caste system
-
కుల రహిత భారతం సాధ్యమే
భారతదేశానికి ‘కులం’ అనేది ఓ శాపం లాంటిది. కుల వ్యవస్థ... తద్వారా వచ్చిన సామాజిక అంతరాల వల్ల ఉత్పత్తి శక్తుల ప్రతిభ నిర్వీర్యమైంది. మని షిని మనిషిగా చూడ లేని దుర్మార్గ వ్యవస్థ వేల ఏండ్లుగా కొనసాగు తోంది. అంబేడ్కర్ లాంటి ప్రపంచ మేధా వియే కుల వ్యవస్థ దుర్మార్గం వల్ల విపరీత మైన వేదనకు గురయ్యారు. ఈ కులవ్యవస్థ పొడగింపు ప్రజాస్వామ్య ప్రభుత్వాల కాలంలోనూ కొనసాగడం గమనార్హం. కులవ్యవస్థ భారత జాతిని నిర్వీర్యం చేసింది. దేశంలోని 85 శాతం ప్రజలను సేవ కులుగా మార్చింది. అందుకే కుల రహిత భారతాన్ని కోరుకున్నారు అంబేడ్కర్. భారత దేశం కుల రహితంగా మారేంత వరకూ, ఆ వ్యవస్థ వల్ల వచ్చిన సామాజిక అంతరాలు పోయే వరకూ శూద్రులకు, అతిశూద్రులకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాడి రాజ్యాంగంలో పొందుపరిచారు. కుల నిర్మూలన సిద్ధాంతాన్ని అందించారు. కులరహిత భార తాన్నీ, సెక్యులర్ భారతాన్నీ అంబేడ్కర్ కోరు కున్నారు. కానీ, రాజ్యాధికారంలో ఉంటు న్నదీ, రాజ్యాంగాన్ని అమలుపరిచే స్థానంలో ఉంటున్నదీ కుల వ్యవస్థ వల్ల లాభపడుతున్న వారే కావడం వల్ల కుల నిర్మూలన జరుగడంలేదు. రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలు కూడా అమలు కావడం లేదు. ఏది ఏమైనా దేశాన్ని అంధకార యుగంలోకి తీసుకు వెళ్ళే కులవ్యవస్థ అంతరించాల్సిందే. కులవ్యవస్థ అంతరించడమంటే వృత్తి పనులు అంతరించడం కాదు. అన్ని దేశా ల్లోనూ వివిధ వృత్తులకు సంబంధించిన పనులున్నాయి, కానీకులాలు లేవు. కులవృత్తులు లేవు. అయితే కులవ్యవస్థ లేనిచోట అన్ని సమస్యలూ పరిష్కారమైనాయా అంటే కాక పోయి ఉండవచ్చుగాక. కాని, కులవ్యవస్థ వల్ల వచ్చే పుట్టుకతోనే దఖలుపడే అధి కారాలు, ఆస్తులు, వివక్ష, పేదరికం, సామా జిక అంతరాలు అక్కడ లేవు. దేశంలోని కోట్లాది మందిని అస్పృశ్యులుగా ముద్ర వేయడం ఏ దేశంలోనూ లేదు. ఒక్క భారత్‌లో తప్ప. కుల రహిత భారతం ఏర్పడితే భారత జాతి అంతా ఒక్క టవుతుంది. సామాజికఅంతరాలు దూరమవుతాయి. ఎ వరికిష్టమైన పనిని, వృత్తిని వారు స్వీకరిస్తారు. ఇది తక్కువ పని, అది ఎక్కువ పని అనే భేద భావాలు తొలగిపోతాయి. విదేశాల్లోలా కులాల బట్టి కాకుండా ఎవరికి ఏ పనిలో నైపుణ్యముంటుందో ఏ పని చేయడానికి ఇష్ట పడుతారో ఆ పని చేస్తారు. అందరూ అన్ని పనులూ చేస్తుంటే సామాజిక అంతరాలు ఆటోమేటిక్‌గా తొలగిపోతాయి. కులాలను కాపాడుతున్నవారు కులాలతో సామాజిక గౌరవం, ఆస్తులు, రాజ్యధికారం అనుభవిస్తున్నారు. వీళ్ళు కులనిర్మూలనకు సహకరించకపోగా కులాలను పెంచి పోషిస్తు న్నారు. వీరి స్థానంలో కుల బాధితులూ,కులంలో అత్యంత హీనస్థితిలో ఉన్నవారూ, మూలజాతుల వారూ రాజ్యాధికారంలోకి వస్తే మంచి ఫలితం ఉంటుంది. వీరు కనీసం యాభై ఏళ్లు పరిపాలన చేస్తే కుల నిర్మూలన జరుగుతుంది. నిచ్చెన మెట్ల కుల సమాజంలో అట్ట డుగున ఉన్నవారు రాజ్యాధిరారంలోకి వస్తే పై మెట్టుపై ఉన్న వారు మాకీ కులాలు వద్దని మొత్తుకుంటారు. కుల నిర్మూలనకు సహక రిస్తారు. ఎలాగూ వేల ఏండ్లుగా బాధితులైన మూలజాతుల వారు తాము పాలకులై తమను ఇన్నేండ్లుగా బాధలో ఉంచిన కులాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. ఇలా అటు ఆగ్రకులాల వారూ, ఇటు శూద్ర, అతిశూద్ర కులాలవారూ కులనిర్మూలనకు సహకరిస్తే ఓ యాభై అరవై ఏళ్లల్లో దేశం లోంచి కులం మాయమైపోతుంది. - వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత మొబైల్: 91829 18567 - డా‘‘ కాలువ మల్లయ్య -
సాధికారతే ప్రజాస్వామ్యం!
కులం పునాదుల మీద మనం ఒక జాతిని నిర్మించలేమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఘంటాపథంగా ప్రకటించారు. భారతీయులందరినీ ఏకతాటి మీదకు తీసుకొని రావాలంటే అందుకు తొలి షరతు కుల నిర్మూలనేనని ఆయన స్పష్టం చేశారు. ఒక మానవ సమూహం నాగరిక పౌరసమాజంగా మన్నన పొందాలంటే, దాని పాలనా విధానంలో ప్రజా స్వామ్యం శోభిల్లాలంటే... ఆ సమూహంలోని ప్రజలంతా ఆత్మ గౌరవంతో తల ఎత్తుకొని జీవించే పరిస్థితి ఉండాలి. ఆత్మ గౌరవానికి అతిపెద్ద శత్రువు కులమేనని పెరియార్ రామస్వామి నాయకర్ నిగ్గు తేల్చారు. కుల నిర్మూలన కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కుల నిర్మూలన ఎలా సాధ్యపడుతుంది? అనాగరికమైన ఈ కుల వ్యవస్థను కూలదోయడానికి ఉపకరించే ఆయుధాలేమిటి? దుర్భర బర్బర సంప్రదాయాల నుంచి సంఘాన్ని విముక్తం చేయడమెట్లా? ఆయా చార్రితక కాలమాన పరిస్థితులను బట్టి సంఘ సంస్కర్తలు రకరకాలుగా మార్గదర్శనం చేశారు. సహపంక్తి భోజనాలు చేయాలన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలన్నారు. పేదకులాల ప్రజలందరూ బాగా చదువుకోవాలని ఉపదేశించారు. వీటన్నిటి సారాంశం ఒక్కటే. పుట్టుక కారణంగా నిమ్నకులం వారుగా ముద్రవేయించుకునే ప్రజలందరూ ధనిక కులాల వారితో ఇంచుమించు సరిసమా నమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ హోదాలను అందుకోవాలి. అప్పుడే వారిలో ఆత్మన్యూనత అదృశ్యమై ఆత్మగౌరవం మొగ్గ తొడుగుతుంది. భారత రాజ్యాంగం ఇదే అభిప్రాయాన్ని తన లిఖితపూర్వక ఆదేశాల్లో ప్రతిఫలింపజేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలందరూ సమాన వాటాదారులు కనుక హెచ్చుతగ్గులు లేని సమాజానికి బాటలు వేయడం రాజకీయ పక్షాల కనీస బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో ఇప్పటివరకూ మన ఏలికలు విఫలమవుతూ వస్తున్నారనేందుకు నిమ్నవర్గాల దుఃస్థితే సజీవ సాక్ష్యం. ఆర్థిక, రాజకీయ రంగాల్లో కొన్ని మొక్కుబడి ప్రయోజ నాలను కల్పించినప్పటికీ, సామాజిక హోదాను కట్టబెట్టడంలో మన ప్రభుత్వాలు చేసింది పెద్ద గుండుసున్నా మాత్రమే! ఆంధ్ర ప్రదేశ్‌లో ఆధికారంలో వున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తన 53 నెలల పాలనాకాలంలో ఈ ఒరవడిని మార్చింది. ఆర్థిక, రాజ కీయ రంగాల్లో మొక్కుబడి తతంగాలకు స్వస్తి చెప్పి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంతవరకు ఎవరూ పట్టించు కోని సాంఘిక రంగంలో సైతం ఉద్యమ చైతన్యాన్ని రగిలించే ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభమైంది కనుకనే, ప్రజలు గుర్తించడం మొదలుపెట్టారు కనుకనే పార్టీ అధినేత వైఎస్ జగన్ సామాజిక సాధికార యాత్రలకు పిలుపునిచ్చారు. ఈ రథయాత్రలు మరింత జన చేతనను జ్వలింపజేస్తాయని ఆయన ఆశిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకూ గత కాలపు ప్రభుత్వాల తూతూ మంత్రపు తతంగాల స్థానంలో విప్లవకర విధానాలను ఆయన ప్రవేశపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే పేద వర్గాల ప్రజలను సంక్షేమ పథం నుంచి సాధికారత గమ్యం వైపు ఆయన మళ్లించారు. ప్రజలకు ఆ గమ్యాన్ని గుర్తు చేయడం కోసం ఇప్పుడు జరుగుతున్న యాత్ర లకు ‘సామాజిక సాధికార యాత్ర’లుగా ఆయన నామకరణం చేశారు. పేదవర్గాల ప్రజలందరూ ఈ గమ్యానికి చేరుకోవడమే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం, సార్థకత. సమస్త వృత్తి వ్యాపారాలకు ప్రాతినిధ్యం వహించే సకల జనులందరూ నిజమైన స్వేచ్ఛతో, సాధికార స్వరంతో నిర్భ యంగా తమ అభిప్రాయాలు వెల్లడించగలిగే దశకు చేరుకున్న ప్పుడే ప్రజాస్వామ్యం నూరుశాతం ఫలించినట్టు లెక్క. రాజ కీయ వేషాలు వేసుకున్న దొంగలకు, దోపిడీదార్లకు, పిండారీ లకు అదుపులేని లైసెన్స్‌లు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. నడిరోడ్ల మీద సభల పేరుతో తొక్కిసలాటలు సృష్టించి జనాన్ని చంపే స్వేచ్ఛ కోసం, నేరం చేసినట్టు ఆధారా లున్నవాడు కూడా అరెస్ట్ కాకుండా ఉండే స్వేచ్ఛ కోసం, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడే స్వేచ్ఛ కోసం ఇప్పుడు జరుగుతున్న ఆరాటాలు, పోరాటాలు ప్రజాస్వామ్యంగా పరిగణించడం సాధ్యం కాదు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ప్రకటిస్తూ పేద తల్లిదండ్రుల పక్షాన ఆ ఆస్తిని సమకూర్చే బాధ్యతను వైఎస్ జగన్ ప్రభుత్వం తలకెత్తుకున్నది. ఆ చదువు నాణ్యమైనదిగా, ఆధునిక సాంకేతికత జోడించినదిగా, అత్యు న్నతస్థాయి పాఠశాలల ప్రమాణాలను అందుకునేదిగా ఉండేట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంత బృహత్తరమైన కార్యా చరణలో తల్లిదండ్రుల మీద వీసమెత్తు భారం పడకుండా, పైగా వారికి ప్రోత్సాహకం కూడా లభించేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి బాలికా, బాలుడూ కచ్చితంగా బడికి వెళ్లేలా, ఏ ఒక్కరూ మధ్యలో బడి మానివేసే పరిస్థితి రాకుండా అందరూ ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ఒక విప్లవోద్యమం మొదలైంది. ఈ ‘ఆస్తి’పరులు తమ చదువును మదుపుచేసి మరో పదేళ్ల తర్వాత నుంచి వరుసగా ప్రతి ఏటా సంపద సృష్టిలో కీలక బాధ్యత వహించబోతున్నారు. తాము పుట్టి పెరిగిన వర్గాన్ని విముక్తం చేయబోతున్నారు. వైద్యం, వ్యవసాయం, చిన్న–సూక్ష్మ పరిశ్రమలు, చిరు వ్యాపారాలు తదితర రంగాలను కూడా పేదల అనుకూల విధానాలు ఆవహిస్తున్నాయి. ఇప్పుడు చేయూత కోసం ఎదురు చూసే స్థితిలో ఉన్న ప్రజలు రానున్న కాలంలో పదిమందిని చేయిపట్టి నడిపించగల స్థితికి చేరుకుంటారు. జగన్ ప్రభుత్వ విధానాల ఫలితంగా మరో ఐదు, పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భు తాలను చూడబోతున్నది. బలహీన వర్గాలకు రాజకీయ పదవుల కల్పనలో కూడా పాత పద్ధతులకు జగన్ సర్కార్ స్వస్తి చెప్పింది. మంత్రి మండలి శాఖల కేటాయింపుల్లో, శాసనమండలి, రాజ్యసభ సభ్యుల ఎంపికలో, కార్పొరేషన్లు, మేయర్లలో, మునిసిపల్, జడ్పీ ఛైర్మన్లలో, కార్పొరేషన్ చైర్మన్లలో ఇలా అన్నిరకాల రాజ కీయ పదువుల్లో బలహీన వర్గాలకు సింహభాగం కేటాయింపులు చేసిన జగన్ ప్రభుత్వం కొత్త చరిత్రను లిఖించింది. సామాజిక సాధికార యాత్రలో వైసీపీ నాయకులు ఈ గణాంకాలను ఉటంకిస్తూ చేస్తున్న సవాళ్లకు బదులు చెప్పలేక విపక్షం డిఫెన్స్‌లో పడిపోయింది. ఆర్థిక – రాజకీయ రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులు ఒక ఎత్తయితే, సామాజిక మార్పులు మరో ఎత్తు. పేదవర్గాలు తల ఎత్తుకొని జీవించడానికి దోహదపడే మార్పులు కొన్ని ఆర్భాటం లేకుండా చోటు చేసుకుంటున్నాయి. ఒక నిశ్శబ్ద విప్లవం కమ్ముకొస్తున్న దృశ్యం ఇప్పుడు జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇందులో మూడు అంశాలను మనం స్పష్టంగా చూడవచ్చు. 1. కొత్తగా వెలుస్తున్న వాడల్లో కులజాడలు కన్పించడంలేదు. 2. హిందూ సమాజం అపురూప గౌరవంగా భావించే ఆలయ మర్యాదలు పెద్ద కులాల పరిధుల్ని దాటి బలహీనవర్గాల్లోకి ప్రవేశించాయి. 3. శ్రామిక మధ్యతరగతి మహిళల మాటకు ఇంటాబయటా క్రమంగా మర్యాద మన్నన పెరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల సంఖ్యంలో నిర్మాణమవుతున్న జగనన్న ఇళ్లను పరిశీలించడానికి ఇటీవల బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్) వెబ్సైట్ ప్రతినిధి ఒకరు రాష్ట్రంలో పర్యటించారు. సెమీ అర్బన్ ప్రాంతమైన సామర్లకోటలో వేల సంఖ్యలో నిర్మాణం పూర్తయిన, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించి అక్కడ నివాసముంటున్న వాళ్లతో మాట్లాడారు. అందులో ఇంజేటి సమర్పణరాజు అనే లబ్ధిదారుడు చెప్పిన మాటలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ‘మాకు (దళితులకు) గతంలో కాలనీలు వేరుగా ఉండేవి. అవమానంగా ఉండేది. ఇక్కడలా చేయలేదు. మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాల నంబర్ల ఆధారంగా డ్రా తీశారు. డ్రాలో వచ్చిన ఫ్లాట్లను కేటాయించారు. అన్ని కులాల వారూ పక్కపక్కనే వచ్చారు. సంతోషంగా ఉంది.’ ఆ ప్రతినిధి పరిశీలించిన అన్ని కాలనీల్లో ఈ మాట వినిపించింది. పశ్చిమ గోదావరి జిల్లా పెదతాడేపల్లి వాస్తవ్యురాలు గుండుగోలు అరుణ అనే దళిత మహిళ మాట్లాడుతూ మాకు వచ్చిన ఇంటికి ఎదురుగానే కమ్మవారికి వచ్చింది. మా పక్కనే తూర్పు కాపులకు వచ్చింది. అందరం కలిసే ఉంటున్నామని చెప్పింది. బలహీన వర్గాల వారికి ప్రభుత్వం కేటాయించే ఇంటి స్థలాల్లో కులాల వారీ కాలనీలు పట్టణ ప్రాంతాల్లో క్రమంగా అంతరించాయిగానీ, గ్రామాల్లో చాలాకాలం కొనసాగాయి. ఆ సంప్రదాయాన్ని 17 వేల జగనన్న కాలనీల్లో స్వస్తి పలికి సమష్టి జీవనానికి శ్రీకారం చుట్టారు. సంపన్నులకు, పెద్ద కుటుంబాల వారికీ, వ్యాపారులకు మాత్రమే ఆలయ కమిటీల్లో చోటు దొరికేది. పూర్వపు ధర్మ కర్తలకు లభించే గౌరవ మర్యాదలు ఈ కమిటీ సభ్యులకు కూడా లభిస్తాయి. ఆలయంలో లభించే గౌరవానికి హిందువులు విశేష ప్రాధాన్యమిస్తారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమా క్లైమాక్స్ దృశ్యం ఈ అభిప్రాయానికి అద్దం పడుతుంది. విఖ్యాత హిందూ దేవాలయం తిరుమలలో ఆలయ మర్యాదల కోసం సంపన్నులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తహతహలాడిపోవడం మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి తిరుమలలో తిరుమలేశుని తొలిదర్శనం చేసుకునే అవకాశాన్ని సన్నిధి గొల్లకు జగన్ మోహన్‌రెడ్డి హక్కుభుక్తం చేశారు. వెనక బడిన కులాల్లో మరింత వెనుకబడిన కులాల వారికి కూడా తిరుమల ఆలయ కమిటీలో సభ్యత్వం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే వేలాది ఆలయా లకు నియమించిన కమిటీల్లో సగం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలవారే! ఇదొక సామాజిక హోదా, గౌరవం. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బలహీనవర్గాల ప్రజలకు ఇప్పుడీ గౌరవం దక్కింది. మహిళా సాధికారత లేకుండా జన సాధికారత సంపూర్ణం కాదు. అది సంపూర్ణం కాకుండా నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అవతరించదు. పేద వర్గాల పురుషులు రాజకీయ, ఆర్థిక,సాంఘిక వివక్షలకు మాత్రమే గురవుతారు. శ్రామిక వర్గ మహిళలు తమ పురుషులతో సమానంగా ఈ వివక్షలను ఎదుర్కొంటూనే లైంగిక అసమానత్వాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఈ రెట్టింపు వివక్ష ఈనాటిది కాదు. ఈ దేశానికి మాత్రమే పరిమితమైనది కాదు. రెండు శతాబ్దాల క్రితం మాక్సిమ్ గోర్కీ రాసిన రష్యన్ నవల ‘అమ్మ’ ఇతివృత్తమే ఇది. ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషల్లో కోట్లాది మంది చదివి ప్రభావితమైన నవల బహుశా ‘అమ్మ’ ఒక్కటేనేమో! రెట్టింపు దోపిడీనీ, రెట్టింపు అవమానాల్నీ ఎదుర్కొన్న అమ్మ మాత్రం బేల కాదు. పోరాట పటిమకు పెట్టింది పేరు. ఆ మాటకొస్తే శ్రామిక మహిళలందరూ పోరాట పటిమ గలవారే. ‘మదర్ ఇండియా’లే! వారి గౌరవ మర్యాదలను ఇనుమడింపజేయగల కొన్ని ప్రత్యేక పథకాలను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పుడు రాష్ట్రంలోని స్థానిక సంస్థల అధ్యక్ష పీఠాలపై సగానికి పైగా మహిళలే ఆసీనులయ్యారు. ఆలయ కమిటీల్లోనూ సగానికంటే ఎక్కువమంది ఉన్నారు. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో సగం దక్కించుకున్నారు. మంత్రివర్గంలో కీలక శాఖల అధిపతులుగా ఉన్నారు. రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచడం ఒక భాగం మాత్రమే! ‘అమ్మ ఒడి’, అమ్మ పేరున ‘ఆస్తిపత్రం’, అమ్మకు ‘చేయూత’ అనే మూడు విశిష్ట పథకాలు ఎక్కడా లేనివి. మహిళల ఆత్మగౌరవానికి మకుట ధారణ చేసినవి. పిల్లల చదువులు, భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయా ధికారాన్ని ‘అమ్మ ఒడి’ పథకం ఆమెకు కట్టబెట్టింది. 30 లక్షల మంది మహిళలకు సంపూర్ణ హక్కులతో ఇంటి పట్టాలను జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్నారు. ఇంటాబయటా ఆమె గౌరవం పెరిగింది. చేయూత పథకంతో నడివయసులోనూ మహిళలు వ్యాపారస్తులుగా రాణిస్తున్నారు. మనుమలు, మను మరాళ్లకు చిన్నచిన్న బహుమతులు కూడా కొనివ్వలేని నిస్స హాయ స్థితిని వాళ్లిప్పుడు జయించారు. వ్యాపార విజయాల కోసం ఇప్పుడు పాటుపడుతున్నారు. ఈ 53 నెలల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు బహుజనులను, మహిళలను సాధికారత పథంలో నిలబెట్టాయి. ఈ పరిణా మాన్ని పెత్తందారీ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తక్షణమే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో అన్ని వైపుల నుంచీ యుద్ధాన్ని ప్రకటించాయి. తప్పుడు ప్రచారాలతో ఒక విష వృష్టిని కురిపిస్తున్నాయి. సాధికార యాత్రలతో విష ప్రచారాలను ఎండగట్టవలసిన బాధ్యత, పెత్తందారీ కుట్రలను తిప్పి కొట్టవలసిన బాధ్యత బహుజనులూ, మహిళలదే! ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చగలిగితేనే కులం జాడలు, వెలివాడలు అదృశ్యమవుతాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కులగణన సర్వేపై నాలుక కరుచుకున్న కేంద్రం
పాట్నా: బీహార్‌లో ఇటీవల జరిగిన కులగణనకు వ్యతిరేకంగా సోమవారం కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కులగణన చేసే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుందని పేర్కొంది. కానీ అంతలోనే పొరపాటు జరిగిందని చెబుతూ అఫిడవిట్లో కేంద్రానికి తప్ప ఇతర సంస్థలకు కులగణన, సర్వే చేసే అధికారం లేదన్న మాటను తొలగించి మరోసారి అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో సవరణలపై బీహార్‌లోని రాజకీయ వర్గాల్లో అగ్గి రాజుకుంది. బీహార్ ప్రభుత్వం కులగణన చేయడం కేంద్రానికి ఇష్టం లేదని దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న వారి కుటిలబుద్ధి మరోసారి బట్టబయలైందని చెబుతూ విమర్శలు చేశారు జేడీయు,ఆర్జేడీ నేతలు. ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ప్రజల హక్కులను హరించాలన్న బీజేపీ, సంఘ్ పరివార్ వక్రబుద్ధికి ఇది నిదర్శనమని, ఇది అనుకోకుండా జరిగింది కాదని ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనని.. ఇదే కొనసాగితే అగ్నిపర్వతం బద్దలవుతుంది జాగ్రత్తని హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ బీజేపీ అసలు రంగు బయటపడింది. బీజేపీకి అసలు కులగణన చేయాలన్న ఉద్దేశ్యమే లేదని దీన్ని బట్టి అర్థమవుతోందని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేడీయు నేత విజయ్ కుమార్ చౌదరి స్పందిస్తూ బీహార్ ప్రభుత్వం ఎప్పటినుంచో తాము చేస్తోంది కులగణన కాదని సర్వే అని చెబుతూనే ఉంది. అయినా కేంద్రం దీన్ని వివాదాస్పదం చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ తాము కులగణనకి వ్యతిరేకమని ఏనాడూ చెప్పలేదని, మేము కోరుతుంది ఒక్కటేనని.. ఒకవేళ కులగణన పూర్తయితే ఆ వివరాలను 24 గంటల్లో ప్రకటించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. చివరిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందిస్తూ.. మేము మొదటి నుంచీ సర్వే మాత్రమే చేస్తున్నామని చెబుతూనే ఉన్నాము. ఆయా కులాల్లో ఎంతమంది ఉన్నారన్నది మేము లెక్కపెట్టడం లేదు. వారి ఆర్థిక స్థితిగతులను మాత్రమే లెక్కపెడుతున్నామని.. దీనివలన అర్హులైనవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే అవకాశముంటుందని అన్నారు. ఈ సర్వేపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన పాట్నా హైకోర్టు బీహార్ ప్రభుత్వం సర్వేలో సేకరించిన డేటా భద్రతపై హామీ ఇచ్చిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే తడవు బీహార్ ప్రభుత్వం కులగణనను పూర్తిచేసింది. ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టులో కోట్లు విలువచేసే మాదకద్రవ్యాలు పట్టివేత -
అడ్డుకోవాలని చూశారు.. అయినా పూర్తి చేశాం: నితీష్ కుమార్
పాట్నా: బీహార్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన పూర్తయినట్లు తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ప్రస్తుతం ఈ డేటా సంకలనం జరుగుతోందని అతి త్వరలోనే ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతూ కులగణన సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనకరమని అన్నారు. శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన కులగణన అన్ని కులాల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని దీని వలన ఎంతోకాలంగా నష్టపోయిన వారితో పాటు సమాజంలో ఆయా వర్గాల వారికి కూడా మేలు చేస్తుందని అన్నారు. పూర్తి డేటా వచ్చిన తర్వాత ఏయే అంశాల్లో మెరుగవ్వాల్సి ఉందో స్పష్టంగా తెలుస్తుందని మిగిలిన రాష్ట్రాల్లో కూడా కులగణన జరిపితే బాగుంటుందని అన్నారు. కొంతమంది ఈ కులగణనను వ్యతిరేకిస్తున్నారు కానీ అఖిలపక్షాల అభిప్రాలు సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వ్యతిరేకించే వారి అభిప్రాయం గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఈ సర్వే ద్వారా సాంఘిక, ఆర్ధిక అసమానతలకు గురైన వారికందరికీ సంక్షేమ పథకాలు అందించి మెరుగైన సేవ చేయడానికి వీలుంటుందని తెలిపారు. మొదటి నుంచి కులాల ప్రాతిపదికన సంక్షేమం అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని అందులో భాగంగానే కులగణన చేశామని అన్నారు. కులగణన కోసం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు అనుమతి కోరడంపై స్పందిస్తూ.. సుప్రీం కోర్టు ప్రజలకు ప్రయోజనకరమైన అంశాలను నిలిపివేయమని ఎప్పుడూ చెప్పదు. ఇక పాట్నా హైకోర్టు అయితే ఇదే అంశంపై నమోదైన అనేక పిల్లను కొట్టి పారేసిందని గుర్తు చేశారు. మరి 2021లోనే పూర్తి కావాల్సిన కులగణన జాప్యం విషయమై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కేంద్రం ఈ కులగణన కార్యక్రమంలో జోక్యానికి అనుమతి కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఇందులో ఉన్న చట్టపరమైన సమస్యలు తెలుపుతూ తదుపరి వాయిదా తేదీ ఆగస్టు 28లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. కానీ ఈలోపే ఈ సర్వే పూర్తి కావడం విశేషం. ఇది కూడా చదవండి: మా పార్టీ చీలిపోలేదు: శరద్ పవార్ -
‘భీమా కోరేగావ్’ స్ఫూర్తితో పోరాడుదాం!
కుల వ్యవస్థ దుర్మార్గపు అణచివేత, వివక్ష, అంటరాని తనం నుండి విముక్తి పొందడానికి మహార్ పీడిత కులానికి చెందిన ఐదు వందలమంది సైనికులు 1818 జనవరి ఒకటవ తేదీ నాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున రెండవ బాజీరావు పీష్వా సైన్యంతో భీమానది ఒడ్డున వీరోచితంగా పోరాడి విజయం సాధించారు. ఈ విజయానికి సూచనగా అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ కోరేగావ్ వద్ద మహార్ అమరవీరుల స్థూపాన్ని నిర్మించి, ఆ స్థూపంపై యుద్ధంలో చనిపోయిన 22 మంది మహార్ వీరుల పేర్లను చెక్కించారు. భీమా నది ఒడ్డున నిర్మించిన మహార్ వీరుల స్మారక విజయ స్తంభాన్ని 1927లో డాక్టర్ అంబేడ్కర్ సందర్శించే వరకు భీమా కోరేగావ్ చరిత్ర... స్వతంత్ర పోరాటం పేరుతో వక్రీకరణకు గురైంది. అక్కడ జరిగిన యుద్ధం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దురాక్రమణకు వ్యతిరేకంగా మరా ఠాలు చేసిన స్వాతంత్య్ర పోరాటంగా కుహనా చరిత్రకారులు చిత్రించారు. నిజానికి చరిత్ర లోతుల్లోకి తొంగిచూస్తే... మహార్ వీరులు ఆ యుద్ధంలో తమ పట్ల పీష్వాలు అనుసరిస్తున్న అంటరానితనం, అణచివేతలకు వ్యతిరేకంగా... తమ విముక్తి కొరకే పాల్గొన్నా రనేది వాస్తవం. అంబేడ్కర్ భీమాకోరేగావ్ వద్ద విజయాన్ని మరాఠా పీష్వాల రాజ్యంలో ‘బ్రాహ్మణీయ అణచివేతపై దళిత ఆత్మగౌరవ ప్రతీకగా’ ప్రకటించడంతో అసలు చరిత్ర వెలుగు లోకి వచ్చింది. మరాఠా సామ్రాజ్యంలో నిజానికి పీష్వాలు దళితులపై చేస్తున్న కుల అణచివేత, ఆగడాలు అంతా ఇంతా కాదు. నడుముకు చీపురు, మూతికి ముంత కట్టించారు. దళితులకు భూమి, ఆత్మగౌరవం, ఆయుధాలు నిరాకరించి పశువుల కన్నా హీనంగా చూస్తున్న పీష్వాల పాలనలో పోరాటం తప్పితే మరేమీ మిగల్లేదు. యుద్ధానికి ముందు మహార్ల నాయకుడైన సిఖ్ నాయక్... పీష్వా సైన్యాధికారిని యుద్ధం జరగకుండా ఉండాలంటే... తమను మనుషులుగా గుర్తించి, అంటరానితనం పాటించడం నిలిపివేసి కనీస హక్కులు ఇవ్వాలని అడిగాడు. ‘మీరు యుద్ధం చేసి గెలిచినా కూడా అస్పృశ్యులే, మీ అంటరానితనం పోదు. మీరు ఎప్పుడూ మా కాళ్ళకింద ఉండేవారే’ అని కండకావరంతో సైని కాధికారి మాట్లాడటంతో యుద్ధం అనివార్యమైంది. అత్యంత బలస్థులూ, పోరాట యోధులైన మహర్ యువకులు ఆ మాటలతో ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారు. రెండు రోజులు కాలినడకన ప్రయాణం చేశారు. వెంట తెచ్చుకున్న రొట్టెలు అయిపోయాయి. అయినా ఆకలితో ఉండి కూడా భీమా నది ఒడ్డున 1818 జనవరి ఒకటవ తేదీనాడు 20 వేల అశ్వికదళం, 8 వేల పదాతిదళం కలిగినన పీష్వాల సైన్యంతో పోరాడి విజయం సాధించారు. ఇది ముమ్మాటికీ కుల పీడనపై ‘ప్రతిఘటన’గానే మనం చూడాలి. నేడు కుల వ్యవస్థ ఆధునిక రూపాలు సంతరించుకొని గ్రామాల నుండి పట్టణాల వరకూ, పాఠశాలల నుండి యూని వర్సిటీల వరకూ, చిన్న పని ప్రదేశాల నుండి కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల వరకూ రాజ్యమేలుతోంది. రోజురోజుకు బలోపేతం అవుతున్న హిందూత్వ ఫాసిజం మనుస్మృతిని అధికారికంగా నెలకొల్పే దిశగా పయనిస్తున్నది. దళిత బహుజనుల నీడ, గాలి సోకకుండా వారి మానవ హక్కు లన్నింటినీ నిషేధించిన పీష్వాల అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతి రేకంగా సాగిన భీమా కోరేగావ్ పోరాటాన్ని ఎత్తి పడుతూ అంబేడ్కర్ ఆ పోరాటాన్ని ఆత్మగౌరవ ప్రతీక అని ప్రకటించి, దానిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళారు. అనంతరం ఈ దేశ రాజ్యంగంలో దళితులకు హక్కులను పొందుపర్చడంతో పాటు కుల వర్గ పీడన అంతం కావాలని ఆశించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికన మహిళలు, దళితులు, ఆదివాసులు, మైనారిటీలతో కూడిన బహుజన సమాజపు విముక్తికై వినూత్న మార్గంలో పోరాడారు. అయినా కొత్త పీష్వాలు అధికారాన్ని చలాయిస్తున్న సందర్భంలో మళ్లీ మనువాదం పూర్తి స్థాయిలో జడలు విప్పుకునే అవకాశం ఉంది. అందుకే బహుజన సమాజం అప్రమత్తతతో ఉండాలి. – కోట ఆనంద్, కుల నిర్మూలన వేదిక రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ‘ 96523 57076 (నేడు భీమా కోరెగావ్ పోరాటం జరిగిన రోజు) -
ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!
డెబ్భై ఐదేళ్ల స్వాతంత్య్ర భారతంలో సామాజిక ఆర్థిక వ్యవస్థ మరింత కూలిపోవడానికి కారణం దళిత, బహుజన ఉత్పత్తి వర్గాలను ప్రధాన స్రవంతి లోని ఉత్పాదక శక్తులుగా మార్చకపోవడమే. అంటే ఒక 500 ఏళ్ల నుంచి నాటు వేసే కుటుంబాలు భూమి కలిగి లేకపోవడం; ఏ రంగంలో అయితే వారు తమ శ్రమను ధారబోస్తున్నారో ఆ రంగం భూస్వామ్య పెట్టుబడిదారుల చేతుల్లో ఉండడం ప్రధాన కారణం. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో శిశు ఆరోగ్య సంరక్షణ మరింతగా క్షీణించడం వలన పుట్టే పిల్లలు శక్తిమంతంగా పుట్టడం లేదు. మాతా శిశు పోషక ఆరోగ్య బాధ్యతలు మరింతగా క్షీణిస్తున్నాయి. అవినీతి అన్ని వైపులా అల్లుకుంటూ ఇచ్చే చేతికీ, తీసుకునే చేతికీ మధ్య వంద చేతులు ఏర్పడుతున్నాయి. భరత భూమిలో ప్రధాన వనరు భూమి. భూమి అందరి సొత్తు. కానీ ప్రతి రాష్ట్రంలోనూ ఇప్పుడు అది ఐదు కులాల చేతుల్లోనే ఉంది. మొత్తం భారత దేశంలో సుమారు 6,000 కులాలున్నాయి. అయితే దాదాపు భూమి అంతా 100 కులాల చేతుల్లోనే ఉంది. ఇంతకంటే పెద్ద అసమానత మనకి ఏ దేశంలోనూ కనిపించదు. మన జాతీయాదాయం మొత్తంలో 22 శాతం... ఒక్క శాతం మంది దగ్గరే ఉంది. భారతదేశ సంపదాభివృద్ధి ప్రక్రియలోకి దళితులను ఎందుకు రానివ్వడం లేదు అనేది మన ముందున్న ప్రశ్న. ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. సంపదను సృష్టిస్తున్న ఐటీ పరిశ్రమ భారతదేశంలో 1990 నుండి ప్రారంభమైంది. అతికొద్ది కాలంలోనే 16 లక్షల కోట్లు వ్యాపారం చేసింది. ఈ రంగంలో దేశంలోని పది, పది హేను కులాలే జొరబడ్డాయి. ఈ రంగంలోకి దళితులు ప్రవేశించకుండా పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఇది పెద్ద సామాజిక ద్రోహం. ఇక జీడీపీ సంగతికొస్తే... ప్రపం చంలో రెండు దేశాలు ముందున్నాయి. ఒకటి చైనా. రెండోది దక్షిణ కొరియా. దీనికి కారణం అక్కడ కుల, మత భేదాలు లేకుండా అందరినీ, అన్ని రంగాలలో ప్రోత్సహించడమే. భారతదేశంలో అటువంటి ప్రోత్సాహమే లేదు. దానికి కారణం కులవ్యవస్థ, అస్పృశ్యతా భావన. చైనా ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. చైనాతో మనం పోటీపడలేక పోవ డానికి కారణం మనదేశం లోని 60 కోట్ల మందినీ మనం ఉత్పత్తి రంగంలోకి తీసుకురాకపోవడం. సామాజిక న్యాయానికి విఘాతం ముఖ్యంగా 1970 తర్వాత ఏ కులం వారు ఆ కుల వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నారు. పారిశ్రామిక వ్యవస్థలు, విద్యా సంస్థలు అన్నింటిలోనూ స్వకులం వారినే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది సామాజిక న్యాయ దూరం. మరోపక్క దేశంలో అవినీతి పెరిగిపోతోంది. అవినీతి మీద మాట్లాడే గళాలను అణచి వేయాలని చూస్తున్నారు. కనీసం స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా, హీరేన్ ముఖర్జీ, డాంగే, పుచ్చలపల్లి సుందరయ్య, కృష్ణ మీనన్, మాలవ్యా, లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా, సుశీలా నాయర్, మొరార్జీ దేశాయ్, నంబూద్రి పాద్ వంటి వారు ప్రజాస్వామ్యంలోని లొసుగులను గురించి తమ గళాలు వినిపించగలిగే వారు. ఇప్పుడా పరిస్థితి భారత దేశంలో లేదు. స్వాతంత్య్ర భారతంలో ప్రజల వాక్కుకు స్వాతంత్య్రం లేదు. ఈ దశాబ్దంలో ఎంతో మంది తమ వాక్కు వినిపించి హతులయ్యారు. సంపన్న వర్గాలు, అగ్రకులాలు ఎన్నికలను పెట్టుబడి, రాబడిగా చూస్తున్నాయి. రాజకీయ రంగంలో ఓటు కొనడం ఎప్పుడు ప్రారంభించారో అప్పుడే ప్రజాస్వామ్య విలువలు కుప్పకూలడం ప్రారంభమయ్యింది. ధనికుల రక్షణ, పేదల భక్షణ కొనసాగుతోంది. పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, పాలక వ్యవస్థ ధనవంతులకు ఊడిగం చేస్తున్నాయి. ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి కారణం రాజ్యాంగ ఉల్లంఘనే. ఈ 75 ఏళ్లలో శాస్త్రీయ, వైజ్ఞానిక, సాంకేతిక జ్ఞానం అంతరిస్తూ వస్తోంది. భారతదేశంలో ప్రధాన మతమైన బౌద్ధం పునరుజ్జీవం మీద దెబ్బ కొట్టారు. హిందూ మతో ద్ధరణకు పూనుకుని బడులు తగ్గించి గుడులు పెంచారు. హిందూ మతేతరమైన జైన, సిక్కు, బౌద్ధ, క్రైస్తవ, జొరాస్ట్రియన్ వంటి మత ధర్మాలను ఎదగకుండా చేశారు. మానవ, సామాజిక, వ్యక్తి ధర్మాలను ధ్వంసం చేసి అరాచకత్వాన్ని పెంచారు. భారతీయ తాత్వికులైన చార్వాకులు, సాంఖ్యాయనులు వంటి భౌతిక తాత్వికుల ధర్మాలను కాలరాశారు. వీటన్నిటి ఫలితంగా భారతదేశం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దోపిడీలో మగ్గుతోంది. స్వాతంత్య్రం అగ్రకులాల, అగ్ర వర్గాల అనుభవైకవేద్యమయ్యింది. (క్లిక్: ప్రగతి ఫలాలు దక్కిందెవరికి?) అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క దళితుడూ, బహుజనుడూ, మైనారిటీలు చేతబూనాల్సిన చారిత్రక సందర్భం ఇది. రాజ్యాంగం ఇచ్చిన ఉద్యమ హక్కుని, పోరాట హక్కుని పునరుజ్జీవింపజేసి మనుషులు చైతన్యవంతులై, నీతిమంతులై, వ్యక్తిత్వ నిర్మాణదక్షులై తమను తాము అమ్ముకోకుండా; తమను తాము రక్షించుకుని, జీవింపజేసుకుని, నూతన భావాలను పునరుజ్జీవింప జేసుకుని రాజ్యాధికార దిశగా కొనసాగ వలసిన రోజులివి. పోరాటం మానవుని హక్కు. జీవించడం మానవుని హక్కు. సంపద అందరికీ సమానంగా పంపిణీ అయ్యే వరకూ పిడికిళ్లు బిగుసుకునే ఉంటాయి. ఐక్యతా పోరాటమే స్వాతంత్య్రానికి పునాది. - డాక్టర్ కత్తి పద్మారావు సామాజిక ఉద్యమకారుడు -
కులాన్ని నిర్మూలిస్తేనే దేశ అభివృద్ధి
లక్డీకాపూల్ (హైదరాబాద్): కుల వ్యవస్థను నిర్మూలిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో తెలంగాణ దళిత దండు, తెలంగాణ మాల మహానాడు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, తెలంగాణ మాదిగ దండోరా, మాదిగ జేఏసీ, రిపబ్లిక్ పార్టీలు సంయుక్తంగా రాజ్యాంగ గర్జన సమావేశం నిర్వహించాయి. తెలంగాణ దళిత దండోరా అధ్యక్షుడు బచ్చలి కూర బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగా న్ని మార్చాల్సిన అవసరం లేదని, పాలకుల మనసు మార్చాలని అన్నారు. మారుతున్న సమాజానికి తగ్గట్టు ఏదైనా కొత్త అంశాన్ని చేర్చాలంటే రాజ్యాంగ సవరణలు చేసే అవకాశం ఉందన్నారు. ఎస్సీ/ఎస్టీ/బీసీల కోసం రాజ్యాంగాన్ని సవరించాలన్నారు. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు పెట్టడానికి.. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటా ప్రవేశపెట్టడానికి రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 75 కోట్ల జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు రాజకీయ రిజర్వేషన్లు లేవన్నారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతం పెంచాలన్నారు. ఈ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్ నిబంధన తొలగించాలన్నారు. బీసీలకు సాంఘిక భద్రత కల్పించడానికి బీసీల అత్యాచార నిరోధక చట్టం ప్రవేశపెట్టాలన్నారు. బహుజనుల అభివృద్ధి, వికాసం కోసం రాజ్యాంగాన్ని సవరించాలి తప్ప బానిసత్వం పునరుద్ధరించడానికి రాజ్యాంగాన్ని మార్చరాదని కృష్ణయ్య స్పష్టం చేశారు. సమావేశంలో తెలంగాణ దళిత దండోరా ఉపాధ్యక్షుడు మొగిలయ్య, టీఎం ఎస్ఎస్ అధ్యక్షుడు యాదయ్య, మహా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మత్స్య పాద నరసింహారావు, మాదిగ జేఏసీ అధ్యక్షుడు కిరణ్, ఆర్పీఐ నాయకుడు బాల స్వామి ప్రసంగించారు. -
వారూ, వీరూ ఎదుర్కొనే పీడన ఒక్కటే!
వేల ఏళ్లుగా నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో అనేక కులాలు వివ క్షకు గురవుతూ వస్తున్న నేప థ్యంలో మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం... 1935 ప్రత్యేక చట్టాన్ని అనుసరించి 1936లో షెడ్యూల్డ్ కులాల జాబితాను ప్రకటించింది. అంతకుముందు వీరిని డిప్రెస్డ్ తరగతులుగా పరి గణించేవారు. భారత రాజ్యాంగం ఆర్టికల్స్ 341, 342 ద్వారా రాష్ట్రపతి షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల జాబితాలను ప్రకటిస్తారు. ఒక కులాన్ని షెడ్యూల్డ్ కులంగా గుర్తించాలంటే సామాజిక, విద్యా, ఆర్థిక వెనుక బాటులతో పాటుగా అస్పృశ్యతను అనుభవిస్తూ ఉండాలి. షెడ్యూల్డ్ తెగగా గుర్తించాలంటే సంబంధిత తెగ ప్రత్యేక భాష, ప్రత్యేక ఆచారాలు కలిగి... అడవుల్లో వంశపారంపర్య వృత్తితో జీవిస్తూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం 105వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 342ఏను సవరిస్తూ... కేంద్ర ఓబీసీ జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చాలంటే కేంద్రానికీ, రాష్ట్ర బీసీ జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చాలంటే ఆయా రాష్ట్రాలకూ అధికా రాలు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం 1950లో, రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా దేశంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాను విడుదల చేస్తూ, ఉత్తర్వులోని 3వ పేరాలో షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించిన వారందరూ తప్పనిసరిగా హిందూమతంలో కొనసాగాలని నిబంధన పెట్టింది. అదే పంజాబ్ రాష్ట్రంలోని రాందాసి, కాబీర్ పంథి, మజాబి, సిక్లిగర్ కులాలు మాత్రం సిక్కుమతంలో కొనసాగవచ్చని తెలి పింది. తదనంతరం 1990లో రాష్ట్రపతి ఉత్తర్వులను సవ రణ చేస్తూ షెడ్యూల్డ్ కులాల వారు తప్పనిసరిగా హిందూ లేదా సిక్కు లేదా బౌద్ధమతంలో కొనసాగాలని నిబం ధన పెట్టారు. ఒకవేళ ఇతర మతంలోనికి మారితే షెడ్యూల్డ్ కులం హోదాను కోల్పోయి ఓబీసీగా గుర్తింపు పొందుతారు. 1956లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా దేశంలో ఎస్టీ జాబితాను ప్రకటించారు. వీరికి ఎలాంటి మత నిబంధనలు లేవు. కేంద్ర ప్రభుత్వం 1975లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం... ఎవరైనా షెడ్యూల్డ్ కులానికి చెందినవారు ఇతర మతాలు... అనగా క్రైస్తవ లేదా ముస్లిం మతం లేదా జైనమతంలోకి మారిన వారికి ఎస్సీలకు కల్పిస్తున్న ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. అదే విధంగా కొంత కాలం తర్వాత వారి పూర్వమతం అయిన హిందూ/ సిక్కు/బౌద్ధ మతానికి మారితే వారికి షెడ్యూల్డ్ కుల హోదా, రిజర్వేషన్లు పొందే వెసులుబాటు కల్పించారు. దేశంలో దళిత క్రైస్తవులు తమను షెడ్యూల్డ్ కులా లుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి మనదేశంలో మతం మారినంత మాత్రాన సామాజిక అసమానతలు, అంటరానితనం పోవడం లేదు. ఎందు కంటే దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు. ఈ మతంలో నిచ్చెనమెట్ల కులవ్యవస్థ పోలేదు. దేశ వ్యాప్తంగా దళిత క్రైస్తవులపై వేలసంఖ్యలో అత్యా చారాలు జరుగుతున్నాయి. సామాజిక భద్రతలో భాగంగా, వీరు అత్యాచార నిరోధక చట్టాన్ని వినియో గించుకునే అవకాశం లేకుండా పోతోంది. పూర్వం షెడ్యూల్డ్ కులాలవారికి హిందూ దేవాలయాల్లోకి ప్రవేశం లేదు, కావున వారు ప్రత్యామ్నాయంగా ఇతర మతాల్లోకి మారడం సహజంగానే చూడాలి. భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులానికి చెందిన వారు మతం మారితే షెడ్యూల్డ్ కులాల హోదా, రిజ ర్వేషన్లు కోల్పోతారని పేర్కొనే ఎలాంటి నిబంధనలు లేవు. కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులలో మాత్రమే నిబంధన పెట్టారు. మొదట హిందూమతంలో కొనసాగాలని చెప్పారు. తరువాత సవరించిన సిక్కు లేదా బౌద్ధ మతా లలో కొనసాగవచ్చని తెలిపారు. అందుకే దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులు రాష్ట్రపతి ఉత్తర్వు–1950లోని 3వ పేరాను సవరించి వారికి షెడ్యూల్డ్ కులాల హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకొని వీరికి న్యాయం చెయ్యాలి. వ్యాసకర్త: కోడెపాక కుమారస్వామి జాతీయ అధ్యక్షులు, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం -
ఇప్పటికీ కుల వివక్షకు గురవుతున్నా!
ఢిల్లీ: నవాజుద్దీన్ సిద్దిఖీ... దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న నటుడు. వైవిద్యమైన పాత్రలతో బాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. పాత్ర ఏదైనా సరే, దానికి అనుగుణంగా నటించగలిగే సామర్థ్యం అతడి సొంతం. అలాంటి వ్యక్తి కూడా కుల వివక్షకు గురయ్యాడంటే నమ్మగలమా. కానీ తన స్వగ్రామంలో ఇంకా కుల వివక్షకు గురవుతున్నానని నవాజుద్దీన్ వెల్లడించాడు. ' నేను నటనతో ఫేమస్ అయినప్పటికీ మా గ్రామంలో నన్ను ఇంకా తక్కువ కులం వాడిలాగే చూస్తారు. కులం అనేది వారి నరనరాల్లో పాకి ఉంది. అది వారు గర్వంగా చెప్పుకుంటారు. మా అమ్మమ్మ తక్కువ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి మమ్మల్ని ఎప్పటికీ వారు అంగీకరించరు' అని సిద్దిఖీ పేర్కొన్నాడు. లాక్డౌన్ కారణంగా గత కొన్ని నెలలుగా సిద్దిఖీ తన స్వగ్రామంలోనే సమయం గడిపాడు. ఇటీవలే సుధీర్ మిశ్రా దర్శకత్వంలో 'సీరియస్ మెన్' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ఈ సినిమాలో సిద్దిఖీ ఒక దళితుని పాత్రలో నటించాడు. మనూ జోసెఫ్ రచించిన సీరియస్ మెన్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీయడం విశేషం. (ఇదీ చదవండి: ఒకానొక సమయంలో ఆత్మహత్యకు సిద్ధపడ్డాను) -
వ్యతిరేకించినవాళ్లే సపోర్ట్ చేస్తున్నారు
‘‘డిగ్రీ కాలేజ్’ విడుదలకు ముందు పోస్టర్స్ చూసి సినిమాని ప్రదర్శించకుండా అడ్డుకుంటామన్న విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల నాయకులే చిత్రాన్ని చూశాక మనసుకు హత్తుకునే మంచి కథ ఉందని ప్రశంసిస్తున్నారు. అప్పుడు వ్యతిరేకించినవాళ్లే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు’’ అన్నారు దర్శకుడు నరసింహ నంది. వరుణ్, దివ్యారావు జంటగా స్వీయ దర్శకత్వంలో నరసింహ నంది నిర్మించిన ‘డిగ్రీ కాలేజ్’ ఈ నెల 7న విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో నరసింహ నంది మాట్లాడుతూ– ‘‘కొన్ని రొమాంటిక్ సీన్స్ చూసి సినిమా మీద నెగటివ్ అభిప్రాయం ఏర్పరచుకోవద్దని మా మనవి. సినిమా చూశాక మాట్లాడమని కోరుతున్నాం. బలమైన కథ ఉంది. క్లైమ్యాక్స్ సీన్స్ ప్రేక్షకులను భావోద్యేగానికి గురి చేస్తున్నాయి. కుల వ్యవస్థ మీద తీసిన సినిమా ఇది. ‘1940 లో ఒక గ్రామం’ సినిమాని కుల వ్యవస్థపైనే తీశాను.. జాతీయ అవార్డు వచ్చింది కానీ డబ్బులు రాలేదు. ‘డిగ్రీ కాలేజ్’కి డబ్బులు కూడా రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
ఇంత దారుణమా! వైరల్ వీడియో
భారతదేశంలో వేళ్ళూనుకుపోయిన కుల వివక్ష వికృత రూపానికి అద్దం పట్టిన ఘటన ఒకటి తమిళనాడులో వెలుగు చూసింది. బతికి వున్నపుడు ఎలా ఉన్నా..చనిపోయిన వారికి కనీస గౌరవాన్నివ్వడం సమాజంలో ఒక సంస్కారంగా కొనసాగుతూ వస్తోంది. కానీ వెల్లూరులో కుప్పన్ అనే దళిత వ్యక్తి చనిపోయిన సందర్భంగా స్థానిక ఆధిపత్య కులానికి చెందిన కొంతమంది పెద్దలు దారుణంగా ప్రవర్తించారు. తమ పొలంలోంచి అతని మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి వీల్లేదని పట్టుబట్టారు. దీంతో వేరే గత్యంతరం లేని బంధువులు వంతెనపైనుంచి స్ట్రెచర్ ద్వారా మృతదేహాన్ని కిందికి దించి, అక్కడనుంచి దహన వాటికకు తరలించాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీనికి సంబంధించిన వీడియో పలువురిని విస్మయ పరుస్తోంది. Ugly face of caste system! Everybody deserves a dignifid death! Kuppan, a dalit man died in Vellore. Some dominant caste people objected to carrying his body through their farm land. His body had to be lowered using a stretcher atop a bridge to reach the cremation ground. pic.twitter.com/MqrJGNRc6V — Vibhinna Ideas (@Vibhinnaideas) August 22, 2019 -
కులతత్వంపై యుద్ధారావం ‘ప్రణయ్’
రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అందించిన అవకాశాల వల్ల అన్ని కులాల బిడ్డలూ ఒకే చోట చదువుకుని, ఉద్యోగాలు చేసే అవకాశాలొచ్చాయి. దీంతో కులాల గోడలను పెకిలించుకొని స్వేచ్ఛావిహంగాలై పిల్లలు ఎగురుతున్నారు. చాలా మంది పిల్లలు తమ మనసుని చంపుకుని ఇంకా కులాల కుంపట్లోనే మాడిపోతున్నారు. కొద్ది మంది మాత్రమే ప్రణయ్, అమృతల్లాగా కులరక్కసి కోరలు పీకడానికి రక్తతర్పణకి సైతం వెనకాడటంలేదు. ఇది కులం గోడలను తునాతునకలు చేయడానికి వేసిన తొలి సమ్మెట దెబ్బ. కులం అనే మురికి అడ్డుపడినంత మాత్రాన ఆధునికతను అందిపుచ్చుకుంటోన్న యువతరం అంతరంగ మహాప్రవాహాన్ని ఎవరు మాత్రం అడ్డుకోగలరు? ‘‘1950 జనవరి 26 తేదీ నుంచి మనం వైరుధ్యాల జీవితంలోనికి అడుగుపెట్టబోతున్నాం. రాజకీయాలలో సమానత్వాన్నీ, సామాజిక ఆర్థిక రంగాలలో అసమానత్వాన్నీ ఎదు ర్కోబోతున్నాం. ఒక మనిషి, ఒక ఓటు. ఒక ఓటు, ఒక విలువ అనే సూత్రంతో రాజకీయాల్లో సమా నత్వం సిద్ధిస్తున్నా, సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇంకా కొనసాగుతోన్న అసమానత్వం ఒక మనిషికి ఒక విలువ అనే సూత్రాన్ని నిరాకరిస్తోంది. ఎంతకాలం మనం ఈ వైరుధ్యాల జీవితాలను కొనసాగించాలి? ఎంత కాలం సామాజిక, ఆర్థిక రంగాల్లో సమాన త్వాన్ని నిరాకరిస్తాం. ఇదే విధానం కొనసాగితే మనం సాధించుకున్న రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. సాధ్యమైనంత త్వరలో మనం ఈ వైరుధ్యాలను తొలగించాలి. లేదంటే ఎంతో శ్రమకోర్చి రాజ్యాంగ సభ నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని అసమానతలతో కుంగి, కృశించిపోతోన్న ప్రజలు పేల్చి వేస్తారు’’.. దాదాపు ఏడు దశాబ్దాల క్రితం భారత రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ అంబేడ్కర్ భవిష్యత్ అసమాన సమాజాన్ని ఉద్దేశించి చేసిన హెచ్చ రిక ఇది. ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన రాజకీయ పార్టీలూ, దేశానికి దిశానిర్దేశం చేస్తామం టోన్న మేధావి వర్గాలూ ఈ హెచ్చరికను ఇసుమం తైనా లక్ష్యపెట్టలేదు. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా దళి తులపైనా, ఆదివాసీలపైనా, మహిళలపైనా, మైనార్టీ లపైనా దాడులూ హత్యలూ, అత్యాచారాలూ కొనసా గుతూనే ఉన్నాయి. దళిత బిడ్డల నెత్తురు ఏరులై ప్రవ హిస్తూనే ఉంది. కుప్పలుపడిన శతాబ్దాల హింసా శకలాల్లో నల్గొండ జిల్లా దళిత బిడ్డ ప్రణయ్ హత్య కూడా ఒకటి. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ కుటిలత్వం తెలియని అమృత, ఈ సమాజంలో కులం కన్నబిడ్డల కంఠాలను తెగనరికేందుకు సైతం వెనకాడదని తెలియని ఓ అగ్రకుల యువతి, ప్రేమని మించింది ఈ ప్రపంచంలో మరొకటుండదని మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, ఆధునికతతోనో, చైతన్యమో తన ప్రేమ విషయంలో అత్యంత పరిణతి ప్రదర్శించింది. తన మాట కాదన్న తల్లిదండ్రుల కుల దురహంకా రాన్ని తలదన్ని తను కోరుకున్న వ్యక్తి చెంతకు చేరింది. ఎందరో అభివృద్ధికాముకులు తమ బిడ్డల విషయంలోసైతం చేయలేని సాహసాన్ని ఆమె చేసి చూపించింది. సమాజం దృష్టిలో కులం తక్కువ వాణ్ణి చేసుకున్నానన్న అపరాధ భావన ఆమెకు ఏ కోశానా లేదు. తన కులాంతర వివాహాన్ని దాచి పెట్టాలన్న అభిప్రాయం అంతకన్నా లేదు. అందుకే తన ఆనందాన్ని రిసెప్షన్ రూపంలో పంచుకుంది. బహుశా గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడో చోట పడి ఉంటే తండ్రిలోని కర్కశత్వం అంత త్వరగా బయట పడేది కాదేమో, కానీ తన కళ్లెదుటే కులం తక్కువ వాణ్ణి పెళ్ళి చేసుకొని తన హర్షాతిరేకాలను ప్రకటిం చిన కూతురి ఆనందాన్ని సహించలేకపోయాడు. డబ్బుమదంతో విర్ర వీగుతోన్న అమృత తండ్రి, కూతుర్ని నమ్మించి, మోసగించి కోటి రూపాయలు సుపారీ ఇచ్చి మరీ నడిరోడ్డుపై అల్లుడి తలను తెగ నరికించాడు. ఈ ఘటనను సమాజం తమకి నచ్చి నట్టుగా, కులం పట్ల తమతమ అవగాహనకు తగ్గ ట్టుగా అర్థం చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రగతిశీల భావాలుగలవారు దీన్ని నిర్ద్వంద్వంగా నిరసించారు. ప్రతిఘటించారు. అయితే ఇది మొదటిదీ, ఇదే చివ రిదీ కూడా కాదు. నల్గొండ ఘాతుకపు నీలినీడలు మనని వీడి పోక ముందే హైదరాబాదు నగరం నడి బొడ్డున కన్న తండ్రే కూతురి తలతెగనరికిన పాశవిక చర్య ఆధునిక సమాజపు ఆనవాళ్ళను మధ్యయుగా లంతటి వెనక్కి తరిమికొట్టింది. ఇక్కడ అమృత తండ్రో, లేదామరో వ్యక్తో కారణం కానేకాదు... తర తరాలుగా ఈ నేలలో ఇంకిన దళితుల నెత్తురంతా కులరక్కసి కారణంగానే. ఈ సమాజాన్ని అగాధం లోకి తోసేస్తోన్న కుల రాకాసి ప్రభావాన్ని ఇప్పటి కింకా తక్కువ చేసి చూడటం మనలో పాతుకుపో యిన అగ్రకుల భావజాలానికి నిదర్శనం. ఒక్కమా టలో చెప్పాలంటే దళిత బిడ్డల హత్యలన్నీ కుల వ్యవస్థలో దాగి ఉన్న ఆధిపత్యానికీ, నిరంకుశత్వా నికీ, హింసాప్రవృత్తికీ ప్రత్యక్ష సాక్ష్యం. అందుకే దీన్ని వ్యక్తుల నేరస్వభావంగా కాకుండా కుల వ్యవస్థ అమానుష హత్యాకాండగా అర్థం చేసుకోవాలి. కుల వ్యవస్థ పుట్టుక, విస్తరణ, ప్రభావం చివరకు దాని నిర్మూలన గురించి అంబేడ్కర్ చాలా శాస్త్రీయంగా విశ్లేషిస్తారు. తనకు తానుగా బంధించుకున్న ఒక పంజరంగా కులాన్ని వర్ణిస్తారాయన. కులం పునాదులను కాపాడుకునేందుకు తన వర్గం వారిని ఉన్నతులుగానూ, ఇతరులను నీచులుగానూ చూసే స్వభావాన్ని ఇది సంతరించుకుంది. ప్రతిష్టను, పరు వునీ ఉన్నతమైన విలువల్లో కాక కులం మూలాల్లో వెతుక్కునే స్వభావం ఎంతటి అమానుషానికైనా ఒడి గట్టే క్రూరత్వానికి కారణం. కులం హిందూ ధర్మశాస్త్రాల పునాదుల్లోంచి పుట్టింది. ఒక కులం వాడు ఇంకొక కులం వాడిని నాయకుడిగా ఒప్పు కోడు. అమృత తండ్రి మారుతీరావు తన నేరాన్ని బహిరంగంగా ఒప్పుకున్నప్పటికీ, అదే కులానికి చెందిన పెద్దలు ఊరేగింపు చేసి, కూతురిని చంపి దోషిగా నిలిచిన వ్యక్తిని పరామర్శించి, ఓ నేరస్తుడికి అండగా నిలుస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఇది ఇటీవలి కాలంలో పొడసూపుతోన్న ఓ నీచమైన సంస్కృతికి తార్కాణం. తన కులంవాడు ఎంత చెడ్డవాడైనా వాడికోసం నిలబడటమే కులం యొక్క బలంగా చలామణీ అవుతోంది. భారత రాజ్యాంగం అందించిన సమానత్వ హక్కులూ, ప్రజాస్వామ్య భావనలూ దేశపు రూపు రేఖలను మార్చబోతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగు తోన్న పరిణామాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తోన్న మార్పులు, ఆధునికతతో ప్రజాస్వామ్య భావనలను సమాజం పుణికిపుచ్చుకుంటోంది. అందులో భాగంగానే ప్రణయ్, అమృతలాంటి యువతీయువకుల కులాంతర, మతాంతర వివా హాలు ఈ కుల వ్యవస్థపై ఒక తిరుగుబాటుగానే భావించాలి. అణగారిన వర్గాలు తలలు ఎగరేస్తే తలలు తెగిపడతాయనే విషయం కొత్తది కాదు. అయినా తలెత్తుకుని తిరగడానికి దళితబిడ్డలు, వారి జీవితాల్లోకి వస్తోన్న దళితేతరుల బిడ్డలు ఒక్క క్షణం తటపటాయించడం లేదు. ఇదే కులం పునాదులను పెకిలించే ఆధునిక ప్రజాస్వామ్య ఉప్పెనై, మనువాద సనాతన సాంప్రదాయాల మురికిని తుడిచిపెట్టేం దుకు సిద్ధమౌతోంది. రాజ్యాంగ రక్షణ లేనప్పుడు, నగరాలూ, పట్ట ణాల అభివృద్ధి కానప్పుడు, పారిశ్రామిక రంగం ఉనికిలోలేనప్పుడు గ్రామాల్లో ఏ కులానికి ఆ కులం తమ తమ వృత్తులలో మునిగి ఉండేవి. కులాల మధ్య సంబంధాలకు తావేలేదు. అంటరానివారికి గ్రామాల్లో ప్రవేశం లేదు. కానీ పరిస్థితి మారింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అందించిన అవకాశాల వల్ల అన్ని కులాల బిడ్డలూ ఒకే చోట చదువుకుని, ఉద్యోగాలు చేసే అవకాశాలొచ్చాయి. దీంతో కులాల గోడలను పెకలించుకుని స్వేచ్ఛా విహంగాలై పిల్లలు ఎగురుతున్నారు. చాలా మంది పిల్లలు తమ మన సుని చంపుకుని ఇంకా కులాల కుంపట్లోనే మాడి పోతున్నారు. కొద్దిమంది మాత్రమే ప్రణయ్, అమృ తల్లాగా కులరక్కసి కోరలు పీకడానికి రక్త తర్పణకి సైతం వెనకాడటంలేదు. కులాంతర వివా హాలను ఒక మార్పుగా మాత్రమే చూడటం తప్పు. ఇది కులం గోడలను తునాతునకలు చేయడానికి వేసిన తొలి సమ్మెట దెబ్బ. కులం అనే మురికి అడ్డుపడి నంత మాత్రాన ఆధునికతను అందిపుచ్చుకుంటోన్న యువతరం అంతరంగ మహాప్రవాహాన్ని ఎవరు మాత్రం అడ్డుకోగలరు? సోషల్ మీడియా సాక్షిగా కులాలకతీతంగా పెల్లుబుకుతోన్న ప్రగతిశీల భావ జాలం ఆ«ధునికతరం అంతరంగాన్ని ఆవిష్కరి స్తోంది. దీన్నే ప్రణయ్ సహచరి అమృత చేపట్టిన కులవ్యతిరేకోద్యమం రుజువుచేసింది. కానీ ప్రభుత్వాలూ, రాజకీయ పార్టీలూ, మేధావి వర్గం కుల వ్యవస్థ నిర్మూలనా కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాయి. రాజ్యాంగంలో ఉన్న రక్షణల ఆధా రంగా ఎన్నో చట్టాలు రూపొందినా వాటి అమలులో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టమే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆ చట్టం ఉద్దేశమే నేరాల నిరోధం. కానీ ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు చట్టం స్ఫూర్తినే దెబ్బతీస్తున్నారు. ప్రణయ్ విషయంలో సైతం పోలీ సులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదనేది సుస్పష్టం. దేశవ్యాప్తంగా ఇదే స్థితి. రాజకీయ పార్టీలు కులం విషయంలో తలదూర్చితే తమ ఓట్లు రాలవనే భయంతో కుల నిర్మూలన అనే రాజ్యాంగ లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మేధావి వర్గం కూడా ప్రేక్షక పాత్రనే వహించడం బాధాకరం. వందేళ్ళ క్రితం బొంబాయి ప్రెసిడెన్సీలో ఆధిపత్య కులాలకు చెందిన ఆనాటి ప్రముఖులు ‘ఆల్ ఇండియా యాంటీ అన్ టచ్బులిటీ మానిఫెస్టో’ విడుదల చేసారు. డిప్రెస్డ్ క్లాస్ మిషన్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ నాయకత్వంలో ముంబాయిలో 1918 మార్చి 23, 24 తేదీల్లో జరిగిన సభ ఆనాడు అంటరాని కులాలకు తమ మద్దతును ప్రకటించింది. ఈ సమావేశానికి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు విఠల్‌భాయ్ పటేల్, ఎమ్మార్ జైకర్, బిపిన్ చంద్రపాల్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. డాక్టర్ హరోల్డ్ మన్, రవీంద్రనాథ్ ఠాగూర్, ద్వారకాపీఠం శంకరాచార్య, డాక్టర్ కురాటకోటి లాంటి వారు అంటరానితనానికి వ్యతిరేకంగా సందేశాలను పంపారు. వీరంతా దళితే తరులేనని అర్థం చేసుకోవాలి. ఇదే స్పందన తక్షణా వసరం. కులం ఒక మానసిక రుగ్మత. కేవలం అంట రాని కులాలే దీన్ని తొలగించుకుంటే సరిపోదు. ఆధి పత్య కులాలతో సహా అందరూ కులతత్వాన్ని వది లించుకుని మానవీయ విలువలనే పరువుప్రతిష్ట లుగా భావించాల్సిన తరుణమిది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
కులరక్కసిపై అమృత పొలికేక
అభిప్రాయం కమ్యూనిష్టు ఉద్యమానికి కంచుకోటైన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దళిత యువకుడు ప్రేమించి వైశ్య యువతి అమృతను పెండ్లి చేసుకున్నందుకు పెండ్లి కుమార్తె తండ్రి తిరునగర్ మారుతీరావు కోటి రూపాయలు వెచ్చించి హత్య చేయించిన ఘటన అన్నివర్గాల ప్రజలకూ ఆశ్చ ర్యాన్ని కల్గించింది. ఈ హత్య ద్వారా కులాంతర వివాహాలు ఆగుతాయి, ప్రేమించే వాళ్ళు ఇక ప్రేమించడం మానివేస్తారు, పెండ్లిళ్ళు చేసుకోవడం మానేస్తారు అనుకోవడం ఒక చారిత్రక తప్పిదమే అవుతుంది. కులం అనేది ఒకనాడు పుట్టింది ఒకనాడు మళ్ళీ పోతుందని అంబేడ్కర్ స్పష్టంగా చెప్పాడు. ‘‘కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్ధ. కుల వ్యవస్థను వదులుకొమ్మని ప్రజలను కోరడం వారి ప్రాథమిక మత భావాలకు విరుద్ధంగా వారిని నడుచుకోమనడమే. హిందువులు తమ సామాజిక వ్యవస్థను పరమ పవిత్రంగా భావిస్తారు. కులానికి దైవిక ప్రాతిపదికను ఆపాది స్తారు. అందువల్ల కులాన్ని నిర్మూలించాలంటే దానికి ఆధారంగా కల్పించిన దైవికతను, పవిత్రతను ముందు నిర్మూలించవలసి ఉంది. అంటే శాస్త్రాల, వేదాల అధికారాన్ని నిర్మూలించవలసి ఉంటుంది’’ (కుల నిర్మూలన) కులాంతర వివాహాన్ని డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగబద్ధం చేశారు. ఇక్కడ అమృత తండ్రి తిరునగరి మారుతీరావు తన కుమార్తెను ప్రేమించి పెండ్లి చేసుకొన్న దళిత యువకుడు ప్రణయ్‌ను క్రూరంగా కిరాయి గూండాలతో హత్య చేయించాడు. ఇది రాజ్యాంగేతరమైన చర్య. సామాజిక మార్పుపై గొడ్డలి వేటు వేసిన చర్య. మరి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎందుకు స్పందించలేదు? తనకు బృహత్తరంగా చందాలిచ్చే వైశ్యుల ఓట్లు పోతాయనా? రెండు తెలుగు రాష్ట్రాల్లో కులాంతర సంస్కృతి విస్తరించడానికి ఆయా ప్రభుత్వ అధినేతలు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఒక ప్రక్క విద్యావంతులైన పిల్లలు కులం పట్టింపు లేకుండా ప్రేమించుకొంటున్నారు. తల్లిదండ్రులు కులం ఊబి లోనే కూరుకు పోయారని తెలిసి కులాంతర వివాహాలు చేసుకొంటున్నారు. ఈ పరిణామాన్ని ఆహ్వానించే చైతన్యం కమ్యూనిస్టులకు కంచుకోటైన నల్ల గొండ జిల్లాలో ఎందుకు లేదు? నక్సలైట్ ఉద్యమానికి పెట్టని కోట అయిన కరీంనగర్ జిల్లాలో కుల నిర్మూలనా చైతన్యం ఎందుకు లేదు? కులం మీరెంత పట్టుకు వేలాడినా నిలవదు. దాని పునాది బలహీనమైందని అంబేడ్కర్ పరిశోధించి చెప్పారు. ఒక ఆర్థ్ధిక వ్యవస్థ్ధగా కుల వ్యవస్థ ఎంతో హానికరమైన సంస్థ అని చెప్పాలి. ఎందుకంటే అది మానవుని సహజశక్తులను, అభిలాషలను క్రూరంగా అణచివేస్తోంది. రాజ్యాంగం అందరికీ విద్యావకాశాలు కల్పిం చాక , సమాజంలో తెలియకుండానే ఒక అంతర్గతమైన మార్పు కొనసాగుతుంది. విద్యకు వున్న శక్తి సామాన్యమైంది కాదు. ప్రధాన స్రవంతి సమాజంలోకి దళితులు విద్య ద్వారా వేగంగా వస్తున్నారు. రూపం, భాష, ఆహార్యం, ప్రవర్తన మారే కొలది ప్రేమకు వారి పుట్టుక అడ్డురావడం లేదనేది ఒక చారిత్రక సత్యం. ఒక పక్క సామాజిక వైజ్ఞానిక సాంకేతిక విప్లవాలు అంతరాలను తొలగించే పనిలో వున్నాయి. మరోవైపున ఓబీసీ కులాలు తమ కుమార్తెలను దళితులు ప్రేమించి పెండ్లి చేసుకోవడాన్ని అడ్డుకొంటున్నాయి. అంబేడ్కర్ చెప్పినట్లు ఇండియాలో సాంఘిక వ్యవస్థను సోషలిస్టులు ఎదుర్కొనక తప్పదు. అలా ఎదుర్కొనకుండా విప్లవం సాధ్యం కాదు. ఒకవేళ ఏ పరిస్థితుల వల్లనో అది సాధ్యమైనా వారి ఆశయాలు నెరవేరాలంటే సదరు సాంఘిక వ్యవస్థతో సోషలిస్టులు కుస్తీ పట్టక తప్పదు. నీవు ఏ దిక్కుకు తిరిగినా సరే దారికడ్డంగా నిలబడే పెనుభూతం కుల వ్యవçస్థ. ఈ భూతాన్ని చంపి పారవేస్తే తప్ప రాజకీయ, ఆర్థిక సంస్కరణలను సాధించలేవు. ఇప్పుడు అమృత కుల నిర్మూలనా ఉద్యమానికి కేక వేస్తోంది. ఆ కేకలో ఆర్తివుంది, ఆవేదన వుంది, సామాజిక సమత వుంది, తండ్రినే నేరస్తుడిగా నిలబెట్టి, తండ్రినే ఉరి తీయమన్న సామాజికనీతి అందరికీ ఆదర్శప్రాయం కావల్సి ఉంది. బాధితురాలు ఒంటరికాదు. భారత రాజ్యాంగం, రాజ్యాంగ శక్తులన్నీ ఆమెకు తోడున్నాయి. కులాంతర వివాహితుల గురించిన రక్షణలు బలపడటమేగాక వారి కోసం ప్రత్యేక కోర్టులు పెట్టించగలిగిన స్థాయికి మనం వెళ్ళాల్సివుంది. ప్రేమించే హక్కును కాపాడాలి, పెండ్లి హక్కునూ కాపాడాలి. అందుకని రోడ్ రోమియోల్లాగా యువకులు మారకూడదు. విద్యాజ్ఞానం, వ్యక్తిత్వ నిర్మాణంతోనే ప్రేమను సాధించవలసి ఉంది. ప్రణయ్‌ను భౌతికంగా హత్య చేయగలరేమో కానీ అతడి ప్రేమను, తాను ఆచరించిన కులాంతర సంస్కృతిని బలివ్వలేరు. ప్రేమ, ఆత్మీయత, సామాజిక సమత అనేవి రాజ్యం కంటే గొప్పవి. అవి కులాల హద్దులనే కాదు దేశాల హద్దులను దాటి ప్రపంచాన్ని ఏకం చేయగలవు. కత్తి పద్మా రావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘ 98497 41695 -
క్యాస్ట్‌కు మూల అర్థం రక్తమా?
సాక్షి, న్యూఢిల్లీ : నేటి ఆధునిక సమాజంలో కులానికున్న ప్రాధాన్యత తక్కువేమి కాదు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కులాల ప్రస్థావన లేకుండా ప్రభుత్వ పాలనే లేదు. ఇంతకూ కులం అంటే ఏమిటీ? ఎక్కడి నుంచి వచ్చింది. ఎలా పుట్టింది?. కులానికి సమానమైన అర్థం ఉందా?. సంస్కతంలో ‘జాతి’ , అరబిక్‌లో ‘కామ్’, పర్షియన్లో ‘జాట్’ అనే పదాలున్నాయి. ఇవన్నీ కూడా ‘క్యాస్ట్ (కులం)’అనే పదానికి సమానమైన అర్థాన్ని ఇవ్వడం లేదు. క్యాస్ట్ అనే ఇంగ్లీషు పదం ‘క్యాస్ట’ అనే స్పానిష్ మాతృక నుంచి వచ్చింది. ‘క్యాస్ట’ అన్న పదం తొలుత ఐబీరియన్లు అయిన స్పానిష్, పోర్చుగీసులు ఉపయోగించారు. ఈ పదాన్ని అమెరికాకు స్పానిష్‌లు, ఆసియాకు పోర్చుగీసులు పరిచయం చేశారు. ‘ఎసో మీ వియెని డి క్యాస్ట’... ‘క్యాస్ట డి జుడియోస్’ పదాలు ఆ విషయాన్ని సూచిస్తున్నాయి. ‘ఎసో మీ వియెని డి క్యాస్ట’ అనే స్పానిష్ వ్యాక్యానికి తెలుగులో ‘ఇది నా రక్తం’ అని అర్థం. ఎవరి కులం ఏదైనా అందరిలో ప్రవహించేది ఒకే రక్తం అంటాం. అదే రక్తం అనే పదం నుంచి క్యాస్ట్ అనే పదం వచ్చిందంటే ఆశ్చర్యమే! యూదులను వేరు చేసి వారిని అవమానించడం కోసం ఐబీరియన్లు ‘క్యాస్ట డి జుడియోస్’ అంటే ‘వారు యూదులు’ అనే పదాన్ని ముందుగా తీసుకొచ్చారట. ఈ క్యాస్ట్ అనే పదం భారత దేశానికి పరిచయం కాకముందే ఒకే ఆదిమ జాతి లేదా గణం మధ్య తప్ప మిగతా జాతి లేదా గణాల మధ్య పెళ్లిళ్లు చేసుకునే వ్యవస్థ లేదు. భారత్‌లోని హిందువులు, జైనులు, బౌద్ధులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవ మతస్తులందరిలోనూ ‘క్యాస్ట్ సిస్టమ్’ ఉంది. ఒకప్పుడు జైనులు, బౌద్ధులు, సిక్కులను హిందువులుగానే పరిగణించేవారు. ఇప్పుడు జైనులు, బౌద్ధులను వేరు మతస్థులుగాను, సిక్కులను హిందువుల్లో భాగంగాను పరిగణిస్తున్నారు. బ్రిటిషర్లు మొట్టమొదటి సారిగా ముంబైలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా కులాల ప్రాతిపదికనే పదవులను నిర్ణయించారు. వ్యవసాయదారులు, వ్యవసాయేతరుల మధ్య భూముల లావాదేవీలకు సంబంధించి 1900 సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు ‘ల్యాండ్ ఎలియనేషన్ యాక్ట్’ను తీసుకొచ్చినప్పుడు కూడా అందులో తెగలు, కులాల ప్రస్థావన తీసుకొచ్చారు. (కుల వ్యవస్థ గురించి పూర్తి అవగాహన కలగాలంటే సుమిత్ గుహ రాసిన ‘బియాండ్ క్యాస్ట్’ రివైజ్డ్ వెర్షన్ పుస్తకాన్ని చదవాల్సిందే. సుమిత్ టెక్సాస్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు). -
కులమే పెద్ద జాతివ్యతిరేకి!
లండన్: భారత్‌లో వేళ్లూనుకుని ఉన్న కుల వ్యవస్థనే నిజమైన జాతి వ్యతిరేకతకు ఉదాహరణ అని నోబెల్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త ఆమర్త్య సేన్ పేర్కొన్నారు. ‘కులమే నిజమైన జాతి వ్యతిరేకి. ఎందుకంటే అది వర్గాల వారీగా దేశాన్ని విడదీస్తుంది. జాతీయవాదమంటే కులాలను, అన్ని విభజనలను నిర్మూలించడమే’ అని తేల్చి చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్(ఎల్ఎస్ఈ)లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గురువారం అమర్త్యసేన్ ప్రసంగించారు. ఎల్ఎస్ఈ పూర్వ విద్యార్థి అయిన అంబేడ్కర్‌ను గొప్ప సామాజిక విప్లవవాదిగా సేన్ అభివర్ణించారు. విద్య ద్వారానే ప్రపంచంలో మనం కోరుకున్న మార్పును సాధించగలమని అంబేడ్కర్ విశ్వసించారన్నారు. -
త్యాగానికీ, ఆత్మ గౌరవానికీ మారు పేరు
ఈ దేశంలో కులవ్యవస్థపై పోరాటం చేసిన మహా పురుషులు, నాయకులు తమ జీవిత కాలంలో ఏదో ఒక సంద ర్భంలో అవమానాలకు, వివక్షకు గురైన వారే. కొలియలకు, శాక్య వంశస్తులకు మధ్య నీటి యుద్ధం అనివార్యమై క్షత్రి యుడైన సిద్ధార్థుడు యుద్ధాన్ని వ్యతిరేకిం చినప్పుడు క్షత్రియ ధర్మమైన రాజ్యపా లనకు అనర్హుడని సొంత సమాజం నుం చి అవమానానికి గురయ్యాడు. ఆ అవమానమే ప్రపంచంలో తొలి సామాజిక విప్లవకారుడి ఆవిర్భావానికి, గౌతమ బుద్ధుడు ఉద్భవిం చడానికి కారణమైనది. బ్రాహ్మణ స్నేహితుడి పెళ్లి ఊరేగింపులో జ్యోతిరావు ఫూలేకి జరిగిన అవమానం... ఆధునిక సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలేను, తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రి బాయిని ఈ దేశానికీ అందించింది. శూద్ర రాజర్షులైన శివాజీ, సాహుజీలకు పట్టాభిషేకం సమయంలో జరిగిన అవమా నాలు- వారిని ఛత్రపతులుగా తీర్చిదిద్దాయి. అఖిల భారత జాతీ య కాంగ్రెస్‌లో జరిగిన అవమానంతో- పెరియార్ రామస్వామి ఆత్మగౌరవ, హేతు, నాస్తికవాద పునాదులు బలపడ్డాయి. గుడిలోకి అడుగు పెట్టనివ్వని వివక్ష- కేరళలో అయ్యంకాళి, నారాయణ గురువులను పుట్టించి ఆ రాష్ర్ట పాలనలో నేటికి మనుధర్మ ఛాయ లు రాకుండా చేసింది. బాల్యం నుంచి భీమ్‌రావుకి జరిగిన అవ మానాలు, మానసిక క్షోభ- ప్రపంచానికి ఒక మేధావిని, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించిన బాబా సాహెబ్ అంబేద్కర్‌ని అందించి కోటానుకోట్ల బడుగు, బలహీన, దళిత, మైనారిటీలతో పాటు అన్ని కులాల్లోని స్త్రీలు, కార్మిక, కర్షక లోకా నికి సౌకర్యవంతమైన జీవనానికి అవకాశాన్ని కల్పించాయి. వీటన్నింటికీ భిన్నంగా పంజాబ్‌లోని సైనిక నేపథ్య చమార్ కుటుంబంలో పుట్టి, కుల వివక్షకు ఏ మాత్రం గురికాని ఓ వ్యక్తి, పుణెలోని రక్షణ సం స్థలో ఉద్యోగిగా చేరాక అక్కడి ఉద్యోగ సంఘ నాయకుడు ఇచ్చిన అంబేద్కర్ రాసిన ‘కులనిర్మూ లన’ చదివి తెలుసుకున్న మనువాద మర్మం - భారతదేశంలో అంబేద్కర్ పునరుజ్జీవనానికి నాం ది పలికి, భారత రాజకీయాల దశ, దిశను మార్చే శక్తి కలిగిన కాన్షీరామ్‌కి పురుడుపోసింది. కుల వివక్ష గురించి ఏ మాత్రం తెలియని ఒక మాదిగ వ్యక్తికి ఒక చిన్న పుస్తకం, ప్రజాస్వామ్య భారతాన్ని ప్రభావి తం చేయగల మహాశక్తిని అందించింది. కాన్షీరామ్ తన తల్లికి రాసి న 24 పేజీల ఉత్తరంలో ఇకపై ఎలాంటి కుటుంబ శుభ, అశుభకా ర్యాలకు రానని, పెళ్లి చేసుకోనని చెప్పి కోట్లాది దయనీయ బహు జన జీవితాలకై ఉద్యోగాన్ని సైతం వదలి అంబేద్కర్ ఉద్యమానికి ఊపిరి పోశాడు. 