విశాఖపట్నం: భీమిలిలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య మూడు ముక్కలాటకు తెరలేచింది. భీమిలి టికెట్ తమకంటే తమకని టీడీపీ నుంచి ఇన్‌చార్జి కోరాడ రాజబాబు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జనసేన ఇన్‌చార్జి పంచకర్ల సందీప్ ప్రకటించుకుని.. పార్టీల క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తున్నారు. భీమిలిలో పోటీపై చంద్రబాబు, పవన్‌లు ఏకాభిప్రాయానికి వచ్చినా.. తగ్గేదేలేదని ఇక్కడి ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు బాహాటంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేస్తున్న పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎవరికివారు యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కోరాడ, గంటా, పంచకర్ల వర్గాలు నిర్వహించే కార్యక్రమాలకు మరొక వర్గం గానీ, పార్టీల నాయకులు గానీ హాజరుకావడం లేదు.
2019 ఎన్నికల సమయంలో భీమిలి నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి వలస వెళ్లిపోయిన గంటా శ్రీనివాసరావు నాలుగున్నరేళ్లుగా ఇక్కడి కార్యకర్తలు, నాయకుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాగే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినా కలవడానికి వెళ్లలేదు. ఈ నెల 10న విశాఖ వచ్చిన లోకేష్‌ను కూడా గంటా కలవకపోవడం విస్మయపరుస్తోంది. ఇక గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సబ్బం హరి మరణంతో ఇక్కడ పార్టీ దాదాపు దిక్కులేనిది అయిపోయింది. దీంతో చాలా వరకు వైఎస్సార్ సీపీలో చేరిపోయారు.
టీడీపీలో మిగిలిన వారు సైతం రెండుగా విడిపోయి కోరాడ, గంటా వర్గీయులుగా చలామణి అవుతున్నారు. పార్టీ కష్టకాలంలో దూరంగా వెళ్లిపోయిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వస్తారని కోరాడ వర్గీయులు అంటున్నారు. చంద్రబాబు, లోకేష్‌లు గంటాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదని కోరాడకే టికెట్టు ఇవ్వనున్నట్టు అతని వర్గీయులు అంటున్నారు. ఇటీవల ఆ పార్టీ చేసిన సర్వేలో కూడా కోరాడ పేరు ఒక్కటే ఉందంటున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 15 లోగా గంటాకు పార్టీ అధినాయకత్వం భీమిలి టికెట్టు కేటాయిస్తుందని అతని వర్గం ఇటీవల భోగాపురం సమీపంలోని సవరవిల్లి వద్ద సమావేశంలో ప్రకటించింది.
ఆటలో అరటి పండు
2019 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో నాలుగో వంతు ఇక్కడ జనసేన అభ్యర్థికి వచ్చాయి. ఇటీవల సేన తరఫున సందీప్ పాదయాత్ర పేరుతో వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమాలకు పొత్తు కుదరలేదనేది స్పష్టమయింది. ఏ ఒక్క టీడీపీ కార్యకర్త, నాయకుడు సేన వెంట వెళ్లేందుకు ఇష్టపడలేదు. సందీప్ పోటీకి డబ్బులు సిద్ధం చేసుకున్నారని, ఈ నెల 14న సందీప్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తారని సేన కార్యకర్తలు చేస్తున్న వ్యాఖ్యలను.. టీడీపీ వర్గీయులు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. భీమిలిలో నూకాలమ్మ జాతరకు ముందే జరుగుతున్న ఈ పొలిటికల్ మూడు ముక్కలాటను ఇక్కడి ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment