
వారిద్దరూ విద్యావంతులు. దానికి తోడు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదుగానీ తల్లితో కలిసి విగతజీవులుగా మారిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మరణాలు కేరళలో (Kerala) కలకలం రేపాయి. వారు ముగ్గురు ఎలా చనిపోయారు, ఎందుకు అకాల మరణం చెందారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయితేనే అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.
అసలేం జరిగింది?
కొచ్చిలోని ఎకాముఖ్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ క్వార్టర్స్‌లోని ఓ ఇంటిలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురి మృతదేహాలను పోలీసులు శుక్రవారం కనుగొన్నారు. మృతులు శాలిని విజయ్, మనీశ్ విజయ్, శకుంతలగా గుర్తించారు. శాలిని.. జార్ఖండ్ (Jharkhand) సాంఘిక సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, ఆమె సోదరుడు మనీశ్.. ఐఆర్‌ఎస్ అధికారి. కొచ్చిలోని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగంలో అడిషనల్ కమిషనర్ ఉద్యోగం చేస్తున్నాడు. లివింగ్ రూములో సీలింగ్ హుక్‌కు ఉరివేసుకుని మనీశ్ చనిపోయాడు. మరో గదిలో శాలిని నిర్జీవంగా కనిపించారు. వీరి తల్లి శకుంతల మృతదేహం తెల్లని వస్త్రంలో చుట్టివుందని, పూలు చల్లిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
మనీశ్ డైరీలో చెల్లెలి ఫోన్ నంబర్
మనీశ్, శాలిని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శకుంతల మరణానికి గల కారణాలు అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే వెల్లడవుతాయని చెప్పారు. ‘శకుంతల మరణం సహజమా, మరేదైనా కారణాలు ఉన్నాయనేది అటాప్సీ నివేదిక వచ్చిన తర్వాతే తెలిసే అవకాశం ఉంద’ని త్రిక్కకరా ఏసీపీ పీవీ బేబీ తెలిపారు. మనీశ్ డైరీలో ఫిబ్రవరి 15న రాసిన నోట్‌ను పోలీసులు గుర్తించారు. తమకు సంబంధించిన కొన్ని పత్రాలను దుబాయ్‌లో (Dubai) ఉంటున్న తన చెల్లెలికి అప్పగించాలని కోరుతూ, ఆమె ఫోన్ నంబరు కూడా అందులో రాశారు.
టాపర్‌గా నిలిచి.. కేసులో ఇరుక్కుని..
శాలిని.. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) 2003లో నిర్వహించిన మొదటి సివిల్ సర్వీసెస్ కంబైన్డ్ పోటీ పరీక్షలో టాపర్‌గా నిలిచారు. ఈ పరీక్ష ద్వారా 64 మంది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో 2022, జూలైలో జార్ఖండ్ హైకోర్టు విచారణను సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ.. శాలినితో పాటు మిగతా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27న జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో శాలిని మరణించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రొఫెసర్ శకుంతల
శకుంతల బొకారో (Bokaro) ప్రాంతానికి చెందిన వారని, వీరి కుటుంబం రాంచీలో 2013 వరకు అద్దె ఇంటిలో ఉందని తెలిసింది. శకుంతల కుటుంబ సభ్యులు భక్తిభావంతో మెలిగేవారని, తమతో స్నేహంగా ఉండేవారని పొరుగింటివారు వెల్లడించారు. బొకారోలో శకుంతల ప్రొఫెసర్‌గా పనిచేసేవారని తెలిపారు. ఆమె మరో కుమార్తె పెళ్లిచేసుకుని రాజస్థాన్‌లో స్థిరపడిందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం రాంచీ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసులో కలిసినప్పుడు మనీశ్ అప్యాయంగా పలకరించాడని.. అతడితో పాటు శాలిని, శకుంతల మరణించారన్న వార్త తెలిసి చాలా బాధపడ్డామన్నారు. కాగా వీరి ముగ్గురి మరణానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
చదవండి: వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయం
అన్నికోణాల్లోనూ దర్యాప్తు
శాలినిపై సీబీఐ కేసు కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శకుంతల సహజంగా చనిపోయివుంటే ఆమె మరణాన్ని తట్టుకోలేక కూతురు, కొడుకు ప్రాణాలు తీసుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వీరి మానసిక పరిస్థితి గురించి కూడా ఆరా తీస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment