విశ్లేషణ
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అంబేడ్కర్ జపం చేస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్యాంగం మీద ఎక్కడలేని ప్రేమను కురిపిస్తున్నారు. రాజ్యాంగం తనకు శిరోధార్యం అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్‌ను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ ఇప్పుడు కొనియాడటంలో మార్మికత ఉంది. వాటిని దళిత బహుజనులు అర్థం చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని చేత బూనుతుంది. కానీ కుల నిర్మూలనకు, స్త్రీ విముక్తికి, సంపద అందరికీ పంచడానికి పాటుపడటం లేదు. ఈ కార్పొరేట్ భారతాన్ని మతవాదులు పెంచి పోషిస్తున్నారు. అంబేడ్కర్ ఒక విస్తృతమైన మానవాభ్యుదయం కోసం కృషి చేశారు. సామ్యవాద భారతం కావాలంటే అంబేడ్కర్ మార్గం ఒక్కటే దిక్సూచి.
భారతదేశంలో అనేక భావ విప్లవ ఉద్య మాలు, సామాజిక సాంస్కృతిక పరిణా మాలు ఆ యా కాలాల్లో వచ్చాయి. అవి రాజకీయ సిద్ధాంతాలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా భారతదేశంలో 1927వ సంవత్సరం నుండి సామాజిక విప్లవోద్యమం ప్రారంభమైంది. బి.ఆర్. అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చెయ్యటంతోనే ఈ సాంస్కృతిక విప్లవం ప్రారంభమైంది. అంబేడ్కర్ పుట్టిన మహారాష్ట్రలో అడుగుపెట్టిన నోబెల్ బహుమతి గ్రహీత వి.ఎస్.నైపాల్ ముంబయి నగరాన్ని చూస్తుంటే అంబేడ్కర్ నగరంగా కనిపిస్తుందని అన్నారు. ఎక్కడ చూసినా అంబేడ్కర్ విగ్రహాలు, అంబేడ్కర్ కాలేజీలు, అంబేడ్కర్ విశ్వవిద్యాలయాలు, అంబేడ్కర్ చైత్యాలు, అంబేడ్కర్ గ్రంథాలయా లతో నిండివుందని నైపాల్ రాశారు. భారతదేశం మొత్తం ఎక్కడ చూసినా– బెంVýæళూరు, చెన్నై, కలకత్తా అన్ని మహనగరాల్లోనూ అంబేడ్కర్ స్ఫూర్తే కనపడుతుంది.
నిజానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు, విశ్వహిందూ పరిషత్‌కు భావజాల పరంగా, సిద్ధాంతపరంగా ప్రత్యామ్నాయంగా రూపొందించిందే మన రాజ్యాంగం. భారత రాజ్యాంగం పూర్తిగా మనుస్మృతి భావజాలాన్ని నిరాకరించిన గ్రంథం. అంబేడ్కర్ రాజ్యాంగ ప్రతిని రాజ్యాంగ పరి షత్తులో ప్రవేశపెట్టిన నాటి నుండి ఆర్‌ఎస్‌ఎస్ నిరాకరిస్తూనే వచ్చింది. బీజేపీ ద్వారా సంపూర్ణ రాజ్యాధికారమే వస్తే రాజ్యాంగాన్నే మార్చా లనే దుర్వ్యూహం వాళ్ళ దగ్గర వుంది.
అంబేడ్కర్ భారతదేశాన్ని సమసమాజ నిర్మాణంలోకి తీసుకు వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేశారు. పెను వృక్షంలాంటి కాంగ్రెస్ బ్రాహ్మణవాదాన్ని ఎదిరించటానికి, అంతర్గతంగా కాంగ్రెస్‌లో దాగి వున్న హిందూ సాంప్రదాయవాదాన్ని ఎదిరించడానికి ఒక దశలో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చింది. తన ప్రజలు కూడా తనకు తోడురాని పరిస్థితుల్లోనూ నిక్కచ్చిగా నిలబడ్డారు. అంబేడ్కర్ దేశ వ్యాప్తంగా తన తాత్విక ముద్ర వేయగలగడానికి కారణం ఆయన బౌద్ధతాత్విక జీవన విధానమే.
ఆయన రాజ్యాంగ రచనా రూప కల్పనలో అష్టాంగ మార్గాన్ని ఆదర్శ సూత్రాల్లోకి సమన్వయించ గలి గారు. సమదృష్టి, సత్‌సంకల్పము, సత్ వచనము, సత్ కర్మ, సత్ జీవనము, సత్ ప్రయత్నము, సత్ కృతి, సత్ సమాధి సూత్రాలను భారత రాజ్యాంగంలో చేర్చిన తరువాత దానికి సామాజిక, తాత్విక జీవన పరిమళం వచ్చింది. భారత రాజ్యాంగం ఒక గొప్ప సమతా మార్గ నిర్దేశంగా నిలబడింది.
ఈనాడు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో బీజేపీ కొత్త ఎత్తు గడతో అంబేడ్కర్ జపం చేస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ దశాబ్దంలో అనేక మార్పులు వచ్చాయి. బీజేపీ దుర్వ్యూహాల గురించి దళితులు, బహుజనులు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్యాంగం మీద ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారు. రాజ్యాంగం తనకు శిరోధార్యం అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఫడ్నవీస్ రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు మోకరిల్లు తున్న పోస్టర్లు మహారాష్ట్రలో విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. రాజ్యాంగ రూపకల్పన పూర్తయిన సందర్భంగా, రాజ్యాంగ నిర్ణాయక సభలో 1949 నవంబర్ 25న అంబేడ్కర్ చేసిన రాజ్యాంగం తుది ప్రతి మీద ఆర్‌ఎస్‌ఎస్ దుమ్మెత్తి పోసింది. రాజ్యాంగంలో భారతీయత అనేది ఉదాహరణ ప్రాయంగా కూడా లేదని దెప్పి పొడిచింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయినా దళితులపై ప్రతిరోజూ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు బహి రంగంగా కొట్టడం, మరి కొన్నిసార్లు గుడిలోకి రానివ్వకపోవడం, చేసిన పనికి జీతం అడిగితే దాడులకు దిగడం, దొంగతనం చేశారన్న అరోపణలతో అకృత్యాలకు పాల్పడటం నిత్యకృత్యాలుగా మారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. దళితులను అవమానించడం, సాంఘిక బహిష్కరణ కేసులు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం, దళితులపై అఘాయిత్యాలకు సంబంధించి ప్రతిరోజూ 150కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఎన్డీయే పాలనలో 2018 నుండి 2022 మధ్య దళితులపై లైంగికదాడులు 35 శాతం పెరిగాయని ఆ నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రకారం 2018 నుంచి ప్రతి సంవ త్సరం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది.
దళితులపై నేరాలకు సంబంధించి 2018లో 42,793 కేసులు నమోదయ్యాయి. 2021లో 50,900 కేసులు, 2022లో 57,582 కేసులు నమోదయ్యాయి. ఆ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో దళితులపై అఘాయిత్యాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2022లో అక్కడ 15 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఎనిమిదిన్నర వేలకు పైగా కేసులు నమో దైన రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది.
యోగీ ఆదిత్యనాథ్ ఇలాకాలోని భరూచ్ జిల్లా తాజ్‌పూర్ తెడియా గ్రామంలో ఇద్దరు కోళ్ల ఫారం యజమానులు దళిత బాలురు దొంగతనం చేశారన్న అనుమానంతో దాష్టీకానికి దిగారు. బాలురను కొట్టి, గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పులిమి గ్రామంలో ఊరేగించారు. ఐదు కిలోల గోధుమలు అపహరించారని ఆరోపిస్తూ 12–14 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలుర ముంజేతులపై ‘దొంగ’ అని రాసి గ్రామంలో ఊరేగించారు.
దళితుల మానవ హక్కుల పోరాటం గురించి అంబేడ్కర్ ఎంతో అధ్యయనం చేశారు. మొదట డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నుకో బడిన అంబేడ్కర్ ఆ పిదప 1947 ఆగస్ట్ 29వ తేదీన రాజ్యాంగ రచన సంఘ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. ఎన్. గోపాల స్వామి అయ్యంగార్, సర్ అల్లాడి కుప్పుస్వామి అయ్యర్, కె.ఎం. మున్షీ, మహ్మద్ సాదుల్లా, ఎన్. మాధవ రావు, డి.పి. ఖైతాన్ యితర సభ్యులు కాగా, బి.ఎన్.రావు రాజ్యాంగ సలహాదారులు.
కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నాయకులను విమర్శించే అంబేడ్కర్‌ను రాజ్యాంగ రచన సంఘా ధ్యక్షులుగా ఆహ్వానించారు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఔదార్యంగా చెప్పబడినా అంబేడ్కర్ అసాధారణ ప్రతిభ, ఒక చారిత్రక అవసరంగా మాత్రమే పరిగణించబడుతుంది.
అంబేడ్కర్ తనపై మోపబడిన ఈ భారాన్ని సమర్థవంతంగా, నిజాయితీగా నిర్వర్తించడానికి కృషి చేశారు. అంబేడ్కర్ అమెరికాలో చదువుతున్న కాలంలో నీగ్రోల చరిత్రను అధ్యయనం చేశారు. నీగ్రోలు తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళే క్రమంలో అమెరికా రాజ్యాంగంలోని 14వ అధికరణం ద్వారా ఎలా స్వాతంత్య్రం పొందారో తెలుసుకున్నారు. నీగ్రోల విముక్తి పోరాటంలో ప్రధాన పాత్ర వహించిన బుకర్ టి.వాషింగ్‌టన్ చరిత్రను అధ్యయనం చేశారు. నీగ్రోల పోరాట చరిత్ర ద్వారా భారతదేశంలో దళితుల్ని ఎలా విముక్తి చేయాలో అర్థం చేసుకొన్నారు.
అంబేడ్కర్ ఒక విస్తృతమైన మానవాభ్యుదయం కోసం కృషి చేశారు. ఆయనకు కుల మత బేధాలు లేవు. ఆయన బౌద్ధ జీవన పథికుడు. ఆయన ఆర్థిక, వ్యాపార, రాజకీయ, పరిపాలన, ధర్మ శాస్త్రాల నిపుణుడు. మనుస్మృతిని, యాజ్ఞవల్క్య స్మృతిని, శారదా స్మృతిని అధ్యయనం చేసిన భారతీయుడు. అవి అధర్మశాస్త్రాలని తేల్చిన పరిశోధకుడు. చార్వాకాన్ని, బౌద్ధాన్ని, జైనాన్ని, సాంఖ్యాన్ని అవపో సన పట్టారు. జాన్ డ్యూయీ శిష్యునిగా ప్రజాస్వామ్య శాస్త్రాన్ని ప్రపంచానికి బోధించారు.
ఆయన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరి షత్ ఇప్పుడు కొనియాడటంలో మార్మికత ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని చేత బూనుతుంది కానీ అస్పృశ్యత నివారణకు, కుల నిర్మూలనకు, స్త్రీ విముక్తికి, సంపద అందరికీ పంచడానికి పాటు పడటం లేదు. ఈ కార్పొరేట్ భారతాన్ని మతవాదులు పెంచి పోషిస్తున్నారు. సామ్యవాద భారతం కావాలంటే అంబేడ్కర్ మార్గం ఒక్కటే దిక్సూచి. ఆయన మార్గంలో నడుద్దాం.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment