‘అర్జున’ జ్యోతి ఆవేదన | Arjuna Award winner Jyothi Surekha Agitation | Sakshi
Sakshi News home page

‘అర్జున’ జ్యోతి ఆవేదన

Published Mon, May 7 2018 3:07 AM | Last Updated on Mon, Aug 20 2018 4:12 PM

Arjuna Award winner Jyothi Surekha Agitation - Sakshi

విజయవాడ స్పోర్ట్స్‌: స్పోర్ట్స్‌ అథారిటీ (శాప్‌), కోచ్‌లు తనకు రావాల్సిన నజరానాలను అడ్డుకుంటున్నారని అర్జున అవార్డు గ్రహీత, విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఆరోపించింది. తన స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అర్జున అవార్డు పొందిన తర్వాత సీఎం చంద్రబాబు రూ.కోటి నజరానా ప్రకటించినా ఇప్పటివరకు అందలేదని తెలిపింది. సహాయం చేయకపోగా అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని  ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ నెల 3న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో తనకు కోచ్‌గా చెరుకూరి సత్యనారాయణను చూపిస్తూ  రూ.15 లక్షల మంజూరు చేయడాన్ని ఖండించింది. తనకు ఏనాడు ఆయన కోచ్‌గా వ్యవహరించలేదని స్పష్టం చేసింది. తన కోచ్‌లు జె.రామారావు, జీవన్‌జ్యోత్‌సింగ్‌ అని స్పష్టం చేసింది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా చెరుకూరి సత్యనారాయణ అడ్డుకున్నారని దీంతో పెట్రోలియం స్పోర్ట్స్‌ బోర్డ్‌ తరఫున ఆడాల్సి వచ్చిందని తెలిపింది. 2013లోనే ఓల్గా ఆర్చరీ అకాడమీ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పింది. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఇంటి స్థలం, గ్రూపు–1 ఉద్యోగాన్ని ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం స్పందించకపోతే సోమవారం నుంచి నిరాహార దీక్షకు దిగుతానని పేర్కొంది.

బేసిక్‌ కోచ్‌ను నేనే: చెరుకూరి సత్యనారాయణ 
జ్యోతి సురేఖకు నేను, నా కుమారుడు లెనిన్‌ శిక్షణ ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చాం. నేనే బేసిక్‌ కోచ్‌ని. క్రీడా పాలసీ ప్రకారం బేసిక్‌ కోచ్‌లకు గౌరవ ఇన్సెంటివ్‌లు ఇస్తారు. అదే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. నేను కోచ్‌ను కాదని సురేఖ తండ్రి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ రాష్ట్రంలో ఆర్చరీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది నా కుమారుడు లెనిన్‌. శాప్‌ నా కుమారుడిని అర్జున, ద్రోణాచార్య అవార్డులకు రిఫర్‌ చేయడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement