వీఆర్ కృష్ణయ్యర్ ఇక లేరు
తీవ్ర అస్వస్థత వల్ల అవయవ వైఫల్యంతో కన్నుమూత
నేడు కొచ్చిలో జరగనున్న అంత్యక్రియలు
కొచ్చి: ప్రఖ్యాత న్యాయశాస్త్ర కోవిదుడు, కమ్యూనిస్టు యోధుడు వి.ఆర్. కృష్ణయ్యర్(100) గురువారం కన్నుమూశారు. నవంబర్ 13వ తేదీన ఆయన 100వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న విషయం విదితమే. తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణయ్యర్‌ను కుటుంబ సభ్యులు నవంబర్ 24న స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆయన డిసెంబర్ 2న తీవ్ర గుండెపోటుతో పక్షవాతానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించటం ప్రారంభమైంది. కీలక అవయవాల వైఫల్యంతో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు కన్నుమూశారని వైద్యులు తెలిపారు.
అరుదైన వ్యక్తి కృష్ణయ్యర్..: కేరళలోని పాలక్కడ్ సమీపంలోని వైద్యనాథపురంలోని తమిళ బ్రాహ్మణుల ఇంట 1914 నవంబర్ 15న జన్మించిన వైద్యనాథపుర రామకృష్ణయ్యర్..యువకుడిగా ఉన్నప్పుడే కమ్యూనిస్టు భావాలను ఒంటబట్టించుకున్నారు. 1937 నుంచి క్రిమినల్ లాయర్‌గా పేరున్న తండ్రి వి.వి. రామయ్యర్ శిష్యరికంలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అనంతరం అప్పటి మద్రాస్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రపంచంలోనే మొదటిసారిగా కేరళలో ఎన్నికైన ఈఎంఎస్ నంబూద్రిపాద్ కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1965 ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం న్యాయవాద వృత్తిపై దృష్టి పెట్టారు. 1968లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇలా రెండు రంగాల్లో అవిరళ కృషి చేసిన అరుదైన వ్యక్తి అయ్యర్. కాగా, 1957లో ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే కేరళలో భూ సంస్కరణలు అమలయ్యాయి. అలాగే, 1973 నుంచి 1980 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఆయన హయాంలోనే బెయిల్ నిబంధనలు సరళమయ్యాయి. విచారణ సందర్భంగా నిందితులకు బేడీలు వేయటాన్ని కూడా అయ్యర్ వ్యతిరేకించారు. భారత న్యాయవ్యవస్థకు అయ్యర్ భీష్మ పితామహుడు వంటి వారని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్ కొనియాడారు. 1975లో ఇందిరాగాంధీని ఎంపీ పదవికి అనర్హురాలిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన షరతులతో కూడిన స్టే ఇచ్చారు.
తదనంతర పరిణామాలు దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించేందుకు దారితీశాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో 400 వరకు తీర్పులు వెలువరించి, అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆయన న్యాయశాస్త్రానికి సంబంధించి 70కి పైగా పుస్తకాలు రాశారు. ‘వాండరింగ్ ఇన్ మెనీ వరల్డ్స్’ పేరుతో ఆత్మకథ రాసుకున్నారు. లా కమిషన్ సభ్యునిగా 1971-73 కాలంలో పనిచేశారు. 1987 రాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్.వెంకట్రామన్ ప్రత్యర్థి వీఆర్ కృష్ణయ్యర్. గుజరాత్ అల్లర్లపై విచారణకు ఏర్పాటైన పౌర సంఘంలో అయ్యర్ కూడా సభ్యునిగా ఉన్నారు. 1999లో ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. 2002 గుజరాత్ అల్లర్లకు నరేంద్రమోదీయే కారణమని అప్పట్లో అయ్యర్ తీవ్ర విమర్శలు చేశారు. కానీ గత ఏడాది బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీని ప్రకటించగా కృష్ణయ్యర్ హర్షం వ్యక్తం చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
నేడు అంత్యక్రియలు: కృష్ణయ్యర్ భౌతిక కాయాన్ని కొచ్చిలోని స్వగృహం ‘సత్‌గమయ’కు తరలించి అక్కడి నుంచి.. ప్రజల సందర్శనార్థం దగ్గరలోనే ఉన్న రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియానికి తరలించనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు జరుపుతారు. ఆయనకు ఇద్దరు కుమారులు.
గొప్ప మానవతావాది: ప్రధాని మోదీ
ఆయన మృతిపై రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ మోదీ విచారం వెలిబుచ్చారు. ఆయన గొప్ప మానవతావాది అని మోదీ ట్వీటర్‌లో శ్లాఘించారు. కృష్ణయ్యర్ ప్రజల మనిషి అని ఆయన సేవలను ఎన్నటికీ మరువబోమని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు. కృష్ణయ్యర్ మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.
బలహీన వర్గాలకు అండ: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ కృష్ణయ్యర్ మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. దేశ న్యాయవ్యవస్థలో తనదైన ముద్ర వేసిన కృష్ణయ్యర్... బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు కొండంత అండగా నిలిచారని జగన్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలకు చేరువ చేయడంలో కృష్ణయ్యర్ కృషి గుర్తుండిపోతుందన్నారు. పలు అసాధారణమైన తీర్పులిచ్చిన కృష్ణయ్యర్ న్యాయవ్యవస్థలో ఓ ఆదర్శమూర్తిలా నిలిచారని జగన్ తన సంతాపం సందేశంలో నివాళులర్పించారు.