1956, మార్చి, 18 నాడు ఆగ్రాలో జరిగిన షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సమావేశంలో రిజర్వే షన్ల ఫలితాలు అనుభవిస్తున్న ఉద్యోగులు మాట్లాడిన స్వార్థపూరిత మాటలతో మానసిక వేదనకు గురై, అనారోగ్యంతో మరణించిన బాబాసాహెబ్ ఉద్యమానికి, అదే ఉద్యోగస్తుల టైమ్, టాలెంట్, ట్రెజర్ ద్వారా కాన్షీరామ్ ప్రాణం పోశాడు. నేటి దళిత నాయకులు, వివిధ కుల సంఘ నేతల వలె కాన్షీరామ్ ఏనాడూ అగ్ర కులాలను నిందించడమే పనిగా పెట్ట్టుకోలేదు, ఇతర కులాలను ద్వేషించ లేదు, సొంత ఫిలాసఫీ చెప్పలేదు. గాంధీ- అంబేద్కర్ల అయిష్ట పూనా ఒడంబడికలోని రహస్య కోణాలను బహిర్గ తం చేసి ప్రత్యేక నియోజకవర్గాల విషయంలో అంబేద్కర్‌ని బ్లాక్ మెయిల్ చేసిన కుట్రలను ప్రధా న ఎజెండాగా అందించి గెలుపొందిన యోధుడు కాన్షీరామ్. ఫూలే ‘గులాంగిరి’, అంబేద్కర్ ‘కులని ర్మూలన’, కాన్షీరామ్ ‘చెంచాయుగం’ బహుజన జాతులకు కనువిప్పు కలిగించే పుస్తకాలు. ప్రతి కులంలోని వ్యక్తులు ఎక్కడో ఒకచోట మానసిక, శారీరక సంఘర్షణలకు గురవక తప్ప దు. కులనిర్మూలనకై సాగాల్సిన ఉద్యమాలు కులం బలపడేటట్లు తయారై, కులానికో అవధూత తయారై, సవాలక్ష అవలక్షణాలతో అంబేద్కర్‌కి అపప్రథ తెస్తూ ఉద్య మాన్ని ప్రేమిం చే ఉద్యోగులను మోసం చేస్తున్నాయి. రాబోయే తరాలు వారిని చరిత్ర పుటల్లోంచి తొలగిస్తాయి. ఆత్మగౌరవం అనేది ప్రతి వ్యక్తి విజయానికి భూమిక. అదిలేని ఏ పోరాటం చరిత్రలో విజయం సాధించిన దాఖలాలు లేవు, నిరంతరం బ్రాహ్మణులను, అగ్రవర్ణా లను నిందించడం మాని ఇతర కులాలను ప్రేమించి ఆత్మగౌర వంతో జీవిస్తూ, లక్ష్యసాధనలో వెన్నుచూపని ధైర్యం అలవర్చు కున్న వారే కాన్షీరామ్ అసలైన వారసులు. కాబట్టి ‘పే బ్యాక్ టు సొసైటీ’లో స్వచ్ఛందంగా పాల్గొని. కులరహిత సమాజాన్ని నిర్మి ద్దాం. అదే కాన్షీరామ్‌కి మనమిచ్చే నిజమైన నివాళి. (నేడు కాన్షీరామ్ 81వ జయంతి సందర్భంగా) రాములు, ప్రెసిడెంట్, అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ఫోన్: 8886-612415 - రాములు బహుజన రచయితల వేదిక ఆవిర్భావ సదస్సు బహుజనుల ఆరాధ్య నేత కాన్షీరాం 81వ జయంతి సందర్భంగా బహుజన రచయితల వేదిక ఆంధ్రప్రదేశ్ సదస్సు నేడు ఉదయం 10 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్లో జరుగనుం ది. దళిత ఉద్యమం, సాహిత్యం ఉవ్వెత్తున ఎగిసిపడే తరుణం లోనే ఉత్తరప్రదేశ్‌లో మాయావతిని సీఎం చేయడం ద్వారా కాన్షీరాం భారత పీడిత కులాలకు ఒక సరికొత్త కలను సాక్షా త్కారం చేశారు. ఆ ఊపు అప్పట్లో ఆంధ్రాలో కూడా బాగా ప్రచారమైనప్పటికీ, అంబేద్కర్ వాదాన్ని కేవలం నినాదాలకే పరిమితం చేసిన శక్తులు నీరసించిపోయి బహుజన ఉద్యమ కాడిని వదిలేశాయి. అంబేద్కర్ మార్గం, కాన్షీరాం రాజకీయ చతురత, ఫూలే సంస్కరణాత్మక కార్యాచరణలను జెండాగా, ఎజెండాగా స్వీకరిస్తూ బహుజన రచయితల వేదిక పురుడు పోసుకుంటున్నది. ఆయా కులాల అస్తిత్వ విశిష్టతను పరిరక్షిం చుకుంటూనే, అణగారిన కులాల అస్తిత్వ రాజకీయాలను పున రుత్తేజం చేయడం బహుజన రచయితల వేదిక కర్తవ్యం. పార్ల మెంటరీ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న అన్ని రంగాలను బహుజన విముక్తి దృష్టి కోణంతో విశ్లేషిస్తూ సృజనరంగంలోకి వేదిక అడుగుపెడుతుంది. బహుజనులను రాజ్యాధికారం వైపు తీసుకువెళ్లటం లక్ష్యంగా ప్రయాణించే బహుజన సాహితీ వేత్త లకు, కవులు, రచయితలు, మేధావులకు ఇదే మా స్వాగతం. (నేడు బహుజన రచయితల వేదిక ఆవిర్భావ సదస్సు) డాక్టర్ కాకాని సుధాకర్, కన్వీనర్ మొబైల్: 9440184788 -
ప్రేమి'కులం'...
అభివృద్ధిలో ఎంత ముందున్నా... భారత సమాజాన్ని తిరోగమింపజేస్తున్నవి నిచ్చనమెట్ల కులవ్యవస్థ, మతఛాందసత్వం. ఈ రెంటినీ ధిక్కరిస్తూ ఏర్పడిన ‘కుల నిర్మూలన సంఘం’ కొన్ని వందల వివాహాలు చేసింది. సంఘం 44వ వార్షికోత్సవం సందర్భంగా ఇందిరాపార్క్‌లో జరిగిన గెట్ టు గెదర్ కి కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలు హాజరయ్యాయి. తమ కష్టసుఖాలను కలబోసుకున్నాయి. - శ్రావణ్‌జయ మనదేశంలో పెళ్లికి ప్రతి మతంలో ఓ సంప్రదాయం, ప్రతి కులానికి ఓ కట్టుబాటు ఉంది. ఇక ప్రేమ పెళ్లి అంటే కుల, మత కుమ్ములాటలు సర్వసాధారణమే. ఇలాంటి అవరోధాలకు బలైనవారు ఎందరో. పరాయి కుల, మతస్తులను పెళ్లి చేసుకుంటే అప్రతిష్ట అన్న భావన, ప్రేమించి పెళ్లి చేసుకుంటే కొంత కాలానికి విడిపోతారనే అభిప్రాయం, కారణాలేమైనా... కులవ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నాయి. ఈ జాఢ్యాన్ని పూర్తిగా రూపుమాపాలని ఏర్పడ్డదే ‘కుల నిర్మూలన సంఘం’. మనుషులందరిదీ ఒక్కటే కులమని, అది మానవత్వమేనని చెబుతూ 1971లో జాగర్లమూడి వీరస్వామి అధ్యక్షతన మొదలైంది. ‘రక్తమార్పిడి జరిగితేనే కులం అంతమవుతుంద’న్న అంబేద్కర్ మాటలను నిజం చేస్తూ... కుల, మత, జాతి అనే భేదాలకు అతీతంగా ఇప్పటి వరకు 1,500 జంటల్ని కలిపింది. పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డా, సహజీవనంలో కష్టనష్టాలె న్ని ఎదురైనా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్న జంటల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. ఐదు రోజుల్లోనే పెళ్లి ఇద్దరం టీచర్లు కావడంతో మా భావాలు కలిశాయి. కాకపోతే మా వారు హైదరాబాదీ, మాది రాజస్థానీ కుటుంబం. ఆయన పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఐదోరోజే మా పెళ్లి జరిగింది. ఇద్దరి కులాలు వేరు, భాషలు వేరు, కట్టుబాట్లు వేరు కానీ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పటికి 14 వసంతాలు పూర్తయ్యాయి. పల్లెల్లో మాత్రమే కాదు, చదువుకున్న వారిలోనూ కుల జాఢ్యం చాలా ఉంది. వారిలో మార్పు వస్తే దేశం సగం మారినట్టే. - కారుమంచి జయప్రకాష్, శాంతా రాథోడ్ దంపతులు డైరీల్లో రాసి చెప్పుకుంటాం రెడ్డి సామాజిక వర్గానికి నేను దళిత వ్యక్తిని పెళ్లాడినందుకు మా వాళ్లు చేసిన గొడవ అంతా ఇంతాకాదు. పోలీసుస్టేషన్లో కేసులు పెట్టారు. మా ఇంట్లో వాళ్లే కాదు బంధువులు, స్నేహితులు కూడా దూరమయ్యారు. మా పెళ్లప్పుడు తను సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. ఎలాగైనా జీవితంలో నెట్టుకు రాలవాలన్న పంతంతో ఇద్దరం కష్టపడ్డాం. ప్రస్తుతం మాకు సొంతంగా హాస్టల్స్ ఉన్నాయి. పెళ్లయి 14 ఏళ్లు. మా ఇద్దరిలో నచ్చని విషయాలు ఏమైనా ఉంటే డైరీల్లో రాస్తాం. అవి చదివి ఇద్దరం మార్చుకునేందుకు ప్రయత్నిస్తాం. అంతేగానీ గొడవల్లేవు. పిల్లల్ని బాగా చదివిస్తున్నాం. ఒకప్పుడు మా పెళ్లిని అడ్డుకున్నవాళ్లే ఇప్పుడు ఆదర్శంగా చూస్తుంటే వారిస్తున్న విలువ మాకా? మేం సంపాదించిన డబ్బుకా? అన్న అనుమానం వస్తుంది. - డి.మల్లేష్ , అలివేలుమంగ దంపతులు పోలీసు, నక్సలైట్ కలిసి చేసిన పెళ్లి ‘మాకు పెళ్లయి 23 ఏళ్లు. మూడు సార్లు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమై నాల్గోసారి అప్పటి అడిషనల్ డీజీపీ మల్లెల బాబురావు , ఓ మాజీ నక్సలైట్, ప్రముఖ కవి శివసాగర్ (కలంపేరు) సహాయంతో ఇద్దరం ఒక్కటయ్యాం. బహుశా పోలీసు, నక్సలై ట్ కలిసి చేసిన పెళ్లి మాదేనేమో. మతాంతర వివాహం కావడంతో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నాం. కుల, మతాలకు అతీతంగా 70 జంటలను కలిపాం. కులవ్యవస్థను మార్చాలంటే ముందు రాజకీయాలు మారాలి. ఏ పార్టీ మేనిఫెస్టోలోనూ కులనిర్మూలన ప్రస్తావనే లేదు. - మహమ్మద్ వహీద్, జ్యోతి దంపతులు అందరూ ఒకచోట చేరాలి దళిత వర్గానికి చెందిన వాడిని కావడంతో బ్రాహ్మిణ్ అయిన తనను పెళ్లి చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రెండు కుటుంబాలూ ధనవంతులైనప్పుడు కులం అనేది అడ్డు కావట్లేదు. ఒకరు పేద, మరొకరు ధనికులైనప్పుడే మరింత ఇబ్బంది ఎదురవుతోంది. గతంలో కంటే ఇప్పుడు మార్పు వస్తోంది. పదేళ్ల కిందట సభకు చాలా తక్కువ మంది వచ్చేవారు. ఇప్పుడు కొన్ని వందల మంది వస్తున్నారు. ఇది శుభసూచకం. త్వరలోనే కులవ్యవస్థ నిర్మూలన కోసం ఓ టీవీ షోను ప్లాన్ చేస్తున్నా. మన రాష్ర్టంలోనే కాదు, దేశం మొత్తంలో కులమతాలకు అతీతంగా వివాహాలు చేసుకున్న వారు ఒక చోట చేరాలన్నది నా ఆకాంక్ష!. - ఇ.సూర్యనారాయణ, సూర్యసుధ దంపతులు