‘లైవ్‌’ కోడి స్పెషల్‌! | bets via live link on festival time | Sakshi
Sakshi News home page

‘లైవ్‌’ కోడి స్పెషల్‌!

Published Mon, Jan 20 2025 5:48 AM | Last Updated on Mon, Jan 20 2025 5:48 AM

bets via live link on festival time

లైవ్‌ లింక్‌ ద్వారా నిర్వాహకుల బెట్టింగ్‌లు 

దేశ విదేశాల్లోని పందెంరాయుళ్లకు ఎర

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సంక్రాంతి సంబరాలకు కూటమి సర్కారు కొత్త భాష్యం చెప్పింది. పండుగ సంప్రదాయం ముసుగులో ప్రైవేట్‌ సైన్యా­ల పహారాలో యథేచ్ఛగా కోడి పందేలు, లైవ్‌లో బెట్టింగ్‌లు, ఫ్లడ్‌ లైట్ల వెలుగుల్లో క్యాసినోలను తలదన్నే రీతిలో నిర్వహించిన జూద క్రీడలు, బెల్టు షాపులు పచ్చ ముఠాలకు కాసులు కురిపించాయి. 

ఇసుక నుంచి మద్యం దాకా ప్రజలను పిండేస్తున్న కూటమి నేతలు సంపాదనే లక్ష్యంగా బరి తెగించి వ్యవహరించారు. ము­నుపెన్నడూ లేని విధంగా ఊరూవాడా కోడి పందా­లు, పేకాట, గుండాటలను యథేచ్ఛగా నిర్వ­హిం­చారు. పండుగ 3 రోజుల్లో రూ.ఐదు వేల కోట్ల మేర దందా సాగింది. పలుచోట్ల కోడి పందేలను కూటమి ప్రజాప్ర­తి­నిధులు, మంత్రులు ప్రారంభించ­డంతోపాటు వారి ఫొటోలతో బరుల వద్ద పెద్ద ఎ­­త్తున ప్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.  

నిశ్చింతగా వచ్చేయండి... 
సంక్రాంతికి ముందు కూడా కూటమి నేతల కనుసన్నల్లో, పోలీసుల సహకారంతో బాపట్ల, కృష్ణా, భీమవరం, కోనసీమ తదితర జిల్లాల్లో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కోడి పందేలు, జూద శిబి­రాలు కొనసాగాయి. 

కొద్ది నెలల ముందు నుంచే పందేలు కాసేవారికి ఆహ్వానాలు అందాయి. ‘మా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే కనుసన్నల్లోనే బ­రులు ఏర్పాటవుతున్నందున ఇబ్బందులేమీ ఉండవు. 3 రోజులు ఉండేలా మీరు నిశ్చింతగా వచ్చే­యండి. హోటళ్లలో గదులు కూడా సిద్ధం చేశాం’ అని ఆహ్వానాలు పంపారు. 

కొత్త వారికి గేలం.. 
పందెంరాయుళ్లతో ఉన్న పాత పరిచయాలను బలోపేతం చేసుకుంటూనే కొత్తవారిని రప్పించేందుకు నిర్వాహకులు పలు మార్గాలు అనుసరించారు. సోషల్‌ మీడియాలో ప్రచారంతో హైప్‌ సృష్టించారు. విదేశాల్లో ఉన్నవారితో పాటు హైదరాబాద్‌ తదితర నగరాల్లో గేటెడ్‌ కమ్యూనిటీల్లో నివసిస్తున్న వారు, సాఫ్ట్‌­వేర్‌ ఉద్యోగులను ఆక­ర్షించేందుకు నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నారు.  

ముందే గెట్‌ టు గెదర్‌లు 
ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద బరుల సంఖ్య ఈదఫా పెరిగాయి. 2 నెలల క్రితమే సమాచారమిచ్చి రహస్యంగా గెట్‌ టు గెదర్‌లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని కూటమి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను రప్పించారు. మందు, విందు భోజనాలతో జరిగిన ఈ పార్టీల్లోనే సంక్రాంతి బరుల్లో కోడి పందేలపై పందెంరాయుళ్లు అవగాహనకు వచ్చారు.

బరు­ల విస్తీర్ణం, పోటీ జోడీలు, తేదీలు, సమయాలు, వ్య­యం తదితరాలు అప్పుడే ఖరారైపోయాయి. రా­జ­కీయ, సినీ, పారిశ్రామిక రంగాల నుంచి ఎవ­రెవరిని ఆహ్వానించాలనేది నిర్ణయించి ఆ మేరకు అమలు చేసేలా ప్రణా­ళిక రూపొందించారు.  

ప్రొఫైల్స్‌ సిద్ధం.. 
బరులు నిర్వహించిన వారు భవిష్యత్తులో నిర్వహించబోయే ఆటలకు మంచి లాబీయింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. సంపన్న వర్గాల నుంచి కొత్తగా వచ్చిన పందెంరాయుళ్ల బలాలు, బలహీనతలను అంచనా వేసుకుని ప్రొఫైల్స్‌ సిద్ధం చేసుకున్నారు. రానున్న రోజుల్లో నిర్వహించబో­యే జూద కార్యకలాపాలకు ఆహ్వానాలు పంపి జేబులు నింపుకునేలా రూట్‌మ్యాప్‌ల తయారీ­లో నిమగ్నమయ్యారు. 

శ్రీలంక, థాయ్‌లాండ్, నేపాల్‌ తదితర దేశాల్లో జరిగే పేకాట, క్యాసినో శిబిరాలకు కూడా వీరిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. భీమవరానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితోపాటు ఆక్వా రంగంలోని పలువురు ప్రముఖులు హైదరాబాద్, విశాఖ, విజయవాడలకు చెందిన వారిని కోళ్ల పందేలకు ఆహ్వానించి పండుగ మూడు రోజులు రాచమర్యాదలు చేసి పంపడం గమనార్హం.

లైవ్‌లో బెట్టింగ్‌లు...
ఈసారి భారీ బరుల వద్ద పందేలను లైవ్‌ టెలికాస్ట్‌ చేయడం ద్వారా క్రికెట్‌ తరహాలో బెట్టింగ్‌లు నిర్వహించారు. లైవ్‌ లింక్‌ ద్వారా దేశ విదేశాల్లోని పందెంరాయుళ్లు కోడిపందేలపై బెట్టింగ్‌లు కాయడం గమనార్హం. ఇదివరకెన్నడూ లేని విధంగా డేగాపురం, వెంకట్రామన్నగూడెం, సీసలి, ఎస్‌.యానాం, కొయ్యలగూడెం, వీరవాసరం, మురుముళ్ల  తదితర ప్రాంతాల్లో పెద్దపెద్ద బరులు ఏర్పాటయ్యాయి. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఏకంగా ‘కోడిపందెం లీగ్‌ (కేపీఎల్‌)’ పేరిట బరి నిర్వహించడం విశేషం. 

బీచ్‌ ఫెస్టివల్‌ పేరిట సంగీత విభావరి ముసుగులో విభిన్న రకాల జూదాలను కొనసాగించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు ఇతరచోట్ల బరులు ఏర్పాటు కాకుండా, తమ బరివద్దకే పందెం రాయుళ్లు వచ్చేలా గుత్తాధిపత్యం చలాయించారు. ఇక మహిళా బౌన్సర్లు ఈసారి ప్రత్యేకం. పందెంరాయుళ్లు ఫోన్‌ పే ద్వారా డబ్బులు బదిలీ చేస్తే అయిదు నుంచి పది శాతం కమీషన్‌ తీసుకుని నగదు అందించేలా బరుల వద్ద ఏర్పాట్లు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement