
విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ
విజయవాడ : ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన జ్యోతి సురేఖ, ఆమె తండ్రి ఈ రోజు నా పరువు బజారున పడేశారని చెరుకూరి వోల్గా ఆర్చరీ సెంటర్ నిర్వాహకుడు చెరుకూరి సత్యనారాయణ అన్నారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..తాను అడగని డబ్బులకు అడిగినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను హాస్టల్ వార్డెన్ అని సంభోదించి పరువు తీశారని చెప్పారు. ఆమె మాటలు ఆమె విచక్షణకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు.
తన మీద చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నా పేరు చెప్పి రాద్ధాంతం చేస్తే ప్రభుత్వం సురేఖకు ఇవ్వాల్సిన ఉద్యోగం, ఇంటి స్థలం, డబ్బులు ఇస్తుందని ఈ డ్రామా నడిపించారని విమర్శించారు. 2007 నుంచి 2013 మార్చి వరకు మా అకాడమీలో జ్యోతి సురేఖ శిక్షణ తీసుకుందని, నా కుమారుడు చనిపోయిన తర్వాత అకాడమీ సురేఖది అన్నట్లు సురేఖ తండ్రి ప్రవర్తించేవాడని విమర్శించారు. సురేఖ ఆంధ్రప్రదేశ్ తరపున ఆడటం లేదని, పెట్రోలియం శాఖ తరపున ఆడుతోందని వెల్లడించారు.
అటువంటి సురేఖకు ఏపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి కుదరదని చెప్పారు. తన అకాడమీలో శిక్షణ తీసుకుని తాను కోచ్ కాదంటే ఎలా అని ప్రశ్నించారు. తన కుమారునికి రాని అవార్డు, జ్యోతి సురేఖకు ఎలా వచ్చిందని సూటిగా అడిగారు. గురువును అవమానించడం సురేఖకు తగదన్నారు. తమకు క్షమాపణ చెప్పే వరకు తన కుమారుడి సమాధి దగ్గర నిరసన దీక్ష చేస్తామని తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ (శాప్), కోచ్‌లు తనకు రావాల్సిన నజరానాలను అడ్డుకుంటున్నారని అర్జున అవార్డు గ్రహీత, విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment