కిరాణా సరుకులు, నిత్యావసర వస్తువులను నిమిషాల్లో డెలివరీ చేస్తామని హామీ ఇస్తున్న క్విక్ కామర్స్ బిజినెస్ పట్టణ ప్రాంతాల్లో వేగంగా ప్రజాదరణ పొందుతోంది. ఇప్పటికే బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్, జెప్టో.. వంటి సంస్థలు ఈ సర్వీసులు అందిస్తున్నాయి. అయితే ఈ బిజినెస్‌పై ప్రజాదరణతోపాటు విమర్శలు సైతం పెరుగుతున్నాయి. ఇందుకు కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వ్యతిరేక పోటీ విధానాలు
క్విక్ కామర్స్ సంస్థలు వ్యతిరేక పోటీ విధానాలను అనుసరిస్తున్నాయనే వాదనలున్నాయి. సాంప్రదాయ రిటైలర్లు, ముఖ్యంగా కిరాణా దుకాణాదారులపై క్విక్ కామర్స్ ప్రభావం భారీగా ఉంది. ఈ సంస్థలు అందించే డిస్కౌంట్లు, నేరుగా ఇంటికే డెలివరీ చేసే సేవలతో కిరాణాదారుల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. వినియోగదారులకు వేగంగా సర్వీసులు అందించేందుకు స్థానికంగా డార్క్ స్టోర్లను, చిన్న, ఆటోమేటెడ్ గోదాములను ఉపయోగిస్తున్నాయి.
ఆకర్షణీయ ధరలు
సాంప్రదాయ రిటైల్ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్ కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటం సైతం కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. క్విక్ కామర్స్ వినియోగం 2024-25లో 74% వృద్ధి నమోదు చేయనుంది. 2023–28 మధ్యలో 48% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
విదేశీ పెట్టుబడుల దుర్వినియోగం
క్విక్ కామర్స్ వాణిజ్యం పెరగడం స్థానిక రిటైలర్లకు గొడ్డలిపెట్టుగా మారింది. సౌలభ్యం, తక్కువ ధరలకు ఆకర్షితులైన చాలా మంది వినియోగదారులు తమ షాపింగ్ అలవాట్లను మార్చుకుంటున్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మార్పు ఫలితంగా సాంప్రదాయ దుకాణాల్లో అమ్మకాలు తగ్గిపోయాయి. రిటైల్ మార్కెట్‌ను పూర్తి తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు విదేశీ పెట్టుబడులను దుర్వినియోగం చేస్తున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఆరోపించింది.
ప్రభుత్వ సంస్థల దర్యాప్తు
క్వాక్ కామర్స్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాలపై ఆందోళనలు ఉన్నాయి. ఈ సంస్థలు పోటీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్న ఆరోపణలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లు ధరలను కట్టడి చేస్తూ పోటీ చట్టాలను ఉల్లంఘించేలా ఇన్వెంటరీని నియంత్రిస్తున్నాయని సాంప్రదాయ రిటైలర్లు పేర్కొన్నారు. ఈ మేరకు వస్తున్న ఆరోపణలపై సీసీఐ తన దర్యాప్తును కొనసాగించడానికి మరింత వివరణాత్మక సాక్ష్యాలను కోరుతోంది.
ఇదీ చదవండి: ఖో-ఖోకు పెరుగుతున్న స్పాన్సర్‌షిప్
ఏం చేయాలంటే..
ఈ ఆందోళనలపై స్పందించిన ప్రభుత్వం వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. రిటైలర్లకు నష్టం కలగకుండా, క్విక్ కామర్స్ సంస్థలు అంగీకరించేలా సమన్వయం చేస్తూ మార్గదర్శకాలు తయారు చేయాల్సి ఉంది. రిటైల్ వ్యవస్థలో భాగస్వాములందరి ప్రయోజనాలను పరిరక్షిస్తూనే సృజనాత్మకతకు మద్దతు ఇచ్చేలా పరిష్కారాలు కనుగొనాలి.
Comments
Please login to add a commentAdd a comment