గొంతు కోస్తోంది!  | China Manja killing the People | Sakshi
Sakshi News home page

గొంతు కోస్తోంది! 

Published Wed, Jan 8 2020 5:32 AM | Last Updated on Wed, Jan 8 2020 5:32 AM

China Manja killing the People - Sakshi

సాక్షి, గుంటూరు: సంప్రదాయ క్రీడలకు ప్రతీక అయిన సంక్రాంతి సమయంలో ఏటా గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీ. గతంలో గాలిపటాలను ఎగురవేసేందుకు నూలుతో తయారైన దారం (మాంజా) ఉపయోగించేవారు. దీనివల్ల ఎవరికీ.. ఎలాంటి గాయాలయ్యేవి కావు. ఇప్పుడు వీటి స్థానంలో రసాయనాలతో కూడిన చైనా మాంజా వాడకంతో తీవ్ర గాయాల పాలవుతున్న పాదచారులు, వాహన చోదకుల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గాజు పిండి, ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసే చైనా మాంజాను నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిషేధించినా మార్కెట్‌లో విచ్చలవిడిగా లభ్యమవుతోంది.
 కౌశిక్‌ మృతదేహం (ఫైల్‌)  

యథేచ్ఛగా విక్రయాలు 
చైనా మాంజాలపై నిషేధం ఉన్నప్పటికీ మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తోంది. ఇతర గాలిపటాలను చైనా మాంజాతో సులువుగా తెంపవచ్చనే ఉద్దేశంతో ఎక్కువ మంది దీనిపట్ల మొగ్గు చూపుతున్నారు. గాలి పటాలు ఎగిరే సమయంలో ఈ మాంజా విద్యుత్‌ తీగలు, వృక్షాలకు చిక్కుకుని పక్షులు మృత్యువాత పడుతున్నాయి. వీటి మనుగడకు పెనుముప్పుగా మారిన చైనా మాంజా వినియోగాన్ని పక్షి ప్రేమికులు, పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గాలిపటాలను నియంత్రించే క్రమంలో ఒక్కోసారి ఎగురవేసే వ్యక్తులు కూడా గాయాల పాలవుతున్నారు. 
- గుంటూరులో సోమవారం తండ్రితో కలసి బైక్‌పై వెళ్తున్న మూడేళ్ల చిన్నారి కౌశిక్‌ మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.  
గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలో చైనా మాంజా గొంతుకు చుట్టుకుని మానవ్‌ శర్మ (28) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు.  
2018లో చైనా మాంజా కారణంగా గుజరాత్‌లో 16 మంది మరణించడంతో కైట్‌ ఫెస్టివల్‌తో పాటు ఈ మాంజా వాడకాన్ని నిషేధించారు. 

చట్టం ఏం చెబుతోందంటే.. 
రసాయనాలు పూసిన చైనా మాంజాతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. 2016 మార్చి 4న ఏపీ ప్రభుత్వం, 2016 జనవరిæ 13న తెలంగాణ సర్కారు వీటి విక్రయాలను నిషేధించాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజాను అమ్మటం, కొనుగోలు చేయడం నేరం. దీన్ని ఉల్లంఘించే వారికి ఐదేళ్లు, అంతకుమించి జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. జంతువులు, పక్షులకు హాని కలిగిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తారు.  

చైనా మాంజా తయారీ ఇలా.. 
దారానికి గాజు పిండి, సగ్గు బియ్యం, గంధకం, రంగులు అద్ది ఉడికించి చైనా మాంజా తయారు చేస్తారు. తమిళనాడులోని ఆరంబాకం, చెన్నైలోని ప్యారిస్, మౌంట్‌రోడ్డు మొదలైన ప్రాంతాల్లో చైనా మాంజా ఎక్కువగా తయారు చేస్తుంటారు. అక్కడి నుంచి ఏపీలోని పలు జిల్లాలకు సరఫరా అవుతుంది. తమిళనాడు సరిహద్దులో ఉన్న నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్లూరుపేట, గుంటూరు నగరంలోని పట్నంబజార్, లాలాపేటలో కూడా చైనా మంజా తయారు చేస్తారు. రాష్ట్రంలోని కర్నూలు చిత్తూరు, కృష్ణా సహా పలు జిల్లాల్లో కుటీర పరిశ్రమగా చైనా మాంజా తయారీ నడుస్తోంది.  

మనుగడకు ముప్పు 
చైనా మాంజాతో గాలిపటాలను ఎగురవేయడం వల్ల పక్షులు, జంతువులకే కాకుండా మనుషులకు కూడా ముప్పు వాటిల్లుతోంది. చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. నూలు దారంతో గాలిపటాలు ఎగురవేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగవు 
–తేజోవంత్, కార్యదర్శి, హెల్ప్‌ ఫర్‌ యానిమల్స్‌ సొసైటీ 
 
 ప్రజల్లో చైతన్యం రావాలి 
ప్రాణాలు హరిస్తున్న చైనా మాంజాను ఎవరూ వినియోగించకూడదు. జీవోలకే పరిమితం అయిన నిషే«ధాన్ని ప్రభుత్వాలు అమలు చేసి చూపించాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. చైనా మాంజాను స్వచ్ఛందంగా నిరాకరించాలి 
– గోపాల్‌ సూరాబత్తుల, వ్యవస్థాపక కార్యదర్శి, యానిమల్‌ రెస్క్యూ ఆర్గనైజేషన్‌ 
 
ఇక కఠిన చర్యలు 
చైనా మాంజా మెడకు చుట్టుకుని మూడేళ్ల బాలుడు మృతి చెందడం అందరినీ కలచి వేసింది. చైనా మాంజాను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై ఎవరైనా దీన్ని కొనుగోలు చేసినా, అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసులను సైతం అప్రమత్తం చేస్తాం. చైనా మాంజా విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం 
– ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్, కలెక్టర్, గుంటూరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement