
జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పు.. చేవెళ్ల రోడ్డు విస్తరణకు బ్రేక్
మళ్లీ నిపుణులతో శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి నివేదించాలని ఆదేశం
బీజాపూర్ జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ శివారులోని అప్పా కూడలి నుంచి మన్నెగూడ కూడలి వరకు నాలుగు వరుసలకు విస్తరించే రోడ్డు ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. విస్తరణలో ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) సరిగ్గా వ్యవహరించకపోవటాన్ని తప్పుపట్టిన జాతీయ హరిత ట్రిబ్యునల్.. మళ్లీ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ రిపోర్టు (పర్యావరణంపై ప్రభావ అంచనా నివేదిక) అందించే వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించొద్దని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెల్లడించింది. – సాక్షి, హైదరాబాద్
మర్రి వృక్షాలే కేంద్రంగా..
నగర శివారులోని అప్పా కూడలి నుంచి చేవెళ్ల–వికారాబాద్ రోడ్డులోని మన్నెగూడ కూడలి వరకు జాతీయ రహదారిని ఎన్‌హెచ్‌ఏఐ నాలుగు వరుసలతో 60 మీటర్లకు విస్తరించాల్సి ఉంది. ఇది కర్ణాటకలోని బీజాపూర్ వరకు విస్తరించిన రోడ్డు. ఎగువన పరిగి మీదుగా రాష్ట్ర సరిహద్దు వరకు గతంలోనే రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలోని జాతీయ రహదారుల విభాగం ఈ రోడ్డును విస్తరించింది. నగర శివారు నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ. నిడివి ఎన్‌హెచ్‌ఏఐ అదీనంలో ఉంది.
దాదాపు రూ.950 కోట్లతో ఈ పనులు చేపట్టాల్సి ఉంది. మన్నెగూడ వరకు రోడ్డుకిరువైపులా స్వాతంత్య్రానికి పూర్వం నాటిన 915 మర్రి వృక్షాలున్నాయి. నాలుగు వరుసలకు విస్తరించాలంటే ఈ మొత్తం చెట్లను తొలగించాల్సి వస్తుంది. చేవెళ్ల, మొయినాబాద్ పట్టణాల వద్ద రోడ్డు విస్తరణలో ఇళ్లను కూడా తొలగించాల్సి రావటంతో ఆ రెండు చోట్ల బైపాస్ రోడ్లు నిర్మించాలనుకున్నారు. దీంతో మొయినాబాద్, చేవెళ్ల పట్టణాల వద్ద ఉన్న 232 చెట్లను తొలగించాల్సిన పని లేకుండాపోయింది.
ఈ వృక్షాలను కొట్టకుండా కాపాడాలంటూ బాలాంత్రపు తేజ సహా పలువురు సామాజిక కార్యకర్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. పలుదఫాల విచారణ అనంతరం, ఆ వృక్షాల తొలగింపు వల్ల పర్యావరణంపై ఉండే ప్రభావాన్ని అంచనా వేయాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో గతేడాది జనవరిలో ఆ శాఖ అదీనంలోని నిపుణుల అంచనా కమిటీ (ఈఏసీ) అధ్యయనం చేసి ఎన్‌హెచ్‌ఏఐకి నివేదిక సమర్పించింది.
కొన్ని చెట్ల పరిరక్షణకు వీలుగా సెంట్రల్ మీడియం వెడల్పు తగ్గించామని, దాని వల్ల 50 చెట్లు తొలగించాల్సిన అవసరం లేకుండా పోయిందని, బైపాస్‌ల వల్ల 232 మిగులుతున్నాయని, స్థానిక ముడిమ్యాల అటవీ ప్రాంతం వద్ద మిగిలే మరికొన్ని చెట్లు సహా మొత్తం 393 వృక్షాలు అలాగే మిగిలి ఉంటాయని, మిగతా వృక్షాలను ట్రాన్స్‌లొకేట్ పద్ధతిలో వేరే చోట నాటుతామని ట్రిబ్యునల్‌కు విన్నవించింది.
ట్రిబ్యునల్ అసంతృప్తి.. ఏమన్నదంటే..
» ఎన్‌హెచ్‌ఏఐ సమర్పించిన నివేదికపై ట్రిబ్యునల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
» ప్రస్తుతమున్న అలైన్‌మెంట్ ప్రకారమే రోడ్డును విస్తరించాలని ఎందుకు అనుకుంటున్నారు. కొత్తగా మరో రోడ్డు నిర్మిస్తే అయ్యే నష్టమేంటన్న మాటకు ఎందుకు స్పష్టమైన సమాధానం ఇవ్వటం లేదు.
» మర్రి వృక్షాలు కీలక భాగాల్లో సున్నితంగా ఉంటాయి. వాటిని ట్రాన్స్‌లొకేట్ చేసిన సందర్భంలో మనుగడ శాతం తక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అందులోనూ ఎక్కువ వయసు ఉన్న వృక్షాల మనుగడలో తీసుకునే చర్యలేమిటో శాస్త్రీయబద్ధ నివేదిక రూపంలో సమర్పించలేదు.
» ట్రాన్స్‌లొకేట్ చేసిన తర్వాత వృక్షాలు మనుగడ సాగించేందుకు తీసుకునే చర్యలేమిటో ప్రాజెక్టు రిపోర్టులో చేర్చలేదు. దానికి సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో వెల్లడించలేదు.
» అందుకే మరోసారి శాస్త్రీయపద్ధతిలో నిపుణుల ఆధ్వర్యంలో పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనం నిర్వహించి నివేదిక సమర్పించాలి. అప్పటి వరకు రోడ్డు విస్తరణ పనులను నిలిపివేయాలి.
Comments
Please login to add a commentAdd a comment