![Artificial intelligence Impact on India Retail and Q-Commerce Sector](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/ISTOCK-1392884242-000-JPG.jpg.webp?itok=X0vi9Yya)
10 నిమిషాల ఇన్‌స్టంట్ డెలివరీకి టెక్నాలజీ దన్ను
రియల్ టైమ్ డేటాతో కచ్చితమైన డెలివరీ టైమ్ చెప్పేస్తున్న ఏఐ
డార్క్ స్టోర్లలో నిల్వల సరైన నిర్వహణ
పదే పది నిమిషాల్లో డెలివరీతో రప్పా రప్పా దూసుకుపోతున్న క్విక్ కామర్స్ దిగ్గజాలు... దీని కోసం అధునాతన టెక్నాలజీని విరివిగా వాడేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా ఎనలిటిక్స్ వంటి సాంకేతికతల దన్నుతో కస్టమర్ల ఆర్డర్ ధోరణులు, ప్రోడక్ట్ ప్రాధాన్యతలు, ఏ సమయంలో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారనే అంశాలను అధ్యయనం చేయడం, డార్క్ స్టోర్ నుంచి గమ్యస్థానికి అత్యంత వేగవంతమైన రూట్‌ను ఎంచుకోవడం వంటివన్నీ చకచకా చక్కబెట్టేస్తున్నాయి.
క్విక్ కామర్స్ దిగ్గజాలైన బ్లింకిట్, బిగ్‌బాస్కెట్ నౌ, జెప్టో లేదంటే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్... చెప్పింది చెప్పినట్లుగా పది నిమిషాలలోపే ఆర్డర్లను అంతవేగంగా ఎలా డెలివరీ చేసేస్తున్నాయో తెలుసా? ఇప్పటికే తమ వద్దనున్న వినియోగదారుల డేటాను ఏఐతో సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారానే ఇదంతా సాధ్యమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. తగినంత కన్జూమర్ సమాచారం ఉన్న క్విక్ కామ్ కంపెనీలకు ఏఐ వరప్రదాయినిగా మారుతోంది.
వినియోగదారుల కొనుగోలు స్వభావం నుంచి వారు ఎంత విరివిగా ఆర్డర్ చేస్తున్నారు, ఏయే ఉత్పత్తులను ఎక్కువగా కొంటున్నారు వంటివన్నీ ఏఐ టూల్స్ రియల్ టైమ్‌లో విశ్లేషించి అందిస్తున్నాయి. అంతేకాదు దగ్గరలో ఉన్న డార్క్ స్టోర్ (క్విక్ కామ్ కంపెనీలు ప్రోడక్టులను నిల్వ ఉంచుకునే చిన్నపాటి గిడ్డంగులు) నుంచి ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో, అలాగే పెద్దగా రద్దీ లేనప్పుడు గమ్యస్థానానికి అత్యంత వేగంగా చేరుకునే రూట్‌ను కూడా అధ్యయనం చేసి ఈ ఏఐ
టూల్స్ నేరుగా డెలివరీ బాయ్‌కు చేరవేస్తున్నాయి.
అంతా క్షణాల్లో...
జెప్టో వంటి కీలక క్విక్ కామ్ సంస్థలు ఉపయోగిస్తున్న తెరవెనుక (బ్యాకెండ్) టెక్నాలజీ... ఏకకాలంలో పికర్స్, ప్యాకర్స్, ఇంకా రైడర్లను రియల్‌టైమ్‌లో కనెక్ట్ చేస్తోంది. ఒకసారి యాప్‌లో ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వగానే, ఈ సిస్టమ్‌లోని అందరూ అనుసంధానమైపోతారు. ఆర్డర్‌ను పిక్ చేయడం, డిస్పాచ్ చేయడం 2 నిమిషాల్లోపే జరిగిపోతుంది.
ఆపై ట్రాఫిక్, ఇంధన మైలేజీ, వాహన టెలీమెట్రీ, ప్రయాణ సమాయాల చరిత్ర, దూరం వంటి డేటాను ఉపయోగించుకుని రియల్ టైమ్ రూటింగ్ తగిన రూట్లను సూచిస్తుంది. దీనివల్ల ఆర్డర్‌ను డెలివరీ పార్టనర్ ఎంత సమయంలో కస్టమర్ చెంతకు చేర్చగలరనే అంచనా ట్రావెల్ టైమ్ (ఈటీఏ)ను పక్కాగా పేర్కొంటుంది. దీని ప్రకారం సగటున 8 నిమిషాల్లోపే ఆర్డర్ డెలివరీ జరిగేందుకు వీలవుతోందని నిపుణులు చెబుతున్నారు. 340కి పైగా డార్క్ స్టోర్లున్న జెప్టో గతేడాది డెలివరీ దూరం 1.7 కిలోమీటర్లు కాగా, ఇప్పుడిది 1.5 కిలోమీటర్లకు తగ్గించుకుంది.
అంతేకాదు, 3–4 సెకెన్లలో చెకవుట్ అయ్యే విధంగా అధునాతన టెక్నాలజీలు వినియోగించే పేమెంట్ గేట్‌వే సరీ్వసులను కంపెనీ వాడుకుంటోంది. ఇక బీబీనౌ విషయానికొస్తే, ఆర్డర్ ఏ డార్క్ స్టోర్‌కు వెళ్తుందో నిర్ణయించడానికి ముందే టెక్నాలజీ రంగంలోకి దిగుతుంది. ఉదాహరణకు సదరు ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్‌లు, పీక్, నాన్–పీక్ టైమ్‌లో ట్రాఫిక్, రోడ్డు స్థితిగతులు, ఇప్పటిదాకా కస్టమర్ షాపింగ్ ధోరణులు, వయస్సు, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి పలు డేటా పాయింట్‌లను పరిగణనలోకి తీసుకుంటామని బిగ్‌బాస్కెట్ సీఓఓ టీకే బాలకుమార్ చెప్పారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా బీబీనౌ రోజుకు 5 లక్షల పైగా ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోంది.
→ జెప్టో డార్క్ స్టోర్ నుంచి ప్రస్తుత డెలివరీ దూరం 1.5 కిలోమీటర్లు; యాప్‌లో ఆర్డర్ చెకవుట్ సమయం 3–4 సెకన్లు.
→ ఆర్డర్లను తగిన డార్క్ స్టోర్లకు కేటాయించేందుకు బీబీనౌ జియో స్పేíÙయల్ డేటాను వినియోగిస్తోంది.
→ పికర్లు, ప్యాకర్లు, రైడర్లను అత్యంత వేగంగా కనెక్ట్ చేయడానికి జెప్టో ఏఐ ఆల్గోరిథమ్స్ దోహదం చేస్తున్నాయి.
→ యూజర్ల అభిరుచులను బట్టి ఉత్పత్తులను సిఫార్సు చేయడంలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డేటా ఎనలిటిక్స్‌ది కీలక పాత్ర.
వృథాకు చెక్..
డిమాండ్‌ను అంచనా వేయడానికి దాదాపు అన్ని క్విక్ కామ్ సంస్థలూ ఏఐ ఆల్గోరిథమ్స్, మెషీన్ లెర్నింగ్ మోడల్స్ ప్రయోజనాన్ని వాడుకుంటున్నాయి. దీనివల్ల ప్రోడక్ట్ నిల్వలను సరిగ్గా నిర్వహించేందుకు, వృథాను అరికట్టేందుకు వాటికి వీలు చిక్కుతోంది. అంతేగాకుండా, డార్క్ స్టోర్లలో ఉత్పత్తుల నిల్వలను నిరంతరం పర్యవేక్షించేందుకు క్విక్ కామ్ సంస్థలు రియల్ టైమ్ డేటాను కూడా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలతో పంచుకుంటున్నాయి.
పలు ఈ–కామర్స్ సంస్థల వృద్ధిలో కీలకంగా నిలుస్తున్న డేటా ఎనలిటిక్స్ క్విక్ కామ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఉదాహరణకు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ షాపింగ్ అభిరుచులు, ప్రాధాన్యతల ఆధారంగా ఒక్కో కస్టమర్‌కు ఒక్కోలాంటి యూజర్ అనుభూతిని అందించేందుకు డేటా ఎనలిటిక్స్‌ను సద్వినియోగం చేసుకుంటోంది. ‘ఇలాంటి నిర్దిష్ట (టార్గెటెడ్) విధానం వల్ల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను సిఫార్సు చేయడానికి వీలువుతుంది. అలాగే కస్టమర్లు ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసే అవకాశాలను పెంచుతుంది’ అని ఈ–కామర్స్ నిపుణులు సోమ్‌దత్తా సింగ్ అభిప్రాయపడ్డారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment