Visakhapatnam District Latest News
-
నేటి నుంచి కుష్టువ్యాధిగ్రస్తుల గుర్తింపు
మహారాణిపేట : ఈనెల 20 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అమలు చేసేందుకు జిల్లాలో 951 టీమ్‌లు వేశామని, వీరు ఇంటింటికి వెళ్లి అనుమానితులను గుర్తించి, సమీపంలో యూపీహెచ్సీకి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తారని డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు చెప్పారు. ఈ ఏడాది ఇప్పుటివరకు జిల్లాలో 85 కుష్టువ్యాధి గ్రస్తులను గుర్తించామని, వీరికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ నివారణాధికారి డాక్టర్ జి.పూర్ణేంద్రబాబు, కేజీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ దవళ భాస్కరరావు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు పాల్గొన్నారు. -
జకార్తా చేరుకున్న ఐఎన్ఎస్ ముంబై
సింథియా: మల్టీ నేషనల్ ఎక్సర్సైజ్ లాపెరోస్ ఎడిషన్‌లో పాల్గొనేందుకు ఆగ్నేయ మహాసముద్ర ప్రాంతంలో మోహరించిన స్వదేశీ విధ్వంసక నౌక ఐఎన్ఎస్ ముంబై ఇండోనేషియాలోని జకార్తా చేరుకుంది. ఈ వ్యాయామంలో రాయల్ అస్ట్రేలియా నేవీ, ఇండోనేషియా నేవీ, రాయల్ మలేషియన్ నేవీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ, రాయల్ కెనడియన్ నేవీల నుంచి పలు షిప్‌లు పాల్గొంటాయి. సముద్ర నిఘాతో, పరస్పర సహకారంతో సముద్రంలో అనుకూల పరిస్థితులను అభివృద్ధి చేయడమే ఈ ఎక్సర్సైజ్ ప్రధాన ఉద్దేశమని నేవీ వర్గాలు తెలిపాయి. -
పాఠశాల విద్యలో మార్పులపై సమీక్ష
విశాఖ విద్య : పాఠశాల విద్యలో తీసుకొస్తున్న సమూల మార్పులపై ఆ శాఖ డైరెక్టర్ వి.విజయ రామరాజు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీ అంబేడ్కర్ అసెంబ్లీ హాల్లో సోమవారం జరిగిన వర్క్‌షాప్‌నకు విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల కలెక్టర్లు హరేందిర ప్రసాద్, విజయకృష్ణన్, దినేష్ కుమార్, అంబేడ్కర్‌తో పాటు, విద్యాశాఖ ఆర్జేడీ విజయ భాస్కర్, నాలుగు జిల్లాల డీఈవోలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా మోడల్ స్కూళ్ల ఏర్పాట్లు, క్లస్టర్ విధానం అమలు, యూపీ స్కూళ్లను సమీప హైస్కూళ్లలో విలీనానికి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. -
డబ్బులు చెల్లిస్తేనే.. భోజనం!
● ఏయూ హాస్టళ్లలో వింత పోకడలు ● స్కాలర్షిప్లు మంజూరుకాక ఇబ్బందులు ● విద్యార్థులపైనే మెస్, విద్యుత్ బిల్లుల బారం ● అధికారుల తీరుపై విద్యార్థుల నిరసన గళం ● వైస్ చాన్సలర్ భవనం ముందు ధర్నా విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువులు ఫ్రీ అనుకుని చేరితే, ఇక్కడ డబ్బులు కడితేనే కానీ హాస్టళ్లలో భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీ అధికారులకు తమ గోడువెళ్లబోసుకున్నా.. పరిష్కారం దొరక్కపోవటంతో నిరసనకు దిగారు. ఆర్ట్స్ అండ్ సైన్సు కోర్సులు అభ్యసించే హాస్టళ్ల విద్యార్థులు సోమవారం వర్సిటీలోని వైస్ చాన్సలర్(వీసీ) భవనం ముందు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పదుల సంఖ్యలో విద్యార్థులంతా వీసీ భవనం ముందు బైఠాయించటంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళన విరమించాలని సూచించినా, వర్సిటీ అధికారులు వచ్చి, స్పష్టమైన హామీ ఇచ్చాకే, అక్కడి నుంచి లేస్తామని తెగేసి చెప్పారు. విద్యార్థుల ఆందోళనతో వర్సిటీ అధికారులు దిగివచ్చారు. రిజిస్ట్రార్ ధనుంజయరావు ఆందోళన చేస్తున్న విద్యార్థుల వద్దకు వచ్చి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారత్ విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఆంధ్ర యూనివర్సిటీ కమిటీ కార్యదర్శి డి.వెంకటరమణ, సహాయ కార్యదర్శి జి.అజయ్ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకొచ్చారు. స్కాలర్షిప్లు రాకపోవటంతో హాస్టల్ నిర్వహణ వ్యయం విద్యార్థులపై వేయటం సరికాదన్నారు. ప్రైవేట్ హాస్టల్ మాదిరి డబ్బులు కడితేనే భోజనం పెడతామని చెబుతున్నారని, దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. మెస్ చార్జీలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నారని ఆక్షేపించారు. హాస్టల్లో మౌలిక సౌకర్యాలు పెంపొందించకున్నా, విద్యార్థుల నుంచి అభివృద్ధి ఫండ్(హెచ్డీఎఫ్) పేరుతో రూ.750లు వసూలు చేస్తున్నారని, కరెంట్ చార్జీలు కూడా విద్యార్థులపైనే వేస్తున్నారని పేర్కొన్నారు. స్కాలర్‌షిప్‌లతో వర్సిటీ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు ఈ ఆర్థిక భారాన్ని మోయలేకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చించి, కొద్ది రోజుల్లోనే పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ ధనుంజయరావు హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.సాయి తదితరులు పాల్గొన్నారు. -
ఫిట్‌నెస్‌లో అన్నీ ఫిట్టింగులే..!
జీవీఎంసీ వాహనాల ఫిట్నెస్ ట్యాక్స్‌లో గోల్మాల్ ● వాహనాలు మరమ్మతుకు రావడంతో బండారం బట్టబయలు ● జీవీఎంసీ ఖజానాకు రూ.50 లక్షల కన్నం ● నిధుల మళ్లింపులో డీఈ దిలీప్ కీలక సూత్రధారి ● కూటమి నేతల ఒత్తిళ్లతో షోకాజులతో సరి ● పైగా జోన్–1 ఈఈగా పదోన్నతి.. కాపులుప్పాడలో కొత్త పోస్టు ● కలర్ జిరాక్సులతో రోడ్ ట్యాక్స్ నిధులూ మళ్లింపు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : జీవీఎంసీ వాహనాల ఫిట్నెస్ ట్యాక్స్ చెల్లింపులో గోల్మాల్ జరిగింది. ఈ నిధులను పక్కదారి పట్టించారు. ఇందులో సంబంధిత ఏజెన్సీతోపాటు జీవీఎంసీలో మెకానికల్ సెక్షన్ డీఈ దిలీప్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మొత్తం 430 వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం రూ.70 లక్షల మేర జీవీఎంసీ నుంచి ఏజెన్సీకి చెల్లించగా.. కేవలం రూ.30 లక్షల మేర మాత్రమే ట్యాక్స్ చెల్లించి మిగిలిన మొత్తాన్ని మళ్లించేశారు. గత ఏడాది జీవీఎంసీకి చెందిన ఆరు వాహనాలు మరమ్మతుకు గురయ్యాయి. ఈ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోవడంతో ఇన్సూరెన్స్ వర్తించదంటూ బీమా కంపెనీ తేల్చిచెప్పింది. దీంతో బాగోతం బయటపడింది. ఈ నేపథ్యంలో ఈ వాహనాలకు రూ.50 లక్షల మేర జీవీఎంసీ నిధులతో మరమ్మతులు చేశారు. అంతేకాకుండా రోడ్ ట్యాక్స్ చెల్లింపులోనూ జీవీఎంసీ నుంచి నిధులు బొక్కేసినట్టు తేలింది. దీంతో పెనాల్టీతో కలిపి రోడ్ ట్యాక్స్ జీవీఎంసీ చెల్లించాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో కూడా దిలీప్ వైపే వేళ్లన్నీ చూపుతున్నాయి. విచిత్రంగా ఈ నిధుల మళ్లింపులో కేవలం ఏజెన్సీపై మాత్రమే కేసు నమోదు చేసి.. కిందిస్థాయి ఉద్యోగి వర్క్ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకొని.. మెకానికల్ ఈఈగా అప్పట్లో ఉన్న దిలీప్‌ను, సెక్షన్‌ను మాత్రం తప్పించారు. కూటమి నేతల ఒత్తిళ్లతోనే దిలీప్‌పై చర్యలు తీసుకునేందుకు జీవీఎంసీ అధికారులు వెనుకంజ వేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా డీఈ పోస్టును సృష్టించి కాపులుప్పాడకు బదిలీ చేయడంతో పాటు ఏకంగా పదోన్నతి ఇచ్చి జోన్–1 ఇన్చార్జి ఈఈగా నియమించడం గమనార్హం. కలర్ జిరాక్సులతో కలరింగ్ రోడ్ ట్యాక్స్ వ్యవహారంలోనూ కలర్ జిరాక్సులతో కలరింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒక బండికి చలానా చట్టి... అదే చలానా కలర్ జిరాక్స్ తీసి ఇతర వాహనాలకు కూడా రోడ్ ట్యాక్స్ చెల్లించేసినట్టు జీవీఎంసీలో రికార్డులు సృష్టించారు. ఇందుకు అనుగుణంగా ట్యాక్స్ మొత్తాన్ని జీవీఎంసీ ఖజానా నుంచి సదరు ఏజెన్సీ లాగేసుకుంది. రవాణాశాఖ అధికారుల వద్ద రికార్డుల్లో కొన్ని వాహనాలకు రోడ్ ట్యాక్స్ కట్టినట్టు ఉంది. మిగతా వాహనాలకు రోడ్ ట్యాక్స్‌తోపాటు పెనాల్టీ కూడా చెల్లించాలని రవాణాశాఖ నోటీసులు జారీచేసింది. దీంతో పెనాల్టీలను కలుపుకుని మరీ జీవీఎంసీ ఖజానా నుంచి అధికారులు చెల్లించాల్సి వచ్చింది. అయితే, సదరు ఏజెన్సీతో పాటు ఏమాత్రం సంబంధం లేని కిందిస్థాయి ఉద్యోగి వర్క్ ఇన్స్పెక్టర్ను బలిచేశారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు అప్పటివరకు మెకానికల్ సెక్షన్ చూస్తున్న ఇన్చార్జి ఈఈ దిలీప్‌కు కేవలం షోకాజ్ నోటీసులతో వ్యవహారం కప్పిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా మెకానికల్ సెక్షన్లో అవసరం లేకపోయినప్పటికీ అక్కడే పోస్టును సృష్టించి కాపులుప్పాడ ఇన్చార్జి డీఈగా నియమించారు. అంతటితో ఆగకుండా జోన్–1కు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా (ఎఫ్ఏసీ) కూడా నియమించడంలో కూటమి నేతల ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. వాహనాలు ఆగిపోవడంతో.. జీవీఎంసీలో ఆయా డిపార్ట్మెంట్లకు మొత్తం 430 వాహనాలున్నాయి. ఈ వాహనాలకు ఏటా ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫిట్నెస్ ట్యాక్స్‌ను నేరుగా జీవీఎంసీ కాకుండా ఆర్టీఏ ఏజెంట్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో లైసెన్స్ ఉన్న ఆర్టీఏ ఏజెంట్ ద్వారా ఏటా ఫిట్నెస్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. 2024–25కు సంబంధించిన ఫిట్నెస్ ట్యాక్స్‌ను చెల్లించేందుకుగాను సదరు ఏజెంట్ అకౌంట్లో రూ.70 లక్షల మేర నిధులను జీవీఎంసీ మళ్లించింది. ఆ మొత్తాన్ని వెంటనే ఫిట్నెస్ ట్యాక్స్ కోసం చెల్లించి, ఆ కాగితాలను జీవీఎంసీకి ఇవ్వాల్సి ఉంది. ఈ వ్యవహారాలన్నీ జీవీఎంసీలో మెకానికల్ సెక్షన్ చూసే ఈఈ పర్యవేక్షిస్తుంటారు. ఇందుకు భిన్నంగా జీవీఎంసీ నుంచి తన అకౌంట్లోకి వచ్చిన నిధుల్లో నుంచి కేవలం రూ.30 లక్షలు మాత్రమే ట్యాక్స్ కోసం చెల్లించి... మిగిలిన నిధులను సొంతానికి వాడుకున్నారు. అయితే, కలర్ జిరాక్సులు పెట్టి వ్యవహారం నడిపిద్దామనుకునే సమయానికి ఇందులో ఆరు వాహనాలు యాక్సిడెంట్‌కు గురై రిపేరుకు వచ్చాయి. వీటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ) లేకపోవడంతో ఇన్సూరెన్స్ వర్తించదని బీమా కంపెనీ తేల్చిచెప్పింది. దీంతో రూ.50 లక్షలతో వీటికి మరమ్మతులు చేయించారు. దీంతో అసలు బండారం బయటకు వచ్చింది. మరోవైపు చెత్త తరలింపు హుక్ లోడర్ వాహనం కూడా గత 8 నెలలుగా టాటా షోరూంలోనే ఉంది. దీనికి కూడా ఎఫ్‌సీలు, ఇన్సూరెన్స్ లేకపోవడంతోనే మరమ్మతు చేయించకుండా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. యాక్సిడెంట్‌కు గురైన జీవీఎంసీకి చెందిన వాహనాలకు గత 8 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాలేదంటే ఏ స్థాయిలో ఈ గోల్మాల్ జరిగిందనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
మేయర్ ఇలా..అధికారులు అలా..
డాబాగార్డెన్స్: కాలుష్య రహిత నగరంగా విశాఖను తిర్చిదిద్దుదామని నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి కంకణం కట్టుకున్నారు. అందుకు ప్రతి సోమవారం వ్యక్తిగత వాహనాలు వీడి ప్రజా రవాణాను వినియోగిస్తున్నారు. జీవీఎంసీ అధికారులు కూడా ఇలాగే రావాలని నిర్ణయించుకున్నారు. అయితే మేయర్ హరి వెంకటకుమారి మాత్రం మాట తప్పకుండా ప్రతి సోమవారం ఆర్టీసీ బస్సులోనే జీవీఎంసీకి చేరుకుంటున్నారు. అధికారులు మాత్రం వ్యక్తిగత వాహనాలు వీడడం లేదు. ప్రతి సోమవారం జీవీఎంసీ వాహనంలో ఇంటి నుంచి బయలుదేరి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు. గేట్ ముందు వాహనం దిగి..ప్రధాన కార్యాలయం లోపలికి నడుచుకుంటూ విధులకు హాజరవుతున్నారు. తామంతా వ్యక్తిగత వాహనాల్లో రావడం లేదని బిల్డప్ ఇస్తూ ఇలా నాలుగు అడుగులు నడుస్తున్నారు. ఇది చూసిన జనం మాత్రం నవ్వుకుంటున్నారు. -
ప్రజా పరిష్కారవేదికకు 92 వినతులు
డాబాగార్డెన్స్: ప్రజా పరిష్కార వేదికకు 92 వినతులు అందినట్టు నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి పేర్కొన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో కమిషనర్ సంపత్ కుమార్‌తో కలిసి అర్జీలను స్వీకరించారు. జోన్–2 నుంచి 12, జోన్–3 నుంచి 13, జోన్–4 నుంచి 11, జోన్–5 నుంచి 16, జోన్–6 నుంచి 10, జోన్–7 నుంచి ఒకటి, జోన్–8 నుంచి 10 ఫిర్యాదులు అందగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి సంబంధించి 19 ఫిర్యాదులు అందాయని మేయర్ తెలిపారు. మొత్తం వినతుల్లో పట్టణ ప్రణాళికా విభాగానికి చెందినవే 45 ఉండడం గమనార్హం. ● అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డు సమీపంలో ప్రధాన గెడ్డ ఉంది. గెడ్డను ఆక్రమించి ఎటువంటి సెట్‌బ్యాక్స్ లేకుండా ఓ వ్యక్తి భవనం నిర్మిస్తున్నాడు. దీనివల్ల వర్షాకాలంలో పెద్ద ఎత్తున దిగువ ఉన్న ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది..దీనిపై చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతానికి చెందిన వెంకటరావు వినతి పత్రం అందజేశాడు. ● మధురవాడ టీచర్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో లే అవుట్ సుమారు 55 ఎకరాలు. ఎల్పీ నంబరు 2/85, రివైజ్డ్ నంబరు 70/87. లేఅవుట్లో 2 వేల గజాల స్థలాన్ని పార్కింగ్ కోసం విడిచిపెట్టాం. ప్రస్తుతం దానిని వేరే వ్యక్తి కబ్జాకు పాల్పడతున్నాడు. ఈ విషయమై గత నెల 16న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశా. సిబ్బంది వచ్చి లే అవుట్ ప్లాన్ అడిగారు. చూపించా.. లే అవుట్లో కబ్జాకు పాల్పడడమే గాక వేసిన షెడ్డు తొలగించాలని వేడుకుంటే..వచ్చిన సిబ్బంది పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని గత నెల 30న వీఎంఆర్డీఏకి ఫిర్యాదు కూడా చేశాను. మాకు న్యాయం చేసి కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మధురవాడ టీచర్స్ కో ఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఎస్ఎస్ విజయ రాఘవన్ వినతిపత్రం అందజేశారు. ● మధురవాడలోని సర్వే నంబరు 281/8,9,10 షిప్‌యార్డ్ లే అవుట్, వుడా లే అవుట్. ఎల్పీ నంబరు 24/94 ప్రకారం పార్కుగా గుర్తించారు. ఆ స్థలంలో అనధికారికంగా 2 రేకుల షెడ్డులు వెలిశాయి. వాటిని తొలగించాలని పలు మార్లు వినతి పత్రం అందజేశాం. వీఎంఆర్డీఏలో కూడా ఫిర్యాదు చేశాం. మా వినతిపై మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయి విచారణ చేపట్టారు. ఆ స్థలం పార్కుదని తేల్చారు. అయినప్పటికీ జీవీఎంసీ జోన్–2 అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ ప్రాంత వాసి సాగర్ అర్జీ సమర్పించాడు. -
‘ప్రత్యేక’ ప్రక్షాళన షురూ..!
● స్పెషల్ బ్రాంచ్‌ను కుదిపేస్తున్న బెట్టింగ్ కేసు ● సీపీ సీరియస్.. రహస్య విచారణ ● ఇటీవలే ఎస్బీ నుంచి పలువురికి ఉద్వాసన ● తాజాగా 11 మంది ఆయా స్థానాల్లో పోస్టింగ్లురహస్య విచారణ? క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాత్రపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి రహస్యంగా విచారణ చేయిస్తున్నట్లు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. ఒక అధికారితో పాటు కొందరు సిబ్బంది కాల్ డేటాను విశ్లేషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొందరు సిబ్బంది కూటమి ఎమ్మెల్యేలకు వాటాలు సైతం అందించారన్న ఆరోపణల నేపథ్యంలో వాటిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఫలితంగానే వారిని ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు, కీలక సమీక్షలకు దూరం పెడుతున్నారన్నట్లు సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన టెలీ కాన్ఫెరెన్స్‌కు ఒక అధికారిని దూరం పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ.. పోలీసులు ఛేదించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో ఆ శాఖకు చెందిన పలువురి పాత్ర ఉన్నట్లు వస్తున్న ఆరోపణలు ఆ శాఖాధికారులకు తలనొప్పిగా మారింది. విశాఖ సిటీ : క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం ‘స్పెషల్ బ్రాంచ్’ను కుదిపేస్తోంది. ఈ కేసులో ఎస్బీ సిబ్బంది పాత్ర.. పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపుతోంది. ఈ వ్యవహారంపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సీరియస్‌గా ఉన్నారు. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. స్పెషల్ బ్రాంచ్ ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఎస్బీలో దీర్ఘకాలంగా విధులు నిర్వర్తిస్తున్న వారికి ఆ విభాగం నుంచి ఉద్వాసన పలికారు. తాజాగా ఆయా స్థానాల్లో ఇతర స్టేషన్లలో పనిచేస్తున్న ఒక ఏఎస్ఐ, ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. త్వరలోనే ఇతర అధికారులపై కూడా బదిలీ వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తవ్వుతున్నకొద్దీ.. క్రికెట్ బెట్టింగ్ కేసును సీపీ సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పెదవాల్తేర్ డాక్టర్స్ కాలనీలో ఒక నిందితుడిని పట్టుకొని విచారించగా భారీ బెట్టింగ్ వ్యవహారం బట్టబయలైంది. ఇప్పటివరకు పోలీసులు గుర్తించిన దాని ప్రకారం ఈ బెట్టింగ్ ద్వారా రూ.176 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఇంకా అనేక బ్యాంక్ ఖాతాలను సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. దేశ, విదేశాల్లో ఈ బెట్టింగ్ రాకెట్ విస్తరించి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడైంది. ఇదిలా ఉంటే.. ఇందులో కూటమి నేతల హస్తం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా పోలీస్ శాఖలో పలువురు ఈ బెట్టింగ్ రాకెట్‌కు సహకారం అందించారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసులూ.. బెట్టింగ్ బాధితులే! ఈ బెట్టింగ్ భూతానికి పలువురు పోలీసులు సైతం బలైనట్లు తెలుస్తోంది. ఈ బెట్టింగ్‌లకు సహకరించిన వారిని పక్కన పెడితే.. కొంత మంది సిబ్బంది ఈ బెట్టింగ్‌లకు పాల్పడి.. రూ.లక్షలు పోగొట్టుకున్నారు. ప్రధానంగా ఏఆర్‌తో పాటు ఇతర విభాగాలకు చెందిన పలువురు సిబ్బంది ఈ బెట్టింగ్ దెబ్బకు భారీగా నష్టపోయినట్లు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. -
త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలి
విశాఖ సిటీ: ప్రజాదర్బార్‌లో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం.వి.ప్రణవ్‌గోపాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి 21 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్‌తో కలిసి అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల్లో విభాగాల వారీగా ఎన్ని పరిష్కారమయ్యాయని తెలుసుకున్నారు. ప్రజాదర్బార్‌లో వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తేనే సంస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఫిర్యాదుదారుడికి నిర్ధిష్ట కాల పరిమితిలో సమాధానం ఇచ్చే విధంగా ఉద్యోగులు బాధ్యత వహించాలని సూచించారు. మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ మాట్లాడుతూ అర్జీదారులు పలుమార్లు సంస్థ సంస్థ చుట్టూ తిరగకుండా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ కె.రమేష్, కార్యదర్శి మురళీకృష్ణ, ఎస్టేట్ అధికారి దయానిధి, చీఫ్ ఇంజనీర్ భవానీశంకర్, సీయూపీ శిల్ప, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ హరిప్రసాద్, డీఎఫ్ఓ శివాని, ల్యాండ్ అక్వెజిషన్ అధికారి వేణుగోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గ్రే హౌండ్స్ డీఐజీగా అట్టాడ బాపూజీ
డీసీపీ(అడ్మిన్)గా కృష్ణకాంత్ పటేల్ విశాఖ సిటీ: గ్రేహౌండ్స్ డీఐజీగా అట్టాడ బాపూజీ నియమితులయ్యారు. ఇక్కడ ఏడీజీగా విధులు నిర్వర్తిస్తున్న రాజీవ్‌కుమార్ మీనాను ఎస్ఎల్పీఆర్బీ చైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా డీసీపీ(అడ్మిన్) పోస్టును భర్తీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న 2018 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కృష్ణకాంత్ పటేల్‌ను డీసీపీ(అడ్మిన్)గా నియమితులయ్యారు. -
ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా విశాఖ
● సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించండి ● ఓ యజ్ఞంలా ప్లాస్టిక్ నియంత్రణ ● ‘సాక్షి’తో జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ ‘ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను చూడాలి. దీనికి ప్రజల సహకారం చాలా అవసరం. ప్రపంచాన్ని శాసిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ నిషేధాన్ని యజ్ఞంలా భావించాలి. భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలి. ప్లాస్టిక్ అనర్థాలపై ఐదేళ్లుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. జనవరి ఒకటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాం. ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని సూచిస్తున్నాం. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, అధికార యంత్రాంగంతో కలిసి ఇప్పటికే కార్యాచరణ చేపట్టాం. ప్రజల్లో క్రమంగా మార్పు వస్తోంది. ప్లాస్టిక్ నియంత్రణలో ప్రజలూ భాగస్వామ్యం కావాలి’ అని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్‌కుమార్ అన్నారు. ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. డాబాగార్డెన్స్ : ప్లాస్టిక్ నిషేధానికి ఆరు దశల్లో చర్యలు చేపట్టాం. ముఖ్యంగా రీసైక్లింగ్‌కు సాధ్యం కాని ప్లాస్టిక్ నిషేధానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. 120 మైక్రాన్ల మందం కన్నా తక్కువ ఉన్న..రీసైక్లింగ్‌కు సాధ్యం కాని ప్లాస్టిక్‌ను నిషేధించాం. దాదాపు ఎనిమిది వారాల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. జీవీఎంసీ పరిధిలో 55 వేల దుకాణాలు..33 వేల మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. వారందర్నీ జీవీఎంసీ అధికారులు, సిబ్బంది నేరుగా కలిసి నిషేధిత ప్లాస్టిక్‌పై సూచనలు..ఆదేశాలిచ్చారు. విశాఖ మహానగరానికి నిత్యం 15 టన్నుల ప్లాస్టిక్ వస్తోంది. ఎక్కువగా విజయనగరం జిల్లా నుంచి వస్తోంది. ఆ ఉత్పత్తిని కంట్రోల్ చేసేందుకు విజయనగరం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాం. ప్లాస్టిక్ నియంత్రణలో జీవీఎంసీ 3వ దశలో ఉంది. ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా విశాఖను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపేందుకు అనేక చర్యలు చేపడతున్నాం. డోర్ టు డోర్ క్యాంపైన్.. ఇక నుంచి ప్రతి నెలా 15 రోజుల పాటు డోర్ టు డోర్ క్యాంపైన్ నిర్వహించనున్నాం. అందుకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్..శానిటరీ సిబ్బందిని భాగస్వామ్యం చేస్తున్నాం. నిబంధనలు మీరితే.. నిబంధనలు మీరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించే చిరు వ్యాపారులకు మొదటి సారి రూ.2,500, రెండోసారి రూ.5వేలతో పాటు వారి ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తాం. జీఎస్టీ పరిధిలోని వ్యాపారస్తులు మొదటిసారి పట్టుబడితే రూ.20వేలు, రెండోసారి పట్టుబడితే రూ.40వేలు, వ్యాపార లైసెన్స్ రద్దు చేసి.. కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియా ద్వారా.. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విస్తృత ప్రచారం చేస్తున్నాం. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సమీక్షించాం. ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా ప్రత్యామ్నాయమైన స్టీల్, గాజు, పింగాణి, పేపర్, వస్త్ర, నార వస్తువులు వినియోగించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాం. నియంత్రణకు కమిటీలు నిషేఽధిత ప్లాస్టిక్ నియంత్రణకు కమిటీలు వేశాం. వార్డు, జోనల్ స్థాయి, జీవీఎంసీ స్థాయిలో కమిటీలు వేసి ఎప్పటికప్పుడు ఆదేశాలివ్వడం జరుగుతోంది. ప్రజల అవగాహనతోనే నియంత్రణ ముడిపడి ఉంది. టోటల్ ప్లాస్టిక్ బ్యాన్ కాలేదు. 120 మైక్రాన్ల మందంలోపు ప్లాస్టిక్‌ను నియంత్రిస్తున్నాం. జీవీఎంసీ పరిధిలో 330 కిలోమీటర్ల మేర 1.2 మీటర్ల వెడల్పున కాలువలున్నాయి. 3 మీటర్ల ఎత్తులో మెస్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. -
జీవీఎంసీ కమిషనర్ బదిలీ
జీతాలు చెల్లించాలని గెస్ట్ ఫ్యాకల్టీల ఆందోళన8లోవిశాఖ సిటీ: జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్ బదిలీ అయ్యారు. ఆయన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జీవీఎంసీ కమిషనర్‌గా ఎవరిని నియమించలేదు. 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంపత్‌కుమార్ 2024, జూలై 23వ తేదీన జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నగరాభివృద్ధితో పాటు, ప్లాస్టిక్ నివారణ, ప్రాజెక్టులు, ఇతర అంశాలపై ప్రత్యేక దృష్టిసారించారు. నగర సుందీకరణతో పాటు, జాతీయ, అంతర్జాతీయంగా చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా విధులు నిర్వహించారు. తాజాగా ఆయన్ని సీడీఎంఏగా ప్రభుత్వం బదిలీ చేసింది. -
విద్యుదాఘాతంతో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌లోని ఈస్ట్‌కోస్ట్ రైల్వే లైన్లో విద్యుత్ షాక్‌తో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఇస్లాంపేటకు చెందిన మహ్మద్ గౌస్ (36).. స్టీల్‌ప్లాంట్‌లోని రైల్వేకు చెందిన సురభీ ఎంటర్ ప్రైజెస్‌లో కాంట్రాక్ట్ కార్మికుడుగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి షిఫ్ట్ డ్యూటీకు వెళ్లాడు. సోమవారం ఉదయం విధి నిర్వహణలో భాగంగా సహ కార్మికుడు ఆలీతో ట్రాక్‌పై ఉన్న ట్యాంకర్‌కు ఇరువైపులా ఎయిర్ రిలీజ్ పనులు చేస్తున్నారు. రెండు బోగీలు అవతల పెద్ద శబ్దం వచ్చింది. భయంతో వెనక్కి వచ్చి చూడగా..గౌస్ ట్రాక్‌పై తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. ట్యాంకర్‌పై ఉన్న విద్యుత్ లైన్లు తగలడం వల్ల విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే అధికారులకు ఆలీ సమాచారం అందించటంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం స్టీల్‌ప్లాంట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ తాతారావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తాతారావు చెప్పారు. -
గృహిణులకు స్పోకెన్ ఇంగ్లిష్‌లో ఉచిత శిక్షణ
సీతంపేట: గృహిణులకు స్పోకెన్ ఇంగ్లిష్‌లో రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు గృహిణి స్పోకెన్ ఇంగ్లిష్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు దామోదర మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. రామాటాకీస్ సమీపంలో కెనరా బ్యాంకు ఎదురుగా శ్రీకృష్ణా ట్రావెల్స్ మేడపైన ఉన్న సంస్థ కార్యాలయంలో ఈనెల 23 నుంచి మార్చి 23 వరకు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని పేర్కొనాన్రు. ఆసక్తి గల గృహిణులు ఇనిస్టిట్యూట్‌కి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 80193 88999 ఫోన్ నంబర్‌కు సంప్రదించాలని కోరారు. -
అర్జీల రీ ఓపెన్‌పై ఆగ్రహం
పింఛను కోసం దివ్యాంగురాలి వేదన మహారాణిపేట: సరిగా నిలబడలేదు..నోరు విప్పి మాట్లాడలేదు..చివరికి ఆహారం కూడా తినలేని పరిస్థితి. జన్యు పరమైన సమస్యతో ఆమె మానసిక దివ్యాంగురాలిగా జీవనం గడుపుతోంది. పైళ్లె..ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈమె మానసిక పరిస్థితి చూసి భర్త విడిచి వెళ్లిపోయాడు. దీంతో ఆమె తల్లి చేరదీసింది. మానసిక దివ్యాంగురాలైన తన బిడ్డకు పింఛను ఇప్పించండి మహాప్రభో అంటూ కాళ్లరిగేలా తిరుగుతోంది. గోపాలపట్నం ఆర్.ఆర్.వెంకటాపురం నందమూరినగర్‌లో ఉంటున్న మద్ది సత్యవతి..మానసిక దివ్యాంగురాలు. ప్రస్తుతం తల్లి కొయ్యన రమణమ్మ దగ్గర తన ఇద్దరి పిల్లలతో ఉంటుంది. రమణమ్మకు వచ్చే పింఛన్‌తోనే వీరు జీవిస్తున్నారు. మానసిక దివ్యాంగురాలైన తన కుమార్తెకు వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్‌తోపాటు, సదరం సర్టిఫికెట్ కూడా ఉందని, పింఛను మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ సమర్పించేందుకు సత్యవతి, ఆమె పిల్లలను వెంటబెట్టుకుని రమణమ్మ కలెక్టరేట్‌కు వచ్చింది. పింఛను ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంది.మహారాణిపేట: జిల్లాలో 165 రీ ఓపెన్ అర్జీలు రావడంతో కలెక్టర్ హరేందిర ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్జీదారులతో స్వయంగా మాట్లాడి కచ్చితమైన సమాచారాన్ని అందించి, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీ పునరావృతమైతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను 24 గంటల్లోపు ఓపెన్ చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు జేసీ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వీటిని సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 237 వినతులు అందగా..రెవెన్యూ శాఖకు చెందినవి 76, పోలీసు శాఖకు సంబంధించి 15, జీవీఎంసీకి సంబంధించి 65 ఉన్నాయి. ఇతర విభాగాలకు సంబంధించి 81 వినతులు వచ్చాయి. అధికారులకు కలెక్టర్ అభినందన జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పర్యటన, సౌత్ జోన్–2 జ్యుడీషియల్ కాన్ఫరెన్స్‌లను నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించిన అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అభినందించారు. పీజీఆర్ఎస్కు 237 అర్జీలు సమస్యలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం -
ఐఎంయూ వద్ద కొనసాగుతున్న నిర్వాసితుల ఆందోళన
సబ్బవరం: మండలంలోని వంగలి గ్రామంలో ఉన్న ఇండియన్ మారిటైం విశ్వవిద్యాలయంలో స్థానికులకు, భూ నిర్వాసిత రైతులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమం మూడో రోజు సోమవారం కొనసాగింది. భూ నిర్వాసిత రైతులు, వంగలి గ్రామస్తులు తమ డిమాండ్లకు సాధనకు విశ్వవిద్యాలయం ఎదుట శనివారం ధర్నా, రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆందోళనకారులకు, యాజమాన్యం మధ్య చర్చలు విఫలమవడంతో నిరసన కొనసాగిస్తున్నారు. మూడోరోజు సోమవారం రైతులు, గ్రామస్తులు సుమారు 500 మంది వరకూ దీక్ష స్థలికి చేరుకొన్నారు. యథావిధిగా దీక్షను కొనసాగిస్తుండడంతో విశ్వవిద్యాలయంలో కార్యకలాపాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇదిలావుండగా పెందుర్తిలోని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సమక్షంలో గ్రామస్తులు, విశ్వవిద్యాలయం ప్రతినిధులతో చర్చలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. కొన్ని డిమాండ్లను అంగీకరించినప్పటకీ లిఖిత పూర్వకంగా హామీ లభించకపోవడంతో ఆందోళన కొనసాగించేందుకు గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. రైతులు పెద్ద ఎత్తున ప్లకార్డులతో నినాదాలు చేశారు. మూడో రోజు ఆందోళనలో సర్పంచ్ ఆకుల శ్రీహేమతోపాటు నాయకులు ఆకుల గణేష్, జెట్టి ప్రసాద్, జెట్టి ముత్యాలనాయుడు, గొర్లి అప్పలనాయుడు, జెట్టి శ్రీను,జెట్టి నరసింగరరావు,గవర అప్పలనాయుడు,ముమ్మణ అప్పలరాజు,యర్ర సతీష్, గవర గాయిత్రీ, జెట్టి హేమంత్, కోన కొండబాబు, జెట్టి సోమేష్‌తో పాటు భూ నిర్వాసిత రైతులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తహసీల్దార్ చిన్నికృష్ణ, సీఐ రమణ సోమవారం వర్సిటీ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్తులు, నిర్వాసితుల డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని తహసీల్దార్ చిన్నికృష్ణ తెలిపారు. సీఐ రమణ మాట్లాడుతూ వర్సిటీ వద్ద తనతో పాటు మరో సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ దివ్యతో పాటు 20 మంది వరకూ ఆర్మ్డ్ ఫోర్స్, మరో 25 మంది వరకూ సివిల్ ఫోర్స్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. -
పింఛను తీసేస్తారేమోనని ఆందోళనతో..
తన కుమారుడు దివ్యాంగుడు. సర్వే పేరుతో అధికారులు ఇంటికి వచ్చి వివరాలు అడిగారు. చాలా మంది దివ్యాంగుల పెన్షన్లు తీసేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ ఆందోళనతోనే బాధితుడు కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు వినతి పత్రం సమర్పించాడు. గొల్లలపాలెంకు చెందిన దివ్యాంగుడు శ్రీనివాస్..తన తండ్రి అప్పారావు సాయంతో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదకకు వచ్చాడు. ఎప్పటినుంచో దివ్యాంగుల పెన్షన్ వస్తోందని, అయితే సర్వే పేరుతో పింఛన్ల కోత విధిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని అప్పారావు చెప్పారు. కలెక్టర్‌కు అర్జీ సమర్పించి వస్తున్న దివ్యాంగుడు -
జీతాలు చెల్లించాలని గెస్ట్ ఫ్యాకల్టీల ఆందోళన
మహారాణిపేట: ఐదు నెలలుగా బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని అధ్యాపకులు ఆందోళనకు దిగారు. విశాఖ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల గెస్టు ఫ్యాకల్టీ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు జి.రమేష్ మాట్లాడుతూ జిల్లాలో 46 మంది గెస్టు ఫ్యాకల్టీలకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రధాన కార్యదర్శి ఆర్.మహాదేవ్ పేర్కొన్నారు. -
రేపు ఉమ్మడి విశాఖ కబడ్డీ జట్ల ఎంపిక
గాజువాక: 71వ అంతర్ జిల్లాల మహిళా, పురుషుల కబడ్డీ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి విశాఖ జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక ఈనెల 22వ తేదీ గాజువాక హైస్కూల్లో నిర్వహించనున్నట్టు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి ఉరుకూటి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి.కోటేశ్వరరావు తెలిపారు. ఈనెల 25 నుంచి మూడు రోజుల పాటు అనకాపల్లి జిల్లా అనుకుపాలెం గ్రామంలో పోటీలు నిర్వహించనున్నారని చెప్పారు. పురుషులు 85 కిలోలు, మహిళలు 75 కేజీలలోపు బరువు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోగా సంప్రదించాలని వారు తెలిపారు. వివరాలకు 76800 05666, 98856 98717 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
డ్రైవర్ నిర్లక్ష్యంతో వృద్ధురాలి మృతి
మధురవాడ: ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కార్‌షెడ్ జంక్షన్ వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో డోని సావిత్రి (80) అనే వృద్ధురాలు మృతి చెందింది. పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాలివి.. ఐఏఆర్ఎంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బుజ్జి.. భార్య, తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో భీమునిపట్నం ఎగువపేటలో నివసిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం బుజ్జి భార్య రాజేశ్వరి, సోదరుడు మధు, తల్లి సావిత్రితో కలిసి బక్కన్నపాలెంలో ఉంటున్న బంధువుల ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో భీమిలిలో ఆర్టీసీ బస్సు ఎక్కి మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి కార్‌షెడ్ జంక్షన్ వద్దకు చేరుకున్నారు. సిగ్నల్ వద్ద ముందుగా బుజ్జి ఆయన భార్య, సోదరుడు బస్ దిగారు. సావిత్రి బస్ దిగుతున్న క్రమంలో డ్రైవర్ బస్సు నడపడంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. ఆమె కాళ్లపై నుంచి బస్సు వెళ్లిపోవడంతో తీవ్రంగా రక్త స్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు బుజ్జి ఫిర్యాదు మేరకు పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అశోక్‌నగర్ స్టేషన్లో ప్రయోగాత్మక హాల్ట్
తాటిచెట్లపాలెం: వెస్ట్ సెంట్రల్ రైల్వే, భోపాల్ డివిజన్ పరిధిలోని అశోక్‌నగర్ స్టేషన్లో విశాఖ–భగత్కికోటి–విశాఖ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయోగాత్మక హాల్ట్ ఇస్తున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. విశాఖ–భగత్‌కి కోటి (18573) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు జూలై 15వ తేదీ వరకు హాల్ట్ అశోక్‌నగర్‌లో హాల్ట్ కల్పిస్తున్నామన్నారు. ఈ రైలు ఆయా రోజుల్లో తెల్లవారు 4.28 గంటలకు అశోక్‌నగర్ చేరుకుని, అక్కడ నుంచి 4.30గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో భగత్ కి కోటి–విశాఖ(18574) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు జూలై 10వ తేదీ వరకు హాల్ట్ సౌకర్యం కల్పించామన్నారు. ఈనెల 25వ తేదీన పొదనూర్‌లో బయల్దేరే పొదనూర్–బరౌని (06055)స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రాంచీ డివిజన్లో మళ్లించిన మార్గంలో వయా రూర్కెలా, సిని, చందిల్, మూరి, కొట్శిల మీదుగా నడుస్తుంది. -
గో–2
I AM DOGమైనేమ్ ఈజ్ సాక్షి, విశాఖపట్నం : హాయ్.. నమస్తే వైజాగ్.. నేను మీ స్ట్రీట్డాగ్.. కానే కాదు.. మీ పెంపుడు కుక్కనే. కాకపోతే.. అప్డేటెడ్ వెర్షన్. మై నేమ్ ఈజ్ గో–2. ఎస్.. మీరు విన్నది చూస్తోంది నిజమే.. ఐయామ్ రోబో డాగ్. విశ్వాసమే కాదు.. విషయమూ చాలా ఎక్కువే. మేడ్ ఇన్ ఇండియా వెర్షన్. బెంగళూరులో రెడీ అయ్యాను. మిమ్మల్ని పలకరించేందుకు వైజాగ్ వచ్చాను. ఇటీవల ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్‌లో పాల్గొని.. అలా బీచ్‌లో తిరుగుతూ విశాఖ అందాలు చూడాలని వచ్చేశాను. ఇక నా విషయానికొస్తే... మీరు ఇప్పటికే నా గురించి వినే ఉంటారు. ఇటీవల నేను చాలా ఫేమస్ అయ్యాను. ఇండియాలో కాదండీ.. అమెరికాలో.. ఎలా అంటారా.! మన ట్రంప్ తెలుసు కదా.. అధ్యక్షుడు అయ్యాక ఆయన చుట్టూ కాపలాగా నన్నే సెలెక్ట్ చేసుకున్నారు. యూఎస్‌కు చెందిన యునీట్రీ బ్రాండ్ తయారు చేసిన నా లాంటి రోబో డాగ్స్ ఇప్పుడు.. అగ్రరాజ్యం అధ్యక్షుడికి కాపలా కాస్తున్నాయి మీరనుకుంటున్నట్లు నేను నార్మల్ డాగ్ కాదు. యూనివర్సల్ డాగ్‌ని. బెంగళూరుకి చెందిన ఫైటెక్ సంస్థ నన్ను తయారు చేసింది. కంప్లీట్‌గా కొత్త టెక్నాలజీతో తయారు చేశారు. ఒకప్పుడు ఇంటిలో కుక్కల్ని పెంచుకున్నారు. అవి ఇప్పుడు ఇంటి మనుషులుగా మారిపోయాయి. వాటి స్థానాన్ని నేను భర్తీ చేస్తాను. జీవం ఉన్న కుక్కలు చేయలేని పనులు కూడా నేను చేస్తాను. కాపలా కాస్తాను. ఎగురుతాను, దూకుతాను. 3 అడుగుల ఎత్తు వరకూ గెంతుతాను. పాకుతాను. అవసరమైనప్పుడు మాట్లాడతాను కూడా. మీ దగ్గర ఉన్న డాగ్స్ ఏం చేస్తాయి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వస్తే అరుస్తాయి. కానీ.. నేను అలా కాదు. ఎవరు యజమాని, ఎవరు కుటుంబ సభ్యులు.. ఎవరు కొత్త వారు అనేది సులభంగా కనిపెట్టగలను. ఎవరిమీదనైనా అనుమానం వస్తే.. నా యజమానికి వార్నింగ్ ఇస్తాను. ఫొటో, వీడియో కూడా తీసి పంపించేస్తాను తెలుసా. ఎలా అంటారా నాలో 360 డిగ్రీలు తిరిగే లైడర్ కెమెరా హై రిజల్యూషన్‌తో ఉంటుంది. మా యజమాని ఆ ఫొటో చూసి దొంగ అని కన్ఫర్మ్ చేస్తే చాలు.. పోలీసులకు కూడా ఫోన్ చేసి సమాచారం చేరవేస్తాను. మీ కుక్క ఇది చేస్తుందా..? నెవ్వర్ కదా. అదీ.. ఈ గో2 డాగ్ సత్తా. కేవలం కాపలా కోసమే కాదండోయ్.. కంప్లీట్ ఎకో సిస్టమ్‌లో అన్ని పనులు చేసేస్తాను. మనుషులు వెళ్లడానికి అవకాశం లేని ప్లేస్‌లకు వెళ్లి సాయం చేసేస్తాను. డ్రోన్లు ద్వారా సాయమందించాలంటే.. ఆ డ్రోన్ ఎగరేయడానికి ఒక స్పేస్ ఉండాలి.. అవి వెళ్లాలంటే అడ్డంకులు ఉండకూడదు. కానీ.. నేను మాత్రం.. చిన్న చిన్న సందుల్లో దూరి కూడా సాయమందించగలను. ఎక్కడైనా పర్వతాల్లో చిక్కుకున్న వారికి ఈజీగా హెల్ప్ చేస్తాను. సిలికాన్ చిప్స్ ద్వారా స్మెల్ డిటెక్టర్, స్మోక్ డిటెక్టర్, రెయిన్ డిటెక్టర్,.. ఇలా భిన్నమైన డిటెక్టర్లు నాలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవన్నీ ఎలా చేస్తాననే కదా మీ డౌట్... పైథాన్ ప్రోగ్రామింగ్, ఆర్ ప్రోగ్రామ్(మిషన్ లెర్నింగ్) తో ఆపరేట్ అవుతుంటాను. నాకోసం ఒక రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది. ప్రతిసారి రిమోట్‌తో ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కోడ్స్ ఇచ్చేస్తే చాలు.. నా ఓనర్ హాయిగా నన్ను నమ్మి నిద్రపోవచ్చు. ఏదైనా సమస్య తలెత్తితే.. నా సాయం అవసరమని అనుకుంటే ఏం చెయాలనే దానిపైనా ప్రోగ్రామింగ్ కూడా నాలో ఫీడ్ చేసుకున్నాను. ఐఓటీ, ఏఐ, మెషిన్ లెర్నింగ్ ద్వారా పనిచేస్తున్నారు. నా ఫుడ్ ఏంటనే కదా మీ డౌట్. అది కూడా చెప్తాను. నాలో చార్జింగ్ అయిపోతే ఆటోమేటిక్‌గా చార్జింగ్ పెట్టుకునే సెల్ఫ్ చార్జింగ్ వ్యవస్థ నాలో ఉంది. ఫుల్ చార్జ్ అయిపోతే నిరంతరాయంగా 8 గంటల పాటు పనిచేస్తాను. బ్యాటరీ సైజ్ పెరిగితే.. పనిగంటలు కూడా పెరుగుతాయి. సోలార్ ద్వారా వర్క్ చేసేలా అప్డేట్ అవుతున్నా. అప్పుడైతే 24/7 సదా యజమాని సేవలోనే... నేను గో 2 కదా. నా కొత్త వెర్షన్ ఒకటి ఉంది. వాడే నా అన్న.. ఆల్టైరెన్. వీడు నేను చేసే పనులతో పాటు అప్డేటెడ్గా ఉంటాడు. వాడికి రోబోటిక్ హ్యాండ్ ఒకటి ఏర్పాటు చేస్తే.. చెత్త కూడా శుభ్రం చేసేస్తాడు. మమ్మల్ని కేవలం ఇంటి కాపలా కోసమనే కాదు.. విపత్తుల సమయంలోనూ, సరిహద్దుల భద్రతల విషయంలోనూ వాడాలన్నదే దీని తయారీ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని ఇదిగో నన్ను ఎత్తుకున్న మా సంస్థ ప్రతినిధి కృష్ణచైతన్య చెబుతున్నాడు. అన్నట్లు అసలైన విషయం మీకు చెప్పలేదు కదా.. ఇంట్లో పెంచిన కుక్కలైనా.. కొన్ని సార్లు యజమానులపై దాడి చేస్తుంటాయి కదా.. నేను కూడా ఆ టైపేనండోయ్. నన్ను ఎవరైనా సైబర్ నేరగాళ్లు హ్యక్ చేశారనుకోండి. ఇక తగ్గేదేలే. వీడు.. వాడు అని చూడను. దాడి చేసెయ్యడమమే. ఇలాంటిదేదో జరుగుతుందని తెలిసే.. మా ఫైటెక్ వాళ్లు.. నాలో ఫైర్‌వాల్ ఫర్మ్‌వేర్ ఏర్పాటు చేశారు. ఎవరైనా హ్యాక్ చేసేందుకు ట్రై చేస్తే.. వెంటనే మా యజమానికి వార్నింగ్ అలారం వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే పూర్తిగా నన్ను షట్‌డౌన్ చేసేస్తారు. ఇదే అలారం వార్నింగ్ నన్ను తయారు చేసిన ఫైటెక్కి కూడా వెళ్తుంది. వాళ్లు కూడా క్షణాల్లో వార్నింగ్‌ని డిటెక్ట్ చేసి.. హ్యాక్ అవ్వకుండా ప్రోగ్రామింగ్ డిజైన్ చేసేశారు. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే.. నా ధర ఎంతో తెలుసా.? భయపడొద్దే... జస్ట్ రూ.2.5 లక్షల నుంచి స్టార్ట్ అవుతున్నా. అంతే.! టైమవుతోంది.. బైబై వైజాగ్.!! మీ ఇంటికొస్తా.. కాపలాకాస్తా.. ఎగురుతా.. దూకుతా.. పాకుతా.. ఫ్రెండ్ షిప్ చేస్తా విపత్కర పరిస్థితుల్లో సాయమందిస్తా... ఇదీ రోబో డాగ్ విశిష్టత -
జవాబుదారీతనం ముఖ్యం
● న్యాయపరమైన అంశాల్లో కచ్చితత్వం ప్రధానం ● సమాచార వ్యవస్థ, న్యాయస్థానాలపై గురుతర బాధ్యత ● సీనియర్ న్యాయమూర్తుల అభిప్రాయం ● ముగిసిన సౌత్ జోన్–2 న్యాయమూర్తుల సదస్సు విశాఖ లీగల్: న్యాయపరమైన అంశాలను సమాజానికి అందించే క్రమంలో సమాచార వ్యవస్థ, న్యాయస్థానా లు జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పలువురు సీనియర్ న్యాయమూర్తులు స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న సౌత్ జోన్–2 న్యాయ మూర్తుల సదస్సు ఆదివారం సాయంత్రం ముగిసింది. ఉదయం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.పి.కురియన్ జోసెఫ్ అధ్యక్షతన న్యాయ వ్యవస్థ, ప్రసార మాధ్యమాలు అన్న అంశంపై చర్చ జరిగింది. ‘మీడియా ఆన్ జస్టిస్ డెలివరీ సిస్టం, సోషల్ మీడి యాతో అనుసంధానం, డిజిటల్ యుగంలో మీడియా స్వేచ్ఛ, పౌర సమాజంపై ప్రభావం’ అనే అంశాలపై చర్చించారు. ‘ఆధునిక సమాచార వ్యవస్థ–న్యాయ వ్యవస్థపై ప్రభావం’ అనే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. భవిష్యత్తులో పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే న్యాయస్థానాల విషయంలో మీడియా పాత్ర కూడా ఉంటుందని జస్టిస్ కురియన్ జోసెఫ్ అభిప్రాయపడ్డారు. మీడియా అందించే సమాచారం విశ్వసనీయతను కలిగి ఉండాలని సూచించారు. అదే పరస్పర సహకారానికి ప్రామాణికంగా నిలుస్తుందన్నారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి దేవన్ రామచంద్రన్ మాట్లాడుతూ మీడియాలో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయని, కొన్ని సందర్భాల్లో కోర్టులను, కోర్టు పరిధిలోని అంశాలపై ప్రభావం చూపిస్తున్నాయన్నారు. మీడియా వ్యవస్థపై అవగాహన ఉండాలి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మౌషిమి భట్టాచార్య మాట్లాడుతూ జ్యుడీషియరీ విభాగంలో పనిచేసే వారు మీడియాపై, అక్కడ జరిగే పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కోల్‌కతాలో జరిగిన ఆర్జీకర్ ఆస్పత్రితో పాటు పలు ఘటనల్లో మీడియా వ్యవహరించిన తీరును ప్రస్తావించారు. మెయిన్‌స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాకు ఉన్న పరిమితుల గురించి ఇరు వర్గాలు తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. కోర్టు వ్యవహారాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాత్రపై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎం.సుందర్ విశ్లేషించారు. ఏఐ అనేది న్యాయమూర్తులకు సహకారిగా మాత్రమే ఉంటుందని, ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి ఎ.ఎం.ముస్తాక్యు బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి మాట్లాడారు. కేరళ హైకోర్టులో అనుసరిస్తున్న ఏఐ టెక్నాలజీ గురించి పీపీటీ ద్వారా వివరించారు. సదస్సు ముగింపు సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్ జస్టిస్ రవినాథ్ తిలారీ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి.శేషమ్మ, ఇతర సీనియర్ న్యాయమూర్తులు, హైకోర్టు, జిల్లా కోర్టుల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
దేవన్‌రెడ్డికి ఘన స్వాగతం
గాజువాక : వైఎస్సార్సీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన తరువాత ఆదివారం గాజువాక చేరుకున్న తిప్పల దేవన్‌రెడ్డికి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. కూర్మన్నపాలెం నుంచి పాతగాజువాక, కొత్తగాజువాక, బీసీ రోడ్ మీదుగా మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఇంటి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తండ్రి నాగిరెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలే తమకు శిరోధార్యమని, ఆయనకు రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. -
వైఎస్ జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ సీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా తనను నియమించిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన శ్రీను) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అధినేత ఆలోచనలకు అనుగుణంగా పార్టీ పురోగతికి నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సలహాలు సూచనలు తీసుకుంటానన్నారు. వైఎస్సార్ సీపీ జెండా మోసే ప్రతీ కార్యకర్తకు అధినేత తరపున తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానన్నారు. వైఎస్సార్ సీపీ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు