
గుడివాడరూరల్: అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో భర్త విచక్షణా రహితంగా దాడి చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మట్టా అశోక్, భూమికలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న అశోక్ చెడు అలవాట్లకు బానిసై తరచూ అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు.
ఇటీవల జరిగిన గొడవతో భార్య భూమిక పిల్లలను తీసుకుని సమీపంలో నివాసముంటున్న తల్లి రాణి ఇంటికి వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం తన బట్టలు తీసుకునేందుకు చెల్లి అనుష్కతో కలిసి భర్త అశోక్ ఇంటికి వెళ్లిన భూమికపై భర్త కత్తితో విచక్షణా రహితంగా మొఖంపై దాడి చేసి పొట్టలో పొడిచాడు. అడ్డుకోబోయిన చెల్లిపై కూడా దాడి చేయడంతో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. అనంతరం అశోక్ పరారయ్యాడు.
గాయపడిన వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. భూమిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడ తరలించారు. బాధితురాలి తల్లి రాణి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వి.దీరజ్ వినీల్, స్థానిక పోలీస్ అధికారులతో కలిసి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఇందిరానగర్ కాలనీలోని సంఘటనా స్థలానికి డీఎస్పీ వెళ్లి పరిశీలించారు.