అభిప్రాయం
కమ్యూనిష్టు ఉద్యమానికి కంచుకోటైన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దళిత యువకుడు ప్రేమించి వైశ్య యువతి అమృతను పెండ్లి చేసుకున్నందుకు పెండ్లి కుమార్తె తండ్రి తిరునగర్ మారుతీరావు కోటి రూపాయలు వెచ్చించి హత్య చేయించిన ఘటన అన్నివర్గాల ప్రజలకూ ఆశ్చ ర్యాన్ని కల్గించింది. ఈ హత్య ద్వారా కులాంతర వివాహాలు ఆగుతాయి, ప్రేమించే వాళ్ళు ఇక ప్రేమించడం మానివేస్తారు, పెండ్లిళ్ళు చేసుకోవడం మానేస్తారు అనుకోవడం ఒక చారిత్రక తప్పిదమే అవుతుంది. కులం అనేది ఒకనాడు పుట్టింది ఒకనాడు మళ్ళీ పోతుందని అంబేడ్కర్ స్పష్టంగా చెప్పాడు.
‘‘కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్ధ. కుల వ్యవస్థను వదులుకొమ్మని ప్రజలను కోరడం వారి ప్రాథమిక మత భావాలకు విరుద్ధంగా వారిని నడుచుకోమనడమే. హిందువులు తమ సామాజిక వ్యవస్థను పరమ పవిత్రంగా భావిస్తారు. కులానికి దైవిక ప్రాతిపదికను ఆపాది స్తారు. అందువల్ల కులాన్ని నిర్మూలించాలంటే దానికి ఆధారంగా కల్పించిన దైవికతను, పవిత్రతను ముందు నిర్మూలించవలసి ఉంది. అంటే శాస్త్రాల, వేదాల అధికారాన్ని నిర్మూలించవలసి ఉంటుంది’’ (కుల నిర్మూలన) కులాంతర వివాహాన్ని డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగబద్ధం చేశారు.
ఇక్కడ అమృత తండ్రి తిరునగరి మారుతీరావు తన కుమార్తెను ప్రేమించి పెండ్లి చేసుకొన్న దళిత యువకుడు ప్రణయ్‌ను క్రూరంగా కిరాయి గూండాలతో హత్య చేయించాడు. ఇది రాజ్యాంగేతరమైన చర్య. సామాజిక మార్పుపై గొడ్డలి వేటు వేసిన చర్య. మరి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎందుకు స్పందించలేదు? తనకు బృహత్తరంగా చందాలిచ్చే వైశ్యుల ఓట్లు పోతాయనా? రెండు తెలుగు రాష్ట్రాల్లో కులాంతర సంస్కృతి విస్తరించడానికి ఆయా ప్రభుత్వ అధినేతలు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఒక ప్రక్క విద్యావంతులైన పిల్లలు కులం పట్టింపు లేకుండా ప్రేమించుకొంటున్నారు.
తల్లిదండ్రులు కులం ఊబి లోనే కూరుకు పోయారని తెలిసి కులాంతర వివాహాలు చేసుకొంటున్నారు. ఈ పరిణామాన్ని ఆహ్వానించే చైతన్యం కమ్యూనిస్టులకు కంచుకోటైన నల్ల గొండ జిల్లాలో ఎందుకు లేదు? నక్సలైట్ ఉద్యమానికి పెట్టని కోట అయిన కరీంనగర్ జిల్లాలో కుల నిర్మూలనా చైతన్యం ఎందుకు లేదు? కులం మీరెంత పట్టుకు వేలాడినా నిలవదు. దాని పునాది బలహీనమైందని అంబేడ్కర్ పరిశోధించి చెప్పారు. ఒక ఆర్థ్ధిక వ్యవస్థ్ధగా కుల వ్యవస్థ ఎంతో హానికరమైన సంస్థ అని చెప్పాలి. ఎందుకంటే అది మానవుని సహజశక్తులను, అభిలాషలను క్రూరంగా అణచివేస్తోంది.
రాజ్యాంగం అందరికీ విద్యావకాశాలు కల్పిం చాక , సమాజంలో తెలియకుండానే ఒక అంతర్గతమైన మార్పు కొనసాగుతుంది. విద్యకు వున్న శక్తి సామాన్యమైంది కాదు. ప్రధాన స్రవంతి సమాజంలోకి దళితులు విద్య ద్వారా వేగంగా వస్తున్నారు. రూపం, భాష, ఆహార్యం, ప్రవర్తన మారే కొలది ప్రేమకు వారి పుట్టుక అడ్డురావడం లేదనేది ఒక చారిత్రక సత్యం. ఒక పక్క సామాజిక వైజ్ఞానిక సాంకేతిక విప్లవాలు అంతరాలను తొలగించే పనిలో వున్నాయి. మరోవైపున ఓబీసీ కులాలు తమ కుమార్తెలను దళితులు ప్రేమించి పెండ్లి చేసుకోవడాన్ని అడ్డుకొంటున్నాయి.
అంబేడ్కర్ చెప్పినట్లు ఇండియాలో సాంఘిక వ్యవస్థను సోషలిస్టులు ఎదుర్కొనక తప్పదు. అలా ఎదుర్కొనకుండా విప్లవం సాధ్యం కాదు. ఒకవేళ ఏ పరిస్థితుల వల్లనో అది సాధ్యమైనా వారి ఆశయాలు నెరవేరాలంటే సదరు సాంఘిక వ్యవస్థతో సోషలిస్టులు కుస్తీ పట్టక తప్పదు. నీవు ఏ దిక్కుకు తిరిగినా సరే దారికడ్డంగా నిలబడే పెనుభూతం కుల వ్యవçస్థ. ఈ భూతాన్ని చంపి పారవేస్తే తప్ప రాజకీయ, ఆర్థిక సంస్కరణలను సాధించలేవు. ఇప్పుడు అమృత కుల నిర్మూలనా ఉద్యమానికి కేక వేస్తోంది.
ఆ కేకలో ఆర్తివుంది, ఆవేదన వుంది, సామాజిక సమత వుంది, తండ్రినే నేరస్తుడిగా నిలబెట్టి, తండ్రినే ఉరి తీయమన్న సామాజికనీతి అందరికీ ఆదర్శప్రాయం కావల్సి ఉంది. బాధితురాలు ఒంటరికాదు. భారత రాజ్యాంగం, రాజ్యాంగ శక్తులన్నీ ఆమెకు తోడున్నాయి. కులాంతర వివాహితుల గురించిన రక్షణలు బలపడటమేగాక వారి కోసం ప్రత్యేక కోర్టులు పెట్టించగలిగిన స్థాయికి మనం వెళ్ళాల్సివుంది. ప్రేమించే హక్కును కాపాడాలి, పెండ్లి హక్కునూ కాపాడాలి. అందుకని రోడ్ రోమియోల్లాగా యువకులు మారకూడదు. విద్యాజ్ఞానం, వ్యక్తిత్వ నిర్మాణంతోనే ప్రేమను సాధించవలసి ఉంది. ప్రణయ్‌ను భౌతికంగా హత్య చేయగలరేమో కానీ అతడి ప్రేమను, తాను ఆచరించిన కులాంతర సంస్కృతిని బలివ్వలేరు. ప్రేమ, ఆత్మీయత, సామాజిక సమత అనేవి రాజ్యం కంటే గొప్పవి. అవి కులాల హద్దులనే కాదు దేశాల హద్దులను దాటి ప్రపంచాన్ని ఏకం చేయగలవు.
కత్తి పద్మా రావు
వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ
వ్యవస్థాపక అధ్యక్షుడు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment