
ఇంటికెళ్లి పొడిచిన దుండగుడు
విజయనగరం జిల్లాలో దారుణం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పట్టపగలు ఇంటికెళ్లి యువతిపై ఒక దుండగుడు దాడిచేసి కత్తితో పొడిచిన ఘటన విజయనగరం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. గరివిడి మండలంలోని ఓ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, 18 ఏళ్ల యువతికి నానమ్మ, తల్లిదండ్రులు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత రెండేళ్లుగా ఇంటివద్దే ఉంటోంది. ఉదయం 9:30 గంటల సమయంలో ఇంటి వద్ద వంట పాత్రలు శుభ్రం చేస్తున్న యువతిపై ఓ యువకుడు ముసుగు (మంకీ క్యాప్) ధరించి వచ్చి దాడి చేశాడు.
కత్తితో కడుపు పక్క భాగంలో రెండుచోట్ల పొడిచాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు పరారయ్యాడు. ఇంటికి ఎదురుగానే ఉంటున్న బూర్లె ఆదినారాయణ అనే యువకుడే ఈ దాడికి పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొద్దిరోజులుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఇందుకు కారణం. పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్న నలుగురు యువకుల్లో ఆదినారాయణ కూడాఉన్నట్లు తెలిసింది.
దెబ్బతిన్న కాలేయం, ఊపిరితిత్తులు
తీవ్ర రక్తస్రావంతో ఘటన జరిగిన వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాధితురాలిని స్థానికులు 108 వాహనంలో తొలుత ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దాడిలో కాలేయం భాగం దెబ్బతిన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లోనూ రక్తస్రావం కావడంతో ఊపిరి తీసుకోవడానికి యువతి ఇబ్బందిపడుతోంది.
బాధితురాలికి వైఎస్సార్‌సీపీ అండ
బాధితురాలికి అండగా ఉండాలన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సత్యలత ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైద్య ఖర్చుల నిమిత్తం పార్టీ తరఫున యువతి కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అండగా ఉంటామని చెప్పారు.