ఈ ఐదు నెలలే ముహూర్తాలు | - | Sakshi
Sakshi News home page

ఈ ఐదు నెలలే ముహూర్తాలు

Published Mon, Feb 12 2024 1:06 AM | Last Updated on Mon, Feb 12 2024 8:32 AM

- - Sakshi

అల్లిపురం : మాఘ మాసం ప్రారంభమవడంతో పలు జంటలు వేద మంత్రాల సాక్షిగా జీవితాన్ని పండించుకునేందుకు కొంగులు ముడి వేసుకోనున్నాయి. వివాహాలు చేసుకునేందుకు ఇప్పటికే పలువురు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీ ముహూర్తంతో వివాహాల కోలాహలం ఆరంభం కానుంది. దీంతో కల్యాణ మండపాలతో పాటు పురోహితులు, కేటరింగ్‌, సన్నాయి మేళం వారికి గిరాకీ పెరిగింది. సుమారు రెండు నెలల విరామం అనంతరం వివాహాలు మొదలు కావడంతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకుంది.

ఈ ఐదు నెలలే ముహూర్తాలు
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలలతో పాటు నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో శుభముహూర్తాలు ఉన్నాయి. దీంతో పెళ్లి చేసుకునేందుకు యువత ఉత్సాహం చూపుతోంది. మరో పక్క నూతన గృహప్రవేశాలు, గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు జోరందుకో నున్నాయి. ఆదివారం నుంచి మొదలైన పెళ్లి సందడి మరో మూడు నెలలు వరకు కొనసాగుతాయని పురోహితులు చెబుతున్నారు. ఆ తరువాత గురు మౌఢ్యం, శుక్రమౌఢ్యం, శూన్య మాసం రావడంతో మే, జూన్‌, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో వివాహాది కార్యక్రమాలకు శుభముహూర్తాలు లేవు.

ఊపందుకోనున్న వ్యాపారాలు
పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కానుండడంతో జిల్లాలో పలు వ్యాపారాలు జోరుగా సాగనున్నాయి. షాపింగ్‌ మాల్స్‌, వస్త్ర దుకాణాలు, డ్రెస్సెస్‌, జ్యూవెల్లరీ దుకాణాలు, లేడీస్‌ ఎంపోరియంలు, ఫొటో స్టూడియోలు, వీడియోగ్రఫీ సెంటర్లు, ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ స్టూడియోలు, ఫంక్షన్‌ హాల్స్‌, క్యాటరింగ్‌ కేంద్రాలు, ఫ్లవర్‌ డెకరేటర్స్‌, వంట మాస్టర్స్‌ ఇలా పలు వ్యాపారాలు పుంజుకోనున్నాయి. ఇప్పటికే ఇందుకు అవసరమైన ఏర్పాట్లను వ్యాపారాల నిర్వాహకులు చేసుకున్నారు. ప్రధానంగా విశాఖ నగరంతో పాటు గాజువాక, గోపాలపట్నం ప్రాంతాల్లో బంగారం, వస్త్ర వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి నూతన డిజైన్లతో కూడిన వస్త్రాలను వ్యాపారులు తీసుకవచ్చి తమ దుకాణాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచారు. వినియోగదారులను ఆకర్శించడానికి డిస్కౌంట్‌లు, ఇతర బహుమతులను అందించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఉపాధి అవకాశాలు మెండు..
గత కొంతకాలంగా పనులు లేక డీలాపడిన శుభకార్యాలకు అనుబంధ వ్యాపారాలు అయిన పురోహితులు, క్యాటరింగ్‌, షామియానాలు, కల్యాణమండపాల వారితో పాటు లైటింగ్‌, పువ్వుల డెకరేషన్‌, ఫొటో స్టూడియోల వారికి, ఐస్‌క్రీం, మినరల్‌ వాటర్‌, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, సాంస్కృతిక కళాకారులు, ఈ ముహూర్తాల్లో చేతి నిండా పని దొరకడంతో ఆయా రంగాల్లో రాణిస్తున్న వారికి ఇది శుభసమయమని చెప్పవచ్చు.

ఇప్పటికే బుకింగ్‌లు ఒప్పుకున్నాం
ప్పటికే పెళ్లిళ్లకు బుకింగ్‌లు మొదలయ్యాయి. ఒక రోజు మూడు నుంచి నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 14, 21, 29 తేదీల్లో ఎక్కువగా పెళ్లిళ్లు ఉన్నాయి. ఆ సమయంలో వర్కర్లు దొరకడం కూడా కష్టంగా ఉంది. అయినా వచ్చిన అవకాశాన్ని దొరకబుచ్చుకుంటున్నాం. డిమాండ్‌ ఉన్న రోజుల్లో డబుల్‌ పేమెంట్‌ కూడా ఇచ్చుకునేందుకు సిద్ధపడుతున్నాం.
– మహ్మద్‌ ఖాజా, ఈవెంట్‌ నిర్వాహకుడు

ఐదు నెలలు మాత్రమే శుభముహూర్తాలు
ఏడాది కేవలం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో మాత్రమే శుభముహూర్తాలు ఉన్నాయి. మే, జూన్‌, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో మూఢం, శూన్యమాసాలు రావటంతో ముహుర్తాలు లేవు. దీంతో శుభకార్యాలు నిర్వహణకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు.
– బులుసు సాయికృష్ణ శర్మ, వేద పండితులు, అల్లిపురం

కల్యాణమండపాలకు డిమాండ్‌ 
ప్రిల్‌ తర్వాత నవంబర్‌ వరకు ముహూర్తాలు లేకపోవడంతో ఈ మూడు నెలల్లోనే శుభకార్యాలు జరిపించేందుకు ఆసక్తి కనబరచడంతో ప్రస్తుతం కల్యాణ మండపాలకు కూడా డిమాండ్‌ బాగా పెరిగింది. అదే రీతిలో షామియానాలు, క్యాటరింగ్‌ పరిశ్రమ కూడా ఊపందుకుంది. బలమైన ముహూర్తాలు ఉండే రోజుల్లో డిమాండ్‌ బాగా ఉండటంతో ఇప్పటికే కల్యాణమండపాల బుకింగ్‌లు పూర్తి చేసుకున్నట్లు మండపాల నిర్వాహకులు చెబుతున్నారు.

అదే విధంగా వీడియోగ్రాఫర్లు, ఫొటో గ్రాఫర్లు, పురోహితులను ఇప్పటికే మాట్లాడుకుని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. రానున్న మూడు నెలల కాలంలో సిటీతో పాటు జిల్లాలో సుమారు 40 వేల పైగా జంటలు ఒక్కటవుతాయని అంచనా. ముఖ్యంగా ఫిబ్రవరి 14, 21, 29 తేదీల్లో అధిక సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో పెళ్లిళ్లకు హాజరయ్యే వారంతా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రైలు, బస్సు సర్వీసులకు రిజర్వేషన్లు చేసుకునే ప్రయత్నంలో పడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement