
దేశవ్యాప్తంగా 28 కోట్లకు ఆన్‌లైన్ షాపర్స్
అంతర్జాతీయంగా రెండవ స్థానం కైవసం
సంఖ్యలో అమెరికాను దాటిన భారత్
సాక్షి, స్పెషల్ డెస్క్: మనతోని అట్లుంటది.. అవును ఆటైనా, పాటైనా.. ఆఖరుకు రిటైల్ అయినా రికార్డులు సృష్టించడంలో ఆ ‘క్లిక్కే’వేరు. ప్రపంచ ఆన్‌లైన్ రిటైల్ రంగంలో కస్టమర్ల సంఖ్య పరంగా అమెరికాను దాటి రెండవ అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించింది. 28 కోట్ల మంది ఆన్‌లైన్ షాపర్స్‌తో రిటైల్ మార్కెట్‌ను మన దేశం షేక్ చేస్తోందని ఫ్లిప్‌కార్ట్ సహకారంతో బెయిన్ అండ్ కంపెనీ రూపొందించిన నివేదిక వెల్లడించింది. 92 కోట్ల మంది ఈ–రిటైల్ షాపర్స్‌తో చైనా తొలి స్థానంలో కొనసాగుతోంది. 27 కోట్ల ఆన్‌లైన్ షాపర్లతో అమెరికా మూడో స్థానంలో నిలిచింది. క్విక్ కామర్స్, ట్రెండ్–ఫస్ట్ కామర్స్, హైపర్–వాల్యూ కామర్స్ భారత్‌లో తదుపరి ఆన్‌లైన్ కొనుగోళ్ల వృద్ధి అధ్యాయాన్ని నిర్వచించనున్నాయి.
ఐదు మించి ప్లాట్‌ఫామ్స్..
ఈ–రిటైల్ షాపర్స్‌లో జెన్–జీ తరం (1997–2012 మధ్య పుట్టినవారు) సంఖ్య దాదాపు 40% ఉంది. ప్రత్యేక షాపింగ్ అలవాట్లు వారి సొంతం. వారిలో సగం మంది ఏటా ఐదు, అంతకంటే ఎక్కువ ప్లాట్‌ఫామ్‌ల నుంచి కొనుగోళ్లు చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ బ్రాండ్‌లపై ఇతర కస్టమర్లతో పోలిస్తే జెన్–జీ తరం మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోంది. హైపర్ వాల్యూ కామర్స్ (అతితక్కువ ధరగల ఉత్పత్తులు) సామాన్యులను ఆకర్షిస్తోంది. ఈ–రిటైల్‌లో 2021లో 5% వాటా కలిగి ఉన్న ఈ విభాగం ఇప్పుడు 12% మించిపోయింది. కిరాణా, జీవనశైలి, సాధారణ వస్తువులు ఈ–రిటైల్ మార్కెట్‌లో 55% వాటా కలిగి ఉన్నాయి. ఇవి 2030 నాటికి మూడింట రెండు వంతులకు చేరనున్నాయి.
తోడైన క్విక్ కామర్స్..
భారత్‌లో తలసరి జీడీపీ రూ. 2,99,950 కంటే ఎక్కువగా ఉన్న కేరళ, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, చండీగఢ్, తమిళనాడు ఇప్పటికే ఈ–రిటైల్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే 1.2 రెట్లు అధికంగా వ్యాప్తి చెందాయి. దేశంలోని ఈ–రిటైల్ రంగంలో ప్రధానంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తూ గ్రామాల వరకు వ్యాపారాన్ని విస్తరించాయి. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తదితర క్విక్ కామర్స్ కంపెనీలు మొత్తం ఈ–కామర్స్ జోరుకు సహాయపడుతున్నాయి.
క్విక్ కామర్స్ యాక్టివ్ కస్టమర్ల సంఖ్య 2 కోట్లు దాటింది. స్వల్పకాలిక స్థూల ఆర్థిక ఎదురుగాలులు ఉన్నప్పటికీ భారత ఈ–రిటైల్ మార్కెట్‌లో దీర్ఘకాలిక అవకాశాలు బలంగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ట్రెండ్–ఫస్ట్ ఫ్యాషన్ (సరసమైన ధరలకు ట్రెండీ కలెక్షన్) ఒక్కటే నాలుగు రెట్లు పెరిగి 2028 నాటికి సుమారు రూ. 68,560–85,700 కోట్లకు చేరుకోనుంది. ట్రెండ్–ఫస్ట్ ఫ్యాషన్ ఆదాయంలో సగానికిపైగా ఆన్‌లైన్ అమ్మకాల ద్వారానే రానుంది.
పెద్ద నగరాలతో సమానంగా..
⇒ ఈ–రిటైల్‌లో 2020 నుంచి ఇప్పటివరకు నమోదైన కొత్త కస్టమర్లలో దాదాపు 60% మంది తృతీయ శ్రేణి పట్టణాలు, చిన్న నగరాలకు చెందినవారే. అలాగే 2021 నుంచి ఈ–రిటైల్ ప్లాట్‌ఫామ్‌లలో చేరిన నూతన విక్రేతలలో 60% కంటే ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి, చిన్న నగరాల నుంచి ఉన్నారు. మొత్తం ఆర్డర్స్‌లో తృతీయ, ఆ తర్వాతి స్థాయి పట్టణాల వాటా 45% పైగా ఉంది. ద్వితీయ శ్రేణి, చిన్న నగరాల్లో వినియోగదార్ల ఈ–రిటైల్ ఖర్చు మెట్రో, ప్రథమ శ్రేణి నగరాలతో సమానంగా ఉంది. అంతేగాక వివిధ వస్తు విభాగాలలో సగటు అమ్మకపు ధరలు సమానంగా లేదా కొంచెం తక్కువగా ఉన్నాయి.
పదింటిలో ఒకటి ఈ–రిటైల్‌కు..
ఈ–రిటైల్ (ఆన్‌లైన్ కొనుగోళ్లు) విపణి భారత్‌లో 2019– 2024 మధ్య ఏటా 20% వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది. 2024లో ఈ రంగంలో రూ. 5,14,200 కోట్ల వ్యాపా రం జరిగింది. ఏటా 18% వృద్ధితో 2030 నాటికి ఇది రూ. 14,56,900–16,28,300 కోట్లకు చేరుకుంటుందని అంచనా. స్థూల ఆర్థిక కారకాలు, వినియోగం క్షీణించిన కారణంగా దేశీయ ఈ–రిటైల్ వృద్ధి గతేడాదిలో 10–12 శాతానికి మందగించినప్పటికీ తాజాగా రికార్డు సృష్టించడం విశేషం. ఒకానొక దశలో ఈ
రంగం 20% పైగా వృద్ధి సాధించింది.
2030 నాటికి దేశంలో తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) రూ. 2,99,950– 3,42,800లకు చేరనున్న నేపథ్యంలో కస్టమర్లు రిటైల్‌లో 10 డాలర్లు (రూ. 857) వెచి్చస్తే ఒకటి ఈ–రిటైల్ కోసం ఖర్చు చేస్తారట. అనవసర ఖర్చుల పెరుగుదల అందుకు ఆజ్యం పోయనుందని నివేదిక వివరించింది.