
ఊయల నుంచి జారిపడి విద్యార్థి మృతి
దోనుబాయి ఆశ్రమ పాఠశాలలో ఘటన
కన్నీటిపర్యంతమైన తల్లి, కుటుంబ సభ్యులు
విజయనగరం: బిడ్డా.. చనిపోయేందుకే వచ్చావా.. ఎంతఘోరం జరిగిపోయింది.. అండగా ఉంటానని చెప్పి అందని లోకాలకు వెళ్లిపోయావా... అంటూ ఆ తల్లి రోదన అక్కడివారికి కన్నీరు తెప్పించింది. పొట్టకూటి కోసం తల్లికి తోడుగా వలసవెళ్లి రెండు నెలల తర్వాత పాఠశాలకు వెళ్లిన విద్యార్థి మృత్యువాత పడిన ఘటన సీతంపేట మండలం దోనుబాయి ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కె.కాగుమానుగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి సవర చలపతి (14) దోనుబాయి ఆశ్రమపాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
కూలిపని కోసం విజయవాడకు వలస వెళ్లిన తల్లి లండమ్మకు తోడుగా వెళ్లిపోవడంతో ఫిబ్రవరి నుంచి మార్చి 26 వరకు పాఠశాలకు గైర్హాజరయ్యాడు. పరీక్షలని తెలియడంతో ఈ నెల 27న పాఠశాలకు వచ్చి ఎప్పటివలే విద్యార్థులతో కలసిమెలసి ఉన్నాడు. శుక్రవారం ఉదయం ఫలహారం అనంతరం పాఠశాల పై అంతస్తులో తన గదిలో బంకర్ బెడ్ మంచానికి ఊయల కట్టుకుని సరదాగా ఊగుతున్నాడు. ఈ క్రమంలో గట్టిగా ఊగడంతో ఒక్కసారిగా కాలు జారి కిందపడిపోయాడు. మంచం కూడా విద్యార్థిపై పడి తలకు బలమైన గాయమైంది. రక్తం ధారలా కారుతుండడాన్ని చూసిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది స్థానిక పీహెచ్‌సీకి తరలించారు.
అక్కడ వైద్యాధికారి భానుప్రతాప్‌తో పాటు వైద్యసిబ్బంది సేవలందించినా ఫలితం లేకపోయింది. తండ్రి భీముడు రెండేళ్ల కిందటే మృతిచెందాడు. ఇద్దరు అన్నదమ్ములు గణే‹Ù, ప్రసాద్ ఉన్నారు. ఎస్‌ఐ షేక్ మస్తాన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, సీఐ చంద్రమౌళి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి మృతిపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
తల్లికి తోడుగా వలస వెళ్లి...
మృతుడి పెద్దఅన్నయ్యకు వివాహం కాగా, చిన్న అన్నయ్య నిరుద్యోగి. నిరుపేద కుటుంబం కావడంతో కూలిపనుల కోసం విజయవాడకు తల్లి బయలుదేరగా తోడుగా చలపతి వెళ్లాడు. ఐదు రోజుల కిందటే గ్రామానికి వచ్చారు. తొమ్మిదో తరగతి పరీక్షలు జరుగుతాయని గురువారం పాఠశాలకు వెళ్లాడు. ఇంతలో బిడ్డ మృతి చెందాడన్న పిడుగులాంటి సమాచారం అందడంతో తల్లితో పాటు కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
కుటుంబాన్ని ఆదుకుంటాం
మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి తెలిపారు. విద్యార్థి మృతివార్త తెలుసుకున్న వెంటనే ఆయన పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. మృతికి కారణాలు తెలుసుకున్నారు. తనకు సమగ్ర నివేదిక అందించాలని గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొరను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామపెద్దలు ఎస్.భాస్కరరావు, విజయ్, రవి తదితరులు పీఓను కోరారు. ముందుగా రుణ సౌకర్యం కలి్పంచి ఆదుకుంటామని పీఓ హామీ ఇచ్చారు. దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.10 వేలు అందజేశారు. ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, పార్వతీపురం ఐటీడీఏ డీడీ కృష్ణవేణి, ఏఎంవో కోటిబాబు, జీసీడీఓ రాములమ్మ, హెచ్‌ఎంలు ఎ.భాస్కరరావు, చంద్రరావు తదితరులు ఉన్నారు.