National Green Tribunal
-
బాబు ఉచిత ఇసుక విధానం.. పేదల కోసం కాదు.. పెద్దల కోసం
సాక్షి, అమరావతి : పేదలు ఇళ్లు కట్టుకోవడానికి దోహదపడాల్సిన ఉచిత ఇసుక విధానం ద్వారా స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడిందని శ్రావణ్‌కుమార్ అనే న్యాయవాది తమ దృష్టికి తెచ్చిన అంశాలను జాతీయ హరిత ట్రిబ్యునల్ 2019, ఏప్రిల్ 4న ఇచ్చిన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించింది. ప్రజల ఆస్తి అయిన సహజ వనరులను ధర్మకర్తలా పరిరక్షించాల్సిన ప్రభుత్వం.. పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కుతూ పూడికతీత, డ్రెడ్జింగ్ పేరుతో ఇసుకను పెద్దల ముఠా దోచుకుంటుంటే ప్రేక్షకపాత్ర వహించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. సహజ వనరులపై ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయనే అంశాన్ని గుర్తుచేసింది. ప్రజలకు సమాన హక్కులు ఉన్న సహజ వనరులను కొందరు పెద్దల ముఠాకే దోచిపెట్టడం సమానత్వం సిద్ధాంతాన్ని అవహేళన చేయడమేనని స్పష్టంచేసింది. ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తవ్వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్రంగా నష్టం చేస్తుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని అప్పట్లో ఎన్జీటీ ఘాటుగా స్పందించింది. అడ్డగోలుగా ఇసుకను తవ్వేయడం ద్వారా పర్యావరణం దెబ్బతిన్నదని.. దానివల్ల ప్రజారోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. ప్రజల హక్కులను ఇసుక స్మగ్లర్లు కాలరాస్తుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడంలో ఆంతర్యమేమిటని నాటి టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని 2019, ఏప్రిల్ 4న అల్టిమేటం జారీచేసింది. మహిళా సంఘాల ముసుగులో దోపిడీ.. నిజానికి.. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ఇసుక రీచ్‌ల నిర్వహణ, అమ్మకాలను స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు అప్పగిస్తూ తొలుత ప్రకటించింది. మహిళా సంఘాల ముసుగులో ముఖ్యనేత దన్నుతో టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక రీచ్‌లను హస్తగతం చేసుకుని.. అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి, అధిక ధరలకు విక్రయిస్తూ దోచుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో 2016, మార్చి 4న ఆ విధానాన్ని రద్దుచేసి.. ఉచిత ఇసుక ముసుగులో తమ ముఠా దోపిడీకి అప్పటి సీఎం చంద్రబాబు రాచబాట వేశారు. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ జారీచేసిన మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ.. చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో ప్రకాశం బ్యారేజ్ జలవిస్తరణ ప్రాంతంలో కృష్ణా నదీ గర్భంలో భారీ పొక్లెయిన్లు, మర పడవలు ఏర్పాటుచేశారు. తద్వారా ఇసుకను తవ్వేసి, అధిక ధరలకు మార్కెట్లో విక్రయించిన ముఠా పెద్దఎత్తున అక్రమార్జన సాగించింది. దీనిపై 2016లోనే రైతులు ఎన్జీటీని ఆశ్రయించారు. పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగిస్తున్న ఇసుక తవ్వకాలను నిలిపివేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై విచారించిన ఎన్జీటీ.. 2017, ఫిబ్రవరి 23న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు.. అయినా.. నాటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించారు. ఇసుక అక్రమ తవ్వకాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఎన్జీటీ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ 2019 జనవరి 17–18న చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వుతుండటాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. 2019, జనవరి 21న ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని టీడీపీ సర్కార్‌కు అల్టిమేటం జారీచేసింది. ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వంద కోట్ల జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలుచేసి చెల్లించాలని స్పష్టంచేసింది. ‘‘సహజ వనరులు ప్రజల ఆస్తులు. ప్రభుత్వం ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా వ్యవహరించాలి. నియంత్రణ లేకుండా ఇసుకను తవ్వి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం అవివేకమైన చర్య. ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేయడంవల్ల పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగింది. ఇలా పర్యావరణానికి విఘాతం కలిగించిన వారి నుంచి పరిహారాన్ని వసూలుచేసి.. దానితో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందుబాటులో ఉండేలా చేయడం ప్రభుత్వం బాధ్యత’’. – 2019, ఏప్రిల్ 4న ఇచ్చిన తీర్పులో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చేసిన వ్యాఖ్య. -
రూ. పది కోట్లు డిపాజిట్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ విధించిన జరిమానాలో రూ.పది కోట్లు కట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులు చేపడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రమౌళీశ్వరరెడ్డి వేర్వే రుగా దాఖలు చేసిన పిటిషన్లను ఎన్జీటీ చెన్నై బెంచ్ గతంలో విచారించిన సంగతి తెలిసిందే. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రూ.528 కోట్లు, డిండి ఎత్తిపోతలపై రూ.92.85 కోట్లు, తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు అదనంగా రూ.300 కోట్లు మొత్తంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.920.85 కోట్ల జరిమానా విధించిన విషయం విదితమే. ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. కోర్టు వ్యాఖ్యలు చేసే వరకు వేచి చూడొద్దు మొత్తం జరిమానా ఎంతంటూ ధర్మాసనం ప్రశ్నించగా డిండి ప్రాజెక్టు విషయంలో రూ.92 కోట్ల జరిమానా విధించారని న్యాయవాదులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి ఎవరు పరిష్కరించాలి? కేంద్ర ప్రభుత్వమా? లేక కోర్టు చొరవ తీసుకోవాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం నుంచి తగిన మార్గదర్శకాలు తీసుకుంటానని న్యాయవాది తెలుపగా మార్గదర్శకాలు త్వరగా తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యలు చేసే వరకు వేచి చూడొద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. పాలమూరు–రంగారెడ్డి విషయంలో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని, ప్రస్తుత డిండి కేసుతో సంబంధం లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. చివరగా... ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం డిండి ప్రాజెక్టుకు విధించిన రూ 92 కోట్ల జరిమానాలో రూ.పది కోట్లను కేఆర్ఎంబీ ఎదుట మూడు వారాల్లో డిపాజిట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మిగిలిన జరిమానా విషయంలో ప్రభుత్వంపై బలవంతపు చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలపై అభ్యంతరం ఉంటే నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పనులు కొనసాగించుకోవచ్చు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తాగు నీటి అవసరాలకు సంబంధించి 75 టీఎంసీల మేర పనులు కొనసాగించుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఎనీ్టటీ విధించిన రూ.528కోట్ల జరిమానాలపై స్టే ఇస్తూ ఫిబ్రవరి 17న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. రెండు పిటిషన్లలోనూ కౌంటర్ దాఖలు చేయా లని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. -
గౌరవెల్లిని ఆపేయండి
సాక్షి, హైదరాబాద్: గౌరవెల్లి రిజర్వాయర్ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని, ఒక వేళ పనులు పూర్తయితే నీటిని నిల్వ చేయొద్దని తెలంగాణ రాష్ట్రాన్ని గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) ఆదేశించింది. ఇప్పటికే నీటిని నిల్వ చేసి ఉంటే కాల్వలకు విడుదల చేయొద్దని కోరింది. ఈ మేరకు గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి ఆర్.అఝగేషన్ శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. పర్యావరణ అనుమతి తీసుకోకుండా గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టడాన్ని సవాలు చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో దాఖలైన కేసులో గోదావరి బోర్డు ప్రతివాదిగా ఉంది. ఎన్జీటీ ఆదేశాల మేరకు గౌరవెల్లి రిజర్వాయర్ పనులపై యథాస్థితిని కొనసాగించాలని, కొత్త పనులు చేపట్టరాదని తాజాగా గోదావరి బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘‘ఆ క్లాజుల ప్రకారం నడుచుకోవాలి’’ గోదావరి బోర్డు అధికార పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని క్లాజులు 1(డీ)(3), 2(ఎఫ్), 2(జీ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని స్పష్టం చేసింది. క్లాజు 1(డీ) ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టులకు గోదావరి బోర్డు, అపెక్స్ కౌన్సిల్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ)ల నుంచి అనుమతులు పొందే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, ఇతర మార్పులు, రెగ్యులేటర్లు, అప్రోచ్ చానల్, సొరంగం పనులు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పనులు చేపట్టాలన్నా గోదావరి బోర్డు, టీఏసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తప్పనిసరి అని గుర్తు చేసింది. క్లాజు 2(ఎఫ్) ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టుల పనులు నిలుపుదల చేసి, గెజిట్ విడుదలైన ఆరు నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. క్లాజు 2(జీ) ప్రకారం అనుమతి రాని ప్రాజెక్టులను వినియోగించుకోకుండా పక్కనబెట్టాల్సి ఉంటుందని తెలిపింది. రాష్ట్రం వచ్చాక పెరిగిన గౌరవెల్లి సామర్థ్యం ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ వరద కాల్వ ప్రాజెక్టులో భాగంగా 1.04 టీఎంసీల సామ ర్థ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్‌ను నిర్మించారు. తెలంగాణ వచ్చాక ప్రాజెక్టుల రీడి జైనింగ్‌లో భాగంగా గౌరవెల్లి సామ ర్థ్యాన్ని 8.5 టీఎంసీలకు పెంచాలని నిర్ణ యం తీ సుకున్నారు. ఇందుకోసం 1960 ఎక రాలను సేకరించారు. రిజర్వాయర్ పనులు పూర్తి కాగా, 1.02 టీఎంసీలను నింపారు. రిజ ర్వాయర్ సామర్థ్యం 8.5 టీఎంసీలకు పెరి గినా ప్రధాన కాల్వ సామర్థ్యం 1.04 టీ ఎంసీలే ఉంది. పర్యావరణ అనుమతులు లే కుండా ప్రాజెక్టు పనులు చేపట్టారని గ్రా మ స్తులు కొందరు కేసు వేయగా, ఎన్జీటీ గతంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Sitamma Sagar: కేసీఆర్ సర్కార్‌కు షాక్
సాక్షి, ఢిల్లీ/భద్రాద్రి: తెలంగాణ సర్కార్‌కు ఎన్జీటీ నుంచి మరో ఝలక్ తగిలింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించతలబెట్టిన సీతమ్మ సాగర్ బ్యారేజ్ ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బ్రేకులు వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టు పనుల్ని వెంటనే నిలిపివేయాలని, అనుమతులు తీసుకోవాల్సిందేనంటూ ఎన్జీటీ చెన్నై బెంచ్ తీర్పు ఇచ్చింది ట్రిబ్యునల్. గోదావరి నీటి నిల్వతో పాటు జల విద్యుదుత్పత్తికి ఉపయోగపడేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద కేసీఆర్ సర్కార్.. ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టింటి. దుమ్ముగూడెం ఆనకట్టకు ఎగువన భద్రాచలం సీతమ్మ వారి పర్ణశాలకు దగ్గరగా బ్యారేజీ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో.. సీతమ్మ సాగర్‌గా నామకరణం చేసింది. 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అయితే.. ఒకవైపు బ్యారేజీ నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతుండగా.. పర్యావరణ అనుమతులు వచ్చాకే ప్రాజెక్టు పనులు కొనసాగించాలని ఇప్పుడు ఎన్జీటీ ఆదేశించడం గమనార్హం. ఈ మేరకు తదుపరి విచారణను ఏప్రిల్ 26వ తేదీకి వాయిదా వేసింది. ఇదీ చదవండి: మా మెట్రో ఏం పాపం చేసింది? -
తెలంగాణ సర్కార్‌కు ఎన్జీటీ షాక్!
సాక్షి, అమరావతి: పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలుపుదల చేయాలని 2021, అక్టోబర్ 29న జారీచేసిన ఆదేశాలను ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించిన తెలంగాణ సర్కార్‌పై గురువారం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. యథేచ్ఛగా పనులు చేయడంవల్ల పర్యావరణానికి అపారనష్టం వాటిల్లిందని తేల్చింది. దీంతో ఈ రెండు ఎత్తిపోతల పథకాల వ్యయంలో 1.5 శాతం చొప్పున మొత్తం రూ.620.85 కోట్లను జరిమానాగా తెలంగాణ సర్కార్‌కు విధించింది. అంతేకాక.. చట్టాలను అమలుచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా వాటిని ఉల్లంఘిస్తున్నందున అదనంగా మరో రూ.300 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. ఇలా మొత్తం రూ.920.85 కోట్లను మూణ్నెళ్లలోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వద్ద డిపాజిట్ చేయాలని స్పష్టంచేసింది. తెలంగాణ సర్కార్ జరిమానాగా చెల్లించే రూ.920.85 కోట్లతో నమామి గంగే ప్రాజెక్టు తరహాలో కృష్ణా నదీ పరిరక్షణ చర్యలు చేపట్టాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. అలాగే, పర్యావరణ అనుమతి తీసుకునే వరకూ పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను కొనసాగించకూడదని తెలంగాణ సర్కార్ తేల్చిచెప్పింది. ఆ రెండు ఎత్తిపోతల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లను కృష్ణా బోర్డుకు పంపి, సీడబ్ల్యూసీ నుంచి అనుమతి తీసుకుని, అపెక్స్ కౌన్సిల్ మంజూరు చేశాకే వాటి పనులు చేపట్టాలని స్పష్టంచేసింది. ఈ మేరకు గురువారం ఎన్జీటీ తుది తీర్పు ఇచ్చింది. వివాదం నేపథ్యం ఇదీ.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు తరలించేలా రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు–రంగారెడ్డి.. రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్ల వ్యయంతో 2015, జూన్ 10న తెలంగాణ సర్కార్ చేపట్టింది. పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన ఈ రెండు ఎత్తిపోతలవల్ల పర్యావరణం దెబ్బతింటోందని, ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన జలాలు దక్కవని.. దీనివల్ల ఆయకట్టులో పర్యావరణం దెబ్బతింటుందని ఏపీకి చెందిన రైతులు 2021లో ఎన్జీటీ (చెన్నె బెంచ్)ను ఆశ్రయించారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులతో జతకలిసింది. కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2060 (పునరుత్పత్తి జలాలతో కలిపి 2130) టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. ఉమ్మడి రాష్ట్రానికి 800 టీఎంసీలు (పునరుత్పత్తితో కలిపి 811) టీఎంసీలు కేటాయించిందని ఎన్జీటికి ఏపీ ప్రభుత్వం వివరించింది. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు నీటి కేటాయింపుల్లేవని.. వాటి ద్వారా 120 టీఎంసీలను తెలంగాణ సర్కార్ తరలిస్తే.. శ్రీశైలం, సాగర్‌పై ఆధారపడ్డ ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టా కూడా నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతుందని, ఇది పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుందని వాదించింది. దీనితో ఏకీభవించిన ఎన్జీటీ.. తక్షణమే పనులు నిలుపుదల చేయాలని 2021, అక్టోబర్ 29న తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. ఎన్జీటీ ఉత్తర్వులు తెలంగాణ బేఖాతరు కానీ, ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించి పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను తెలంగాణ సర్కార్ కొనసాగించింది. దాదాపు 90 శాతం పనులు పూర్తిచేసింది. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతులు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిజానిజాలను నిర్ధారించడానికి కృష్ణా బోర్డు నేతృత్వంలో కమిటీని ఎన్జీటీ నియమించింది. క్షేత్రస్థాయిలో ఆ రెండు ఎత్తిపోతల పథకాలను పరిశీలించిన కమిటీ.. ఎన్జీటీ ఉత్తర్వులను తెలంగాణ సర్కార్ ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించినట్లు తేల్చింది. ఆ మేరకు ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, రైతులు, కేంద్ర ప్రభుత్వం, కృష్ణా బోర్డు వాదనలను విన్న జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగస్టు 17న తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఆ తీర్పును గురువారం వెల్లడించింది. -
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టారని రూ.900 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. మూడు నెలల్లో చెల్లించాలని చెన్నై ఎన్జీటీ ధర్మాసనం ఆదేశించింది. మొత్తం ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో 1.5 శాతం జరిమానా విధించింది. జరిమానాను కేఆర్ఎంబీ వద్ద జమ చేయాలని ఎన్జీటీ పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన తెలిసిందే. చదవండి: కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ -
షాకింగ్.. హైదరాబాద్ పరిధిలో 134 జలాశయాలు కబ్జా
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో స్వచ్ఛమైన వర్షపు నీటితో కళకళలాడాల్సిన చెరువులు కబ్జాల చెరలో చిక్కిశల్యమవుతున్నాయి. ఒకవైపు మురుగు ముప్పు.. మరోవైపు ఆక్రమణలు ఆయా జలాశయాల ఉసురు తీస్తున్నాయి. మహానగరం పరిధిలో మొత్తంగా 185 చెరువులుండగా వీటిలో ఇప్పటివరకు 134 చెరువులు కబ్జాలకు గురైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు నివేదించడం గమనార్హం. ఇందులో పలు జలాశయాల ఫుల్ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లలో ఆక్రమణలు అధికంగా ఉన్నట్లు ఈ నివేదికలో తెలిపింది. మొత్తంగా 134 జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో 8,718 .. బఫర్‌జోన్‌లో 5,343 అక్రమ నిర్మాణాలున్నట్లు పేర్కొంది. సదరు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం నివేదికలో స్పష్టంచేసింది. 51 చెరువులకు ఊరట.. మహానగరం పరిధిలో కేవలం 51 చెరువులు మాత్రమే కబ్జాలకు గురికాకుండా ఉన్నాయని ప్రభుత్వం నివేదికలో తెలిపింది. ఇక 30 చెరువులు 85 శాతం ఆక్రమణకు గురైనట్లు తేల్చింది. మరో 104 జలాశయాలు 15 శాతం కబ్జాకు గురైనట్లు నివేదికలో పేర్కొంది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 185 జలాశయాలకు సంబంధించి ఎఫ్టీఎల్ హద్దులను సిద్ధం చేసి హెచ్ఎండీఏ పరిధిలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి సమర్పించినట్లు తెలిపింది. ఇప్పటికే 157 చెరువుల ఎఫ్టీఎల్ బౌండరీలకు సంబంధించి తుది నోటిఫికేషన్ హెచ్ఎండీఏ వెబ్సైట్లో ప్రదర్శిస్తున్నామని పేర్కొంది. నూతనంగా ఆయా జలాశయాల్లో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే రెవెన్యూ, జీహెచ్ఎంసీ విభాగాల సహకారంతో సంబంధిత వ్యక్తులపై ఇరిగేషన్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని వివరించింది. న్యాయపరమైన చిక్కులతో సాగని పనులు.. నగరంలో పలు చెరువుల్లో ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఇరిగేషన్ శాఖ ఆయా జలాశయాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సాధ్యపడడం లేదని నివేదికలో తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేని చోట ఆక్రమణలను తొలగించి ఎఫ్టీఎల్ బౌండరీల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేశామని పేర్కొంది. నగరంలో 63 జలాశయాల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటుకు ఇప్పటివరకు జీహెచ్ఎంసీ రూ.94 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపింది. లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటుతోపాటు ఆయా జలాశయాల చుట్టూ సీసీటీవీలను ఏర్పాటు చేసి అక్రమార్కులపై నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. -
ఎన్జీటీ పెనాల్టీ నుంచి ఏపీకి మినహాయింపు
సాక్షి, విజయవాడ: ఎన్జీటీ పెనాల్టీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మినహాయింపు లభించింది. జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుతో మినహాయింపు దక్కింది. 5 రాష్ట్రాలకు వేల కోట్ల పెనాల్టీ వేసిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్.. ఏపీలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ వల్ల పెనాల్టీ విధించలేదు. జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ఎన్జీటీ సంతృప్తి చెందింది. తెలంగాణకు 3,800 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కి 3 వేల కోట్లు, మహారాష్ట్రకు 12 వేల కోట్లు, రాజస్థాన్‌కి 3 వేల కోట్లు, కర్ణాటకకు 2, 900 కోట్లు ఎన్జీటీ పెనాల్టీ విధించింది. చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? -
Diwali 2022: పండుగ పచ్చగా.. గ్రీన్ క్రాకర్స్‌కు పెరిగిన ఆదరణ
దీపావళి వచ్చేసింది. అమావాస్య చీకటి రోజున దివ్వెల కాంతులతో పాటు కాకరపువ్వొత్తుల చిటపటలు, మతాబుల వెలుగులు, చిచ్చుబుడ్ల మెరుపులు, లక్ష్మీబాంబుల మోతలు లేకుండా పండుగకి కళే రాదు. మరి ఈ బాణాసంచాతో పర్యావరణం, వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బ తింటోంది. అందుకే ఇప్పుడు అందరూ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ పండగ సరదా తీర్చుకోవాలంటే గ్రీన్ క్రాకర్స్ మార్గం కావడంతో వాటికి ఆదరణ పెరుగుతోంది. ఏమిటీ గ్రీన్ క్రాకర్స్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)–నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) ప్రకారం తక్కువ షెల్ సైజుతో, రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ, బూడిద వాడకుండా తయారు చేసే బాణసంచాను గ్రీన్ క్రాకర్స్‌గా పిలుస్తున్నారు. మామూలుగా వాడే హానికరమైన సల్ఫర్ నైట్రేట్స్, సోడియం, లెడ్, మెగ్నీషియం, బేరియం, అత్యంత హానికరమైన బ్లాక్ పౌడర్‌ను వీటిలో వాడరు. అందుకే వీటితో కాలుష్యం 30% తక్కువగా ఉంటుంది. శబ్ద కాలుష్యమూ తక్కువే. సాధారణ బాణసంచా 160 డెసిబుల్ శబ్దంతో పేలితే ఇవి 110 డెసిబుల్ శబ్దం చేస్తాయి. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్‌కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతినిచ్చింది. గ్రీన్ క్రాకర్స్‌ని గుర్తించడం ఎలా ? ఎన్ఈఈఆర్ఐ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో ప్రఖ్యాత బాణాసంచా కేంద్రమైన శివకాశీలోనే తయారు చేస్తున్నారు. వీటిని గుర్తించడానికి వీలుగా సీఎస్ఐఆర్–ఎన్ఈఈఆర్ఐ ఆకుపచ్చ రంగు లోగోను బాణాసంచా బాక్సులపై ముద్రిస్తున్నారు. క్యూఆర్ కోడ్ కూడా ఈ బాక్సులపై ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్ మూడు రకాలున్నాయి. స్వాస్: వీటిని కాల్చినప్పుడు నీటి ఆవిరి కూడా విడుదలై గాల్లో ధూళిని తగ్గిస్తుంది. గాలిలో సూక్ష్మ ధూళికణాలు 30% తగ్గుతాయి స్టార్: వీటిలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వాడరు వాయు కాలుష్యానికి కారణమైన పర్టిక్యులర్ మేటర్ (పీఎం)ని తగ్గించడంతో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా నివారిస్తాయి సఫల్: ఈ రకమైన గ్రీన్ క్రాకర్స్‌లో మెగ్నీషియమ్కు బదులుగా అల్యూమినియమ్ తక్కువ మోతాదులో వాడతారు.సంప్రదాయ బాణాసంచాతో పోలిస్తే శబ్ద కాలుష్యం తక్కువ. కేంద్రం లైసెన్స్ ఇచ్చిన కేంద్రాల్లోనే గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాదే ఆదరణ ఎందుకు ? పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పుని గుర్తించిన సుప్రీం కోర్టు బాణాసంచాను నిషేధిస్తూ అక్టోబర్ 23, 2018 దీపావళికి ముందు సంప్రదాయ బాణాసంచాపై నిషేధం విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. గ్రీన్ క్రాకర్స్‌కి మాత్రమే అనుమతినిచ్చింది. 2019లో దీపావళి సమయంలో గ్రీన్ క్రాకర్స్‌పై గందరగోళంతో బాణాసంచా పరిశ్రమ భారీగా నష్టపోయింది. వేటిని గ్రీన్ అనాలో వేటి కాదో తెలీక, తయారీదారులకే వీటిపై అవగాహన లేకపోవడంతో ఆ ఏడాది దీపావళి పండగ కళ తప్పింది. ఆ తర్వాత వరసగా రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం పండగపై పడింది. 2021లో సుప్రీం కోర్టు ఆకుపచ్చ రంగుని వెదజల్లే బేరియమ్ను వాడే టపాసులకి అనుమతి లేదని మరోసారి స్పష్టం చేసింది. సుప్రీం తీర్పు వచ్చి నాలుగేళ్లు కావడంతో ఇప్పుడు వీటిపై అందరికీ అవగాహన పెరుగుతోంది. అయినప్పటికీ బాణాసంచా ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 50% తగ్గిపోయిందని శివకాశీలో తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏయే రాష్ట్రాల్లో ఎలా? కాలుష్యంతో సతమతమయ్యే ఢిల్లీలో జనవరి 1 దాకా అన్ని రకాల బాణసంచాపై నిషేధముంది. కొన్ని రాష్ట్రాలు గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతినిచ్చాయి. పశ్చిమ బెంగాల్లో దీపావళి రోజు మాత్రం క్రాకర్స్‌ను కాల్చుకోవచ్చు. పంజాబ్ రాత్రి 8 నుంచి 10 వరకే గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతించింది. హరియాణా కూడా గ్రీన్ క్రాకర్స్‌కే అనుమతినిచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెంగాల్ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్.. రూ.3,500 కోట్లు జరిమానా
కోల్‌కతా: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) గట్టి షాకిచ్చింది. రాష్ట్రంలో ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో నిబంధనలు పాటించటం లేదని రూ.3500 కోట్లు జరిమానా విధించింది. 2022-2023 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాలకు సంబంధించి 12,819కోట్లు రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది. అయితే.. పారిశుద్ధ్య నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు మమతా బెనర్జీ సర్కారు ప్రాధాన్యమివ్వలేదని ఎన్జీటీ అసహనం వ్యక్తం చేసింది. ‘ప్రజలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించడం స్థానిక సంస్థలు, రాష్ట్రాల బాధ్యత. నిధుల కొరత ఉందని ప్రజలకు జీవించే హక్కును తిరస్కరించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల కోసం వేచి చూస్తూ రాష్ట్రాలు తమ బాధ్యతలు నిర్వర్తించటంలో ఆలస్యం చేయకూడదు. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే. రెండు నెలల్లోపు రూ.3500కోట్లను బెంగాల్ ప్రభుత్వం జమ చేయాలి‘ అని ఎన్జీటీ ఛైర్పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెత్త నిర్వహణపై ఇకనైనా బెంగాల్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని, ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రాష్ట్రంలో రోజుకు 2,758 మిలియన్ల లీటర్ల మురుగు నీరు పోగవుతోందని, అయితే.. 44 ఎస్టీపీల ఏర్పాటుతో కేవలం 1,268 ఎంఎల్డీలు మాత్రమే శుభ్రం చేస్తున్నారని పేర్కొంది. రెండింటి మధ్య అంతరం భారీగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ‘ప్రపంచం నుంచే కమ్యూనిస్టులు కనుమరుగు.. భవిష్యత్తు బీజేపీదే’.. అమిత్ షా ఆరోపణలు -
ఓఎన్జీసీకి ఎన్జీటీ భారీ జరిమానా
అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్(ఓఎన్జీసీ)కి భారీ జరిమానా విధించింది జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ). కోనసీమ జిల్లాలో జల, భూ కాలుష్యానికి కారణమైనందున రూ.22.76 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఓఎన్జీసీపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. సీఎస్ఆర్ ఫండ్స్‌ను ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. సంయుక్త కమిటీ నివేదిక ఆధారంగా ఓఎన్జీసీకి భారీ జరిమానా విధించినట్లు తెలిపింది. యెనుమల వెంకటపతి రాజు పిటిషన్‌పై విచారణ చేపట్టిన హరిత ట్రైబ్యునల్- (ఎన్జీటీ) తీర్పు వెలువరించింది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై ఈ జరిమానా విధించింది. ఇదీ చదవండి: ‘విద్యారంగంలో దేశంలోనే ఎవరు చేపట్టనన్ని సంస్కరణలు తెచ్చాం’ -
ఎన్జీటీ ఉన్నది సామాన్యుల కోసం
సాక్షి, న్యూఢిల్లీ: ‘జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఉన్నది న్యాయస్థానాన్ని ఆశ్రయించలేని సామాన్యుల కోసం. చట్టసభ సభ్యులకు కాదు’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టసభ సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేల లేఖలు కూడా ఎన్జీటీ విచారణకు స్వీకరిస్తోందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎన్జీటీ ప్రొసీడింగ్స్ ప్రారంభించడంపై అసహనం వ్యక్తం చేసింది. విశాఖలోని రిషికొండ నిర్మాణాలపై ఎన్జీటీ ఇచ్చిన స్టే ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ కమిటీ, కోస్టల్ జోన్ అథారిటీ, అటవీ శాఖ అనుమతులు వచ్చిన తర్వాతే రిషికొండపై నిర్మాణాలు ప్రారంభించామన్నారు. ప్రతివాది రాసిన లేఖపై ఎన్జీటీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎలాంటి ఉల్లంఘనలు చేయలేదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ దాన్ని ఎన్జీటీ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పర్యావరణ అనుమతులు సరైనవా కాదా అనేది పరిశీలించడానికి మరో కమిటీని నియమించిందన్నారు. ఆ తర్వాత కూడా ఏపీ ప్రభుత్వ వాదనలు వినకుండానే నిర్మాణాలపై ఎన్జీటీ ఏకపక్షంగా స్టే విధించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయని, స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందని తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ప్రతులు అందలేదని, అధ్యయనం చేయడానికి సమయం కావాలని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది కోరడంతో బుధవారం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. రిషికొండ నిర్మాణాలపై హైకోర్టులో తదుపరి విచారణ ఎప్పుడో చెప్పాలని ఏపీ తరఫు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. -
Telangana: రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఝలక్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ/మీర్జాగూడలో హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల క్యాచ్మెంట్ ఏరియాల్లో జీవో 111 రూల్స్‌ను ఉల్లంఘించి ఐటీ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌లో దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని హైకోర్టు తేల్చింది. అర్హత లేని పిటిషన్లో సంయుక్త కమిటీ దర్యాప్తునకు ఆదేశించడం సరికాదని స్పష్టం చేసింది. రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను, ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కేటీఆర్, ఫామ్‌హౌస్ యజమాని ప్రదీప్‌రెడ్డి విడివిడిగా వేసిన రిట్లను అనుమతిస్తూ జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావ్‌ల డివిజన్ బెంచ్ బుధవారం తీర్పు చెప్పింది. ఎన్జీటీ రూల్స్ ప్రకారం నిర్మాణం జరిగిన ఆరు నెలల్లోగా ఎవరైనా ఫిర్యాదు చేయాలని, అయితే ఏనాడో నిర్మాణం జరిగిన దానిపై రేవంత్ పిటిషన్ వేస్తే దానిని ఎన్జీటీ విచారించే అర్హత లేదని చెప్పింది. పైగా, కేటీఆర్ ఆ నిర్మాణం చేయలేదని, ఆ భూమికి యజమాని కూడా కాదని చెబుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తేల్చింది. ‘కేటీఆర్‌కు నోటీసు కూడా జారీ చేయకుండా నేరుగా ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేయడం సబబు కాదు. నోటీసు ఇవ్వకుండా సంయుక్త కమిటీ ఏర్పాటు చెల్లదు. ఫాం హౌస్ ఓనర్ ప్రదీప్‌రెడ్డిని ప్రతివాదిగా చేయకుండా రేవంత్ ఎన్జీటీలో పిటిషన్ వేసి ఉత్తర్వులు పొందడం చెల్లదు’అని పేర్కొంటూ.. ఎన్జీటీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలేగానీ హైకోర్టు జోక్యం చేసుకోడానికి వీల్లేదన్న రేవంత్ వాదనను తిరస్కరించింది. ఎన్జీటీ ఉత్తర్వులపై జోక్యం చేసుకునే పరిధి హైకోర్టులకు కూడా ఉంది. ఇద్దరి పిటిషన్లను అనుమతిస్తున్నాం.. అని తీర్పులో పేర్కొంది. -
ఆ ఫాంహౌస్ కేటీఆర్‌ది కాదు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలోని ఫాంహౌస్ మంత్రి కె.తారకరామారావుది కాదని, అయినా ఆయనే యజ మాని అంటూ తప్పుడు సమాచారంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలు చేశారని కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి హైకోర్టులో నివేదించారు. జీవో 111 పరిధిలోని జన్వాడ ఫాంహౌస్‌లో అక్రమనిర్మాణాలు చేపట్టారంటూ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలంటూ కేటీఆర్, ఫాంహౌస్ యజమాని ప్రదీప్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. ఏవైనా నిర్మాణాలు చేపట్టినా 8 నెలల్లోగా ఎన్జీటీకి ఫిర్యాదు చేయాల్సి ఉందని, దాదాపు ఆరేళ్ల తర్వాత రేవంత్‌రెడ్డి ఎన్జీటీని ఆశ్రయించారని, కాలాతీతమైన తర్వాత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే పరిధి ఎన్జీటీకి లేదన్నారు. ఫాంహౌస్ యజమాని ప్రదీప్‌రెడ్డిని ప్రతివాదిగా చేర్చకుండా ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపించారు. జలాశయాలను కాపాడేందుకే... హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల క్యాచ్మెంట్ ఏరియాలో నిర్మాణాలు చేపట్టకుండా జీవో 111 తీసుకొచ్చారని రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. 2020 ఫిబ్రవరిలో జన్వాడ ఫాంహౌస్‌లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా తెలిసిందని, పరిశీలించేందుకు అక్కడికి వెళ్తే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని తెలిపారు. జీవో 111 పరిధిలో అక్రమ నిర్మాణాలు జరగకుండా జలాశయాలను కాపాడేందుకే రేవంత్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారన్నారు. ఎన్జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. అయితే, ఎన్జీటీ ఉత్తర్వులపై రివ్యూ చేసే అధికారం ఈ కోర్టుకు ఉందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె.రాంచందర్‌రావు నివేదించారు. సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఇదిలా ఉండగా రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ జన్వాడ ఫాంహౌస్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయో లేదో పరిశీలించి నివేదిక సమర్పించేందుకు నిపుణులతో కమిటీ వేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఎన్జీటీ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. -
మైనింగ్ జోన్లో విరిగిపడ్డ కొండ చిరియలు.. 20 మంది కార్మికులు గల్లంతు!
చండీఘడ్: రాష్ట్రంలోని మైనింగ్ జోన్లో శనివారం కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 15 నుంచి 20 మంది ఘటనలో చిక్కుకున్నారు. తోషమ్ బ్లాక్‌లోని దాడం మైనింగ్ జోన్లో జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. హర్యానాలోని భివానీ జిల్లాలో ఉన్న మైనింగ్ ఏరియాలో వాహనాల్లో వేరే ప్రాంతాలకు వెళ్తున్న కార్మికులపై కొండచరియలు విరిగిపడటంతో, వాహనాల్లో కార్మికులందరూ చిక్కుకున్నట్లు సమాచారం. త్వరితగతిన రెస్క్యూ ఆపరేషన్లు, క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించడానికి జిల్లా యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ట్విటర్ వేదికగా తెలిపారు. సంఘటన స్థలాన్ని పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ హుటాహుటిన చేరుకున్నారు. ఇప్పటివరకు ముగ్గురుని రక్షించి ఆసుపత్రికి తరలించామని, ఇద్దరు మృతి చెందారని, ప్రమాదంలో చిక్కుకున్నవారిని ప్రాణాలతో కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి మీడియాకు తెలిపారు. కాగా దాడం మైనింగ్ ప్రాంతం, ఖనాక్ పహారీలో మైనింగ్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతుండేవి. ఐతే కాలుష్యం కారణంగా నేషనల్ గ్నీన్ ట్రిబ్యునల్ విధించిన రెండు నెలలు నిషేధాన్ని గురువారం ఎత్తివేయగా శుక్రవారం నుంచి మైనింగ్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. నిషేధం తర్వాత కేవలం ఒక్క రోజులోనే ఇంత పెద్ద ప్రమాదం జరడగంతో తాజా సంఘటన చర్చనీయాంశమైంది. చదవండి: ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’ -
ఏపీ సీఎస్‌పై కోర్టు ధిక్కారం అవసరం లేదు: ఎన్జీటీ తీర్పు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: పర్యావరణ అనుమతి తీసుకున్న తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దిశానిర్దేశం చేసింది. పర్యావరణ ప్రభావ మదింపు ప్రకటన (ఈఐఏ)–2006 ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను పరిశీలించి.. పర్యావరణ అనుమతి జారీచేసే ప్రక్రియను వేగంగా ముగించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఎన్జీటీ (చెన్నై బెంచ్) ఉత్తర్వులు జారీచేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రైతు, తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్లపై ఎన్జీటీ విచారించింది. డీపీఆర్ రూపకల్పన కోసం అవసరమైన పనులు మాత్రమే చేశామని ఏపీ సర్కార్ చేసిన వాదనతో ఏకీభవించింది. ఎత్తిపోతల పనులు చేపట్టినందుకుగానూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. డీపీఆర్ రూపకల్పన కోసం చేసిన పనులను మదింపు చేయడానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయం, సీడబ్ల్యూసీ అధికారి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కమిటీతో ఎత్తిపోతల పనులను మదింపు చేసి.. వాటివల్ల పర్యావరణానికి ఏమైనా విఘాతం కలిగిందా? లేదా? అనే కోణంలో అధ్యయనం చేసి, నాలుగు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. డీపీఆర్ రూపకల్పన కోసం మార్గదర్శకాలు రూపొందించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ సూచించిన మార్గదర్శకాలను ఈఐఏ–2006లో చేర్చి.. పర్యావరణ అనుమతివ్వాలని నిర్దేశించింది. నివేదిక, పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ డీపీఆర్‌కు సంబంధించిన పనులతో సహా ఎలాంటి పనులు చేపట్టరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. చదవండి: చురుగ్గా ‘వైద్య’ పోస్టుల భర్తీ -
‘భోగాపురం’ అనుమతులు సరైనవే
సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపనంత వరకు ఆ నిర్ణయంలో న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు జోక్యం చేసుకోలేవని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేసేందుకు నిరాకరించింది. అనుమతులు రద్దుకు సహేతుక కారణాలు లేవని స్పష్టంచేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణుల కమిటీ సిఫారసుల ఆధారంగానే కేంద్ర మంత్రిత్వ శాఖ అనుమతులిచ్చిందని తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నీటి వనరుల విషయంలో మాత్రమే తాము జోక్యం చేసుకుంటున్నామంది. తాము నిర్దేశించిన పరిమితికి మించి నీరు అవసరమైతే పర్యావరణ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకుని నిబంధనల్లో మార్పు కోరవచ్చని తెలిపింది. ఈ మేరకు ఎన్జీటీ చెన్నై బెంచ్ జుడిషియల్ సభ్యులు జస్టిస్ కె.రామకృష్ణన్, ఎక్స్పర్ట్ సభ్యుడు డాక్టర్ సత్యగోపాల్ కొర్లపాటితో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ విశాఖపట్నం రాంనగర్‌కు చెందిన దాట్ల శ్రీదేవీ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పునిచ్చింది. ప్రభుత్వం తరఫున సయ్యద్ నూరుల్లా షరీఫ్, దొంతిరెడ్డి మాధురీరెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. భోగాపురం విమానాశ్రయానికి ఎంత భూమి అవసరమన్న వివరాలను దాచిపెట్టారన్న పిటిషనర్ వాదనను ఎన్జీటీ తోసిపుచ్చింది. ‘పౌర విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఉండకూడదన్న నిషేధం ఏదీ లేదు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న ఎయిర్‌పోర్టు భోగాపురం విమానాశ్రయానికి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుత విమానాశ్రయం నావికాదళానికి సంబంధించింది. పౌర విమానాశ్రయంగా దానిని నిర్వహించే విషయంలో కొన్ని పరిమితులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా ఓ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలన్న విధానపరమైన నిర్ణయం తీసుకుంది.’ అని ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొంది. -
‘పాలమూరు–రంగారెడ్డి’ని ఆపాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాల్సిందేనని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. పిటిషన్లకు విచారణ అర్హత లేదన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. పర్యావరణ అనుమతులు తప్పించుకోవడానికే తాగునీటి పేరు చెప్పి సాగునీటి ప్రాజెక్టు చేపడుతోందన్న ఏపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. పిటిషనర్లు పర్యావరణ అంశంతో ఆశ్రయించిన నేపథ్యంలో విచారణ పరిధి తమకుందని పేర్కొంది. పర్యావరణ అనుమతులు పొందే వరకూ ప్రాజెక్టుపై తెలంగాణ ముందుకు వెళ్లకూడదని ఆదేశాల్లో పేర్కొంది. సంయుక్త కమిటీలో తెలంగాణ సభ్యులు మినహా మిగతా సభ్యులు పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని పేర్కొన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని తాము విశ్వసిస్తున్నామని జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాల్లో స్పష్టం చేసింది. ‘పాలమూరు–రంగారెడ్డి’ని తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తోందని, ఇది ఆంధ్రప్రదేశ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందంటూ డి.చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, అవ్వ వెంకటసుబ్బారెడ్డి, ఎస్కే.జానీబాషా, వజ్రాల కోటిరెడ్డి, నరబోయిన వెంకటరావు, సిద్దదాపు గాంధీ, గరికపాటి వెంకటరామనాయుడు, అన్నెం సోరెడ్డి, పండిపాటి వెంకయ్యలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు వెలువరించింది. అనుమతులు తీసుకున్నాకే... తెలంగాణ, ఏపీ, పిటిషనర్ల, కేంద్రం తరఫున న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. ‘కేంద్ర పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అనుమతించింది. అయితే ఇది ప్రాజెక్టు నిర్మాణానికి కాదని గుర్తుచేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిన ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని తెలంగాణకు కేంద్రం సూచించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించలేదని.. ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని కృష్ణా బోర్డు కూడా స్పష్టం చేసింది. ఇవన్నీ ఇలా ఉన్నా.. తెలంగాణ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది. ఈ నిర్ణయం పర్యావరణంపై ప్రభావం చూపడంతోపాటు ఏపీ ప్రజలు, పిటిషనర్ల (రైతులు) ప్రయోజనాలపైనా ప్రభావం చూపుతుంది. చెంచు గిరిజనులు ఉన్న ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం(పంప్‌హౌస్) చేపట్టడానికి తెలంగాణకు అనుమతి లేదు. 90 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తే ఇక సాగునీటికి కాలువలు తీయడం మినహా ఏమీ లేదు’అని తెలంగాణ సర్కార్‌కు తేల్చిచెబుతూ ఉత్తర్వులు జారీచేసింది. ► ‘ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 14(3) ప్రకారం కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన ఆరు నెలల్లోనే పిటిషన్ దాఖలు చేయాలనడం వాస్తవమే, సెక్షన్ 15 ప్రకారం పిటిషన్‌ను పరిశీలించే అధికారం మాత్రం మాకుంది’ ► ‘తెలంగాణ పేర్కొన్నట్లు 7.5 టీఎంసీలు తాగునీటికి అవసరం కాగా.. 90 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కడుతున్నారంటే సాగునీటి అవసరాలకు కూడా అని భావిస్తున్నాం. పర్యావరణ అనుమతులు కూడా తాగునీటికే ఉన్నాయి.. సాగునీటికి కాదని కమిటీ స్పష్టం చేసింది’. ► ‘అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతితో పనులు చేపట్టాలి’ – పాలమూరు–రంగారెడ్డి కేసులో ఎన్జీటీ -
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై ఎన్జీటీ స్టే
-
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే
న్యూఢిల్లీ: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టును నిర్మించొద్దని ఎన్జీటీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తాగునీటి కోసమని చెప్పి సాగునీటి కోసం నిర్మాణాలు చేపట్టారని పిటిషనర్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని చంద్రమౌళీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ తీర్పు వెలువరించింది. చదవండి: (ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ పదవీకాలం పొడిగింపు) -
పాలమూరు–రంగారెడ్డిపై కేంద్రం వైఖరి తెలపాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్రం వైఖరి ఏమిటో తెలపాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ముందు ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్రం తన వైఖరి వెంటనే చెప్పాలని ఏజీ శ్రీరామ్ కోరారు. కేంద్రం వైఖరి ఏమిటో చెప్పకుండా ఆదేశాలు ఇవ్వొద్దని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవంటూ ఏపీకి చెందిన రైతులు డి.చంద్రమౌళీశ్వరరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఎన్జీటీలో పిటిషన్ దాఖలుకు ఆరు నెలల కాల పరిమితి ఉంటుందని, ఆ సమయం మించి దాఖలు చేసిన పిటిషన్లను విచారించరాదని పేర్కొన్నారు. ఏపీ రైతుల పిటిషన్ ప్రవేశ సమయంలోనే విచారణకు నిరాకరించాలన్నారు. సుప్రీంకోర్టులో కూడా ఈ అంశంలో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు రాలేదన్న విషయం తెలిసి కూడా ఎన్జీటీని ఆశ్రయించారన్నారు. 2015లో ఇచ్చిన జీవో ప్రకారం తాగునీటి కోసమే ప్రాజెక్టు చేపట్టామన్నారు. పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టబోమని రాంచందర్‌రావు తెలిపారు. కేవలం తాగునీటి కోసమే అయితే అంతంత సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారు? సాగునీటి కోసం కూడా ప్రాజెక్టు వినియోగించాలన్న ఉద్దేశంతోనే చేపడుతున్నట్టుంది కదా ? అని ధర్మాసనం ప్రశ్నించింది. కృష్ణా నదిలో నిరంతరం నీరు ఉండదని, వర్షాలు తక్కువ పడినా, వరదలు లేకున్నా నాలుగేళ్లపాటు నిర్విరామంగా తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కడుతోందని రాంచందర్‌రావు తెలిపారు. ప్రాజెక్టు సమీప 13 మండలాల్లో ఫ్లోరైడ్ బాధిత గ్రామాలున్నాయని, భూగర్భ జలాల వినియోగం వల్ల ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలోనే భారీ రిజర్వాయర్లు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తొలుత అండర్ టేకింగ్ ఇచ్చినట్టుగా తాగునీటి కోసమే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామనిస్పష్టం చేశారు. ఈ కేసులో కేంద్రం వైఖరి చెప్పాలన్న అంశంపై కేంద్రం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రాథమిక దశలోనే విచారణ ఉందని తుది విచారణలో తప్పకుండా వైఖరి వెల్లడిస్తామని ధర్మాసనానికి తెలిపారు. తదుపరి వాదనలు గురువారం వింటామన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
NGT: తాగునీటి కోసమే రిజర్వాయర్లు
సాక్షి, న్యూఢిల్లీ: తాగునీటిని అందించడానికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాన్ని చేపట్టామని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ముందు వాదనలు వినిపించింది. అయితే, కేంద్రం వైఖరి చెప్పకుండా ఆదేశాలు ఇవ్వొద్దని ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవంటూ ఏపీ రైతుల డి.చంద్రమౌళీశ్వరరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎన్జీటీలో పిటిషన్ దాఖలుకు 6 నెలల కాలపరిమితి ఉంటుందని, ఆ సమయం మించి దాఖలైన పిటిషన్లను విచారించరాదని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులోనూ ఈ అంశంలో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు రాలేదన్న విషయం తెలిసీ ఎన్జీటీని ఆశ్రయించారన్నారు. 2015లో ఇచ్చిన జీవో ప్రకారం.. తాగునీటి కోసమే ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. పర్యావరణ అనమతులు వచ్చే వరకూ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టబోమని రాంచందర్‌రావు వెల్లడించారు. తాగునీటి కోసమే అయితే అంత సామర్థ్యమున్న రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారు.. సాగునీటి కోసం కూడా ప్రాజెక్టు వినియోగించాలన్న ఉద్దేశంతోనే చేపడుతున్నట్లుంది కదా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. కృష్ణాలో నిరంతరం నీరు ఉండదని, వర్షాలు తక్కువ పడినా, వరదలు లేకున్నా నాలుగేళ్లపాటు నిర్విరామంగా తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ఈ ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కడుతోంందని రాంచందర్‌రావు చెప్పారు. ప్రాజెక్టు సమీప 13 మండలాలు ఫోర్లైడ్ బాధిత గ్రామాలని, భూగర్భజలాలు వినియోగం వల్ల ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో భారీ రిజర్వాయర్లు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ విచారణ ప్రాథమిక దశలోనే ఉందని తుది విచారణలో తప్పకుండా తమ వైఖరి వెల్లడిస్తామని కేంద్రం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తదుపరి వాదనలు గురువారం (నేడు) వింటామన్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. చదవండి: టీఆర్ఎస్ జెండాను ఎత్తుకెళ్లిన దుండగులు -
‘రాయలసీమ’ కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పు రిజర్వు చేసింది. రాయలసీమపై గతంలో ఎన్జీటీ ఇచి్చన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంప్లీడ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. వీటిని తాజాగా సోమవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపించారు. జియాలజిస్టుల సూచనలు, డీపీఆర్ అవసరాల మేరకే రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద పనులు జరుగుతున్నాయని పునరుద్ఘాటించారు. ఎన్జీటీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేపట్టం లేదని స్పష్టం చేశారు. ఆదేశాల ధిక్కరణ పిటిషన్ల విచారణ ఎన్జీటీ పరిధిలో లేదంటూ పలు కేసులు ప్రస్తావించారు. ఎన్జీటీని ఏపీ తప్పుదోవ పట్టించలేదని పేర్కొన్నారు. డీపీఆర్ పరిధి దాటి పనులు చేస్తే దానిపై చర్యలు తీసుకొనే అధికారం విషయంలో చట్టపరంగా ఎక్కడా స్పష్టత లేదన్నారు. అదనపు పనులపై చర్యలు తీసుకొనే అధికారం పర్యావరణ శాఖకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తరఫు మరో న్యాయవాది మాధురి దొంతిరెడ్డి, తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు, పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌లు హాజరయ్యారు. -
‘డిండి’ సాగునీటి ప్రాజెక్టే..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని ‘డిండి’ ఎత్తిపోతల పథకం సాగునీటి ప్రాజెక్టు అని స్పష్టమవుతోందని జాతీయ హరిత ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. త్వరితగతిన వైఖరి చెప్పకుంటే స్టేటస్కో విధించాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పర్యావరణ చట్టాలు ఉల్లంఘించి అక్రమంగా చేపడుతున్న డిండి ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. డిండి ఎత్తిపోతల వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాజెక్టుల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ విషయాన్ని కృష్ణా బోర్డు, కేంద్ర జలశక్తి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదన్నారు. అంతర్రాష్ట్ర జలవివాదాలు పక్కనపెడితే.. అసలు ఈ పథకానికి పర్యావరణ అనుమతులు లేవని పేర్కొన్నారు. పర్యావరణ ప్రభావ అంచనా –2008 నోటిఫికేషన్ ప్రకారం పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా చేయలేదన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీలు తరలించి 3.60 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే లక్ష్యంతో 2015 జూన్‌లో తెలంగాణ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకం ప్రారంభించిందని చెప్పారు. ఈ వివరాలు తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లో కూడా ఉన్నాయన్నారు. పర్యావరణ అనుమతులు లేని ఈ ప్రాజెక్టు నిలిపి వేయాలని ఏజీ శ్రీరామ్ కోరారు. ఏపీ వాదనలపై తెలంగాణ వైఖరి చెప్పాలని ధర్మాసనం కోరింది. మూడు వారాల సమయం కావాలన్న తెలంగాణ ఏఏజీ.. ఏపీ పిటిషన్‌పై ప్రాథమిక అభ్యంతరాలు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం తరఫు అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు తెలిపారు. మూడు వారాల సమయం కావాలని కోరగా ధర్మాసనం అనుమతి ఇవ్వలేదు. ప్రాథమికంగా ఇరిగేషన్ కాంపొనెంటు ఉందని అర్థం అవుతోందని, పర్యావరణ శాఖ అనుమతులు తప్పని సరిగా ఉండాలని స్పష్టం చేసింది. సమయం ఎక్కువ కోరితే స్టేటస్ కో విధిస్తామని పేర్కొంది. ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ప్రారంభమైందని, కాలపరిమితి ముగిసిన తర్వాత పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి విచారణకు అర్హత లేదని రాంచందర్‌రావు తెలిపారు. ఈ తరహా పిటిషన్లు వ్యక్తులు దాఖలు చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కాదన్నారు. 2007లో ఈ ప్రాజెక్టుకు జీవోలు జారీ అయినప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో మళ్లీ జీవోలు ఇచ్చారని ఏపీ ఏజీ శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర పర్యావరణ శాఖ తదితరులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. ఈ నెల 8 లోగా వైఖరి చెప్పాలని ఆదేశిస్తూ అదే రోజుకు విచారణను వాయిదా వేసింది. -
తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణకు పాల్పడి రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద పనులు చేపడుతున్నామంటూ తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ఆధారాలతో ఎన్జీటీని తప్పుదోవ పట్టిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. సృష్టించిన (ఫ్యాబ్రికేటెడ్) ఆధారాలతో వీడియోలు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వంపై ఐపీసీ సెక్షన్ 192 మేరకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీ ప్రభుత్వం కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తూ రాయలసీమ ఎత్తిపోతల వద్ద పనులు చేపడుతోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్లకు సంబంధించిన కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయిన విషయం విదితమే. కోర్టు ధిక్కరణ చర్యలకు సంబంధించి ఎన్జీటీకి అధికారం ఉందా అనే అంశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్లో ప్రస్తావించింది. అనంతరం ఎన్జీటీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసింది. ఆయా పిటిషన్లను గురువారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి, అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ మాధురి దొంతిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద చేపడుతున్న పనులు, సర్వే.. కేంద్ర జలసంఘం మార్గదర్శకాల మేరకు రూపొందిస్తున్న డీపీఆర్‌కు సంబంధించినవి మాత్రమేనని తెలిపారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల వద్ద పరిశీలించిన కృష్ణాబోర్డు గతనెల 13న, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఈనెల 8న ఎన్జీటీకి సమర్పించిన నివేదికల్లో.. ప్రాజెక్టు పరిసరాల్లో ఎలాంటి పనులు కొనసాగడంలేదని స్పష్టం చేశాయని తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించి జరుగుతున్న పనులను రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద జరుగుతున్న పనులుగా వీడియో క్లిప్పింగ్‌లు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని కోరారు. గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో కల్పించుకున్న ధర్మాసనం..ట్రిబ్యునల్ తీర్పులు అమలు కాకపోతే చూస్తూ ఉండాలా అని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందని గవినోళ్ల శ్రీనివాస్ న్యాయవాది శ్రావణ్‌కుమార్, తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు తెలిపారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.