
కాశ్మీర్ దాడి భయానక క్షణాలను వివరించిన దంపతులు
కుటుంబ సభ్యులు, స్నేహితుల కన్నీటి పర్యంతం
విశాఖపట్నం: స్నేహశీలిగా, సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా, ఆధ్యాత్మిక భావాలు గల విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి జె.ఎస్.చంద్రమౌళి మరణం ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తీరని వేదనను మిగిలింది. విహారం కోసం కాశ్మీర్ లోని పహల్గాం వెళ్లిన ఆయన.. ఉగ్రవాదుల ఆకస్మిక దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న పుట్టినరోజు జరుపుకున్న ఆయన.. అదే రోజు తన భార్య, మరో రెండు కుటుంబాలతో కలిసి కశ్మీర్ బయలుదేరారు. ఉగ్రదాడిలో ఆయన మరణవార్త విని వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా చంద్రమౌళి ఎంతో ఉత్సాహంగా ఉండేవారు.
ఆదివాసీ ప్రాంతాలకు వెళ్లి దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు, విశ్రాంత ఉద్యోగుల సంఘం తరపున, వ్యక్తిగతంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉండటంతో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తరచుగా సందర్శించేవారు. చంద్రమౌళి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయనతో గడిపిన క్షణాలను స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. మంచి వ్యక్తిని కోల్పోయామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు తగిన శిక్ష పడాలని వారంతా కోరుతున్నారు.
ప్రాణాలతో బయటపడ్డాం కానీ..
కశ్మీర్ పహల్గాంలో జరిగిన దాడిలో విశాఖకు చెందిన చంద్రమౌళి మృతి చెందగా.. ఆయన మిత్రులు శశిధర్, సుచిత్రలు ప్రాణాలతో బయటపడ్డారు. చంద్రమౌళి, శశిధర్, అప్పన్న కుటుంబాలు ఈ నెల 18న కాశ్మీర్ విహారయాత్రకు బయలుదేరి వెళ్లాయి. ఈ నెల 25న అందరూ విశాఖకు తిరిగి రావాల్సి ఉంది. కానీ 22న పహల్గాం దాడిలో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో తాము ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వారు వివరించారు.
దాడి జరిగిన సమయంలో కొండపై ఉన్న క్యాంటీన్ సమీపంలో ఉన్నామని, కాల్పుల శబ్దాలు వినిపించగానే భయంతో టాయిలెట్ల వెనుక దాక్కున్నామని సుచిత్ర తెలిపారు. తుపాకీతో కనిపించిన ఉగ్రవాది తమవైపు రావడం చూసి, ప్రాణ భయంతో నుదుటిన బొట్టు కూడా చెరుపుకుని, సమీపంలోని వాగులో ముఖాలు కడుక్కున్నామని చెప్పారు. భయం ఎక్కువగా ఉన్నా.. దైవనామస్మరణ చేస్తే ఆ శబ్దం విన్నా చంపేస్తారేమోననిపించి అది కూడా చేయలేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. శశిధర్ మాట్లాడుతూ కాల్పులకు భయపడి తాము ఫెన్సింగ్ కింద నుంచి దూరి చెట్ల వెనుక దాక్కునే ప్రయత్నం చేశామన్నారు.

తన భార్య సుచిత్ర ఫెన్సింగ్ దాటడానికి చంద్రమౌళి సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. కాల్పులు జరుగుతున్నప్పుడు కళ్లముందే మనుషులు నేలకొరగడం చూశామన్నారు. చంద్రమౌళి కాల్పుల్లో మృతి చెందారని తర్వాత తెలిసి తీవ్ర ఆవేదనకు లోనైనట్లు చెప్పారు.కాశ్మీర్ వెళ్దామని రెండేళ్లుగా ప్లాన్ చేసుకుని ఇప్పుడు వెళ్తే, తమ మిత్రుడిని కోల్పోవాల్సి వచ్చిందని శశిధర్ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి ఏటా విహారయాత్రలకు వెళ్లే తమకు, ఈ పర్యటన తీరని విషాదాన్ని మిగిల్చిందని సుచిత్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. చంద్రమౌళి కుమార్తెలు అమెరికా నుంచి రావడంతో.. శుక్రవారం అతని అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు.