రాజ్యాంగ నిర్మాతకు క్రీడా నివాళి
విజయనగరం మున్సిపాలిటీ: భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు క్రీడా నివాళి అర్పించేందుకు విజయనగరం సిద్ధమైంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) నేతృత్వంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు విజ్జీ, రాజీవ్ స్టేడియంలు ముస్తాబయ్యాయి.
మూడు రోజుల పాటు కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నవి. ఏర్పాట్లలో అధికార యంత్రాంగం తలమునకలైంది. దీనికోసం కలెక్టర్ అధ్యక్షతన 14 కమిటీలు వేశారు. అయితే, రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు ప్రభుత్వం కేవలం రూ.12 లక్షల నిధులు మాత్రమే కేటాయించింది. నిధులు చాలవంటూ జిల్లా యంత్రాంగం శాప్‌కు నివేదించింది.
బరిలో 1300 మంది క్రీడాకారులు..
రాష్ట్ర స్థాయి పోటీలకు 13 జిల్లాల నుంచి 1300 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. ఈమేరకు శనివారం ఉదయానికి నెల్లూరు, అనంతరపురం, ప్రకాశం జిల్లాలకు చెందిన క్రీడాకారులు విజయనగరం చేరుకోగా... మిగిలిన జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. పోటీల పర్యవేక్షణ కోసం 300 మంది ఆఫీషియల్స్ జిల్లాకు చేరుకున్నారు. వీరికి వసతి సదుపాయాన్ని జిల్లా అధికారులు కల్పించారు. బాలికల కోసం నాయుడు ఫంక్షన్ హాల్, తోష్నివాలా భవన్‌లు కేటాయించగా.. బాలుర క్రీడాకారుల కోసం ఉల్లివీధిలోని ఆర్యవైశ్య కల్యాణ మండపం, లేడీస్ రిక్రియేషన్ క్లబ్, టీటీడీ కల్యాణ మండపం, రెవెన్యూ కల్యాణ మండపం, పోలీస్ ట్రైనింగ్ కళాశాలలను కేటాయించారు. ఆఫీషియల్స్ వసతి కోసం యూత్ హాస్టల్‌తో పాటు జిల్లా పరిషత్, ఆర్‌అండ్‌బీ అతిథి గృహాలను కేటాయించారు.
పోటీల్లో విజేతలకు నగదు ప్రోత్సాహకాలు
పోటీల్లో విజేతలుగా నిలిచే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నారు. విజేతలుగా నిలిచిన వరుస మూడు జట్లు, క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ.1500, రూ.1000, రూ.500 చొప్పున నగదు, జ్ఞాపికలు అందజేయనున్నారు.
మైదానంలోనే సదుపాయాలు..
క్రీడాకారులకు మైదానంలోనే మౌలిక సదుపాయాలు కల్పించారు. క్రీడాకారులకు కేటాయించిన వసతి నుంచి 20 బస్సుల్లో ఉదయం 7 గంటలకే విజ్జి మైదానానికి తరలించనున్నారు. ఈ రవాణా ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ అధికులు పర్యవేక్షించనున్నారు. మైదానం ఆవరణలో ఏర్పాటు చేసిన భోజనశాల వద్దనే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ముగించిన తరువాత వారికి కేటాయించిన వసతి వద్దకు తరలించనున్నారు. మైదానం ఆవరణలో పక్కా మరుగుదొడ్లు లేకపోవటంతో 34 మొబైల్ టాయిలెట్లు బాల, బాలికలకు వేరువేరుగా నిర్మించారు. క్రీడాకారులకు తాగేందుకు నీటి సదుపాయం, ఆటలో దెబ్బలు తగిలితే ప్రథమ చికిత్స అందించేందుకు మూడు మెడికల్ యూనిట్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.