చిరు వ్యాపారులపై ముప్పేట దాడి | - | Sakshi
Sakshi News home page

చిరు వ్యాపారులపై ముప్పేట దాడి

Sep 19 2025 2:56 AM | Updated on Sep 19 2025 12:57 PM

 Tiffin buddy delivering near the Gurudwara intersection

గురుద్వారా కూడలి సమీపంలో తరలిస్తున్న టిఫిన్‌ బడ్డీ

చిరువ్యాపారుల రెక్కలు విరిచిన కూటమి సర్కార్‌ 

ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డుపాల్జేశారు 

టీ స్టాళ్లు, టిఫిన్‌ బళ్లు, బడ్డీల తొలగింపు 

రెక్కాడితే కాని డొక్కాడని చిరు వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు చేసుకొని పొట్టపోసుకుంటున్న వారిపై జులుం ప్రదర్శించారు. ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండా టీ స్టాళ్లు, టిఫిన్‌బళ్లు, బడ్డీలను జేసీబీలతో తొలగించారు. బడ్డీల్లో సరుకులు, డబ్బులు సైతం తీసుకునే సమయం ఇవ్వకుండా తరలించడంతో పేదలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఏళ్లగా రోడ్డు పక్కన చిరు వ్యాపారాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న తమను రోడ్డున పడేశారని, ఎలా బతికేది, ఎక్కడ బతికేదంటూ వ్యాపారులు బతిమలాడినా అధికారులు కనికరించలేదు. జీవీఎంసీ కమిషనర్‌ ఆదేశాలతో సీతంపేట మెయిన్‌రోడ్, శంకరమఠం రోడ్, 
నరసింహనగర్‌ రైతుబజార్, గ్రీన్‌పార్క్‌ రోడ్డు, ఎన్‌ఏడీ నుంచి గోపాలపట్నం బంక్‌ వరకు, మధురవాడ, తగరపువలస, ఎండాడ, గాజువాక ప్రాంతాల్లో జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్, పోలీస్‌ విభాగం సంయుక్తంగా గురువారం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాయి.  

ఉదయం 7 గంటల నుంచే..

సీతంపేట : జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది, పోలీసులు, సచివాలయ కార్యదర్శులు గురువారం ఉదయం 7 గంటలకే జేసీబీలు, లారీలతో ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలి చందు స్వీట్స్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి హైవే వరకు ద్వారకానగర్‌, సీతంపేట మెయిన్‌రోడ్‌లో రహదారికి ఇరువైపులా రోడ్డుపై, ఫుట్‌పాత్‌పై ఉన్న బడ్డీలు, టిఫిన్‌ బళ్లు, టీ స్టాళ్లు, ఫ్రూట్‌స్టాళ్లు, పకోడీ బళ్లు, బిర్యానీ, కర్రీపాయింట్లను జేసీబీలతో తొలగించి లారీల్లో తరలించారు. బీవీకే కళాశాల ఎదురుగా ఉన్న బడ్డీలను జేసీబీతో ధ్వంసం చేయడంతో వ్యాపారులు గగ్గోలుపెట్టారు. బడ్డీల్లోని సరుకులు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సీతంపేట కూడలిలో దుర్గాగణపతి ఆలయం పరిసరాల్లో ఉన్న వ్యాపారాలను తొలగించారు. అక్కడ నుంచి గురుద్వారా కూడలి సమీపంలో వైన్‌షాపు ముందున్న బోర్డును తీసేశారు. అక్కడే ఉన్న టీ స్టాల్‌, టిఫిన్‌ స్టాళ్లలోని స్టీల్‌ కౌంటర్లు తరలించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం హైవే నుంచి డైమండ్‌ పార్కు వరకు ఉన్న శంకరమఠం రోడ్‌లో బడ్డీలు, తోపుడు బళ్లు తొలగించారు. ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే రోడ్డుపాలు చేశారని చిరువ్యాపారులు మండిపడ్డారు.

ప్రజాప్రతినిధులు లేని సమయంలో..

ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు లేని సమయం చూసి ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపులు చేపట్టారు. కార్పొరేటర్లు వారం రోజుల పాటు స్టడీటూర్‌కు రాజస్థాన్‌ వెళ్లారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు, ఎంపీ పార్లమెంట్‌ సమావేశాలకు వెళ్లారు. చిరు వ్యాపారులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి ఒక్క ప్రజాప్రతినిధి అందుబాటులో లేని సమయంలో డ్రైవ్‌ చేపట్టారు. దీంతో ఏమి చేయాలో తెలియక వ్యాపారులు ఆవేదనకు గురయ్యారు.

దివ్యాంగుడిని ఎలా బతకాలి  

త 19 ఏళ్లుగా సీతంపేట జంక్షన్‌లో పకోడి బండి వేస్తున్నాను. నేను దివ్యాంగుడిని, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పకోడి బండిపై వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. ముందస్తు నోటీసు, సమాచార ఇవ్వకుండా ఉన్నపళంగా లారీలో బండిని పట్టుకుపోయారు. నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. ఎలా బతకాలి.

– పతివాడ శ్రీరాములు, పకోడి బండి, సీతంపేట

రోడ్డున పడేశారు

సీతంపేట మెయిన్‌రోడ్‌లో మార్గదర్శి బిల్డింగ్‌ పక్క రోడ్‌లో టీ కొట్టు నడుపుతున్నాను. సుమారు 15 సంవత్సరాలుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్నాను. మెయిన్‌రోడ్‌పై లేకపోయినా నా బండి తొలగించారు. ఉన్నపళంగా తొలగిస్తే మాలాంటి వాళ్లు ఎలా బతకాలి. మా కుటుంబాన్ని రోడ్డునపడేశారు. – ఎల్‌.మహేష్‌, టీ కొట్టు, సీతంపేట

కౌంటర్‌లో డబ్బులు తీసుకోనీయలేదు 
గత 28 ఏళ్లుగా సీతంపేట దుర్గాగణపతి ఆలయం పక్కన టీ, టిఫిన్‌ షాపు నిర్వహిస్తున్నాను. రోడ్డుకు అడ్డుగా లేకపోయినా, షాపు ముందున్న రెండు స్టీల్‌ కౌంటర్లు జేసీబీతో పట్టుకెళ్లిపోయారు. కనీసం కౌంటర్‌లో ఉన్న డబ్బులు కూడా తీసుకునే సమయం ఇవ్వలేదు. పెద్దోళ్లని వదిలి చిరువ్యాపారులపై ప్రతాపం చూపడం దారుణం.  – పిన్నింటి అప్పలనాయుడు,  టిఫిన్‌ షాప్, సీతంపేట

524 దుకాణాల తొలగింపు 
డాబాగార్డెన్స్‌ : విశాఖలో ‘ఆపరేషన్‌ లంగ్స్‌’ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు జీవీఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ ప్రభాకరరావు తెలిపారు. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆదేశాల మేరకు కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు. 
వివిధ జోన్లలో తొలగించిన 
ఆక్రమణల వివరాలు 
జోన్‌–1: తగరపువలస మెయిన్‌ రోడ్డు, భీమిలి రోడ్డులో మొత్తం 40 బడ్డీలు. 
జోన్‌–2: జాతీయ రహదారి–16, శ్రీకాంత్‌నగర్‌ జంక్షన్‌ నుంచి పెదగదిలి జంక్షన్‌ వరకు మొత్తం 90  
జోన్‌–3: ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డు నుంచి గురుద్వారా జంక్షన్, డైమండ్‌పార్క్, శాంతిపురం జంక్షన్లలో మొత్తం 84  
జోన్‌–4: సిరిపురం జంక్షన్‌ నుంచి జగదాంబ జంక్షన్‌ వరకు 60  
జోన్‌–5: నరసింహానగర్, డీఎల్‌బీ గ్రౌండ్, సీఐఎస్‌ఎఫ్‌ గేట్, ఎన్జీవోస్‌ కాలనీ పరిధిలో మొత్తం 55   
జోన్‌–6: పాత, కొత్త గాజువాక ప్రధాన రహదారులు, రాజీవ్‌నగర్‌ మార్గ్, కేకేఆర్‌ వాటర్‌ ప్లాంట్‌ రోడ్డులో మొత్తం 86  
జోన్‌–7: నెహ్రూ చౌక్‌ నుంచి సుంకరమెట్ట రోడ్డు వరకు 42  
జోన్‌–8: ఎన్‌ఎస్‌టీఎన్‌ జంక్షన్‌ నుంచి విమాన్‌నగర్‌ జంక్షన్, గోపాలపట్నం పెట్రోల్‌ బంక్‌ వరకు మొత్తం 67 టీ, టిఫిన్, బడ్డీలు, దుకాణాలను తొలగించామన్నారు.  

బడుగులపై ‘మహా’ ప్రతాపం 

భీమిలి పరిధిలో వందకు పైగా దుకాణాల తొలగింపు

మధురవాడ/కొమ్మాది/తగరపువలస: భీమిలి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో చిరు వ్యాపారుల దుకాణాలను, తోపుడు బళ్లను అధికారులు తొలగించడంతో వారంతా కన్నీటిపర్యంతమయ్యారు. జీవీఎంసీ జోన్‌.2 పరిధిలో తొలగింపు ఉద్రిక్తంగా మారింది. మధురవాడ మిథిలాపురి వుడా కాలనీ రోడ్డులో సుమారు 80 బడ్డీలు, దుకాణాలను అధికారులు తొలగించారు. కనీసం సమాచారమైనా ఇవ్వకుండా తొలగించారని ఆందోళన వ్యక్తం చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో వ్యాపారులు రోడ్డుపై బైఠాయించారు. పీఎం పాలెం పోలీసులు వచ్చి, ఆందోళనకారులతో మాట్లాడి, పరిస్థితిని చక్కబరిచారు. ఎండాడ జాతీయ రహదారి నుంచి రుషికొండ వెళ్లే డబుల్‌ రోడ్డు వెంబడి సుమారు 20 దుకాణాలను అధికారులు పొక్లెయిన్‌లతో తొలగించారు. రెండు రోజులైనా వ్యవధి ఇవ్వకుండా తోపుడు బళ్లు, టిఫిన్‌ సెంటర్లు, దుకాణాలను తొలగించడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ జోన్‌–1 పరిధిలోని తగరపువలస మెయిన్‌రోడ్డు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను జెడ్సీ అయ్యప్పనాయుడు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది తొలగించారు. చిట్టివలస ఈఎస్‌ఐ ఆస్పత్రి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు తొలగింపులు జరిగాయి.

చాలా అన్యాయం

ళ్ల తరబడి రోడ్డుపై చిరు వ్యాపారాల ద్వారా బతుకుతున్నాం. ఏళ్ల తరబడి జీవీఎంసీకి ఆశీలు కడుతున్నాం. ట్రేడ్‌ లైసెన్స్‌ ఉంది. కనీసం ముందుగా అయినా సమాచారం ఇవ్వకుండా, అధికారులు మాపై అకస్మాత్తుగా దాడి చేయడం అన్యాయం. ఇలా చేస్తే మా కుటుంబాలు ఏమై పోవాలి? –లక్ష్మి కుమారి, చిరు వ్యాపారి

రోడ్డున పడిన 50 కుటుంబాలు 

తాటిచెట్లపాలెం: నరసింహనగర్‌ రైతుబజార్‌ వద్ద 30 ఏళ్లుగా చిరు వ్యాపారాలు సాగిస్తున్న 50 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గురువారం ఉదయం జీవీఎంసీ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తొలగించి జీవనోపాధిని దెబ్బతీశారు. జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సచివాలయాల సిబ్బంది ఉదయాన్నే ఇక్కడకు చేరుకొని పొక్లెయినర్లతో బడ్డీలను, వస్తువులను విరగ్గొట్టి మరీ లారీల్లోకి ఎక్కించారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో చిరు వ్యాపారులు రోడ్డెక్కి ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు కూటమి ప్రభుత్వం తమకు మంచి శాస్తి చేసిందని చిరు వ్యాపారులంతా వాపోతున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా.. బడ్డీలను తొలగించడంతో జీవనోపాధి కోల్పోయామని, ఎలా బతకాలని విలపించారు.

జీవనాధారాన్ని తొలగించారు

దయం నుంచి మామీద ముప్పేట దాడి చేసి జీవనాధారాన్ని తొలగించారు. సుమారు 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకున్న వారిని రోడ్డున పడేశారు. కనీసం సమయం కూడా ఇవ్వలేదు. ప్రత్యామ్నాయం చూపాలి కదా. ఇప్పుడు ఎలా బతకాలి. – ప్రకాష్‌, చిరు వ్యాపారుల ప్రతినిధి, నరసింహనగర్‌ రైతుబజార్‌

ఇది పేదలను వేధించే ప్రభుత్వం

త 20 ఏళ్లుగా ఇక్కడే పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాం. ఇప్పటికిప్పుడు ఇలా తీసేస్తే ఎలా? కనీసం సమయం ఇవ్వాలి కదా? ఇప్పుడు వ్యాపారం కోసం చేసిన ఫైనాన్స్‌లు కట్టుకోవాలి? పిల్లల ఫీజులు కట్టుకోవాలి? ఇది పేదలను వేధించే ప్రభుత్వం. – సంతోష్‌, పండ్ల వ్యాపారి, నరసింహనగర్‌

చావే శరణ్యం

త కొన్నేళ్లుగా రైతుబజార్‌ పరిసర ప్రాంతంలో బ్యాంగిల్స్‌, ఫ్యాన్సీ వ్యాపారం పాత తోపుడుబండిపై చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి ఈ రోజు మా వ్యాపారాల్ని తొలగించారు. ఎలా బతకాలి. మాకు చావే శరణ్యం. ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఏ విషమో తాగి చస్తాం. – రమణమ్మ, ఫ్యాన్సి, బేంగిల్స్‌ వ్యాపారి, నరసింహనగర్‌

చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నం 

తాటిచెట్లపాలెం : నరసింహనగర్‌ రైతుబజార్‌ వద్ద 30 ఏళ్లుగా చిన్న బడ్డీలు ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారాలు సాగిస్తున్న సుమారు 50 కుటుంబాలను కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసింది. దీంతో ఆందోళన చెందిన నరసింహనగర్‌ ప్రాంతానికి చెందిన సంతోష్‌ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాజు సీసాను పగులగొట్టి ఛాతీపై గట్టిగా కోసుకున్నాడు. ఫోర్త్‌ టౌన్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, బంధువులు అతడిని అడ్డుకొని వారించారు. ఇక్కడే పుట్టి పెరిగానని, ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న చికెన్‌ సెంటర్‌ను తొలగించి, జీవనోపాధిపై వేటువేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. చిరు వ్యాపారులకందరికీ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement