Sports Authority of Andhra Pradesh
-
తిరుపతిలో సీఎం కప్ ఫైనల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘సీఎం కప్’ టోర్నీ ఫైనల్స్‌ను తిరుపతి వేదికగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు 14 క్రీడాంశాల్లోనూ స్టేట్ మినీ ఒలింపిక్స్ మాదిరిగా ఒకే ప్రాంతంలో పోటీలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే జిల్లాస్థాయిలో పోటీల్లో గెలుపొందిన జట్ల వివరాలను పంపించాలని డీఎస్ఏలు, చీఫ్ కోచ్‌లను శాప్ ఆదేశించింది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 4,200 మందికిపైగా క్రీడాకారులు సీఎం కప్ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్నారు. మొత్తం టోర్నీలో 963 పతకాలు, 48 ట్రోఫీలను బహూకరించనున్నారు. ఏపీ భవన్లో విద్యుత్ పొదుపు ప్రాజెక్ట్ 2030 నాటికి బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా కేంద్ర విద్యుత్‌శాఖ నేతృత్వంలోని బీఈఈ న్యూఢిల్లీలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యలపై దృష్టి సారించింది. మొదటిదశలో ఏపీ భవన్ నుంచి ఇంధన సామర్థ్య పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది. బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విడదల రజిని చెప్పారు. గుంటూరు శివారు అమరావతి రోడ్డులో ఆదివారం బీపీ మండల్ కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో మంత్రులు మాట్లాడారు. -
గ్రామస్థాయి నుంచే క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం: బైరెడ్డి సిద్దార్థరెడ్డి
సాక్షి, రాజమహేంద్రవరం: ఎంపీ భరత్ రామ్ నిర్వహిస్తున్న రాజన్న రచ్చబండ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడూతూ..గ్రామస్థాయి నుంచే క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అద్భుతాలు సృష్టించే క్రీడాకారులు గ్రామాల్లో ఉన్నారని, క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినప్పుడే వారికి సరైన గుర్తింపు దక్కుతుందని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పోర్ట్స్ పాలసీని తీసుకురావాలని ఆదేశించారు. దీనికోసం రాష్ట్రంలో అన్ని వర్గాల వారి సలహాలు తీసుకుంటున్నామని బైరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వసతులతో క్రీడా అకాడమీలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సింధూ, రజనీలను ప్రొత్సహించినట్లే ప్రతిభ కల్గిన క్రీడాకారులను ప్రొత్సహిస్తామని బైరెడ్డి సిద్దార్థరెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ ఆశీస్సులతో రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. చదవండి:ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సిసోడియా -
సీఎం జగన్ నమ్మకాన్ని నిలబెడతా: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. సిద్దార్ద్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని నిలబెడతాను. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేస్తాను. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు నా కృతజ్ఞతలు’’ అని అన్నారు. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని, అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. సిద్ధార్థరెడ్డికి నామినేటెడ్ పోస్టు.. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ పదవిని ఇచ్చి హామీ నిలబెట్టుకున్నారు. -
మాట నిలబెట్టుకున్న సీఎం జగన్.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారటీ చైర్మన్ పదవి(శాప్)ని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు. దీనిలో భాగంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవిని సిద్ధార్థ్‌రెడ్డికి అప్పచెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. చదవండి: AP Nominated Posts 2021: ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన కాగా పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని, అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్ర సయమంలో సీఎం జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా నెరవేర్చారని బైరెడ్డి అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు పోస్ట్ ఇస్తున్నట్లు ప్రకటించగానే బైరెడ్డి ఇంటి దగ్గర. పార్టీ ఆఫీసు దగ్గర కార్యకర్తలు, అభిమానులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. చదవండి: AP Nominated Posts List 2021: ఏపీ నామినేటెడ్ పదవులు దక్కించుకుంది వీరే.. ప్రస్తుతం నందికొట్కూరు నియోజవకర్గ ఇంచార్జ్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తనకు శాప్ పదవి రావడంపై బైరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు కడపలోని ఆయన నివాసంలో సిద్ధార్థ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. -
పట్టుదల, కృషితోనే లక్ష్య సాధన: హంపి
సాక్షి, గన్నవరం: వర్ధమాన క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ప్రపంచ ర్యాపిడ్ మహిళల చెస్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. మహిళల విభాగంలో భారత నంబర్‌వన్‌గా ఉన్న 32 ఏళ్ల హంపి రష్యాలో గతవారం జరిగిన ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో మహిళల ర్యాపిడ్ విభాగంలో విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన హంపి బుధవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ చేరుకుంది. ఆమెకు గన్నవరం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్), ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ‘శాప్’ నుంచి స్పోర్ట్స్ డైరెక్టర్ రమణ, ఓఎస్డీ రామకృష్ణ, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జీ.మధుసూదనరావు... ఏపీఓఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేపీ రావు, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు శ్రీహరి, నామిశెట్టి వెంకటేశ్వరరావు, ధనియాల నాగరాజు, చెరుకూరి సత్యనారాయణ, అర్జా పాండురంగారావు, ఆర్చరీ క్రీడాకారిణి చెరుకూరి డాలీ, హంపి భర్త దాసరి అన్వేష్, తల్లిదండ్రులు కోనేరు అశోక్, లత తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో హంపి మీడియాతో మాట్లాడింది. ‘తండ్రి అశోక్ నిరంతరం ఇచ్చే విలువైన సూచనలతో చెస్‌లో ఉన్నతస్థితికి చేరుకున్నాను. ఆయన శిక్షణలో మరింతగా రాటుదేలి భవిష్యత్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాను. భర్త అన్వేష్ ఎల్లవేళలా ప్రోత్సహిస్తున్నారు. కుటుంబసభ్యుల సంపూర్ణ సహకారంతోనే చెస్‌లో పునరాగమనం చేయగలిగాను. ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా అవతరించాను. క్లాసికల్ విభాగంలో విశ్వవిజేతగా నిలువడమే తదుపరి లక్ష్యం’ అని హంపి వ్యాఖ్యానించింది. -
వాళ్లిద్దరూ నా పరువు తీశారు
విజయవాడ : ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన జ్యోతి సురేఖ, ఆమె తండ్రి ఈ రోజు నా పరువు బజారున పడేశారని చెరుకూరి వోల్గా ఆర్చరీ సెంటర్ నిర్వాహకుడు చెరుకూరి సత్యనారాయణ అన్నారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..తాను అడగని డబ్బులకు అడిగినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను హాస్టల్ వార్డెన్ అని సంభోదించి పరువు తీశారని చెప్పారు. ఆమె మాటలు ఆమె విచక్షణకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. తన మీద చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నా పేరు చెప్పి రాద్ధాంతం చేస్తే ప్రభుత్వం సురేఖకు ఇవ్వాల్సిన ఉద్యోగం, ఇంటి స్థలం, డబ్బులు ఇస్తుందని ఈ డ్రామా నడిపించారని విమర్శించారు. 2007 నుంచి 2013 మార్చి వరకు మా అకాడమీలో జ్యోతి సురేఖ శిక్షణ తీసుకుందని, నా కుమారుడు చనిపోయిన తర్వాత అకాడమీ సురేఖది అన్నట్లు సురేఖ తండ్రి ప్రవర్తించేవాడని విమర్శించారు. సురేఖ ఆంధ్రప్రదేశ్ తరపున ఆడటం లేదని, పెట్రోలియం శాఖ తరపున ఆడుతోందని వెల్లడించారు. అటువంటి సురేఖకు ఏపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి కుదరదని చెప్పారు. తన అకాడమీలో శిక్షణ తీసుకుని తాను కోచ్ కాదంటే ఎలా అని ప్రశ్నించారు. తన కుమారునికి రాని అవార్డు, జ్యోతి సురేఖకు ఎలా వచ్చిందని సూటిగా అడిగారు. గురువును అవమానించడం సురేఖకు తగదన్నారు. తమకు క్షమాపణ చెప్పే వరకు తన కుమారుడి సమాధి దగ్గర నిరసన దీక్ష చేస్తామని తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ (శాప్), కోచ్‌లు తనకు రావాల్సిన నజరానాలను అడ్డుకుంటున్నారని అర్జున అవార్డు గ్రహీత, విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే. -
ప్రభుత్వ ప్రోత్సాహాకాల్లోను వాటాలు అడుగుతున్నారు
-
‘ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు తీవ్ర అన్యాయం’
సాక్షి, విజయవాడ : కొంతమంది అధికారులు, స్పోర్ట్స్ అథారిటీలు, కోచ్‌ల వల్లే రాష్ట్రంలో క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అర్జున అవార్డు గ్రహీత, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు ప్రకటించిన కోటి రూపాయల నజరానా ఇప్పటి వరకు అందలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున అనేక టోర్నీలలో పాల్గొన్న జ్యోతి అద్భుత ప్రతిభ కనబర్చి పథకాలు సాధించారు. అయితే రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఆడనీయకుండా కొంతమంది అధికారులు, కోచ్ అని చెప్పుకుంటున్న సత్యనారయణ తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అసలు సత్యనారాయణ కోచ్ కాదని, ఆయన కేవలం హాస్టల్ వార్డెన్ మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాకాలలో వాటాలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారి వల్లే రాష్ట్ర కీడాకారులకు అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. అంతర్జాతీయ ర్యాకింగ్స్లో జ్యోతి సురేఖ 13వ స్థానంలో కొనసాగుతున్నారు. -
అవుట్ సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలు!
ఇంటర్వ్యూ తర్వాత హోటల్లో మళ్లీ దరఖాస్తుల పరిశీలన విజయవాడ స్పోర్ట్స్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) అవుట్ సోర్సింగ్ విధానంలో చేపట్టిన కోచ్‌ల నియామకం మరోసారి రచ్చకెక్కింది. కోచ్ పోస్టుల కోసం ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత కూడా విజయవాడలోని ఓ హోటల్లో దరఖాస్తులను సెలెక్షన్ కమిటీ శుక్రవారం రహస్యంగా మళ్లీ పరిశీలించడం బయట పడింది. వివరాల్లోకెళితే... కోచ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ‘శాప్’ నియమించిన సెలెక్షన్ కమిటీ ఇంటర్వూ్యలు నిర్వహించింది. నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ నిర్వహణ అనంతరం ఎంపికైన వారి జాబితాను ‘శాప్’ కార్యాలయంలో ఉంచాల్సి ఉంది. అయితే ‘శాప్’ ఉన్నతాధికారి, సెలెక్షన్ కమిటీ కన్వీనర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీ రహస్యంగా ఒక హోటల్లో దరఖాస్తులను స్క్రూటినీ చేయడం వివాదానికి కారణమైంది. దీనికి తోడు ‘శాప్’ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బంగారురాజు, సెలెక్షన్ కమిటీలోని మరో సభ్యుడు లేకుండా దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం జరగడం గమనార్హం. సెలెక్షన్ కమిటీలో ‘శాప్’ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బంగారురాజు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు ఎ.రమణరావు చైర్మన్‌గా, రామిరెడ్డి, వెంకటేశ్వరరావు సభ్యులుగా ‘శాప్’ ఉన్నతాధికారి దుర్గాప్రసాద్ కన్వీనర్‌గా ఉన్నారు. వాస్తవానికి ఇంటర్వ్యూ ప్రక్రియ మొత్తం ఎండీ పర్యవేక్షణలో ‘శాప్’ కార్యాలయంలో జరగాలి. హోటల్లో దరఖాస్తులు పరిశీలిస్తున్న గదికి మీడియా వెళ్లడంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. కొద్దిసేపు ఏం చెప్పాలో వారికి తోచలేదు. పైగా ఇంటర్వూ్య లకు హాజరైన అభ్యర్థులు హోటల్లో కనిపించడంతో నియామకాలపై వచ్చిన ఆరోపణలకు బలం చేకూరుతోంది. దీనిపై సెలెక్షన్ కమిటీ కన్వీనర్ దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా, ఎండీ పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన జరుగుతోందన్నారు. ఎండీ బంగారురాజు, సెలెక్షన్ కమిటీ చైర్మన్ భోజనానికి వెళ్లారని, తాను విధి నిర్వహణలో ఉన్నట్లు చెప్పారు. ‘శాప్’ కార్యాలయంలో దరఖాస్తుల పరిశీలనకు అనువైన వాతావరణం లేదని, అందుకే హోటల్‌కు వచ్చినట్లు చెప్పడం గమనార్హం. వాస్తవానికి ‘శాప్’ వీసీ అండ్ ఎండీ బంగారురాజు, కమిటీ చైర్మన్ ప్రస్తుతం నగరంలో లేరు. మొత్తం ఎంపిక ప్రక్రియ వివాదాస్పదం కావడంపై ఎండీ కార్యాలయం తరఫు నుంచి ఇంకా ఎలాంటి వివరణా రాలేదు. -
రాజ్యాంగ నిర్మాతకు క్రీడా నివాళి
విజయనగరం మున్సిపాలిటీ: భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు క్రీడా నివాళి అర్పించేందుకు విజయనగరం సిద్ధమైంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) నేతృత్వంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు విజ్జీ, రాజీవ్ స్టేడియంలు ముస్తాబయ్యాయి. మూడు రోజుల పాటు కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నవి. ఏర్పాట్లలో అధికార యంత్రాంగం తలమునకలైంది. దీనికోసం కలెక్టర్ అధ్యక్షతన 14 కమిటీలు వేశారు. అయితే, రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు ప్రభుత్వం కేవలం రూ.12 లక్షల నిధులు మాత్రమే కేటాయించింది. నిధులు చాలవంటూ జిల్లా యంత్రాంగం శాప్‌కు నివేదించింది. బరిలో 1300 మంది క్రీడాకారులు.. రాష్ట్ర స్థాయి పోటీలకు 13 జిల్లాల నుంచి 1300 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. ఈమేరకు శనివారం ఉదయానికి నెల్లూరు, అనంతరపురం, ప్రకాశం జిల్లాలకు చెందిన క్రీడాకారులు విజయనగరం చేరుకోగా... మిగిలిన జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. పోటీల పర్యవేక్షణ కోసం 300 మంది ఆఫీషియల్స్ జిల్లాకు చేరుకున్నారు. వీరికి వసతి సదుపాయాన్ని జిల్లా అధికారులు కల్పించారు. బాలికల కోసం నాయుడు ఫంక్షన్ హాల్, తోష్నివాలా భవన్లు కేటాయించగా.. బాలుర క్రీడాకారుల కోసం ఉల్లివీధిలోని ఆర్యవైశ్య కల్యాణ మండపం, లేడీస్ రిక్రియేషన్ క్లబ్, టీటీడీ కల్యాణ మండపం, రెవెన్యూ కల్యాణ మండపం, పోలీస్ ట్రైనింగ్ కళాశాలలను కేటాయించారు. ఆఫీషియల్స్ వసతి కోసం యూత్ హాస్టల్‌తో పాటు జిల్లా పరిషత్, ఆర్అండ్బీ అతిథి గృహాలను కేటాయించారు. పోటీల్లో విజేతలకు నగదు ప్రోత్సాహకాలు పోటీల్లో విజేతలుగా నిలిచే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నారు. విజేతలుగా నిలిచిన వరుస మూడు జట్లు, క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ.1500, రూ.1000, రూ.500 చొప్పున నగదు, జ్ఞాపికలు అందజేయనున్నారు. మైదానంలోనే సదుపాయాలు.. క్రీడాకారులకు మైదానంలోనే మౌలిక సదుపాయాలు కల్పించారు. క్రీడాకారులకు కేటాయించిన వసతి నుంచి 20 బస్సుల్లో ఉదయం 7 గంటలకే విజ్జి మైదానానికి తరలించనున్నారు. ఈ రవాణా ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ అధికులు పర్యవేక్షించనున్నారు. మైదానం ఆవరణలో ఏర్పాటు చేసిన భోజనశాల వద్దనే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ముగించిన తరువాత వారికి కేటాయించిన వసతి వద్దకు తరలించనున్నారు. మైదానం ఆవరణలో పక్కా మరుగుదొడ్లు లేకపోవటంతో 34 మొబైల్ టాయిలెట్లు బాల, బాలికలకు వేరువేరుగా నిర్మించారు. క్రీడాకారులకు తాగేందుకు నీటి సదుపాయం, ఆటలో దెబ్బలు తగిలితే ప్రథమ చికిత్స అందించేందుకు మూడు మెడికల్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.