
మేయర్‌కు స్మార్ట్ చెక్!
తనకు తెలియకుండా హాస్టల్ భవనాలకు
టెండర్లు పిలిచారంటూ ఆగ్రహం
టెండర్ల రద్దు కోసం
ఏకంగా కౌన్సిల్‌లో తీర్మానం
జీవీఎస్‌సీసీఎల్ ద్వారానే
టెండర్లు పిలిచేందుకు అనుమతి
తాజాగా ఉత్తర్వులతో
మేయర్ నిర్ణయాలకు బ్రేక్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌లో మేయర్ ప్రాభవానికి క్రమంగా చెక్ పడుతోందా? స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటమికి ఆయన వ్యవహారశైలే కారణమని టీడీడీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందా? ఎమ్మెల్యేలతో ఆయన వ్యవహరశైలిపై కూడా ఆగ్రహంగా ఉందా? అంటే.. తాజా పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తోంది. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ పరిధిలో తనకు తెలియకుండా హాస్టల్ భవనాలకు టెండర్లను పిలవడంపై కార్పొరేషన్ మేనేజర్ ఆనంద్‌పై మేయర్ పీలా శ్రీనివాసరావు మండిపడ్డారు. అంతటితో ఆగకుండా ఆ టెండర్లను రద్దు చేస్తూ పాలకవర్గ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే, మేయర్ ప్రయత్నాలను చిత్తుచేస్తూ.. గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ (జీవీఎస్‌సీసీఎల్) స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ)గా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మునిసిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు కూడా జారీచేశారు. అంతేకాకుండా జీవీఎస్‌సీసీఎల్ మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులతో పాటు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ప్రాజెక్టు పనులను కూడా పర్యవేక్షిస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. తద్వారా మేయర్ నిర్ణయాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కమిషనర్‌కు వ్యతిరేకంగా..!
వాస్తవానికి జీవీఎంసీ కమిషనర్‌గా కేతన్ గార్గ్ తనదైన ముద్రతో ముందుకెళుతున్నారు. కమిషనర్‌గా ఆయన వచ్చిన సందర్భంలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలు, టీడీఆర్‌ల వ్యవహారాల్లోనూ కమిషనర్ సూటిగా వ్యవహరిస్తుండటం మేయర్ ఆగ్రహానికి కారణమన్న అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కమిషనర్‌పై మేయర్ గుర్రుగా ఉన్నారు. ఈ విషయమై తన అనుయాయుల వద్ద ఆయన బయటపడిన సందర్భాలు ఉన్నట్టు జీవీఎంసీలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణాలపై జీవీఎస్‌సీసీఎల్ ద్వారా సీఈవో హోదాలో టెండర్లను కమిషనర్ ఆహ్వానించారు. ఈ విషయం తనకు తెలియదంటూ మేయర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు టెండర్లను రద్దు చేస్తున్నట్టు కూడా పరోక్షంగా కొన్ని మీడియాల్లో కథనాల ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా కమిషనర్ వైఖరితో మేయర్‌కు ఇబ్బందిగా మారుతోందంటూ లీకులిచ్చారు. తద్వారా కమిషనర్‌పై నేరుగా యుద్ధాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జీవీఎస్‌సీసీఎల్ టెండర్లను రద్దు చేయడమే కాకుండా ఏకంగా బీచ్‌రోడ్‌లోని సంస్థ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. తనదే పైచేయి అన్నట్టుగా మేయర్ వ్యవహరించారు. తాజాగా ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులతో మేయర్‌కు ‘స్మార్ట్’గా చెక్ పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మేయర్‌కే ముప్పు..!
కేవలం జీవీఎస్‌సీసీఎల్‌లోనే కాకుండా చికెన్ వ్యర్థాల విషయంలోనూ కమిషనర్‌పై నెపం పెట్టే ప్రయత్నం జరిగింది. చికెన్ వ్యర్థాల తరలింపులో పట్టుబడిన వారిపై కేసులు పెట్టకుండా కమిషనర్ అడ్డుపడుతున్నారంటూ మేయర్ వర్గం ప్రచారం చేసింది. వాస్తవానికి కేతన్‌గార్గ్ కమిషనర్‌గా వచ్చిన తర్వాత చికెన్ వ్యర్థాల తరలింపునకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి కాపులుప్పాడకు తరలించేలా చూస్తున్నారు. దీంతో ఈ ప్రచారం కాస్తా విఫలమైంది. అయితే ఏ టెండర్లను మేయర్ రద్దుచేశాడో... అవే టెండర్లను జీవీఎస్‌సీసీఎల్ ద్వారానే పిలిచేందుకు అనుమతిస్తూ తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. తద్వారా మేయర్ పీఠానికి తాము ఇస్తున్న గౌరవం ఎంత మేర ఉందనే విషయాన్ని సూటిగా అర్థమయ్యేలా చెప్పినట్టు ఉందన్న అభిప్రాయం జీవీఎంసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొత్తంగా మేయర్ అధికారాలకు ముప్పు వచ్చేలా తాజా నిర్ణయం ఉందన్న అభిప్రాయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.