breaking news
Visakhapatnam District News
-
పందెం బరిలో..
ప్రజల్ని చైతన్యవంతులను చేయాల్సిన ప్రజా ప్రతినిధులు జూదాలకు, మద్యానికి బానిసలుగా చేస్తూ కూటమి నాయకులు ప్రజలపై విషం కక్కుతున్నారు. కోడి పందాలు, జూదాలు, మద్యంతో పాటు అశ్లీల నృత్యాలకు స్టేజీలు ఏర్పాటు చేసి మరీ అమాయక ప్రజల్ని ఆకట్టుకోవడానికి పాట్లు పడుతున్నారు. కూటమి నేతల అడ్డాల్లో సంక్రాంతి మూడు రోజుల్లో రూ.కోట్లల్లో చేతులు మారనున్నాయి. వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నా పోలీసులు చూసీచూడనట్లుగా ఆ వైపే వెళ్లకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. అశ్లీల నృత్యాలకు ఏర్పాటు చేసిన స్టేజ్ ఎదురుగా కోడి పందాల బరి సాక్షి, అనకాపల్లి/అచ్యుతాపురం రూరల్ : కూటమి ప్రభుత్వం ఏర్పడి మండలంలో టీడీపీ, జనసేన వేర్వేరుగా విడిపోయి ఒక్కో పార్టీ ఒక్కో మండలాన్ని పంచుకుని అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడంలో నిమగ్నమయ్యారు. జనసేన పార్టీ స్థానిక ఎమ్మెల్యే సోదరుల అనుచరులు, నాయకులు రాంబిల్లి మండలం వెంకటాపురం కేంద్రంగా బరి ఏర్పాటు చేశారు. స్థానిక టీడీపీ ఇన్‌ఛార్జి అనుచరులు, టీడీపీ నాయకులు అచ్యుతాపురం మండలం చోడపల్లి పంచాయతీలో మరో బరి ఏర్పాటు చేసుకుని అక్రమ ధనార్జనకు సామాన్య ప్రజల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. అనధికారిక లేఅవుట్లో... అచ్యుతాపురంలో చోడపల్లి పంచాయతీలో అనధికారంగా వేసిన లే–అవుట్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూటమి నాయకులు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా చోడపల్లిలో ఏర్పాటు లే–అవుట్‌కు ఎటువంటి అనుమతులు లేకుండా రహదారులు ఏర్పాటు చేసి ప్లాట్లుగా విభజించి అమ్మకాలు చేసుకుంటూ పంచాయతీ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇప్పుడు అదే లే–అవుట్లో కోడి పందాలు, గుల్లాట బల్లలు, పేకాట, మద్యం బెల్టు షాపులకు కూటమి నాయకులు బరి సిద్ధం చేశారు. ఒక వైపు పోలీసులు రాష్ట్రంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అనుమతులు లేవని హెచ్చరిస్తున్నప్పటికీ గ్రామ స్థాయి నాయకులు మాత్రం అధికారుల మాటలు బేఖాతరు చేస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయమై చోడపల్లి పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌రావును సంప్రదించగా చోడిపల్లిలో ఏర్పాటు చేసిన బరి అనధికారంగా వేసిన లే–అవుట్‌లోనే ఉందని, ఆ లే–అవుట్‌కి పంచాయతీ అనుమతులు లేవని, లే–అవుట్ సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు మాకు అందజేయలేదంటూ తెలియజేశారు. 80 ఎకరాల లేఅవుట్లో భారీ బరి..! రాంబిల్లి మండలంలో వెంకటాపురం గ్రామం సమీపంలో 80 ఎకరాల ఓ రియల్ ఎస్టేట్ లేఅవుట్లో జనసేన ఎమ్మెల్యే సోదరుల కనుసన్నుల్లోనే భారీఎత్తున జూద క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. కోడి పందాలతో పాటు లాటరీ బల్ల, గుండాట వంటి జూద క్రీడలను ఏర్పాటు చేస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ జూద క్రీడల్లో 16 లాటరీ బల్లలను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. వీటిలో అచ్యుతాపురానికి చెందిన జనసేన పార్టీకి చెందిన నేతలకు –4, రాంబిల్లి–3, యలమంచిలి–4, మునగపాక–5 లాటరీ బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బల్లను ఏర్పాటు చేసినందుకు ముందస్తు మామ్మూళ్లు రూ.5 లక్షలు చొప్పున చెల్లించినట్లు తెలిసింది. ‘బరి’తెగిస్తే చర్యలు తప్పవు ప్రశాంతమైన వాతావరణంలో గ్రామీణ స్థాయి నుంచి సంక్రాంతి వేడుకలను నిర్వహించుకోవాలని, ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కాంతులు, ఆనందాలు నింపాలని, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ నిర్వహించుకోవాలని, కోడిపందాలు, గుళ్లాటలు, ఇతర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పండగ ముసుగులో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై 24/7 డ్రోన్ కెమెరాల ద్వారా పోలీస్ పర్యవేక్షణ ఉంటుందన్నారు. గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో నిరంతరం డ్రోన్ కెమెరా ద్వారా జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో పర్యవేక్షణ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోడిపందాలకు కత్తుల కట్టడం, భారీ ఎత్తున బెట్టింగ్ నిర్వహించడం, పేకాట, గుండాట, కోసు వంటి జూద క్రీడలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సంప్రదాయం పేరిట జీవహింసకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఇప్పటికే రౌడీషీట్లు తెరిచేందుకు కూడా వెనుకాడబోమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలన్నారు. ఎక్కడైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్టతే డయల్ 100/112కు, స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని అటువంటి వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. – తుహిన్ సిన్హా, ఎస్పీ, అనకాపల్లి జిల్లాఅచ్యుతాపురంలో చోడపల్లిలో అనధికార లేఅవుట్లో టీడీపీ బరి -
బోడి బంగ్లాకు రాజకీయ తాళం
మహారాణిపేట: నగరంలోని 30వ వార్డు శాలిపేటలో శతాబ్ద కాలం నాటి చరిత్ర కలిగిన బోడి బంగ్లా (పిండప్రదానాల భవనం)కు తాళం వేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హిందూ సమాజం అంతిమ సంస్కారాలు, పితృ కార్యకలాపాల కోసం కేటాయించిన ఈ భవనాన్ని స్థానిక కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం తాళం వేసి జీవీఎంసీకి అప్పగించడం విమర్శలకు తావిస్తున్నాయి. ఈ చర్యను విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్‌తో పాటు పలు బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సుమారు రూ. 6 కోట్ల విలువైన ఈ స్థలంపై కన్నేసిన అధికార పార్టీ నేతలు, దానిని ఆక్రమించుకునేందుకే కుట్ర పూరితంగా తాళాలు వేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై విశ్వహిందూ పరిషత్ నేత పుడిపెద్ది శర్మ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయగా, మంగళవారం మహారాణిపేట పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు నమోదైంది. 1902లో తెన్నేటి విశ్వనాథం, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం జమీందారు కలిసి హిందూ ధర్మ కార్యాల కోసం ఈ స్థలాన్ని కేటాయించారు. అప్పటి నుంచి ఇక్కడ నిరంతరాయంగా కర్మకాండలు జరుగుతున్నాయి. అటువంటి పవిత్ర స్థలాన్ని మూసివేసి భక్తులకు ఇబ్బంది కలిగించడం అన్యాయమని, వెంటనే తాళాలు తీసి యథావిధిగా కార్యక్రమాలు జరిగేలా చూడాలని హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. -
గంగవరం పోర్టుకు ఐసీసీ ఎన్విరాన్మెంటల్ ఎక్స్‌లెన్స్ అవార్డు
పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టుకు ఐసీసీ ఎన్విరాన్మెంటల్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కోల్‌కతాలో నిర్వహించిన 19వ ఎన్విరాన్మెంట్ పార్ట్నర్షిప్ సమ్మిట్‌లో ప్లాటినం విభాగంలో ప్రతిష్టాత్మక అవార్డును గంగవరం పోర్టు ప్రతినిధులు మంగళవారం అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడేళ్లలో ఆరు జాతీయ అవార్డులు అందుకున్నామని తెలిపారు. ఈ అవార్డుతో తమ పోర్టు బాధ్యత మరింత పెరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోర్టు అనేక కార్యకలాపాలు చేపడుతోందని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. -
ఎంపీ బాబూరావును కలిసిన లక్నో ఏడీజీపీ
నక్కపల్లి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో ఏసీబీలో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీపీ)గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి కిల్లాడ సత్యనారాయణ మంగళవారం విశాఖపట్నంలో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావును మర్యాద పూర్వకంగా కలిశారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని పాములవాక గ్రామానికి చెందిన సత్యనారాయణ సెకెండరీ గ్రేడ్ ఉపాద్యాయుడిగా పనిచేస్తూ సివిల్స్‌కు ప్రిపేర్ అయి 1996లో యూపీ ఐపీఎస్ కేడర్‌కు ఎంపికయ్యారు. ఆగ్రా ఏఎస్పీగా మొదటి పోస్టింగ్ పొందిన ఆయన మీరట్, ఝాన్సీ ఎస్పీగా, వారణాసి డీఐజీగా సేవలందించారు. సమర్థవంతమైన ఐపీఎస్ అధికారిగా పేరు సంపాదించుకుని ఐదేళ్లపాటు ఏపీలో డిప్యూటేషన్‌పై అనంతపురం రేంజ్ డీఐజీగా, ఏపీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. తర్వాత తిరిగి యూపీకి వెళ్లిపోయారు. సంక్రాంతి పండక్కి స్వగ్రామానికి కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన విశాఖలో ఎంపీ బాబూరావును కలిశారు. తాను ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన సత్యనారాయణ ఐపీఎస్ అధికారిగా పనిచేయడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా బాబూరావు అన్నారు. ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జీవీ రవిరాజు, శంకర్‌రెడ్డి, బొడ్డేటి గంగా మహేష్, డిప్యూటీ మాజీ మేయర్ దాడి సత్యనారాయణ, పురుషోత్తం రెడ్డి, బోరా కుమార్‌రెడ్డి, దల్లి రామకృష్ణారెడ్డి, శివకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
తాళం వేయడంపై ఆగ్రహం
1902 నుంచి ఉపయోగిస్తున్న ఈ భవనానికి కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం తాళం వేసి జీవీఎంసీ జోనల్ కమిషనర్‌కు అప్పగించారు. ఈ బంగ్లా వివాదంపై 2017 నుంచి హైకోర్టులో కేసు ఉంది. ఈ స్థలంపై తమకు సంబంధం లేదని జీవీఎంసీ అప్పట్లోనే హైకోర్టుకు రాతపూర్వకంగా సమర్పించింది. ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉంది. ఇంతలో కార్పొరేటర్ బంగ్లాకు తాళం వేయడం సరికాదు. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తాయి. అన్ని సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బంగ్లాకు సంబంధించి కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. నిబంధనలు విరుద్ధంగా బంగ్లాకు తాళం వేసిన కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలి. తక్షణమే బంగ్లాను తెరిపించాలని, లేనిపక్షంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం. –పూడిపెద్ది శర్మ, విశ్వహిందూ పరిషత్ మహానగర్ నేత, విశాఖ -
స్వయం సంవృద్ధి ఆర్థిక వ్యవస్థగా వీఎంఆర్డీఏ
విశాఖ సిటీ: విశాఖ గ్రాంట్లపై ఆధారపడే నగరంగా కాకుండా స్వయం సంవృద్ధి ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ తెలిపారు. ఎంఏయూడీ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం రెండు రోజుల అధ్యయన పర్యటనలో భాగంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)ను సందర్శించింది. ఇందులో ప్రాంతీయ పాలన, భూమి ఆధారిత ఫైనాన్సింగ్, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్, మురికివాడల పునర్వికాసం, విస్తృత స్థాయి నగర నిర్మాణానికి సంబంధించి దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన వ్యవస్థలపై అధ్యయనం చేశారు. ఈ పర్యటనకు వీఎంఆర్డీఏ నుంచి కమిషనర్‌తో పాటు జాయింట్ కమిషనర్ కె.రమేష్, సీఈ భవానీశంకర్, సీయూపీ వి.శిల్ప, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్‌భరత్ మాట్లాడుతూ ముంబై నమూనా ఒక నగరాన్ని దీర్ఘకాలిక ఆర్థిక ఇంజన్లుగా ఎలా మార్చగలదో చేపిస్తుందని తెలిపారు. అదే ప్రతిపాదికన విశాఖ ఎకనామిక్ రీజియన్‌కు రూపకల్పన చేస్తున్నామని, తద్వారా విశాఖ స్వయం సమృద్ధిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
సింహగిరి ఘాట్‌రోడ్డులో కారు బోల్తా
సింహాచలం: సింహగిరి ఘాట్‌రోడ్డులో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ సంక్రాంతి పండగ కోసం గాజువాకలోని తన ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి స్వామివారి దర్శనం కోసం సింహాచలం వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఘాట్‌రోడ్డు మార్గంలో కారు టైరు ఒక్కసారిగా పంచర్ కావడంతో వాహనం నియంత్రణ తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్‌తో పాటు కారులో ఉన్న ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన దేవస్థానం సిబ్బంది వారిని అంబులెన్స్‌లో నగరంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ కారులో ఉన్న పిల్లలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. -
మయూర్ అశోక్ సేవలు ప్రశంసనీయం
మహారాణిపేట: అద్భుతమైన పనితీరుతో అందరి మనసులు గెలుచుకున్న జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ కొనియాడారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీపై వెళ్తున్న జేసీ మయూర్ అశోక్ దంపతులకు రెవెన్యూ అసోసియేషన్, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వీడ్కోల సభ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది మయూర్ అశోక్, ఆయన భార్య జీసీసీ ఎండీ కల్పనా కుమారిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్లిష్టమైన సమస్యల పరిష్కారంలో మయూర్ అశోక్ చురుకై న పాత్ర పోషించారని, మంచి వ్యక్తిత్వం, నిబద్ధత కలిగిన అధికారిగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులు, సాంకేతిక అంశాల్లోనూ చురుగ్గా వ్యవహరించారని తెలిపారు. విధి నిర్వహణలో తనకు ఒక సోదరుడిలా వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్నారు. అరకు కాఫీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో జీసీసీ ఎండీ కల్పనా కుమారి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆమె పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. తక్కువ కాలంలోనే జీసీసీలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని ప్రశంసించారు. ఉత్తరాంధ్ర కుటుంబం నుంచి దూరమవుతున్నా.. జేసీ మయూర్ అశోక్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో సుమారు నాలుగేళ్ల పాటు పనిచేసిన అనుభవం మరువలేనిదన్నారు. విశాఖతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని చెప్పారు. ఉత్తరాంధ్ర కుటుంబం నుంచి దూరమవుతున్నందుకు బాధగా ఉందన్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ మార్గదర్శకత్వం, సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుందని, అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. జీసీసీ ఎండీ కల్పనా కుమారి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో వివిధ బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించిందని, విశాఖలో హౌసింగ్ జేసీగా పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అన్ని విభాగాల అధికారుల సహకారం మరువలేనిదని తెలిపారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్, ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, హౌసింగ్ పీడీ సత్తిబాబు, కలెక్టరేట్ ఏవో రాణి, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు త్రినాథ్, కార్యదర్శి శ్యాంప్రసాద్, వీఆర్వో అసోసియేషన్, రేషన్ దుకాణాల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.చిట్టిరాజు, మాకిన ప్రసాద్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అంబరాన్నంటిన సంబరాలు
సాక్షి, విశాఖపట్నం: మన సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేస్తూ మద్దిలపాలెంలో గల వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా పార్టీ కార్యాలయం బయట, లోపల మహిళా నేతలు ముగ్గులు వేశారు. భోగి మంటలు, బొమ్మల కొలువులు, గొబ్బెమ్మలు, పిండివంటకాలు ప్రదర్శించారు. బసవన్నల నృత్యాలు, హరిదాసుల కీర్తనలు అలరించాయి. సంప్రదాయాల పరిరక్షణలో మహిళల పాత్ర ప్రశంసనీయమని ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై, పండగ ఆనందాలను పంచుకోవడం వైఎస్సార్ సీపీ సంస్కృతి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భోగిమంటల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సంబరాల్లో మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఎస్ఈసీ సభ్యులు జహీర్ అహ్మద్, సతీష్ వర్మ, పీలా వెంకటలక్ష్మి, పోతిన హనుమత్, రాష్ట పార్టీ సంయుక్త కార్యదర్శులు పీవీ నారాయణ, తాడి జగన్నాథ రెడ్డి, శ్రీనివాస్, నాగ మల్లేశ్వరి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయ్ చంద్ర, ద్రోణంరాజు శ్రీ వత్సవ, రాష్ట్ర, జోనల్, జిల్లా అనుబంధ అధ్యక్షులు అంబటి శైలేష్, కటికల కల్పన, బోని శివరామకృష్ణ, కర్రి రామరెడ్డి, వంకాయల మారుతీ ప్రసాద్, బర్కత్ అలీ, సేనాపతి అప్పారావు, బొండా ఉమామహేశ్వరరావు , దేవరకొండ మార్కెండేయులు, శ్రీదేవి వర్మ, సనపల రవీంద్ర, శకభక్తల ప్రసాద్, మాజీ చైర్మన్లు అలంపల్లి రాజబాబు, పళ్లా చిన్నతల్లి, కార్పొరేటర్లు అనిల్ రాజు, అల్లు శంకరరావు, సాడి పద్మారెడ్డి, శశికళ, బిపిఎన్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు -
నాడు అన్నీ.. నేడు వట్టి బియ్యమే!
మహారాణిపేట: జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అమలు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అందే రేషన్ సరుకుల్లో కోతలు విధిస్తూ, అరకొర సరఫరాతో కాలక్షేపం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కందిపప్పు, వంటనూనె, రాగిపిండి వంటి అనేక రకాల నిత్యావసరాలను అందిస్తామని ఇచ్చిన హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదు. గత 18 నెలల కాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే కందిపప్పు పంపిణీ చేసి, ప్రస్తుతం కేవలం బియ్యం, పంచదారతోనే సరిపెడుతున్నారు. సంక్రాంతి పండగ వేళ కూడా పప్పు సరఫరా చేయకపోవడంతో పేద ప్రజలు ఉసూరమంటున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి కార్డుదారునికి నెలకు ఒక కిలో కందిపప్పును రూ. 70లకే అందించేవారు. మార్కెట్లో కందిపప్పు ధరలు సామాన్యులకు భారంగా మారిన తరుణంలో, రేషన్ డిపోల ద్వారా అందే పప్పుపైనే అనేక కుటుంబాలు ఆధారపడేవి. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. అటు గోధుమ పిండి పంపిణీలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్న విమర్శలు వస్తున్నాయి. కేవలం పట్టణ ప్రాంతాలకే గోధుమ పిండిని పరిమితం చేసి, గ్రామీణ ప్రాంత కార్డుదారులను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. జనవరి నెలకు సంబంధించి సిటీ పరిధిలోని 504 దుకాణాలకు మాత్రమే 320 మెట్రిక్ టన్నుల గోధుమ పిండిని కేటాయించారు. అరకొర సరుకులు జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,17,619 తెల్ల కార్డులు, 625 చౌకధరల దుకాణాలు ఉన్నప్పటికీ, సరుకుల సరఫరా మాత్రం కార్డుల సంఖ్యకు అనుగుణంగా ఉండటం లేదు. అరకొరగా సరుకులు పంపిణీ చేస్తుండటంతో అటు కార్డుదారులు, ఇటు డీలర్లు గందరగోళానికి గురవుతున్నారు. ఒకవైపు జిల్లా సప్లయి అధికారి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో అధికారులు పర్యవేక్షిస్తున్నా, క్షేత్రస్థాయిలో సరుకుల లభ్యత మాత్రం మెరుగుపడటం లేదు. పండుగ వేళ పూర్తిస్థాయిలో నిత్యావసరాలు అందించకుండా ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
నేడు సింహగిరిపై సంక్రాంతి సంబరాలు
సింహాచలం: సింహగిరిపై బుధవారం ఉదయం సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హిందూ సనాతన ధర్మాన్ని, తెలుగు సంస్కృతిని, గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుకలను తీర్చిదిద్దారు. రాజగోపురం ఎదురుగా ఉన్న మాడ వీధిలో తెల్లవారుజామున పెద్ద ఎత్తున భోగి మంటలు వేసేందుకు ఏర్పాట్లు చేయగా, గొబ్బెమ్మలతో కూడిన ముత్యాల ముగ్గులు, డూడూ బసవన్నల విన్యాసాలు భక్తులను అలరించనున్నాయి. వీటితో పాటు జంగమ దేవర, కొమ్మదాసరి, హరిదాసు వేషధారణలు, కపిలగోవు, కపిలగిత్త, ఎడ్లబండి మరియు పూరిగుడిసెల ప్రదర్శనలు పల్లె వాతావరణాన్ని తలపించనున్నాయి. వేడుకల్లో భాగంగా గోపూజను నిర్వహించడంతో పాటు, ఉదయం 9 గంటలకు చిన్నారులకు సామూహికంగా భోగిపళ్లు పోసే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ వేడుకల కోసం రాజగోపురం మార్గాన్ని శోభాయమానంగా అలంకరించారు. -
గూడు చెదిరిన వలస పక్షులు
చిట్టివలస చెరువులో అల్పసంఖ్యాకంగా కనిపిస్తున్న పక్షులుతగరపువలస: జీవీఎంసీ భీమిలి జోన్ 1, 2 వార్డుల పరిధిలోని చిట్టివలస, చిల్లపేట గ్రామాల మధ్య 36 ఎకరాలలో విస్తరించిన చెరువు గతంలో వలస పక్షులకు ఆలవాలంగా ఉండేది. చిత్తడి నేలల రకానికి చెందిన ఈ చెరువులో పీఎం పాలేనికి చెందిన ఈస్ట్‌కోస్ట్ కన్జర్వేషన్ టీమ్, గ్రీన్ పా ప్రతినిధులు గతంలో 35 రకాల పక్షిజాతులను గుర్తించారు. వాటిలో నీటి కోడి, పావురాలు, కొంగలు, మునుగుడు కోడి, జెముడుకాకులు, తాటి చతకా, కుకూడు, నీటికాకులు, చిలకలు, మైనాలు, కత్తెర పిట్టలు, జకన, ఉల్లంకి పిట్టలు తదితర పక్షులు ఉండేవి. భూసారం, ఇసుక నేలలు, డ్రైనేజీ నిల్వలు, రసాయన వ్యవసాయం, నీటి పారుదల, పట్టణ వ్యర్థాలు, కాలుష్యం పక్షుల మనుగడపై ప్రభావం చూపాయి. ఇటీవల జీవీఎంసీ చెరువులో పక్షులు సంతానోత్పత్తిలో భాగమైన చెట్లు, తుప్పలు తొలగించింది. అలాగే సంగివలస అనిల్ నీరుకొండ మెడికల్ కళాశాల, ఆసుపత్రి నుంచి వ్యర్థాలు నేరుగా చెరువులో కలవడం కూడా వీటి మనుగడపై ప్రభావం చూపింది. దీంతో తగరపువలస–భీమిలి రోడ్డులో నిత్యం ప్రయాణికులు, పర్యాటకులను పలకరించే పక్షులు ఇప్పుడు పలచబడ్డాయి. ఈ చెరువును వలస పక్షులకు ఆలవాలంగా మార్చాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 81 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో 81 వినతులను కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ స్వీకరించారు. వీటిలో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి 51 ఫిర్యాదులు అందాయి. మిగిలిన వాటిలో ఇంజినీరింగ్ సెక్షన్‌కు 11, రెవెన్యూకి 7, పరిపాలన అండ్ అకౌంట్స్ విభాగానికి 6, ప్రజారోగ్య విభాగానికి 5, ఉద్యానవన విభాగానికి ఒక వినతి వచ్చాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అందిన ప్రతి అర్జీపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోండి.. నగర ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ’పురమిత్ర’యాప్‌ను ప్రజలు విరివిగా వినియోగించు కోవాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. మౌలిక సదుపాయాలు, ఇతర పౌర సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు నేరుగా కార్యాలయాలకు రానవసరం లేకుండా, ఈ యాప్ ద్వారా తమ వినతులను సమర్పించవచ్చని తెలిపారు. దీనివల్ల ప్రజలకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, సమస్యలు కూడా వేగంగా పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, సీసీపీ ప్రభాకరరావు, డీసీఆర్ శ్రీనివాసరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. -
పోలీస్ పీజీఆర్ఎస్కు 90 ఫిర్యాదులు
అల్లిపురం: నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 90 ఫిర్యాదులు అందినట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ వేదికలో సీపీతో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొని ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులలో ప్రధానంగా కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్యాభర్తల గొడవలు, ఆర్థిక మోసాలు, సివిల్ కేసులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని సీపీ తెలిపారు. ఫిర్యాదులపై ఆయన స్పందిస్తూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడారు. బాధితుల సమస్యలను నిష్పక్షపాతంగా, వేగంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
స్టీల్‌ప్లాంట్‌లో ఉత్కంఠగా మాక్‌డ్రిల్
ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌లో గ్యాస్ బూస్టింగ్ స్టేషన్–2ఎం వద్ద ఉన్న ఎల్పీ బూస్టర్–1 నుంచి కోక్ ఓవెన్ గ్యాస్ లీకై , మంటలు చెలరేగినట్లు సంకేతాలు అందడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం అందడంతో ఆయా విభాగాల సిబ్బంది యుద్ధప్రాతిపదికన స్పందించారు. ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగం, గ్యాస్ సేఫ్టీ, సీఐఎస్ఎఫ్ ఫైర్, వైద్య , భద్రతా సిబ్బంది, హెచ్ఆర్, వాటర్ మేనేజ్మెంట్ విభాగాలకు చెందిన అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరిని తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించి ప్రథమ చికిత్స అందించడంతో పాటు, గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. అయితే ఇదంతా ప్రమాద సమయాల్లో సిబ్బంది పనితీరును పరీక్షించేందుకు నిర్వహించిన మాక్‌డ్రిల్ అని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర ఫ్యాక్టరీ విభాగం జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ జె. శివశంకరరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్లాంట్‌లోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సింహాచలంలో ముగిసిన నృసింహ దీక్షలు
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దీక్షల విరమణ కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. మండల దీక్ష, 32 రోజులు దీక్షలు చేపట్టిన భక్తులు, తమ శిరస్సులపై తిరుముడిలను ధరించి మెట్ల మార్గం ద్వారాను, ఘాట్ రోడ్డు ద్వారాను కొండపైకి చేరుకున్నారు. దీక్షాధారులందరికీ దేవస్థానం వారు ఉచిత అంతరాలయ దర్శనం కల్పించగా, భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించి దీక్షలను విరమించారు. శ్రీగోకులం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద అర్చకులు శాస్త్రోక్తంగా ఈ విరమణ ప్రక్రియను నిర్వహించారు. కార్య క్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు, ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సింహాద్రి మఠం గురుస్వామి కశిరెడ్డి సురేంద్ర, చందన పెరుమాళ్ పీఠం గురుస్వామి సానబోయిన రాజుల నేతృత్వంలో భక్తులు హరినామ స్మరణ చేస్తూ కొండపైకి చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు కొండ పైకి, కిందకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా, అన్న ప్రసాద భవనంలో అందరికీ భోజన వసతి ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ కల్యాణమండపంలో నిర్వహించిన శ్రీనృసింహ హోమాన్ని భక్తులు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లన్నింటినీ ఏఈవోలు తిరుమలేశ్వరరావు, రమణమూర్తి పర్యవేక్షించారు. -
సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి
మద్దిలపాలెం: మన సంస్కృతి, సంప్రదాయానికి సంక్రాంతి ప్రతీకగా నిలస్తుందని, యువత ఈ పండగ పరమార్థాన్ని గ్రహించాలని ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న మహా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనఆయన మాట్లాడుతూ ప్రకృతితో మూడిపడిన పండగ సంక్రాంతి, నాలుగు రోజులు పండగలో నాలుగు విధాలైన పరమార్ధాలున్నాయన్నారు. వీటిని యువత తెలుసుకోవాలన్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలను ఆత్మ నిర్భర్ సంక్రాంతిగా నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వు బ్యాంకు డైరెక్టర్ రాజేష్‌కుమార్ మహాన, ఎస్బీఐ డీజీఎం రాహుల్ సాంకృత్య, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరుశురామరాజు పాల్గొన్నారు. -
20 నుంచి ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ ఛార్జీల అంశానికి సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయనున్న టారిఫ్‌లపై ఈనెల 20వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సీఎండి ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. ఏపీఈఆర్సీ చైర్మన్ పీవీఆర్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని తిరుపతి, విజయవాడ, కర్నూలులో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఎఆర్ఆర్)పై జనవరి 20న తిరుపతిలో, 22, 23వ తేదీల్లో విజయవాడలో, 27వ తేదీన కర్నూలులో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖ, ఏపీట్రాన్స్కో, ఏపీజెన్కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ ప్రతి రోజు మూడు విద్యుత్ పంపిణీ సంస్థల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన అభిప్రాయాలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అభిప్రాయాలు చెప్పదలుచుకున్నవారు సమీప విద్యుత్ ఆపరేషన్ సర్కిల్ కార్యాలయం(ఎస్ఈ ఆఫీస్) లేదా డివిజన్ కార్యాలయం(ఈఈ ఆఫీస్) నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. -
కళ్లెదుటే తల్లి మృతి
తాటిచెట్లపాలెం: ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాటాకీస్ రోడ్డులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు కిందపడి ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతమ్మధారకు చెందిన బొంగు రమణి (56) అనారోగ్యం కారణంగా తన కుమారుడు అశోక్ కుమార్‌తో కలిసి ద్విచక్రవాహనంపై నగరంలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి సీతమ్మధారలోని తమ ఇంటికి వెళ్తుండగా.. రామాటాకీస్ రోడ్డులో వస్తున్న ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న రమణి ఒక్కసారిగా కిందపడిపోగా, బస్సు వెనుక చక్రాలు ఆమె తలపై నుంచి వెళ్లాయి. దీంతో ఆమె తల భాగం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లెదుటే తల్లి విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి కుమారుడు అశోక్ కన్నీరుమున్నీరుగా విలపించడం చూసి స్థానికులు చలించిపోయారు. సమాచారం అందుకున్న ద్వారకా ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెవెన్యూ క్లినిక్ వినతులను సకాలంలో పరిష్కరించాలి
మహారాణిపేట: రెవెన్యూ క్లినిక్‌కు వచ్చే వినతులను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సకాలంలో, నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆయా వారాల్లో వచ్చే ఫిర్యాదులను అదే వారంలో పరిష్కరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని ఆయన హితవు పలికారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన రెవెన్యూ క్లినిక్, సాధారణ పీజీఆర్ఎస్ కార్యక్రమాల్లో కలెక్టర్ హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ పాల్గొని ప్రజల నుంచి 86 వినతులు స్వీకరించారు. కార్యక్రమాంలో ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. -
వేదన నుంచి వేదనాదం వరకు..
డాబాగార్డెన్స్: తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి సందడి అంటేనే హరినామ స్మరణ. నెల రోజుల పాటు సాగే ఈ ధనుర్మాస ఉత్సవాల్లో అక్షయపాత్రను నెత్తిన మోస్తూ, చిడతల సవ్వడితో, తంబురా మీటుతూ వచ్చే హరిదాసులను సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి స్వరూపంగా భక్తులు భావిస్తారు. తరతరాలుగా పురుషులు మాత్రమే నిర్వహిస్తూ వస్తున్న ఈ పవిత్ర వృత్తిలో, విధి ఆడిన వింత నాటకంలో ఒక సామాన్య మహిళ ‘హరిదాసి’గా మారి అరుదైన బాటను ఎంచుకుంది..నగరానికి చెందిన కందుల నాగమణి. భర్త మరణానంతరం ఆయన వదిలివెళ్లిన భక్తి వారసత్వాన్ని, కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుని ఆమె చేస్తున్న ఈ ప్రయాణం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. భక్తి సామ్రాజ్యంలో ... సాధారణంగా హరిదాసులంటే కాషాయ వస్త్రాలు, నుదుట తిరునామాలు, తలపై అక్షయపాత్రతో కనిపిస్తారు. ఇది పురందరదాసు, కనకదాసుల కాలం నుంచి వస్తున్న గొప్ప సంప్రదాయం. హరిదాసుల గానామృతం కేవలం ఆధ్యాత్మిక చింతననే కాకుండా, సామాజిక చైతన్యాన్ని కూడా కలిగిస్తుంది. ఇన్నాళ్లూ పురుషులకే పరిమితమైన ఈ రంగంలోకి నాగమణి అడుగుపెట్టడం వెనుక ఒక కన్నీటి గాథ, అంతకు మించిన గుండె నిబ్బరం ఉన్నాయి. జీవీఎంసీ 50వ వార్డు పరిధిలోని సాయిరామ్‌నగర్‌లో నివసించే నాగమణి భర్త కందుల చంద్రం, గతంలో బ్రాండిక్స్ కంపెనీలో బస్సు డ్రైవర్‌గా పని చేస్తూనే, ఏటా ధనుర్మాసంలో హరిదాసుడుగా మారి భక్తిని పంచేవారు. భర్త కీర్తనలు పాడుతుంటే పరవశించిపోయే నాగమణి, ఆయనతో పాటే ఆ ఆధ్యాత్మిక గీతాలను నేర్చుకుంది. 2018లో గుండెపోటుతో చంద్రం మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. అధైర్యపడని ఆత్మవిశ్వాసం భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. కానీ నాగమణి కుంగిపోలేదు. భర్త పనిచేసిన కంపెనీలోనే స్టిచింగ్ ఆపరేటర్‌గా చేరి పిల్లల్ని చదివిస్తోంది. పెద్ద కుమార్తె చంద్రిక పదో తరగతి, చిన్న కుమార్తె వైష్ణవి ఎనిమిదో తరగతి చదువుతున్నారు. అయితే కేవలం ఆర్థిక అవసరాలే కాకుండా, తమకు మగపిల్లలు లేరనే వెలితి రాకూడదని, తన భర్త కొనసాగించిన కులవృత్తి ఆగిపోకూడదని నాగమణి దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆ సంకల్పమే ఆమెను ‘హరిదాసి’గా మార్చింది. తన భర్త గతంలో ఏ ఏ వీధుల్లో అయితే హరినామ స్మరణ చేశారో, సరిగ్గా అదే ప్రాంతాల్లో ఇప్పుడు నాగమణి తంబురా పట్టుకుని కనిపిస్తుంటే స్థానికులు ఆశ్చర్యంతో పాటు అభినందనలు కురిపిస్తున్నారు. కఠినమైన నిష్ట.. నిరంతర నామస్మరణ ధనుర్మాసం మొదలవగానే నాగమణి దినచర్య ఎంతో కఠినంగా ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి, స్నానపానాలు ముగించుకుని, దైవ ప్రార్థన అనంతరం హరిదాసి వేషధారణలో సిద్ధమవుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విరామం లేకుండా సాయిరామ్‌నగర్, మురళీనగర్, పట్టాభిరెడ్డి గార్డెన్స్ వంటి ప్రాంతాల్లో కీర్తనలు పాడుతూ భక్తులను ఆశీర్వదిస్తోంది. హరిదాసుల సంప్రదాయం ప్రకారం తలపై ఉన్న అక్షయపాత్రను ఇంటికి వెళ్లే వరకు కింద పెట్టకూడదు. ఒకవేళ భక్తులు ఇచ్చే బియ్యం, కానుకలతో పాత్ర నిండిపోతే, ఒక రాయిపై దించి సంచిలోకి మార్చుకుంటారు. తిరిగి ఇంటికి చేరుకున్నాకే అక్షయపాత్రను దేవుడి మూల ఉంచి, పూజ నిర్వహించి అప్పుడు భోజనం స్వీకరిస్తారు. చేయూత కోసం ఎదురుచూపు ఆర్థిక ఇబ్బందులు వెన్నాడుతున్నా నాగమణి ఆత్మగౌరవంతో ముందుకు సాగుతోంది. సొంతంగా తంబురా కొనుగోలు చేసే స్తోమత లేక ఇతరుల నుంచి తీసుకుని వాడుతోంది. స్థానిక దాత పైలా దేముడు నాయుడు ఆమెకు 7 కేజీల రాగి పాత్రను బహూకరించి తన వంతు సాయం అందించారు. ‘భర్త నేర్పిన విద్యను, మా కుటుంబ సంప్రదాయాన్ని కాపాడుకోవడమే నా లక్ష్యం. పిల్లల చదువుల కోసం, నా వృత్తి కోసం ఎవరైనా దాతలు సహకరిస్తే కృతజ్ఞతతో ఉంటాను’ అని నాగమణి విజ్ఞప్తి చేస్తోంది. ఒకవైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు అంతరించిపోతున్న కళారూపాన్ని మహిళగా భుజాన మోస్తున్న నాగమణి నిజంగానే అభినందనీయురాలు. -
అంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతోంది
మొన్న పెందుర్తి ఏకలవ్య కాలనీ పరిధిలో ఇద్దరు అమ్మాయిల్ని కొందరు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మా సంఘ ప్రతినిధులు వారిని వెంటపడి పట్టుకున్నారు. కేసు నమోదు చేయకుండా కౌన్సెలింగ్ ఇచ్చి బైండోవర్ నమోదు చేసి పంపించేశారు. మహిళల భద్రత విషయంలో భయపడాల్సి వస్తోంది. డ్రగ్ కల్చర్ నుంచి ప్రతి ఒక్కటీ ప్రభుత్వాల కనుసన్నల్లోనూ నడుస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం అన్ని చోట్లా మహిళలపై నేరాలు పెరుగుతున్నాయన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మహిళల్ని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తూ వారి హక్కుల్ని కాలరాస్తున్నారు. – పి.లక్ష్మి, ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు -
ఆడపిల్లల్ని వేధిస్తే తాటతీస్తామన్న పవన్ ఎక్కడ ?
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల భద్రత అనేది కనుమరుగైపోయింది. మహిళలే లక్ష్యంగా దాడులు, దొంగతనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విశాఖ నగరంలో జరుగుతున్న ఘటనలు మహిళల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మహిళల్ని ఎవరైనా వేధిస్తే అదే వారి చివరి రోజని చెప్పిన చంద్రబాబు.. ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఏం చేస్తున్నారు.? ఆడపిల్లల్ని వేధిస్తే తాట తీస్తామని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏమైపోయారు? ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాల శాతం పెరిగిపోయింది. – వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ -
జీవీఎంసీ బడ్జెట్‌కు స్థాయీ సంఘం ఆమోదం
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ 2026–27 బడ్జెట్ అంచనాలపై స్థాయీ సంఘ సభ్యులు సుదీర్ఘంగా చర్చించి ఆమోదించారని నగర మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో జీవీఎంసీ వార్షిక బడ్జెట్‌పై స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. ఏ విభాగానికి ఎంత వెచ్చించారు? జమలు, ఖర్చులు, వివిధ అభివృద్ధి పనులకు ఎంత కేటాయించారో? తదితర అంశాలను సభ్యుల ముందుకు జీవీఎంసీ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి తీసుకొచ్చారు. వాటిని స్థాయీ సంఘ సభ్యులు చర్చించి ఆమోదించారు. వాటిలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి త్వరలో జరగనున్న కౌన్సిల్ సమావేశంలో సభ్యుల ఆమోదానికి పంపనున్నారు. కాగా మేయర్ పీలాకు ఇదే మొదటి బడ్జెట కాగా.. చివరి బడ్జెట్ కూడా ఇదే కావడం విశేషం. ఐదేళ్ల పాలనలో నాలుగేళ్లు వైఎస్సార్ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి స్థాయీ సంఘం చైర్‌పర్సన్‌గా బడ్జెట్ ఆమోదించారు. సమావేశంలో అదనపు కమిషనర్లు పీఎం సత్యవేణి, డి.వి.రమణమూర్తి, ఎస్.ఎస్.వర్మ, పి.నల్లనయ్య, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ రాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.ఎన్.వి.నరేష్కుమార్, తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ ఇలా.. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనా సంగ్రహంగా ప్రారంభ నిల్వ రూ.365.96 కోట్లు. అన్ని పద్దుల కింద జమలు రూ.3814.41 కోట్లు. ప్రారంభ నిల్వతో కలిపి మొత్తంగా జమలు రూ.4180.37 కోట్లు కాగా.. అన్ని పద్దుల కింద ఖర్చులు రూ.4047.12 కోట్లు. ముగింపు నిల్వగా రూ.133.25 కోట్లుగా నిర్ణయించారు. గారడీ అంకెలంటే ఒప్పుకునేది లేదు.. బడ్జెట్‌ను స్థాయీ సంఘ సభ్యుల ముందుకు చర్చకు తెచ్చే ముందు మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో గారడీ అంకెలు చూపించారని తెలపడంతో స్థాయీ సంఘ సభ్యురాలు సాడి పద్మారెడ్డి స్పందిస్తూ.. ‘మీరు ఆ విధంగా మాట్లాడడం సరికాదు. బడ్జెట్‌ను ఎవరు రూపొందిస్తారు.. అధికారులా? సభ్యులా? గతంలో 98 వార్డుల్లో అభివృద్ధి జరగలేదా? మీ వార్డు ఏ మేరకు అభివృద్ధి జరిగిందో మీకు తెలియదా’? అంటూ మండిపడ్డారు. ● గాజువాక, గోపాలపట్నం, పెందుర్తి తదితర విలీన ప్రాంతాల్లో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్స్ కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని, వాటిని జీవీఎంసీ పరంగా మనం అభివృద్ధి చేయలేమా? అంటూ సభ్యుడు రాపర్తి త్రివేణి వరప్రసాదరావు ప్రశ్నించారు. ● జీవీఎంసీ పరిధిలో పార్కులు, శ్మశానవాటికలు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశారు. అంత వరకూ బాగానే ఉంది. వాటిని సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారని, సభ్యులు సాడి పద్మారెడ్డి, రాపర్తి త్రివేణి వరప్రసాదరావు అధికారుల ముందుకు తీసుకొచ్చారు. కేర్ టేకర్స్‌ని నియమిస్తే వాటి సంరక్షణ ఉంటుందని సూచించారు. ● బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణలో చాలా చోట్ల బస్టాప్‌లు కోల్పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు సభ్యులు అధికారుల దృష్టికి తీసుకోచ్చారు. -
వివాదాల పరిష్కారంలో కొత్త అధ్యాయం
అల్లిపురం: కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి మధ్యవర్తిత్వ శిక్షణా కార్యక్రమం సోమవారం విజయవంతంగా ముగిసింది. నగరంలోని ఒక హోటల్లో జరిగిన ఈ ముగింపు వేడుకకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, కన్జ్యూమర్ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ జి. తనూజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న సభ్యులకు వారు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని కొనియాడారు. రాష్ట్రంలోనే తొలిసారిగా శిక్షణ పొందిన మధ్యవర్తులుగా డాక్టర్ వికాస్ పాండేతో పాటు 12 మంది సీఆర్సీ సభ్యులు గుర్తింపు పొందడం విశేషం. ఈ శిక్షణ పొందిన వారిలో న్యాయవాదులు డాక్టర్ ఆర్. శ్రీరాములు, డాక్టర్ త్రినాథ్, సుకన్య ప్రియ, డాక్టర్ డొడ్డి చంద్రశేఖర్, శరత్ చంద్ర, కె. అవినాష్, శంకర్, దివ్య భారతి, ముజీర్, రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణ జీ, షంవీర్ చౌహాన్లు ఉన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ సహకారంతో జరిగిన ఈ శిక్షణను అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఎ.జె. జవాద్ బృందం నిర్వహించారు. మధ్యవర్తిత్వానికి సంబంధించిన సిద్ధాంతాలు , ఆచరణాత్మక అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కోసం ప్రజలు 99636 33653 నంబర్‌కు కాల్ చేయవచ్చని లేదా ఠీఠీఠీ. ఛిటఛిఛజ్చిట్చ్ట. ఛిౌఝ వెబ్సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు సూచించారు. ముగిసిన మీడియేషన్ శిక్షణ -
రేపు సింహగిరిపై సంక్రాంతి సంబరాలు
సింహాచలం: సింహగిరిపై బుధవారం ఉదయం సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హిందు సనాతన ధర్మాన్ని, తెలుగు సంస్కృతిని, గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఈ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాజగోపురం ఎదురుగా ఉన్న మాడ వీధిలో ఉదయం పెద్ద ఎత్తున భోగి మంటను వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గొబ్బెమ్మలతో ముత్యాల ముగ్గులు, డూడూ బసవన్నల విన్యాసాలు, జంగమ దేవర, కొమ్మదాసరి, హరిదాసు వేషధారణలు, కపిలగోవు, కపిలగిత్త, ఎడ్లబండి, పూరిగుడెసలు, ధాన్యం గుట్టలను ప్రదర్శనలు ఏర్పాటుచేస్తున్నారు. ఉదయం 9 గంటలకు చిన్నారులకు సామూహికంగా భోగిపళ్లు పోసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే ముంగళవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న మాడవీధిలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. -
● విశాఖలో వరుసగా అతివలపై దాడులు ● మహిళలే లక్ష్యంగా చోరీలు ● బయటకు వస్తే భద్రత కరువు ● దాడుల నియంత్రణకు చర్యలు శూన్యం ● దాడి జరిగిన తర్వాత పట్టుకున్నారంటూ చంద్రబాబు ప్రశంసలు ● ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న మహిళలు
సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మహిళల భద్రత గాల్లో దీపమే అని ఈ ఘటనలు మరోసారి రుజువు చేశాయి. మహిళల భద్రతకు పెద్దపీట వేశామంటూ సీఎం చంద్రబాబు, హోంమంత్రి మైక్ దొరికిన ప్రతిసారీ ఊదరగొడుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అవన్నీ ఒట్టిమాటలే అని తేల్చేస్తూ వరుస ఘటనలు.. విశాఖలో మహిళా లోకాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అత్యంత రద్దీ ఉన్న ప్రాంతంలో భద్రతను పెంచాలన్న కనీస చర్యలు చేపట్టలేకపోవడం దురదృష్టకరం. పట్టపగలే మహిళలే టార్గెట్‌గా.. మహిళల్నే టార్గెట్ చేస్తూ దొంగతనాలు జరుగుతున్నాయి. అంతా జరిగిన తర్వాత బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు ఛేదిస్తున్నారే తప్ప.. ముందస్తు చర్యలు చేపట్టడం, భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత సెప్టెంబర్ నెలలో ఒకే రోజున నగరంలోని కంచరపాలెం, వన్‌టౌన్, గాజువాక తదితర ఏడు ప్రాంతాల్లో మహిళల మెడలో గొలుసులు దొంగతనాలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్ నెలలో కంచరపాలెం సమీపంలో అర్ధరాత్రి ఓ ఇంటిలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి కట్టేసి 12 తులాల బంగారం, నగదు దోచుకెళ్లారు. ఇతర రాష్ట్రాల నుంచి ముఠాలు ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి బవారియా వంటి అంతర్రాష్ట్ర ముఠాలు విశాఖను టార్గెట్ చేసినా.. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారన్న వాదన బలంగా వినిపిస్తోంది. కేవలం రోడ్లమీదే కాదు.. ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోతోందనే ఆరోపణలొస్తున్నాయి. రాజకీయ విమర్శలు, రాజకీయ కక్షతో అరెస్టులకు ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మహిళల రక్షణపై కనీస శ్రద్ధ కూడా చూపించడం లేదంటూ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలపై దాడులు కొత్తేం కాదు. 2014–19లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో పెందుర్తి మండలం 2017 డిసెంబర్ నెలలో ఓ దళిత మహిళని వివస్త్ర చేసి టీడీపీ నాయకులే విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. మళ్లీ అదే తరహా సంస్కృతి విశాఖలో విషతుల్యంగా మారకముందే.. చంద్రబాబు ప్రభుత్వం మహిళా భద్రతపై మరింత కఠినంగా వ్యవహిరంచాలంటూ పలువురు కోరుతున్నారు. -
అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
మహారాణిపేట : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అధికారుల అలసత్వంపై కలెక్టర్ ఆగ్రహానికి వేదికై ంది. ప్రజల నుంచి వచ్చే వినతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, నాణ్యమైన పరిష్కారం చూపని అధికారులపై కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వినతులపై సరైన ఎండార్స్మెంట్ ఇవ్వకుండా, తూతూమంత్రంగా వ్యవహరిస్తున్న జీవీఎంసీ, టౌన్ ప్లానింగ్ విభాగాలకు చెందిన జెడ్సీ, డీసీపీ, ఏసీపీ, డీఈ, ఏఎస్ఓ స్థాయిలోని 10 మంది అధికారులకు తక్షణమే మెమోలు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు 48 గంటల్లోగా వివరణతో కూడిన నివేదికలు సమర్పించాలని పీజీఆర్ఎస్ నోడల్ అధికారిని ఆదేశిస్తూ కఠిన చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేదిక ద్వారా బాధితులకు సకాలంలో, నాణ్యమైన న్యాయం జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏ వారం వచ్చిన వినతులను ఆ వారమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఫిర్యాదులు గుట్టలుగా పేరుకుపోయి సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని అధికారులకు సూచించారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత లోపించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా వచ్చిన వినతులపై అధికారులు ఇచ్చిన ఎండార్సుమెంట్లు, ప్రీ–ఆడిట్ విధానం, ప్రజల సంతృప్తి స్థాయిని స్వయంగా విశ్లేషించిన కలెక్టర్, బాధ్యతారాహిత్యంగా ఉన్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 164 వినతుల స్వీకరణ : సోమవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 164 వినతులు రాగా, అందులో జీవీఎంసీకి సంబంధించి 80, పోలీస్ శాఖకు 9, ఇతర శాఖలవి 75 ఉన్నాయి. కార్యక్రమంలో జీవీఎంసీ ఏడీసీ సత్యవేణి, డిప్యూటీ కలెక్టర్ సత్తిబాబు, ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్‌లతో పాటు పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు. అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని, ప్రజల సమస్యల పరిష్కారంలో రాజీ పడే ప్రసక్తే లేదని కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
గోపాలపట్నం: సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉప రవాణా కమిషనర్ ఆర్.సి.హెచ్. శ్రీనివాసరావు హెచ్చరించారు. పండుగ రద్దీ దృష్ట్యా ఆదివారం, సోమవారం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 10 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు, వారి నుంచి రూ. 15,500 జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం, ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా 91 92816 07001 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. -
ఇంటి పన్నులు వేయించండి మహాప్రభో..
పెందుర్తి నియోజకవర్గం చింతగట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 28లో నివసిస్తున్న 78 కుటుంబాలు, గత ఎనిమిదేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం గళమెత్తారు. తాము ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నప్పటికీ, పంచాయతీ అధికారులు తమకు ఇంటి పన్ను రశీదులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అనుచరుల ఒత్తిడి వల్లే అధికారులు పన్నులు వేయడం లేదని, వారి అడ్డుతగిలే ధోరణితో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆరోపించారు. ఈ సమస్యపై సోమవారం పీజీఆర్ఎస్లో వీరంతా వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు వేయడానికి పంచాయతీ సిబ్బంది సిద్ధంగా ఉన్నప్పటికీ, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే వెనుకంజ వేస్తున్నారని వారు వాపోయారు. పన్ను రశీదులు లేకపోవడం వల్ల విద్యుత్ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన సర్టిఫికెట్లు కూడా అధికారులు ఇవ్వడం లేదని, దీనివల్ల చీకట్లోనే మగ్గాల్సి వస్తోందని బాధితులు మొరపెట్టుకున్నారు. -
కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం దాసోహం
బీచ్‌రోడ్డు: రైతు సంఘం నాయకుడు ఎం.అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ప్రయోగించిన పీడీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. నరసింగరావు డిమాండ్ చేశారు. అప్పలరాజును బేషరతుగా విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో నరసింగరావు మాట్లాడారు. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ వల్ల మత్స్యకారులు, రైతులు తమ భూములతో పాటు జీవనోపాధిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనతో ప్రజలు న్యాయబద్ధంగా పోరాడుతుంటే, ప్రభుత్వం పోలీసు బలగాలతో ఉద్యమాన్ని అణచివేయాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. దీనిని ప్రశ్నించినందుకే అప్పలరాజుపై 19 అక్రమ కేసులు బనాయించారని, డిసెంబర్ 24న అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద జైలుకు పంపడం ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఎం.శ్రీనివాస్, ఆర్.కె.ఎస్.వి.కుమార్, జిల్లా నాయకులు పి.మణి, డాక్టర్ బి. గంగారావు, పి.వెంకటరావు, సీతా లక్ష్మి, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
మాస్టర్ ఇ.కె.భౌగోళిక ప్రబోధకులు
ఘనంగా 65వ మాస్టర్ సీవీవీ గురుపూజా ఉత్సవాలు మహారాణిపేట: జగద్గురు పీఠం వ్యవస్థాపకుడు మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య(మాస్టర్ ఇ.కె.) నవయుగానికి సరిపడే ఆచరణీయ మార్గాన్ని తన శతాధిక గ్రంథాల ద్వారా అందించారని, ఆయన భౌగోళిక ప్రబోధకులని పీఠం జాతీయ అధ్యక్షుడు సీహెచ్‌ఎస్‌ఎన్ రాజు కొనియాడారు. జిల్లా పరిషత్ సమీపంలోని అంకోసా ఫంక్షన్ హాల్లో జరుగుతున్న 65వ మాస్టర్ సీవీవీ గురుపూజా ఉత్సవాల్లో ఆదివారం మాస్టర్ ఇ.కె. శతజయంతి ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం సంస్థ సలహా సంఘ సభ్యుడు రామప్రసాద్ జోషి మాట్లాడుతూ..మాస్టర్ ఇ.కె.బోధనలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని తెలిపారు. సంస్థ కార్యనిర్వాహక సభ్యులు చింతలపాటి సత్యదేవ్, బి.ఆర్.కె.రాజు, అజ్జరపు శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. గురుపూజోత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో మాస్టర్ సీవీవీ ప్రార్థనలను, వేద మంత్ర పఠనాన్ని సంస్థ బృందం సామూహికంగా నిర్వహించింది. సంస్థ భౌగోళిక అధ్యక్షుడు కె.గురుప్రసాద్ దంపతులు శాస్త్రోక్తంగా నారాయణ హోమాన్ని జరిపించారు. అలాగే చిన్నారులకు నామకరణాలు, అన్నప్రాసన జరిపించారు. కొన్నేళ్లుగా సేవలందిస్తున్న సంస్థలోని వివిధ కేంద్రాల ప్రాంతీయ గణపతులకు, సుమారు 700 మంది కార్యకర్తలకు ఈ సందర్భంగా జగద్గురు పీఠం తరఫున వస్త్ర ప్రదానం చేశారు. -
మళ్లీ ఎటో..
వైజాగ్ మెట్రో..వైజాగ్ మెట్రో రైలు ప్రాజెక్టు నమూనాసాక్షి, విశాఖపట్నం : ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడమెలాగో చంద్రబాబు ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఇదిగో పులి అంటూ చంద్రబాబు అంటే.. అదిగో తోక అంటూ టీడీపీ భజన బృందం హడావుడి చేయడం షరామాములుగా మారిపోయింది. డీపీఆర్‌కు కేంద్రం ఆమోదముద్ర వెయ్యకుండానే టెండర్లు పిలిచి.. అభాసుపాలైన ప్రభుత్వం.. చివరికి వైజాగ్ మెట్రో ప్రాజెక్టును గాల్లో దీపంలా మార్చేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఫీజిబిలిటీ రిపోర్టు పూర్తై డీపీఆర్ ఆమోదం చివరి దశకు చేరుకున్న తరుణంలో.. డీపీఆర్‌లో మార్పులు చేస్తామంటూ చంద్రబాబు సర్కారు మోకాలడ్డింది. ఇప్పుడు గతంలో ఇచ్చిన ఫీజిబిలిటీ రిపోర్టు సరిపోదని..మళ్లీ కొత్తది ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆదేశించడంతో ప్రాజెక్టు అటా.. ఇటా.. అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. మహా విశాఖ మరింత అభివృద్ధి చెందేందుకు గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తూ.. లైట్‌మెట్రో ప్రాజెక్టు పట్టాలక్కెంచేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. 76 కిలోమీటర్ల మేర 4 కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు వ్యయం అవుతుందని స్పష్టం చేస్తూ 2023 డిసెంబర్ 29న ఉత్తర్వులు సైతం జారీ చేసింది. పీపీపీ విధానంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో ప్రభుత్వాల వాటా 40 శాతం కాగా, టెండరు దక్కించుకున్న సంస్థ 60 శాతం భరించనున్నట్లు ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ని కూడా పంపించారు. అయితే.. ప్రభుత్వం మారిపోవడం.. విశాఖను అభివృద్ధి చెయ్యడం అంతగా ఇష్టం లేనట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు.. మెట్రో ప్రాజెక్టుకి మోకాలడ్డే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. మరోసారి డీపీఆర్ తయారు చేస్తామంటూ పాత డీపీఆర్‌ని పక్కన పడేశారు. దీంతో.. కథ మళ్లీ మొదటికొచ్చింది. అయితే పాత డీపీఆర్కే స్వల్ప మార్పులు చేసి హడావుడి చేసింది. మెట్రోని మరింత జాప్యం చేసేందుకు భూ సర్వే చెయ్యాలంటూ జిల్లా అధికారుల్ని ఆదేశించారు. అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. మరోసారి ఫీజిబిలిటీ పేరుతో కొర్రీ పాత డీపీఆర్‌నే అటు ఇటుగా మార్చేసి.. ఆలస్యంగా రాష్ట్రప్రభుత్వం సమర్పించిన డీపీఆర్ మీద కేంద్రం కొత్త కొర్రీ వేసినట్లు తెలుస్తోంది. రూ.14,309 కోట్లుతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌కు ఫీజిబిలిటీరిపోర్టు మళ్లీ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకసారి రూపొందించిన ఫీజిబిలిటీ రిపోర్టు పదేళ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. విభజన హామీలో మెట్రో ప్రాజెక్టు ఉండటంతో 2014–15లో రూపొందించిన ఫీజిబిలిటీ రిపోర్టు వ్యాలిడిటీ 2025కి పూర్తయింది. దీంతో.. కొత్తగా సాధ్యాసాధ్యాల నివేదిక కచ్చితంగా ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం మరోసారి సర్వే చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది. అదే.. 2024 జనవరిలో ఇచ్చిన డీపీఆర్ ఆమోదించి ఉంటే.. ఫీజిబిలిటీ రిపోర్టు మరోసారి చెయ్యాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం.. జాప్యం చెయ్యడం వల్ల.. ప్రాజెక్టు మళ్లీ మొదటికొచ్చింది. ఫ్లైఓవర్లతో సరిపెట్టేద్దామా.? మరోవైపు విశాఖలోని రద్దీ జంక్షన్లలో ఫ్లైఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలు పెరుగుతున్నాయి. కీలకమైన కూడళ్ల వద్ద.. ఫ్లైఓవర్లు ఏర్పాటు చేస్తే.. ట్రాఫిక్ ఇబ్బందులు దాదాపుగా తగ్గుతాయనే అభిప్రాయం అటు అధికారుల్లోనూ ఇటు ప్రజాప్రతినిధుల్లోనూ ఉంది. అయితే.. మెట్రో రైలుకు.. ఫ్లై ఓవర్లకు వేరువేరుగా నిర్మాణం చేయడం వల్ల ఆర్ధిక భారం పెరగడంతో పాటు రహదారుల విస్తరణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వ పునరాలోచనలో పడింది. ఇప్పుడు దీనిపైనా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పలు ప్రధాన నగరాల్లో మెట్రో నష్టాలతో నడుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం.. దాన్నే బూచిగా చూపించి.. వైజాగ్‌కు మెట్రో ప్రాజెక్టు లేకుండా చెయ్యాలనే కుట్రలు పన్నుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్లకు అతీగతి లేదు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం గతేడాది జూలై 25న టెండర్లు పిలిచింది. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.6250 కోట్లు(జీఎస్టీ అదనం)తో టెండర్లుకు ఆహ్వానించింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.11,498 కోట్లు కాగా.. మూడు కారిడార్లలో ఫేజ్ –1 పనుల కోసం ఈపీసీ ప్రాతిపదికన ఏఎంఆర్‌సీ టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది. కాగితాలపై ఉన్న ప్రాజెక్టు నిర్మించేందుకు ఏ సంస్థా అడుగు ముందుకేసి టెండర్లలో పాల్గొనేందుకు సాహసించలేదు. దీంతో.. పనుల్ని సింగిల్ ప్యాకేజీలా కాకుండా.. ప్యాకేజీలుగా విభజించినా ఎవరు రాకపోవడంతో.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మారింది. మొత్తంగా.. ఏమీ లేకుండానే.. ఏదో చేసేస్తున్నామని డప్పులు కొట్టిన చంద్రబాబు ప్రభుత్వానికి మెట్రో షాక్ తగిలింది. ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోయినా.. టెండర్ల పేరుతో అరచేతిలో మెట్రో చూపించి.. అభాసుపాలైన ప్రభుత్వం.. ఇప్పుడు ఫీజిబిలిటీ షాక్‌తో ఏం చెయ్యాలో పాలుపోక ఆపసోపాలు పడుతోంది. -
ట్యూనా టైమ్.. సముద్రం ఇచ్చిన బహుమతి
మహారాణిపేట: కూటి కోసం సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను అదృష్టం వరించింది. ఆదివారం భారీ సంఖ్యలో ట్యూనా చేపలు చిక్కాయి. సముద్రంలో లభించిన ఈ చేపలను మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్‌కు తరలించారు. వలలకు చిక్కిన ట్యూనా చేపలు ఒక్కోటి దాదాపు 10 నుంచి 20 కిలోల బరువు ఉండటంతో వారిలో ఆశలు చిగురించాయి. పెద్ద పరిమాణంలో ఉన్న ఆ చేపలను ముక్కలుగా కోసి ఎగుమతులకు అనువుగా సిద్ధం చేశారు. ట్యూనా చేపలకు మార్కెట్లో మంచి గిరాకీ ట్యూనా చేపలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ముఖ్యంగా కేరళ, చైన్నె ప్రాంతాల ప్రజలు వీటిని ఎంతో ఇష్టంగా భుజిస్తారు. 6 అడుగుల నుంచి 15 అడుగుల వరకు పెరిగే ఈ చేపలకు మంచి ధర పలుకుతుండటంతో ఫిషింగ్ హార్బర్లో సందడి నెలకొంది. చేపలను ఐస్‌తో నింపిన వ్యాన్లు, కంటైనర్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. -
నైట్రోజన్ నింపుతుండగా పేలిన సిలిండర్
చికిత్స పొందుతూ కార్మికుడి మృతి పరవాడ: సంక్రాంతి పండగకు సొంతూరికి వెళ్లాలన్న ఆతృతతో.. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఆదివారం విధులకు హాజరైన ఓ కార్మికుడిని మృత్యువు సిలిండర్ పేలుడు రూపంలో కబళించింది. వెన్నలపాలెం జంక్షన్‌లోని సేఫ్ జోన్ షాపులో ఆదివారం మధ్యాహ్నం సిలిండర్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించి, కాకినాడకు చెందిన మామిడి సూర్యప్రకాశరావు (45) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివి.. కాకినాడకు చెందిన మామిడి సూర్యప్రకాశరావు ఐదేళ్ల పాటు కాకినాడలోని సేఫ్ జోన్ బ్రాంచీలో పనిచేశాడు. మూడు నెలల కిందట బదిలీపై వెన్నలపాలెం జంక్షన్‌లోని బ్రాంచీకి వచ్చాడు. ఈ సంస్థ ఫార్మా కంపెనీలకు సరఫరా చేసే ఫైర్ ఎక్స్టింగ్విషర్లకు సర్వీసింగ్, రీఫిల్లింగ్ చేస్తుంటుంది. సాధారణంగా ఎక్స్టింగ్విషర్ల సిలిండర్‌లో సగం వరకు డ్రై పౌడర్‌ను, మిగిలిన సగం నైట్రోజన్ గ్యాస్‌తో నింపుతారు. ఆదివారం మధ్యాహ్నం 1.14 గంటల సమయంలో సూర్యప్రకాశరావు ఒక సిలిండర్‌లో డ్రై పౌడరు నింపిన అనంతరం నైట్రోజన్ గ్యాస్‌ను నింపుతుండగా.. ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో సూర్యప్రకాశరావు తీవ్రంగా గాయపడ్డాడు. సహచరులు వెంటనే క్షతగాత్రుడిని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారు. సంక్రాంతి కోసం కాకినాడ వెళ్లాల్సి ఉండటంతో, ఆదివారం సెలవు అయినప్పటికీ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి సూర్యప్రకాశరావు సంస్థకు వచ్చాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. మృతుడికి భార్య వనితరత్నం, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. -
క్రేజీ కై ట్స్
శంకరమఠం రోడ్లో గాలిపటాలు విక్రయాలు కనుజు పిల్లతో తల్లి సీతంపేట: సంక్రాంతి అంటేనే సందడి. ఇంటి ముందు రంగవల్లులు, ఆకాశంలో రంగు రంగుల పతంగులు. ఈ పండగ వచ్చిందంటే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలోనూ కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. పిండివంటల ఘుమఘుమలు, హరిదాసుల కీర్తనలు, బసవన్నల దీవెనలతో పాటు, ఆకాశంలో ఎగిరే గాలిపటాలు పండగకు కొత్త శోభను తీసుకువస్తాయి. భలే భలే పతంగులు శంకరమఠం రోడ్, పాలబూత్ సెంటర్, సంగం ఆఫీస్ కూడలి ప్రాంతాలు గాలిపటాల విక్రయాలతో కళకళలాడుతున్నాయి. చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగా వ్యాపారులు పేపర్, పాలిథిన్, క్లాత్‌తో చేసిన వైరెటీ గాలిపటాలను సిద్ధం చేశారు. బాహుబలి, స్పైడర్‌మ్యాన్, డోరేమాన్, టామ్ అండ్ జెర్రీ, చోటాభీమ్ వంటి కార్టూన్, సినిమా తారల చిత్రాలతో కూడిన పాలిథిన్, పేపర్ గాలిపటాలు పిల్లలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. క్లాత్‌తో తయారు చేసిన సీతాకోకచిలుక, షార్క్ చేప, పులి, సింహం, రామచిలుక, గబ్బిలం, గ్రద్ద ఆకారపు గాలిపటాలకు మంచి డిమాండ్ ఉంది. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా రూ.10 నుంచి మొదలుకొని రూ.1,000 వరకు వివిధ రకాల గాలిపటాలు లభిస్తున్నాయి. షాపింగ్ మాల్స్ అలంకరణ కోసం ప్రత్యేకంగా చిన్న సైజు పతంగుల ప్యాకెట్ల(100 పీసులు)ను రూ.600లకు విక్రయిస్తున్నారు. చైనా మాంజాపై నిషేధం గాలిపటాలు ఎగరేయడం ఎంత సరదాగా ఉంటుందో, అందులో వాడే దారం విషయంలో అంతే జాగ్రత్త అవసరం. చైనా మాంజా(గాజు పొడి పూసిన దారం) వినియోగం వల్ల గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించింది. ఇది పక్షులకు, మనుషులకు అత్యంత ప్రమాదకరం. ఈ నేపథ్యంలో పోలీసులు చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై కఠిన నిషేధం విధించారు. ప్రజలు భద్రతా దృష్ట్యా చైనా మాంజాను వాడకూడదని, పాత స్టాక్ ఉన్నా ఉపయోగించవద్దని సూచించారు. దీనికి ప్రత్యామ్నాయంగా సురక్షితమైన స్థానిక దారం(కాటన్ మాంజా) రీల్స్ మాత్రమే వాడాలని కోరుతున్నారు. మార్కెట్లో సాధారణ మాంజా రూ.50 నుంచి రూ.300 వరకు లభిస్తోంది. ఈమూ పిల్లలు మార్కెట్లో వైరెటీ గాలిపటాలు బాహుబలి నుంచి చోటాభీమ్ దాకా.. -
నా బంగారు కూన..
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్క్ కొత్త ప్రాణుల రాకతో కళకళలాడుతోంది. జూలో అమలు చేస్తున్న పునరుత్పత్తి చర్యలు, ఇతర రాష్ట్రాల నుంచి జంతు మార్పిడి విధానం సత్ఫలితాలనిస్తున్నాయి. దీని వల్ల వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే జూలో ఏకంగా ఐదు రకాల వన్యప్రాణులు పండంటి పిల్లలకు జన్మనిచ్చాయి. ఇందులో ఆరు ఈమూ పిల్లలు, మూడు కృష్ణ జింకలు, రెండు కనుజులు, రెండు నీలగాయిలు, ఒక నల్ల హంస పిల్ల ఉన్నాయి. ఈ చిన్నారుల రాకతో జూలో సందడి నెలకొంది. ప్రస్తుతం పుట్టిన పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని, వెటర్నరీ వైద్య బృందం, జంతు సంరక్షకులు వీటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. -
జూలో ముగిసిన వింటర్ క్యాంప్
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో నాలుగు రోజుల పాటు నిర్వహించిన వింటర్ క్యాంప్ ఆదివారంతో ముగిసింది. ఈ నెల 8న ఈ క్యాంప్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నాలుగు రోజుల్లో పిల్లలకు వివిధ అంశాలపై జూ అధికారులు అవగాహన కల్పించారు. నీటి ఏనుగులు, కోతులు, ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు, నెమళ్లు, ఈమూలు, ఆఫ్రికన్ చిలుకలు తదితర జీవుల ఆవాసాలు, వాటి ఆహారపు అలవాట్ల గురించి పిల్లలకు వివరించారు. క్యాంప్ ముగింపు సందర్భంగా ఇందులో పాల్గొన్న చిన్నారులకు సర్టిఫికెట్లు, జూలో 10 సార్లు ఉచిత ప్రవేశానికి వీలు కల్పించే పాస్‌పోర్టు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జూ క్యూరేటర్ జి.మంగమ్మ మాట్లాడుతూ.. పిల్లల్లో వన్యప్రాణుల పట్ల అవగాహన పెంచడానికి, వాటిపై ప్రేమను కలిగించడానికే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో జూ అసిస్టెంట్ క్యూరేటర్ గోపి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
సింహాచంలో దర్శకుడు హరీష్ శంకర్
సింహాచలం : సింహాచల క్షేత్రంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్ దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ సంప్రదాయం ప్రకారం ఏఈవో తిరుమలేశ్వరరావు స్వామివారి ప్రసాదం , శేషవస్త్రాన్ని బహూకరించారు. కప్పస్తంభానికి మొక్కుకుంటున్న హరీష్‌శంకర్ -
7 బస్సులపై కేసుల నమోదు
గోపాలపట్నం: పండగ సీజన్‌ను పురస్కరించుకుని రవాణా శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఏడు ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేసినట్లు ఉప రవాణా కమిషనర్ ఆర్.సి.హెచ్. శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ఏడీ జంక్షన్ సమీపంలోని ఎన్ఎస్టీఎల్ వద్ద నిర్వహించిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుల ద్వారా మొత్తం రూ.33,600 జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంవీఐ బుచ్చిరాజు, ఏఎంవీఐ పార్వతి, ఇతర రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
● ఆకాశంలో సంబరం.. గాలిలో మృత్యువు
పండగ ఆనందంతో ఊరంతా వెలిగిపోవాల్సిన వేళ, ఒక నిర్లక్ష్యపు దారం మూగజీవి ప్రాణాన్ని నిలువునా బలితీసుకుంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనం ఎగురవేసే పతంగాలు మనకు ఉల్లాసాన్ని ఇస్తుండవచ్చు కానీ, ఆ గాలిపటానికి కట్టే నిషేధిత ‘చైనీస్ మాంజా’ పక్షుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. పలు స్వచ్ఛంద సంస్థలు ఎంతగా నెత్తీనోరూ బాదుకుంటున్నా, కొందరి అనాలోచిత చర్యలు ప్రాణాలను హరిస్తూనే ఉన్నాయి. పాతనగరం మెయిన్‌రోడ్డులోని టౌన్‌కొత్తరోడ్డు సిగ్నల్ పాయింట్ వద్ద ఆదివారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కొందరు యువకులు మాంజా దారంతో పతంగులు ఎగురవేస్తుండగా, ఆ ఘాటైన దారం గాలిలో ఎగురుతున్న ఒక పక్షి మెడకు చుట్టుకుంది. తప్పించుకునే దారి లేక, ఆ దారం బిగుసుకుపోవడంతో ఆ పక్షి సిగ్నల్ పాయింట్ వద్దే విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచింది. దారి వెంట వెళ్లేవారు గమనించి కాపాడే లోపే ఆ మూగజీవి ప్రాణం నిశ్శబ్దంగా అనంతవాయువుల్లో కలిసిపోయింది. మనిషి ఆనందం కోసం వాడే ఒక వస్తువు, ప్రకృతిలో స్వేచ్ఛగా విహరించే పక్షికి శాపంగా మారింది. అదే వీధిలో కొద్ది దూరంలోనే సంక్రాంతి ముగ్గుల పోటీలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయి. రంగురంగుల ముగ్గులు, చిన్నారుల కేరింతలు, పండుగ కోలాహలం ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు మనిషి స్వార్థానికి బలైన ఒక పక్షి కళేబరం వేలాడుతూ కనిపించడం అక్కడి వారిని కలచివేసింది. ఆనందం, ఆవేదన ఒకే చోట దర్శనమిచ్చిన ఈ దృశ్యం మానవత్వానికే ఒక పరీక్షగా నిలిచింది. – డాబాగార్డెన్స్/ ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
గుర్తుకొస్తున్నాయి.. ఎదలోతుల్లోని..
పెందుర్తి: జ్ఞానపురంలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు 33 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఆదివారం పెందుర్తి మండలం ఎస్ఆర్ పురంలోని ఓ రిసార్ట్‌లో 1992–93 బ్యాచ్(పదో తరగతి) విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి 160 మంది విద్యార్థులకు గాను 116 మంది ఈ కార్యక్రమానికి హాజరై.. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలతో పాటు స్విట్జర్లాండ్, అమెరికా, కెనడా తదితర దేశాల్లో స్థిరపడిన వారు సైతం తరలివచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా పాఠశాల రోజుల్లో విరామ సమయాల్లో తినే స్ట్రాంగ్ బిళ్లలు, మేరీ బిస్కట్లు, మామిడి ముక్కలు, తాటి తాండ్ర, జీళ్లు, ఉసిరికాయలు వంటి చిరుతిళ్లను ఈ కార్యక్రమంలో ప్రదర్శించి, అందరూ ఆప్యాయంగా పంచుకున్నారు. తొలుత.. దివంగతులైన నాటి ప్రిన్సిపాల్ మాథ్యూ, పీడీ దాస్, ఇతర ఉపాధ్యాయులకు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆడిపాడి సందడి చేశారు. సహపంక్తి భోజనాలు చేశారు. చివరగా.. ఇన్నాళ్లకు కలిసామన్న ఆనందం, మళ్లీ దూరమవుతున్నామన్న భావోద్వేగంతో మిత్రులు ఒకరికొకరు ఆత్మీయ వీడ్కోలు పలికారు. -
సంక్రాంతి వేళ అప్పన్న దర్శన వేళల్లో మార్పులు
సింహాచలం: సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత ఆదివారం తెలిపారు. ఈ నెల 14న భోగి సందర్భంగా సింహగిరికి భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు స్వామి వారిని నీలాద్రి గుమ్మం వద్ద నుంచే దర్శించుకునేలా లఘు దర్శనం ఏర్పాటు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు పవళింపు సేవ కారణంగా దర్శనాలు ఉండవు. 16 కనుమ పండగ, 18న తెప్పోత్సవం సందర్భంగా సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు మూలవిరాట్ దర్శనం లభిస్తుంది. ఈ నెల 19న రాత్రి 7 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఆ రోజు ఆలయంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్లు ఈవో పేర్కొన్నారు. -
విశాఖలో లైట్ హౌస్ మ్యూజియం
ఏయూక్యాంపస్: దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న క్రమంలో మన మూలాలను, చరిత్రను విస్మరించకూడదని ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చా రు. ఎంజీఎం పార్క్ వేదికగా 3వ ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సోనోవాల్ ప్రసంగిస్తూ.. మారిటైం సంస్కృతి, చరిత్రలకు లైట్ హౌస్‌లు సాక్ష్యాలుగా నిలుస్తాయని అభివర్ణించారు. 5 వేల సంవత్సరాల కిందటే భారత్ సముద్ర వాణిజ్యంలో అగ్రగామిగా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దేశంలోని అత్యుత్తమ 20 కంటైనర్ పోర్టుల్లో విశాఖ పోర్ట్ ఒకటిగా నిలిచిందన్నారు. విశాఖ నగరంలో లైట్ హౌస్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, ఇక్కడి ఇండియన్ మారిటైం వర్సిటీలో ఇండియా షిప్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 75 లైట్ హౌస్‌లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దామని, అదనంగా మరో 25 లైట్ హౌస్‌లను అభివృద్ధి చేస్తామని, ఇందులో ఏపీకి చెందినవి కూడా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సోనోవాల్ తెలుగు భాషపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘తెలుగు చాలా తీయనైన, అందమైన భాష. ఇది వినడం నాకెంతో ఇష్టం’అంటూ.. మీరంతా బాగున్నారా? అని తెలుగులో పలకరించి సభికులను ఆకట్టుకున్నారు. కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి మాట్లాడుతూ.. లైట్ హౌస్‌లు కేవలం కట్టడాలు కావని, అవి ఒక నమ్మకానికి ప్రతిరూపాలని అన్నారు. ప్రాచీన వాణిజ్యం, తీరప్రాంత ప్రజల అనుబంధానికి, దేశ సార్వభౌమాధికారానికి ఇవి చిహ్నాలుగా నిలుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను మంత్రి సోనోవాల్ వర్చువల్‌గా ఆవిష్కరించారు. విశాఖ పోర్ట్ అథారిటీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్ హౌస్ అండ్ లైట్ షిప్స్ మధ్య ఒప్పంద పత్రాలను మంత్రుల సమక్షంలో మార్చుకున్నారు. ఈ ఉత్సవంలో హస్తకళలు, శిల్పకళలు, చిత్రకళలకు సంబంధించిన స్టాల్స్ కళా ప్రియులను కట్టిపడే శాయి. ప్రముఖ గాయని నహీద్ అఫ్రీన్ తన శ్రావ్యమైన గాత్రంతో ఆహూతులను అలరించారు. ‘వాక్ ఆఫ్ వేవ్స్’పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రత్యే క ఆకర్షణగా నిలిచింది. చివరగా సింగర్ సోనాలీ ఠాకూర్ బ్యాండ్ ప్రదర్శనతో ఉత్సాహం పరవళ్లు తొక్కింది. కేంద్ర ఓడరేవుల శాఖ కార్యదర్శి విజయ్ కుమార్, అదనపు కార్యదర్శి ముఖేష్ మంగల్, లైట్‌హౌస్ అండ్ లైట్ షిప్స్ డైరెక్టర్ జనరల్ మురుగానందం, విశాఖ పోర్ట్ చైర్మన్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని కోరాటి, డీసీఐ ఎండీ కెప్టెన్ దివాకర్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. -
ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి జర్నలిజం విలువలు లేవు
ఎండీ రాధాకృష్ణ, యాంకర్, డిబేట్లో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలి ఏడీసీపీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నేతలుఅల్లిపురం: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్‌కు జర్నలిజం విలువలు లేవని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై డిబేట్లు పెడుతూ, అందులో పాల్గొన్న వ్యక్తులు చులకనగా మాట్లాడుతున్న తీరును ఆయన ఖండించారు. ఏబీఎన్ చానల్ ఎండీ రాధాకృష్ణ, యాంకర్ వెంకటకృష్ణ, డిబేట్ పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పార్టీ నాయకులతో కలిసి నగర పోలీస్ కమిషనరేట్‌కి వెళ్లి అడ్మిన్, ఏడీసీపీ డాక్టర్ వి.బి.రాజ్‌కమల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఏబీఎన్ చానల్ తెలుగుదేశం కరపత్రంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్‌తో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లుతుందన్నారు. ఏబీఎన్ చానల్ యాంకర్ వెంకటకృష్ణ సభ్యసమాజం తలదించుకునేలా డిబేట్లు నిర్వహిస్తూ.. అల్లర్లు సృష్టించి.. ఆ నెపం వైఎస్సార్ సీపీపై నెట్టేయాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, అసమర్ధ పాలనతో రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ ఏబీఎన్ చానల్ చేసే పనులు రక్తపాతాన్ని సృష్టిస్తాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పడం వల్లనే కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారన్నారు. ఏబీఎన్ చానల్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ డిబేట్స్ పెట్టి ప్రజలను రెచ్చగొడుతున్న ఏబీఎన్ చానల్‌ను చూసి జర్నలిస్టులే అసహ్యించుకుంటున్నారన్నారు. డిబేట్స్‌కు వచ్చే వ్యక్తులు ఉన్నా దుల్లా మాట్లాడుతున్నారన్నారు. ఏబీఎన్ చానల్‌పై చర్యలు తీసుకోకుంటే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఎస్ఏసీ సభ్యులు బాణాల శ్రీనివాసరావు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి పల్లా దుర్గ, మంచా మల్లేశ్వరి, తాడి జగన్నాథరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, విజయ్‌చందర్, రాష్ట్ర అనుబంధ విభాగాల కార్యనిర్వాహక అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ్, చెన్నా జానికీరామ్, జి.వి.రవిరాజు, జోనల్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు అంబటి శైలేష్, ముట్టి సునీల్ కుమార్, జగదీష్ రెడ్డి, బోని శివరామకృష్ణ, కర్రి రామారెడ్డి, సనపల రవీంద్ర భరత్, రాయపురెడ్డి అనిల్‌కుమార్, వంకాయల మారుతీ, దేవరకొండ మార్కండేయులు, నీలి రవి, జీలకర్ర నాగేంద్ర, మాజీ చైర్మన్ అల్లంపల్లి రాజబాబు, ఆల్ఫా కృష్ణ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కృష్ణంరాజు నడింపల్లి, రెయ్యి డేవిడ్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రామరాజు, కార్పొరేటర్లు సాడి పద్మా రెడ్డి, శశికళ, బిపిన్ కుమార్ జైన్, కో ఆప్షన్ సభ్యుడు ఎండి షరీఫ్, పార్టీ నాయకులు పీతల గోవింద్, శ్రీనివాస్‌రెడ్డి, జక్కంపూడి సత్యనారాయణ, తుళ్లి చంద్రశేఖర్, పద్మాశేఖర్, పేర్ల విజయచంద్ర, తదితరులు పాల్గొన్నారు -
దారులనీ్న.. ఊరివైపే..
విశాఖ సిటీ: నగరం పల్లె బాట పడుతోంది. సంక్రాంతికి నాలుగు రోజుల ముందే ఊరు ఖాళీ అయిపోతోంది. ఉపాధి, ఉద్యోగాల కోసం వచ్చిన కుటుంబాలు సొంతూళ్లకు పయనమవుతున్నాయి. పెద్ద పండగకు ముందే సెలవులు రావడంతో జనాలు అప్పుడే బస్సులు, రైళ్లు ఎక్కేస్తున్నారు. దీంతో ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వీటితో పాటు విమాన సర్వీసులు కూడా ఫుల్ అయిపోతున్నాయి. ప్రధానంగా పండగ తర్వాత తిరుగుపయనాల సమయాల్లో టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి. సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకునేందుకు బస్సుల నుంచి విమానాల వరకు అన్ని టికెట్లు ధరలు విపరీతంగా పెంచేశారు. అయినప్పటికీ టికెట్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. 21వ తేదీ వరకు ఫుల్ రైళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. వాల్తేరు డివిజన్ 18 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అలాగే దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఈ ప్రత్యేక రైళ్ల టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడయిపోయాయి. ఈ నెల 21వ తేదీ వరకు రైళ్లు ఫుల్ అయినట్లు తెలుస్తోంది. విశాఖ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి విశాఖ మీదుగా వెళ్లే రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రత్యేక రైళ్లు వేసినప్పటికీ అవి సరిపడని పరిస్థితి కనిపిస్తోంది. వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత కనిపిస్తోంది. విమాన టికెట్లకు గిరాకీ బస్సు, రైళ్లు కిటకిటలాడుతుండడంతో ప్రయాణికులు విమాన సర్వీసుల వైపు మల్లుతున్నారు. దీంతో విమాన సర్వీసులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చే విమాన టికెట్ ధర ఏకంగా రూ.10,800 వరకు ఉండడం గమనార్హం. విశాఖ విమానాశ్రయం నుంచి నిత్యం 60 విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణంగా రూ.3,800 నుంచి రూ.4,300 వరకు ఉండే ధర.. పండగ సందర్భంగా రెండు, మూడింతలు పెంచేశారు. ఆ తర్వాత రోజుల్లో కూడా ప్రస్తుతానికి రూ.6100 నుంచి రూ.6,500 వరకు ఉంది. మరో ఒకటి, రెండు రోజుల్లో డిమాండ్‌ను బట్టి వీటి ధరలు కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. దేశీయ విమాన టికెట్ల ద్వారా సింగపూర్, అబుదాబి(దుబాయ్) టికెట్ల కూడా డిమాండ్ పెరిగింది. వీటి ఆక్యుపెన్సీ కూడా 80 శాతం దాటుతోంది. తిరుగు ప్రయాణాల ఎక్కువగా ఉండే 17, 18, 19 తేదీల్లో టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. సంక్రాంతి సందర్భంగాపల్లె బాట పట్టిన నగరం కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రత్యేక బస్సులు సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఆర్టీసీ, రైల్వే అధికారులు ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీ ఈ సారి ఏకంగా 1,007 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. సాధారణ రోజుల్లో విశాఖ రీజియన్ నుంచి నిత్యం 1,100 వరకు ఆర్టీసీ సర్వీసులు ఇతర జిల్లాలకు రాకపోకలు సాగిస్తుండగా.. ఈ ఏడాది వీటికి అదనంగా మరో 1,007 బస్సులు ఏర్పాటు చేసింది. విజయవాడ, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, భీమవరం తదితర దూరప్రాంత బస్సులతో పాటు విజయనగరం, రాజాం, పాలకొండ, పార్వతిపురం, శ్రీకాకుళం, సోంపేట, ఇచ్చాపురం తదితర ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాలకు ముందస్తు బుకింగ్‌లతో ఫుల్ అయిపోతున్నాయి. ఆర్టీసీతో పాటు ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఈ సంక్రాంతిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు ఫుల్ అయిపోతుండడంతో అనేక మంది ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో విశాఖ–హైదరాబాద్ స్లీపర్ ఇప్పటి వరకు రూ.1600 నుంచి రూ.1800 ఉండగా.. పండగ సందర్భంగా కొందరు ప్రైవేట్ ఆపరేటర్లు రూ.3,200 నుంచి రూ.3,500 వరకు పెంచేశారు. -
బాలల హక్కుల రక్షణకు కలిసి పనిచేయాలి
అల్లిపురం: బాలల రక్షణ చట్టాలను సమర్థంగా అమలు చేయడానికి పోలీసు, న్యాయవ్యవస్థ, పౌర సమాజం మధ్య బలమైన సమన్వయం అవసరమని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. నగర పోలీస్ కమిషనరేట్, వాసవ్య మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో నగర పోలీస్ సమావేశ మందిరంలో శనివారం ‘పోక్సో చట్టం–బాలల రక్షణ చర్యల బలోపేతం’అనే అంశంపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోక్సో చట్టం అమలు వ్యూహాలపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ‘మనం ఒంటరిగా మైలురాళ్లను మాత్రమే సాధించగలం.. కానీ అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే బాధితులకు న్యాయం, రక్షణతో కూడిన భవిష్యత్తును అందించగలం’ అని పిలుపునిచ్చారు. బాలల హక్కుల పరిరక్షణలో భాగస్వామ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ.. కోర్టు విచారణ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లు, సాక్ష్యాల సేకరణలో ఇబ్బందులు, విధానపరమైన జాప్యం వంటి అంశాలను వివరించారు. సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం : ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల కనీస అవగాహన పెంచుకోవాలని నగర పోలీస్ కమిషనర్, విశాఖ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. శనివారం వీసీఎస్ ఆధ్వర్యంలో ప్రో–విజిల్ సంస్థలో సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ బాగ్చి మాట్లాడుతూ సాంకేతికతతో ముడిపడి ఉన్న నేటి ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఉద్యోగులు తమ డిజిటల్ భద్రత కోసం వ్యక్తిగత, వృత్తిపరమైన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అన్నారు. ఏదైనా సైబర్ నేరం జరిగి తే, బాధితులు 1930కు కాల్ చేయాలని సూచించారు. అసోసియేట్ డైరెక్టర్ సీమా సిక్రి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో కార్పొరేట్ సంస్థల కోసం మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. విశాఖలోని ఐటీ కమ్యూనిటీ భద్రతకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో కీలకమని సైబర్ సెక్యూరిటీ జాయింట్ సెక్రటరీ కిశోర్ దాసరి అభిప్రాయపడ్డారు. -
బ్రొకలికి మంచి డిమాండ్
మాది కోటపాడు మండలం, సంతపాలెం. మా పొలంలో పండించిన పంటలను దశాబ్దాలుగా ఎంవీపీ రైతు బజార్లో విక్రయిస్తున్నాను. సాధారణ పంటలతో ఆదాయం అంతంతమాత్రంగా ఉండటంతో పాటు సీజనల్‌గా రైతులంతా ఒకేసారి అధికంగా ఉత్పత్తి చేస్తుండటంతో భారీగా నష్టాలను చవిచూస్తున్నాను. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కొంత భిన్నంగా ముందుకు సాగాలనుకున్నాను. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న బ్రొకలిని పండించేందుకు నడుంకట్టాను. గత కొన్నేళ్లుగా నాకున్న పొలంలోని 80 సెంట్లలో బ్రొకలి పండిస్తున్నాను. మంచి దిగుబడి సాధించే దిశగా నిపుణుల సలహాలు తీసుకున్నాను. ప్రస్తుతం 80 సెంట్లలో టన్ను వరకు దిగుబడి సాధిస్తున్నాను. బ్రొకలిలో పోషక విలువలు పుష్కలంగా ఉండటంతో వినియోదారుల నుంచి డిమాండ్ ఉంది. బయట మార్కెట్లో దీని ధర కేజీ రూ.200 ఉండగా రైతు బజార్లో రూ.80కి విక్రయిస్తున్నాం. దీని ద్వారా ఏటా రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తోంది. కాలీప్లవర్ సాగుతో రూ.లక్ష ఆదాయం వస్తే, అదే విస్తీర్ణంలో బ్రొకలితో రూ.2లక్షలు ఆదాయం వస్తోంది. దీంతో రానున్న రోజుల్లో మరింత విస్తీర్ణంలో పంట సాగుచెయ్యాలని భావిస్తున్నాను. – బొట్టా అప్పారావు, రైతు సంతపాలెం -
ఇద్దరు బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
విశాఖ సిటీ: అక్రమంగా బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు మోసగాళ్లను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన మాకిరెడ్డి రాంబాబు(40), మోదిన సత్యహేమ సుబ్రమణ్యమూర్తి(33) అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు మహదేవ్ బుక్, ఇండీబెట్లను నిర్వహించడంతో పాటు ఆడుతున్నట్లు గుర్తించారు. క్రికెట్ బెట్టింగ్ వెబ్సైట్లలో కమీషన్ కోసం అమాయక ప్రజలకు మంచి లాభాలు వస్తాయని డబ్బు ఆశ చూపించి బెట్టింగ్ ఆడేలా ప్రేరేపిస్తున్నట్లు తెలుసుకున్నారు. సాంకేతికత సహాయంతో వారిపై నిఘా పెట్టి పట్టుకున్నారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. వారి నుంచి క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలకు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
పేదల జోలికొస్తే పోరాటం తప్పదు
బీచ్‌రోడ్డు: నగరంలోని మురికివాడల్లో నివాసం ఉంటున్న పేదలు కదం తొక్కారు. ఎక్కడి మురికివాడలను అక్కడే అభివృద్ధి చేయాలని నినదించారు. నివాస హక్కుల పోరాట దినం సందర్భంగా మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం చలో జీవీఎంసీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డీఆర్ఎం కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ కళాకారులు తమ ఆటపాటలతో ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. మురికివాడల ప్రజలపై వివక్ష తగదని, పాలకుల, అధికారుల నిర్లక్ష్యం నశించాలంటూ నినదించారు. అనంతరం జరిగిన మహా ధర్నాలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి మాట్లాడుతూ.. మురికివాడ అభివృద్ధి చట్టం–1956 ప్రకారం స్లమ్స్‌ను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడి వారికి అక్కడే ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. 2012లో పేదలు నివాసాల కోసం పెద్ద ఎత్తున పోరాడి హక్కులు సాధించుకున్నారని, ఆ పోరాటా న్ని అణచివేయడం పాలకుల తరం కాలేదని గుర్తుచేశారు. సమస్యలను పరిష్కరించకపోతే మరోసారి నాటి ఘటనలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఎం.శరత్ మాట్లాడుతూ.. పేదలు నివాసం ఉంటున్న భూములను లాగేసుకునే కుట్రలో భాగంగానే తరలింపు, తొలగింపు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు రమణమూర్తి, న్యాయవాది గిరిధర్, భీమ్ సేన ప్రధాన కార్యదర్శి డాక్టర్ వసంత రాజేంద్రప్రసాద్, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.శ్రీరామ్మూర్తి, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్ సుర్ల వెంకటరమణ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, వై.కొండయ్య, న్యాయవాదులు పల్లెటి అప్పారావు, కె.పద్మ, పలు సంఘాల నాయకులు అనురాధ, వై.నూకరాజు, జీడి సారయ్య, ఏపీబీఎస్పీ లక్ష్మి, యు.వెంకటేశ్వర్లు, నిర్మల, బాలనాగమ్మ, ఈసర లక్ష్మి, గోపాలం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రైతు కార్డ్ లేనివారికీ అవకాశం
సీజనల్ పంటలే కాకుండా మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు పండించాలని రైతులకు సూచిస్తున్నాం. జిల్లా హార్టికల్చర్ విభాగం ఈ దిశగా పెద్ద ఎత్తున వారికి అవగాహన కల్పిస్తోంది. ప్రస్తుతం చాలా మంది రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు పండించి రైతు బజార్లలో విక్రయించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇలాంటి పంటలు పండించే అర్హతున్న రైతులు ఎవరైనా వారి పంటను నగర రైతు బజార్లలో విక్రయించుకునే అవకాశం కల్పిస్తాం. రైతు బజార్ కార్డ్‌హోల్డర్ కానప్పటికీ ఈ సేవలను వారు వినియోగించుకోవచ్చు. అవసరమైతే వారి పంటను పూర్తిస్థాయిలో పరిశీలించి వారికి రైతు బజార్లో విక్రయాల కోసం కార్డ్ మంజూరు చేయడం కూడా జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇలాంటి రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస కిరణ్, డీడీ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రోత్సాహానికి కృషిచేస్తున్నాం పోషక విలువలు, అధిక ఆదాయం లభించే పంటలు పండించే దిశగా విశాఖ రైతులను నిత్యం ప్రోత్సహిస్తున్నాం. విశాఖ గ్రామీణ జిల్లాకు సంబంధించి పద్మనాభం, భీమిలి మండలాల్లో నిత్యం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆసక్తి గల రైతులు ఇంట్లో, ఇంటి ఆవరణలో కూడా కొన్ని పంటలను పండించవచ్చు. పోషక పంటలకు తక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు అనుకూలం. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల అఽధికారుల సమన్వయంతో మన్యం రైతుల్లో అవగాహన పెంచే దిశగా కృషిచేస్తున్నాం. ఇలాంటి పంటలు పండించేందుకు ఆసక్తి గల రైతులను గుర్తించాలని ఇప్పటికే నగరంలోని రైతుబజార్ల ఈవోలకు సూచించడం జరిగింది. వారి నుంచి కూడా వివరాలు తీసుకుంటాం. రానున్న రోజుల్లో ఇలాంటి పంటలు పండించే రైతుల ప్రోత్సాహానికి మరింత కృషి చేస్తాం. – బి.శ్యామల, ఏడీ, జిల్లా హార్టికల్చర్ విభాగం -
పరిజ్ఞానంతో పాటు ఫలితాలు కీలకం
ఎంపీ శ్రీ భరత్ బీచ్‌రోడ్డు: నేటి ప్రపంచంలో కేవలం సిద్ధాంత పరిజ్ఞానం లేదా మంచి ఉద్దేశాలు ఉంటే సరిపోదని, వాటి ద్వారా వచ్చే ఫలితాలే అత్యంత కీలకమని ఎంపీ శ్రీభరత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏస్టీపీఐ సహకారంతో ఏపీ డిజిటల్ టెక్నాలజీ పరిశ్రమల నెట్వర్క్(ఏపీడీటీఐ) ఆధ్వర్యంలో ‘ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమిట్ 26’, ‘ఏపీ ఇన్నోవేటర్స్ సమ్మిట్ 26’ శుక్రవారం వీఎంఆర్డీఏ చిల్ట్రన్స్ ఎరీనాలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బియాండ్ ఆటోమేషన్: ది ఇంటెలిజెంట్ ఎరా’అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సదస్సులో ఐటీ, ఏఐ, డీప్‌టెక్ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా చర్చలు సాగుతాయన్నారు. ఏఐ వంటి సాంకేతిక విప్లవం కారణంగా ప్రపంచం వేగంగా మారుతోందని, ఈ మార్పులకు అనుగుణంగా మనం నిరంతరం నేర్చుకుంటూ ఉండాలని పిలుపునిచ్చారు. సమయాన్ని ఒక విలువైన కరెన్సీలా భావించాలని సూచించారు. అధ్యాపకులు ఎప్పటికప్పుడు పారిశ్రామిక మార్పులను గమనిస్తూ, తమను తాము అప్డేట్ చేసుకోవాలన్నారు. ఏపీడీటీఐ చైర్మన్ శ్రీధర్ కోసరాజు మాట్లాడుతూ జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐల రాకతో పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయన్నారు. ఇవి కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా, స్వయంగా ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకుంటూ లక్ష్యాలను చేరుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఎస్టీపీఐ డైరెక్టర్ సి.కవిత, హెచ్‌సీఎల్ టెక్ ప్రతినిధి చెరుకూరి కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రోత్సహిస్తే ఆదాయార్జనే..!
ఎంవీపీకాలనీ : సీజనల్ పంటలతో కనీస ఆదాయం లభించక రైతులు భారీగా నష్టాలను చవిచూస్తున్నారు. టమాట, ఉల్లి, బంగాళాదంపలు, వంగ, మిరప వంటి సాధారణ పంటల ధరలు ఏటా సీజనల్‌గా పతనం కావడం వారిని ఆర్థికంగా కుంగదీస్తోంది. ఆయా పంటలను పండించేందుకు భారీగా పెట్టుబడులు పెడుతునప్పటికీ ధరల పతనం నష్టాలను తెచ్చుపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకున్న కొందరు రైతులు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. సాధారణ పంటలను పక్కనబెట్టి మార్కెట్ డిమాండ్‌తో పాటు ఆదాయాన్ని తెచ్చేపెట్టే పోషక పంటలవైపు దృష్టిసారిస్తున్నారు. నగర వాసులకు పోషక ఆహారాన్ని అందుబాటులోకి తెస్తూనే లాభాలను ఆర్జిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే భారీ విస్తీర్ణంలో పంటల ఉత్పత్తి చేపట్టి మరిన్ని అద్భుతాలు సాధిస్తామంటున్నారు. ప్రోత్సహిస్తే మరింత దిగుబడి మాది పెందుర్తి మండలం పెదగాడి. గత కొన్నేళ్లుగా అక్కయ్యపాలెం రైతు బజార్లో ఆర్గానిక్ మష్రూమ్స్ (పుట్టగొడుగులు) విక్రయిస్తున్నాను. ఇతర పంటల కంటే ఈ పంట విధానం భిన్నంగా ఉంటుంది. మార్కెట్లో మంచి డిమాండ్‌తో పాటు ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉండటంతో మంచి ఆదాయం కూడా లభిస్తోంది. ప్రస్తుతం 220 గజాల విస్తీర్ణంలో మష్రూమ్స్ పండిస్తున్నాం. తొలుత వరిగడ్డిని నానబెట్టి తరువాత స్పాన్ (పుట్టగొడుగుల విత్తనాలు) కలిపి సంచుల్లో నింపి చీకటి ప్రదేశంలో ఉంచాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత 22 నుంచి 25 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి. సరైన తేమ, గాలి ప్రసరణ ఉండాలి. ఇలా 25 రోజులు నిల్వచేసిన అనంతరం పంట లభిస్తుంది. అయితే ఈ విధానం ద్వారా ప్రస్తుతం మేము వారానికి 40 కేజీల మష్రూమ్స్ దిగుబడి తీస్తున్నాం. ఒక సీజన్లో 750 కేజీల వరకు దిగుబడి వస్తోంది. ప్రస్తుతం రైతు బజార్లో కేజీ మష్రూమ్స్ రూ.400లకు విక్రయిస్తుండగా బయట మార్కెట్లో దీని ధర కేజీ రూ.600 పైనే పలుకుతోంది. అయితే పంట సమయంలో ప్రభుత్వం రుణ సహాయంతో పాటు నాణ్యమైన విత్తనాలు, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తే మరింత దిగుబడి సాధించే దిశగా అడుగులు వేస్తాం. – ముసల్ల నాయుడు, రైతు పెదగాడి -
ఆటో ఢీకొని వ్యక్తి మృతి
పీఎం పాలెం: రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఇందుకు సంబంధించి పీఎం పాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కొరపుకృష్ణాపురం గ్రామానికి చెందిన ముగడ సింహాచలం(65) మధురవాడ ధర్మపురికాలనీలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య అప్పలనారాయణ నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లింది. అతడు గురువారం రాత్రి 9 గంటల సమయంలో భోజనం చేయడానికి హోటల్‌కు కాలినడకన బయలుదేరాడు. కారుషెడ్ కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొనగా తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. మృతుని భార్య అప్పలనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
‘కూటమి వైఫల్యాలను ఎండగడతాం’
మహారాణిపేట: అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించి, వారి హృదయాలను గెలుచుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ప్రజలున్నారని వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం(ఉత్తరాంధ్ర జోన్–1) వర్కింగ్ ప్రెసిడెంట్ జి.వి.రవిరాజు అన్నారు. శుక్రవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై విశ్వాసం ఉంచి ఉత్తరాంధ్ర జోన్–1 ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మేలును, ప్రజాహిత నిర్ణయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని రవిరాజు స్పష్టం చేశారు. పార్టీ విధానాలు, సిద్ధాంతాలను సమర్థవంతమైన ప్రచార వ్యూహాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో ప్రచార విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అనంతరం ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీవత్సవ్, జిల్లా ప్రచార విభాగ అధ్యక్షుడు జీలకర్ర నాగేంద్ర, దల్లి రామకృష్ణ రెడ్డి, కోతకాల కుమార్, బొడ్డేటి మహేష్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
నడకకు వెళ్లి.. అనంతలోకాలకు..
జీవీఎంసీ వాహనం ఢీకొని వృద్ధుడి మృతి ఆరిలోవ: ఓ వృద్ధుడు ఉదయం వాకింగ్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా జీవీఎంసీ చెత్త తరలించే వాహనం ఢీకొని మృతి చెందారు. ఈ విషాద ఘటన శుక్రవారం ఆరిలోవలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 10వ వార్డు శ్రీకాంత్‌నగర్‌లో నివాసముంటున్న మజ్జి రామారావు (66) రోజూ బీఆర్టీఎస్ రోడ్డులో ముడసర్లోవ వైపు వాకింగ్‌కు వెళ్తుంటారు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం వాకింగ్ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా.. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఎదురుగా జీవీఎంసీ చెత్త వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిన రామారావు తలకు తీవ్ర గాయమై, అధిక రక్తస్రావం జరగడంతో మృతి చెందారు. వాహన డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి భార్య రమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రామారావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటి పెద్ద మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
లెట్యూస్‌తో మంచి రాబడి
మాది అరకు నియోజకవర్గంలోని దేముడువలస. గత పదేళ్లుగా ఎంవీపీ రైతు బజార్లో కూరగాయలు విక్రయిస్తున్నాను. గత కొన్నేళ్లుగా కేబేజీ పంటను పండిస్తున్నాం. అయితే ఆదాయం అంతంతమాత్రంగా ఉండటంతో నష్టాలను చవిచూస్తున్నాం. దీంతో మార్కెట్లో డిమాండ్ ఉన్న లెట్యూస్ పండించాలని నిర్ణయించాను. ఇది మంచి పోషక విలువలు ఉన్న ఆకుకూర పంట కావడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. విటమిన్ ఏ, విటమిన్ కే లు పుష్కలంగా ఉండటంతో పోషకాహారం కోరుకునే వినియోగదారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. రెస్టారెంట్లలో శాండ్విచ్లు, సూప్‌లు, బర్గర్లలో కూడా విరివిగా దీన్ని వాడుతుండటంతో బయట మార్కెట్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. దీంతో 30 సెంట్లలో ఈ పంట పండించగా ఏడాదికి 1/2 టన్ను దిగుబడి వస్తోంది. రైతు బజార్లో లెట్యూస్ కేజీ ధర రూ.80కి విక్రయిస్తుండగా బయట మార్కెట్లో దీని ధర కేజీ రూ.200లకు పైగా పలుకుతోంది. దీంతో మూడేళ్లుగా పండిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాను. రానున్న రోజుల్లో మరింత విస్తీర్ణంలో లెట్యూస్ పండించి మార్కెట్ చేయాలని భావిస్తున్నాను. – పాంగి గోపినాథ్, రైతు అరకు -
వైఎస్సార్టీయూసీ క్యాలెండర్ ఆవిష్కరణ
సింథియా: హిందుస్థాన్ షిప్‌యార్డ్ వైఎస్సార్టీయూసీ నూతన సంవత్సర పాకెట్ క్యాలెండర్‌ను ఎంపీ గొల్ల బాబూరావు శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం క్యాలెండర్లను యూనియన్ నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. షిప్‌యార్డ్ మినీరత్న స్థాయికి ఎదగడంలో యాజమాన్యం, కార్మికుల కృషిని అభినందించారు. కార్మిక సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ముఖ్యంగా ఎల్‌అండ్‌ఎం సిరీస్ కార్మికుల సమస్యలపై త్వరలోనే షిప్‌యార్డ్ ఉన్నతాధికారులతో చర్చిస్తానని, వారిని పర్మినెంట్ చేసే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రెగ్యులర్ ఉద్యోగుల ప్రమోషన్లు, కార్మికులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై యాజమాన్యంతో మాట్లాడతానని తెలిపారు. షిప్‌యార్డ్ అభివృద్ధికి వైఎస్సార్సీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో షిప్పింగ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉన్న హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ను, రక్షణ శాఖ పరిధిలోకి తీసుకురావడంలో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన కృషిని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్టీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
సంక్రాంతి.. సంస్కృతికి ప్రతీక
మద్దిలపాలెం: పాతను వదిలి కొత్తను ఆహ్వానించే సంక్రాంతి మన వేద సంస్కృతికి నిదర్శమని.. పాశ్చాత్య జీవన శైలిని వదిలి మన భారతీయ జీవన శైలిని అలవర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ‘మహా సంక్రాంతి’ సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు హాజరైన ఆయన మాట్లాడుతూ సంక్రాంతి కేవలం పండగ మాత్రమే కాదని, అది తెలుగు రైతుల జీవనరేఖ అని కొనియాడారు. వ్యవసాయం వైపు యువతను మరలిద్దాం.. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత పెంచి, రసాయనాల వాడకాన్ని విడనాడుదాం.. వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పుల కోసం ప్రయత్ని ద్దామని పిలుపు నిచ్చారు. మాతృభాష కంటి చూపు వంటిదని, పరాయి భాష కేవలం కళ్లజోడు వంటిదని వ్యాఖ్యానించారు. భారత ఎగుమతులపై 500 శాతం సుంకం విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి స్వయం సమృద్ధి కార్యక్రమాలే సరైన మార్గమని చెప్పారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం గర్వకారణమని అన్నారు. మాజీ ఎంపీ జి.వి.ఎల్. నరసింహారావు, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఏయూ వీసీ రాజశేఖర్, ఎస్బీఐ డీజీఎం రాహుల్ సంకృతియ పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు -
24 నుంచి విశాఖ ఉత్సవ్
మహారాణిపేట: విశాఖ వైభవాన్ని చాటిచెప్పేలా ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ‘విశాఖ ఉత్సవ్’ను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. శుక్రవారం కలెక్టర్ట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన ఏర్పాట్లపై సమీక్షించారు. ఇదే సమావేశంలో వర్చువల్‌గా భాగస్వామ్యమైన హోంమంత్రి అనిత పలు అంశాలపై సూచనలు చేశారు. వేడుకలను వైభవంగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ ఈనెల 24, 25వ తేదీల్లో అనకాపల్లి జిల్లాలో, 26 నుంచి 31వ తేదీ వరకు విశాఖ, అల్లూరి జిల్లాలో ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఫిబ్రవరి 1న ఆదివారం కావడంతో ప్రత్యేకంగా అరకులో ఉత్సవాలను కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు సమన్వయంగా ఏర్పాట్లు చేయాలన్నారు. విశాఖలో భీమిలి, రుషికొండ, సాగర్‌నగర్, ఆర్కే బీచ్ తదితర ఎనిమిది ప్రాంతాల్లో ఉత్సవాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో జనవరి చివరి నాటికి పాత వ్యర్థాలు పూర్తిగా తొలగించాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించామన్నారు. అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించుకోవాలన్నారు. మహిళల భద్రత కోసం నగరాన్ని చీకటి ప్రాంతాలు లేని ‘ఇల్యుమినేషన్ సిటీ’గా మార్చాలని సూచించినట్లు తెలిపారు. విశాఖ పోర్టు నుంచి బొగ్గు, ఇతర ముడి పదార్థాల రవాణా సమయంలో కాలుష్యం వ్యాపించకుండా.. టార్పాలిన్లతో కప్పి ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేవీ ఎమ్యునిషన్ వర్క్‌షాప్‌నకు శంకుస్థాపన
సాక్షి, విశాఖపట్నం : తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి సంబంధించిన ఆయుధ సంపత్తి నిర్వహణకు అవసరమైన వర్క్‌షాప్ నిర్మాణానికి విశాఖలో కీలక అడుగు పడింది. ఎన్ఏడీ జంక్షన్‌లోని నేవల్ ఆర్మ్డ్ డిపో ఆవరణలో ఈ వర్క్‌షాప్‌ని నిర్మించేందుకు ఈఎన్సీ చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ ఆపరేషన్స్ రియర్ అడ్మిరల్ మనోజ్ ఝా శుక్రవారం శంకుస్థాపన చేశారు. భారత నౌకాదళ చరిత్రలో ఎమ్యునిషన్ వర్క్‌షాప్‌ని అత్యాధునిక భద్రత సాంకేతికతతో నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వర్క్‌షాప్ పూర్తయిన తర్వాత.. తూర్పు నౌకాదళంతో పాటు ఇండియన్ నేవీ భద్రతా ప్రమాణాలు, ఆయుధ సంపత్తి నిల్వ సంసిద్ధత, లాజిస్టిక్ వ్యవహారాల్లో గణనీయ మార్పులు చోటుచేసుకోనున్నాయని రియర్ అడ్మిరల్ మనోజ్ ఝా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఏడీ అధికారులు పాల్గొన్నారు. -
సాగర తీరాన భారతీయ కళా వైభవం
ఏయూక్యాంపస్: విశాఖ సాగర తీరాన భారతీయ కళల గొప్పదనాన్ని చాటిచెప్పేలా లైట్‌హౌస్ ఫెస్టివల్ శుక్రవారం కనులపండువగా ప్రారంభమైంది. బీచ్‌రోడ్డులోని ఎం.జి.ఎం పార్క్ వేదికగా నిర్వహిస్తున్న రెండు రోజుల మూడవ భారతీయ లైట్‌హౌస్ ఫెస్టివల్‌ను కేంద్ర పోర్టు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్‌తో కలిసి పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రోడ్డు మార్గం కంటే సముద్రయానం ప్రాచీనమైనదని, వీటిలో ఓడరేవులు, లైట్ హౌస్‌లు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయన్నారు. దేశ ప్రజలు ముందుగా దేశీయంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని, ఇండియా టూరిజంను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఉన్న 205 లైట్ హౌస్‌ల్లో 75ను అభివృద్ధి చేసి లైట్ హౌస్ టూరిజంను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా ఏపీలో 110 కార్యక్రమాలను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఎకో, అడ్వెంచర్, క్రూజ్ టూరిజంను ప్రారంభించామన్నారు. టెంపుల్ టూరిజం సైతం బాగుందని, పర్యాటక రంగం ఉపాధి అవకాశాలను పెంచుతోందన్నారు. ఉత్సవంలో భాగంగా మణిపూర్ (పుంగ్ చోళం), అరుణాచల్ ప్రదేశ్ (గాలో డ్యాన్స్), మిజోరం (చెరావ్), త్రిపుర (సంగ్రైన్), మేఘాలయ (వంగలా), నాగాలాండ్ (కబూయి), సిక్కిం (మరౌని), అస్సాం (బిహు) జానపద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన హస్తకళలు, సంప్రదాయ వస్త్రాలు, చెక్క బొమ్మలు, చిత్రకళ, వివిధ రకాల ఆహార పదార్థాల స్టాల్స్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ స్టాల్స్‌ను కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ ప్రారంభించి తిలకించారు. అనంతరం ప్రదర్శనను వీక్షించడానికి వచ్చిన పాఠశాల విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో పోర్టు ట్రస్ట్ చైర్మన్ అంగముత్తు, డీజీఎల్‌ఎల్ ఎన్.మురుగానందన్, ఎంపీ సీఎం రమేష్, మేయర్ పీలా శ్రీనివాస రావు, ఎమ్మెల్యేలు వంశీ కృష్ణ, పి.విష్ణుకుమార్ రాజు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆకట్టుకుంటున్న లైట్‌హౌస్ ఫెస్టివల్ -
వెరీ పిటీ!
పోర్టు ఐటీ..సాక్షి, విశాఖపట్నం: కొద్ది నెలల కిందట వరకు మేజర్ పోర్టులతో పోటీ పడుతూ ప్రగతి పథంలో సాగిన విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ).. ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇన్చార్జి చైర్మన్ పాలన, కీలకమైన ఉన్నతాధికారుల నియామకంలో జాప్యం కారణంగా పోర్టు పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. ఇదే సమయంలో పోర్టు ఐటీ విభాగంలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయి, పరస్పర ఫిర్యాదుల పర్వం మొదలైంది. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ చైర్పర్సన్ ఐటీ విభాగం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. గాడి తప్పిన పరిపాలన విశాఖ పోర్టులో పరిపాలన గాడి తప్పింది. పాలన సాగించాల్సిన కీలక అధికారులు బదిలీ కావడంతో కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రస్తుతం పోర్టు ఇన్చార్జి చైర్మన్‌గా ఉన్న డా. అంగముత్తు.. తన సమయాన్ని సింహభాగం ముంబయి పోర్టు చైర్మన్ బాధ్యతలకే కేటాయిస్తున్నారు. దీంతో ఇక్కడ పర్యవేక్షణ లోపించింది. ఇటీవలే డిప్యూటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన రోష్ని అపరాంజి, విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ పోర్టు వ్యవహారాలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐటీ విభాగంలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు బట్టబయలయ్యాయి. ఐటీ వింగ్‌లో పలువురు అధికారుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని, కొందరు అధికారుల హోదాను అడ్డం పెట్టుకుని కింది స్థాయి సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత పనులకు అప్రెంటిస్‌లు పోర్టులో అప్రెంటిస్‌గా చేరిన వారిని ఐటీ విభాగంలోని కొందరు అధికారులు తమ సొంత పనులకు వాడుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు అధికారుల మధ్య విభేదాలు ముదరడంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని సమాచారం. ఓ ఐటీ అధికారి అయితే ఏకంగా ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేయడమే కాకుండా, వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల డిప్యూటీ చైర్పర్సన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ అధికారులు కాన్ఫరెన్స్ హాల్లోనే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ పోర్టు పరువు తీశారన్న విమర్శలున్నాయి. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ చైర్పర్సన్.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఐటీ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఓ అధికారిని తక్షణం ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసినట్లు తెలిసింది. అయితే, సదరు అధికారి తప్పేమీ లేదని, ఐటీ విభాగం అంతా గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటున్నారని మరికొందరు వాదిస్తున్నారు. కేవలం సొంత ప్రయోజనాలపైనే దృష్టి సారించి, పోర్టు వ్యవహారాలను పక్కన పెట్టేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల కొరత కారణంగా ఫైళ్లు ముందుకు కదలక, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. వీలైనంత త్వరగా విభాగాధిపతులను నియమించి, పోర్టును తిరిగి గాడిలో పెట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. -
విశాఖపై కాలుష్యం పడగ
డీఆర్సీ సమావేశంలో ప్రజాప్రతినిధుల ఆందోళన మహారాణిపేట: అందమైన విశాఖ నగరాన్ని కాలుష్యం కమ్మేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో నగర ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, దీని నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు కోరారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన జిల్లా సమీక్ష మండలి(డీఆర్సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కాలుష్య నియంత్రణ, మౌలిక వసతుల కల్పనపై విస్తృతంగా చర్చించారు. గాలి నాణ్యతపై ఆందోళన సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దక్షిణ నియోజకవర్గంలో కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని, తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. రూ.4 కోట్లకు పైగా జరిమానా: కలెక్టర్ దీనిపై స్పందించిన కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణకు ఇప్పటికే పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. పరిశ్రమలు, లేబర్, రెవెన్యూ శాఖలతో ప్రత్యేక కమిటీ వేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన సంస్థలకు ఇప్పటికే రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు జరిమానా విధించామన్నారు. నగరంలో 10 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కేంద్రాలు ఉన్నాయని, అయితే ద్వారకానగర్ కేంద్రం మాత్రమే జాతీయ స్థాయికి అనుసంధానమై ఉండటంతో.. అక్కడి డేటా ఆధారంగా పొల్యూషన్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని వివరించారు. పెట్రోల్ బంకుల్లో నాణ్యత పరీక్షలు, బొగ్గు రవాణా వాహనాలపై నిఘా ఉంచామని తెలిపారు. కాలం చెల్లిన వాహనాలను తనిఖీ చేసేలా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టామని వివరించారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి కావాలి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమయ్యే నాటికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న విశాఖలో మౌలిక వసతులు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని సూచించారు. ఇదే అంశంపై ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ.. రోడ్ల పనులు పూర్తి కాకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అధికారులకు మంత్రి ఆదేశాలు ● నగరంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మద్యం సేవించే విధులకు హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ● ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలి. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి, మాతా శిశు మరణాలను తగ్గించాలి. ● 22–ఎ భూములు, రీ–సర్వే, గ్రామాల్లో పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలి. ● పోలవరం నీరు అందుబాటులోకి వచ్చే నాటికి నిల్వ సామర్థ్యాలు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ● దబ్బందలో పెండింగ్‌లో ఉన్న 120 మీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. ● కొండవాలు ప్రాంతాల్లో సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలి. ● గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి. రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి. శానిటేషన్ వర్కర్లగా హిజ్రాలు జీవీఎంసీ పరిధిలో ఇప్పటికే పారిశుధ్య పనులు చేస్తున్న ఐదుగురు హిజ్రాలకు శానిటేషన్ వర్కర్లుగా మంత్రి అధికారిక అనుమతులు జారీ చేశారు. తమకు అధికారిక గుర్తింపు లభించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, గాదె శ్రీనివాసులు నాయుడు, మేయర్ పీలా శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, డీసీపీ మేరీ ప్రశాంతి, ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాథూర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులు నగరంలోని పలు పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వ విప్ గణబాబు కోరారు. గోపాలపట్నం తహసీల్దార్ కార్యాలయానికి భవనం లేదా స్థలం కేటాయించాలన్నారు. కోర్టు కేసుల విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు. ఉత్తర నియోజకవర్గంలోని పాఠశాలలకు ప్రహరీలు, లైట్లు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. దక్షిణ నియోజకవర్గంలో కొత్త రైతు బజారు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కోరారు. జ్ఞానాపురం మార్కెట్‌కు అదనపు స్థలం కేటాయించాలన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు కోరారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల విషయంలో భూములు కోల్పోయిన రైతులతో అధికారులు మాట్లాడాలని సూచించారు. -
తప్పుడు కేసులు పిరికిపంద చర్య
బీచ్‌రోడ్డు: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తే, వారి గొంతు నొక్కేలా తప్పుడు కేసులు పెట్టి బెదిరించడం పిరికిపంద చర్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు విమర్శించారు. విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ, శుక్రవారం వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ముందుగా గాంధీ విగ్రహానికి కె.కె.రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, విద్యార్థి సంఘాలపైన, వైఎస్సార్ సీపీ నాయకులపైన దాడులు, హత్యలు చేస్తూ ఆరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. హామీలను నెరవేర్చేందుకు కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చామని, అయినా హామీలు నెరవేర్చకపోగా.. ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అప్పటి వరకు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పి, నేటికీ అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, మరొక 6 హామీలను అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్మెంట్, తల్లికి వందనం, హాస్టల్స్ వసతుల కోసం ఎవరైతే ప్రశ్నిస్తున్నారో.. వారిపై గంజాయి కేసులు, రౌడీ షీట్లు నమోదు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా, అన్ని వర్గాలపై దాడులు చేస్తూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. తక్షణమే అక్రమ కేసులు నిలిపివేసి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేకపోతే ప్రజలు మరింతగా నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. నిరసనలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకూటి రామచంద్రరావు, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యనిర్వహణ అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీవత్సవ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లా దుర్గ, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్ల్లవరపు జాన్ వెస్లీ, పేర్ల విజయ్ చందర్, రాష్ట్ర అనుబంధ విభాగాల కార్యనిర్వాహక అధ్యక్షుడు చెన్న జానకి రామ్, జిల్లా ఉపాధ్యక్షుడు రెయ్యి డేవిడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల సురేష్, జోనల్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు ముట్టి సునీల్ కుమార్, తమ్ములూరు జగదీష్ రెడ్డి, బోని శివ రామకృష్ణ, రామా రెడ్డి, శ్రీదేవి వర్మ, దేవరకొండ మార్కండేయులు, నీలి రవి, జిలకర్ర నాగేంద్ర, పార్టీ నాయకులు దొడ్డి కిరణ్, మహ్మద్ ఇమ్రాన్, రామన్న పాత్రుడు, ఎం.డి షరీఫ్, బిపిన్ కుమార్ జైన్, తాడి రవి తేజ్, రవికిరణ్ రెడ్డి, మువ్వల సంతోష్, కోన శంకర్, చోలింగి నాగేశ్వరరావు, బోడేటి ప్రసాద్, బంగారు భవానీశంకర్, లోకనాథం, భాస్కరరావు, దమయంతి, నిఖిల్, ఇప్పిలి పార్వతి, తిరుమల రావు, పీతల గోవింద, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. -
డీఆర్సీకి నివేదికలతో రండి
మహారాణిపేట: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సమీక్షించారు. శుక్రవారం డీఆర్సీ సమావేశం జరగనున్న నేపథ్యంలో.. గురువారం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గత డీఆర్సీలో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. ముఖ్యంగా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవోల అమలు, సాధించిన లక్ష్యాలపై చర్చించారు. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, రెవెన్యూ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న పథకాల తాజా స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యాంశాలను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీఆర్సీ సమావేశానికి పక్కా నివేదికలను రూపొందించాలని, ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమీక్షలో జేసీ కె.మయూర్ అశోక్, ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
12న శ్రీనృసింహ దీక్షల విరమణ
సింహాచలం: శ్రీనృసింహ దీక్షల విరమణ ఈనెల 12న సింహగిరిపై వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. 40 రోజుల మండల దీక్ష, 32 రోజుల దీక్ష చేసినవారంతా ఆరోజు దీక్షలు విరమించాలని పేర్కొన్నారు. ఆరోజు ఉదయం 6.30 గంటల నుంచి దీక్షాదారులను సుపధ మండపం మార్గం ద్వారా ప్రధాన ఆలయంలోకి అనుమతిస్తామని, స్వామివారి దర్శనం అనంతరం దక్షిణ రాజగోపురంలో నుంచి బయటకి పంపించడం జరుగుతుందన్నారు. శ్రీగోకులం వద్ద తిరుముడి సమర్పించాల్సి ఉంటుందన్నారు. గోకులం వద్ద తిరుముడులు సమర్పించేందుకు వీలుగా వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుముడులతో దీక్షాదారులు క్యూల్లో వెళ్తూ వీక్షించే విధంగా కల్యాణమండపంలో శాంతి హోమం నిర్వహించడం జరుగుతుందన్నారు. -
కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.88.48 లక్షలు
డాబాగార్డెన్స్ : కనకమహాలక్ష్మి దేవస్థానం హుండీల ఆదాయం లెక్కింపు గురువారం చేపట్టారు. గత నెల 8 నుంచి ఈ నెల 8 వరకు(31 రోజులు) హుండీల్లో వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.88,48,360 నగదు వచ్చింది. అలాగే 58 గ్రాముల 200 మిల్లీ గ్రాముల బంగారం, కేజీ 481 గ్రాముల వెండితో పాటు యూఎస్ఏకి చెందిన 16 డాలర్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్‌కి చెందిన 700 బైసా, సౌదీ అరేబియన్ కరెన్సీ 50 రియాల్స్, బ్యాంక్ ఆఫ్ మలేషియా కరెన్సీ 1 రింగ్, 10 ఆర్ఎమ్స్, కెనడా కరెన్సీ 5 డాలర్లు, సింగపూర్ కరెన్సీ 10 డాలర్లు వచ్చాయి. లెక్కింపులో ఆలయ ఈవో కె.శోభారాణి, జిల్లా దేవదాయ శాఖ అధికారి టి.అన్నపూర్ణ, దేవదాయ శాఖ తనిఖీదార్ శ్రీధర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
నేటి నుంచి లైట్ హౌస్ ఫెస్టివల్
మహారాణిపేట : విశాఖపట్నం వైభవాన్ని చాటిచెప్పేలా పోర్టు, షిప్పింగ్, ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో లైట్ హౌస్ ఫెస్టివల్–2026 నిర్వహించనున్నారు. ఇందుకు బీచ్‌రోడ్డులోని ఎంజీఎం పార్కు ముస్తాబవుతోంది. సముద్ర వారసత్వాన్ని ప్రోత్సహించడం, లైట్ హౌస్ టూరిజాన్ని విస్తరించడం, తీర ప్రాంత ప్రజలను భాగస్వామ్యులను చేయడం లక్ష్యంగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఫెస్టివల్లో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర విశేషాలతో కూడిన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 2023లో గోవా, 2024లో పూరీ నగరాల్లో లైట్ హౌస్ ఫెస్టివల్‌ను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో ఈ సారి విశాఖలో మరింత వైభవంగా నిర్వహించేందుకు పోర్టు అధికారులు, జిల్లా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. పబ్లిక్–ప్రైవేటు పార్టనర్షిప్(పీపీపీ) ద్వారా లైట్‌హౌస్‌ల అభివృద్ధి, భారత తీర ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. -
కింగ్
బిర్యానీయేవిశాఖపట్నం ఇప్పుడు కేవలం స్టీల్ సిటీ మాత్రమే కాదు.. రుచుల రాజధానిగానూ మారిపోయింది. ఫుడ్ లవర్స్‌కు వైజాగ్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ వెల్లడించింది. 2025లో అక్షరాలా 13 లక్షల చికెన్ బిర్యానీలు వైజాగ్ వాసుల ఆకలి తీర్చాయంటే.. ఆ రుచికి నగరం ఎంతగా దాసోహమైందో అర్థం చేసుకోవచ్చు. పల్లె రుచులైనా, పశ్చిమ దేశాల బర్గర్లైనా.. మనసు గెలుచుకోవాలంటే అది ప్లేటులోకి రావాల్సిందేనంటూ నగరవాసులు తెగ ఆర్డర్ చేశారని స్విగ్గీ విడుదల చేసిన ‘హౌ ఇండియా స్విగ్గీడ్’ నివేదిక చెబుతోంది. 2025లో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో స్విగ్గీ ద్వారా జరిగిన ఆర్డర్లకు సంబంధించి ఆసక్తికరమైన వివరాలను ఈ నివేదికలో పేర్కొంది. ఉదయం స్వదేశీ.. సాయంత్రం విదేశీ! నగర ప్రజలు ఉదయం వేళ సంప్రదాయ రుచులకు ప్రాధాన్యమిస్తే, సాయంత్రం వేళల్లో వెస్ట్రన్ స్నాక్స్‌పై మొగ్గు చూపారు. బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్లలో దోశ అగ్రస్థానంలో నిలిచింది. 2025లో ఏకంగా 1.47 లక్షల దోశలు ఆర్డర్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో 1.43 లక్షల ఆర్డర్లతో ఇడ్లీ నిలిచింది. ఒక్కో ఆర్డర్‌కు సగటున 3 ఇడ్లీలు అని లెక్కేసుకున్నా.. ఏకంగా 4.3 లక్షల ఇడ్లీలను నగర ప్రజలు ఆరగించేశారు. ఇక సాయంత్రం వేళల్లో ఏదైనా తినాలనిపిస్తే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది చికెన్ బర్గర్. రోజుకు సగటున 165 చికెన్ బర్గర్లు ఆర్డర్ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చికెన్ ఫ్రై, చికెన్ నగ్గెట్స్.. ఇలా ఏది చెప్పుకున్నా విశాఖ ప్రజలు మంచి టేస్ట్ ఉన్న భోజన ప్రియులని స్విగ్గీ కితాబిచ్చింది. ఫిట్‌నెస్‌లోనూ తగ్గేదేలే! ఆహారమే కాదు, ఆరోగ్యంపైనా నగరవాసులు శ్రద్ధ చూపారు. ఫుడ్ విషయంలో ఎలా ఆరగించారో.. ఫిట్నెస్ విషయంలోనూ అదే స్థాయిలో పోటీపడ్డారు. ఏడాది పొడవునా 2.12 లక్షల హై ప్రోటీన్ ఫుడ్ ఆర్డర్లు నమోదవ్వడం విశేషం. మరోవైపు ‘ఫుడ్ ఆన్ ట్రైన్’ ఫీచర్ ద్వారా నగరంలో ఆర్డర్లు ఏకంగా 171 శాతం పెరిగాయి. రైళ్లలో ప్రయాణించేవారు విశాఖ రైల్వే స్టేషన్‌కు వస్తూ.. తమ కోచ్, సీట్ నంబర్‌తో ఆర్డర్ పెట్టి మరీ ఆరగించేశారు. ఆఫీసుల్లో పనిచేసే వారు ‘డెస్క్ ఈట్స్’ ద్వారా చికెన్ పాప్‌కార్న్, ఇడ్లీ, మసాలా దోశలను ఎక్కువగా ఇష్టపడ్డారు. ఒకేసారి 16 పిజ్జాలు.. 28 కేకులు పార్టీలు చేసుకోవడంలోనూ వైజాగిటీస్ కొత్తదనం చాటుకుంటున్నారు. ఒకే ఆర్డర్లో రూ.17 వేల విలువ చేసే 16 పిజ్జాలు, 28 చాకోలావా కేక్స్ తెప్పించుకోవడం గమనార్హం. ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫ్రై ఆర్డర్ చేసుకున్నారు. చాక్లెట్ కేక్స్, మ్యాంగో రసమలాయ్, గులాబ్ జామూన్లకు కూడా వైజాగ్ వాసులు ఫిదా అయిపోయారు. మొత్తంగా విశాఖ అంటే.. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ అనుకుంటివా..‘సిటీ ఆఫ్ ఫుడీస్’అని పుష్ప స్టైల్లో డైలాగ్స్ చెబుతున్నారంటూ స్విగ్గీ నివేదిక చమత్కరించింది. వైజాగ్ వాసులు.. బిర్యానీ ప్రియులు ఉదయం పూట వేడి వేడి దోశల పలకరింపు.. మధ్యాహ్నం వేళ ముచ్చటైన బిర్యానీ విందు.. సాయంత్రం చిరుజల్లులో చికెన్ బర్గర్ల సందడి.. అర్ధరాత్రి ఆకలికి మళ్లీ చికెన్ బిర్యానీ! సాగర కెరటాల హోరుకు, స్పైసీ బిర్యానీ హుషారు తోడైతే ఆ మజాయే వేరంటూ విశాఖ వాసులు ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. – సాక్షి, విశాఖపట్నం చికెన్ బిర్యానీ భళా 2025 ఏడాదికి సంబంధించి స్విగ్గీ నివేదిక ప్రకారం.. వైజాగ్ వాసులు తిండి విషయంలో కొత్త రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా చికెన్ బిర్యానీ పట్ల తమకున్న అంతులేని మమకారాన్ని 13.12 లక్షల ఆర్డర్లతో చాటిచెప్పారు. ఏడాది పొడవునా ఈ స్థాయి ఆర్డర్లు నమోదయ్యాయి. విశేషమేమిటంటే.. అర్ధరాత్రి తర్వాతే ఎక్కువ మంది బిర్యానీ తినడానికి ఇష్టపడ్డారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య చికెన్ బిర్యానీ ఆర్డర్లు ఏకంగా 48 శాతం పెరిగాయి. 2024తో పోలిస్తే డిన్నర్ ఆర్డర్లలో 23 శాతం వృద్ధి నమోదైంది. -
స్కెచ్!
డీజిల్ గల్లంతుకుసీసీఎస్ ప్రాజెక్టుల్లో చెత్తతోనే కాదు.. వివాదాలతో నిండిన సీసీఎస్సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ‘క్లోజ్డ్ కంపాజిషన్ సిస్టం (సీసీఎస్) ప్రాజెక్టు కోసం తాజాగా పిలిచిన టెండర్లో ఓపెన్ టిప్పర్లలో చెత్తను తరలిస్తే జీవీఎంసీ డీజిల్‌ను సరఫరా చేయదు.. ఉచితంగా డీజిల్ ఇవ్వమంటూ పెట్టిన నిబంధనను వెనక్కి తీసుకోకపోతే మేం దాఖలు చేసిన టెండర్‌ను వెనక్కి తీసుకున్నట్టు భావించండి. మేం వేసిన టెండర్ అమలులో ఉండదు’’ అంటూ సీసీఎస్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్న రాశా సంస్థ స్వయంగా గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్‌తో పాటు మెకానికల్ అధికారులకు గత నెలలోనే లేఖలు రాసింది. అయినప్పటికీ పనులను కట్టబెడుతూ కమిషనర్ నిర్ణయం తీసుకోవడం.. మెకానికల్ అధికారులు సదరు సంస్థకు పనులను అప్పగిస్తూ ఆదేశాలు జారీచేయడం గమనార్హం. ఈ పనులను అప్పగించడం వెనుక జీవీఎంసీ అధికారుల వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే జీవీఎంసీ ఖజానా నుంచి అదనపు ఆయిల్‌ను ఉచితంగా ఇచ్చేందుకే నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. వాస్తవానికి సీసీఎస్ ప్రాజెక్టుల ఉద్దేశమే క్లోజ్డ్ కంపాక్టర్ల ద్వారా చెత్తను తరలించడం. అయితే ఇప్పటికే ఒక క్లోజ్డ్ కంపాక్టర్ పోలీసు స్టేషన్లో మరొకటి మరమ్మతుల పేరుతో నెలల తరబడి షోరూంలో ఉంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ నుంచి ఉచితంగా ఆయిల్‌ను తీసుకుని కాపులుప్పాడలోని విద్యుత్ ప్లాంటుకు ఓపెన్ టిప్పర్లలో తరలిస్తున్నారు. ఈ దఫా టెండర్లలో ఓపెన్ టిప్పర్ల ద్వారా చెత్తను తరలించేందుకు వీలులేదని.. ఒకవేళ తరలిస్తే జీవీఎంసీ ఉచితంగా డీజిల్‌ను సరఫరా చేయదనే నిబంధన విధించారు. అయితే ఈ నిబంధన తొలగించకుంటే తాము దాఖలు చేసిన టెండర్‌ను పరిగణలోనికి తీసుకోవద్దంటూ స్వయంగా రాశా యాజమాన్యం లేఖ రాసింది. అయినప్పటికీ చేయాల్సిందేంటూ రెండు సీసీఎస్ ప్రాజెక్టులను సదరు సంస్థకు అప్పగించారు. అంటే ఉచితంగా డీజిల్‌ను ఇచ్చేందుకు జీవీఎంసీ నిర్ణయం తీసుకుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ ప్రాజెక్టు నుంచి కోట్ల రూపాయల డీజిల్‌ను ఉచితంగా ఇచ్చేందుకే ఈ బాగోతం నడిచిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కమిషనర్‌కు తెలియదా..! వాస్తవానికి సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణపై కమిషనర్ స్వయంగా సమీక్ష నిర్వహించడమే కాకుండా వీటిపై విచారణ కూడా చేపట్టారు. నిర్వహణ విషయంలో పక్కాగా ఉండాలంటూ ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో తాజా టెండర్లలో ఓపెన్ టిప్పర్ల ద్వారా చెత్త తరలించకుండా ఉండేందుకు కొన్ని నిబంధనలను చేర్చారు. అయితే, ఈ నిబంధన ఉంటే తమ టెండర్‌ను పరిగణలోకి తీసుకోవద్దన్న రాశా సంస్థ లేఖను సైతం పక్కనపెట్టి పనులను అప్పగించారు. ఇంతకీ ఈ విషయం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్‌కు వాస్తవాలు తెలియకుండా జీవీఎంసీ కిందిస్థాయి అధికారులు వ్యవహారం నడిపించారా? అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అవినీతి కొండలు..! జీవీఎంసీ పరిధిలోని 10 జోన్ల నుంచి ప్రతీ రోజూ 1,200 టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. ఇంటింటికీ వెళ్లి క్లాప్ వాహనాల ద్వారా చెత్తను సేకరిస్తున్నారు. ఈ విధంగా సేకరించిన చెత్తను జీవీఎంసీ పరిధిలోని 4 సీసీఎస్ ప్రాజెక్టులకు (గాజువాక, టౌన్కొత్త రోడ్డు, చీమలాపల్లి, ముడసర్లోవ) తరలిస్తున్నారు. అక్కడి నుంచి క్లోజ్డ్ కాంపాక్టర్ల ద్వారా చెత్తను కాపులుప్పాడకు వెళ్తోంది. అయితే తరలింపు సమయంలో రోడ్లపై చెత్త పడకుండా.. కాలుష్యం లేకుండా చూసేందుకే ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ఇందుకుగానూ జనవరి 1వ తేదీ నుంచి సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లలో జరిగిన వింతలతో ప్రాజెక్టుల వద్ద చెత్త మొత్తం గుట్టలుగుట్టలుగా పేరుకుపోయి కొండలను తలపిస్తోంది. వందల టన్నుల చెత్త పేరుకుపోతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు సాహసించడం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సీసీఎస్ ప్రాజెక్టుల అసలు ఉద్దేశాన్ని కూడా పక్కనపెట్టి పనులను అప్పగించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు ఎవరికి మేలు చేసేందుకు ఈ తతంగమంతా నడిచిందనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి ఇన్ని షరతులు విధించినప్పటికీ ఏమీ చూడకుండానే కమిషనర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఏమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయం కాస్తా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లకుండానే వ్యవహారం నడిచిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
అక్రమ కేసులకు భయపడేది లేదు
మహారాణిపేట: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని, ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ.. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని వైఎస్సార్ సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకూటి రామచంద్రరావు, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యనిర్వహణ అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీవత్సవ్ స్పష్టం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీవత్సవ్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రశ్నించినందుకే పార్టీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెడుతోందని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే చర్య అని విమర్శించారు. ప్రజల గొంతుకను అణచివేయాలనే కుట్రలకు తమ పార్టీ భయపడదని, వెనుకడుగు వేయదని కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్ అన్నారు. శుక్రవారం జరిగే ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కాగితాల వెంకటేశ్, నియోజకవర్గ అధ్యక్షుడు తాడి రవితేజ, పార్టీ నాయకులు బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు. -
బూత్ స్థాయి నుంచే పార్టీ బలోపేతం
సాక్షి, విశాఖపట్నం: పార్టీ కమిటీల నిర్మాణాన్ని 45 రోజుల్లోగా పూర్తి చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆదేశించారు. వార్డులో ప్రతి ఒక్కరినీ కలుపుకొని బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమావేశంలో విశాఖ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు, టాస్క్‌ఫోర్స్ సభ్యుడు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా స్థాయి నుంచి గ్రామ, వార్డు, అనుబంధ విభాగాల కమిటీలన్నింటినీ పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర కమిటీలు, జిల్లా, వార్డు అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటయ్యా యని, వాటిలో మిగిలిన పదవులతో పాటు గ్రామ, వార్డు అనుబంధ విభాగ కమిటీలను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కదిరి బాబూరావు, రవిబాబు మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే మండల, వార్డు స్థాయిలో కమిటీల నిర్మాణం జరిగిందన్నారు. గ్రామ స్థాయిలో ప్రతి రెండు గ్రామాలకు ఇన్చార్జిలను, గ్రామ కమిటీలను, అనుబంధ విభాగ కమిటీలను నియమించాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, చింతలపూడి వెంకటరామయ్య, మహిళా నేత సిరి సహస్ర, ఎస్ఈసీ సభ్యులు బాణాల శ్రీనివాసరావు, డా. జహీర్ అహ్మద్, రాష్ట్ర పార్టీ అధికారిక ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ, పేర్ల విజయచందర్, ఇతర ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
యూనియన్ బ్యాంక్ ఎన్ఆర్ఐ కార్నివాల్
మద్దిలపాలెం: ప్రవాసీ హమారా గౌరవ్ ప్రచారంలో భాగంగా గురువారం యూనియన్ బ్యాంక్ జోనల్, రీజనల్ కార్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో డాల్ఫిన్ హోటల్లో ఎన్ఆర్ఐ కార్నివాల్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈడీ అమరీష్ ప్రసాద్, ఐబీడీ జీఎం సత్యజిత్ మహంతి, జీఎం డాక్టర్ హెచ్‌టీ వానప్ప, రీజనల్ హెడ్ జె.సింహాచలం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్యాంకు ప్రస్తుత, నూతన ఎన్ఆర్ఐ ఖాతాదారులతో వ్యక్తిగతంగా అనుసంధానం కావడానికి, వారి సహకారాన్ని గుర్తించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. బ్యాంకింగ్ సమస్యల పరిష్కారం, పెట్టుబడి ప్రయోజనాలు, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలపై ఖాతాదారుల ప్రశ్నలకు సమాధానలిచ్చి, వారి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎన్ఆర్ఐ ఖాతాదారులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. -
వచ్చే నెల 23న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు
బీచ్‌రోడ్డు : మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు ఫిబ్రవరి 23న గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు ఏపీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శివ వైజాగ్ బౌన్సర్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది బాడీ బిల్డర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు బాడీ బిల్డింగ్ రంగానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని శివ వైజాగ్ బౌన్సర్ ఫౌండర్ శివ తెలిపారు. ఈ సందర్భంగా బాడీ బిల్డింగ్ విన్యాసాలు ప్రదర్శించారు. -
వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే గేమ్ లక్ష్యం
విశాఖ సిటీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమలే కీలకమని గ్లోబల్ అలయన్స్ ఫర్ మాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్(గేమ్) వైజాగ్ డిస్ట్రిక్ట్ ఎంట్రప్రెన్యూర్షిప్ మిషన్(డీఈఎం) ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.సుభాష్కిరణ్ తెలిపారు. గురువారం ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే గేమ్ లక్ష్యమన్నారు. విశాఖ కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి గతేడాది సెప్టెంబర్‌లో గేమ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. విశాఖలో ఆరు ప్రాజెక్టులకు శ్రీకారం విశాఖలో కమ్యూనిటీ టూరిజం, రైతు పంటల ఎగుమతులు, ఆక్వా రంగంలో మహిళలకు సహకారం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈలకు మెంటర్షిప్ ప్రోగ్రాం, వెజిటేబుల్ క్లస్టర్ ఇలా ఆరు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పాడేరు, అరకు ప్రాంతాల్లో కమ్యూనిటీ టూరిజం అభివృద్ధి కోసం ఐదు గ్రామాలను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కిల్లోగూడలో హోం స్టేలు, కమ్యూనిటీ కిచెన్, ఇలా పర్యాటకులకు అవసరమైన అన్ని లాజిస్టిక్స్ ఉండేలా స్థానికులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీవో)ల ద్వారా రైతులను వ్యాపారవేత్తలుగా, విదేశాలకు కాఫీ, పసుపు, మిల్లెట్స్ ఇలా.. అన్నింటినీ ఎగుమతి చేసేలా శిక్షణ ఇస్తున్నామని వివరించారు. అరకు కాపీని యూరప్‌కు ఎగుమతి చేసేందుకు వీలుగా యూరోపియన్ యూనియన్ డిఫారెస్టేషన్ రెగ్యులేషన్(ఈయూడీఆర్) సర్టిఫికేషన్ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ సమావేశంలో గేమ్ సహ వ్యవస్థాపకుడు రవి వెంకటేషన్, గేమ్ అధ్యక్షుడు కేతుల్ ఆచార్య, ఆర్టీఐహెచ్ సీఈవో రవి ఈశ్వరరాపు పాల్గొన్నారు. -
అదృశ్యం డ్రామా ఆడి.. అడ్డంగా దొరికిపోయి..
పీఎంపాలెం: ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించింది భార్య. ఎంత తెలివిగా నేరం చేసినా చట్టం నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ కేసులో ఆమెతో పాటు ప్రియుడు, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాఖ నార్త్ ఏసీపీ అప్పలరాజు ఈ కేసు వివరాలను వెల్లడించారు. అసలేం జరిగింది? : విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరుకు చెందిన అల్లాడ నాగరాజు(38)కు, అదే ప్రాంతానికి చెందిన తన మేనత్త కూతురైన రమ్యతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం విశాఖకు వలస వచ్చిన వీరు కే–3 కాలనీలో ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. నాగరాజు జీవీఎంసీ 8వ వార్డులోని పనోరమా హిల్స్ వాటర్ పంపింగ్ విభాగంలో పనిచేస్తుండేవాడు. అక్కడే పనిచేసే కంచరపాలేనికి చెందిన సంజీవి వసంతరావుతో నాగరాజుకు పరిచయం ఏర్పడింది. ప్రియుడితో కలిసి కుట్ర : స్నేహం సాకుతో వసంతరావు తరచూ నాగరాజు ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో నాగరాజు భార్య రమ్యతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వసంతరావు భార్య గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో నాగరాజును అడ్డు తొలగించుకుంటే స్వేచ్ఛగా ఉండవచ్చని వీరిద్దరూ పథకం వేశారు. ఇందుకోసం కంచరపాలేనికి చెందిన బాలకృష్ణ, ప్రవీణ్ అలియాస్ పండులకు రూ.50 వేలు సుపారీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. మద్యం తాగించి.. దారుణ హత్య : పథకం ప్రకారం గత ఏడాది నవంబర్ 28న వుడా కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. నాగరాజుకు మద్యం వ్యసనం ఉంది. 29వ తేదీ సాయంత్రం మందు పార్టీ పేరుతో నాగరాజును అక్కడికి తీసుకెళ్లి ఫుల్లుగా మద్యం తాగించారు. అనంతరం వసంతరావు, బాలకృష్ణ, ప్రవీణ్ కలిసి నాగరాజు గొంతు నులిమి, ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి తిమ్మాపురం రోడ్డులోని బావికొండ సమీపంలో ఉన్న పొదల్లో పడేసి, అతను మద్యం మత్తులో పడిపోయినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అదృశ్యమైనట్లు డ్రామా : భర్తను హత్య చేసిన తర్వాత రమ్య ఏమీ ఎరగనట్లు నటించింది. ప్రియుడితో కలిసి ఆనందంలో మునిగితేలింది. భర్త అదృశ్యం అయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇక అతని కథ ముగిసినట్టే అని భావించింది. ఆ తర్వాత కే–3 కాలనీ నుంచి బక్కన్నపాలేనికి మకాం మార్చింది. డిసెంబర్ 9న నాగరాజు 10 తులాల బంగారం, రూ.5 వేల నగదుతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని, తిరిగి రాలేదని పేర్కొంటూ డిసెంబరు 17న పీఎంపాలెం పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసింది. నాగరాజు అదృశ్యంపై అనుమానం వచ్చిన అతని బంధువులు రమ్య, వసంతరావులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అస లు విషయం బయటపడింది. సుమారు 40 రోజుల కిందట హత్య చేయడంతో మృతదేహం పూర్తిగా పాడైపోయిన స్థితిలో ఈ నెల 7న పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. హత్యకు సూత్రధారి అయిన రమ్యతో పాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పీఎంపాలెం సీఐని, సిబ్బందిని సీపీ, డీసీపీ అభినందించారు. -
సామాన్యురాలి చేతుల మీదుగా.. అసామాన్యురాలి కథ
పారిశుధ్య కార్మికురాలి చేతుల మీదుగా రాష్ట్రపతి పుస్తకావిష్కరణ మద్దిలపాలెం: సంప్రదాయాలకు భిన్నంగా ఆంధ్రా విశ్వవిద్యాలయంలో గురువారం ఓ అరుదైన కార్యక్రమం జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవిత విశేషాలతో ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము’ పుస్తకాన్ని.. ఏయూలో రోడ్లు శుభ్రం చేసే పారిశుధ్య కార్మికురాలు లక్ష్మమ్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఏయూ ప్రాంగణంలోని ఒక చెట్టు కింద అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ వేడుక శ్రమ గౌరవానికి, సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా రచయిత యార్లగడ్డ మాట్లాడుతూ.. కష్టసాధ్యమైన పరిస్థితుల నుంచి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన ముర్ము జీవితం అణగారిన వర్గాలకు గొప్ప ప్రేరణ అన్నారు. ఆమెలోని వినయం, పట్టుదల, శ్రమకు గౌరవం దక్కాలనే ఉద్దేశంతోనే.. ఒక సామాన్య కార్మికురాలితో ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశామని తెలిపారు. అనంతరం పుస్తక తొలి ప్రతిని వేములపల్లి విద్యాసాగర్‌కు అందజేశారు. ద్రౌపది ముర్ము జీవితాన్ని ప్రతిబింబించేలా సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమం అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది. -
తప్పులు.. రైతులకు తిప్పలు
మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా పంపిణీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు తప్పుల తడకగా ఉన్నాయి. పుస్తకాల్లో పేర్లు, సర్వే నంబర్లు తారుమారయ్యాయి. వయసు, భూమి వివరాల్లోనూ అనేక వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఆన్లైన్ డేటా అప్డేట్ కాకపోవడంతో అంతా గందరగోళంగా తయారైంది. తాజా క్రయ, విక్రయాలు (రిజిస్ట్రేషన్లు) ఈ పుస్తకాల్లో నమోదు కాకపోవడంతో భూ యజమానులు లబోదిబోమంటున్నారు. ఇంకా పూర్తి కాని పంపిణీ భూ యాజమాన్య హక్కు పత్రాలు పంపిణీకి ప్రభుత్వం ఈ నెల 2వ తేదీ నుంచి శ్రీకారం చుట్టింది. కలెక్టర్, జేసీ పర్యవేక్షణలో తహసీల్దార్లు ఈ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 37 గ్రామాల్లో రీ–సర్వే పూర్తి కాగా, సుమారు 16 వేల పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి గ్రామ సభల ద్వారా రైతులకు, ప్రజలకు నేరుగా అందజేయాలని నిర్ణయించారు. అయితే పుస్తకాల్లో కోకొల్లలుగా తప్పులు ఉండడంతో పంపిణీ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. జాప్యంపై అసహనం సాధారణంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 45 పని దినాల్లోగా పాసు పుస్తకాలు మంజూరు చేయాలనే నిబంధన ఉంది. అయితే భూ యజమానులకు పోస్ట్‌లో పాస్ బుక్ చేరడానికి 100 రోజులు పట్టేది. దరఖాస్తు చేసిన ఏడాది తర్వాత కూడా పుస్తకాలు అందక అనేక మంది అవస్థలు పడుతున్నారు. జిల్లాలో రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. చక్కదిద్దే పనిలో రెవెన్యూ యంత్రాంగం రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో సిద్ధం చేసిన పుస్తకాలు తప్పుల తడకగా రావడంతో, వాటిని చక్కదిద్దే పనికి రెవెన్యూ యంత్రాంగం ఉపక్రమించింది. భూముల విస్తీర్ణంలో చోటు చేసుకున్న వ్యత్యాసాలు సరిచేయాలంటూ చాలా దరఖాస్తులు వచ్చాయి. దీంతో అధికారులు వాటిని సరిదిద్దే పనిలో పడ్డారు. క్రయ విక్రయాలు, భాగస్వామ్య పంపిణీ, గిఫ్ట్ డీడ్లు, మ్యూటేషన్ వంటివి పూర్తయిన తర్వాతే పట్టాదారు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని, అప్పుడే మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. పాసు పుస్తకంలో గొంతిన వెంకట రమణ పేరు ఆంగ్లంలో తప్పుగా నమోదుజెట్టపురెడ్డితునికి బదులు జత్తపురెడ్డి తునిగా పడిన పాసు పుస్తకం, ఆధార్, సెల్ నంబర్లు కూడా తప్పులే.. పుస్తకాల నిండా తప్పులే.. పట్టాదారు పాస్ పుస్తకాల్లోని భూమి వివరాలు, సర్వే నంబర్లు, భూ యజమానుల వివరాల్లో అనేక తప్పులు దొర్లాయి. భూముల అమ్మకాలు జరిగినా, కొత్త యజమానుల పేర్లు పాస్ పుస్తకాల్లో మారలేదని పలువురు వాపోతున్నారు. తప్పులు ఉన్న విషయం తెలియక అనేక మంది వాటిని తీసుకున్న తర్వాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రింటింగ్లోనూ అనేక తప్పులు కనిపిస్తున్నాయి. చిరునామాలు, పేర్లలో అక్షర దోషాలు, వయసులో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పేర్లు కూడా మారిపోయాయి. ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ పుస్తకాలే ప్రామాణికం కాబట్టి, భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భూ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుస్తకంలో అన్నీ తప్పులే.. పట్టాదారు పాసు పుస్తకం కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. పుస్తకాలు వచ్చాయని సంతోషపడ్డాం. కానీ నాకు ఇచ్చిన పుస్తకంలో అనేక తప్పులు ఉన్నాయి. ఈ విషయాన్ని స్థానిక వీఆర్వో ద్వారా తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లాను. పాసు పుస్తకంలో తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతాం. అందుకే వెంటనే సవరించాలని కోరాను. – చిల్లా వెంకటరమణ, వెల్లంకి, ఆనందపురం మండలం తప్పులు సరిచేసి ఇస్తామన్నారు నాకు భీమిలి మండలంలో 35 సెంట్ల భూమి ఉంది. ఈ భూమికి తాజాగా పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారు. అయితే అందులో తప్పులు ఉన్నాయి. దీన్ని సరిచేయాలని తహసీల్దార్‌ను కోరాను. తప్పులు సరిచేసి, కొత్త పుస్తకం ఇస్తామని ఆయన చెప్పారు. – పిన్నంటి అప్పలసూరి, మజ్జివలస, భీమిలి మండలం -
చోరీ కేసులో ముగ్గురు మహిళల అరెస్టు
నిందితులపై 26 పాత కేసులు గాజువాక : స్థానిక బీసీ రోడ్‌లోని ఓ జ్యూయలరీ షాప్‌లో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడిన ముగ్గురు మహిళలను గాజువాక క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గాజువాక క్రైం ఎస్ఐ సీహెచ్.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా వీరుల్లపాడు మండలం గోకరాజుపల్లి గ్రామానికి చెందిన పొన్న పద్మ (45), బొజ్జగాని జ్ఞానమ్మ (55), బొజ్జగాని నాగమణి (50) బీసీ రోడ్‌లోని శ్రీలక్ష్మీ శ్రీనివాస జ్యూయలరీ షాప్‌నకు వెళ్లి చెవి దిద్దులు చూపించమని అడిగారు. వారు కోరిన ఆభరణాలను దుకాణదారుడు ఒక ట్రేలో పెట్టి చూపించగా, అవి నచ్చలేదని వారు వెళ్లిపోయారు. వారు వెళ్లిపోయిన తరువాత ట్రేను పరిశీలించగా, నాలుగున్నర గ్రాముల విలువైన రెండు సెట్ల చెవి దిద్దులు మాయమైనట్టు గుర్తించి గాజువాక క్రైం పోలీసులకు దుకాణదారుడు ఉరుకూటి రాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గాజువాక మెయిన్ రోడ్లో గురువారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు దొంగతనానికి పాల్పడింది వారేనని నిర్ధారించుకొని అరెస్టు చేశారు. వారి నుంచి 4.5 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. వారిపై గతంలో కూడా ఇదే తరహాలో దొంగతనాలకు పాల్పడిన 26 కేసులున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
విశాఖలో ఏపీ ఇన్నోవేటర్స్ సమ్మిట్
సాక్షి, విశాఖపట్నం : సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) సహకారంతో ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ(ఏపీడీటీఐ) ఆధ్వర్యంలో ఏపీ ఇన్నోవేటర్స్ సమ్మిట్–2026, ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్–2026ని విశాఖలో నిర్వహించనున్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ఈ సమ్మిట్స్ జరగనున్నాయనీ ఏపీడీటీఐ నెట్వర్క్ చైర్మన్ శ్రీధర్ కొసరాజు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఈ సమ్మిట్స్‌కు సహకారం అందిస్తోందని వెల్లడించారు. ‘ఆటోమేషన్‌కు అతీతంగా, మేధో యుగం – ఆవిష్కరణలు, డీప్‌టెక్ నైపుణ్యాల సమన్వయం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు సాధికారత కల్పించడం అనే థీమ్‌తో సదస్సులు జరగనున్నాయని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు, అభివృద్ధికి దిక్సూచీగా విశాఖ నగరం విరాజిల్లుతున్న తరుణంలో డిజిటల్ టెక్నాలజీలోని ఐటీ, ఐటీ అనుబంధ, ఏఐ–ఎమర్జింగ్ టెక్, ఇండస్ట్రీ–4.0, మెడ్‌టెక్ – హెల్త్‌టెక్, క్రియేటివ్ టెక్ మొదలైన 6 రంగాలను మిళితం చేసేలా మొట్టమొదటిసారిగా ఈ సదస్సు జరగనుందన్నారు. సదస్సును ఎంఎస్ఎంఈ, ఎస్ఈఆర్పీ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ప్రారంభించనున్నారని తెలిపారు. ఉత్తమ స్టార్టప్‌లకు 10వ తేదీన వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు చైర్మన్ శ్రీధర్ కొసరాజు వెల్లడించారు. -
లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్‌కు రూ.2.75 లక్షల విరాళం
తాటిచెట్లపాలెం: సీతమ్మధారలోని లయన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్‌ను బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ డి.భారతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె లయన్స్ ఆస్పత్రి సేవలను కొనియాడుతూ.. హాస్పిటల్ అభివృద్ధికి రూ.2.75 లక్షల విరాళాన్ని హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ వి.ఉమామహేశ్వరరావుకు అందజేశారు. రిటైర్డ్ ప్రొఫెసర్ భారతి ఉదార విరాళానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మొత్తాన్ని హాస్పిటల్లో కార్డియాలజీ విభాగంతోపాటు ఇతర వైద్య విభాగాలను బలోపేతం చేయడానికి ఉపయోగించనున్నారు. -
స్టీల్‌ప్లాంట్ భూములపై కార్పొరేట్ల కన్ను
డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కొత్తపల్లి లోకనాధం, కార్పొరేటర్ బి.గంగారావు ఆరోపించారు. బుధవారం సీపీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్లాంట్‌ను రక్షిస్తామని చెబుతూనే ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తోందని మండిపడ్డారు. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు 9 జిల్లాల పరిధిలో ఎకనామిక్ రీజియన్ పేరుతో 232 పేజీల ప్రణాళికను విడుదల చేసిందని వారు తెలిపారు. ఇందులో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన దాదాపు 2,500 ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు బదలాయించే ప్రతిపాదనలు ఉన్నాయని వారు బయటపెట్టారు. ప్లాంట్‌కు ఉన్న రూ.2,400 కోట్ల విద్యుత్ బకాయిలను సాకుగా చూపి, వాటిని ఈక్విటీగా మార్చుకుని భూములను స్వాధీనం చేసుకునే ఎత్తుగడ వేస్తున్నారని విమర్శించారు. కోక్, సింటర్ వంటి ముడిసరుకులను సొంతంగా ఉత్పత్తి చేసుకోకుండా, బయట నుంచి అధిక ధరలకు కొనుగోలు చేస్తూ ప్లాంట్‌ను నష్టాల్లోకి నెడుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్ను కోక్‌పై రూ.8 వేలు, పెల్లేట్స్పై రూ.2 వేలకు పైగా అదనపు భారాన్ని మోపుతూ, ముడిసరుకు వ్యయాన్ని 60 శాతం నుంచి 78 శాతానికి పెంచేశారని ఆరోపించారు. గతంలో ఎన్ఎండీసీకి లీజుకు ఇచ్చిన 1,100 ఎకరాలు, ఇప్పుడు ప్రతిపాదిస్తున్న 2,500 ఎకరాలు కలిపి మొత్తం అదానీ, మిట్టల్ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ దుర్మార్గపు ప్రతిపాదనలను తక్షణం వెనక్కి తీసుకోవాలని, ఉక్కు భూములను కేవలం ప్లాంట్ విస్తరణకే ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిటూ నాయకులు నమ్మి రమణ, ఎన్.రామారావు, సీపీఎం నాయకుడు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం ధ్వజం -
యూనిట్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు
రెసిడ్యూ అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ యూనిట్ సాధారణంగా ముడి చమురును శుద్ధి చేసేటప్పుడు పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్ వంటివి వేరు చేసిన తర్వాత, చివరికి నల్లగా, చిక్కటి తారు వంటి పదార్థం(వాక్యూమ్ రెసిడ్యూ) అవశేషంగా మిగులుతుంది. దీనిని బాటమ్ ఆఫ్ ది బ్యారెల్ అని పిలుస్తారు. గతంలో ఈ పదార్థాన్ని తక్కువ ధరకు తారు రూపంలోనూ లేదా ఓడల ఇంధనంగానో విక్రయించేవారు. మార్కెట్లో వీటి విలువ చాలా తక్కువ. అయితే, ఇందులో ఉండే మిగులు ఇంధనాన్ని వెలికి తీసి వినియోగించుకోవడం దేశంలోని చమురు రిఫైనరీలకు పెద్ద సవాల్‌గా ఉండేది. దీనిపై సుదీర్ఘ పరిశోధనలు చేసిన తర్వాత హెచ్‌పీసీఎల్ ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆవిష్కరించింది. అదే చమురు అవశేషాల శుద్ధి కర్మాగారం(ఆర్‌యూఎఫ్). హెచ్‌పీసీఎల్ ప్లాంట్‌ని 8.33 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 ఎంఎంటీ వరకూ చేపట్టిన విస్తరణ పనుల్లో భాగంగా ఈ ఆర్‌యూఎఫ్(రఫ్)ని కూడా ఏర్పాటు చేశారు. ఏడాదికి 3.35 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఇది అందుబాటులోకి వచ్చింది. చమురు అవశేషాల వ్యర్థాలను వృథా చేయకుండా తిరిగి ప్రాసెస్ చేసి, అత్యంత విలువైన డీజిల్, నాఫ్తా, ఎల్పీజీ, గ్యాసోలిన్ వంటి ఇంధనాలుగా ఈ ప్లాంట్‌లో మారుస్తారు. ప్రపంచంలో తొలిసారిగా.. ఇప్పటివరకూ ఆర్‌యూఎఫ్ ప్లాంట్లు చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో వేళ్లపై లెక్కపెట్టేవి మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నవన్నీ లిక్విడ్ కాటలిటిక్ ఫైనింగ్(ఎల్‌సీఎఫ్) యూనిట్లు. కానీ ప్రపంచంలో తొలిసారిగా అత్యాధునిక సాంకేతికతతో ‘ఎల్సీ మ్యాక్స్’ యూనిట్‌ని విశాఖలో ఏర్పాటు చేశారు. ఈ సాంకేతికతను అమెరికాకు చెందిన ‘షెవ్రాన్ లుమ్మస్ గ్లోబల్’ అనే సంస్థ అందించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా అమలు చేస్తున్న సాంకేతికత. ‘బ్లాక్ గోల్డ్’ అని పిలిచే చిక్కటి చమురు మిగులు వ్యర్థాలను ఇది దాదాపు 93 శాతం వరకూ ప్రాసెస్ చేస్తుంది. 2019లో భారీ రియాక్టర్ల రాకతో.. ఈ ఆర్యూఎఫ్లో ప్రపంచంలోనే అతిపెద్ద రియాక్టర్లను ఏర్పాటు చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎల్ అండ్ టీ సంస్థ తయారు చేసిన మూడు భారీ రియాక్టర్లను 2019 జూన్‌లో ఏర్పాటు చేయడం ద్వారా పనులు జోరందుకున్నాయి. ఒక్కో రియాక్టర్ ఏకంగా 2,200 టన్నుల బరువు ఉంటుంది. ఇవి సుమారు 420 డిగ్రీల ఉష్ణోగ్రత, 200 బార్ పీడనం వద్ద పనిచేస్తాయి. మన దేశంలో ఇలాంటి భారీ రియాక్టర్లను ఒకే చోట అమర్చడం ఇంజినీరింగ్ రంగంలోనే ఒక అద్భుతమని హెచ్‌పీసీఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్యూఎఫ్కి కీలకమైన క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ 2023 మార్చిలో అందుబాటులోకి వచ్చింది. ఆర్‌యూఎఫ్ యూనిట్ నిర్వహణలో ఏఐ వినియోగిస్తుండటం వల్ల, ఏ చిన్న లోపం తలెత్తినా ముందుగానే పసిగట్టవచ్చు. దీని వల్ల ప్రమాదాల ముప్పు తగ్గి, ఉత్పాదకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. భారత దేశ ఇంధన భద్రతలో విశాఖ తీరప్రాంతం మరో మైలురాయిని అధిగమించింది. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) విశాఖ రిఫైనరీని ఆధునికీకరించడమే కాకుండా, ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతికత కలిగిన ‘రెసిడ్యూ అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ’(ఆర్‌యూఎఫ్)ని అందుబాటులోకి తెచ్చింది. దీనిని కేవలం ఒక పరిశ్రమ విస్తరణలా మాత్రమే కాకుండా, భారత చమురు రంగం ‘వ్యర్థం నుంచి అర్థం’ వైపు వేసిన ఒక కీలక అడుగుగా పారిశ్రామిక వర్గాలు అభివర్ణిస్తున్నాయి. వ్యర్థంగా పారేసే చమురు అవశేషాల నుంచి అత్యంత నాణ్యమైన ఇం‘ధనం’ సృష్టించే ఈ ‘బ్లాక్ గోల్డ్’ మ్యాజిక్.. దేశ ఇంధన భద్రతలో ఒక గేమ్ ఛేంజర్‌గా మారనుంది. – సాక్షి, విశాఖపట్నం ప్రాజెక్టు విశేషాలు హెచ్‌పీసీఎల్ ఆర్థిక, వ్యూహాత్మక అడుగులు హెచ్‌పీసీఎల్ విస్తరణ ప్రాజెక్టు కోసం సుమారు రూ.26,264 కోట్ల నుంచి రూ.31 వేల కోట్ల వరకూ భారీ పెట్టుబడి పెట్టింది. 2018లో పనులు ప్రారంభమై, ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఈ స్థాయికి చేరుకుంది. ఇందులో ఆర్‌యూఎఫ్ ఏర్పాటు చేయడం వల్ల రిఫైనరీ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్ భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే ప్రతి బ్యారెల్ ముడి చమురుపై వచ్చే లాభం పెరుగుతుందని హెచ్‌పీసీఎల్ వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా డీజిల్ ఉత్పత్తి పెరగడం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికి తోడు సల్ఫర్ తక్కువగా ఉండే బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలోనూ ఇది కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. మల్కాపురం: దేశానికే తలమానికంగా నిలుస్తున్న హెచ్‌పీసీఎల్(విశాఖ రిఫైనరీ)లో విస్తరణ పనుల భాగంగా నిర్మించిన అత్యాధునిక రఫ్ (రెసిడ్యూ అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ) యూనిట్ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. సంస్థ ఉన్నతాధికారులు ఈ యూనిట్‌ను ప్రారంభించి, పనితీరును పరిశీలించారు. గత నాలుగేళ్లుగా జరుగుతున్న విస్తరణ పనుల్లో ఈ యూనిట్ నిర్మాణం కీలకం. -
కనకమహాలక్ష్మికి తుమ్మిడి బ్రదర్స్ నెక్లెస్ బహూకరణ
డాబాగార్డెన్స్: సిరులతల్లి కనకమహాలక్ష్మి అమ్మవారికి తుమ్మిడి బ్రదర్స్ అధినేత తుమ్మిడి రామ్‌కుమార్ దంపతులు, కుటుంబ సభ్యులు బుధవారం బంగారు నెక్లెస్‌ను బహూకరించారు. సుమారు రూ.2.12 లక్షల విలువ చేసే 13.623 గ్రాముల ఈ బంగారు హారాన్ని ఆలయ ఈవో కె.శోభారాణికి అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దాతల గోత్రనామాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా రామ్‌కుమార్ మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చే కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ మెండుగా ఉండాలని, 2026లో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తుమ్మిడి బ్రదర్స్ డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. సంస్థ ప్రారంభించి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమ్మవారికి ఈ హారాన్ని కానుకగా సమర్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
సివిల్స్‌లో మనోళ్లు మెరవాలి
మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొమ్మాది: సివిల్స్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సత్తా చాటాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. బుధవారం రుషికొండలోని అంబేడ్కర్ స్టడీ సర్కిల్లో ఏర్పాటు చేసిన ఉచిత సివిల్స్ శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ గల పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు రూ.4.22 కోట్ల వ్యయంతో మూడు చోట్ల కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడల్లో తరగతులు ప్రారంభం కాగా, తాజాగా విశాఖ కేంద్రం అందుబాటులోకి వచ్చిందన్నారు. మొత్తం 340 మంది అభ్యర్థులకు (ఒక్కో కేంద్రంలో సుమారు 100 మంది) ఉచిత శిక్షణతో పాటు వసతి, నాణ్యమైన ఆహారం, స్టడీ మెటీరియల్ ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. విద్యార్థుల కోసం మాక్ టెస్టులు, లైబ్రరీ సౌకర్యంతో పాటు నిష్ణాతులైన మెంటర్ల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఏజెన్సీలో రూ.1,300 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామని, గిరిజన నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆసుపత్రులు, ఫీడర్ అంబులెన్సులు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. అట్టడుగు వర్గాల విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును అందించేందుకు ఇలాంటి కోచింగ్ సెంటర్లు మరిన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ సదాభార్గవి, శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
చెత్త కొండలు
దర్శనమిస్తున్న వందల టన్ను చెత్తకుప్పలు మూలకు చేరిన క్లోజ్డ్ కాంపాక్టర్ వాహనాలు కనీసం పట్టించుకోని కమిషనర్, మేయర్ వచ్చే నెలలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రారంభం చెత్తమయంతో విశాఖ పరువు తీస్తున్న చంద్రబాబు ప్రభుత్వం టౌన్ కొత్తరోడ్డులోని సీసీఎస్‌లో చెత్త కుప్పలుసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలోని వివిధ క్లోజ్డ్ కంపాక్షన్ సిస్టం (సీసీఎస్) ప్రాజెక్టుల నుంచి చెత్తను సేకరించి కాపులుప్పాడలోని చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంటుకు తరలించాల్సి ఉంటుంది. ఒకవైపు ఈ వాహనాలు నెలల తరబడి షెడ్డకు, పోలీసుస్టేషన్లలో ఉండటంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి ఉంటోంది. వచ్చే నెల మధ్య నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రారంభం కానుంది. ఈ సమయంలో కూడా ఈ వ్యవహారంపై జీవీఎంసీ కమిషనర్, మేయర్ కనీసం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగరాన్ని చెత్తమయంగా చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో జీవీఎంసీకి గార్బేజ్ ఫ్రీ సిటీ(జీఎఫ్‌సీ)లో 3 స్టార్ అవార్డు లభించింది. 2022లో దేశంలోనే 4వ క్లీన్‌సిటీ అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాకుండా అదే సంవత్సరంలో జీఎఫ్‌సీలో 5 స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తకుప్పలు కాదు.. కొండలను చూస్తే జీవీఎంసీ గార్బేజ్ సిటీ కేటగిరీలో అవార్డు దక్కించుకునే అవకాశం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడి చెత్త అక్కడే...! వాస్తవానికి నగరంలోని గాజువాక, ముడసర్లోవ, చీమలాపల్లి, టౌన్ కొత్త రోడ్డు ప్రాంతాల్లో క్లోజ్డ్ కాంపాక్షన్ సిస్టం (సీసీఎస్) ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం ఆయా సీసీఎస్ ప్రాజెక్టుల వద్ద వందల టన్నుల చెత్త పేరుకుపోయి దర్శనమిస్తోంది. జీవీఎంసీ పరిధిలో ప్రతీ రోజూ 1,200 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇంటింటా క్లాప్ వాహనాల ద్వారా సేకరించిన చెత్తను ఈ సీసీఎస్ ప్రాజెక్టుల వద్దకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి క్లోజ్డ్ కాంపాక్టర్ల ద్వారా కాపులుప్పాడలోని చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంటుకు నేరుగా తరలించాల్సి ఉంటుంది. అక్కడ కూడా కిందపడేయకుండా నేరుగా ప్లాంటులోని బాయిలర్‌కు ఫీడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇలా ఒకవైపు సీసీఎస్ ప్రాజెక్టుల నుంచి చెత్తను సేకరించాల్సిన వాహనాలు ఎక్కడికక్కడ ఉండిపోవడంలో చెత్త కుప్పలు పెద్ద కొండల్లా దర్శనమిస్తున్నాయి. వీటి దుర్గంధంతో నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరి నెలలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రారంభంకానున్న తరుణంలో ఈ చెత్తకుప్పలు కాస్తా జీవీఎంసీ ర్యాంకింగ్‌ను చెత్తమయం చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాక్సిడెంట్లు అవుతున్నా..! చెత్తను తరలించే క్లోజ్డ్ కాంపాక్టర్ వాహనాలు గతంలో ఒకటి 2025లో మూడు యాక్సిడెంట్లు చేశాయి. ఈ వాహనాలు పదే పదే యాక్సిడెంట్లు అవుతున్నా.. డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సదరు డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడుపుతున్నారని తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. అలాగే ఈ సీసీఎస్ వాహనాలకు ఇన్సూరెన్స్ కూడా సకాలంలో చెల్లించడం లేదు. పర్యటనలు ఏవీ..! గతంలో కమిషనర్, మేయర్ ఇద్దరూ కలిసి తెల్లవారుజామునే ఏదో ఒక వార్డులో పర్యటించేవారు. వీధులు, రోడ్లను కార్మికులు ఎలా శుభ్రం చేస్తున్నారు? అందరూ హాజరయ్యారా? లేదా అనే అంశాలను ఆరా తీయడంతో పాటు చెత్త కనపడితే సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ను మందలించేవారు. ఇలా నెలలో వీలైనన్ని ఎక్కువ రోజులు కలిసి పర్యటన చేసేవారు. మేయర్‌గా పీలా శ్రీనివాసరావు, కమిషనర్‌గా కేతన్ గార్గ్ వచ్చిన తర్వాత కలిసి పర్యటించిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇరువురి మధ్య అంతగా సఖ్యత లేదన్న వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఇది కాస్తా జీవీఎంసీలోని కిందిస్థాయి అధికారులకు అలుసుగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గాజువాక డంపింగ్ యార్డు నుంచి చెత్తను తీసుకువెళ్లే ఏపీ39డబ్ల్యూ7138 నెంబరు గల క్లోజ్డ్ కాంపాక్టర్ వాహనం నడుపుతున్న డ్రైవర్ కంచరపాలెం స్టేషన్ పరిధిలో గత డిసెంబర్ 9వ తేదీన యాక్సిడెంట్ చేశాడు. రాత్రి 1.30 గంటల సమయంలో జరిగిన ఈ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి మరణించారు. సదరు వాహనం ఇన్సూరెన్స్ డిసెంబర్ 8వ తేదీన ముగిసింది. కనీసం ఈ వాహనానికి ఇన్సూరెన్స్ కూడా జీవీఎంసీ అధికారులు రెన్యూవల్ చేయలేదు. ఈ వాహనం ఇప్పటికీ పోలీసు స్టేషన్లోనే ఉంది. మరో క్లోజ్డ్ కాంపాక్టర్ గత 14 నెలలుగా మరమ్మతుల పేరుతో ఇప్పటికీ ఇంకా షో రూంలోనే ఉంది. ఈ వాహనానికి కూడా ఇన్సూరెన్స్ లేదు. మరమ్మతులకు లక్షల్లో ఖర్చు అవుతుండటంతో ఈ భారాన్ని ఎవరు భరించాలనే విషయంపై ఇప్పటికీ తర్జనభర్జన నడుస్తూనే ఉంది. -
9, 10 తేదీల్లో లైట్ హౌస్ ఫెస్టివల్
మహారాణిపేట: విశాఖపట్నం వైభవాన్ని మరింత చాటిచెప్పేలా పోర్టు, షిప్పింగ్, ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10వ తేదీల్లో ఎంజీఎం పార్కులో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ ఫెస్టివల్ ఏర్పాట్లపై లైట్ హౌస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, పోర్ట్ అధికారులతో కలిసి కలెక్టరేట్లో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సముద్ర వారసత్వాన్ని ప్రోత్సహించడం, లైట్ హౌస్ టూరిజాన్ని విస్తరించడం, తీర ప్రాంత ప్రజలను భాగస్వామ్యులను చేయడం లక్ష్యంగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వేడుకలకు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర టూరిజం మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర టూరిజం మంత్రి కందుల దుర్గేశ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరవుతారని వెల్లడించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా, మెడికల్ క్యాంపు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని, బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో లైట్ హౌస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వీరేంద్ర యాదవ్, విశాఖ పోర్టు కార్యదర్శి సాంబమూర్తి, సీఏవో రమణమూర్తి, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ వికాశ్, విశాఖపట్టణం ఆర్డీవో సుధాసాగర్, జీవీఎంసీ, ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆయుర్వేదం ముసుగులో నకిలీ దందా
తాటిచెట్లపాలెం: ఆయుర్వేద వైద్యం పేరుతో నకిలీ నూనెలు, పొడులు విక్రయిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. శ్రీనగర్‌లోని ప్రకృతి ఆయుర్వేదిక్ సెంటర్‌పై దాడి చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ద్వారకా సబ్ డివిజన్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి బుధవారం మీడియాకు వెల్లడించారు. దాసిక కల్యాణ ఆనంద శంకర ప్రసాద్ అనే వృద్ధుడు హైడ్రోసిల్ సమస్యతో బాధపడుతున్నారు. గత నెల 22న సీతమ్మధార సిగ్నల్ జంక్షన్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన్ని సంప్రదించాడు. ఆయుర్వేద మందుల ద్వారా నయం చేస్తామని నమ్మబలికాడు. అనంతరం గత నెల 23న శ్రీనగర్‌లోని ప్రకృతి ఆయుర్వేదిక్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ప్రసాద్ అనే వ్యక్తి.. బాధితుడి నుంచి ఫోన్ పే ద్వారా రూ. 1.6 లక్షలు వసూలు చేసి, రసీదు ఇచ్చారు. ఆయుర్వేద మందులను ఇచ్చి కొన్ని రోజులు వాడాలని సూచించారు. అయితే మందులు వాడినా జబ్బు నయం కాకపోవడంతో బాధితుడు ఆరా తీయగా, తనలాగే మరికొందరిని కూడా ఈ ముఠా మోసం చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన ద్వారకా పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ టాస్క్ ఫోర్స్, ద్వారకా పోలీసులు సంయుక్తంగా ప్రకృతి ఆయుర్వేదిక్ సెంటర్‌పై దాడి చేశారు. అక్కడ నకిలీ మందులు నిల్వ ఉంచి విక్రయిస్తున్న సుధాం దుర్గప్ప గోల్లర్, ప్రభు కల్లోలప్ప, దురగప్ప గొల్లా, గొల్లర్ గుర్రన్న, బాగల్కోటి సోమప్పలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమావేశంలో ద్వారకా సీఐ డి.వి.రమణ, ఎస్ఐ అసిరి తాతల పాల్గొన్నారు. -
స్టీల్‌ప్లాంట్‌ను ముంచేసిన ఘనుడు చంద్రబాబు
నక్కపల్లి: స్టీల్‌ప్లాంట్‌ను ముంచేసిన ఘనుడు చంద్రబాబునాయుడేనని, ప్రైవేటు పరం కాకుండా కాపాడతానని బూటకపు హామీలిచ్చి మోసం చేశారని సీఐటీయూ రాష్ట్రకార్యదర్శి సీహెచ్ నర్సింగరావు ధ్వజమెత్తారు. గత నెలలో పీడియాక్ట్ కింద అరైస్టె జైల్లో ఉన్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు కుటుంబాన్ని బుధవారం పెనుగొల్లు ధర్మవరంలో పరామర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అక్రమ భూసేకరణ, మత్స్యకారుల ప్రాణాలు తీసే బల్క్‌డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే కక్షతోనే అప్పలరాజుపై చంద్రబాబు ప్రభుత్వం పీడీయాక్ట్ పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించిందన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని అపలేరని తెలిపారు. 2019లో ఓడిపోయాక తండ్రీకొడుకులు మూడేళ్లపాటు పత్తాలేకుండా పోయారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతాను, ప్రైవేటుపరంగా కానివ్వనని ఎన్నికల ముందు బూటకపు హామీ ఇచ్చి మోసం చేశారని తెలిపారు. తీరా గెలిచిన తర్వాత చేతులు ముడుచుకుని కూ ర్చొన్నారన్నారు. బీజేపీతో భాగస్వాములై కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నర్సింగరావు -
నవభారత దీప్తి.. యువతకు స్ఫూర్తి
ఘనంగా వివేకానంద శోభాయాత్రఏయూక్యాంపస్/డాబాగార్డెన్స్: స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఆధ్వర్యంలో బుధవారం నగరంలో ఘనంగా శోభాయాత్ర జరిగింది. విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ యాత్ర రెడ్నం గార్డెన్స్, రాఘవేంద్రస్వామి ఆలయం డౌన్ రోడ్డు, సెవెన్ హిల్స్ ఆస్పత్రి, హోటల్ గ్రీన్‌పార్క్, నౌరోజీ రోడ్డు, నోవాటెల్ మీదుగా ఆర్కే బీచ్‌లోని రామకృష్ణ మిషన్ ఆశ్రమం వరకు సాగింది. ర్యాలీలో భారీ వివేకానందుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు క్రమశిక్షణతో కవాతు చేస్తూ, వివేకానందుని సూక్తులు రాసిన ప్లకార్డులు చేతబూని నినదించారు. పలువురు చిన్నారులు వివేకానందుని వేషధారణలో అలరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ.. నవభారత దీప్తిగా, యువతరానికి నిత్య స్ఫూర్తిగా స్వామి వివేకానంద నిలుస్తారని కొనియాడారు. భారతీయ యువతను మేల్కొలిపి, వారిని కార్యోన్ముఖులను చేసిన ఘనత ఆయనదేనన్నారు. ఆత్మవిశ్వాసం, మనోధైర్యాన్ని పెంపొందించే వివేకానందుని ప్రసంగాలు, సూక్తులు నేటి తరానికి దిక్సూచిలాంటివని, ప్రతి ఒక్కరూ వాటిని చదవాలని పిలుపునిచ్చారు. నేవల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. వివేకానందుని సందేశాల సారాన్ని అందిపుచ్చుకుని, భారతీయ యువత దేశభక్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రామకృష్ణ ఆశ్రమం కార్యదర్శి స్వామి స్వసంవేద్యానంద మాట్లాడుతూ.. దేశాన్ని ప్రేమించడంతో పాటు సేవ చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. యువత కోసం వివేకానందుడు ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆశ్రమ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ రాజు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యువజన, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
దెబ్బతింటున్న అసలు ఉద్దేశం..!
చెత్త భూమిపై పడకుండా నేరుగా కాంపాక్టరులోకి.. అక్కడి నుంచి నేరుగా విద్యుత్ ప్లాంటులోని బాయిలరులో వేయడమే ఈ సీసీఎస్ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం. చెత్త ఎక్కడా బయట కనపడకుండా చూడటం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడమూ ఇందులో భాగం. అలాగే చెత్త తరలించేటప్పుడు రోడ్డుపై పడకుండా చూడాలనేది కూడా ఓ లక్ష్యం. అయితే చంద్రబాబు ప్రభుత్వం సీసీఎస్ వాహనాల నిర్వహణను పట్టించుకోకపోవడంతో లక్ష్యం నీరుగారిపోతుంది. అధికారుల తీరు కూడా ఆడింది ఆట.. పాడిందే పాటగా తయారయ్యిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాజువాక సీసీఎస్‌లో... -
14న సింహగిరిపై సంక్రాంతి సంబరాలు
సింహాచలం: సింహగిరిపై ఈనెల 14న భోగి రోజున సంక్రాంతి సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆ రోజు ఉదయం రాజగోపురం ఎదురుగా మాడవీధిలో పెద్ద ఎత్తున భోగి మంట వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గోపూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 13న సాయంత్రం 4 నుంచి 9 గంటల మధ్య రాజగోపురం ఎదురుగా ఉన్న మాడవీధిలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఆ రోజు ఉదయం 9 గంటలకు చిన్నారులకు భోగిపళ్లు పోసే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భఈనెల 16న కనుమ రోజు శ్రీకృష్ణాపురంలోని గోశాలలో ఉదయం 9గంటలకు గోపూజలు నిర్వహిస్తామన్నారు. సింహగిరిపై రాజగోపురం -
వైఎస్సార్ సీపీలో విశాఖ నేతలకు కీలక పదవులు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగం కమిటీలో పలువురికి చోటు కల్పించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఎల్.రమణమ్మ(విశాఖ దక్షిణ), బీసీ సెల్ కార్యదర్శులుగా నూకవరపు మైకిల్(విశాఖ దక్షిణ), రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా గంట్యాడ గురుమూర్తి(గాజువాక), రాష్ట్ర లీగల్ సెల్ సంయుక్త కార్యదర్శులుగా వాక శ్రీనివాస రెడ్డి(విశాఖ ఉత్తర), యొమ్మి చిన్నారావు(విశాఖ దక్షిణ), గాదె రోషిరెడ్డి(భీమిలి) నియమితులయ్యారు. జిల్లా ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ల వింగ్ అధ్యక్షుడిగా చుక్కా పైడిరాజు(విశాఖ పశ్చిమ), జిల్లా విద్యార్థి వింగ్ ప్రధాన కార్యదర్శిగా కుప్పిలి ప్రసాద్‌బాబు(విశాఖ తూర్పు), విద్యార్థి వింగ్ కార్యదర్శిగా దాడి సంతోష్‌కుమార్(గాజువాక), జిల్లా సోషల్ మీడియా వింగ్ కార్యదర్శిగా శివకళ దుర్గా ప్రసాద్(విశాఖ తూర్పు), జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా చంద్రపాటి ఈశ్వర్రావు(గాజువాక), జిల్లా ఆర్టీఐ వింగ్ ప్రధాన కార్యదర్శిగా రామిరెడ్డి అమర్నాథ్రెడ్డి(గాజువాక), జిల్లా గ్రీవెన్స్‌సెల్ కార్యదర్శులుగా గాలి సునీల్‌కుమార్(గాజువాక), జి.సాయి శివ కుమార్(గాజువాక), బైరెడ్డి శ్రీనివాసరావు(గాజువాక), జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా రాయి గిరి(గాజువాక), వైఎస్సార్ టీయూసీ జిల్లా కార్యదర్శిగా దాము రోతు అప్పలరాజు(గాజువాక)లను నియమించారు. -
మ్యూల్ అకౌంట్ సరఫరా చేసే వ్యక్తి అరెస్ట్
విశాఖ సిటీ : డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు సరఫరా చేస్తున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 81 ఏళ్ల రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.11 లక్షలను కాజేశారు. దీనిపై బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడు జమ చేసిన ఖాతా వివరాలను పరిశీలించగా.. ఆ అకౌంట్ యజమాని వరంగల్ జిల్లాకు చెందిన కొండ్లె రాజశేఖర్(35)గా పోలీసులు గుర్తించారు. అధిక కమీషన్‌కు ఆశపడి తన బ్యాంక్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్ ఇచ్చినట్లు తెలుసుకున్నారు. దీంతో రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. -
పెందుర్తిలో గంజాయి పట్టివేత
పెందుర్తి: ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరం మీదుగా కేరళకు తరలిస్తున్న మూడున్నర కిలోల గంజాయిని పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సీఐ కె.వి.సతీష్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేరళకు చెందిన జోస్ ఫెలిక్స్ అలియాస్ వలాన్ పులి(38), జతిన్ కలిస్టస్ అలియాస్ బాంబ్ జతిన్(30) ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని సేకరించారు. బుధవారం రైలులో పెందుర్తి మీదుగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పెందుర్తి ఎస్ఐ షేక్ జిలానీ ఆధ్వర్యంలో పెందుర్తి రైల్వే స్టేషన్ వద్ద కాపుకాసి నిందితులను పట్టుకున్నారు. గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. -
బడిలో బాహాబాహీ
ఆరిలోవ: తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. మధ్యాహ్న భోజన సమయంలో జరిగిన ఈ గొడవలో ఒక విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడి చేయడంతో రెండు పళ్లు విరిగిపోయాయి. వివరాలివి. పాఠశాలలో ఒక సెక్షన్‌కు చెందిన విద్యార్థి రామచంద్రరావుకు, మరో సెక్షన్‌కు చెందిన విద్యార్థికి మధ్య మాటామటా పెరిగి కొట్లాట మొదలైంది. రెండో సెక్షన్ విద్యార్థి తన స్నేహితులను పిలిపించుకుని రామచంద్రరావుపై మూకుమ్మడిగా దాడి చేశారు. ముఖంపై బలంగా కొట్టడంతో రామచంద్రరావు నోటిలోని పైవరుస పన్ను సగానికి, కింద పన్ను లోపలికి విరిగిపోయాయి. నుదుటిపై కూడా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రామచంద్రరావు తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. గాయపడిన తమ కుమారుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా, పాఠశాలలోనే మోకాళ్లపై నిలబెట్టి ఉంచారని తండ్రి ఆకుల సూరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎం, ఉపాధ్యాయులను నిలదీసినా సరైన సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు. ఆ తర్వాత వెంటనే బాలుడిని విమ్స్‌కు, అక్కడి నుంచి గీతం దంత వైద్యశాలకు తరలించారు. రెండు పళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వారం రోజుల చికిత్స తర్వాత కొత్త పళ్లు అమర్చాలని వైద్యులు సూచించినట్లు విద్యార్థి తండ్రి తెలిపారు. దీనిపై ఆరిలోవ పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. అప్పటికే గొడవ సద్దుమణగడంతో తిరిగి వెళ్లిపోయారు. కాగా..ఈ ఘటన గురించి విద్యా శాఖాధికారులకు హెచ్ఎం తెలియజేయకపోవడం గమనార్హం. పోలీసులకు సమాచారం ఇచ్చాం ఈ ఘటనపై పాఠశాల హెచ్ఎం భవాని స్పందిస్తూ.. ‘విద్యార్థులు కొట్టుకున్న విషయం తెలియగానే వారిని ఆఫీస్ గదికి పిలిపించాం. ఎవరినీ మోకాళ్లపై నిలబెట్టలేదు. ఆస్పత్రికి తీసుకువెళ్దామని అనుకుంటుండగానే విద్యార్థి తల్లి వచ్చారు. వెంటనే ఆరిలోవ సీఐకి సమాచారం ఇచ్చాం. పోలీసులు వచ్చి పరిశీలించి వెళ్లారు. విద్యార్థులు గొడవపడిన విషయం తల్లిదండ్రులకు ఎలా తెలిసిందో మాకు అర్థం కావడం లేదు’అని తెలిపారు. -
రైతు సజీవ దహనం
రావికమతం: మండలంలోని కవగుంటలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో ఓ గిరిజన రైతు సజీవదహనమయ్యాడు. స్థానిక ఎస్ఐ రఘువర్మ, స్థానికులు తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కల్యాణం దొర(65) వ్యవసాయంతో పాటు నాటు వైద్యం చేస్తుంటాడు. ఇతని భార్య గతంలో మృతి చెందగా, ముగ్గురు కుమారులకు వివాహాలు జరిగాయి. వారంతా వేర్వేరుగా ఉంటున్నారు.భార్య మృతి చెందినప్పటి నుంచి పాకలో ఉంటూ నాటు వైధ్యం చేస్తున్నాడు. రోజూ రాత్రి పెద్ద కుమారుడు ఇంటిలో భోజనం చేశాక పాక దగ్గరకు వెళ్లి నిద్రిస్తుంటాడు. సోమవారం రాత్రి కూడా పాకలోనే నిద్రించాడు. మంగళవారం తెల్లవారుజామున స్నానం కోసమని నీళ్లు మరగ బెడుతుండగా మంటలు చెలరేగి క్షణాల్లో పాక దగ్ధమైంది. కాళ్ల నొప్పులతో బాధపడుతున్న కల్యాణం దొర బయటకురాలేక మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. స్థానికులు వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో దొర పాకలో లేడని వారు భావించారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాత పరిశీలించగా దొర మృతదేహం కనిపించిందని స్థానికులు తెలిపారు. అందిన సమాచారం మేరకు స్థానిక అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదు పు చేశారు. ఎస్ఐ రఘువర్మ సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరిలించారు. మృతుడి కుమారుడు రొబ్బా బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రఘువర్మ తెలిపారు. పాకలో వేడినీరు కాస్తుండగా ప్రమాదం -
సంక్రాంతికి 1,007 ప్రత్యేక బస్సులు
డాబాగార్డెన్స్: సంక్రాంతిని పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ విశాఖ నుంచి భారీగా ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు విశాఖలోని వివిధ డిపోల నుంచి మొత్తం 1,007 ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. విశాఖపట్నం, సింహాచలం, మద్దిలపాలెం, మధురవాడ, గాజువాక, విశాఖ స్టీల్, వాల్తేర్ డిపోల నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళానికి అత్యధికంగా 238, విజయవాడకు 215 సర్వీసులను కేటాయించారు. మిగిలిన వాటిలో పార్వతీపురానికి 101, రాజమండ్రికి 86, పలాసకు 85, పాలకొండకు 65, విజయనగరానికి 58, ఇచ్ఛాపురానికి 48, రాజాంనకు 34, సాలూరుకు 28, కాకినాడకు 18, బొబ్బిలికి 10, అమలాపురానికి 10, భీమవరానికి 5, నర్సీపట్నానికి 4, పాడేరుకు 2 చొప్పున బస్సులు నడపనున్నట్లు అప్పలనాయుడు వెల్లడించారు. -
కోతి దాడిలో ఇద్దరు విద్యార్థినులకు గాయాలు
రావికమతం: మండల కేంద్రం రావికమతంలో కోతుల దాడులతో విద్యార్థులు వణికిపోతున్నారు. గత నెలలో ఒకసారి హాస్టల్ విద్యార్థులపై, మరో సారి ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులపై కోతులు దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం నవోదయ విద్యార్థినులపై కోతి దాడి చేయడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. మంగళవారం గెంజి వారి రామాలయా నికి సమీపంలో నవోదయ పాఠశాలలోకి కోతి ప్రవేశించి ఇద్దరు విద్యార్థినులపై దాడి చేసింది. ఈ దాడిలో రావికమతంకు చెందిన ఎస్.లోహిత, గు మ్మాళ్లపాడుకు చెందిన బుర్రకాయుల లీనా గాయపడ్టారు. వారిని పాఠశాల సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా చూడాలని నవోదయ స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ పట్నాయక్ కోరారు. -
యోగానంద నారసింహుడిగా అప్పన్న
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న రాపత్తు ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు మంగళవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి యోగానంద నారసింహుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని యోగానంద నారసింహుడిగా ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల సమేతంగా స్వామిని ఒక పల్లకీలో, ఆళ్వారులను వేరొక పల్లకీలో అధిష్టింపజేశారు. సాయంత్రం ఆలయ మాడవీధిలో స్వామికి వైభవంగా తిరువీధి నిర్వహించారు. ఈ తిరువీధిలో భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
ఇద్దరు దొంగల అరెస్ట్ మల్కాపురం: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. గాజువాక క్రైం పోలీసులు తెలిపిన వివరాలివి. తామర హరిబాబు, బండారి భరత్ తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడి నగదు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను అపహరిస్తున్నారు. దీనిపై ఈ నెల 2వ తేదీన వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జీవీఎంసీ 59వ వార్డు పరిధిలోని కొత్త నక్కవానిపాలెం, గాజువాక పరిధిలోని అజీమాబాద్తో పాటు మరో రెండు ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలు ఒకే తీరుగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నిందితులు ఈ నెల 5వ తేదీ సాయంత్రం గాజువాక మసీద్ సెంటర్ వద్ద సంచరిస్తున్నారన్న సమాచారంతో క్రైమ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగతనాలకు పాల్పడింది తామేనని వారు అంగీకరించారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును క్రైమ్ సీఐ హరికృష్ణ మీడియాకు చూపించారు. మంగళవారం నిందితులను రిమాండ్‌కు తరలించారు. -
రూ.16,200
● మొబైల్ టాయిలెట్ల మాయాజాలంరూ.6,900ఒకే కంపెనీకి అప్పగింతఈ ఫొటోలో కనిపిస్తోంది కేకేవీఎస్ ఆగ్రోటెక్ అనే సంస్థ ఇండియా మార్ట్ వెబ్సైట్లో ఒక రోజు పోర్టబుల్ టాయిలెట్ అద్దె రూ.2 వేలుగా పేర్కొన్న దృశ్యం. కర్నూలులో అద్దె విశాఖలో అద్దెచినబాబు సిఫారసుతో..! అధికార తెలుగుదేశం పార్టీ నేతకు చెందిన సంస్థ కావడంతో పాటు చినబాబు నుంచి వచ్చిన సిఫారసుతోనే దోచిపెట్టే వ్యవహారం ఈ రేంజ్లో సాగుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇండియా మార్ట్‌లో ఒక మొబైల్ టాయిలెట్ కొనుగోలు ధర రూ.18 వేలుగా ఉంది. అంటే విశాఖలో ఒక రోజు అద్దెగా చెల్లించిన మొత్తం కంటే కేవలం రూ.1,800లే ఎక్కువ. అంటే ఒక రోజుకే దాదాపుగా కొనుగోలు ధరను సదరు సంస్థకు చెల్లించినట్టు అర్థమవుతోంది. నేరుగా చినబాబు నుంచి సిఫారసు ఉండటంతో అధికారులు, స్థానిక నేతలూ కిక్కురుమనడం లేదని సమాచారం. -
చైనీస్ మాంజాపై పూర్తి నిషేధం
విశాఖ సిటీ : ప్రాణాంతకంగా మారుతున్న చైనీస్ మాంజాపై నిషేధం ఉన్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి సందర్భంగా పిల్లలు కేవలం సంప్రదాయ కాటన్ దారంతో మాత్రమే గాలిపటాలు ఎగురవేసేలా తల్లిదండ్రులు చూడాలని సూచించారు. ఈ సింథటిక్ దారం ద్విచక్ర వాహనదారుల మెడకు తగిలి ప్రాణాంతక గాయాలు అవుతున్నాయని, గాలిపటాలు ఎగురవేసే క్రమంలో పిల్లల వేళ్లు తెగుతున్నాయని, పక్షులు, వన్యప్రాణులు ఈ దారంలో చిక్కుకుని మరణిస్తున్నాయని తెలిపారు. ఈ దారం విద్యుత్ తీగలకు తగిలితే విద్యుత్ షాక్, అగ్నిప్రమాదాలు, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందన్నారు. చైనీస్ మాంజా అమ్మకాలు, నిల్వ, రవాణా, వాడకంపై ప్రత్యేక నిఘా, ఆకస్మిక తనిఖీలు జరుగుతాయన్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం దీనిపై పూర్తి నిషేధం ఉందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చైనీస్ మాంజా అక్రమ విక్రయాలు, నిల్వల కోసం సమాచారం తెలిస్తే డయల్ 112కు గాని, సీపీ వ్యక్తిగత నెంబర్ 7995095799కు లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
ఫార్మా అండ్ ల్యాబ్ ఎక్స్పో ప్రారంభంపరవాడ: ఫార్మా రంగంలో వస్తున్న వినూత్న మార్పులు, అధునాతన సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని జేఎన్పీసీ ఫార్మా మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జెట్టి సుబ్బారావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన వైజాగ్ ఫార్మా అండ్ ల్యాబ్ ఎక్స్పోను ఉద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగళవారం ఫార్మాసిటీ క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశవిదేశాల్లో తయారైన అధునాతన ఫార్మా పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల యాజమాన్యాలు ఈ కొత్త సాంకేతికతను తమ పరిశ్రమల్లో వినియోగించి అభివృద్ధి సాధించాలని సూచించారు. పరవాడతో పాటు అచ్యుతాపురం, నక్కపల్లి, పైడిభీమవరం, పూసపాటిరేగ ప్రాంతాల్లోని పరిశ్రమలకు, అక్కడ పనిచేస్తున్న సుమారు 60 వేల మంది ఉద్యోగులకు, ఫార్మసీ, కెమికల్ విభాగాల విద్యార్థులకు ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో మొదటి రోజు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించారు. రెండో రోజు బాయిలర్ డిపార్ట్‌మెంట్‌పై, మూడో రోజు పర్యావరణం అంశాలపై సంబంధిత అధికారులు అవగాహన కల్పిస్తారని వివరించారు. ఎగ్జిబిషన్లో 150 సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎన్.సూర్యప్రకాశరావు, ఎం.ఎ.ఎస్.ఎం అధ్యక్షుడు ఎం.శివరామప్రసాద్, డ్రగ్ కంట్రోల్ ఏడీ ఎస్.విజయకుమార్, జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి ఎన్.కల్యాణి, ఏఎస్ఆర్ జిల్లా అధికారి కె. ఇందిరాభారతి తదితరులు పాల్గొన్నారు. -
యోగా డే నాడు మొబైల్ టాయిలెట్ల మొత్తం అద్దె రూ.1.60 కోట్లు టెండర్లు లేకుండానే నామినేషన్ పద్ధతిలో అప్పగింత ప్రధాని కర్నూలు పర్యటనలోనూ అదే తీరు రాష్ట్రంలో ఎక్కడ పర్యటనలు జరిగినా ఒకే కాంట్రాక్టరుకు అప్పగింత పనులన్నీ గుంటూరుకు చెందిన టీడీపీ నేతకే...
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : యోగా డే మాటున చంద్రబాబు సర్కారు దోపిడీకి ప్రణాళిక రచించింది. అనుంగుడైన కాంట్రాక్టరుకు మొబైల్ టాయిలెట్ల అద్దె రూపేణా అడ్డంగా దోచిపెట్టేందుకు స్కెచ్ వేసింది. పైగా ఆ కాంట్రాక్టరు గుంటూరుకు చెందిన టీడీపీ నేతే కావడం గమనార్హం. ఇండియా మార్ట్‌లో కేవలం రూ.2 వేలకే మొబైల్ టాయిలెట్‌ను అద్దెకు సరఫరా చేస్తామని కేకేవీఎస్ ఆగ్రోటెక్ కంపెనీ ప్రకటిస్తుంటే.. కేకేవీఎస్ గ్రీన్ వెంచర్స్ నుంచి జీవీఎంసీ ఏకంగా రూ.16,200 అద్దె చెల్లించేందుకు పనులను అప్పగించడం యోగా డే మరుగున దోపిడీ బాగోతాన్ని బహిర్గతం చేసింది. మరీ విచిత్రమేమంటే కేకేవీఎస్ ఆగ్రోటెక్, కేకేవీఎస్ గ్రీన్ వెంచర్స్ కంపెనీలు రెండూ ఒకేటే కావడం. గత అక్టోబరు 16న కర్నూలులో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమం సందర్భంగా కూడా ఒక్కో టాయిలెట్‌కు అద్దె రూ.6,900 చొప్పున చెల్లించారు. ఇవే కాదు రాష్ట్రంలో ఎక్కడ ప్రధాని పర్యటన జరిగినా.. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనలకై నా... యోగా డే... ఇలా ఏ కార్యక్రమమైనా మొబైల్ టాయిలెట్ల సరఫరా కాంట్రాక్టు మాత్రం గుంటూరుకు చెందిన టీడీపీ నేతకే దక్కుతున్నాయి. ఒకవేళ టెండరులో వేరే సంస్థ పనులు దక్కించుకున్నా.. ఉన్నతాధికారుల ఒత్తిడితో పనులు చేసేది మాత్రం సదరు టీడీపీకి చెందిన సంస్థే అని తెలుస్తోంది. దీంతో కార్యక్రమాన్ని బట్టి ఒక్కోసారి ఒక్కో ధరను ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు సంస్థ వసూలు చేస్తోంది. గత ఏడాది జూన్ 21న యోగా డే పేరుతో విశాఖలో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా ఒక్కో మొబైల్ టాయిలెట్‌కు పెట్టిన ఖర్చు చూస్తే ఏకంగా కొత్త టాయిలెట్ కొనడమే కాదు.. మరో రూ.4 వేలు వెచ్చిస్తే ఏకంగా శాశ్వతంగా టాయిలెట్లను నిర్మించవచ్చననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు కంపెనీల పేర్లతో మాయాజాలం ఒక్క యోగా డే పేరుతో నామినేషన్ పద్ధతిలో జీవీఎంసీ మొబైల్ టాయిలెట్ల అద్దె పేరుతో చెల్లించేందుకు సిద్ధమైన మొత్తం అక్షరాలా రూ.1.60 కోట్లు. ఇదే కాకుండా కర్నూలులో అక్టోబరులో జరిగిన ప్రధాని పర్యటన సందర్భంగా కూడా రూ.41.52 లక్షల మేర చెల్లింపులు చేశారు. గుంటూరుకు చెందిన కేకేవీఎస్ గ్రీన్ వెంచర్స్ సంస్థకే ప్రధానంగా ఈ మొబైల్ టాయిలెట్ల సరఫరా పనులన్నీ దక్కుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఒకే సంస్థ పేరుతో కాకుండా ప్రెస్టేజ్ కన్స్ట్రక్షన్స్, వై.మోహన్, కోనసీమ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ పేరుతో పనులు దక్కినప్పటికీ.. మొబైల్ టాయిలెట్లను సరఫరా చేస్తోంది మాత్రం కేకేవీఎస్ గ్రీన్ వెంచర్స్ సంస్థ అనే విమర్శలున్నాయి. ఈ సంస్థ యజమాని గుంటూరుకు చెందిన టీడీపీ నేత కావడమే ఈ అదనపు చెల్లింపులకు ప్రధాన కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రెండు కార్యక్రమాలు.. రూ.2 కోట్లు..! యోగా డే పేరుతో జరిగిన యోగా విన్యాసాలకు మించి మొబైల్ టాయిలెట్ల ఏర్పాటులో చేసిన విన్యాసాలు రక్తి కట్టించినట్టు అర్థమవుతోంది. వీఐపీ టాయిలెట్ల పేరుతో రూ.16,200, బయో టాయిలెట్ల పేరుతో రూ.16 వేలు.. సాధారణ టాయిలెట్ల పేరుతో రూ.11,957 ఇలా యోగా డే సందర్భంగా అద్దె చెల్లించేందుకు జీవీఎంసీ ప్రజారోగ్యశాఖ అధికారులు సిద్ధమయ్యారు. అది కూడా ఎటువంటి టెండర్ లేకుండానే నామినేషన్‌పై పనులను అప్పగించడం గమనార్హం. కార్యక్రమం నిర్వహించిన 6 నెలల తర్వాత తీరిగ్గా అనుమతి కోసం స్టాండింగ్ కమిటీ ముందు ఉంచారు. ఈ విధంగా మొత్తం రూ.1.62 కోట్ల మేర కేవలం మొబైల్ టాయిలెట్ల అద్దె బిల్లు అవుతుండగా... కర్నూలులో అక్టోబరులో జరిగిన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన వాటిలోనూ ఇదే తంతు జరిగింది. అయితే, ఇక్కడ టెండర్లను పిలిచి... 880 టాయిలెట్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఒక దానికి రూ.4,500, మరో దానికి రూ.6,900 చొప్పున మొత్తం రూ.41.52 లక్షల మేర కేవలం అద్దె రూపంలో చెల్లించింది. అంటే కేవలం ఈ రెండు కార్యక్రమాలకే మొబైల్ టాయిలెట్లకే రూ.2 కోట్లకుపైగా వెచ్చించడం విస్తుగొలుపుతోంది. -
అల్లరి చేశాడని తల పగలకొట్టారు
ఆరిలోవ: తరగతి గదిలో ఓ విద్యార్థి అల్లరి చేస్తున్నాడన్న నెపంతో ఓ ఉపాధ్యాయురాలు.. చేతిలో ఉన్న ఫ్లాంక్తో తలపై కొట్టారు. దీంతో విద్యార్థి తలపై గాయమైంది. ఆరిలోవ ప్రాంతంలోని సీతాంజలి ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లి, స్థానికులు తెలిపిన వివరాలివి. పెదగదిలికి చెందిన జోష్ అనే విద్యార్థి పాత ఆరిలోవలోని సీతాంజలి స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం తరగతిలో పిల్లలు అల్లరి చేస్తున్నారని మందలించే క్రమంలో గణిత ఉపాధ్యాయురాలు జోష్‌ను ఫ్లాంక్తో తలపై కొట్టడంతో గాయమైంది. సాయంత్రం స్టడీ అవర్‌లో ఉండకుండా తొందరగా ఇంటికి వెళ్లిన బాలుడి తల నుంచి రక్తం కారడాన్ని గమనించిన తల్లి.. వెంటనే పాఠశాలకు వెళ్లి నిలదీశారు. అయితే.. ‘అది చిన్న దెబ్బే.. అంత గాబరా పడాల్సిన పనిలేదు’ అంటూ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి పంపించేసిందని ఆమె తెలిపారు. రక్తం కారుతున్నా పాఠశాల యాజమాన్యం సరైన వైద్యం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల సూచన మేరకు బాలుడిని విమ్స్‌కు తరలించి ఎమ్మెల్సీ చేయించారు. చికిత్స పొందుతుండగానే బాలుడు వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి తీవ్రత అర్థమైంది. వేలల్లో ఫీజులు కట్టి పిల్లలను బడికి పంపిస్తుంటే.. ఇలా కొట్టి చంపేస్తారా? అంటూ విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్‌పై వేటు..యాజమాన్యం సేఫ్.. ఘటనపై ఫిర్యాదులు రావడంతో డీఈవో ఎన్.ప్రేమకుమార్ ఆదేశాల మేరకు ఎంఈవో రవీంద్రబాబు మంగళవారం పాఠశాలను సందర్శించి విచారణ జరిపారు. విద్యార్థిని కొట్టిన గణిత ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని యాజమాన్యాన్ని సున్నితంగా మందలించి వదిలేశారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. కేవలం టీచర్‌ను బలిచేసి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన యాజమాన్యాన్ని అధికారులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాలల హక్కుల సంఘాలు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో దారుణం -
వణికిస్తున్న శీతల గాలులు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్న మంచు, చలి ప్రభావం కొనసాగుతోంది. మన్యం వాసులు చలి తీవ్రతకు వణికిపోతున్నారు. మంగళవారం ముంచంగిపుట్టులో 8.0 డిగ్రీలు, పెదబయలులో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధి జి.మాడుగులలో 9.7, హుకుంపేటలో 11.1 డిగ్రీలు, పాడేరులో 11.5 డిగ్రీలు, అరకువ్యాలీలో 12.0 డిగ్రీలు, చింతపల్లిలో 13.5 డిగ్రీలు, అనంతగిరిలో 13.9 డిగ్రీలు, కొయ్యూరులో 14.1 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. ●పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధి మారేడుమిల్లిలో 11.3 డిగ్రీలు, వై.రామవరంలో 11.7 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 14.7డిగ్రీలు, అడ్డతీగలలో 15.8 డిగ్రీలు, రంపచోడవరంలో 16.4 డిగ్రీలు, చింతూరు డివిజన్చింతూరులో 15.2 డిగ్రీలు, ఎటపాకలో 16.5 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి శీతల గాలులు ప్రభావం ఎక్కువగా ఉంటోందని స్థానికులు తెలిపారు. ఉదయం 9 గంటలు దాటే వరకు భానుడు కనిపించడం లేదు. మంచు తెరలు రహదారులను కమ్మేయడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఆకట్టుకున్న సప్త స్వరాలాపన
మద్దిలపాలెం: కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సంగీత కళాభారతి జలజాక్షి హాజరయ్యారు. మొదటి రోజు కార్యక్రమంలో డాక్టర్ గౌరీ, రామ్మోహన్‌రావులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కంకటాల మల్లిక్ దంపతుల చేతుల మీదుగా వీరికి రూ.10 వేల నగదు పురస్కారం, నూతన వస్త్రాలను అందజేశారు. ముఖ్యఅతిథి జలజాక్షి చేతుల మీదుగా ‘సంగీత కళాభారతి’ బిరుదును, జ్ఞాపికను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ.. తాము ఇప్పటివరకు ఎన్నో పురస్కారాలు పొందినప్పటికీ, ఇంత ఘనంగా సన్మానం జరగడం ఇదే మొదటిసారి అని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్ మాధురి దేవి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ప్రదర్శించిన సంగీత గాత్ర రూపకం అలరించింది. 4 వీణలు, 20 మంది గాత్ర కళాకారులు కలిసి సద్గురు శ్రీ త్యాగరాజ సప్త స్వరాలాపన చేసి సభికులకు శ్రావ్యానందాన్ని పంచారు. వీఎండీఏ కార్యవర్గ సభ్యులు ఎం.ఎస్.ఎన్.రాజు, డాక్టర్ రాంబాబు, పైడా కృష్ణప్రసాద్, పంతుల రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ప్రారంభమైన త్యాగరాజ ఆరాధనోత్సవాలు -
కేజీహెచ్‌లో ప్రపంచ బ్యాంక్ బృందం పర్యటన
మహారాణిపేట: ప్రపంచ బ్యాంక్‌కు చెందిన ఉన్నత స్థాయి సాంకేతిక బృందం మంగళవారం కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కళాశాలను సందర్శించింది. రాష్ట్రంలో ఆరోగ్య సేవల నాణ్యత పెంపులో భాగంగా.. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు డాక్టర్ మొహిర్జోన్ అహ్మదోవ్, డాక్టర్ కేరీ గార్డనర్, గణేష్ మరిముత్తులతో కూడిన బృందం ఆసుపత్రిని సందర్శించింది. వీరికి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ మెడిసిన్, ప్రసూ తి విభాగాల అధ్యాపకులు ఆసుపత్రి పనితీరును వారికి వివరించారు. బృందం సభ్యులు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, డయాగ్నోస్టిక్ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యం, పరీక్షల నిర్వహణ తీరుపై ఆరా తీశారు. అనంతరం బృందం లేబర్ కాంప్లెక్స్‌ను సందర్శించి, అక్కడి వసతులను పరిశీలించింది. ప్రసవ సమయంలో అందిస్తున్న సేవలు, లేబర్ రూమ్ నిర్వహణపై విభాగపు వైద్యులతో సుదీర్ఘంగా చర్చించారు. కేజీహెచ్ అత్యవసర వైద్య విభాగాధిపతి వి.ఎస్.ఎన్.మూర్తి, డాక్టర్ ఎన్.నవీన్, డాక్టర్ కిరణ్‌కుమార్, గైనిక్ విభాగాధిపతి జి.సౌమిని, ప్రొఫెసర్ పి.జయంతి, అసోసియేట్ ప్రొఫెసర్ పి.సుధా పద్మశ్రీ, డిప్యూటీ సూపరింటెండెంట్లు డి.రాధాకృష్ణన్, డాక్టర్ వాసవీ లత, డాక్టర్ ఎం.చంద్రశేఖరం నాయుడు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఈ 18 నెలల కాలంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, భూకబ్జాలు, ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా మహిళా విభాగం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరుదు కల్యాణి మాట్లాడుతూ.. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ మహిళా విభాగం కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళలకు జరిగిన మేలును వివరిస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వ మోసాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు సర్కార్‌ను నిలదీస్తూ, ప్రజల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు. కూటమి నేతల అఘాయిత్యాలకు బలవుతున్న బాధితులకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అండగా నిలిచి భరోసా కల్పించాలన్నారు. జోన్–1 మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, పేడాడ రమణికుమారి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు, స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతానికి పైగా అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. మళ్లీ మహిళలకు ఆ ప్రాధాన్యత దక్కాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే దిశగా ప్రతి మహిళా కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. సమావేశంలో మహిళా కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, వార్డు స్థాయి మహిళా నేతలు, అనుబంధ విభాగాల సభ్యులు పాల్గొన్నారు. -
విద్యే వజ్రాయుధం
మధురవాడ/కొమ్మాది: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, గురుకులాల్లో గురువారం ఉదయం అందించే ఉప్మా స్థానంలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలిస్తామని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సి.హెచ్.విజయప్రతాపరెడ్డి వెల్లడించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మధురవాడ, మారికవలస, ఎండాడ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ డిపోలు, జిల్లా పరిషత్ హైస్కూల్, గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. భోజన నాణ్యత, వంటల తీరు, రకుల నిల్వలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. గురువారం ఉదయం పెట్టే ఉప్మా తినలేకపోతున్నామని మారికవలస గురుకుల విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఆయన.. ఉప్మా బదులుగా విద్యార్థులకు ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టే యోచనలో ఉన్నట్లు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విద్య వజ్రాయుధం లాంటిదని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాకుండా నైపుణ్యాలు పెంచుకుంటే ప్రైవేట్ రంగంలోనూ అపార అవకాశాలు ఉంటాయన్నారు. విద్యార్థులు అవినీతి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చైర్మన్‌కు చిన్నారుల గ్రీటింగ్స్ ఎండాడ పాఠశాల సందర్శనలో విద్యార్థులు చైర్మన్‌కు ఘన స్వాగతం పలికారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఫుడ్ ఈజ్ గాడ్ అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డులను ఆయనకు అందజేశారు. వాటిని ఆయన సంతోషంగా స్వీకరించారు. ఫుడ్ కమిషన్ సభ్యుడు సూర్యకిరణ్, డీసీఎస్వో వి.భాస్కరరావు, సివిల్ సప్లై మేనేజర్ ఎం.శ్రీలత, డీఈవో ఎన్.ప్రేమకుమార్, ఐసీడీఎస్ పీడీ కేవీ రామలక్ష్మి, ఫుడ్ సేఫ్టీ అధికారి కల్యాణ్ చక్రవర్తి, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ డిప్యూటీ కంట్రోలర్ కె.టి.రవికుమార్, సోషల్ వెల్ఫేర్ డీడీ రామారావు, మధ్యాహ్న భోజనం పథకం కో–ఆర్డినేటర్ మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. మెనూ పాటించాల్సిందే.. పాఠశాలల్లో కచ్చితంగా మెనూ ప్రకారమే ఆహారం అందించాలని, పౌష్టికాహార సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదని ఫుడ్ కమిషన్ చైర్మన్ హెచ్చరించారు. ఎండాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పిల్లలు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. అలాగే రేషన్ డిపోల ద్వారా లబ్ధిదారులకు బియ్యం, పంచదార సక్రమంగా అందుతున్నాయా అని ఆరా తీశారు. సివిల్ సప్లై, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం, సోషల్ వెల్ఫేర్ వంటి విభాగాలు తమ కమిషన్ పరిధిలోకి వస్తాయని, ఎటువంటి సమస్యలున్నా తమను సంప్రదించవచ్చని తెలిపారు. -
విశాఖ–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు
తాటిచెట్లపాలెం: పండగ వేళ విశాఖపట్నం–చర్లపల్లి–విశాఖపట్నం మధ్య స్పెషల్ రైలు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజనల్ అధికారులు తెలిపారు. విశాఖ–చర్లపల్లి(08513) స్పెషల్ ఈ నెల 18 రాత్రి 11 గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. చర్లపల్లి–విశాఖపట్నం(08514) స్పెషల్ ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ స్పెషల్ దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజవాయడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. -
వీఐపీలకు ఇక ప్రత్యేక సమయం
సింహాచలం: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు వందశాతం సంతృప్తికరమైన సేవలు అందించడమే లక్ష్యమని, ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని రాష్ట్ర దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ తెలిపారు. మంగళవారం ఆయన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని, ‘ప్రసాద్’ పథకం పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా, ప్రోటోకాల్ వీఐపీల దర్శనాలకు ప్రత్యేక సమయాలు కేటాయిస్తామని, ఆ సమయంలోనే వారు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సింహాచలం, విజయవాడ ఆలయాల్లో పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవెల్ పార్కింగ్ భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సింహగిరి రెండో ఘాట్ రోడ్డును(పాత అడవివరం వైపు నుంచి) కొండపై వరకు పొడిగించే ప్రతిపాదనలు చేశామన్నారు. సింహాచలంలో ప్రసాద్ పథకం పనులు నెల రోజుల్లో పూర్తవుతాయని, మెట్ల మార్గం పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. కొండ దిగువన వరాహ పుష్కరిణి వద్ద తలనీలాల కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రసాదాల నాణ్యత, పరిమాణం, పారిశుధ్యంపై ఎస్‌వోపీలను అమలు చేస్తున్నామని, అన్నప్రసాదం నాణ్యత పరిశీలనకు ఇద్దరు అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 22 ఆర్జేసీ, డీసీ హోదా కలిగిన ఆలయాల ఈవోలతో ఎస్‌వోపీలు అమలుపై ప్రతి రెండు వారాలకోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎన్ఎంఆర్ల పర్మినెంట్ విషయంలో నిషేధం ఉందని, కొన్ని చోట్ల కోర్టు ఉత్తర్వుల మేరకు ఇవ్వడం జరుగుతోందన్నారు. పులిహోరలో నత్త వచ్చిందన్న ఆరోపణపై విచారణ జరుగుతోందని, తప్పులు జరిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని భక్తులను కోరారు. ఆ భక్తుడిపై చర్యలు తీసుకునే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. శ్రీనివాసనగర్‌లో కొత్తగా నిర్మించిన కల్యాణ మండపాలను నెలలోపు అందుబాటులోకి తేవాలని, భద్రత కోసం మెటల్ డిటెక్టర్లు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. భైరవవాక ఆలయ రహదారి నిర్మాణంపై అటవీశాఖతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట దేవస్థానం ఇన్చార్జి ఈవో సుజాత, ఈఈ రమణ, ఏఈవోలు ఉన్నారు. 06విఎస్సి95–320092,06విఎస్సి95ఎ–320092: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందంతో కేజీహెచ్ సూపరిండెంటెంట్ వాణి, వైద్యులు -
● ముప్పుటంచున సాగర తీరం
ఏయూక్యాంపస్: విశాఖ సముద్ర తీరం అలల తాకిడికి నానాటికి కుచించుకుపోతోంది. ముఖ్యంగా ఆర్.కె.బీచ్‌లోని విక్టరీ ఎట్ సీ ఎదురుగా ఉన్న ప్రాంతం తీవ్రమైన కోతకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అలల ఉధృతి కారణంగా తీరంలోని ఇసుక సముద్రంలోకి కొట్టుకుపోతుండటంతో, అక్కడి పచ్చదనం క్రమంగా కనుమరుగవుతోంది. గతంలో తీర రక్షణ కోసం, సౌందర్యం కోసం నాటిన కొబ్బరి చెట్లు ఇప్పటికే అలల తాకిడికి నేలకొరిగి సముద్రంలో కలిసిపోయాయి. తాజాగా, వాటి వెనుక రక్షణగా నాటిన మరికొన్ని మొక్కలు కూడా సముద్రంలో కలిసే ప్రమాదం ఏర్పడింది. మొక్కలను, తీరాన్ని రక్షించడానికి గతంలో రాళ్లతో నిర్మించిన గేబియన్ స్ట్రక్చర్ కూడా అలల ధాటికి దెబ్బతింది. ప్రస్తుతం ఆ రాళ్లు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఇవి అలల వేగాన్ని అడ్డుకోవడంలో విఫలమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పర్యాటకులు సముద్ర తీరంలో కాలు మోపడం కూడా కష్టసాధ్యంగా మారే ప్రమాదం ఉంది. అధికారులు తక్షణం స్పందించి, నిపుణుల సూచనలతో తీరం కోతకు అడ్డుకట్ట వేసేలా శాశ్వత పరిష్కార మార్గాలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శాశ్వత పరిష్కారం ఎక్కడ? -
ఆందోళనకరంగా సూచీలు
గత నెల రోజులుగా విశాఖలో గాలి నాణ్యత సూచీలు(ఏక్యూఐ) ఆందోళనకరంగా ఉన్నాయి. చలికాలంలో కమ్ముకుంటున్న కాలుష్య మేఘాలు ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్నాయి. గత వారం రోజులుగా ఢిల్లీలో మాదిరిగా ఏక్యూఐ 326 దాటుతోంది. పలు సందర్భాల్లో 329 కూడా నమోదై ఆందోళన కలిగించింది. ముఖ్యంగా రాత్రి సమయాల్లోనే కాలుష్య ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్ 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తిగా, 101 నుంచి 200 అయితే మోడరేట్‌గా, అంతకు మించి 201 నుంచి 300 అయితే పూర్, 301 నుంచి 400 వరకు అయితే వెరీ పూర్, 401 నుంచి 500 అయితే తీవ్ర ఆందోళనకర పరిస్థితిగా పేర్కొంటారు. విశాఖలో మాత్రం ప్రతి గంటకు గాలి నాణ్యత సూచీ పెరుగుతోంది. సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఏక్యూఐ 290 దాటి అర్ధరాత్రికి 329కి చేరుకుంటోంది. గాలి కాలుష్య రేణువులు క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాములు మించితే ప్రమాదం. పార్టికులేట్ మేటర్(పీఎం) 10 రేణువులు ప్రమాదకర స్థాయిలో 436 చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కానీ పీఎం 2.5 రేణువులు రాత్రి వేళల్లో 386గా నమోదవుతోంది. -
● ఇది బాబు ఫ్రీ బస్సండీ..ఆగదండి
చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఆ ప్రయాణం గమ్యం చేరుతుందా అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా కనిపిస్తున్నాయి. బస్సు ఎక్కితే సీట్ల కోసం తగాదాలు, దిగితే తోపులాటలే కనిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో చూస్తుంటే, అసలు బస్సు ఎక్కడం కూడా మహిళలకు ఒక ‘గగన యాత్ర’లా మారిందనిపిస్తోంది. సంక్రాంతి పండగ హడావుడి మొదలైంది. జగదాంబ సెంటర్ నుంచి పూర్ణామార్కెట్ వరకు ఇసుక వేస్తే రాలనంత జనసంచారం. షాపింగ్‌లు, పనుల కోసం దూరప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు సంచులతో నిలబడి ఉన్నా ఆ సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు కనీసం అపలేదు. దీనిని బట్టి చూస్తే చంద్రబాబు కల్పించిన ఫ్రీ బస్సు ప్రయాణం ఎలా ఉందో ఆర్థమవుతోందని విమర్శలు వెల్లువెత్తాయి. – జగదాంబ -
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తా
మహారాణిపేట: జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం యంత్రాంగం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ‘రెవెన్యూ క్లినిక్’కు ఆర్జీదారులు పోటెత్తారు. సాధారణంగా జరిగే పీజీఆర్ఎస్ కంటే ఈ క్లినిక్కే జనాలు ఎక్కువగా తరలిరావడంతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. గత వారం 72 వినతులు రాగా, ఈ సోమవారం ఆ సంఖ్య గణనీయంగా పెరిగి 137కు చేరింది. దీంతో బాధితుల నమోదు కోసం అధికారులు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో తహసీల్దార్ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడం, ఆన్లైన్ మ్యుటేషన్లు, 1బి పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో రెవెన్యూ అధికారులు కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తుండటంతో బాధితులు జిల్లా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సమస్య పరిష్కారం కాకపోయినా ఫోన్లకు పరిష్కృతమైందనే సందేశాలు రావడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు వంటి అంశాల్లో నివేదికలు స్పష్టంగా ఉండాలని, బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఫైళ్లను వెనక్కి పంపడం లేదా అమరావతిలోని సీసీఎల్ఏ కార్యాలయానికి పంపడం సరికాదని స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో దళారులు, రాజకీయ నాయకుల ప్రమేయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, సామాన్య ప్రజల పట్ల సహృదయంతో స్పందించి నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. డాక్యుమెంట్లు లేవనే నెపంతో డిజిటల్ అసిస్టెంట్లు అర్జీలను తిరస్కరించవద్దని, కనీసం సర్వే నంబర్ ఉన్నా దరఖాస్తును స్వీకరించి విచారణ చేపట్టాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సిబ్బందిపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం జేసీ మయూర్ అశోక్ ఆధ్వర్యంలో కొనసాగిన రెవెన్యూ క్లినిక్‌లో విశాఖ, భీమిలి ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, అన్ని మండలాల తహసీల్లార్లు కలెక్టరేట్ వీసీ హాలులో ప్రజల నుంచి రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరించారు. అక్కడికక్కడే ఫిర్యాదు తాలూక వివరాలపై విచారించారు. వాటి పరిస్థితిని తెలియజేస్తూ పరిష్కారం కోసం చేపట్టబోయే చర్యలను వివరించారు. జేసీ దగ్గరుండి రెవెన్యూ క్లినిక్‌ను పర్యవేక్షించారు. ఆక్రమణదారుల నుంచి రక్షణ కల్పించాలి నేను 1993లో గంభీరం, బోయిపాలెం ప్రాంతాల్లో 164 గజాల చొప్పున నాలుగు స్థలాలను కొనుగోలు చేశాను. అన్ని చట్టబద్ధమైన పత్రాలు ఉన్నప్పటికీ, కొద్ది నెలలుగా స్థానికులు నన్ను స్థలంలోకి రానివ్వకుండా అడ్డుకుంటూ ఆక్రమించుకున్నారు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అధికారులు స్పందించి, సర్వే నంబర్ల ప్రకారం నా స్థలాన్ని అప్పగించి, రక్షణ కల్పించాలి. – ఎన్.స్వర్ణలత, మధురవాడ -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
విశాఖ సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన సత్వరమే పరిష్కరించాలని మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం వీఎంఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 13 ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. నిర్ణీత వ్యవధిలో న్యాయపరంగా చిక్కులు లేనివాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పారు. వచ్చిన ఫిర్యాదుల్లో ప్రణాళిక విభాగానికి చెందినవి 6, పరిపాలన విభాగానివి 4, ఇంజనీరింగ్‌కు 3 ఉన్నాయి. -
అప్పన్నను దర్శించుకున్న మహిళా క్రికెటర్లు, రిఫరీలు
సింహాచలం: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని సోమవారం పలువురు క్రికెటర్లు, బీసీసీఐ ప్రతినిధులు దర్శించుకున్నారు. క్రికెటర్లు వి. కృతిక, నియతి లోకూర్ సహా బీసీసీఐ రిఫరీలు, అధికారులు శివశుక్లా, చేతన్ శర్మ, సుబ్రత దాస్, అభిషేక్ తోమర్, రాకేష్ కుమార్ తదితరులు స్వామివారిని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో వీరి పేరిట అర్చకులు స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందజేశారు. -
బౌల్ ఏరియాతో సంకట స్థితి
గాలి, నీరు, నేల కాలుష్య కోరల్లో చిక్కుకొని నగరానికి సవాల్ విసురుతున్నాయి. ఓవైపు సుందర తీరం.. మూడు వైపులా కొండలు.. మధ్యలో సుమారు 265 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న విశాఖకు వరంగా భావించేవారు. కానీ.. అదే ఇప్పుడు కొంప ముంచే కాలుష్యానికి కారణంగా మారుతోంది. ఈ విధంగా ఉండటాన్ని బౌల్ ఏరియాగా పిలుస్తుంటారు. ఈ బౌల్ ఏరియాలోకి కాలుష్యం విస్తరిస్తే బయటకు వెళ్లే మార్గముండదని పర్యావరణవేత్తల అభిప్రాయం. ఏడాదికి 9 నెలల పాటు నైరుతి దిశగా నగరం వైపు గాలులు వీస్తుంటాయి. ఈ దిక్కున భారీ పరిశ్రమలు ఉండడంతో ఏడాదికి 8 నెలలపాటు అంటే మార్చి నుంచి అక్టోబర్ వరకు అవి వెలువరించే వాయు, ధూళి కాలుష్యాలు గాలివాటంతో నగరాన్ని తాకుతున్నాయి. సుమారు 300 నుంచి 500 మీటర్ల ఎత్తుగా ఉండే ఈ కొండలు ఈ కాలుష్య వాయువులకు అడ్డుగా నిలబడి, వెనక్కు నెట్టి వేస్తున్నాయి. నగరంలోనే అవి తిష్ట వేసుకొనేటట్లు చేస్తున్నాయి. శీతాకాలంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తక్కువ ఉష్ణోగ్రతలు, మంచు కారణంగా కాలుష్యభరిత వాయువులు, హానికర ధూళి పదార్థాలు వాతావరణంలో పైకి పోలేక భూమి పైనే కేంద్రీకృతం అవుతున్నాయి. సాధారణంగా భూమి మీద వేడి గాలులు, ఆ పైన చల్ల గాలులు ఉంటాయి. ఇవి శీతాకాలంలో తారుమారు అవుతూ ఉంటాయి. దీంతో హానికర ధూళి పదార్థాలు ఉపరితల వాతావరణంలోకి వెళ్లడం లేదు. -
రికార్డుల్లో ‘పరిష్కారం’.. క్షేత్రస్థాయిలో ప్రహసనం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల తీరుపై అర్జీదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద ఫైల్స్ పెండింగ్‌లో ఉండకూడదనే ఉద్దేశంతో, క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోయినా పరిష్కారమైనట్లు అధికారులు మొక్కుబడిగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్జీదారుల సంతకాలు లేకపోయినా, నేరుగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమస్య పరిష్కారమైందంటూ తప్పుడు సమాచారం పంపిస్తున్నారని పలువురు సోమవారం మీడియా దృష్టికి తీసుకువచ్చారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్‌తో కలిసి ప్రజల నుంచి మొత్తం 108 వినతులు స్వీకరించారు. వీటిలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగానికి 42 ఫిర్యాదులు అందగా, ఇంజినీరింగ్ సెక్షన్‌కు 28, అడ్మినిస్ట్రేషన్ విభాగానికి 17, రెవెన్యూ విభాగానికి 12, ప్రజారోగ్య విభాగానికి 7 ఫిర్యాదులు అందాయి. మొక్కల విభాగం, యూసీడీ విభాగాలకు ఒక్కో విన్నపం వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ, ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణ రాజు, ఇన్చార్జ్ ప్రధాన వైద్యాధికారి అప్పలనాయుడు, ప్రధాన సిటీ ప్లానర్ ప్రభాకరరావు, డీసీఆర్ శ్రీనివాసరావు, ఇన్చార్జ్ డీడీహెచ్ వాసు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవాలు
మద్దిలపాలెం: కళాభారతి వేదికగా త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఏడు రోజుల పాటు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. వేడుకలను పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు ప్రారంభించనుండగా, డాక్టర్ గౌరీ రామ్మోహన్ రావుకు ‘సంగీత కళాభారతి’ బిరుదును ప్రదానం చేయనున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే ఈ సంగీత యజ్ఞంలో దేశవిదేశాల నుంచి తరలివచ్చే వెయ్యికి పైగా కళాకారులు 429 కచేరీలను ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా 7వ తేదీన త్యాగరాజ స్వామి వర్ధంతి సందర్భంగా నిర్వహించే పల్లకి సేవ, పంచరత్న కృతుల బృంద గానం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు సాగే ఈ ఉత్సవాలు 12న ఆంజనేయ స్వామి ఉత్సవం, మంగళహారతితో ముగుస్తాయని ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ జి.ఆర్.కె. ప్రసాద్ తెలిపారు. -
ఏడు దేశాల నిపుణులకు క్యాన్సర్ చికిత్సలో శిక్షణ
అగనంపూడి : అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రిలో సోమవారం ‘బిమ్స్టెక్’ దేశాల సమష్టి కృషితో క్యాన్సర్ కేర్‌పై ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రకటన మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ అంతర్జాతీయ స్థాయి శిక్షణను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి డైరెక్టర్ ఉమేష్ మహంత్‌శెట్టి మాట్లాడుతూ.. భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్ దేశాలకు చెందిన 35 మంది వైద్య నిపుణులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారని తెలిపారు. క్యాన్సర్ నివారణ, ఆధునిక చికిత్సా పద్ధతులపై అన్వేషణలతో పాటు ఏడు దేశాల మధ్య మెరుగైన వైద్య నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మెడ్‌టెక్ జోన్ సీఈవో జితేంద్రశర్మ, ఉక్కు డైరెక్టర్ ఏ.కె.బాగ్చి మాట్లాడుతూ.. నాణ్యమైన, సమగ్రమైన వైద్య సేవలను తక్కువ ఖర్చుతో బాధితులకు అందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి పొరుగు రాష్ట్రాల రోగులకు కూడా ఇక్కడ విశేష సేవలు అందుతున్నాయని గుర్తుచేశారు. ఈ అంతర్జాతీయ శిక్షణలో భాగంగా ఆంకో పాథాలజీ, ఆంకో నర్సింగ్, ప్యాలియేటివ్ మెడిసిన్, ప్రివెంటివ్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ వంటి విభాగాల్లో నాలుగు వారాల పాటు ఇంటెన్సివ్ ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. -
చదువులో రాణిస్తేనే మంచి భవిష్యత్తు
ఆరిలోవ : చదువులో రాణిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మ్న్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శ్రీకృష్ణాపురంలో గల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఇక్కడ గురుకుల ఆవరణ, తరగతి గదులను పరిశీలించారు. పిల్లలతో నేరుగా మాట్లాడి సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా, రుచికరంగా వండుతున్నారా, బోధన బాగా జరుగుతుందా? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను విద్యార్థులు పేర్లు రాయకుండా పేపర్‌పై రాసి ఇవ్వాలని సూచించారు. అనంతరం ఆయన నేరుగా గురుకులంలో వంట గదికి వెళ్లి పరిశీలించారు. పిల్లలు పేపర్లుపై రాసిన సమస్యలను చదివి అక్కడ వంట సిబ్బందికి వినిపించారు. నీరు ఎక్కువగా కలిపిన పప్పు పెడుతున్నారని, వంకాయ కూర వండినప్పుడు రుచిగా ఉండదని, వంట చేసే ఉమ అక్క తమను తరుచూ తిడుతుందని విద్యార్థులు రాశారు. దీంతో విద్యార్థులను తిడుతున్న వంట మనిషి ఉమను మార్చేయాలని గురుకులాల జిల్లా సమన్వయాధికారి గ్రేస్‌ను ఆదేశించారు. విద్యార్థుల కోసం రుచిగా వంటలు చేసి మంచి భోజనం పెట్టాలని సూచించారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వేసిన పెయింటింగ్స్‌ను పరిశీలించారు. అక్కడ పదో తరగతి విద్యార్థి వేసిన ఓ పెయింటింగ్ పరిశీలించి అభినందించారు. ఈ సందర్శనలో డీఈవో ఎన్.ప్రేమకుమార్, గురుకులాల సమన్వయాధికారి గ్రేస్, గురుకులం ప్రిన్సిపాల్ పూతిరెడ్డి మురళి, అధ్యాపకులు పాల్గొన్నారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి -
రాత్రి పూట విషవాయువులు వెదజల్లుతున్నాయి
భూ ఉపరితలం నుంచి పైకెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కానీ ఇప్పుడు పెరుగుతున్నాయి. దీన్నే ఇన్వర్షన్ లేయర్ అంటారు. ఇది ఒక లిడ్లా మారిపోయింది. పరిశ్రమలు రాత్రి వేళల్లో రసాయన వాయువులు వెదజల్లుతుంటాయి. ఇన్వర్షన్ లేయర్ వల్ల ఈ వాయువులు పైకెళ్లే పరిస్థితులు కనిపించక.. కాలుష్యం పెరుగుతోంది. ఇది చాలా ప్రమాదకరం. ఈ వాయువుల కారణంగా క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. కార్సినోజెనిక్ వాయువులతో పాటు గతంతో పోలిస్తే.. ధూళి కణాలు పెరగడం ఆందోళన కలిగించే అంశంగా పరిగణించవచ్చు. చెట్లు పెంచడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. – ప్రొ.భానుకుమార్, పర్యావరణ నిపుణుడు -
పోర్ట్‌లో పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ
విశాఖ సిటీ : విశాఖ పోర్ట్ అథారిటీని పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుల బృందం సోమవారం సందర్శించింది. ఈ సభ్యులకు పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి వివిధ విభాగాల అధిపతులతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఈ బృందం పోర్ట్‌లో పర్యటించారు. పోర్ట్ సమగ్ర కార్యకలాపాలు, చేపడు తున్న వివిధ వ్యూహాత్మక కార్యక్రమాలను డిప్యూ టీ చైర్పర్సన్ వివరించారు. పోర్ట్ మౌలిక సదుపాయాలు, సరుకు నిర్వహణ సామర్థ్యం, ఆధునీకరణ, యాంత్రీకరణ కార్యక్రమాలు, కవర్డ్ నిల్వ సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, పరిశ్రమల అవసరాల కోసం మురుగునీటి శుద్ధి కేంద్రం ద్వారా నీటి పునర్వినియోగం వంటి అంశాలపై కమిటీకి అవగాహన కల్పించారు. అదే విధంగా విశాఖ పోర్ట్ ద్వారా దిగుమతి–ఎగుమతి కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఉన్న పెట్టు బడి అవకాశాలు, సాధ్యమైన మార్గాలను తెలియ జేశారు. పోర్ట్‌లో జరుగుతున్న కార్యకలాపాలపై పార్లమెంటరీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. -
నిద్రలేచిన ఏపీపీసీబీ, రవాణా శాఖ!
ఇన్నాళ్లూ అవే పరిశ్రమలు, అదే కాలుష్యం వెదజల్లుతున్నా.. కనీస తనిఖీలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిస్థితుల చేయి దాటిన తర్వాత ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ), జిల్లా రవాణా శాఖ అధికారులు నిద్రలేచారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం కమిటీలు వేయడంతో హడావుడి మొదలు పెట్టారు. గత డిసెంబర్ 21 నుంచి పరిశ్రమల్లో తనిఖీలు మొదలుపెట్టారు. నిబంధనలు పాటించని ఏడు పరిశ్రమలను గుర్తించి రూ.10 కోట్ల జరిమానాలు విధించారు. ఇన్నాళ్లూ ఈ పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ఏపీపీసీబీ మొద్దు నిద్ర వ్యవహరించిందా? అనే విమర్శలొస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి బాటలోనే జిల్లా రవాణాశాఖ అధికారులు నడిచారు. ఇప్పుడు చలానాలు వేయడం మొదలెట్టారు. డిసెంబర్ 21 నుంచి ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ పేరుతో తనిఖీలు మొదలుపెట్టి.. 32 వాహనాలపై ఓవర్ లోడింగ్, 69 వాహనాలపై పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని, టార్పాలిన్ లేకుండా.. దుమ్ము ధూళి లోడింగ్‌తో వెళ్తున్న 58 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.17.54 లక్షల జరిమానా విధించారు. జీవీఎంసీ అధికారులు కూడా కాలుష్య నియంత్రణ కోసం జూలు విదిల్చామని చెప్పేందుకు 10 ఎన్ఫోర్స్మెంట్ బృందాల్ని ఏర్పాటు చేశారు. ఇంతవరకూ ఈ బృందాలు ఏం చేశాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారింది. -
సమగ్ర ప్రణాళికతో వీఈఆర్ అభివృద్ధి
మహారాణిపేట : సమగ్ర ప్రణాళికతో వీఈఆర్ (విశాఖ ఎకనామిక్ రీజియన్) అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వీఈఆర్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, భూ సేకరణ ప్రక్రియ, మాస్టర్ ప్లాన్ అమలుపై విస్తృతంగా చర్చించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్‌భరత్ ఆయా శాఖల పరిధిలో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, అర్బన్ డెవలప్మెంట్, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతులు వంటి రంగాల్లో విశాఖ రీజియన్ సమగ్ర అభివృద్ధి చెందాలని కలెక్టర్ పేర్కొన్నారు. విశాఖను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. వీఈఆర్ అభివృద్ధికి అవసరమైన భూ సేకరణను వివాదాలు లేకుండా చేపట్టాలని సూచించారు. వీఈఆర్ పరిధిలో రోడ్లు, రైల్వే మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్ వంటి రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. స్టీల్ సిటీ, ఇండస్ట్రియల్ సిటీ, ఫార్మా సిటీ, టూరిజం వంటి రంగాల్లో వీఈఆర్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలను మిగిలిన ప్రాంతాలతో అనుసంధానం చేయడం, రహదారుల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రిసార్టులు, హోటళ్ల ఆక్యుపెన్సీ పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. బీచ్ ఫ్రంట్లు, వరల్డ్ క్లాస్ థీమ్ పార్క్, వాటర్ స్పోర్ట్స్ హబ్‌లతో విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేయాలన్నారు. కై లాసగిరి మాస్టర్ ప్లాన్ కింద మెగా రీ డిజైన్ పనులకు త్వరలో శ్రీకారం చుట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలోగా మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేయాలన్నారు. ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, మెట్రో, ఏపీఐఐసీ, పరిశ్రమలు, టూరిజం, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు, తహసీశీల్దార్లు సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
పార్కింగ్ ఫీజులు నియంత్రించండి
డాబాగార్డెన్స్: నగరంలోని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు, వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 44ను కఠినంగా అమలు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, న్యాయవాది కొండా రాజీవ్‌గాంధీ కోరారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఆయన కమిషనర్ కేతాన్గార్గ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కింగ్ ఫీజుల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను బహిరంగంగా ఉల్లంఘిస్తూ ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జీవో 44 ప్రకారం.. మొదటి 30 నిమిషాలు పార్కింగ్ పూర్తిగా ఉచితమని, షాపింగ్ బిల్లు లేదా సినిమా టికెట్ చూపిస్తే మొదటి గంట వరకు ఉచితంగా ఉండాలని గుర్తు చేశారు. గంట దాటిన తర్వాత కూడా బిల్లు మొత్తం పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువగా ఉంటే ఉచిత పార్కింగ్ కల్పించాలనే నిబంధనలు ఉన్నాయని, కానీ చాలా చోట్ల వీటిని పాటించడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేసినా, సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కరించినట్లు నమోదు చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలకు నోటీసులు జారీ చేయాలని, పార్కింగ్ ప్రాంతాల్లో నిబంధనలకు సంబంధించిన సైన్ బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల హక్కులను పరిరక్షించాలని రాజీవ్‌గాంధీ విజ్ఞప్తి చేశారు. -
కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు 207 వినతులు
మహారాణిపేట: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో 207 వినతులను కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్‌తో పాటు పీజీఆర్ఎస్ నోడల్ అధికారి శేష శైలజ, జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణిలు స్వీకరించారు. వినతుల్లో అత్యధికంగా జీవీఎంసీకి సంబంధించి 90 ఉండగా, పోలీస్ విభాగానికి చెందినవి 21, ఇతర శాఖలకు సంబంధించినవి 96 ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో అన్ని విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్‌కు వినతి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉత్తర శాసనసభ్యుడు పి.విష్ణుకుమార్‌రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు నేతృత్వంలో సోమవారం విశాఖ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు నేటి నుంచి ‘జనతా వారధి’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉంటూ, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అత్తిలి శంకరరావు, ఎ.కేశవకాంత్, అధికార ప్రతినిధి కె.సుహాసిని ఆనంద్, కె.ఎన్.పిచక్రవర్తి, శ్రీరంగం ధనేశ్వరరావు, పురుషోత్తం, శ్రీనివాసరావు, ఎం.సురేష్‌బాబు,ఆర్.విజయ చంద్రుడు, ఎం.ప్రకాష్, పి.వి.కృష్ణారావు, నాదేళ్ల జ్యోతి పాల్గొన్నారు. అర్జీల వివరాలు నమోదు చేస్తున్న కలెక్టరేట్ సిబ్బంది -
నిబంధనలకు పాతర.. స్టాండర్డ్స్ లేని కౌన్సిల్
డాబాగార్డెన్స్: జీవీఎంసీ అక్రమాలకు అడ్డాగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి తమ అనుయాయులకు పదవులు కట్టబెట్టడంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వెనుకడుగు వేయడం లేదు. తప్పు అని తెలిసినా అధికార మదంతో వరుసగా పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. దీనికి నిదర్శనమే నిబంధనలను నీళ్లొదిలి ఒక కార్పొరేటర్ భర్తకు జీవీఎంసీలో కీలక పదవి కట్టబెట్టడం. అక్కడితో ఆగకుండా కట్టుకున్న భార్యను, కన్న కొడుకును వదిలేసిన వ్యక్తిని సైతం జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించడం విశేషం. ఈ అక్రమ నియామకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే, తాము డబ్బులు పెట్టి పదవులను కొనుక్కున్నామని బహిరంగంగానే సమాధానం చెబుతుండటం గమనార్హం. అర్హత, నీతి నియమాలను పక్కన పెట్టి సాగుతున్న ఈ అక్రమ పదవుల పంపకంపై నగర ప్రజలు , పౌర సమాజం తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తోంది. భార్యని..కన్నకొడుకుని వదిలేసిన వ్యక్తికా? ఈ నియామకాల్లో మరో విస్తుపోయే అంశం ఏమిటంటే, నైతిక విలువలను కూడా విస్మరించడం. 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న తన భార్య విమలను, దివ్యాంగుడైన కుమారుడిని పదేళ్ల క్రితమే వదిలేసిన కారి గోవిందరాజును స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం మేయర్ చాంబర్‌కు వెళ్లిన విమలు తన ఆవేదనను వెలిబుచ్చింది. అయితే పీజీఆర్ఎస్లో ఫిర్యాదు తీసుకుంటానని..అక్కడ వేచి ఉండమని మేయర్ బదులిచ్చారని, అయితే తన ఫిర్యాదు తీసుకోవడానికి అక్కడ సిబ్బంది చెప్పడంతో మీడియాను ఆశ్రయించారు. కట్టుకున్న భార్యను, కన్న కొడుకును పట్టించుకోని వ్యక్తి ప్రజా ప్రతినిధిగా ఎలా పనిచేస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ పదవిని తాను డబ్బులు పెట్టి కొనుక్కున్నానని తన భర్తే స్వయంగా చెప్పినట్లు ఆమె మీడియా ముందు వెల్లడించడం జీవీఎంసీలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అద్దం పడుతోంది. ముమ్మాటికీ కోర్టు ధిక్కారణే : సీనియర్ న్యాయవాది సత్యనారాయణ ఈ మొత్తం వ్యవహారంపై సీనియర్ న్యాయవాది పాకా సత్యనారాయణ స్పందిస్తూ.. ఇది స్పష్టంగా కోర్టు ధిక్కరణే అవుతుందని పేర్కొన్నారు. రోస్టర్ పాయింట్లు పాటించకుండా, అఫిడవిట్‌కు విరుద్ధంగా తమకు నచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. జీవీఎంసీ అధికారుల తీరుపై త్వరలోనే కంటెప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నియామకాలను రద్దు చేయాలని బాధితులు, న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల తూచ్ మున్సిపల్ నిబంధనల ప్రకారం కార్పొరేటర్ల కుటుంబ సభ్యులను స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా నియమించడానికి ఎటువంటి అవకాశం లేదు. 15వ వార్డు కార్పొరేటర్ భర్తకే ఆ పదవి లభించేలా చక్రం తిప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి నియామకాలు గతంలో చెల్లకుండా పోయిన ఉదాహరణలు ఉన్నప్పటికీ, జీవీఎంసీలో మాత్రం అవే తప్పులను పునరావృతం చేస్తున్నారు. మరోవైపు, నగర పరిధిని 10 జోన్లకు విస్తరించినప్పటికీ, పాత పద్ధతిలోనే కేవలం 8 మంది సభ్యులను ఎంపిక చేయడం గమనార్హం. ఈ ఎంపిక ప్రక్రియలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించలేదని, మైనార్టీలకు కనీస ప్రాతినిధ్యం కల్పించలేదని ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ మద్దతుదారులకు సైతం మొండిచేయి చూపడంతో ఆ వర్గం వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
కోడిపందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడులు
ఎంవీపీకాలనీ: నగర శివార్లలోని కోడిపందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు విస్తృత దాడులు చేపట్టారు. రెండు రోజులుగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిర్వహిస్తున్న ఈ తనిఖీల్లో భాగంగా.. సోమవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎంవీపీ కాలనీలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని తుంగ్లాంలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో దాడులు చేయగా 12 మంది పట్టుబడ్డారు. వారి నుంచి కోడిపుంజులతో పాటు రూ. 15,200 స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండాల కాలనీలో నిర్వహించిన దాడుల్లో 14 మంది పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి మూడు కోడిపుంజులు, రూ. 10,500 స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. -
అప్పుల బాధ తాళలేక కాంట్రాక్టర్ ఆత్మహత్య
గాజువాక: అప్పుల బాధ తాళలేక ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక శ్రీనగర్ ప్రాంతానికి చెందిన ముదునూరు మోహన్‌రాజు(39) కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన కొన్ని పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో రాకపోవడం, దానికి తోడు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన మోహన్‌రాజు.. గాజువాకలోని ఓ లాడ్జిలో గది తీసుకున్నారు. శనివారం లాడ్జిలో దిగిన ఆయన, ఆదివారం ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. మోహన్‌రాజు గదిలో ఉరివేసుకుని మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫైళ్లపై ‘డిస్కస్’ మంత్రం.. పరిష్కారానికి ఏళ్ల కాలం
మహారాణిపేట: జిల్లాలో భూ సమస్యల పరిష్కారం గగనమవుతోంది. తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు రెవెన్యూ వ్యవస్థ మొత్తం మొద్దునిద్ర పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడు తన భూమి హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంటే, పరిష్కారం కంటే కొర్రీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన దస్త్రాలను ఉన్నతాధికారులు కనీసం పరిశీలించకుండా ‘డిస్కస్’ అని రాసి పక్కన పెట్టడం లేదా బాధ్యత నుంచి తప్పించుకోవడానికి సీసీఎల్ఏ కార్యాలయానికి పంపడం పరిపాటిగా మారింది. ఫలితంగా ఒక్కో దస్త్రం పరిష్కారానికి నెలలు, ఏళ్లు పడుతోంది. జిల్లాలో డీఆర్వో, ఆర్డీవో వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉండటం ఈ జాప్యానికి మరో ప్రధాన కారణమవుతోంది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న వినతుల్లో అత్యధిక భాగం రెవెన్యూ శాఖకు చెందినవే ఉంటున్నాయి. తాజా సమావేశంలో వచ్చిన 413 వినతుల్లో 148 కేవలం రెవెన్యూ సమస్యలే కావడం గమనార్హం. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు స్వయంగా తహసీల్దార్లకు ఫోన్ చేసి ఆదేశిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. ముఖ్యంగా 11 తహసీల్దార్ కార్యాలయాల నుంచి వస్తున్న ఫిర్యాదులకు అంతులేకుండా పోతోంది. అర్జీదారులు ప్రతి వారం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, అధికారులు సెలవులో ఉన్నారని లేదా బిజీగా ఉన్నారని సాకులు చెబుతూ వెనక్కి పంపుతున్నారు. సాకులు చెబుతూ..: భూ దస్త్రాలను తాకడానికి అధికారులు భయపడటం జిల్లాలో వింత పరిస్థితిని సృష్టిస్తోంది. ఏ చిన్న సంతకం చేసినా ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళనతో ఫైళ్లను పెండింగ్‌లో పెడుతున్నారు. పాత రికార్డులు లేవని సాకులు చెప్పడం, ఆన్లైన్ ప్రక్రియలో కావాలని జాప్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాగులో ఉన్న భూములను సైతం ఆన్లైన్ చేయకపోవడంతో రైతు భరోసా వంటి పథకాలు అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా అనుభవిస్తున్న భూములను అకస్మాత్తుగా ప్రభుత్వ భూముల జాబితాలోకి చేర్చడం, జీరో ఖాతాలకు మళ్లించడం వంటి చర్యలు భూస్వాములను బజారున పడేస్తున్నాయి. రాజకీయ కోణం వివాదాల్లేని జీరాయితీ భూములను కూడా రెవెన్యూ రికార్డుల్లో వివాదాల్లోకి నెట్టడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి వివాదంలో పడిన భూమిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడం సామాన్యుడికి తలకు మించిన భారమవుతోంది. జిల్లాలో సర్వే నంబర్ల సబ్–డివిజన్ ప్రక్రియ సక్రమంగా జరిగితే సగం సమస్యలు తీరుతాయని తెలిసినా, ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఫలితంగా వేలాది మంది ఇళ్లు కట్టుకున్నా రిజిస్ట్రేషన్లు లేక, ఆస్తులపై హక్కులు పొందే మార్గం లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. -
వార్డు, బూత్ కమిటీలను త్వరగా నియమించండి
అల్లిపురం: వచ్చే 2029 అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు శ్రేణులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. అన్ని వార్డుల్లోనూ కమిటీల నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలోని 30, 32, 33, 34, 36, 37, 38, 39, 41వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా పార్టీ శ్రేణులకు స్వీట్లు పంపిణీ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయా వార్డుల్లో బూత్ అధ్యక్షులు, వార్డ్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాటు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బూత్, వార్డు స్థాయిల్లోని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, ఆయా పదవులకు సంబంధించిన ఆశావహుల బయోడేటాలను త్వరగా అందజేయాలని నాయకులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట పద్మావతి, కోడిగుడ్ల పూర్ణిమ, పార్టీ జిల్లా కార్యదర్శి గనగళ్ల రామరాజు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్ర భారత్, పార్టీ ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు వడ్డాది దిలీప్, జిల్లా కార్యదర్శి బొడ్డు ఆనంద్, నాయకుడు పచ్చిపల్లి రాము, రాష్ట్ర నాయకులు లింగం శ్రీను, రాష్ట్ర అనుబంధ సంఘాల కార్యదర్శులు సాగర్, భాను, వార్డు అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్, ముత్తబత్తుల రమేష్, మహమ్మద్ షాకిల్, గురజారపు రవి, చేపల నూకరాజు, ముజీబ్ ఖాన్, జిల్లా అనుబంధ సంఘాల ఉపాధ్యక్షులు కోన శంకర్, గుంటూ ఆనంద్, దూడ అప్పారావు, దక్షిణ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఆకుల శ్యామ్, బాబ్జి, సూర్య, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా రెడ్డి కుటుంబాల ఆత్మీయ కలయిక
ఎంవీపీకాలనీ: శివాజీపార్కులో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రెడ్డి కుటుంబాల ఆత్మీయ కలయిక ఉత్సాహంగా జరిగింది. ఈ వేడుకకు వైఎస్ రవీంద్రనాథ్‌రెడ్డి, మారిటైం బోర్డ్ మాజీ చైర్మన్ కాయల వెంకటరెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సమష్టి కృషితోనే రెడ్ల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఏటా ఇలాంటి వేడుకలు నిర్వహించి కుటుంబాల మధ్య బంధాన్ని పెంచాలని, మహిళలు, చిన్నారుల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. సంఘం అధ్యక్షుడు గొరుసు మహేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్తి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విశాఖలో రెడ్లకు కనీసం ఒక్క ఎమ్మెల్యే టికెట్ అయినా కేటాయించాలని కోరారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చిన ప్రతిసారీ రెడ్డి కులస్తులను గెలిపించుకున్న చరిత్ర ఉందన్నారు. జీవీఎంసీ తొలి మేయర్, ఎమ్మెల్యే ఎన్ఎస్ఆర్ రెడ్డి, సూర్యరెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, సుబ్బరామిరెడ్డి, తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి వంటి ఎందరో రెడ్లు విశాఖలో ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచారని గుర్తుచేశారు. ఇదే తరహాలో ఇప్పుడు కూడా టికెట్లు కేటాయిస్తే వారిని గెలిపించుకునే బాధ్యత ఇక్కడి రెడ్డి సంఘాలు తీసుకుంటాయని స్పష్టం చేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గంట గంటకు పట్టు చీర, ప్రశ్నలకు దంపతులిద్దరూ ఒకే సమాధానం చెప్పడం, కుర్చీల కింద టోకెన్స్ గేమ్‌లో సిల్వర్ కాయిన్స్ గెలుచుకోవడం వంటి పోటీలు ఉత్సాహాన్ని నింపాయి. -
‘త్రివిక్రముడి’గా అప్పన్న
సింహాచలం: సింహగిరిపై వైభవంగా జరుగుతున్న రాపత్తు ఉత్స వాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ‘త్రివిక్రముడి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తి అయిన గోవిందరాజస్వామిని త్రివిక్రమ అవతారంలో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామివారు పలకీలో అధిష్టించి భక్తులను అనుగ్రహించారు. మరో పల్లకిలో ఆళ్వారులను ఉంచి ఆలయ మాడవీధిలో విశేషంగా తిరువీధి సేవ నిర్వహించారు. సాయంత్రం జరిగిన ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకుడు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
నృత్య సాగర సోయగం
మద్దిలపాలెం: భారతీయ సంప్రదాయ నృత్యాలన్నీ ఒకే వేదికపై ఏకమై..‘థక్ ధిమి తయ్యాకు తాక ధిమి’ తాళాల మధ్య వందలాది మంది కళాకారులు నర్తిస్తూ నృత్య సాగర సోయగాన్ని ఆవిష్కరించారు. సాక్షాత్తు వైశాఖేశ్వరునికి నృత్య నీరాజనం పలికిన ఈ మహా బృంద నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నటరాజ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఎంజీఎం పార్క్ వేదికగా జరిగిన ‘ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డ్యాన్స్ – 2026’ ముగింపు వేడుకలు కనులపండువగా సాగా యి. సుమారు 750 మంది కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్య రీతుల్లో ఏకకాలంలో నర్తిస్తూ నటరాజుకు, పార్వతీదేవికి అర్పించిన నృత్య నివేదన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకను వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, దాడి ఇన్స్టిట్యూట్స్ అధినేత దాడి రత్నాకర్, ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ బి. సత్యనారాయణ రాజు మాట్లాడుతూ భారతీయ సంప్రదాయ కళలకు అంతర్జాతీయ వేదికగా విశాఖ నిలవడం గర్వకారణమన్నారు. పదర్శనల్లో భాగంగా నటరాజ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు సమర్పించిన మహిషాసుర మర్దిని నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది. పద్మభూషణ్ వెంపటి చిన సత్యం నృత్య పరికల్పనలోని కూచిపూడి ‘నాట్యాంబ్రహ్మాంజలి’, కేవీ సత్యనారాయణ రూపొందించిన ‘వినాయక స్తుతి’ ప్రేక్షకులను అలరించాయి. భరతనాట్య విభాగంలో మైసూర్‌కు చెందిన డా. వసుంధర దొరస్వామి దర్శకత్వంలోని ప్రదర్శనలు, ఆంధ్రనాట్య సృష్టికర్త కళాకృష్ణ పరికల్పనలోని అంశాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సందర్భంగా కళాక్షేత్రంలో విశేష సేవలందించిన డా. వసుంధర దొరస్వామిని ఐటీడీసీ జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమ రథసారథి విక్రమ్ గౌడ్ పర్యవేక్షణలో ఈ నాట్య విలాసం దిగ్విజయంగా ముగిసింది. హరేకృష్ణ మూమెంట్‌కు చెందిన నిష్కించిన భక్తదాస, కార్పొరేటర్ ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు.750 మంది కూచిపూడి, భరతనాట్య విన్యాసం -
విశాఖ తీరాన ఎగసిన కార్మిక కెరటం
జగదాంబ: రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కార్మిక లోకంతో విశాఖ నగరం జనసంద్రమైంది. సీఐటీయూ అఖిల భారత మహాసభల సందర్భంగా నిర్వహించిన భారీ ప్రదర్శనతో నగరం ఎరుపెక్కిపోయింది. జగదాంబ సెంటర్ నుంచి ఇందిరా మున్సిపల్ స్టేడియం వరకు జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది కార్మికులు పాల్గొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తారు. కార్మిక చట్టాలను అమలు చేయాలి.. లేబర్ కోడ్లను రద్దు చేయాలి అంటూ చేసిన నినాదాలతో విశాఖ వీధులు హోరెత్తాయి. జీవీఎంసీ 39వ వార్డులోని ఇందిరా మున్సిపల్ క్రికెట్ స్టేడియంలో సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ కె. హేమలత అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య నాయకులు తపన్ సేన్, కరీం, గఫూర్, నర్సింగరావు, సాయిబాలు ప్రసంగిస్తూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. 2019లో పరాజయం పాలై, 2024లో మారతానంటూ ప్రజల కాళ్లు పట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మళ్లీ పాత పద్ధతులనే అవలంబిస్తున్నాడని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో చేతులు కలిపి కార్మికులను ఉక్కుపాదంతో తొక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 50 లక్షల మంది కార్మికులకు చట్టబద్ధమైన వేతన సవరణ జరగడం లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు, పెన్షన్, పీఎఫ్ సౌకర్యాలు లేకపోవడం శోచనీయమ న్నారు. దేశాన్ని అమ్మడమే పనిగా పెట్టుకున్న మోదీకి చంద్రబాబు మద్దతు తెలపడం కార్మికులకు చేస్తున్న అన్యాయమని, కార్మిక మంత్రులు కేవలం దిష్టిబొమ్మల్లా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. అంగన్వాడీల సమస్యలు తీరుస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోని ఎమ్మెల్యేలను, ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించిన నారా లోకేష్‌ను నాయకులు ప్రశ్నించారు. అలాగే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన శాఖలోని నామమాత్రపు వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల కష్టాలను ఎందుకు చూడటం లేదని నిలదీశారు. మార్పు కోసం పనిచేయాల్సిన పవన్ కల్యాణ్, సనాతన ధర్మం పేరిట కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కనీస వేతన చట్టం–2026ను వెంటనే అమలు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని సభ తీర్మానించింది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. 2025 విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, అసంఘటిత కార్మికులకు ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12న జరగబోయే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. -
సింహాద్రి ఎన్టీపీసీ కొత్త బాస్ ‘అయస్కాంత జెనా’
పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీ బిజినెస్ యూనిట్ నూతన హెడ్ ఆఫ్ ప్రాజెక్ట్‌గా అయస్కాంత జెనా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ 14 నెలల పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా పనిచేసిన సమీర్ శర్మ ఢిల్లీలోని ఐటీ విభాగానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సికింద్రాబాద్ ఈఎన్జీజీ ప్లానింగ్ సీజీఎంగా పనిచేస్తున్న జెనా ఇక్కడకు బదిలీపై వచ్చారు. నూతన హెచ్వోపీగా బాధ్యతలు చేపట్టిన జెనాకు ప్లాంట్ అధికారులు ఘనస్వాగతం పలికారు. 1990లో ఎన్టీపీసీలో చేరిన ఆయనకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, టాస్క్ ఫోర్స్ కార్యకలాపాల్లో అపార అనుభవం ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింహాద్రి ఎన్టీపీసీలో నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ, ప్రాజెక్టును ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. -
అప్పన్న సేవలో రైల్వే పార్లమెంటరీ కమిటీ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారిని ఆదివారం రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. ఈ బృందంలో ఎంపీలు భరత్‌భాయ్ మనుభాయ్ సుతారియా, డాక్టర్ కె.లక్ష్మణ్, నరహరి అమీన్, ఖాజిన్ ముర్మ, భలభద్ర మజ్హి, దామోదర్ అగర్వాల్, సుభాశిష్ కుంటియా, కౌశలేంద్రకుమార్, సుదామ ప్రసాద్, ఉమ్మెదరామ్ బెనివాల్ తదితరులు ఉన్నారు. ముందుగా వీరంతా ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అంతరాలయంలో అర్చకులు వీరి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనం అందించారు. దర్శనానంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం కమిటీ సభ్యులకు స్వామి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రాలను దేవస్థానం ఇన్చార్జి ఈవో సుజాత అందజేశారు. -
9 నుంచి మహా సంక్రాంతి సంబరాలు
మద్దిలపాలెం: ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో మహా సంక్రాంతి సంబరాలు–2026కు సంబంధించిన రాట మహోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పూజలు చేసి, వేడుకల వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 13, 14, 15 తేదీల్లో ప్రధాన వేడుకలు జరుగుతాయని, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతారని వివరించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ‘ఇంటింటా స్వదేశీ – ప్రతి ఇంటా స్వదేశీ’అనే నినాదంతో పాటు వందేమాతర గీతం 150 ఏళ్ల ఉత్సవాలు, దేశ సమైక్యతలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి విశిష్టతను చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు జీవీఎల్ వెల్లడించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఎం.ఎన్. పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు. -
భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత జగన్‌దే
డాబాగార్డెన్స్: ఇతరులు చేసిన అభివృద్ధి పనులను తన ఖాతాలో వేసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధహస్తుడని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్‌వెస్లీ విమర్శించారు. గతంలో సెల్‌ఫోన్ కనిపెట్టింది తానేనని, గూగుల్‌ను విశాఖకు తెచ్చింది తానేనని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలోనూ అదే క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో సింహభాగం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలోనే జరిగిందని జాన్‌వెస్లీ గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం రూ.900 కోట్లతో 2,751 ఎకరాల భూసేకరణను పూర్తి చేసిందని, రైతులకు ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు పరిహారం అందించిందన్నారు. డి–పట్టా భూములకు సైతం జిరాయితీ భూములతో సమానంగా పరిహారం చెల్లించి రైతులకు న్యాయం చేశారని తెలిపారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వదిలేసిన 117 ఎకరాల భూ సేకరణను కూడా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు. నిర్వాసితులైన 376 కుటుంబాలకు రూ.80 కోట్లతో టౌన్షిప్ స్థాయి సౌకర్యాలతో కాలనీని ఏర్పాటు చేశారని, ఒక్కో కుటుంబానికి 5 సెంట్ల స్థలంతో పాటు రూ.8.70 లక్షల పరిహారం అందించారని చెప్పారు. అన్ని అనుమతులతో 2023 మే 3న భూమిపూజ నిర్వహించి, 3.8 కి.మీ రన్‌వే, రక్షణ గోడ నిర్మాణం, 6 లైన్ల అప్రోచ్ రోడ్డు పనులను వేగవంతం చేశారని వెల్లడించారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు కేవలం ఓట్ల కోసం అనుమతులు లేకుండానే కొబ్బరికాయ కొట్టి ప్రాజెక్టును గాలికి వదిలేశారని జాన్‌వెస్లీ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రస్తుత ట్రయల్ రన్ ఆ కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. ఇప్పటికై నా చంద్రబాబు ఇతరుల కష్టాన్ని తనదిగా చెప్పుకునే నైజాన్ని మానుకోవాలని హితవు పలికారు. -
ఇప్పటి రాజకీయ ధోరణులకు సరిపోను
సీతంపేట: వైజాగ్ బ్రాహ్మిణ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ‘కాఫీ విత్ ఉండవల్లి అరుణ్ కుమార్’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని తన రాజకీయ ప్రస్థానం, అనుభవాలు, సమకాలీన అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పన్నెండేళ్లుగా తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఉండవల్లి స్పష్టం చేశారు. మారుతున్న ఇప్పటి రాజకీయ ధోరణులకు తాను సరిపోనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఆధ్యాత్మిక అంశాలపై స్పందిస్తూ.. ‘హిందుత్వం అనేది కేవలం మతం కాదు, అది ఒక సనాతన ధర్మం. అది ఎప్పటికీ నిత్యనూతనంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. మానవ జీవితంలో ఎదురయ్యే అన్ని ప్రశ్నలకు భగవద్గీతలో సమాధానాలు లభిస్తాయని ఆయన తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన రాజకీయ చాతుర్యం దేశానికి దిశానిర్దేశం చేసిందన్నారు. అలాగే మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ సేవలను కొనియాడుతూ, ఢిల్లీలో ఆయన అందరికీ అందుబాటులో ఉండేవారని, కులమతాలకు అతీతంగా ఎంతోమందికి రాజకీయ భిక్ష ప్రసాదించారని గుర్తుచేసుకున్నారు. బ్రాహ్మణులు రాజకీయంగా రాణించాలంటే తమ నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో ద్రోణంరాజు శ్రీవాత్సవ, టీఎస్ఆర్ ప్రసాద్, చెరువు రామకోటయ్య, వేదుల హనుమంతరావు, కాళీ నరసింహం, కావూరి చరణ్ కుమార్, శ్రీరంగం దివాకర్, శంకర్ నీలు, నండూరి సుబ్రహ్మణ్యం, కేశప్రగడ నరసింహమూర్తి, టీఎస్కే అరుణ్ కుమార్, రాచకొండ దశరథ రామయ్య తదితర బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలి
కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు: బొత్స సత్యనారాయణబీచ్రోడ్డు: వైఎస్సార్సీపీ పురోగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం సిరిపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అరకు నియోజకవర్గ నాయకులు బొత్సను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలతో పాటు పార్టీకి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న తీరుపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని బొత్స వారికి సూచించారు. పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని, పార్టీ కోసం కష్టపడేవారికి తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. బొత్సను కలిసిన వారిలో జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జిన్ని నరసింహమూర్తి, అరకు వ్యాలీ ఎంపీటీసీ దురియ ఆనంద్ కుమారి, సీనియర్ నాయకులు భూర్జ హస్తిన కుమార్, గొల్లోరి గోపాల్ రావు, మజ్జి గురు, బోయి మోహన్ రావు, శెట్టి సోమేష్, కొర్రా బాబురావు, కొర్రా సాలమన్, భీమన్న, రామారావు తదితరులు ఉన్నారు. -
ఉద్యమించిన ఉక్కు నిర్వాసిత నిరుద్యోగులు
పెదగంట్యాడ: విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం సర్వం కోల్పోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉక్కు నిర్వాసిత నిరుద్యోగులు ఆదివారం ఉద్యమించారు. పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు నిరసనగా భిక్షాటన చేయడానికి పూనుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం, యాజమాన్యానికి తమ ఆవేదనను తెలియజేయాలని భావించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. భిక్షాటన ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో, వారంతా కుటుంబ సభ్యులతో సహా పాత గాజువాకలోని లంకా మైదానంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాసిత సంఘం నాయకులు మాట్లాడుతూ.. నిర్వాసిత నిరుద్యోగులకు స్టీల్‌ప్లాంట్ మిగులు భూముల్లో ఎకరం చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ చేయాలని, లేని పక్షంలో జీవనభృతి కింద నెలకు రూ.25 వేలు చొప్పున చెల్లించాలని కోరారు. వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్న తమను స్టీల్‌ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మబలికి భూములు తీసుకున్నారని, నాటి నుంచి నేటి వరకూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో 64 గ్రామాలకు చెందిన నిర్వాసితులు, నాయకులు పితాని భాస్కరరావు, ఉమ్మిడి అప్పారావు, పల్లా కార్తీక్, గళ్లా రామకృష్ణ, కోన రమణ, పేర్ల జగన్, నడిగట్ల ప్రసాద్, మంత్రి గోపీ, అంగాల దేముడు తదితరులు పాల్గొన్నారు. -
గీత కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి
ఆరిలోవ: గీత కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. విశాఖ అర్బన్ గీత కులాల ఆహ్వానం కమిటీ ప్రతినిధులు అప్పారి గిరిబాబు, సింహాచలం బోర్డు మాజీ సభ్యుడు సంపంగి శ్రీను ఆధ్వర్యంలో ముడసర్లోవ పార్కులో ఆదివారం ఘనంగా నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు 30 వేల మందికి పైగా తరలివచ్చిన గీత కులాల సంఘ నాయకులు, ప్రతినిధులుతో వేదిక కళకళలాడింది. పెద్ద ఎత్తున హాజరై తమ సంఖ్యా బలాన్ని చాటుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 25 శాతం మంది గీత కులాల వారు ఉన్నారని, గీత కులస్తుల ఐక్యత కోసం, హక్కులు సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కులాల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. ఈ వన సమారాధన వేదిక గీత కులాల వారి భవిష్యత్తు, అభివృద్ధికి దిశ, నిర్దేశం అవుతుందని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ గీత కులస్తులు సామాజిక, రాజకీయ రంగాలలో ముందుండే విధంగా ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. శాసనమండలి మాజీ డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రమాదవశాత్తూ తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందిన గీత కార్మికులకు గతంలో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేవారని దానిని పునరుద్ధరించాలని కోరారు. వనసమారాధనలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.అనంత కుమారి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేష్‌బాబు, గణబాబు, మేయర్ పీలా శ్రీనివాస్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొని గీత కులాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, కార్పొరేటర్ అప్పారి శ్రీ విద్య, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి మధు, యాత సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు అంగటి రాము, రేఖలకృష్ణ గౌడ్, కొప్పిశెట్టి కనక శేఖర్, కట్టా మల్లేశ్వరావు, పినగాడి సర్పంచ్ కేసుబోయిన త్రినాథ్, బొమ్మిడి రమణ, దొడ్డి కన్నారావు, గుత్తుల వెంకటేశ్వరరావు, గీత కులాల పెద్దలు పాల్గొన్నారు. -
ఆంక్షల కంచె..
అక్షర ధామంలోవీసీని కలవాలన్నా గండమే..ఏయూ గేట్లకు నో ఎంట్రీ బోర్డులుమద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మునుపెన్నడూ లేని విధంగా కఠిన నిబంధనలు, ఆంక్షలు అమల్లోకి రావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వవిద్యాలయ పాలనా యంత్రాంగం అనుసరిస్తున్న తీరు నియంతృత్వ ధోరణిని తలపిస్తోందని విద్యార్థి లోకం మండిపడుతోంది. ముఖ్యంగా వర్సిటీ పెద్ద దిక్కులైన వీసీ, రిజిస్ట్రార్లను కలిసేందుకు కూడా వీల్లేదంటూ జారీ చేసిన తాజా సర్క్యులర్ వర్సిటీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విద్యార్థులు సంక్రాంతి సెలవుల్లో ఉన్న సమయాన్ని చూసి ఇటువంటి కఠిన నిర్ణయాలు అమలు చేయడంపై సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. ఆంక్షలపై వాగ్వాదం ప్రస్తుతం ఏయూలో ఇతరుల ప్రవేశాన్ని పూర్తిగా నిరోధిస్తూ ‘నో ఎంట్రీ’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న ఈ సువిశాల ప్రాంగణంలో ఇప్పటివరకు ఉన్న రాకపోకల వెసులుబాటును రద్దు చేస్తూ ప్రధాన ద్వారాలను మూసివేశారు. ఆఖరికి కలెక్టర్ బంగ్లాకు వెళ్లే మార్గాన్ని కూడా పరిమితం చేస్తూ నిబంధనలు విధించడం గమనార్హం. కేవలం సౌత్ క్యాంపస్ ఇన్–గేట్, బీచ్ రోడ్డు అవుట్–గేట్ ద్వారా మాత్రమే రాకపోకలు సాగించాలని వీసీ ఆదేశించడంతో వర్సిటీలో కలకలం రేగుతోంది. కేవలం ఐడీ కార్డులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తుండటంతో, కార్డులు మర్చిపోయిన సిబ్బంది, విద్యార్థులు సెక్యూరిటీ గార్డులతో వాగ్వివాదానికి దిగాల్సి వస్తోంది. అనుబంధ కళాశాలల విద్యార్థుల పడిగాపులు ఈ నిబంధనల వల్ల ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు విస్తరించి ఉన్న అనుబంధ సంస్థల విద్యార్థులు తమ సర్టిఫికెట్లు, ఓడీల కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంటారు. అయితే గేటు వద్దే వారిని అడ్డుకుంటుండటంతో ఉన్నత విద్య అభ్యసించిన వారు కూడా పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు, తమను కలవడానికి వచ్చే వారికి వీసీ, రిజిస్ట్రార్లు గ్రీవెన్స్ సెల్ మార్గాన్ని సూచించడం విడ్డూరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. పాలనాధిపతులు విద్యార్థులకు అందుబాటులో ఉండకపోతే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నియంత పాలన.. వీసీని, రిజిస్ట్రార్లను ఎవరూ నేరుగా కలిసేందుకు వీలులేదని, సమస్యలుంటే గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసుకోవాలని నిబంధనలు పెట్టారు. ప్రతి ఒక్కరూ పాలనాధిపతులను కలవడం వలన వర్సిటీలో పాలనకు అంతరాయం కలుగుతుందని వీసీ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొనడం విడ్డూరంగా ఉందంటూ వర్సిటీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. నియంతృత్వ నిబంధనలతో ఏయూను నిర్బంధించడంపై పలు విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏయూ వీసీ, రిజిస్ట్రార్‌ను కలవడానికి ఆంక్షలు పెట్టడమేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శతాబ్ది వేళ...అప్రతిష్ట శతాబ్ది ఉత్సవాల వేళ ఏయూ ప్రతిష్టను పెంచాల్సింది పోయి, ఇలాంటి వింత పోకడలతో ఆభాసుపాలు చేస్తున్నారని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పాలనాపరమైన ఆంక్షలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు బోధనారంగం గాడితప్పుతోంది. 14 విభాగాల్లో రెగ్యులర్ ప్రొఫెసర్లు లేక, గెస్ట్ లెక్చరర్లతో కాలం వెల్లదీస్తున్నారు. నాణ్యమైన విద్య అందక విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల వైపు చూస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సింది పోయి, కేవలం ఆంక్షలతో విశ్వవిద్యాలయాన్ని బందీ చేయడమేంటని విద్యావేత్తలు నిలదీస్తున్నారు. ఏయూలో రాకపోకల సంక్షోభం కఠిన నిబంధనలపై కలకలం.. విద్యార్థుల ఆందోళన -
69 పోక్సో కేసుల్లో శిక్షలు
అల్లిపురం: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 2024, జూన్ 12వ తేదీ నుంచి ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో 69 పోక్సో కేసులలో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయని నగర శాంతిభద్రతల డీసీపీ–2 డి.మేరీ ప్రశాంతి వెల్లడించారు. శనివారం సాయంత్రం నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వివరాలను సుదీర్ఘంగా వివరించారు. నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత భాగ్చి మార్గదర్శకత్వంలో అనేక కేసులను అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా గుర్తించి, వేగవంతమైన దర్యాప్తు నిర్వహించి సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయడం వల్లే ఈ స్థాయిలో శిక్షలు పడడం సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకు తీర్పు వెలువడిన కేసులలో ఒకరికి మరణ శిక్ష, ఇద్దరికి మరణించే వరకూ జీవిత ఖైదు, పది మందికి జీవిత ఖైదు పడగా, మరో 15 కేసుల్లో ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రెండింటిలో ఇరవై ఐదు ఏళ్లు, మరో రెండు కేసుల్లో పది ఏళ్లు, మూడు కేసుల్లో ఏడేళ్ల పాటు కఠిన కారాగార శిక్షలు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పునిచ్చాయని వివరించారు. వీటిలో ప్రధానంగా ఐదు కేసులలో అత్యంత తక్కువ కాలంలోనే న్యాయ ప్రక్రియ ముగిసిందని డీసీపీ తెలిపారు. 2024 సెప్టంబర్ 24న నమోదైన ఒక కేసులో, కన్న తండ్రే తన ఇద్దరు మైనర్ బాలికలపై లైంగికదాడికి పాల్పడగా, కేవలం 10 నెలల వ్యవధిలో అంటే 2025 ఆగస్టు 21న విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేలు జరిమానా విధించడంతో పాటు బాధితురాళ్లకు చెరో మూడు లక్షల రూపాయల నష్టపరిహారం అందజేయాలని ఆదేశించింది. అదేవిధంగా 2025 జనవరి 21న నమోదైన మరో కేసులో 8 నెలల వ్యవధిలోనే సెప్టంబర్ 12న శిక్ష పడగా, శారీరక, మానసిక దివ్యాంగురాలైన మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ బాధితురాలికి రూ.4 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. ఏప్రిల్ 16న నమోదైన మరో దారుణ ఘటనలో, కన్న తండ్రే తన నాలుగేళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడగా, ఐదు నెలల కాలంలోనే సెప్టంబర్ 29న కోర్టు సంచలన తీర్పునిస్తూ నిందితుడికి మరణం వరకూ కఠిన కారాగార జీవిత ఖైదుతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించి, ప్రభుత్వం బాధితురాలికి ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని పేర్కొంది. మార్చి 26న జరిగిన మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో 9 నెలల వ్యవధిలో డిసెంబర్ 30న తీర్పు రాగా, నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష , రూ.20 వేలు జరిమానా విధించి, ఆ మొత్తాన్ని బాధితురాలికి అందజేయాలని కోర్టు తెలిపింది. జూన్ 7న నమోదైన మరొక కేసులో కేవలం ఆరు నెలల వ్యవధిలో అంటే ఈ ఏడాది జనవరి 2న తీర్పు వెలువడగా, మైనర్ బాలికపై లైంగిక దాడికి సహకరించిన ఒక మహిళతో సహా ఇద్దరు నిందితులకు చెరో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ బాధితురాలికి రూ.40 వేలు నష్టపరిహారం చెల్లించాలని విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు ఆదేశించింది. నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో వేగవంతమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా కఠిన చర్యలు తీసుకుంటామని మేరీ ప్రశాంతి స్పష్టం చేశారు. నగర పౌరులు ఎటువంటి నేరాలకు పాల్పడకుండా తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకోకుండా సన్మార్గంలో నడుస్తూ నగరానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా పోలీసులు ఆకాంక్షించారు.


