రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం దర్యాప్తులో విజయవాడ సీపీ తీరుపై ప్రజాస్వామ్యవాదులు, అంబేడ్కర్ ఆలోచనాపరుల విస్మయం
రాత్రి 9 తర్వాత స్మృతివనం సిబ్బందిని బయటకు పంపిందెవరు?
లైట్లు ఆర్పేసి రాజ్‌భవన్, సీపీ కార్యాలయానికి సమీపంలోని సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడికి తెగబడటం మీ వైఫల్యం కాదా?
మీడియా వెంటనే సమాచారం ఇచ్చినా ఎందుకు స్పందించలేదు?
సీపీ ఫుటేజీని బయటపెట్టి.. దుండగులెవరో ఎందుకు తేల్చరు?
నిందితులను పట్టుకోకుండా సామాజిక మాధ్యమాలు, కొన్ని పత్రికలు వక్రీకరించాయని.. వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామనడంలో ఆంతర్యమేమిటి?
ఇది భావప్రకటన, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కల్పి0చడం కాదా?
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కనుసన్నల్లో దాడిచేసిన వారిని కాపాడటమే మీ లక్ష్యమా?
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీరే దాన్ని ఖూనీ చేసిన వారికి వత్తాసు పలికేలా వ్యవహరించడం ధర్మమా?
సాక్షి, అమరావతి: రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం ఘటన కేసు దర్యాప్తులో విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు, అంబేడ్కర్ ఆలోచనాపరులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించిన ఆగంతకులెవరో తేల్చకుండా.. ఆ సంఘటనను వక్రీకరించిన పత్రికలు, సామాజిక మాధ్యమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించడంపై విస్తుపోతున్నారు. ఇది భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కల్పి0చడం కాదా? అని నిలదీస్తున్నారు.
విజయవాడ నడిబొడ్డున రాజ్‌భవన్, పోలీసు కమిషనర్ కార్యాలయానికి కూత వేటు దూరంలోని అంబేడ్కర్ స్మృతివనంలో సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు ఈనెల 8న రాత్రి కొందరు దుండగులు తెగబడ్డారు. స్మృతివనంలో పనిచేస్తున్న సిబ్బందిని రాత్రి 9 గంటలకు అక్కడి నుంచి బయటకు పంపి లైట్లన్నీ ఆర్పేసి సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు, మాజీ సీఎం జగన్ పేరును ధ్వంసం చేశారు.
ఈ ఘటన జరుగుతుండగానే మీడియా ప్రతినిధులు పోలీసు కమిషనర్‌కు తెలిపేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. స్మృతివనం వద్దకు చేరుకున్న మీడియా ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు, అంబేడ్కర్ ఆలోచనాపరులను చూసి ఆగంతకులు పారిపోయారు. లేదంటే అంబేడ్కర్ విగ్రహం విధ్వంసానికి గురయ్యేదని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజ్యోన్మాదంపై ఆగ్రహజ్వాల..
సామాజిక అభ్యున్నతి ద్వారానే దళిత వర్గాల తలరాత మారుతుందని బాబా సాహెబ్ అంబేడ్కర్ నినదించి ఆగస్టు 8వతేదీ నాటికి సరిగ్గా 95 ఏళ్లు. అదే రోజు విజయవాడ నడిబొడ్డున రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహంపై టీడీపీ మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడంపై ప్రజాస్వామ్యవాదులు, అంబేడ్కర్ ఆలోచనాపరులు మండిపడుతున్నారు.
అంబేడ్కర్ విగ్రహంపై దాడి ఘటనలో నిందితులెవరో తేల్చాలని ఉద్యమిస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కొందరు అధికారులు, పోలీసుల సమక్షంలో సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించారని స్పష్టం చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రోద్బలంతో ఎంపిక చేసిన కొందరు అధికారుల సమక్షంలో అంబేడ్కర్ విగ్రహంపై దాడి జరిగినట్లు స్పష్టమవుతోందని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు.
అంబేడ్కర్ విగ్రహాన్ని విధ్వంసం చేసేందుకు తెగబడ్డ ఉన్మాదులెవరో తేల్చకుండా కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాలు వక్రీకరించి దు్రష్ఫచారం చేస్తూ సామాజిక వర్గాలు, దళిత సంఘాలను రెచ్చగొడుతూ వైషమ్యాలను సృష్టిస్తున్నాయని విజయవాడ సీపీ ఎస్వీ రాజశేఖరబాబు వ్యాఖ్యానించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సీపీ గారూ.. సమాధానం చెబుతారా?
» రాజ్‌భవన్, పోలీసు కమిషనర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న స్మృతివనంలో లైట్లన్నీ ఆర్పేసి అంబేడ్కర్ విగ్రహంపై కొందరు ఆగంతకులు దాడి చేయడం భద్రతా వైఫల్యం కాదా?
» అంబేడ్కర్ విగ్రహంపై దాడి చేస్తున్నారనే సమాచారాన్ని మీడియా మీకు అందించడానికి ప్రయత్నించినప్పుడు మీరు అందుబాటులోకి రాలేదన్నది వాస్తవం కాదా?
» మీడియా ప్రతినిధులు, అంబేడ్కర్ ఆలోచనాపరులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున స్మృతివనం వద్దకు చేరుకోవటాన్ని చూసే కదా ఆగంతకులు పారిపోయారు? ఆ తర్వాతే అక్కడికి పోలీసులు వచ్చారన్నది నిజం కాదా?
» అంబేడ్కర్ స్మృతివనం చుట్టూ సీసీ కెమెరాలున్నాయి. వాటి ఫుటేజీని బయటపెట్టి నిందితులెవరో
ఎందుకు తేల్చరు?
» సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కనుసన్నల్లో ఎంపిక చేసిన పచ్చమూకలే అంబేడ్కర్ విగ్రహంపై దాడికి తెగబడ్డాయన్న నిజం బయటపడుతుందనే సీసీ ఫుటేజీని బహిర్గతం చేయడం లేదా? ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సింది పోయి ఖూనీ చేసిన వారికి వత్తాసు పలకడం కాదా?
» సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును అప్పటికే ధ్వంసం చేశారు. స్మతివనం వద్దకు మీడియా, అంబేడ్కర్ ఆలోచనాపరులు, ప్రజాస్వామ్యవాదులు చేరుకునే సరికి ఆగంతకులు పారిపోయారు. లేదంటే అంబేడ్కర్ విగ్రహాన్ని విధ్వంసం చేసే వారన్నది వాస్తవం కాదా?
» అంబేడ్కర్ విగ్రహంపై దాడి ఘటనను బహిర్గతం చేయడం మీ దృష్టిలో వక్రీకరించడమా? అది సామాజిక వర్గాలను, దళిత సంఘాలను రెచ్చగొట్టి వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించడమా?
Comments
Please login to add a commentAdd a comment