
అంత్యక్రియలకు హజరైన ప్రముఖులు, స్నేహితులు
బీచ్‌రోడ్డు (విశాఖ): ఉగ్రమూకల చేతిలో మరణించిన చంద్రమౌళి భౌతిక కాయానికి విశాఖ నగరవాసులు, ప్రముఖులు ఘన వీడ్కోలు పలికారు. ఈ నెల 22న కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు చేతిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి భౌతిక కాయం 23న నగరానికి చేరుకుంది. కుమార్తెలిద్దరూ గురువారం సాయంత్రానికి నగరానికి చేరుకోవటంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.
చంద్రమౌళి భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. హోంమంత్రి వంగలపూడి అనిత, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్,, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేశ్, వైఎస్సార్‌సీపీ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యేలు అదీప్‌రాజు, కరణం ధర్మశ్రీ, డిప్యూటీ మేయర్ శ్రీధర్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
చంద్రమౌళి పాడెను మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేశ్, మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మోశారు. భౌతికకాయాన్ని అంతిమయాత్ర వాహనంలోకి ఎక్కించారు. అక్కడ నుంచి నేరుగా శ్మశాన వాటికకు తీసుకెళ్లి హిందూ సంప్రదాయంలో చంద్రమౌళికి దహన సంస్కారాలు చేపట్టారు. కాగా దేశంలో ఉగ్రవాదులు లేకుండా అంతం చేస్తేనే చంద్రమౌళి అత్మకు శాంతి లభిస్తుందని ఆయన స్నేహితులు, తోటి ఉద్యోగులు మీడియాకు తెలిపారు.