కల తీర్చిన కొలంబియా | Jai Bhim! Remembering BR Ambedkar on his 125th birth anniversary | Sakshi
Sakshi News home page

కల తీర్చిన కొలంబియా

Published Thu, Apr 14 2016 12:53 PM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

కల తీర్చిన కొలంబియా

కల తీర్చిన కొలంబియా

అ.. అంబేడ్కర్  ఆ.. ఆడబిడ్డలు
 
స్త్రీ అభివృద్ధే.. సమాజాభివృద్ధికి కొలమానం.

స్త్రీ హక్కులు, స్వేచ్ఛ, సాధికారత, ఆత్మగౌరవంపై అంబేడ్కర్‌కు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక సమాజం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి  స్త్రీ అభివృద్ధి అనేది కొలమానం అనేవారు. తన ఉపన్యాసాలలో స్త్రీ అణచివేత, కులవ్యవస్థ మధ్య ఉన్న లంకెను  గురించి చర్చించేవారు.
 
‘ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ వుమెన్’ పేరుతో రాసిన వ్యాసంలో స్త్రీని చీకటి అగాధంలోకి నెట్టేసిన సామాజిక పరిస్థితులను చర్చించారు. ఆడబిడ్డ పుట్టుకను బౌద్ధసంప్రదాయం దుఃఖమయ ఘటనగా భావించదని చెబుతూ... బుద్ధుడు, ప్రసంజిత్ మహారాజు మధ్య జరిగిన ఒక సంఘటనను ఉదహరిస్తుండేవారు: తనకు ఆడపిల్ల జన్మించిందన్న కారణంతో ప్రసంజిత్ దుఃఖితుడవుతున్న సమయంలో- ‘‘ఆడబిడ్డ పుట్టిందని దుఃఖించాల్సిన అవసరం లేదు. ఆడబిడ్డ మగబిడ్డకు ఏమాత్రం తీసిపోదు’’ అంటాడు బుద్దుడు.
 
మారుతున్న  సమాజంతో పాటు మారాలనీ, మూఢాచారాలను వదిలివేయాలనీ చెప్పేవారు అంబేడ్కర్. స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు అంబేడ్కర్. ఆయన నేతృత్వంలో ఏర్పడిన ‘పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ ఎందరో బాలికలకు విద్యావకాశాలు కల్పించింది. అంబేడ్కర్ మనుస్మృతి ప్రతులను దగ్ధం చేయడాన్ని చాలామంది ‘కులం’ కోణం నుంచే చూస్తారుగానీ ఇందులో స్త్రీ దృక్కోణం కూడా ఉంది. మనుస్మృతి స్త్రీ కాళ్లకు, మేధస్సుకు బంధనాలు వేస్తుందనే నిరసన కూడ ఈ దగ్ధం వెనుక ఒక ప్రధాన కారణం. బాల్యవివాహాలకు దూరంగా ఉండాలని చెప్పిన అంబేడ్కర్,  స్త్రీ దృష్టి కోణం నుంచి కుటుంబ నియంత్రణను గట్టిగా సమర్థించేవారు.
 
దళిత స్త్రీల కట్టుబొట్టును నిర్ణయించి, నియంత్రించిన అగ్రకుల వ్యవస్థ కుట్రను కూడా తన ప్రసంగాలలో ఎండగట్టేవారు. దళిత మహాసభలు జరిగినప్పుడు, స్త్రీల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రసంగించేవారు. ‘‘పాత, మురికి బట్టలకు దూరంగా ఉండాలి’’ అని చెప్పేవారు. దీని ఉద్దేశం ఆడంబరంగా తయారవ్వాలని కాదు, కుల ఆధారిత వస్త్రధారణను నిరసించడం! ఆయన మాటల ప్రభావంతో ఎన్నో దళిత మహిళాసంఘాలు తమాషా(పాటలతో కూడిన  నృత్యం)లకు దళిత స్త్రీలు దూరంగా ఉండాలని తీర్మానం చేశాయి. ప్రదర్శన సమయంలో దళిత స్త్రీలు నెత్తి మీద గ్యాస్ దీపాలు మోయకూడదని కూడా తీర్మానం చేశాయి.

పాట కావచ్చు, పని కావచ్చు, వేసుకునే బట్టలు కావచ్చు...ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యను అనుమతించకూడదని దళిత స్త్రీలకు అంబేడ్కర్ చెప్పేవారు. కుటుంబ వ్యవస్థలో స్త్రీలకు కొన్ని హక్కులు కల్పిస్తూ తాను తయారుచేసిన ‘హిందూ కోడ్’ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేయడానికి శతవిధాల ప్రయత్నించారు అంబేడ్కర్. ఛాందసుల వల్ల ఈ బిల్లు ఆమోదం పొందలేదు. దీనికి నిరసనగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి స్త్రీల హక్కులపై తన నిబద్ధతను చాటుకున్నారాయన.

కల తీర్చిన కొలంబియా

సామాజిక స్వేచ్ఛను సాధించనంత కాలం చట్టం కల్పించిన స్వాతంత్య్రం అందుబాటులోకి రాదు.

బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక, రాజనీతి శాస్త్రాలలో 1912లో డిగ్రీని పొందిన భీమ్‌రావు... బరోడా సంస్థానంలో ఉద్యోగంలో చేరాడు. బరోడా సంస్థానాధీశుడు కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారికి ఉపకార వేతనాలు ప్రకటించడం అంబేడ్కర్ ఆశయానికి ఊతమిచ్చింది. 1913లో రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేరారు. జోన్ డెవే, సెలింగ్మన్, క్లార్క్ జేమ్స్, హార్వే రాబిన్సన్ వంటి ప్రొఫెసర్ల నేతృత్వంలో చదివారు. 20వ శతాబ్దంలో విద్యావేత్తగా పేరొందిన జాన్ డెవే దగ్గర చ దవడం తన అదృష్టంగా భావించారు.
 
కొలంబియాలో ఉన్న మూడేళ్లకాలం ఎక్కువ సమయాన్ని గ్రంథాలయానికే కేటాయించారు. ఆర్థికశాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం, తత్త్వశాస్త్రం, పురాతత్త్వశాస్త్రాలే కాక ఫ్రెంచ్, జర్మన్ భాషలు కూడా నేర్చుకున్నారు. 1915 జూన్‌లో ఎమ్‌ఏ పరీక్ష పూర్తి చేశారు. ఆ సమయంలోనే ‘ఏన్షియంట్ ఇండియన్ కామర్స్’ మీద పరిశోధనా పత్రం సమర్పించారు. ఆయన ప్రతిభను గుర్తించిన తోటి విద్యార్థులు, ఆచార్యులు ఘనంగా సన్మానించారు. 1916లో ‘నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా’ అనే మరో పరిశోధనా పత్రాన్ని కూడా సమర్పించారు. ఈ పత్రమే భవిష్యత్తులో ఆయన పీహెచ్‌డీకి కేంద్రమైంది. ఒక పురాతత్త్వ శాస్త్రవేత్త నిర్వహించిన సదస్సులో అంబేడ్కర్ ‘కేస్ట్స్ ఇన్ ఇండియా, దెయిర్ మెకానిజం జెనిసిస్ అండ్ డెవలప్‌మెంట్’ అనే పత్రాన్ని చదివారు.  కొలంబియాలో ఇంత విస్తృతంగా జ్ఞానసముపార్జన చేశారు.   - శిష్ట్లా రామచంద్రరావు
 
బజార్లో గౌరవంగా నడుస్తున్నామంటే...
అంబేడ్కరే లేకపోతే ఈ దేశంలోని 30 కోట్ల మంది దళితులను పౌరసమాజం మనుషులుగా గుర్తించని పరిస్థితి ఉండేది. నాలాంటివాళ్లం ప్యాంటూ షర్టూ వేసుకుని గౌరవప్రదంగా బజార్లో నడుస్తున్నామంటే దానికి కారణం అంబేడ్కర్. దేశంలో సామాన్యుడూ ఓటు వేస్తున్నాడంటే దానికి కారణం కూడా అంబేడ్కరే. స్వాతంత్య్ర సమయంలో బ్రిటిష్ వాళ్లముందు ఒక వాదన ఉండేది, ఓటు హక్కును ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో. డిగ్రీ పాస్ అయినవారూ, సంస్థానాధీశులూ, కోటీశ్వరులూ మాత్రమే ఓటు వేయడానికి అర్హులన్న వాదనను తోసిపుచ్చి, అది పేదవాడైనా, భిక్షగాడైనా, కోటీశ్వరుడైనా 21 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కుకు అర్హులే అని అంబేడ్కర్ వాదించారు. ఒక వ్యక్తి- ఒక ఓటు- ఒకే విలువ అన్న నాటి ఆయన వాదన వల్లే ప్రజాస్వామ్యం బలోపేతం అయింది.  డా॥ఎం.ఎఫ్.గోపీనాథ్, హృద్రోగ నిపుణులు
 
 
సలామ్ అంబేడ్కర్

రాజ్యాంగం దుర్వినియోగానికి గురవుతోందని తేలితే, దానిని తగలబెట్టే మొదటి వ్యక్తిని నేనే అవుతాను.
భాగ్యనగరంతో బాబాసాహెబ్ అంబేడ్కర్‌కి ఎంతో అనుబంధం ఉంది. హైదరాబాద్ లో జరిగిన అనేక సభలకు, సమావేశాలకు హాజరయ్యేందుకు అంబేడ్కర్ వచ్చేవారు. అయితే 1952తో ఆ అనుబంధం మరింత బలపడింది. ఉస్మానియా యూనివర్సిటీ అంబేడ్కర్‌కి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించడమే దానికి కారణం. అంతర్జాతీయంగా న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీ 1952 వ సంవత్సరంలో అంబేడ్కర్‌కి డాక్టరేట్ ప్రదానం చేసింది. అయితే మన దేశంలో మాత్రం కేవలం హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే అంబేడ్కర్‌కి గౌరవ డాక్టరేట్ ఇచ్చిన ఘనత దక్కించుకుంది.

1952వ సంవత్సరంలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనే ఉస్మానియా యూనివర్సిటీకి చాన్స్‌లర్‌గా ఉన్నారు. చాన్స్‌లర్‌గా ఉన్న బూర్గుల రామకృష్ణారావు సంతకంతో 1952 జనవరి 12న అంబేడ్కర్‌కి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అలాగే చిట్టచివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ అంబేడ్కర్‌ని హైదరాబాద్ స్టేట్‌కి  చీఫ్ జస్టిస్ గా ఉండాలని కోరడం కూడా విశేషమే. అప్పటికే అనేక పదవులను వదులుకున్న అంబేడ్కర్ సమానత్వ సాధనకోసం చేసిన అలుపెరగని పోరాటం అందరితో పాటు చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేత సైతం సలామ్ అంబేడ్కర్ అనిపించింది. అంబేడ్కర్ హైదరాబాద్‌కి ఎప్పుడొచ్చినా తన చిరకాల మిత్రుడు సుబ్బారావు ఇంట్లోనే ఉండేవారు. సికింద్రాబాద్‌లోని ఇప్పుడున్న పారడైస్ కి దగ్గరలో ఫ్రెండర్ ఘాస్ట్ రోడ్‌లో  సుబ్బారావు నివాసం ఉండేవారు.
 
ద త్రీ ఇన్‌సల్ట్స్
 
మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు. అంబేడ్కర్ జీవితంలో జరిగిన మూడు అవమానాలు అతన్ని అసమానత్వపుటల్లోంచి సమానత్వ కాంక్షవైపు పరుగులు పెట్టించాయని చరిత్ర చెబుతోంది.
 
భీంరావ్ అంబేడ్కర్ ఒక రోజు తన సోదరుడితో కలిసి చాలా దూరంలో ఉన్న ఒక గ్రామానికి ప్రయాణించాల్సి వచ్చింది. మధ్యలో అంబేడ్కర్‌కి విపరీతమైన దాహం వేసింది. ఇంతలోనే అల్లంత దూరంలో వారికొక ఇల్లు కనిపించడంతో ఎక్కడలేని ఆనందం వేసింది. అక్కడికి వెళ్ళి ఆ ఇంటి యజమానిని గొంతు తడారిపోతోంది నీరిమ్మని అడిగాడు అంబేడ్కర్.

మంచినీళ్ళివ్వబోతూ నీదే కులమని అడిగాడు యజమాని. అంబేడ్కర్ కులం చెప్పగానే, మహర్ కులస్తుడని తెలిసి అతను కోపంగా దూరంగా ఉన్న మురికి గుంటను చూపించి అందులో నీళ్ళు తాగమన్నాడు. అప్పటివరకు నీటికి రంగుండదన్న జ్ఞానం నేర్చుకున్న అంబేడ్కర్ నీటికులం రంగుని స్పష్టంగా చూడగలిగాడు.
 
ఒకరోజు అంబేడ్కర్ మండువేసవిలో అతని అన్న, మేనల్లుడితో కలిసి గోరెగాంవ్‌లో ఉన్న తన తండ్రి దగ్గరకు బయలు దేరాడు. వీరు వస్తున్న సమాచారం అంబేడ్కర్ తండ్రి రాంజీకి అందకపోవడం వల్ల ఆయన స్టేషన్‌కు రాలేక పోయారు. చాలా సేపు ఎదురుచూసిన ఆ ముగ్గురూ అతికష్టంమీద స్టేషన్ మాస్టర్ సహకారంతో ఒక ఎడ్లబండిని మాట్లాడుకున్నారు. బండి కొద్ది దూరం వె ళ్ళిందో లేదో బండినడిపే వ్యక్తికి వీళ్ళు అంటరానివారన్న సంగతి అర్థం అయ్యింది. వెంటనే అతను బండి ఆపి దిగిపొమ్మని శాసించాడు. వారి సామానును గిరాటేశాడు. బండి, ఎడ్లు మైలపడ్డాయని కోపంతో ఊగిపోయాడు. అయితే అప్పటికే ఈ పిల్లలు ముగ్గురూ అలసిపోయి వున్నారు.

బండివాడి తిట్లు భరిస్తూనైనా బండిలో వెళ్ళడం తప్ప మరోమార్గం కనిపించలేదు. గతంలో మాట్లాడుకున్న దానికంటే రెట్టింపు డబ్బులిస్తానని ఆశపెట్టాడు భీంరావు అన్న. బండివాడు శాంతించాడు. రూపాయి ముందు కులం మోకరిల్లింది. అయితేనేం అహం ఎదురొచ్చింది. నేను బండైతే ఇస్తాను కానీ మీ కులంతో మైలపడ్డ బండిని నేను నడపనన్నాడు. భీంరావ్ అన్న బండి నడుపుతుంటే బండివాడు అంత ఎండలోనూ వెనకాలే నడుచుకుంటూ వచ్చాడు  తప్ప బండి ఎక్కలేదు. ప్రాణాలుపోయినా పర్లేదు కానీ మైలపడకూడదనుకున్న బండివాడి ప్రవర్తన అంబేడ్కర్‌ని తీవ్రంగా కదిలించింది.
 
అంబేడ్కర్ తెలివితేటలకు ముగ్ధుడైన బరోడా మహారాజు ఉన్నత చదువుల అనంతరం తన వద్ద పనిచేయాలన్న షరతుతో అంబేడ్కర్ విదేశీ విద్యకు ఆర్థిక సాయం చేశాడు. అతనికిచ్చిన మాట మేరకు అంబేడ్కర్ 1917లో బరోడా చేరాడు. అయితే, అంబేడ్కర్‌కు స్వాగతం పలకాల్సిందిగా బరోడా మహారాజు ఉత్తర్వులిచ్చారు. కానీ ఓ దళితుడిని ఆహ్వానించమన్న ఉత్తర్వుని అమలుపరిచేవారెవ్వరు? స్వాగతం అటుంచి బరోడాలో అడుగుపెట్టాక  తలదాచుకునేందుకు చిన్నగది సైతం అంబేడ్కర్‌కు దొరకలేదు. చివరకు ఒక పార్శీ సత్రంలో తలదాచుకున్నాడు.

అంబేడ్కర్ రాజుగారి మిలిటరీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కానీ సంస్థానోద్యోగులు అందుకు వ్యతిరేకులు. అంబేడ్కర్ ఆఫీసుకి వస్తున్నప్పుడూ, వెళ్తున్నప్పుడూ తివాచీలు ఎత్తేసేవారు మైలపడతాయని! అందుకే అంబేడ్కర్‌కి ఎప్పుడూ గ్రంథాలయంలోనే సాంత్వన దొరికేది. పుస్తకాలు చీదరించుకోవు. వాటిని తాకినా ఏమీ అనవు. అందుకే అవే ఆయనకు శాశ్వత నేస్తాలయ్యాయి. అవమానం జరిగిన చోటనే ఆకాశాన్ని తలదన్నే ఆత్మగౌరవ పతాకగా ఆయన్ను అవి నిలిపాయి.
 
లేబర్ పవర్
 
సమస్త సామాజిక పురోగతికి రాజ్యాధికారమే కీలకం.

అంబేడ్కర్ దళితుల రాజ్యాధికారం కోసం 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ప్రకటించాడు. ‘లేబర్’ అనే పదానికి ‘అణగదొక్కబడిన’ అనే అర్థాన్నిచ్చారు. 1932లో బ్రిటీష్ గవర్నమెంట్ అస్పృశ్యులకు ప్రత్యేక నియోజకవర్గాల్ని ప్రకటించినప్పుడు గాంధీ ఆమరణ నిరాహార దీక్ష చేసి వాటిని అడ్డుకున్నాడు. అందుకు మెజారిటీ ప్రజల్ని దళిత నాయకత్వంలో సమీకృతం చేయడానికి రాజకీయ పార్టీ నిర్మాణమే అసలైన పరిష్కారం అనుకున్నాడు అంబేడ్కర్.
 
ఈ పార్టీ బొంబాయిలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన పదిహేను సీట్లలో పదమూడింటిని కైవసం చేసుకుంది. జనరల్ సీట్లను రెండింటిని కూడా గెలుచుకుంది. 1937లో బొంబాయి ప్రెసిడెన్సీలో కాంగ్రెస్‌కు పటిష్ఠమైన ప్రతిపక్షంగా వ్యవహరించింది. ఇండియన్ లేబర్ పార్టీని విస్తృతపరచాలనే ఉద్దేశంతో 1942లో ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ స్థాపించాడు. తన ‘రెనడే, గాంధీ అండ్ జిన్నా’ గ్రంథంలో ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ ప్రతిపక్షం యొక్క ప్రాధాన్యతను నొక్కి వక్కాణించాడు.  1952 ఎలక్షన్లకు సన్నద్ధమౌతూ కేవలం షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ మాత్రమే  విజయవంతం కావడం కష్టమని భావించి ఇతర వామపక్ష పార్టీల పొత్తు కోసం పిలిచారు.

అస్పృశ్యత నివారించే క్రమంలో సామాజిక అసమానతలను రూపుమాపే ముఖ్య సూత్రంపైన ఆయన పార్టీల పొత్తు కోరారు.  అంబేడ్కర్ రాజకీయ ఉద్యమాలు ప్రత్యామ్నాయమైనవి. సామాజిక, ఆర్థిక, సమత సాధించేవి. అవి ఈనాటి చారిత్రక అవసరం. అంబేడ్కర్ రిజర్వేషన్ దశ నుంచి నిర్మాణ దశకు తన రాజకీయ ఉద్యమాన్ని తీసుకువెళ్ళాడు. ఆ ఉద్యమ స్ఫూర్తి ఈనాటి చారిత్రక అవసరం.  - డాక్టర్ కత్తి పద్మారావు,దళిత బహుజన ఉద్యమ నేత
 
సమ సమాజ నిర్మాత

ప్రభుత్వాన్ని ధిక్కరించే రాజకీయ నాయకుడి కంటే సమాజాన్ని ధిక్కరించే సంస్కర్తే ఎక్కువ ధైర్యశాలి.విశిష్టమైన భారత రాజ్యాంగ రచనలో ప్రధాన భూమికలు పోషించి, నూతన సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన ప్రతిభాశాలి అంబేడ్కర్. ఆగస్టు 29, 1947న బి.ఆర్. నాయకత్వంలో మరో ఆరుగురు ఉద్దండులతో ముసాయిదా కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ తొలి ముసాయిదాను ఫిబ్రవరి 1948 కల్లా రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించింది. ముసాయిదా కమిటీ సమావేశమైనది 141 రోజులే. రాజ్యాంగానికి తుది రూపాన్ని రాజ్యాంగ పరిషత్‌లో నవంబరు 4, 1948న సమర్పించారు.  భారత ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకై ఉద్దేశించబడిన 32వ ఆర్టికల్‌ను భారత రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ అనీ, ఇదే భారత రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ అనీ అభివర్ణించారంటే అంబేడ్కర్ వ్యక్తిస్వేచ్ఛకు, సాంఘిక సమానత్వానికి ఎంత ప్రాధాన్యతను ఇచ్చారో తెలుస్తుంది.
 
ఒక దేశ రాజ్యాంగ రచన సామాన్యమైన విషయం కాదు. భారతదేశం లాంటి ప్రత్యేకతలు కలిగిన దేశంలో భిన్నత్వాలను గౌరవిస్తూ, ఏకత్వాన్ని సాధిస్తూ, ప్రజాస్వామ్య మార్గంలో ఒక నిశ్శబ్ద సామాజిక, ఆర్థిక విప్లవానికి బాటలు వేస్తూ, జాతి ఐక్యతకు, సమగ్రతకు కావలసిన ఒక సజీవ, సమగ్ర, సార్వకాలీన, సాంఘిక, ఆర్థిక, రాజకీయ నిర్మాణాలను సృష్టించే రాజ్యాంగాన్ని రచించటం మేధావులకు సైతం సవాలు. అటువంటి గురుతర బాధ్యతను అంబేద్కర్ తన అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధతతో నిర్మించారు.- కె.వి.విజయబాబు రాజనీతి శాస్త్ర శాఖాధిపతి, ఆంధ్రా లయోలా కళాశాల
 

కోట్.. అన్‌కోట్
 
నీ కోసం జీవిస్తే నీలోనే మిగిలిపోతావు... జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు.
అంబేడ్కర్ కోటు ధారణ వెనకాల బలమైన ఫిలాసఫీ ఉంది. అడ్డగోచీ దాటకూడదనే అడ్డగోలు వ్యవస్థని ఛిద్రం చెయ్యడానికి అంబేడ్కర్ కోటు, బూటు, సూటు వేసుకున్నారు.
 
సామాజిక చైతన్యం కోసం భార త రాజకీయ రంగం పైన ఒక ధృవతారగా వె లిసిన అంబేడ్కర్ అణగారిన ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా వెలిగాడు. అణచి వేయబడిన వర్గాలకు సామాజిక గౌరవం సాధించటం ఆయన లక్ష్యం. అందుకే ఉన్ని ప్యాంటు, చొక్కా, పైన కోటు, మెడలో టై, చేతిలో భారత రాజ్యాంగం, చూపుడు వేలుతో దిశానిర్దేశం చేస్తున్న భంగిమలో  ఈ దేశంలోని అణగారిన ప్రజల ఆశల ప్రతిరూపంగా నిలిచాడు.
 
అంబేడ్కర్ ఆధునిక సంఘసంస్కర్తల్లో ప్రథముడు. అంటరానివారుగా సామాజికంగా హీనస్థితిలోకి నెట్టివేయబడిన కులంలో జన్మించాడు. సామాజిక సమానత్వం తిరస్కరించబడిన వర్గాలకు దారిదీపంగా నిలిచాడు. ఊరుమ్మడి బావిలో నీళ్లు తాగటానికి వీల్లేని బాహ్యులకు ఆసరా అయ్యాడు. విషపూరిత కులవృక్షాన్ని సమూలంగా పెళ్లగించటానికి పాశ్చాత్య సంస్కరణా సిద్ధాంతాలైన స్వేచ్ఛ, సమానత్వం, సమైక్యతల్ని ఆచరణకు తెచ్చాడు. అందుకే పాశ్చాత్య వస్త్రధారణను ఆత్మాభిమానానికి సంకేతంగా ఆయన భావించాడు.
 
కోట్లాది తన ప్రజల దృష్టిలో తాను సనాతన ఛాందసవాదిగా కాక, ఆధునికవాదిగా కనిపించటం ఒక అవసరం. వస్త్రధారణ ప్రభావం మన ఆలోచనల పైన తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. సముద్రుడు ఏనుగు చర్మం ధరించిన ఆటవిక వేషధారి శివుడికి హాలాహలాన్నీ, పట్టుబట్టలు కట్టుకునే విష్ణువుకు తన కూతురు లక్ష్మినీ ఇచ్చాడు. ఈ దేశంలో సగటు మనిషి ఆలోచనా ధోరణి ఇలానే ఉంటుంది. సనాతన భావజాలం లోంచి బయటపడాలంటే మొదటగా వస్త్రధారణ విధానం మారాలని అంబేడ్కర్ విశ్వసించాడు. కోటు, ప్యాంటు ధరించి తాను సనాతన ఛాందసవాదంలోంచి పుట్టిన కుల వ్యవస్థకు, ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకం అని చాటిచెప్పదలిచాడు. అంబేడ్కర్ వస్త్రధారణ ఆయన లక్ష్యానికి ఒక ప్రతీక.  - డా॥జి.వి. పూర్ణచంద్
 

ఏ ఇంట్లో పుట్టావూ అంటే... భారతదేశంలో పుట్టాను అనగలగాలి

కులం అనేది ఒక మానసిక స్థితి. అదొక మానసిక వ్యాధి.

‘‘పుట్టుక అనేది మనిషి అవకాశాలను, గౌరవాన్ని, అస్తిత్వాన్ని అడ్డుకోకూడదు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం ప్రతి భారతీయుడి ప్రథమ హక్కు కావాలి’’ అని అంబేడ్కర్ ఆకాంక్షించారు. భారతదేశంలో కుల సమాజాన్ని ముక్కలుగా విభజించడం వల్ల మనదేశం అనైక్యతకు ఆలవాలమైందనేది అంబేడ్కర్ భావన. అందుకే కుల వ్యవస్థకు పరిష్కారంగా ఆయన స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం లక్ష్యాలను ప్రతిపాదించారు. స్వేచ్ఛ, సమానత్వం లాంటి విషయాలపట్ల అంతర్జాతీయంగా ఒకే రకమైన స్వభావం ఉంటుంది.

అన్ని దేశాల్లో వీటి మీద చర్చ ఉంటుంది. అయితే భారతదేశంలో ఈ రెండింటితో పాటు సోదరత్వమనేది ప్రత్యేకమైన విషయం. ఒక మనిషిని ఇంకొక మనిషి తనకు సోదర సమానులే అన్న భావనను కలిగి ఉండడమే సోదరత్వం. కుల విభజన వల్ల అది మనలో లేకుండా పోయింది. అంతే కాకుండా, అంబేడ్కర్ మాటల్లో చెప్పాలంటే, సోదరత్వానికి మరోపేరు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యమంటే కేవలం పరిపాలనకు సంబంధించిన విధానం మాత్రమే కాదు. రాజకీయ అంశం మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం ప్రజల జీవితంలో భాగంగా ఉండాలి. అందరూ సమానులే అనే భావనను కలిగి ఉండాలి. ఒక రకంగా ఇది మానసికమైనది. భౌతికంగా దీనిని నిర్మూలించలేం. ఇందుకే అంబేడ్కర్ సోదరత్వాన్ని సాధించడానికి కుల నిర్మూలనను ప్రతిపాదించారు.
 
‘‘కులం అనేది మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ. ఈ మత విశ్వాసాలకు శాస్త్రాల, పురాణాల మద్దతు ఉంది. హిందూ సమాజం కులానికి దైవిక ప్రాతిపదికను ఆపాదిస్తారు. అందువల్ల కులాన్ని నిర్మూలించాలంటే దానికి ఆధారమైన శాస్త్రాల, వేదాల పురాణాల అధికారాన్ని నిర్మూలించాల్సి ఉంటుంది.’ అని తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రకటించారు. అంతేకాకుండా, భారతదేశ ప్రజలందరూ స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వ భావాలతో కలసిమెలసి జీవించడానికి కావాల్సిన పరిపాలనా విధానాలను, ఆదేశాలను ఆయన తాను నాయకత్వం వహించి రచించిన రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రజాస్వామ్య  స్వప్నాన్ని సాకారం చేసిన మహనీయుడు, సమానత్వ కాంక్షను ఆచరణీకరించిన కార్యశీలుడు, భవిష్యత్ సమసమాజ మార్గ నిర్దేశకుడు బాబాసాహెబ్ అంబేడ్కర్.  - మల్లెపల్లి లక్ష్మయ్య

ఇన్‌పుట్స్: అత్తలూరి అరుణ, జగన్నాథ దాసు, యాకూబ్ పాషా, నిర్మలారెడ్డి, పురాణపండ వైజయంతి, నిఖిత నెల్లుట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement