Former Supreme Court judge
-
ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌గా వి.రామసుబ్రమణియన్
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీకాలం జూన్1తో ముగియడంతో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ పదవి ఖాళీగా ఉంది. కొత్త చైర్పర్సన్ ఎంపిక కోసం డిసెంబర్ 18న సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రపతి నియమించారు. చైర్మన్ రామసుబ్రమణియన్‌తోపాటు సభ్యులుగా ప్రియాంక్ కనూంగో, డాక్టర్ బిద్యుత్ రంజన్ సారంగి (రిటైర్డ్)లను నియమిస్తున్నట్లు ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. కనూంగో గతంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) చైర్ పర్సన్‌గా పనిచేశారు. గతంలో హక్కుల సంఘానికి అధిపతులుగా పనిచేసిన మాజీ సీజేఐలలో హెచ్ఎల్ దత్తు, కేజీ బాలకృష్ణన్ ఉన్నారు. -
హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ‘ఖేల్‌రత్న’ అవార్డు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటనకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 12 మంది సభ్యుల సెలక్షన్ కమిటీ అర్జున, ఖేల్‌రత్న, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ తదితర అవార్డులకు సంబంధించిన నామినేషన్ల జాబితాను ప్రభుత్వానికి అందించింది. మార్పులు లేకుండా దాదాపు ఇదే జాబితా ఖాయమయ్యే అవకాశం ఉంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేరును ‘ఖేల్‌రత్న’ పేరు కోసం ప్రతిపాదించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన 28 ఏళ్ల హర్మన్‌ప్రీత్... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో భారత్ పతకాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. హర్మన్‌తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ‘ఖేల్‌రత్న’ కోసం సిఫారసు చేసింది. పారిస్ పారాలింపిక్స్ హైజంప్ (టి64 క్లాస్)లో ప్రవీణ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు సాధించిన షూటర్ మనూ భాకర్ పేరు ఖేల్‌రత్న జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న ప్లేయర్‌గా మరో చర్చ లేకుండా ‘ఖేల్ రత్న’ అవార్డుకు ఆమె అర్హురాలు. అయితే మనూ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని క్రీడా మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. దానిని మనూ తండ్రి రామ్‌కిషన్ ఖండించారు. తాను సరైన ఫార్మాట్లోనే అప్లికేషన్ అందించామని స్పష్టం చేశారు. ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోయినా ... ప్రదర్శనను బట్టి అవార్డుకు ఎంపిక చేసే అధికారం జ్యూరీకి ఉంది. కాబట్టి మనూ సాధించిన ‘డబుల్ ఒలింపిక్ మెడల్’ ఘనతను బట్టి చూస్తే ఆలస్యంగానైనా ఆమె పేరు ఈ జాబితాలో చేరవచ్చు. ‘అర్జున’ జాబితాలో 30 మంది కమిటీ ప్రతిపాదించిన ‘అర్జున’ అవార్డీల జాబితాలో 13 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, మరో 17 మంది పారా ఆటగాళ్లు ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న అమన్ (రెజ్లింగ్), సరబ్జోత్, స్వప్నిల్ కుసాలే (షూటింగ్) పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పారా ఆటగాళ్లలో తెలంగాణకు చెందిన దీప్తి జివాంజికి ‘అర్జున’ దక్కనుండటం విశేషం. వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి పారిస్ పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు (టి20)లో కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు ఆసియా పారా క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో ఆమె ఖాతాలో రెండు స్వర్ణాలు ఉన్నాయి. పారా షూటింగ్ కోచ్ సుభాష్ రాణా పేరును ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం కమిటీ సిఫారసు చేసింది. ఈ జాబితాలో మరో కోచ్ అమిత్ కుమార్ సరోహా పేరు కూడా ఉండటం చర్చకు దారి తీసింది. అతను ఎప్పుడూ అధికారికంగా కోచ్‌గా పని చేయలేదని... పైగా ఇటీవల పారిస్‌లోనూ ఆటగాడిగా బరిలోకి దిగాడు కాబట్టి ద్రోణాచార్య అవార్డుకు అర్హుడు కాదని విమర్శలు వస్తున్నాయి. -
కొలీజియం సిఫార్సులపై సాగదీత...
ముంబై: కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు చేస్తున్న విమర్శలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్ శనివారం తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘సాధారణ పౌరునిగా కొలీజియంతో పాటు ప్రతి వ్యవస్థనూ విమర్శించవచ్చు. కానీ ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా మాత్రం నియమ నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడి ఉండాల్సిందే’’ అన్నారు. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘకాలం పాటు పెండింగ్‌లో పెడుతున్న వైనాన్ని ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా ఆయన అభివర్ణించారు. ‘‘నిర్భీతితో కూడిన స్వతంత్ర న్యాయమూర్తులు లేకుండా పోతే పరిస్థితేమిటి? న్యాయ వ్యవస్థ మన చివరి ఆశా కిరణం. అది కూడా కుప్పకూలితే దేశానికిక చీకటి రోజులే. తప్పో, ఒప్పో.. 1993 నాటి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా కొలీజియం వ్యవస్థ పుట్టుకొచ్చింది. దాన్ని గౌరవించడం కేంద్రం విధి. ఎందుకంటే అన్ని వ్యవస్థలూ సుప్రీంకోర్టు తీర్పులకు కట్టుబడాల్సిందే’’ అన్నారు. తనకు అనుకూలమైన కొలీజియం వచ్చి పాత సిఫార్సులపై పునరాలోచన చేస్తుందనేది కేంద్రం వైఖరి అని అభిప్రాయపడ్డారు. అందుకే కొలీజియం సిఫార్సులపై 30 రోజుల్లోగా కేంద్రం స్పందించని పక్షంలో దాన్ని అంగీకారంగానే పరిగణించేలా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించాలన్నారు. -
ఎన్జీటీ చైర్మన్‌గా జస్టిస్ గోయల్
న్యూఢిల్లీ: జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, వ్యవహారాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. చైర్మన్ పదవిలో గోయల్ ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గోయల్ పదవీవిరమణ చేయగానే ఆయన్ను ప్రభుత్వం ఎన్జీటీ చైర్మన్‌గా నియమించింది. ట్రిపుల్ తలాక్, జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) ఏర్పాటు సహా పలు కేసుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గోయల్ చరిత్రాత్మక తీర్పులిచ్చారు. గతేడాది డిసెంబర్లో జస్టిస్ స్వతంతర్ కుమార్ పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం ఎన్జీటీకి పూర్తిస్థాయి చైర్మన్‌ను నియమించలేదు. పర్యావరణంతో పాటు అడవులు, సహజవనరుల పరిరక్షణకు జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం ద్వారా 2010, అక్టోబర్ 18న ఎన్జీటీని ఏర్పాటుచేశారు. ఎన్జీటీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. మదిలో ఎమర్జెన్సీ కదలాడింది! పదవీవిరమణ అనంతరం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన వీడ్కోలు సభలో జస్టిస్ గోయల్ మాట్లాడుతూ..‘ఎమర్జెన్సీ సందర్భంగా ప్రాథమిక హక్కుల్ని రద్దుచేశారు. దీంతో పోలీసులు, అధికారులకు ఎలాంటి సమీక్ష లేకుండా అపరిమిత అధికారాలు లభించాయి. కానీ అలాంటి వాతావరణంలో కూడా కోర్టులు ప్రజలకు న్యాయం అందించేందుకు కట్టుబడ్డాయి. ఎమర్జెన్సీ కారణంగానే ఓ అమాయకుడ్ని అరెస్ట్ చేసిన సందర్భాల్లో కోర్టులు వెంటనే బాధితులకు బెయిల్‌ను మంజూరు చేశాయి. ఎస్సీ,ఎస్టీ చట్టం దుర్వినియోగం కేసులో తీర్పు రాసేటప్పుడు ఇవన్నీ నా మదిలో కదలాడాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
వీఆర్ కృష్ణయ్యర్ ఇక లేరు
తీవ్ర అస్వస్థత వల్ల అవయవ వైఫల్యంతో కన్నుమూత నేడు కొచ్చిలో జరగనున్న అంత్యక్రియలు కొచ్చి: ప్రఖ్యాత న్యాయశాస్త్ర కోవిదుడు, కమ్యూనిస్టు యోధుడు వి.ఆర్. కృష్ణయ్యర్(100) గురువారం కన్నుమూశారు. నవంబర్ 13వ తేదీన ఆయన 100వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న విషయం విదితమే. తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణయ్యర్‌ను కుటుంబ సభ్యులు నవంబర్ 24న స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆయన డిసెంబర్ 2న తీవ్ర గుండెపోటుతో పక్షవాతానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించటం ప్రారంభమైంది. కీలక అవయవాల వైఫల్యంతో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు కన్నుమూశారని వైద్యులు తెలిపారు. అరుదైన వ్యక్తి కృష్ణయ్యర్..: కేరళలోని పాలక్కడ్ సమీపంలోని వైద్యనాథపురంలోని తమిళ బ్రాహ్మణుల ఇంట 1914 నవంబర్ 15న జన్మించిన వైద్యనాథపుర రామకృష్ణయ్యర్..యువకుడిగా ఉన్నప్పుడే కమ్యూనిస్టు భావాలను ఒంటబట్టించుకున్నారు. 1937 నుంచి క్రిమినల్ లాయర్‌గా పేరున్న తండ్రి వి.వి. రామయ్యర్ శిష్యరికంలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అనంతరం అప్పటి మద్రాస్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రపంచంలోనే మొదటిసారిగా కేరళలో ఎన్నికైన ఈఎంఎస్ నంబూద్రిపాద్ కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1965 ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం న్యాయవాద వృత్తిపై దృష్టి పెట్టారు. 1968లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా రెండు రంగాల్లో అవిరళ కృషి చేసిన అరుదైన వ్యక్తి అయ్యర్. కాగా, 1957లో ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే కేరళలో భూ సంస్కరణలు అమలయ్యాయి. అలాగే, 1973 నుంచి 1980 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఆయన హయాంలోనే బెయిల్ నిబంధనలు సరళమయ్యాయి. విచారణ సందర్భంగా నిందితులకు బేడీలు వేయటాన్ని కూడా అయ్యర్ వ్యతిరేకించారు. భారత న్యాయవ్యవస్థకు అయ్యర్ భీష్మ పితామహుడు వంటి వారని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్ కొనియాడారు. 1975లో ఇందిరాగాంధీని ఎంపీ పదవికి అనర్హురాలిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన షరతులతో కూడిన స్టే ఇచ్చారు. తదనంతర పరిణామాలు దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించేందుకు దారితీశాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో 400 వరకు తీర్పులు వెలువరించి, అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆయన న్యాయశాస్త్రానికి సంబంధించి 70కి పైగా పుస్తకాలు రాశారు. ‘వాండరింగ్ ఇన్ మెనీ వరల్డ్స్’ పేరుతో ఆత్మకథ రాసుకున్నారు. లా కమిషన్ సభ్యునిగా 1971-73 కాలంలో పనిచేశారు. 1987 రాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్.వెంకట్రామన్ ప్రత్యర్థి వీఆర్ కృష్ణయ్యర్. గుజరాత్ అల్లర్లపై విచారణకు ఏర్పాటైన పౌర సంఘంలో అయ్యర్ కూడా సభ్యునిగా ఉన్నారు. 1999లో ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. 2002 గుజరాత్ అల్లర్లకు నరేంద్రమోదీయే కారణమని అప్పట్లో అయ్యర్ తీవ్ర విమర్శలు చేశారు. కానీ గత ఏడాది బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీని ప్రకటించగా కృష్ణయ్యర్ హర్షం వ్యక్తం చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నేడు అంత్యక్రియలు: కృష్ణయ్యర్ భౌతిక కాయాన్ని కొచ్చిలోని స్వగృహం ‘సత్గమయ’కు తరలించి అక్కడి నుంచి.. ప్రజల సందర్శనార్థం దగ్గరలోనే ఉన్న రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియానికి తరలించనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు జరుపుతారు. ఆయనకు ఇద్దరు కుమారులు. గొప్ప మానవతావాది: ప్రధాని మోదీ ఆయన మృతిపై రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ మోదీ విచారం వెలిబుచ్చారు. ఆయన గొప్ప మానవతావాది అని మోదీ ట్వీటర్లో శ్లాఘించారు. కృష్ణయ్యర్ ప్రజల మనిషి అని ఆయన సేవలను ఎన్నటికీ మరువబోమని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు. కృష్ణయ్యర్ మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. బలహీన వర్గాలకు అండ: వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: జస్టిస్ కృష్ణయ్యర్ మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. దేశ న్యాయవ్యవస్థలో తనదైన ముద్ర వేసిన కృష్ణయ్యర్... బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు కొండంత అండగా నిలిచారని జగన్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలకు చేరువ చేయడంలో కృష్ణయ్యర్ కృషి గుర్తుండిపోతుందన్నారు. పలు అసాధారణమైన తీర్పులిచ్చిన కృష్ణయ్యర్ న్యాయవ్యవస్థలో ఓ ఆదర్శమూర్తిలా నిలిచారని జగన్ తన సంతాపం సందేశంలో నివాళులర్పించారు. -
లైంగిక ఆరోపణలు అవాస్తవం: జస్టిస్ స్వతంత్ర కుమార్
సుప్రీం న్యాయమూర్తులపై వరుసపెట్టి లైంగిక ఆరోపణలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలీపై ఆరోపణలు వెల్లువెత్తగా, ఇప్పుడు మరో మాజీ జడ్జి స్వతంత్ర కుమార్ వంతు వచ్చింది. అయితే, తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని జస్టిస్ స్వతంత్ర కుమార్ చెబుతున్నారు. ఆయన వద్ద పనిచేసినట్లు చెబుతున్న ఓ న్యాయ విద్యార్థిని ఆయనపై ఆరోపణలు చేసింది. ప్రస్తుతం జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. నిన్నటి వరకు ఆయన పేరు బయటకు రాలేదు. శుక్రవారం నాడు బాధితురాలి ఫిర్యాదును ఉటంకిస్తూ సీఎన్ఎన్ ఐబీఎన్ చానల్ ఆయన పేరు బయటపెట్టడంతో, స్వతంత్రకుమార్ జాతీయ మీడియాకు తన వివరణ పంపారు. అసలు ఆమె ఎవరో తనకు తెలియదని, తన వద్ద ఆమె శిష్యరికం చేసినట్లు కూడా గుర్తు లేదని ఆయన అన్నారు. ఆమె అఫిడవిట్ దాఖలు చేసినట్లు కూడా తనకు సమాచారం ఏమీ లేదన్నారు. కేవలం మీడియా ద్వారా మాత్రమే తనకు అలాంటి అఫిడవిట్ పంపినట్లు తెలిసిందని, అఫిడవిట్ వివరాలు ప్రచురిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆయన చెప్పారు. జస్టిస్ స్వతంత్రకుమార్ తన పృష్టభాగంపై చేయి వేశారని, ఆయనతో కలిసి ప్రయాణించేందుకు, హోటళ్లలో ఉండేందుకు ఇబ్బంది ఏమీ లేదు కదా అని అడిగారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. -
రాజీనామా యోచనలో గంగూలీ
ఢిల్లీ/కోల్‌కతా: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే గంగూలీ.. పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ (డబ్ల్యూబీహెచ్ఆర్సీ) చైర్మన్ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. గంగూలీ ఈ విషయాన్ని తనకు ఫోన్లో చెప్పినట్టు మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ తెలిపారు. గంగూలీ తనను లైంగికంగా వేధించారంటూ న్యాయ విద్యార్థి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై గంగూలీ తనకు వివరించారని సోరాబ్జీ తెలిపారు. డబ్ల్యూబీహెచ్ఆర్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలనుకోవడం వివేకమైన నిర్ణయమని గంగూలీకి చెప్పానని సోరాబ్జీ పేర్కొన్నారు.