B.r. ambedkar
-
రాజ్యాంగ అమలులో చిత్తశుద్ధి ఉందా?
దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి చర్చలు తుది రూపంలోకి వస్తున్న తరుణంలోనే రాజ్యాంగాన్ని రూపొందించడానికి ‘రాజ్యాంగ సభ’ను ఏర్పాటు చేశారు. బి.ఆర్. అంబేడ్కర్ ముసాయిదా కమిటి చైర్మన్‌గా, బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించారు. వివిధ రాజ్యాంగ రచనా కమిటీలకు నిష్ణాతులు సేవలందించారు. వీరి కృషి ఫలితంగా రూపొందిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 నాడు రాజ్యాంగ సభ ఆమోదించింది. నాటి రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉన్నాయి (ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు, 486 పైగా అధిక రణలు). చివరకు 1950 జనవరి 26 నాడు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అంటే 2025 జనవరి 26 నాటికి రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లన్నమాట! ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో దేశం పరిపాలనా పరంగా, జనాభా పరంగా, సంస్థాగతంగా, సాంకేతికంగా చాలా ప్రగతిని సాధించిందని చెప్పగలం. కానీ ఆ అభివృద్ధి అన్ని రంగాల్లో ఆశించిన స్థాయిలో జరగకపోవడం, రాజ్యాంగంలో పేర్కొన్నట్లు అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా పంపిణీ కాకపోవడం బాధాకరం. రాజ్యాంగ ప్రవేశికలో లేని ‘సామ్యవాద’, ‘లౌకిక’ పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం చేర్చింది. మొత్తం మీద ఇప్పటికి 106 రాజ్యాంగ సవరణలు జరగడం గమనార్హం. ఏ దేశ రాజ్యాంగం అయినా మారుతున్న అవసరా లకు అనుగుణంగా తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. ఆనాడు రాజ్యాంగ సభలో అంబేడ్కరే స్వయంగా ‘ఒకవేళ రాజ్యాంగం విఫలం అయితే ఆ తప్పు రాజ్యాంగానిది కాదు, దానిని అమలు చేసే పాలకులదే’ అన్నారు. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టా’న్ని చేశారు. కానీ దీన్ని చాలా రాజకీయ పార్టీలు ఎంతగా నీరుగార్చాయో తెలిసిందే కదా! 6–14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ‘విద్యా హక్కు చట్టం’ తెచ్చారు. కానీ అమలును మరచారు. నేటికీ బడి బయట కోట్లాదిమంది పిల్లలు బాలకార్మికులుగా బతుకు తున్నారు. దేశంలో అంతర్గతంగా పెరుగుతున్న కులం, మతం భావాలు విద్వేషాన్ని నింపుతున్నాయి. ఈ మధ్యనే ఫ్యూచర్ రీసెర్చ్ సెంటర్ నివేదికలో మత విద్వేషం బుసలు కొడుతున్న దేశాల్లో మనదేశం మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది.రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశ సూత్రాలు సరిగ్గా అమలుకు నోచుకోవడం లేదు. ప్రాథమిక హక్కు లదీ దాదాపు అదే స్థితి. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వాలు ఎలా నీరుగారుస్తున్నాయో జైళ్లలో మగ్గుతున్న అనేక మంది హక్కుల కార్యకర్తలూ, ప్రజా ఉద్యమకారులూ, మేధావులను చూస్తే అర్థమవు తుంది. అలాగే అమానవీయమైన అంటరానితనాన్ని రాజ్యాంగం నిషేధించినా ఇప్పటికీ గ్రామాల్లో వివక్ష కొన సాగుతూనే ఉంది. ‘రాజ్యాంగం’ మీద కనీస అవగాహన లేనివారు చట్టసభలలో అడుగుపెట్టడం శోచనీయం. ఇక వారు ఎటువంటి చట్టాలు చేస్తారో చెప్పవలసిన పనేముంది! ఒక అందమైన భవంతిని నిర్మించుకొని దానిని సక్రమంగా వాడుకోకపోతే అది త్వరలోనే శిథిల స్థితికి చేరుతుంది. ఈ సూత్రం ఏ దేశ రాజ్యాంగానికైనా వర్తిస్తుంది. ‘భారత ప్రజలమైన మేము దేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్య్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్నీ, ఆలోచన, భావ ప్రకటన స్వేచ్ఛ, మతవిశ్వాస ఆరాధనా స్వేచ్ఛలనూ, అవకాశాల్లో సమానత్వాన్ని సాధించేందుకు, వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు శాసనం (రాజ్యాంగం రూపంలో) చేసి, ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాం’ అని రాజ్యాంగ ప్రవేశికలోనే ఉంది. అంటే ఆనాడు మన లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగానే అది రూపొందించబడింది. కానీ దాని అమలులోనే పాలకులకు చిత్తశుద్ధి కొరవడింది. ఇది గర్హనీయం. డా‘‘ మహ్మద్ హసన్ వ్యాసకర్త పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ -
సమతా పథంలో సాగాలంటే...
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అంబేడ్కర్ జపం చేస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్యాంగం మీద ఎక్కడలేని ప్రేమను కురిపిస్తున్నారు. రాజ్యాంగం తనకు శిరోధార్యం అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్‌ను బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ ఇప్పుడు కొనియాడటంలో మార్మికత ఉంది. వాటిని దళిత బహుజనులు అర్థం చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని చేత బూనుతుంది. కానీ కుల నిర్మూలనకు, స్త్రీ విముక్తికి, సంపద అందరికీ పంచడానికి పాటుపడటం లేదు. ఈ కార్పొరేట్ భారతాన్ని మతవాదులు పెంచి పోషిస్తున్నారు. అంబేడ్కర్ ఒక విస్తృతమైన మానవాభ్యుదయం కోసం కృషి చేశారు. సామ్యవాద భారతం కావాలంటే అంబేడ్కర్ మార్గం ఒక్కటే దిక్సూచి.భారతదేశంలో అనేక భావ విప్లవ ఉద్య మాలు, సామాజిక సాంస్కృతిక పరిణా మాలు ఆ యా కాలాల్లో వచ్చాయి. అవి రాజకీయ సిద్ధాంతాలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా భారతదేశంలో 1927వ సంవత్సరం నుండి సామాజిక విప్లవోద్యమం ప్రారంభమైంది. బి.ఆర్. అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చెయ్యటంతోనే ఈ సాంస్కృతిక విప్లవం ప్రారంభమైంది. అంబేడ్కర్ పుట్టిన మహారాష్ట్రలో అడుగుపెట్టిన నోబెల్ బహుమతి గ్రహీత వి.ఎస్.నైపాల్ ముంబయి నగరాన్ని చూస్తుంటే అంబేడ్కర్ నగరంగా కనిపిస్తుందని అన్నారు. ఎక్కడ చూసినా అంబేడ్కర్ విగ్రహాలు, అంబేడ్కర్ కాలేజీలు, అంబేడ్కర్ విశ్వవిద్యాలయాలు, అంబేడ్కర్ చైత్యాలు, అంబేడ్కర్ గ్రంథాలయా లతో నిండివుందని నైపాల్ రాశారు. భారతదేశం మొత్తం ఎక్కడ చూసినా– బెంVýæళూరు, చెన్నై, కలకత్తా అన్ని మహనగరాల్లోనూ అంబేడ్కర్ స్ఫూర్తే కనపడుతుంది. నిజానికి ఆర్ఎస్ఎస్కు, విశ్వహిందూ పరిషత్‌కు భావజాల పరంగా, సిద్ధాంతపరంగా ప్రత్యామ్నాయంగా రూపొందించిందే మన రాజ్యాంగం. భారత రాజ్యాంగం పూర్తిగా మనుస్మృతి భావజాలాన్ని నిరాకరించిన గ్రంథం. అంబేడ్కర్ రాజ్యాంగ ప్రతిని రాజ్యాంగ పరి షత్తులో ప్రవేశపెట్టిన నాటి నుండి ఆర్ఎస్ఎస్ నిరాకరిస్తూనే వచ్చింది. బీజేపీ ద్వారా సంపూర్ణ రాజ్యాధికారమే వస్తే రాజ్యాంగాన్నే మార్చా లనే దుర్వ్యూహం వాళ్ళ దగ్గర వుంది.అంబేడ్కర్ భారతదేశాన్ని సమసమాజ నిర్మాణంలోకి తీసుకు వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేశారు. పెను వృక్షంలాంటి కాంగ్రెస్ బ్రాహ్మణవాదాన్ని ఎదిరించటానికి, అంతర్గతంగా కాంగ్రెస్‌లో దాగి వున్న హిందూ సాంప్రదాయవాదాన్ని ఎదిరించడానికి ఒక దశలో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చింది. తన ప్రజలు కూడా తనకు తోడురాని పరిస్థితుల్లోనూ నిక్కచ్చిగా నిలబడ్డారు. అంబేడ్కర్ దేశ వ్యాప్తంగా తన తాత్విక ముద్ర వేయగలగడానికి కారణం ఆయన బౌద్ధతాత్విక జీవన విధానమే. ఆయన రాజ్యాంగ రచనా రూప కల్పనలో అష్టాంగ మార్గాన్ని ఆదర్శ సూత్రాల్లోకి సమన్వయించ గలి గారు. సమదృష్టి, సత్సంకల్పము, సత్ వచనము, సత్ కర్మ, సత్ జీవనము, సత్ ప్రయత్నము, సత్ కృతి, సత్ సమాధి సూత్రాలను భారత రాజ్యాంగంలో చేర్చిన తరువాత దానికి సామాజిక, తాత్విక జీవన పరిమళం వచ్చింది. భారత రాజ్యాంగం ఒక గొప్ప సమతా మార్గ నిర్దేశంగా నిలబడింది. ఈనాడు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో బీజేపీ కొత్త ఎత్తు గడతో అంబేడ్కర్ జపం చేస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ దశాబ్దంలో అనేక మార్పులు వచ్చాయి. బీజేపీ దుర్వ్యూహాల గురించి దళితులు, బహుజనులు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్యాంగం మీద ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారు. రాజ్యాంగం తనకు శిరోధార్యం అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫడ్నవీస్ రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు మోకరిల్లు తున్న పోస్టర్లు మహారాష్ట్రలో విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. రాజ్యాంగ రూపకల్పన పూర్తయిన సందర్భంగా, రాజ్యాంగ నిర్ణాయక సభలో 1949 నవంబర్ 25న అంబేడ్కర్ చేసిన రాజ్యాంగం తుది ప్రతి మీద ఆర్ఎస్ఎస్ దుమ్మెత్తి పోసింది. రాజ్యాంగంలో భారతీయత అనేది ఉదాహరణ ప్రాయంగా కూడా లేదని దెప్పి పొడిచింది.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయినా దళితులపై ప్రతిరోజూ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు బహి రంగంగా కొట్టడం, మరి కొన్నిసార్లు గుడిలోకి రానివ్వకపోవడం, చేసిన పనికి జీతం అడిగితే దాడులకు దిగడం, దొంగతనం చేశారన్న అరోపణలతో అకృత్యాలకు పాల్పడటం నిత్యకృత్యాలుగా మారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. దళితులను అవమానించడం, సాంఘిక బహిష్కరణ కేసులు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం, దళితులపై అఘాయిత్యాలకు సంబంధించి ప్రతిరోజూ 150కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఎన్డీయే పాలనలో 2018 నుండి 2022 మధ్య దళితులపై లైంగికదాడులు 35 శాతం పెరిగాయని ఆ నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రకారం 2018 నుంచి ప్రతి సంవ త్సరం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. దళితులపై నేరాలకు సంబంధించి 2018లో 42,793 కేసులు నమోదయ్యాయి. 2021లో 50,900 కేసులు, 2022లో 57,582 కేసులు నమోదయ్యాయి. ఆ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో దళితులపై అఘాయిత్యాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2022లో అక్కడ 15 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఎనిమిదిన్నర వేలకు పైగా కేసులు నమో దైన రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. యోగీ ఆదిత్యనాథ్ ఇలాకాలోని భరూచ్ జిల్లా తాజ్పూర్ తెడియా గ్రామంలో ఇద్దరు కోళ్ల ఫారం యజమానులు దళిత బాలురు దొంగతనం చేశారన్న అనుమానంతో దాష్టీకానికి దిగారు. బాలురను కొట్టి, గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పులిమి గ్రామంలో ఊరేగించారు. ఐదు కిలోల గోధుమలు అపహరించారని ఆరోపిస్తూ 12–14 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలుర ముంజేతులపై ‘దొంగ’ అని రాసి గ్రామంలో ఊరేగించారు. దళితుల మానవ హక్కుల పోరాటం గురించి అంబేడ్కర్ ఎంతో అధ్యయనం చేశారు. మొదట డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నుకో బడిన అంబేడ్కర్ ఆ పిదప 1947 ఆగస్ట్ 29వ తేదీన రాజ్యాంగ రచన సంఘ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. ఎన్. గోపాల స్వామి అయ్యంగార్, సర్ అల్లాడి కుప్పుస్వామి అయ్యర్, కె.ఎం. మున్షీ, మహ్మద్ సాదుల్లా, ఎన్. మాధవ రావు, డి.పి. ఖైతాన్ యితర సభ్యులు కాగా, బి.ఎన్.రావు రాజ్యాంగ సలహాదారులు. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నాయకులను విమర్శించే అంబేడ్కర్‌ను రాజ్యాంగ రచన సంఘా ధ్యక్షులుగా ఆహ్వానించారు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఔదార్యంగా చెప్పబడినా అంబేడ్కర్ అసాధారణ ప్రతిభ, ఒక చారిత్రక అవసరంగా మాత్రమే పరిగణించబడుతుంది. అంబేడ్కర్ తనపై మోపబడిన ఈ భారాన్ని సమర్థవంతంగా, నిజాయితీగా నిర్వర్తించడానికి కృషి చేశారు. అంబేడ్కర్ అమెరికాలో చదువుతున్న కాలంలో నీగ్రోల చరిత్రను అధ్యయనం చేశారు. నీగ్రోలు తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళే క్రమంలో అమెరికా రాజ్యాంగంలోని 14వ అధికరణం ద్వారా ఎలా స్వాతంత్య్రం పొందారో తెలుసుకున్నారు. నీగ్రోల విముక్తి పోరాటంలో ప్రధాన పాత్ర వహించిన బుకర్ టి.వాషింగ్టన్ చరిత్రను అధ్యయనం చేశారు. నీగ్రోల పోరాట చరిత్ర ద్వారా భారతదేశంలో దళితుల్ని ఎలా విముక్తి చేయాలో అర్థం చేసుకొన్నారు.అంబేడ్కర్ ఒక విస్తృతమైన మానవాభ్యుదయం కోసం కృషి చేశారు. ఆయనకు కుల మత బేధాలు లేవు. ఆయన బౌద్ధ జీవన పథికుడు. ఆయన ఆర్థిక, వ్యాపార, రాజకీయ, పరిపాలన, ధర్మ శాస్త్రాల నిపుణుడు. మనుస్మృతిని, యాజ్ఞవల్క్య స్మృతిని, శారదా స్మృతిని అధ్యయనం చేసిన భారతీయుడు. అవి అధర్మశాస్త్రాలని తేల్చిన పరిశోధకుడు. చార్వాకాన్ని, బౌద్ధాన్ని, జైనాన్ని, సాంఖ్యాన్ని అవపో సన పట్టారు. జాన్ డ్యూయీ శిష్యునిగా ప్రజాస్వామ్య శాస్త్రాన్ని ప్రపంచానికి బోధించారు. ఆయన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరి షత్ ఇప్పుడు కొనియాడటంలో మార్మికత ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని చేత బూనుతుంది కానీ అస్పృశ్యత నివారణకు, కుల నిర్మూలనకు, స్త్రీ విముక్తికి, సంపద అందరికీ పంచడానికి పాటు పడటం లేదు. ఈ కార్పొరేట్ భారతాన్ని మతవాదులు పెంచి పోషిస్తున్నారు. సామ్యవాద భారతం కావాలంటే అంబేడ్కర్ మార్గం ఒక్కటే దిక్సూచి. ఆయన మార్గంలో నడుద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
కల తీర్చిన కొలంబియా
అ.. అంబేడ్కర్ ఆ.. ఆడబిడ్డలు స్త్రీ అభివృద్ధే.. సమాజాభివృద్ధికి కొలమానం. స్త్రీ హక్కులు, స్వేచ్ఛ, సాధికారత, ఆత్మగౌరవంపై అంబేడ్కర్‌కు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక సమాజం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి స్త్రీ అభివృద్ధి అనేది కొలమానం అనేవారు. తన ఉపన్యాసాలలో స్త్రీ అణచివేత, కులవ్యవస్థ మధ్య ఉన్న లంకెను గురించి చర్చించేవారు. ‘ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ వుమెన్’ పేరుతో రాసిన వ్యాసంలో స్త్రీని చీకటి అగాధంలోకి నెట్టేసిన సామాజిక పరిస్థితులను చర్చించారు. ఆడబిడ్డ పుట్టుకను బౌద్ధసంప్రదాయం దుఃఖమయ ఘటనగా భావించదని చెబుతూ... బుద్ధుడు, ప్రసంజిత్ మహారాజు మధ్య జరిగిన ఒక సంఘటనను ఉదహరిస్తుండేవారు: తనకు ఆడపిల్ల జన్మించిందన్న కారణంతో ప్రసంజిత్ దుఃఖితుడవుతున్న సమయంలో- ‘‘ఆడబిడ్డ పుట్టిందని దుఃఖించాల్సిన అవసరం లేదు. ఆడబిడ్డ మగబిడ్డకు ఏమాత్రం తీసిపోదు’’ అంటాడు బుద్దుడు. మారుతున్న సమాజంతో పాటు మారాలనీ, మూఢాచారాలను వదిలివేయాలనీ చెప్పేవారు అంబేడ్కర్. స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు అంబేడ్కర్. ఆయన నేతృత్వంలో ఏర్పడిన ‘పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ ఎందరో బాలికలకు విద్యావకాశాలు కల్పించింది. అంబేడ్కర్ మనుస్మృతి ప్రతులను దగ్ధం చేయడాన్ని చాలామంది ‘కులం’ కోణం నుంచే చూస్తారుగానీ ఇందులో స్త్రీ దృక్కోణం కూడా ఉంది. మనుస్మృతి స్త్రీ కాళ్లకు, మేధస్సుకు బంధనాలు వేస్తుందనే నిరసన కూడ ఈ దగ్ధం వెనుక ఒక ప్రధాన కారణం. బాల్యవివాహాలకు దూరంగా ఉండాలని చెప్పిన అంబేడ్కర్, స్త్రీ దృష్టి కోణం నుంచి కుటుంబ నియంత్రణను గట్టిగా సమర్థించేవారు. దళిత స్త్రీల కట్టుబొట్టును నిర్ణయించి, నియంత్రించిన అగ్రకుల వ్యవస్థ కుట్రను కూడా తన ప్రసంగాలలో ఎండగట్టేవారు. దళిత మహాసభలు జరిగినప్పుడు, స్త్రీల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రసంగించేవారు. ‘‘పాత, మురికి బట్టలకు దూరంగా ఉండాలి’’ అని చెప్పేవారు. దీని ఉద్దేశం ఆడంబరంగా తయారవ్వాలని కాదు, కుల ఆధారిత వస్త్రధారణను నిరసించడం! ఆయన మాటల ప్రభావంతో ఎన్నో దళిత మహిళాసంఘాలు తమాషా(పాటలతో కూడిన నృత్యం)లకు దళిత స్త్రీలు దూరంగా ఉండాలని తీర్మానం చేశాయి. ప్రదర్శన సమయంలో దళిత స్త్రీలు నెత్తి మీద గ్యాస్ దీపాలు మోయకూడదని కూడా తీర్మానం చేశాయి. పాట కావచ్చు, పని కావచ్చు, వేసుకునే బట్టలు కావచ్చు...ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యను అనుమతించకూడదని దళిత స్త్రీలకు అంబేడ్కర్ చెప్పేవారు. కుటుంబ వ్యవస్థలో స్త్రీలకు కొన్ని హక్కులు కల్పిస్తూ తాను తయారుచేసిన ‘హిందూ కోడ్’ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయడానికి శతవిధాల ప్రయత్నించారు అంబేడ్కర్. ఛాందసుల వల్ల ఈ బిల్లు ఆమోదం పొందలేదు. దీనికి నిరసనగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి స్త్రీల హక్కులపై తన నిబద్ధతను చాటుకున్నారాయన. కల తీర్చిన కొలంబియా సామాజిక స్వేచ్ఛను సాధించనంత కాలం చట్టం కల్పించిన స్వాతంత్య్రం అందుబాటులోకి రాదు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక, రాజనీతి శాస్త్రాలలో 1912లో డిగ్రీని పొందిన భీమ్రావు... బరోడా సంస్థానంలో ఉద్యోగంలో చేరాడు. బరోడా సంస్థానాధీశుడు కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారికి ఉపకార వేతనాలు ప్రకటించడం అంబేడ్కర్ ఆశయానికి ఊతమిచ్చింది. 1913లో రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేరారు. జోన్ డెవే, సెలింగ్మన్, క్లార్క్ జేమ్స్, హార్వే రాబిన్సన్ వంటి ప్రొఫెసర్ల నేతృత్వంలో చదివారు. 20వ శతాబ్దంలో విద్యావేత్తగా పేరొందిన జాన్ డెవే దగ్గర చ దవడం తన అదృష్టంగా భావించారు. కొలంబియాలో ఉన్న మూడేళ్లకాలం ఎక్కువ సమయాన్ని గ్రంథాలయానికే కేటాయించారు. ఆర్థికశాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం, తత్త్వశాస్త్రం, పురాతత్త్వశాస్త్రాలే కాక ఫ్రెంచ్, జర్మన్ భాషలు కూడా నేర్చుకున్నారు. 1915 జూన్‌లో ఎమ్ఏ పరీక్ష పూర్తి చేశారు. ఆ సమయంలోనే ‘ఏన్షియంట్ ఇండియన్ కామర్స్’ మీద పరిశోధనా పత్రం సమర్పించారు. ఆయన ప్రతిభను గుర్తించిన తోటి విద్యార్థులు, ఆచార్యులు ఘనంగా సన్మానించారు. 1916లో ‘నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా’ అనే మరో పరిశోధనా పత్రాన్ని కూడా సమర్పించారు. ఈ పత్రమే భవిష్యత్తులో ఆయన పీహెచ్‌డీకి కేంద్రమైంది. ఒక పురాతత్త్వ శాస్త్రవేత్త నిర్వహించిన సదస్సులో అంబేడ్కర్ ‘కేస్ట్స్ ఇన్ ఇండియా, దెయిర్ మెకానిజం జెనిసిస్ అండ్ డెవలప్మెంట్’ అనే పత్రాన్ని చదివారు. కొలంబియాలో ఇంత విస్తృతంగా జ్ఞానసముపార్జన చేశారు. - శిష్ట్లా రామచంద్రరావు బజార్లో గౌరవంగా నడుస్తున్నామంటే... అంబేడ్కరే లేకపోతే ఈ దేశంలోని 30 కోట్ల మంది దళితులను పౌరసమాజం మనుషులుగా గుర్తించని పరిస్థితి ఉండేది. నాలాంటివాళ్లం ప్యాంటూ షర్టూ వేసుకుని గౌరవప్రదంగా బజార్లో నడుస్తున్నామంటే దానికి కారణం అంబేడ్కర్. దేశంలో సామాన్యుడూ ఓటు వేస్తున్నాడంటే దానికి కారణం కూడా అంబేడ్కరే. స్వాతంత్య్ర సమయంలో బ్రిటిష్ వాళ్లముందు ఒక వాదన ఉండేది, ఓటు హక్కును ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో. డిగ్రీ పాస్ అయినవారూ, సంస్థానాధీశులూ, కోటీశ్వరులూ మాత్రమే ఓటు వేయడానికి అర్హులన్న వాదనను తోసిపుచ్చి, అది పేదవాడైనా, భిక్షగాడైనా, కోటీశ్వరుడైనా 21 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కుకు అర్హులే అని అంబేడ్కర్ వాదించారు. ఒక వ్యక్తి- ఒక ఓటు- ఒకే విలువ అన్న నాటి ఆయన వాదన వల్లే ప్రజాస్వామ్యం బలోపేతం అయింది. డా॥ఎం.ఎఫ్.గోపీనాథ్, హృద్రోగ నిపుణులు సలామ్ అంబేడ్కర్ రాజ్యాంగం దుర్వినియోగానికి గురవుతోందని తేలితే, దానిని తగలబెట్టే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. భాగ్యనగరంతో బాబాసాహెబ్ అంబేడ్కర్‌కి ఎంతో అనుబంధం ఉంది. హైదరాబాద్ లో జరిగిన అనేక సభలకు, సమావేశాలకు హాజరయ్యేందుకు అంబేడ్కర్ వచ్చేవారు. అయితే 1952తో ఆ అనుబంధం మరింత బలపడింది. ఉస్మానియా యూనివర్సిటీ అంబేడ్కర్‌కి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించడమే దానికి కారణం. అంతర్జాతీయంగా న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీ 1952 వ సంవత్సరంలో అంబేడ్కర్‌కి డాక్టరేట్ ప్రదానం చేసింది. అయితే మన దేశంలో మాత్రం కేవలం హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే అంబేడ్కర్‌కి గౌరవ డాక్టరేట్ ఇచ్చిన ఘనత దక్కించుకుంది. 1952వ సంవత్సరంలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనే ఉస్మానియా యూనివర్సిటీకి చాన్స్‌లర్‌గా ఉన్నారు. చాన్స్‌లర్‌గా ఉన్న బూర్గుల రామకృష్ణారావు సంతకంతో 1952 జనవరి 12న అంబేడ్కర్‌కి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అలాగే చిట్టచివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ అంబేడ్కర్‌ని హైదరాబాద్ స్టేట్‌కి చీఫ్ జస్టిస్ గా ఉండాలని కోరడం కూడా విశేషమే. అప్పటికే అనేక పదవులను వదులుకున్న అంబేడ్కర్ సమానత్వ సాధనకోసం చేసిన అలుపెరగని పోరాటం అందరితో పాటు చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేత సైతం సలామ్ అంబేడ్కర్ అనిపించింది. అంబేడ్కర్ హైదరాబాద్‌కి ఎప్పుడొచ్చినా తన చిరకాల మిత్రుడు సుబ్బారావు ఇంట్లోనే ఉండేవారు. సికింద్రాబాద్‌లోని ఇప్పుడున్న పారడైస్ కి దగ్గరలో ఫ్రెండర్ ఘాస్ట్ రోడ్లో సుబ్బారావు నివాసం ఉండేవారు. ద త్రీ ఇన్సల్ట్స్ మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు. అంబేడ్కర్ జీవితంలో జరిగిన మూడు అవమానాలు అతన్ని అసమానత్వపుటల్లోంచి సమానత్వ కాంక్షవైపు పరుగులు పెట్టించాయని చరిత్ర చెబుతోంది. భీంరావ్ అంబేడ్కర్ ఒక రోజు తన సోదరుడితో కలిసి చాలా దూరంలో ఉన్న ఒక గ్రామానికి ప్రయాణించాల్సి వచ్చింది. మధ్యలో అంబేడ్కర్‌కి విపరీతమైన దాహం వేసింది. ఇంతలోనే అల్లంత దూరంలో వారికొక ఇల్లు కనిపించడంతో ఎక్కడలేని ఆనందం వేసింది. అక్కడికి వెళ్ళి ఆ ఇంటి యజమానిని గొంతు తడారిపోతోంది నీరిమ్మని అడిగాడు అంబేడ్కర్. మంచినీళ్ళివ్వబోతూ నీదే కులమని అడిగాడు యజమాని. అంబేడ్కర్ కులం చెప్పగానే, మహర్ కులస్తుడని తెలిసి అతను కోపంగా దూరంగా ఉన్న మురికి గుంటను చూపించి అందులో నీళ్ళు తాగమన్నాడు. అప్పటివరకు నీటికి రంగుండదన్న జ్ఞానం నేర్చుకున్న అంబేడ్కర్ నీటికులం రంగుని స్పష్టంగా చూడగలిగాడు. ఒకరోజు అంబేడ్కర్ మండువేసవిలో అతని అన్న, మేనల్లుడితో కలిసి గోరెగాంవ్లో ఉన్న తన తండ్రి దగ్గరకు బయలు దేరాడు. వీరు వస్తున్న సమాచారం అంబేడ్కర్ తండ్రి రాంజీకి అందకపోవడం వల్ల ఆయన స్టేషన్‌కు రాలేక పోయారు. చాలా సేపు ఎదురుచూసిన ఆ ముగ్గురూ అతికష్టంమీద స్టేషన్ మాస్టర్ సహకారంతో ఒక ఎడ్లబండిని మాట్లాడుకున్నారు. బండి కొద్ది దూరం వె ళ్ళిందో లేదో బండినడిపే వ్యక్తికి వీళ్ళు అంటరానివారన్న సంగతి అర్థం అయ్యింది. వెంటనే అతను బండి ఆపి దిగిపొమ్మని శాసించాడు. వారి సామానును గిరాటేశాడు. బండి, ఎడ్లు మైలపడ్డాయని కోపంతో ఊగిపోయాడు. అయితే అప్పటికే ఈ పిల్లలు ముగ్గురూ అలసిపోయి వున్నారు. బండివాడి తిట్లు భరిస్తూనైనా బండిలో వెళ్ళడం తప్ప మరోమార్గం కనిపించలేదు. గతంలో మాట్లాడుకున్న దానికంటే రెట్టింపు డబ్బులిస్తానని ఆశపెట్టాడు భీంరావు అన్న. బండివాడు శాంతించాడు. రూపాయి ముందు కులం మోకరిల్లింది. అయితేనేం అహం ఎదురొచ్చింది. నేను బండైతే ఇస్తాను కానీ మీ కులంతో మైలపడ్డ బండిని నేను నడపనన్నాడు. భీంరావ్ అన్న బండి నడుపుతుంటే బండివాడు అంత ఎండలోనూ వెనకాలే నడుచుకుంటూ వచ్చాడు తప్ప బండి ఎక్కలేదు. ప్రాణాలుపోయినా పర్లేదు కానీ మైలపడకూడదనుకున్న బండివాడి ప్రవర్తన అంబేడ్కర్‌ని తీవ్రంగా కదిలించింది. అంబేడ్కర్ తెలివితేటలకు ముగ్ధుడైన బరోడా మహారాజు ఉన్నత చదువుల అనంతరం తన వద్ద పనిచేయాలన్న షరతుతో అంబేడ్కర్ విదేశీ విద్యకు ఆర్థిక సాయం చేశాడు. అతనికిచ్చిన మాట మేరకు అంబేడ్కర్ 1917లో బరోడా చేరాడు. అయితే, అంబేడ్కర్‌కు స్వాగతం పలకాల్సిందిగా బరోడా మహారాజు ఉత్తర్వులిచ్చారు. కానీ ఓ దళితుడిని ఆహ్వానించమన్న ఉత్తర్వుని అమలుపరిచేవారెవ్వరు? స్వాగతం అటుంచి బరోడాలో అడుగుపెట్టాక తలదాచుకునేందుకు చిన్నగది సైతం అంబేడ్కర్‌కు దొరకలేదు. చివరకు ఒక పార్శీ సత్రంలో తలదాచుకున్నాడు. అంబేడ్కర్ రాజుగారి మిలిటరీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కానీ సంస్థానోద్యోగులు అందుకు వ్యతిరేకులు. అంబేడ్కర్ ఆఫీసుకి వస్తున్నప్పుడూ, వెళ్తున్నప్పుడూ తివాచీలు ఎత్తేసేవారు మైలపడతాయని! అందుకే అంబేడ్కర్‌కి ఎప్పుడూ గ్రంథాలయంలోనే సాంత్వన దొరికేది. పుస్తకాలు చీదరించుకోవు. వాటిని తాకినా ఏమీ అనవు. అందుకే అవే ఆయనకు శాశ్వత నేస్తాలయ్యాయి. అవమానం జరిగిన చోటనే ఆకాశాన్ని తలదన్నే ఆత్మగౌరవ పతాకగా ఆయన్ను అవి నిలిపాయి. లేబర్ పవర్ సమస్త సామాజిక పురోగతికి రాజ్యాధికారమే కీలకం. అంబేడ్కర్ దళితుల రాజ్యాధికారం కోసం 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ప్రకటించాడు. ‘లేబర్’ అనే పదానికి ‘అణగదొక్కబడిన’ అనే అర్థాన్నిచ్చారు. 1932లో బ్రిటీష్ గవర్నమెంట్ అస్పృశ్యులకు ప్రత్యేక నియోజకవర్గాల్ని ప్రకటించినప్పుడు గాంధీ ఆమరణ నిరాహార దీక్ష చేసి వాటిని అడ్డుకున్నాడు. అందుకు మెజారిటీ ప్రజల్ని దళిత నాయకత్వంలో సమీకృతం చేయడానికి రాజకీయ పార్టీ నిర్మాణమే అసలైన పరిష్కారం అనుకున్నాడు అంబేడ్కర్. ఈ పార్టీ బొంబాయిలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన పదిహేను సీట్లలో పదమూడింటిని కైవసం చేసుకుంది. జనరల్ సీట్లను రెండింటిని కూడా గెలుచుకుంది. 1937లో బొంబాయి ప్రెసిడెన్సీలో కాంగ్రెస్‌కు పటిష్ఠమైన ప్రతిపక్షంగా వ్యవహరించింది. ఇండియన్ లేబర్ పార్టీని విస్తృతపరచాలనే ఉద్దేశంతో 1942లో ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ స్థాపించాడు. తన ‘రెనడే, గాంధీ అండ్ జిన్నా’ గ్రంథంలో ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ ప్రతిపక్షం యొక్క ప్రాధాన్యతను నొక్కి వక్కాణించాడు. 1952 ఎలక్షన్లకు సన్నద్ధమౌతూ కేవలం షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ మాత్రమే విజయవంతం కావడం కష్టమని భావించి ఇతర వామపక్ష పార్టీల పొత్తు కోసం పిలిచారు. అస్పృశ్యత నివారించే క్రమంలో సామాజిక అసమానతలను రూపుమాపే ముఖ్య సూత్రంపైన ఆయన పార్టీల పొత్తు కోరారు. అంబేడ్కర్ రాజకీయ ఉద్యమాలు ప్రత్యామ్నాయమైనవి. సామాజిక, ఆర్థిక, సమత సాధించేవి. అవి ఈనాటి చారిత్రక అవసరం. అంబేడ్కర్ రిజర్వేషన్ దశ నుంచి నిర్మాణ దశకు తన రాజకీయ ఉద్యమాన్ని తీసుకువెళ్ళాడు. ఆ ఉద్యమ స్ఫూర్తి ఈనాటి చారిత్రక అవసరం. - డాక్టర్ కత్తి పద్మారావు,దళిత బహుజన ఉద్యమ నేత సమ సమాజ నిర్మాత ప్రభుత్వాన్ని ధిక్కరించే రాజకీయ నాయకుడి కంటే సమాజాన్ని ధిక్కరించే సంస్కర్తే ఎక్కువ ధైర్యశాలి.విశిష్టమైన భారత రాజ్యాంగ రచనలో ప్రధాన భూమికలు పోషించి, నూతన సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన ప్రతిభాశాలి అంబేడ్కర్. ఆగస్టు 29, 1947న బి.ఆర్. నాయకత్వంలో మరో ఆరుగురు ఉద్దండులతో ముసాయిదా కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ తొలి ముసాయిదాను ఫిబ్రవరి 1948 కల్లా రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించింది. ముసాయిదా కమిటీ సమావేశమైనది 141 రోజులే. రాజ్యాంగానికి తుది రూపాన్ని రాజ్యాంగ పరిషత్‌లో నవంబరు 4, 1948న సమర్పించారు. భారత ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకై ఉద్దేశించబడిన 32వ ఆర్టికల్‌ను భారత రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ అనీ, ఇదే భారత రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ అనీ అభివర్ణించారంటే అంబేడ్కర్ వ్యక్తిస్వేచ్ఛకు, సాంఘిక సమానత్వానికి ఎంత ప్రాధాన్యతను ఇచ్చారో తెలుస్తుంది. ఒక దేశ రాజ్యాంగ రచన సామాన్యమైన విషయం కాదు. భారతదేశం లాంటి ప్రత్యేకతలు కలిగిన దేశంలో భిన్నత్వాలను గౌరవిస్తూ, ఏకత్వాన్ని సాధిస్తూ, ప్రజాస్వామ్య మార్గంలో ఒక నిశ్శబ్ద సామాజిక, ఆర్థిక విప్లవానికి బాటలు వేస్తూ, జాతి ఐక్యతకు, సమగ్రతకు కావలసిన ఒక సజీవ, సమగ్ర, సార్వకాలీన, సాంఘిక, ఆర్థిక, రాజకీయ నిర్మాణాలను సృష్టించే రాజ్యాంగాన్ని రచించటం మేధావులకు సైతం సవాలు. అటువంటి గురుతర బాధ్యతను అంబేద్కర్ తన అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధతతో నిర్మించారు.- కె.వి.విజయబాబు రాజనీతి శాస్త్ర శాఖాధిపతి, ఆంధ్రా లయోలా కళాశాల కోట్.. అన్కోట్ నీ కోసం జీవిస్తే నీలోనే మిగిలిపోతావు... జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. అంబేడ్కర్ కోటు ధారణ వెనకాల బలమైన ఫిలాసఫీ ఉంది. అడ్డగోచీ దాటకూడదనే అడ్డగోలు వ్యవస్థని ఛిద్రం చెయ్యడానికి అంబేడ్కర్ కోటు, బూటు, సూటు వేసుకున్నారు. సామాజిక చైతన్యం కోసం భార త రాజకీయ రంగం పైన ఒక ధృవతారగా వె లిసిన అంబేడ్కర్ అణగారిన ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా వెలిగాడు. అణచి వేయబడిన వర్గాలకు సామాజిక గౌరవం సాధించటం ఆయన లక్ష్యం. అందుకే ఉన్ని ప్యాంటు, చొక్కా, పైన కోటు, మెడలో టై, చేతిలో భారత రాజ్యాంగం, చూపుడు వేలుతో దిశానిర్దేశం చేస్తున్న భంగిమలో ఈ దేశంలోని అణగారిన ప్రజల ఆశల ప్రతిరూపంగా నిలిచాడు. అంబేడ్కర్ ఆధునిక సంఘసంస్కర్తల్లో ప్రథముడు. అంటరానివారుగా సామాజికంగా హీనస్థితిలోకి నెట్టివేయబడిన కులంలో జన్మించాడు. సామాజిక సమానత్వం తిరస్కరించబడిన వర్గాలకు దారిదీపంగా నిలిచాడు. ఊరుమ్మడి బావిలో నీళ్లు తాగటానికి వీల్లేని బాహ్యులకు ఆసరా అయ్యాడు. విషపూరిత కులవృక్షాన్ని సమూలంగా పెళ్లగించటానికి పాశ్చాత్య సంస్కరణా సిద్ధాంతాలైన స్వేచ్ఛ, సమానత్వం, సమైక్యతల్ని ఆచరణకు తెచ్చాడు. అందుకే పాశ్చాత్య వస్త్రధారణను ఆత్మాభిమానానికి సంకేతంగా ఆయన భావించాడు. కోట్లాది తన ప్రజల దృష్టిలో తాను సనాతన ఛాందసవాదిగా కాక, ఆధునికవాదిగా కనిపించటం ఒక అవసరం. వస్త్రధారణ ప్రభావం మన ఆలోచనల పైన తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. సముద్రుడు ఏనుగు చర్మం ధరించిన ఆటవిక వేషధారి శివుడికి హాలాహలాన్నీ, పట్టుబట్టలు కట్టుకునే విష్ణువుకు తన కూతురు లక్ష్మినీ ఇచ్చాడు. ఈ దేశంలో సగటు మనిషి ఆలోచనా ధోరణి ఇలానే ఉంటుంది. సనాతన భావజాలం లోంచి బయటపడాలంటే మొదటగా వస్త్రధారణ విధానం మారాలని అంబేడ్కర్ విశ్వసించాడు. కోటు, ప్యాంటు ధరించి తాను సనాతన ఛాందసవాదంలోంచి పుట్టిన కుల వ్యవస్థకు, ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకం అని చాటిచెప్పదలిచాడు. అంబేడ్కర్ వస్త్రధారణ ఆయన లక్ష్యానికి ఒక ప్రతీక. - డా॥జి.వి. పూర్ణచంద్ ఏ ఇంట్లో పుట్టావూ అంటే... భారతదేశంలో పుట్టాను అనగలగాలి కులం అనేది ఒక మానసిక స్థితి. అదొక మానసిక వ్యాధి. ‘‘పుట్టుక అనేది మనిషి అవకాశాలను, గౌరవాన్ని, అస్తిత్వాన్ని అడ్డుకోకూడదు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం ప్రతి భారతీయుడి ప్రథమ హక్కు కావాలి’’ అని అంబేడ్కర్ ఆకాంక్షించారు. భారతదేశంలో కుల సమాజాన్ని ముక్కలుగా విభజించడం వల్ల మనదేశం అనైక్యతకు ఆలవాలమైందనేది అంబేడ్కర్ భావన. అందుకే కుల వ్యవస్థకు పరిష్కారంగా ఆయన స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం లక్ష్యాలను ప్రతిపాదించారు. స్వేచ్ఛ, సమానత్వం లాంటి విషయాలపట్ల అంతర్జాతీయంగా ఒకే రకమైన స్వభావం ఉంటుంది. అన్ని దేశాల్లో వీటి మీద చర్చ ఉంటుంది. అయితే భారతదేశంలో ఈ రెండింటితో పాటు సోదరత్వమనేది ప్రత్యేకమైన విషయం. ఒక మనిషిని ఇంకొక మనిషి తనకు సోదర సమానులే అన్న భావనను కలిగి ఉండడమే సోదరత్వం. కుల విభజన వల్ల అది మనలో లేకుండా పోయింది. అంతే కాకుండా, అంబేడ్కర్ మాటల్లో చెప్పాలంటే, సోదరత్వానికి మరోపేరు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యమంటే కేవలం పరిపాలనకు సంబంధించిన విధానం మాత్రమే కాదు. రాజకీయ అంశం మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం ప్రజల జీవితంలో భాగంగా ఉండాలి. అందరూ సమానులే అనే భావనను కలిగి ఉండాలి. ఒక రకంగా ఇది మానసికమైనది. భౌతికంగా దీనిని నిర్మూలించలేం. ఇందుకే అంబేడ్కర్ సోదరత్వాన్ని సాధించడానికి కుల నిర్మూలనను ప్రతిపాదించారు. ‘‘కులం అనేది మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ. ఈ మత విశ్వాసాలకు శాస్త్రాల, పురాణాల మద్దతు ఉంది. హిందూ సమాజం కులానికి దైవిక ప్రాతిపదికను ఆపాదిస్తారు. అందువల్ల కులాన్ని నిర్మూలించాలంటే దానికి ఆధారమైన శాస్త్రాల, వేదాల పురాణాల అధికారాన్ని నిర్మూలించాల్సి ఉంటుంది.’ అని తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రకటించారు. అంతేకాకుండా, భారతదేశ ప్రజలందరూ స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వ భావాలతో కలసిమెలసి జీవించడానికి కావాల్సిన పరిపాలనా విధానాలను, ఆదేశాలను ఆయన తాను నాయకత్వం వహించి రచించిన రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రజాస్వామ్య స్వప్నాన్ని సాకారం చేసిన మహనీయుడు, సమానత్వ కాంక్షను ఆచరణీకరించిన కార్యశీలుడు, భవిష్యత్ సమసమాజ మార్గ నిర్దేశకుడు బాబాసాహెబ్ అంబేడ్కర్. - మల్లెపల్లి లక్ష్మయ్య ఇన్పుట్స్: అత్తలూరి అరుణ, జగన్నాథ దాసు, యాకూబ్ పాషా, నిర్మలారెడ్డి, పురాణపండ వైజయంతి, నిఖిత నెల్లుట్ల -
'అందుకే కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేశా'
హైదరాబాద్ : సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆపార్టీ ఎంపీ, సినీనటుడు చిరంజీవి అన్నారు. భారత రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి (మహాపరినిర్వాణ్)ని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి శనివారం చిరంజీవి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం చూసే...తాను ప్రజారాజ్యాన్ని విలీనం చేశానన్నారు. -
రైతుల కళ్లల్లో ఆనందమే ధ్యేయం
తిప్పర్తి, న్యూస్‌లైన్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయించి రైతుల కళ్లల్లో ఆనందం చూడడమే తన ధ్యేయమని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టులను 5 సంవత్సరాల్లో పూర్తి చేసి జిల్లా రైతులకు రెండు పంటలకు సాగునీరందిం చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఆది వారం తిప్పర్తి మండల కేంద్రంలో విజ యోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇప్పటికే ఏఎంఆర్పీ కాల్వల ద్వారా ఒక కారుకు మాత్రమే నీరుందుతుందని తెలిపారు. నియోజకవర్గంలో గ్రామానికో సబ్‌స్టేషన్ నిర్మిం చేందుకు తనవంతు బాధ్యతగా కృషి చేస్తానన్నారు. అలాగే గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి, మండల కేంద్రంలో ఎస్సీల కోసం ప్రత్యేకంగా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా భూ సేకరణ చేసి మోడల్ కాలనీ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. దీనితో పాటు రాజ్యాం గ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్‌రావు విగ్రహాల ఏర్పాటుతో పాటు తిప్పర్తి సెంటర్లో పార్కును ఏర్పాటు చేస్తానన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల ఆస్పత్రిగా మార్చి ఎళ్లవేళలా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా చూస్తానన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఐటీఐ, జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయిస్తానన్నారు. తిప్పర్తి మండల ప్రజల రుణం తీర్చుకోలేనిది మరోమారు తనను ఎమ్మెల్యేగా గెలిపిం చేందుకు తిప్పర్తి మండల ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని కోమటిరెడ్డి అన్నారు. ఈ మండల ప్రజ లను తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని తెలిపారు. వారంలో నాలు గు రోజులు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. రోజు కో మండలంలోని ప్రజా సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చడమే ధ్యేయంగా అభివృద్ధిపై దృష్టి సారిస్తానన్నారు. మం డలంలోని ఇండ్లూరు, సర్వారం గ్రామా ల్లో త్వరలో సబ్‌స్టేషన్ నిర్మాణాలను శంకుస్థాపన చేస్తానన్నారు. జిల్లా కేం ద్రంలో మెడికల్ కాలేజీ శంకుస్థాపన కేసీఆర్‌తో చేయిస్తానని, అలాగే పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పూర్తి చేయించేందుకు నిధులను త్వరలోనే మంజూరు చేయిస్తానన్నారు. అం తకు ముందు తిప్పర్తి కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డిని ఘనంగా సన్మానిం చారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, డీసీసీబీ డెరైక్టర్ పాశం సంపత్‌రెడ్డి, చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, పాశం రాంరెడ్డి, రావుల మల్లమ్మ -కొమురయ్య, జాకటి మోష, కిన్నెర అంజి, జూకురి రమేష్, లొడంగి వెంకటేశ్వర్లు, గుండా సత్యనారాయణ, పెరిక వెంకటేశ్వర్లు, ఆదిమూలం ప్రశాంత్, నాగేందర్, గుండు శ్రీను, కుంచం వెంక న్న, సల్వాది సైదులు, వనపర్తి రాము, ఎస్.సైదులు, చక్రవర్తి, కొండ్ర సైదులు, ఏనుగు నర్సిరెడ్డి, మురళి, నగేష్, శ్రీనివాస్, వెంకన్న, శ్రీనివాస్‌రెడ్డి, సైదు లు, ఎస్.కె.మహ్మద్ పాల్గొన్నారు. -
అంబేద్కర్ గొప్ప దార్శనికుడు
రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకల్లో సీజే జస్టిస్ సేన్‌గుప్తా హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాణంలో బీఆర్ అంబేద్కర్ పాత్రను జాతి ఎన్నటికీ మరువదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా అన్నారు. అధ్యయనం, చర్చల తర్వాతే రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప దార్శనికుడని కొనియాడారు. రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం సంయుక్తంగా సోమవారం హైకోర్టు ప్రాంగణంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని నిర్వహించాయి. ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ జస్టిస్ సేన్‌గుప్తా మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మీద మరో వ్యవస్థ పెత్తనం చేయకుండా ఉండేలా రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. ఘనత ప్రధానంగా అంబేద్కర్‌కే దక్కుతుందన్నారు. కొన్ని అంశాల్లో రాష్ట్రాలపై కేంద్రానికి అజమాయిషీ ఉన్నప్పటికీ, న్యాయవ్యవస్థకు మాత్రం రాజ్యాంగం పూర్తిస్థాయి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించిందని వివరించారు. న్యాయమూర్తులు, విద్యావంతులు తప్ప మిగిలినవారు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్ట నిబంధనల గురించి ఆలోచించట్లేదన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎ.వి.శేషసాయి, దామా శేషాద్రినాయుడు, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు, అదనపు ఏజీ కె.జి.కృష్ణమూర్తి, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వేణుమాధవ్, కార్యదర్శులు పాశం కృష్ణారెడ్డి, డి.ఎల్.పాండు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బార్ కౌన్సిల్, న్యాయవాదుల సంఘం ప్రతినిధులను సీజే ప్రత్యేకంగా అభినందించారు. -
అంబవేద్కర్ అంబేద్కర్ అయ్యాడు
సాక్షి, హైదరాబాద్: ‘‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అంత గొప్పవాడు అయ్యేందుకు ఆయన గురువు చేసిన చిన్న మార్పే కారణం. అంబవేద్కర్గా ఉన్న ఆయన ఇంటి పేరును అంబేద్కర్గా మార్చారు. ఎందుకంటే అంబవేద్కర్ అనే ఇంటి పేరు ఆయన కులాన్ని వెంటనే గుర్తించేలా చేస్తుంది. ఆ ఇంటి పేరే ఉంటే ఆయన పట్ల వివక్ష చూపి ఆయనను అడ్డుకునే ప్రమాదాన్ని అంబేద్కర్ గురువు ముందుగానే పసిగట్టారు. అప్పట్నుంచీ ఇప్పటిదాకా నిమ్నజాతులపై వివక్ష కొనసాగుతూనే ఉంది’’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ అన్నారు. అభివృద్ధి చెందే అవకాశం సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఉండాలని, అయితే స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు గడుస్తున్నా అసమానతలు, అవినీతి కారణంగా అన్ని వర్గాలు అభివృద్ధి చెందడం లేదని, ఇందుకు కులం, పేదరికం అడ్డంకిగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ వంగాల ఈశ్వరయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ... అల్పులమనే భావన నుంచి బడుగు, బలహీన వర్గాల ప్రజలు విముక్తులు కావాలని పిలుపునిచ్చారు. పల్లకీలు, జెండాలు మోసే కార్యకర్తల మనస్తత్వం నుంచి బయటపడి దేశాన్ని పాలించాలనే భావనకు వచ్చినప్పుడే బీసీల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ దిశగా కృషి జరగాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... బీసీలంతా ఐకమత్యంతో కృషి చేసి రాజ్యాధికారాన్ని సాధించుకోవాలన్నారు. పేదరికం కారణంగా బడుగు, బలహీన వర్గాల పట్ల సాంఘిక అసమానతలు కొనసాగుతున్నాయని వాటిని అధిగమించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య.. మాట్లాడుతూ బీసీల్లో ఎన్నో కులాలున్న కారణంగా ఐకమత్యం లోపించిందని, ఈ అనైక్యతను అగ్రవర్ణాలు వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల అభివృద్ధి కోసం జాతీయ, రాష్ట్రస్థాయిల్లో నియమించిన కమిషన్ల సిఫారసులను అమలు చేయలేదని బీజేపీ జాతీయ నాయకుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. బీసీ నాయకుడు పాలూరు రామకృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి గంగాధర్, జస్టిస్ సి.వి.రాములు, అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు రామ్మూర్తి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుందర్‌కుమార్, వివిధ బీసీ సంఘాల నేతలు శ్యాంసుందర్‌గౌడ్, దేవర కరుణాకర్, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, అరుణ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఒత్తిళ్లకూ లొంగకుండా పనిచేస్తా: జస్టిస్ ఈశ్వరయ్య జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య మాట్లాడుతూ... బీసీల సమస్యలను పరిష్కరించేందుకు తన శాయశక్తులా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేస్తానని చెప్పారు. బీసీ కమిషన్లకు చట్టబద్ధత కల్పించినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని, బీసీల సంక్షేమానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కుల వ్యవస్థపై ఆధారపడిన దేశ రాజకీయాల్లో బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించుకోవాలని అన్నారు. 2011 జనాభా లెక్కల్లో భాగంగా సేకరించిన కులాల వారీ జనాభా వివరాలను వెల్లడించాలంటూ జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్మించాలని సూచించారు. సమావేశంలో భాగంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన కాపులను బీసీల్లో చేర్చేందుకు అంగీకరించవద్దని జస్టిస్ ఈశ్వరయ్యను కోరారు.