నామినేషన్లలో కనిపించని మనూ భాకర్ పేరు
తుది జాబితాలో ఖరారయ్యే అవకాశం!
తెలంగాణ అథ్లెట్ దీప్తి జివాంజికి ‘అర్జున’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటనకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 12 మంది సభ్యుల సెలక్షన్ కమిటీ అర్జున, ఖేల్‌రత్న, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ తదితర అవార్డులకు సంబంధించిన నామినేషన్ల జాబితాను ప్రభుత్వానికి అందించింది. మార్పులు లేకుండా దాదాపు ఇదే జాబితా ఖాయమయ్యే అవకాశం ఉంది.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేరును ‘ఖేల్‌రత్న’ పేరు కోసం ప్రతిపాదించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన 28 ఏళ్ల హర్మన్‌ప్రీత్... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో భారత్ పతకాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.
హర్మన్‌తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ‘ఖేల్‌రత్న’ కోసం సిఫారసు చేసింది. పారిస్ పారాలింపిక్స్ హైజంప్ (టి64 క్లాస్)లో ప్రవీణ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు సాధించిన షూటర్ మనూ భాకర్ పేరు ఖేల్‌రత్న జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న ప్లేయర్‌గా మరో చర్చ లేకుండా ‘ఖేల్ రత్న’ అవార్డుకు ఆమె అర్హురాలు. అయితే మనూ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని క్రీడా మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. దానిని మనూ తండ్రి రామ్‌కిషన్ ఖండించారు. తాను సరైన ఫార్మాట్‌లోనే అప్లికేషన్ అందించామని స్పష్టం చేశారు. ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోయినా ... ప్రదర్శనను బట్టి అవార్డుకు ఎంపిక చేసే అధికారం జ్యూరీకి ఉంది. కాబట్టి మనూ సాధించిన ‘డబుల్ ఒలింపిక్ మెడల్’ ఘనతను బట్టి చూస్తే ఆలస్యంగానైనా ఆమె పేరు ఈ జాబితాలో చేరవచ్చు.
‘అర్జున’ జాబితాలో 30 మంది
కమిటీ ప్రతిపాదించిన ‘అర్జున’ అవార్డీల జాబితాలో 13 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, మరో 17 మంది పారా ఆటగాళ్లు ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న అమన్ (రెజ్లింగ్), సరబ్‌జోత్, స్వప్నిల్ కుసాలే (షూటింగ్) పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పారా ఆటగాళ్లలో తెలంగాణకు చెందిన దీప్తి జివాంజికి ‘అర్జున’
దక్కనుండటం విశేషం. వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి పారిస్ పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు (టి20)లో కాంస్యం గెలుచుకుంది.
అంతకుముందు ఆసియా పారా క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో ఆమె ఖాతాలో రెండు స్వర్ణాలు ఉన్నాయి. పారా షూటింగ్ కోచ్ సుభాష్ రాణా పేరును ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం కమిటీ సిఫారసు చేసింది. ఈ జాబితాలో మరో కోచ్ అమిత్ కుమార్ సరోహా పేరు కూడా ఉండటం చర్చకు దారి తీసింది. అతను ఎప్పుడూ అధికారికంగా కోచ్‌గా పని చేయలేదని... పైగా ఇటీవల పారిస్‌లోనూ ఆటగాడిగా బరిలోకి దిగాడు కాబట్టి ద్రోణాచార్య అవార్డుకు అర్హుడు కాదని విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment