
ఎవరి జేబులోకి రూ.2 లక్షలు..!
ఫిర్యాదు చేసినా కేసు పెట్టకుండా కాలయాపన
నేరుగా స్టేషన్‌లోనే రూ.2 లక్షలు తీసుకున్నట్టు సీసీ ఫుటేజీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లు ఏకంగా వసూళ్లకు కేంద్రంగా మారిపోతున్నాయా? అక్కడ ఇక్కడ ఎందుకంటూ నేరుగా స్టేషన్‌లోనే లంచాలు వసూలు చేస్తున్నారా? అంటే.. గత నెలలో అనకాపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిన వ్యవహారాన్ని గమనిస్తే ఇట్టే తెలుస్తోంది. బాధితుడి నుంచి ఫిర్యాదు అందినప్పటికీ కేసు నమోదు చేయకుండా ఏకంగా అనకాపల్లి స్టేషన్‌లోనే రూ.2 లక్షలు వసూలు చేసిన వ్యవహారం సీసీ ఫుటేజీ సాక్షిగా బయటపడినట్టు సమాచారం. నేరుగా స్టేషన్‌కే వచ్చి రూ.2 లక్షలు అందజేసినట్టు ఏసీబీని ఆశ్రయించిన పెందుర్తి వ్యాపారి స్పష్టం చేయడంతోపాటు స్టేషన్ సీసీ ఫుటేజీలో కూడా అదే దృశ్యం కనిపించినట్లు తెలుస్తోంది.
ఈ రూ.2 లక్షలు ఎస్‌ఐ తీసుకున్నప్పటికీ అంతిమంగా ఎవరి జేబులోకి వెళ్లాయనే కోణంలో ఏసీబీ దృష్టి సారించినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ‘విజయ’వంతంగా జేబులోకి వేసుకున్న వ్యక్తిని కూడా నిందితుడిగా ఏసీబీ చేర్చనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఫిర్యాదు అందినప్పుడు కేసు నమోదు చేయకుండా ఉద్దేశపూర్వకంగా నాన్చుడు ధోరణి అవలంబించిన అనకాపల్లి సీఐ పేరును కూడా కేసులో ఏసీబీ చేర్చనున్నట్లు సమాచారం. స్టేషన్‌లోనే లంచాలు తీసుకుంటున్న సీసీ ఫుటేజీ లభించడంతో ఇప్పుడు ఏ చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంలో అసలు దోషి తప్పించుకుంటున్నారంటూ ఆగస్టు 17వ తేదీన ‘సాక్షి’లో ‘అసలు దోషి ఎవరు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఇప్పుడు ఏసీబీ తాజా విచారణలో అసలు దోషి బయటపడే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతోంది.
పెందుర్తికి చెందిన బంగారు వ్యాపారి అప్పారావు అనకాపల్లిలో ఖాళీగా ఉన్న తన షాపును ఈ ఏడాది మే నెలలో శాస్తి మండల్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చి రూ.రెండు లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. శాస్తి మండల్ జూలై 16న తన అద్దె షాపు నుంచి పక్కనే ఉన్న బంగారు దుకాణంలోకి రంధ్రం తవ్వి బంగారు ఆభరణాలను దొంగలించడానికి ప్రయత్నించి, విఫలం కావడంతో పరారయ్యాడు. పక్క షాపు యజమాని బుద్ద శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ ఈశ్వరరావు షాపు యజమాని అప్పారావును పిలిపించి విచారించారు.
ఈ కేసులో ఇరికించకుండా అడ్వాన్స్‌గా తీసుకున్న రూ.2 లక్షలు, షాపు తాళాలు ఇవ్వడానికి లక్ష రూపాయలు ఎస్‌ఐ డిమాండ్ చేశాడు. అతడు అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.50 వేలకు తగ్గించారు. దీంతో అతడు ఏసీబీని ఆశ్రయించగా ఆగస్టు 14వ తేదీన ఎస్‌ఐ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అయితే నేరుగా స్టేషన్‌లోనే రూ.2 లక్షలు ఎస్‌ఐకి అందజేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఫిర్యాదు వచ్చినప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయిన సీఐ మిన్నకుండిపోవడం బట్టి చూస్తే వ్యవహారమంతా ఆయనకు తెలిసే జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఐపై కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.