
ఆదర్శ్‌కుమార్ గోయల్
న్యూఢిల్లీ: జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, వ్యవహారాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. చైర్మన్ పదవిలో గోయల్ ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గోయల్ పదవీవిరమణ చేయగానే ఆయన్ను ప్రభుత్వం ఎన్జీటీ చైర్మన్‌గా నియమించింది. ట్రిపుల్ తలాక్, జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) ఏర్పాటు సహా పలు కేసుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గోయల్ చరిత్రాత్మక తీర్పులిచ్చారు. గతేడాది డిసెంబర్‌లో జస్టిస్ స్వతంతర్ కుమార్ పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం ఎన్జీటీకి పూర్తిస్థాయి చైర్మన్‌ను నియమించలేదు. పర్యావరణంతో పాటు అడవులు, సహజవనరుల పరిరక్షణకు జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం ద్వారా 2010, అక్టోబర్ 18న ఎన్జీటీని ఏర్పాటుచేశారు. ఎన్జీటీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.
మదిలో ఎమర్జెన్సీ కదలాడింది!
పదవీవిరమణ అనంతరం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన వీడ్కోలు సభలో జస్టిస్ గోయల్ మాట్లాడుతూ..‘ఎమర్జెన్సీ సందర్భంగా ప్రాథమిక హక్కుల్ని రద్దుచేశారు. దీంతో పోలీసులు, అధికారులకు ఎలాంటి సమీక్ష లేకుండా అపరిమిత అధికారాలు లభించాయి. కానీ అలాంటి వాతావరణంలో కూడా కోర్టులు ప్రజలకు న్యాయం అందించేందుకు కట్టుబడ్డాయి. ఎమర్జెన్సీ కారణంగానే ఓ అమాయకుడ్ని అరెస్ట్ చేసిన సందర్భాల్లో కోర్టులు వెంటనే బాధితులకు బెయిల్‌ను మంజూరు చేశాయి. ఎస్సీ,ఎస్టీ చట్టం దుర్వినియోగం కేసులో తీర్పు రాసేటప్పుడు ఇవన్నీ నా మదిలో కదలాడాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.