Online Market
-
క్విక్ కామర్స్‌పై విమర్శలు ఎందుకు..
కిరాణా సరుకులు, నిత్యావసర వస్తువులను నిమిషాల్లో డెలివరీ చేస్తామని హామీ ఇస్తున్న క్విక్ కామర్స్ బిజినెస్ పట్టణ ప్రాంతాల్లో వేగంగా ప్రజాదరణ పొందుతోంది. ఇప్పటికే బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్, జెప్టో.. వంటి సంస్థలు ఈ సర్వీసులు అందిస్తున్నాయి. అయితే ఈ బిజినెస్‌పై ప్రజాదరణతోపాటు విమర్శలు సైతం పెరుగుతున్నాయి. ఇందుకు కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.వ్యతిరేక పోటీ విధానాలుక్విక్ కామర్స్ సంస్థలు వ్యతిరేక పోటీ విధానాలను అనుసరిస్తున్నాయనే వాదనలున్నాయి. సాంప్రదాయ రిటైలర్లు, ముఖ్యంగా కిరాణా దుకాణాదారులపై క్విక్ కామర్స్ ప్రభావం భారీగా ఉంది. ఈ సంస్థలు అందించే డిస్కౌంట్లు, నేరుగా ఇంటికే డెలివరీ చేసే సేవలతో కిరాణాదారుల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. వినియోగదారులకు వేగంగా సర్వీసులు అందించేందుకు స్థానికంగా డార్క్ స్టోర్లను, చిన్న, ఆటోమేటెడ్ గోదాములను ఉపయోగిస్తున్నాయి.ఆకర్షణీయ ధరలుసాంప్రదాయ రిటైల్ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్ కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటం సైతం కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. క్విక్ కామర్స్ వినియోగం 2024-25లో 74% వృద్ధి నమోదు చేయనుంది. 2023–28 మధ్యలో 48% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.విదేశీ పెట్టుబడుల దుర్వినియోగంక్విక్ కామర్స్ వాణిజ్యం పెరగడం స్థానిక రిటైలర్లకు గొడ్డలిపెట్టుగా మారింది. సౌలభ్యం, తక్కువ ధరలకు ఆకర్షితులైన చాలా మంది వినియోగదారులు తమ షాపింగ్ అలవాట్లను మార్చుకుంటున్నారు. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మార్పు ఫలితంగా సాంప్రదాయ దుకాణాల్లో అమ్మకాలు తగ్గిపోయాయి. రిటైల్ మార్కెట్‌ను పూర్తి తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు విదేశీ పెట్టుబడులను దుర్వినియోగం చేస్తున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఆరోపించింది.ప్రభుత్వ సంస్థల దర్యాప్తుక్వాక్ కామర్స్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాలపై ఆందోళనలు ఉన్నాయి. ఈ సంస్థలు పోటీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్న ఆరోపణలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లు ధరలను కట్టడి చేస్తూ పోటీ చట్టాలను ఉల్లంఘించేలా ఇన్వెంటరీని నియంత్రిస్తున్నాయని సాంప్రదాయ రిటైలర్లు పేర్కొన్నారు. ఈ మేరకు వస్తున్న ఆరోపణలపై సీసీఐ తన దర్యాప్తును కొనసాగించడానికి మరింత వివరణాత్మక సాక్ష్యాలను కోరుతోంది.ఇదీ చదవండి: ఖో-ఖోకు పెరుగుతున్న స్పాన్సర్షిప్ఏం చేయాలంటే..ఈ ఆందోళనలపై స్పందించిన ప్రభుత్వం వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. రిటైలర్లకు నష్టం కలగకుండా, క్విక్ కామర్స్ సంస్థలు అంగీకరించేలా సమన్వయం చేస్తూ మార్గదర్శకాలు తయారు చేయాల్సి ఉంది. రిటైల్ వ్యవస్థలో భాగస్వాములందరి ప్రయోజనాలను పరిరక్షిస్తూనే సృజనాత్మకతకు మద్దతు ఇచ్చేలా పరిష్కారాలు కనుగొనాలి. -
కిరాణా కొట్లకు ‘క్విక్’ దెబ్బ
సాక్షి, అమరావతి: ఆన్లైన్ కొనుగోళ్ల సంస్కృతి పెరుగుతోంది. ఏ వస్తువు కావాలన్నా ప్రజలు ఆన్లైన్ వైపే చూస్తున్నారు. ఇటీవల మార్కెట్లోకి దూసుకొచ్చి¯]∙క్విక్ కామర్స్ సంస్థలు జెప్టో, బ్లింకిట్ వంటి కంపెనీలు వినియోగదారులు కోరుకున్న వస్తువులను 10 నిమిషాల్లోనే ఇంటికి డెలివరీ చేస్తున్నాయి. ఈ ప్రభావం కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. దీనివల్ల దేశవ్యాప్తంగా గత ఏడాది 2 లక్షల కిరాణా షాపులు మూతపడ్డాయి. ఈ విషయాన్ని ఆల్ ఇండియా కన్సూ్యమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ (ఏఐసీపీడీఎఫ్) నివేదిక వెల్లడించింది.క్విక్ కామర్స్ వల్లే..క్విక్ కామర్స్ (శీఘ్ర వాణిజ్యం) ప్లాట్‌ఫామ్‌ల రాకతోనే కిరాణా షాపులు మూతపడుతున్నట్టు ఏఐసీపీడీఎఫ్ అధ్యయనం వెల్లడించింది. దేశంలోని మెట్రో నగరాలతోపాటు చిన్నపాటి పట్టణాల్లోనూ క్విక్ కామర్స్ ఊపందుకోవడంతో పచారీ దుకాణాలు మూతపడుతున్నాయి. కాలు బయటకు పెట్టకుండా ఇంటికే వేగంగా సరుకులు రావాలని కోరుకుంటున్న వినియోగదారులు బ్లింకిట్, జెప్టో వంటి ఫాస్ట్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆర్డర్లు చేసేందుకు ఇష్టపడుతున్నారు.ఫలితంగా సంప్రదాయ కిరాణా షాపులు దెబ్బతింటున్నాయి. దేశం మొత్తం మీద సుమారు 1.30 కోట్ల కిరాణా షాపులు ఉంటే.. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ వల్ల కేవలం ఏడాది కాలంలోనే కనీసం 2 లక్షల కిరాణా స్టోర్లు, చిన్నాచితక రిటైల్ ఔట్లెట్లు మూతపడ్డాయి. ముఖ్యంగా మెట్రో నగరాలతోపాటు ప్రధాన నగరాల్లోని కిరాణా దుకాణాలపై క్విక్ కామర్స్ ప్రభావం ఎక్కువగా ఉందని ఏఐసీపీడీఎఫ్ స్పష్టం చేసింది. నగరాల్లోనే 45 శాతంమూతపడిన దుకాణాల్లో 45 శాతం మెట్రో నగరాల్లోనే ఉన్నాయి. ప్రధాన నగరాల్లో 30 శాతం, పట్టణాల్లో 25 శాతం కిరాణా షాపులు కనుమరుగయ్యాయి. క్విక్ కామర్స్ కంపెనీలు విస్తరిస్తున్న వేగానికి దశాబ్దాలుగా భారత రిటైల్ రంగానికి వెన్నెముకగా ఉన్న కిరాణా దుకాణాలు ఖాతాదారులను, లాభదాయకతను కోల్పోతున్నాయని ఏఐసీపీడీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్ పాటిల్ స్పష్టం చేశారు. తగ్గింపు ధరల పేరుతో ప్రజలను ఆకర్షిస్తున్న ఆన్లైన్ వాణిజ్య సంస్థలు కిరాణా షాపుల వినియోగదారులను కొల్లగొడుతున్నాయని తెలిపారు.40 నుంచి 60 శాతం వరకు తగ్గింపులతో వస్తువులను విక్రయించడం ఏ కంపెనీకి వాస్తవికమైనది లేదా స్థిరమైనది కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్విక్ కామర్స్ సంస్థల చట్టవిరుద్ధ ధరలపై విచారణ జరిపించాలని పాటిల్ డిమాండ్ చేశారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాసిన లేఖలో ఈ–కామర్స్, క్విక్ కామర్స్ భారీ తగ్గింపులపై ఏఐసీపీడీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధరలపై దర్యాప్తు చేయాలని కోరింది. క్విక్ కామర్స్ సంస్థల విస్తరణను అడ్డుకోకపోతే కిరాణా షాపులను కాపాడుకోవడం కష్టమని స్పష్టం చేసింది.అద్దెలు చెల్లించడం కష్టంగా ఉందిమాల్స్, డీమార్ట్, స్మార్ట్ బజార్, బిగ్ బాస్కెట్ వంటి సూపర్ మార్కెట్లు రావడంతో చిన్నచిన్న కిరాణా షాపుల్లో విక్రయాలు తగ్గిపోయాయి. ఆన్లైన్ సంస్థలు గ్రామీణ ప్రాంతాలకు సైతం డోర్ డెలివరీలు చేçస్తుండటంతో కిరాణా షాపులకు కొనుగోలుదారులు రావడం లేదు. వ్యాపారం లేక షాపుల అద్దెలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. సరుకులు, షాపుల నిర్వహణ కోసం చేసిన అప్పులు చెల్లించలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక వంటి కారణాలతో కిరాణా షాపులు మూతపడుతున్నాయి. – బొలిశెట్టి సత్యనాగ బాలరాజు, అధ్యక్షుడు, పెడన వర్తక సంఘం, కృష్ణా జిల్లాకిరాణా వ్యాపారాలకు గడ్డుకాలమేకిరాణా వ్యాపారులకు గడ్డుకాలం వచ్చింది. ఒకవైపు ఆన్లైన్ మార్కెట్, మరోవైపు చిన్న పట్టణాల్లో మెగా మార్ట్ల రాకతో దశాబ్దాల కాలంగా స్థానికంగా చేస్తున్న కిరాణా వ్యాపారాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆన్లైన్, మాల్స్ పోటీని తట్టుకుని నిలబడలేక నష్టాల బాట పట్టాం. అద్దె షాపుల్లో సిబ్బందితో నడిపే కిరాణా వ్యాపారాలు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వాస్తవానికి కిరాణా షాపుల్లో సరుకుల నాణ్యత చూసి కొనుక్కునే అవకాశంతోపాటు అరువు తీసుకునే వెసులుబాటు కూడా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. – అద్దంకి వెంకట శివప్రసాదరావు, కార్యదర్శి, భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్, పశ్చిమగోదావరి -
క్విక్ విస్తరణ!
క్విక్ కామర్స్ కంపెనీలకు దండిగా నిధులు లభిస్తుండటంతో విస్తరణ జోరు పెంచాయి. నగరాల్లో ఈ మోడల్ మంచి సక్సెస్ సాధించడంతో జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ తదితర సంస్థలు డార్క్ స్టోర్ల సంఖ్యను భారీగా పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. కిరాణాతో మొదలు పెట్టిన కంపెనీలు ఇప్పుడు నెమ్మదిగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, మేకప్, టాయ్స్ వంటి ఇతర ప్రొడక్టులను కూడా కార్ట్‌లోకి చేర్చుతున్నాయి. అయితే, బడా నగరాల్లో ఈ మైక్రో వేర్‌హౌస్‌ల కోసం స్థలాల వేట కష్టతరంగా మారుతోందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.సమీపంలోని ప్రాంతాలకు 30 నిమిషాల్లోపే ఆర్డర్లను డెలివరీ చేయడానికి వీలుగా ఏర్పాటు చేసే చిన్న స్థాయి గోడౌన్లను డార్క్ స్టోర్లుగా పేర్కొంటారు. కిక్కిరిసిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహరం. అయినప్పటికీ కంపెనీలు తగ్గేదేలే అంటున్నాయి. మరోపక్క, రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, క్విక్ డెలివరీ విషయంలో లోటుపాట్లు లేకుండా చూసేందుకు భారీ స్థాయిలో సిబ్బంది నియామకాలతో ఈ రంగంలో హైరింగ్ కళకళలాడుతోంది. చిన్న నగరాల్లో స్పీడ్... నగరాల్లోని కిక్కిరిసిన ప్రాంతాల్లో డార్క్ స్టోర్ల ఏర్పాటు సవాలుగా మారుతోందని జెప్టో సీఈఓ ఆదిత్ పలీచా చెబుతున్నారు. గత రెండు నెలల్లోనే బిలియన్ డాలర్లను (దాదాపు రూ.8,400 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా, చండీగఢ్, భువనేశ్వర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వేగంగా స్థలాలు దొరుకుతుండటంతో అక్కడ విస్తరణ స్పీడ్ పెంచుతున్నామని పలీచా పేర్కొన్నారు. ‘ఈ రంగంలోకి నిధులు పుష్కలంగా వస్తున్నాయని పసిగట్టిన స్థిరాస్తి యజమానులు అద్దెలు భారీగా పెంచేస్తున్నారు.కొన్నిచోట్ల పోటీ కారణంగా బిడ్డింగ్‌లో పాల్గొనాల్సి వస్తోంది’ అని పలీచా వివరించారు. జొమాటో బ్లింకిట్ సైతం భటిండా, హరిద్వార్, విజయవాడ వంటి నగరాల్లో అడుగుపెట్టింది. కస్టమర్లకు వేగంగా సేవలదించేలా డార్క్ స్టోర్ల సైజును కంపెనీలు పెంచుతున్నాయి. గతంలో సగటున 2,500 చదరపు అడుగులున్న ఈ స్టోర్ సైజు 4,000–5,000 చ.అ.కు పెరిగింది. కొన్నిచోట్ల 10,000 చ.అ., మరికొన్ని చోట్ల ఏకంగా 25,000 చ.అ. డార్క్ స్టోర్లు కూడా ఏర్పాటవుతుండటం ఈ రంగంలో జోరుకు నిదర్శనం.‘అమ్మతోడు అరగంటలోపే డెలివరీ చేసేస్తాం’ క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో స్లోగన్ ఇది! ఇందుకు తగ్గట్టుగానే శరవేగంగా దూసుకెళ్తున్న క్విక్ కామర్స్ రంగంలో కంపెనీలు నువ్వానేనా అనేలా తలపడుతున్నాయి. బంపర్ వేల్యుయేషన్లతో ఈ రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతుండటంతో సేవలను ‘క్విక్’గా విస్తరించేందుకు పోటీ పడుతున్నాయి. సిబ్బంది నియామకాలతో పాటు డార్క్ స్టోర్ల సంఖ్య, సైజును కూడా భారీగా పెంచుకుంటున్నాయి. దీంతో కస్టమర్లకు మరిన్ని ఉత్పత్తులు లభించడంతో పాటు మరింత వేగంగా సేవలు లభించేందుకు దోహదం చేస్తోంది.రూ. 300-500 : సగటు ఆర్డర్ విలువ (గతంలో ఇది 200–250గా ఉండేది)4,000 చ. అ. : డార్క్ స్టోర్ ప్రస్తుత సగటు సైజు (అంతక్రితం 2,500 స్థాయిలో ఉండేది). కొన్ని ఏరియాల్లో 10,000 చ. అ. స్టోర్లు కూడా ఉన్నాయి.హైరింగ్.. ఫుల్ స్వింగ్ ‘క్విక్’ విస్తరణ నేపథ్యంలో సిబ్బంది డిమాండ్ తారస్థాయికి చేరుకుంది. ‘ఈ రంగంలో అన్ని విభాగాల్లోనూ హైరింగ్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తోంది. ఐదు ప్రధాన కంపెనీలు అగ్ర స్థానం కోసం పోటీ పడుతుండటమే దీనికి ప్రధాన కారణం. ప్రధానంగా లాజిస్టిక్స్ ఇక్కడ అత్యంత కీలక పాత్ర పోషిస్తుండటంతో ఇతర కంపెనీల్లోని నిపుణులైన ఉద్యోగులకు గాలం వేస్తున్నాయి’ అని ఒక క్విక్ కామర్స్ సంస్థ చీఫ్ వెల్లడించారు. ‘మినిట్స్’ పేరుతో లేటుగా ఈ విభాగంలోకి అడుగుపెట్టిన ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాల వేగం పెంచేందుకు బిగ్‌బాస్కెట్ వంటి ఇతర కంపెనీల నుంచి చాలా విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క, బిగ్‌బాస్కెట్ సైతం పూర్తి స్థాయి క్విక్ కామర్స్ మోడల్లోకి మారే ప్రయత్నాల్లో ఉండటం విశేషం. ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేశ్ ఝా ఇటీవలే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీఈఓగా చేరారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు మధ్య స్థాయి మేనేజర్లకు డిమాండ్ నెలకొంది. క్యూ–కామర్స్‌లోని మార్కెటింగ్, ఆపరేషన్స్, సప్లయ్ చైన్, ఫైనాన్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ వలసలు జోరందుకోవడం గమనార్హం. జెప్టో కూడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, స్విగ్లీ, ఓలా, అర్బన్ కంపెనీ తదితర కంపెనీల నుంచి కీలక సిబ్బందిని భారీగా నియమించుకుంటోంది. కంపెనీ ప్రధాన కేంద్రాన్ని బెంగళూరు నుంచి మంబైకి మార్చే సన్నాహాల్లో ఉన్న జెప్టో.. 500 మంది ఎగ్జిక్యూటివ్‌ల వేటలో ఉన్నట్లు పలీచా తెలిపారు. -
వీమార్ట్ చేతికి లైమ్‌రోడ్
న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ లైమ్‌రోడ్‌ను సొంతం చేసుకున్నట్లు ఫ్యాషన్ రిటైలర్ వీమార్ట్ రిటైల్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. తద్వారా ఓమ్నీ చానల్ విభాగంలో కార్యకలాపాలను విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది. డీల్‌లో భాగంగా ఒకేసారి 31.12 కోట్ల నగదును చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు ఏఎం మార్కెట్‌ప్లేసెస్(లైమ్‌రోడ్)తో స్లంప్ సేల్ పద్ధతిలో వ్యాపార బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! రెండు సంస్థల మధ్య కుదిరిన అంగీకారం ప్రకారం లైమ్రోడ్కు చెందిన రూ. 14.61 కోట్ల ఆస్తులు, రూ. 36.26 కోట్ల లయబిలిటీలు సైతం బదిలీకానున్నట్లు తెలియజేసింది. 2022 మార్చితో ముగిసిన గతేడాదిలో లైమ్‌రోడ్ రూ. 69.31 కోట్ల ఆదాయం సాధించినట్లు తెలియజేసింది. ప్రస్తుతం మహిళా విభాగం అమ్మకాలు ఆదాయంలో 65 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు వివరించింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
చిరుద్యోగి నుంచి సీయీవో దాకా!
జనబాహుళ్యంలోకి ఆన్లైన్ మార్కెట్ వచ్చాక తయారీదారుల నుంచి కస్టమర్ల దాకా ఆందరూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కామర్స్ మార్కెట్‌ను సరిగ్గా ఒడిసి పట్టుకుంటే అందనంత ఎత్తుకు ఎదగవచ్చని గ్రహించిన ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ వినూత్న ఆలోచనలతో అనుబంధ సంస్థను దేశంలోని టాప్ ఫైవ్ కంపెనీలలో ఒకటిగా నిలబెట్టింది. కంపెనీలో కంటెంట్ రైటర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టి, అనతికాలంలోనే ‘వీ కమిషన్’ కంపెనీకి సీఈఓ అయిన ఎంట్రప్రెన్యూర్ మరెవరో కాదు పారుల్ తరంగ్ భార్గవ. పదేళ్లుగా కంపెనీ సీఈఓగా విజయవంతంగా రాణిస్తూ తాజాగా గ్లోబర్ అఫిలియేట్ నెట్వర్క్ కేటగిరిలో ‘‘ప్రామిసింగ్ ఉమెన్ సీఈఓ ఆఫ్ ద ఇయర్– 2022 విశేష సత్కారం అందుకుని నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది పారుల్. ఏంజిల్ ఇన్వెస్టర్, స్పీకర్, లీడర్, వీ కమిషన్ సహవ్యవస్థాపకురాలు పారుల్ తరంగ్ భార్గవ ఢిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. తల్లిదండ్రుల మాట జవదాటకుండా నడుచుకునేది. స్కూలు విద్యాభ్యాసం అంతా ఆడుతూ పాడుతూ గడిపిన పారుల్కు... కాలేజీ చదువులు ప్రారంభమయ్యాక అసలైన ప్రçపంచం మనిషి మనుగడ, పేరు ప్రఖ్యాతులకోసం పడే తాపత్రయం, ఉన్నతంగా ఎదగడానికి ఎదుర్కోవాల్సిన పోటీని ప్రత్యక్షంగా తెలుసుకుంది. గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్శిటీలో బిటెక్(ఐటీ) చదివే సమయంలోనే ప్రస్తుత జీవిత భాగస్వామి గురుగావ్‌కు చెందిన తరంగ్ భార్గవ పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం, తర్వాత ప్రేమ చిగురించి జీవిత భాగస్వాములయ్యారు. వీకమిషన్.. ఇంజినీరింగ్ అయ్యాక తరంగ్ 2006లో పేరిట ‘వీకమిషన్’ అఫిలియేట్ కంపెనీని ప్రారంభించారు. వివిధ ఈ కామర్స్ కంపెనీలకు అనుబంధ మార్కెటర్స్‌ను అందించడమే ఈ కంపెనీ ముఖ్యమైన పని. దీనిలో కంటెంట్ రైటర్‌గా చేరింది పారుల్. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే ప్రస్తుత మార్కెట్ ట్రెండింగ్ అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వీ కమిషన్ ఎదుగుదలకు సరికొత్త ఐడియాలను అన్వేషించి అమలు చేసేది. దీంతో వీ కమిషన్ అభివృద్ధి బాట పట్టింది. ఈ కామర్స్ మార్కెట్లో తనదైన ముద్రవేయడంతో 2008లో వీ కమిషన్‌కు సహవ్యవస్థాపకురాలిగా మారింది పారుల్. నమ్మకాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా.. ఇండియన్ అఫిలియేట్ మార్కెట్లపై విదేశీ కంపెనీలకు మంచి అభిప్రాయం లేదని గ్రహించిన పారుల్ ముందుగా ఆయా కంపెనీల నమ్మకాన్ని గెలుచుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే యూఎస్, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలను లక్ష్యంగా పెట్టుకుని చిగురుటాకులా ఉన్న వీకమిషన్‌ను అనతి కాలంలోనే అతిపెద్ద కంపెనీగా నిలబెట్టింది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న పాపులర్ అఫిలియేట్ ప్లాట్‌ఫామ్‌లలో వీ కమిషన్ కూడా ఒకటి. యాడ్‌వేస్ వీసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎయిర్టెల్, ఫ్లిప్‌కార్ట్, ఈబే, అమెజాన్, డోమినోస్, ఏసియన్ పెయింట్స్, పీఅండ్‌జీ వంటి ప్రముఖ కంపెనీలకు అనుబంధంగా వీ కమిషన్ పనిచేస్తోంది. ఈ– కామర్స్, ట్రావెల్, ఫైనాన్స్, ఇన్సురెన్స్, ఐ గేమింగ్, నేచురల్ ప్రోడక్ట్స్, డొమైన్ కంపెనీలకు అఫిలియేటర్‌గా, వాల్‌మార్ట్, అలీబాబా, మింత్రా, అగోడా, షాపీ, ఖతార్ ఎయిర్వేస్కు అనుబంధంగా పనిచేసింది. పది స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. ఇలా అనేక పరిశ్రమ వర్గాల నమ్మకాన్ని చూరగొని 2015లో టాప్–50 అలెక్సా ర్యాంకింగ్స్‌లో ఒకటిగా నిలిచింది. చకచకా దూసుకుపోతూ దశాబ్దకాలంలోనే ల„ý ల నెట్వర్క్ అఫిలియేట్స్‌ను చేరుకుని 80 మిలియన్ల నెలవారి ట్రాఫిక్, నెలకు రెండు బిలియన్ల జీఎమ్‌వీతో ఏషియాలోనే అతిపెద్ద కంపెనీగా వీ కమిషన్ నిలవడానికి పారుల్ ఇచ్చిన సలహాలు, సూచనలు, టిప్పులు ట్రిక్స్, కృషే కారణం. బెస్ట్ ఈ–కామర్స్ కంపెనీగా... ప్రస్తుతం అంతా ఆన్లైన్ మార్కెట్ నడుస్తోంది. ఆయా ఈ కామర్స్ యాజమాన్యాల దగ్గర నుంచి వస్తువుల లింక్ తీసుకుని వివిధ అనుబంధ మార్కెటర్స్‌తో విక్రయించడమే అఫిలియేట్ చేసే పని. ఇలా లక్షలమంది అఫిలియేట్ మార్కెటర్స్‌ను జాతీయ అంతర్జాతీయ కంపెనీలకు పనిచేసేలా చేయడంతో, ఈ కామర్స్ ఫ్లాట్‌ఫాంకు మంచి లాభాలు వచ్చాయి. ఈ కామర్స్ కంపెనీల నమ్మకాన్ని చూరగొనడంతో మా వీకమిషన్ బెస్ట్ ఈ కామర్స్ కంపెనీగా నిలిచింది. కస్టమర్ల అభిరుచులు తెలుసుకుని విభిన్నంగా ఆలోచిస్తే ఎవరైనా మంచి ఎంట్రప్రెన్యూర్‌గా ఎదగవచ్చు. – పారుల్ తరంగ్ భార్గవ్, ‘వీకమిషన్’ సిఈఓ -
రుచిలో మేటి మాడుగుల హల్వా
కాకినాడ కాజాకు, బందరు లడ్డూకు.. ఆత్రేయపురం పూతరేకులకు.. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో మధురమైన ప్రత్యేకత ఉంటుంది. మప విశాఖ జిల్లా పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది నోరూరించే మాడుగుల హల్వా. పేరులోనే కాదు రుచిలో కూడా దీనికి సాటి మరొకటి లేదని చెప్పక తప్పదు. ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో 132 ఏళ్ల క్రితం పుట్టిన ఈ హల్వా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు వ్యాపించింది. వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. మాడుగుల: మాడుగులలో 1890లో ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో పుట్టిన హల్వా నేడు విదేశాల్లో సైతం నోరూరిస్తోంది. మాడుగుల అంటే హల్వాగానే ఖ్యాతి పెరిగింది. గతంలో హల్వా మాడుగులలోనే లభ్యమయ్యేది. ప్రస్తుతం ఆన్లైన్ మార్కెట్ కూడా విస్తరించింది. ఆన్లైన్ ఆర్డరిస్తే ఎంత దూరమైనా హల్వా పంపించే స్థాయికి మార్కెట్..నెట్వర్క్ అభివృద్ధి చెందింది. జీడి, బాదం పలుకులతో పాటు కవ్వంతో చిలికిన ఆవు నెయ్యి, ఎండు ఖర్జూరం నీళ్లు, తేనే..గోధుమ పాలుతోపాటు రాతి రుబ్బి రాయితో గంటలు పాటు సాన పట్టి కర్రలు పొయ్యిలో తగిన ఉష్ణోగ్రతలో తగిన పాకంతో పదునుపట్టగానే పుట్టుకొచ్చేదే మాడుగుల హల్వా. సినీతారలు ఫిదా అరకు, పాడేరు ప్రాంతాల్లో జరిగే సినీ షూటింగ్‌లకు ప్రముఖ హీరోహీరోయిన్లు మాడుగుల హల్వా రుచికి ఫిదా అయినవాళ్లే. హల్వాను లొట్టలేసుకుని తిన్నవారే..అందుకే ఈ ప్రాంతానికి సినీ తారలు ఎవరొచ్చినా కచ్చితంగా హల్వా రుచి చూడకుండా వెళ్లరు. పర్యాటక ప్రాంతాలు వీక్షించేందుకు వచ్చే పర్యటకులు మాడుగుల హల్వా రుచి చూడకుండా వెళ్లరు. విశాఖ అందాలను చూసేందుకు ఎంత ఉవ్విళ్లూరతారో.. మాడుగుల హల్వా తినేందుకు కూడా అంతే ఆసక్తి కనబరుస్తారు. అందుబాటులో ధరలు మాడుగులలో మేలు రకం కిలో రూ 500కాగా రెండో రకం కిలో రూ.400. స్థానిక వ్యాపారంతో పాటు పార్సిల్ ద్వారా ఇతర ప్రాంతాలకు ప్రతి రోజు ఎగుమతి జరుగుతోంది. మాడుగులలో ఒకప్పుడు దంగేటి వారి హల్వా షాపు ఒక్కటే ఉండేది. దంగేటి కుటుంబం మాత్రమే తయారీ చేసేవారు. తయారీ గుట్టురట్టవ్వడంతో మాడుగుల పట్టణానికి చెందిన దాసరి కుటుంబీకులు కూడా హల్వా పాకం, పదునును కనిపెట్టడంతో ప్రస్తుతం సుమారు 20 షాపులకుపైగా ఏర్పాటయ్యాయి. విదేశాలకు హల్వా రుచులు మాడుగులకు చెందిన కొందరు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పండగలకు, శుభకార్యాలకు మాడుగుల వచ్చి తిరిగి వెళ్లేటప్పుడు విదేశీ స్నేహితుల కోసం హల్వా తీసుకువెళ్లడం..ఆ రుచికి వారు మైమరచిపోవడం ఈ స్వీటుకున్న క్రేజ్ తెలియజేస్తుంది. హైదరాబాద్ చిత్రపురి హౌసింగ్ సొసైటీ జనరల్ సెక్రటరీ, సినీ నటుడు కాదంబరి కిరణ్‌కు మాడుగుల హల్వా అంటే చెప్పలేని ఇష్టం. అంతేకాదు చిత్రపురి కార్మికులకు తన స్నేహితుడైన కేజేపురం గ్రామానికి చెందిన పుట్టా ప్రసాద్ బాబుతో హల్వా రప్పించి పంపిణీ చేస్తుంటారు. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, భద్రాచలం, చెన్నై లాంటి నగరాల్లో కార్తీక ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, కోటి దీపాలంకరణ సమయాల్లో ఇక్కడ నుంచి హల్వా తీసుకెళ్లి వందలాది మంది నిరుద్యోగులు జీవనం సాగిస్తుంటారు. హల్వా టర్నోవర్ సాధారణ రోజుల్లో ఒక్కో షాపులో రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు విక్రయిస్తారు. పండగ, పర్యాటకుల రద్దీ ఉన్న సమయాల్లో రూ.4 వేలకు పైగా వ్యాపారాలు జరుగుతాయి. ఈ ఒక్కో షాపు నెలకు రూ.5లక్షలకు పైగానే వ్యాపారం సాగిస్తోంది. 5 వేల మందికి ఉపాధి మాడుగుల కేంద్రంగా తయారయ్యే హల్వా వ్యాపారంపై ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5 వేల మందికి పైగా నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ నుంచి విశాఖ, అనకాపల్లి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వరకు ఎగుమతి చేస్తున్నారు. హల్వా సృష్టి కర్త దంగేటి ధర్మారావు నుంచి అతని కుమారుడు, మనుమలు, ముని మనవళ్లు హల్వా తయారీలో నిష్ణాతులు. తరాలు మారుతున్న హల్వా రుచి ఏ మాత్రం తగ్గలేదు. మాడుగుల నుంచి ఢిల్లీ తదితర ప్రాంతాలకు ప్రతి రోజు హల్వా విక్రయాలు జరుగుతూనే ఉంటాయి. అరకు షూటింగ్‌కు వచ్చిన అల్లు అర్జున్, విజయశాంతి, రాజకీయ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సైతం నాటి పాదయాత్ర సమయంలో మాడుగుల హల్వా రుచి చూశారని వ్యాపారులు దంగేటి మోహన్ , దాసరి ప్రసాద్ చెబుతున్నారు. అలాగే నాటి ప్రధాని ఇందిరా గాంధీ గత 40 ఏళ్ల క్రితం ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు హల్వా రుచి చూసి..ఢిల్లీకి పంపాలని అప్పటి సీనియర్ నాయకుడు వేమరవపు వెంకటరమణకు చెప్పారట. అంతలా మాడుగుల హల్వా రుచి అందరి మనసు గెలుచుకుంది. పోస్టల్ కవర్ పై .. విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలిసారి తయారు చేసే హల్వాకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. మాడుగుల వాసులు తయారు చేసే ఈ రకమైన హల్వాకు లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఉందని అంతర్జాతీయంగా కూడా ప్రచారం జరిగింది. గోధుమ పాలు, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు వంటి వాటితో మాడుగుల వాసులు తయారు చేసే హల్వా కూడా తపాలా శాఖ విడుదల చేసిన పోస్టల్ కవర్ల పై ఉండటంతో విస్తృత ప్రచారం జరుగుతోంది. మాడుగుల టు ప్యారిస్ మాది విశాఖ జిల్లా మాడుగుల మండలం సత్యవరం గ్రామం. ఉద్యోగరీత్యా ప్యారిస్‌లో 8 ఏళ్లుగా స్థిరపడ్డాం. మాడుగుల ఎప్పుడు వచ్చినా హల్వా తీసుకెళ్లి ప్యారిస్‌లో ఉన్న స్నేహితులకు ఇస్తుంటా..ఇండియా వచ్చినప్పుడు హల్వా మర్చిపోవద్దు అంటూ స్నేహితులు పదేపదే చెబుతుంటారు. –గోపిశెట్టి వెంకటేష్, మెకానికల్ ఇంజనీర్, ప్యారిస్ తరాలుగా ఒకటే రుచి తాతలు నాటి క్వాలిటీని నేటికీ కొనసాగిస్తున్నాం. ఆవు నెయ్యి, బాదం జీడి పలుకులు, గోధుమ పాలతో చేసే హల్వా రుచి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అందుబాటు «ధరల్లో విక్రయాలు జరుపుతున్నాం. హల్వా తయారీలో మా ముత్తాత ధర్మారావు టెక్నిక్ అనుసరిస్తున్నాం. అందుకే రుచిలో ఒకలా ఉంటుంది. –దంగేటి మోహన్,హల్వా తయారీదారుడు మాడుగుల -
Meesho: ‘మీ షో యాప్’ ఫౌండర్ విదిత్ ఆత్రే సక్సెస్ స్టోరీ!
Meesho is the freshest Organization to join the Unicorn Club: కిందపడ్డప్పుడు ‘అయ్యో!’ అనుకుంటారు అందరు. ‘ఎందుకు పడ్డాం?’ అని ఆలోచిస్తారు కొందరు. రెండో కోవకు చెందిన వారు కాస్త లేటయినా ఘాటైన విజయం సాధిస్తారు.... ఇందుకు ఈ ఇద్దరే ఉదాహరణ... ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్న విదిత్ ఆత్రే ‘ఫోర్ట్స్’ జాబితాలోని యువ సంపన్నుల గురించి ఆసక్తిగా తెలుసుకునేవాడు. అలాంటి విదిత్ పవర్ఫుల్ ఫోర్బ్స్ ‘30 అండర్ 30’ ఏషియా జాబితాలోకి రాడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇక కాస్త వెనక్కి వెళితే... చదువు పూర్తయిన తరువాత మంచి ఉద్యోగాలే చేశాడు విదిత్. ఆ సమయంలోనే అతడికొక మంచి ఆలోచన వచ్చింది. ఆన్లైన్ మార్కెటింగ్ కోసం యాప్ మొదలుపెడితే ఎలా ఉంటుంది? అని. అయితే తన ఆలోచనకు పెద్దగా మద్దతు లభించలేదు. ‘చాలా కష్టం’ అన్నవాళ్లే ఎక్కువ. దిల్లీ కాలేజీలో తన బ్యాచ్‌మేట్ సంజీవ్ బర్నావాల్ కూడా తనతో పాటే ‘ఫోర్బ్స్’ జాబితాలో చోటు సంపాదించాడు. కాస్త వెనక్కి వెళితే...తన చదువు పూర్తి అయిన తరువాత జపాన్‌లోని సోనీ కంపెనీలో మంచి ఉద్యోగం చేశాడు సంజీవ్. ఇండియాలో ఉన్న విదిత్, జపాన్‌లో ఉన్న సంజీవ్ తమ ఆలోచనలను కలిసి పంచుకునేవారు. వారి ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చిన తరువాత బెంగళూరులో హైపర్ లోకల్ ఫ్యాషన్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ ‘ఫ్యాష్‌నియర్’తో రంగంలోకి దిగారు. తామే స్వయంగా కరపత్రాలు పంచినా, కస్టమర్ల దగ్గరకు వెళ్లి ‘మీరు కష్టపడి షాప్‌కు రావాల్సిన అవసరం లేదు. మా యాప్ విజిట్ చేస్తే చాలు’ అని చెప్పినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మొదటి ప్రయత్నం విజయవంతంగా ఫ్లాప్ అయింది. అలా అని ‘చలో బ్యాక్’ అనుకోలేదు. తమ పని గురించి సూక్ష్మంగా విశ్లేషించుకున్నారు. అప్పుడు వారికి అర్ధమైందేమిటంటే ఫ్యాషన్ మార్కెట్‌కు ఉండే ‘వైడ్‌రేంజ్ ఆప్షన్స్’ వల్ల తమ ప్రయత్నం విజయవంతం కాలేదని. ఆ సమయంలోనే వారి ఆలోచనలు చిన్నవాపారుల చుట్టూ తిరిగాయి. సాధారణంగా చిన్న వ్యాపారులకు సొంత వెబ్సైట్లు ఉండవు. అలా అని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్...లాంటి పెద్ద వేదికల దగ్గరికి వెళ్లరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఫ్యాష్‌నియర్’కు శుభం కార్డు వేసి ‘మీ షో’(మేరీ షాప్–మై షాప్) యాప్‌ను డిజైన్ చేశారు. చిన్నవ్యాపారులకు ఇదొక అద్భుతమై మార్కెట్ ప్లేస్‌గా పేరు సంపాదించుకుంది. తమ ప్రాడక్స్‌ను యాడ్ చేయడానికి, వాట్సాప్,ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సులభంగా షేర్ చేయడానికి, సులభంగా యూజ్ చేయడానికి ‘బెస్ట్’ అనిపించుకుంది మీ షో. డెలివరీ, మానిటైజ్ల ద్వారా సెల్లర్స్ నుంచి కమీషన్ తీసుకుంటుంది మీ షో. ఈ ప్లాట్ఫామ్లో ప్రతి నెల సెల్లర్స్ సంఖ్య పెరుగుతుంది. చిన్న వ్యాపారుల కోసం ఏర్పాటయిన ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ పెద్ద విజయం సాధించింది. మన దేశంలోని లార్జెస్ట్ సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్లో ఒకటిగా నిలిచింది. విదిత్, సంజీవ్‌లను రైజింగ్స్టార్లుగా మార్చింది. చదవండి: Men's Day 2021: పక్కా జెంటిల్మన్ ఎలా ఉండాలో తెలుసా!.. అదే జెంటిల్‌నెస్.. -
భారీ అవకాశాలు: డిజిటల్ హబ్‌గా విశాఖ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలో రోజురోజుకీ ఆన్లైన్ మార్కెట్ వ్యాపారం గణనీయంగా పెరుగుతోంది. కొన్నాళ్ల కిందటి వరకూ క్రమంగా ఒక పద్ధతిలో విస్తరిస్తూ వచ్చిన ఆన్లైన్ రంగం... కోవిడ్‌తో ఆకాశమే హద్దు అన్నట్లు పెరిగిపోయింది. ఆన్లైన్ వ్యవస్థే సమూలంగా మారిపోయింది. ఇంట్లో సరుకులు మొదలు... ఇతరత్రా వస్తువులు... తినే భోజనం... కాఫీ, టీ కూడా ఆన్లైన్లోనే ఆర్డరు చేసే పరిస్థితులు బాగా పెరిగిపోయాయి. మరోవంక సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచార వ్యూహాన్నీ మార్చాయి. పెద్ద ఎత్తున డిజిటల్ ప్రచారానికి వెచ్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ఆన్లైన్ వినియోగదారుల అభిరుచులను కనుక్కోవడంతో పాటు ఎటువంటి ఉత్పత్తుల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు? ఎలాంటి ఉత్పత్తుల కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు? వంటి డేటా కంపెనీలకు ఇంధనంగా మారుతోంది. సరిగ్గా ఈ అవసరమే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌కు.. సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే ‘మార్కెట్ ప్లేస్ మేనేజ్మెంట్’కు డిమాండ్‌ను పెంచుతోంది. రాష్ట్ర పరిపాలన రాజధానిగా మారుతున్న విశాఖపట్నంలో ఇప్పటికే పలు కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తున్నాయి. ఈ రంగానికి సంబంధించిన మానవ వనరులు కూడా ఇక్కడ పుష్కలంగా లభిస్తుండటంతో విశాఖలో రాబోయే రోజుల్లో ఈ రంగం మరింతగా విస్తరిస్తుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఐటీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్ల మార్కెట్ ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ మార్కెటింగ్ వార్షిక కార్యకలాపాలు 300 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అత్యంత వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా వచ్చే ఐదేళ్లలో డిజిటల్ మార్కెటింగ్ కార్యకలాపాల విలువ ఏకంగా ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని పలు సంస్థలు అంచనాలు వేశాయి. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఇవి మరింత పెరిగే అవకాశాలూ లేకపోలేదన్నది నిపుణుల మాట. దీంతో ఐటీ ఆధారిత సేవలందిస్తున్న సంస్థలు కూడా డిజిటల్ మార్కెటింగ్ వైపు దృష్టి సారిస్తున్నాయి. రాష్ట్రంలో మిగిలిన నగరాలతో పోలిస్తే విశాఖలోనే ఐటీ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయనే అంశం నిర్వివాదం. గతంలో ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించినా... ఆ తరవాత నిపుణుల కొరత వంటి పలు కారణాలతో తమ కార్యకలాపాలను తగ్గించేసుకున్నాయి. డిజిటల్ మార్కెటింగ్‌కు వచ్చేసరికి మాత్రం ఇప్పటికే ఇక్కడ పలు సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రిటైల్, హెల్త్, టెక్స్టైల్ బిజినెస్ రంగాల్లోని కంపెనీలకు సేవలందిస్తున్నాయి. వీటిలో హెల్త్‌టెక్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ రంగంలో విస్తరిస్తున్న పల్సస్ గ్రూపు ఇప్పటికే ఇక్కడ 2,500 మందికి ఉపాధి కల్పించింది. ఈ సంస్థకు దేశంలో గుర్గావ్, చెన్నై, హైదరాబాద్‌లో కేంద్రాలున్నా విశాఖ కేంద్రంలో 65 శాతం మహిళలే ఉండటం గమనార్హం. ఇక డబ్ల్యూఎన్ఎస్, ఏజీఎస్ హెల్త్‌టెక్, ఏసీఎస్ హెల్త్‌కేర్ వంటి ఇతర కంపెనీలూ విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు ముందుకొచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. విశాఖలో ఇప్పటికే 4 వేల మందికి పైగా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉపాధి పొందుతుండగా... వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 20వేలకు చేరవచ్చనే అంచనాలున్నాయి. ‘‘వచ్చే ఐదేళ్లలో డిజిటల్ రంగ మార్కెట్ ట్రిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలున్నాయి. దీన్లో కనీసం 2 శాతంపై ఏపీ దృష్టి సారించినా ఇక్కడ కనీసం 20 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది’’ అనేది నిపుణుల మాట.. తద్వారా డిజిటల్ మార్కెటింగ్‌కు విశాఖ కేంద్రంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ అన్ని విధాలా అనుకూలం ఐటీ సేవల రంగమైతేనే ఎక్కువ మందికి ఉపాధి కల్పించగలం. దీనికి శిక్షణ పొందిన మానవ వనరులు కావాలి. డిజిటల్‌కూ అంతే. కొన్నాళ్లుగా మేం శిక్షణనిస్తూ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ 2,500 మంది పనిచేస్తున్నారు. నగరంలో డిజిటల్ మార్కెటింగ్ నిపుణుల లభ్యత కూడా పెరిగింది. పలు ఇతర కంపెనీలూ వచ్చాయి. నిజానికి ఏపీ ఐటీ నిపుణుల సంఖ్య లక్షల్లో ఉన్నా ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల్లోనే పనిచేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఐటీకి ప్రాధాన్యమివ్వటం, విశాఖ సహా 3 చోట్ల ఐటీ కాన్సెప్ట్ సిటీలు ప్రతిపాదించటం రాష్ట్రంలో ఈ రంగానికి ఊతమిస్తాయి. డిజిటల్‌పై ప్రభుత్వం దృష్టి పెడితే ఇక్కడి విద్యార్థులకు మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. – గేదెల శ్రీనుబాబు, పల్సస్ గ్రూపు సీఈవో విశాఖలో అపార అవకాశాలు డిజిటల్ మార్కెటింగ్‌కు విశాఖలో చాలా అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ వల్ల ప్రాధాన్యం పెరిగింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆన్లైన్లో ఉంది. ఇక్కడి నుంచి ప్రతి ఏటా కొన్ని వేల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. ఇక్కడ మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఈ రంగంలో కొన్ని కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మరిన్ని కంపెనీలకు అవకాశం ఉంది. – ఆర్ఎల్ నారాయణ, చైర్మన్, ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ఇన్వెస్ట్మెంట్ బ్రాండింగ్ కమిటీ డేటా చాలా కీలకం ఆన్లైన్ వ్యాపార రంగంలో ఉన్న కంపెనీలకు వినియోగదారుల అభిరుచులపై డేటా చాలా కీలకం. వారి అభిరుచులకు అనుగుణంగా వారు తమ వద్ద ఆయా ప్రొడక్ట్స్‌ను స్టాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు వినియోగదారుల డేటా చాలా కీలకం. దీన్ని విశ్లేషించడం అంత సులువు కాదు. నిపుణులు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడాలి. ఇందుకోసం మా ఉద్యోగులకు మేమే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో మార్కెట్ ప్లేస్ మేనేజ్మెంట్ రంగం చాలా కీలకంగా మారనుంది. – చమన్ బేడ్, ఏసీఎస్ హెల్త్‌టెక్ సీఈవో -
దుకాణం.. ఫర్ సేల్: అమ్మకం బోర్డు పెట్టిన 1,200 మంది!
న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు చిన్న వ్యాపారులు కుదేలయ్యారు! సుదీర్ఘ లాక్డౌన్లు, ఆంక్షలు, ప్రతికూల ఆర్థిక పరిస్థితులు అన్నీ కలసి చిన్న వ్యాపారాల పాలిట శాపంగా పరిణమించాయి. దీంతో వ్యాపారాలను నడపలేక వాటిని అమ్మేసి బయటపడదామనుకుంటున్నారు. ఒక ఆన్లైన్ మార్కెట్ పోర్టల్‌లో 1,200 మంది తమ వ్యాపారాలను విక్రయానికి పెట్టడం దీన్నే సూచిస్తోంది. లాక్డౌన్లతో వ్యాపారాలను కొనసాగించలేని పరిస్థితుల్లో ఉన్నకాడికి అమ్ముకుని ఊరట పొందేందుకు మొగ్గుచూపిస్తున్నారు. లాక్డౌన్ల ప్రభావం ఎక్కువగా చిన్న టూర్ (పర్యాటక) ఆపరేటర్లు, వ్యాయామ కేంద్రాలు (జిమ్‌లు), రెస్టారెంట్లు, ఈవెంట్ నిర్వహణ సంస్థలు, సెలూన్లు, ప్లే స్కూళ్లు, క్లౌడ్ కిచెన్లపై ఉన్నట్టు ఎస్‌మెర్జర్స్ అనే ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ డేటా తెలియజేస్తోంది. ‘‘సగటున ఒక్కో చిన్న వ్యాపార సంస్థ 2019–20తో పోలిస్తే 2020–21 ఆర్థిక సంవత్సరంలో 30 శాతం మేర ఆదాయం నష్టపోయాయి. ప్రధానంగా రెస్టారెంట్లు, సెలూన్లు, సూపర్మార్కెట్లు, వినోద కేంద్రాలకు అయితే ఆదాయం 90–95% పడిపోయింది’’ అని ఎస్‌మెర్జర్స్ వ్యవస్థాపకుడు విశాల్ దేవనాథ్ తెలిపారు. 2021లో భారీ మార్పు.. 2018లో ఎస్‌మెర్జర్స్ వేదికపై 3.37 లక్షల కంపెనీలు నమోదు చేసుకున్నాయి. 2019లో 3.86 లక్షల సంస్థలు సాయం కోరుతూ నమోదు చేసుకోవడం గమనార్హం. ఆ తర్వాత వీటి సంఖ్య 6.10 లక్షలు దాటిపోయింది. ఇందులో 32,000 కంపెనీలు 2019లో విక్రయానికి ఉంచినవి కాగా, 2020లో 36,000, 2021లో తొలి నాలుగు నెలల్లోనే 11,000కు వీటి సంఖ్య పెరిగిపోయింది. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇటీవలే నిర్వహించిన సర్వే ప్రకారం.. కరోనా కారణంగా 82 శాతానికి పైగా వ్యాపార సంస్థలు సమస్యలను ఎదుర్కొంటుండగా.. వీటిల్లో 70 శాతం సంస్థలు కరోనా ముందు నాటి డిమాండ్‌ను చేరుకునేందుకు కనీసం మరో ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిసింది. -
ఆన్లైన్లో మందుల విక్రయంపై నిషేధం
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఇకపై మందుల విక్రయాన్ని నిలిపివేయాలని సెంట్రల్ డ్రగ్స్ రెగ్యులేటర్ సంస్థ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇ–ఫార్మసీ సంస్థలన్నీ తక్షణమే ఇంటర్నెట్లో మందుల విక్రయాన్ని నిలిపివేయాలని కోరినట్టు ఆరోగ్య శాఖకు చెందిన ఒక అధికారి బుధవారం చెప్పారు. ఇ–ఫార్మసీ సంస్థల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిబంధనల్ని రూపొందించే పనిలో ఉంది. కేంద్ర నిబంధనలు అమల్లోకి వచ్చినంత వరకు ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలను నిలిపివేయాలంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వి.జి.సోమాని ఇటీవలే∙ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ కోర్టు తీర్పు అమలయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ డీసీజీఐ అన్ని రాష్ట్రాలు, యూటీలకు ఆదేశించారు. ఎలా జరిగిందంటే.. చట్టవిరుద్ధంగా, అనుమతుల్లేకుండా ఆన్లైన్లో యథేచ్ఛగా కొనసాగుతున్న మందుల విక్రయానికి అడ్డుకట్ట వెయ్యాలని జహీర్ అహ్మద్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో గత ఏడాది పిల్ వేశారు. ఇష్టారాజ్యంగా ఆన్లైన్లో మందులు కొనుగోలు చేసి వాడడం వల్ల రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ప్రజలు జీవించే హక్కుని కోల్పోతారని, వారి ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిల్‌ను విచారించిన హైకోర్టు 2018 డిసెంబర్లో ఆన్లైన్లో మందుల అమ్మకం నిలిపివేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో జహీర్ మళ్లీ కోర్టుకెళ్లారు. దీనిపై హైకోర్టు కేంద్రానికి, ఇ–ఫార్మసీ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు గత సెప్టెంబర్‌లో స్పందించిన ఇ–ఫార్మసీ కంపెనీలు ఆన్లైన్ విక్రయాలకు ఎలాంటి అనుమతులు, ప్రిస్క్రిప్షన్లు అవసరం లేదని కోర్టుకు చెప్పారు. స్విగ్గీలో ఆహార పదార్థాలు ఎలా ఇంటికి అందిస్తున్నారో తాము కూడా మందుల్ని డోర్ డెలివరీ చేస్తున్నట్టు వింత వాదన వినిపించారు. ఆ కంపెనీలు 8 లక్షలు! ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 కంపెనీలు ఆన్లైన్లో మందులు విక్రయిస్తున్నాయి. వీటికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. దేశవ్యాప్తంగా హోల్‌సేల్, రిటైల్ ఫార్మసీ కంపెనీలు 8 లక్షల వరకు ఉన్నట్టు ఒక అంచనా. ఆన్లైన్ అమ్మకాలతో తమ వ్యాపారాలకు దెబ్బ పడుతోందని ఫార్మసీ కంపెనీలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నాయి. ఇ–ఫార్మసీ కంపెనీలు ఇస్తున్న ఆఫర్లతో తాము వ్యాపారాలు మూసుకోవాల్సిన పరిస్థితులున్నాయని అంటున్నాయి. స్విగ్గిలో ఆహార పదార్థాల సరఫరా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల డోల్ డెలివరీ ఒకటి కాలేదని కేంద్రం స్పష్టం చేసింది. -
భారత్‌లోకి చైనా పెట్టుబడుల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లోని ఆన్లైన్ ట్రావెల్, హోటల్ వ్యాపార రంగాల్లోకి చైనా నుంచి పెట్టుబడులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. భారత్‌కు చెందిన అతిపెద్ద ఆన్లైన్ ట్రావెల్ సంస్థ ‘మేక్ మై ట్రిప్’లో 42.5 శాతం వాటాను చైనాకు చెందిన ఆన్లైన్ ట్రావెల్ సంస్థ ‘సీట్రిప్’ ఇటీవల కొనుగోలు చేసింది. దీంతో ‘మేక్ మై ట్రిప్’లో దాదాపు సగం వాటా సీట్రిప్ కైవసం అయింది. 2016లోనే మేక్ మై ట్రిప్‌లో 18 కోట్ల డాలర్ల పెట్టుబడులను పెట్టి కొంత వాటాను కొనేసింది. 2017లో దక్షిణాఫ్రికాకు చెందిన కాస్పర్స్ కంపెనీకి మేక్ మై ట్రిప్ విక్రయించిన వాటాను ఇప్పుడు సీట్రిప్ కొనుగోలు చేసింది. 2020కి ఆన్లైన్ ట్రావెల్ వ్యాపారం 3.3 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో ఈ డీల్ కుదిరింది. భారత్‌లోనే అతిపెద్ద బడ్జెట్ హోటళ్ల చైన్‌ను కలిగిన ‘ఓయో’, దాని ప్రత్యర్థి ‘ట్రీబో’లోకి ఇప్పటికే చైనా పెట్టుబడుదారులు ప్రవేశించారు. గురుగావ్ కేంద్రంగా పనిచేస్తున్న ‘హాపీ ఈజీ గో’ లాంటి చిన్న ట్రావెల్ కంపెనీలోకి కూడా చైనా పెట్టుబడులు వస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతోంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అవడం వల్ల, సమీప భవిష్యత్‌లో చైనా తర్వాత, అంతటి బలమైన ఆర్థిక వ్యవస్థ తయారవుతుందన్న అంచనాలతో ముందస్తుగానే చైనా పెట్టుబడులు వచ్చి పడుతున్నాయని ‘సెక్యూర్లీషేర్’ కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంస్థ ‘స్ట్రాటజీ, పాలసీ అండ్ కార్పొరేట్ డెవలప్మెంట్’ విభాగం అధిపతి విద్యా శంకర్ సత్యమూర్తి తెలిపారు. ‘మేక్ మై ట్రిప్’ ట్రావెల్ సంస్థ 2000 సంవత్సరంలో ఏర్పడింది. అది అప్పుడు కేవలం అమెరికా, భారత్ మధ్య పర్యటలపైనే దృష్టిని కేంద్రీకరించింది. మెల్లమెల్లగా మధ్య తరగతికి చెందిన భారతీయులు ఇతర విదేశీ పర్యటనలపై ఆసక్తి చూపిస్తుండడంతో వాటిపైనా దృష్టిని కేంద్రీకరించింది. దేశంలో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఇదొకటి. -
ఇండియా మార్ట్ ఐపీఓకు సెబీ ఓకే
ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, ఇండియామార్ట్ ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’... ఆమోదం తెలిపింది. ఈ కంపెనీతో పాటు అవన లాజిస్టెక్ కంపెనీ ఐపీఓకు కూడా సెబీ పచ్చజెండా ఊపింది. ఐపీఓలో భాగంగా ఇండియామార్ట్ కంపెనీ 42.88 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.600 కోట్లు సమీకరిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జెఫరీస్ ఇండియాలు వ్యవహరిస్తాయి. అవన లాజిసిస్టెక్ ఐపీఓ... అవన లాజిస్టెక్ కంపెనీ ఐపీఓలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో 43 లక్షల షేర్లను విక్రయించనున్నది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, కోల్డ్ స్టోరేజ్‌లు, గిడ్డంగిల నిర్మాణానికి, కంటైనర్ల కొనుగోళ్లకు వినియోగించుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్ కంపెనీలు వ్యవహరిస్తాయి. ఈ రెండు కంపెనీల ఐపీఓలకు ఆమోదంతో ఈ ఏడాది సెబీ ఆమోదం తెలిపిన ఐపీఓల సంఖ్య 50కు పెరిగింది. -
అమెజాన్ ‘సూపర్ మార్కెట్లు’!
న్యూఢిల్లీ: దేశీయ ఆన్లైన్ మార్కెట్లో ప్రధాన కంపెనీగా అవతరించిన అమెజాన్, ఆఫ్‌లైన్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఇందుకుగాను దేశీయ సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు, రిటైల్ కంపెనీల్లో ఒకదానిలో వాటా కొనుగోలు చేసేందుకు ప్రాథమిక సంప్రదింపులు మొదలు పెట్టింది. పెద్ద రిటైల్ సంస్థలు సైతం అమెజాన్‌తో చర్చించాయని, ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల దేశీయ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ మెజారిటీ వాటా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్ జరిగిన వెంటనే తన కంపెనీలో వాటాను బలమైన అంతర్జాతీయ రిటైలర్‌కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నానని ఫ్యూచర్ గ్రూపు వ్యవస్థాపకుడు కిషోర్బియానీ ప్రకటించారు. కిషోర్బియానీ ఇప్పటికే అమెజాన్‌తో, వాల్మార్ట్తోనూ సంప్రదింపులు జరపడం గమనార్హం. ఫ్యూచర్‌గ్రూపు బిగ్‌బజార్ సహా మరెన్నో బ్రాండ్లపై దుకాణాలు నిర్వహిస్తోంది. ఇక అమెజాన్‌తో ప్రాంతీయ సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్ సంస్థలు కూడా చర్చలు జరిపాయని ఆయా వర్గాలు వెల్లడించాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్–వాల్‌మార్ట్ డీల్‌తో ఈ వ్యవహారానికి సంబంధం లేదని, ఆఫ్‌లైన్ రిటైల్‌లోకి ప్రవేశించాలన్న ప్రయత్నాలు అమెజాన్ ఎప్పటి నుంచో కొనసాగిస్తున్నట్టు చెప్పాయి. ‘‘అమెజాన్ అమెరికాలో మాదిరిగానే భారత రిటైల్ మార్కెట్లో విస్తరించాలనుకుంటోంది. కొన్ని కంపెనీలతో సంప్రదింపులు ప్రాథమిక దశలో ఉన్నాయి. అన్నీ కుదిరితే భారీ రిటైలర్‌తో ఈ ఏడాది చివరికి డీల్ కుదరొచ్చు’’ అని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై అమెజాన్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. తొలుత చిన్నగానే... ‘‘తొలుత 10 నుంచి 15 శాతం వాటాను అమెజాన్ కొనుగోలు చేయాలనుకుంటోంది. దీనిపైనే చర్చిస్తోంది. తర్వాత మరిన్ని పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది. అవసరం అనుకుంటే మెజారిటీ వాటా కొనుగోలు చేస్తుంది. కానీ, ప్రస్తుతమైతే ఆఫ్‌లైన్ రిటైల్ ఎలా ఉంటుందో చూడాలన్నదే ప్రణాళిక. భారత్‌లో రిటైల్ చైన్ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలనుకుంటోంది. దీర్ఘకాలంలో శీతల గోదాములపై ఇన్వెస్ట్ చేస్తుంది. రైతుల నుం చి నేరుగా ఉత్పత్తులను సమీకరిస్తుంది. స్థానికంగా ఉత్పత్తి అయిన వాటిని విదేశాలకు షిప్ చేసే ప్రణాళికలతోనూ ఉంది. స్థానిక కంపెనీలు తయారు చేసిన వాటిని ఇప్పటికే విదేశాల్లో విక్రయిస్తోంది’’ అని ఆ వర్గాలు తెలిపాయి. గతేడాది సెప్టెంబర్‌లో షాపర్స్‌స్టాప్‌లో అమెజాన్ ఎన్వీ హోల్డింగ్స్ 1.79 బిలియన్ డాలర్లతో 5% వాటా కొనడం విదితమే. తన ఉత్పత్తులను అమెజాన్ డాట్ ఇన్‌లో విక్రయించేందుకు షాపర్స్‌స్టాప్ ఒప్పందం కూడా చేసుకుంది. అమెజాన్.ఇన్ ఇప్పటికే ఆన్లైన్లో గ్రోసరీ ఉత్పత్తులను విక్రయిస్తుండగా, ఆహార రిటైల్‌లో ఎఫ్‌డీఐకి కేంద్రం అనుమతినీ తీసుకుంది. జొమాటోపై సాఫ్ట్‌బ్యాంక్ కన్ను! వాల్‌మార్ట్‌లో తనకున్న వాటాలను భారీ విలువకు విక్రయించేందుకు డీల్ చేసుకున్న జపాన్ దేశ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సాఫ్ట్ బ్యాంకు ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోపై కన్నేసింది. జొమాటోలో పెట్టుబడులు పెట్టేందుకు గాను చర్చలు ప్రారంభించింది. ఈ వారం మొదట్లో ఇది జరిగినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడి చేశాయి. ఆరు నెలల క్రితం బెంగళూరుకు చెందిన మరో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో 200–250 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు సాఫ్ట్ బ్యాంకులు చర్చలు జరిపిన విషయం గమనార్హం. గతేడాది నవంబర్ నుంచి పలు మార్లు సంప్రదింపులు సాగించింది. అయితే, సాఫ్ట్‌బ్యాంకు నుంచి నిధులు సమీకరించే విషయంలో స్విగ్గీ ఇంకా చాలా ప్రారంభ దశలోనే ఉన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. సాఫ్ట్‌బ్యాంకు దేశీయ ఫుడ్ డెలివరీ మార్కెట్లో కీలక పాత్రను పోషించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు చెప్పాయి. కనీసం 200–400 మిలియన్ డాలర్ల మధ్య ఫుడ్ డెలివరీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నది సాఫ్ట్‌బ్యాంకు యోచనని, ఈ ఏడాది చివరి నాటికి ఇది కార్యరూపం దాల్చొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
ఆన్లైన్ మార్కెట్‌పై పతంజలి దృష్టి
న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రాందేవ్‌కి చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి... తాజాగా ఆన్లైన్ మార్కెట్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. సంస్థకు ఇప్పటికే పతంజలి ఆయుర్వేద్డాట్నెట్ పేరిట సొంత పోర్టల్ ఉన్నప్పటికీ.. మరిన్ని ఈ–కామర్స్ సంస్థలతో చేతులు కలపడం ద్వారా కార్యకలాపాలు మరింత విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా 8 ఈ–కామర్స్ సంస్థలతో జట్టు కట్టేందుకు కసరత్తు మొదలెట్టింది. స్వదేశీ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాల కోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్, బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్, షాప్‌క్లూస్, స్నాప్‌డీల్, 1ఎంజీ వంటి సంస్థలతో త్వరలో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పతంజలి ప్రతినిధి ఎస్.కె.తిజారావాలా ఇటీవలే మైక్రోబ్లాగింగ్ సైట్ ట్వీటర్లో చేసిన ట్వీట్ ఇందుకు ఊతమిస్తోంది. ఆన్లైన్లో భారీగా విస్తరించే దిశగా ప్రపంచంలోనే అతిపెద్ద ఈ–కామర్స్ కంపెనీలతో త్వరలో జట్టు కట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో అనేక పోర్టల్స్‌లో పతంజలి ఉత్పత్తులు లభ్యం కాగలవని, కంపెనీ చరిత్రలో ఇది కొత్త అధ్యాయం కాగలదని తిజారావాలా తెలిపారు. ఈ భాగస్వామ్యాలతో తమ ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి రాగలవన్నారు. ఆన్లైన్ కంపెనీలన్నింటితో భేటీ అయ్యే దిశగా పతంజలి ఈ నెల 16న భారీ కార్యకమ్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికి సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ ఆచార్య బాలకృష్ణ కూడా హాజరుకానున్నారు. కొంగొత్త వ్యూహాలతో వృద్ధి.. బ్రోకింగ్ సంస్థల అంచనాల ప్రకారం.. పతంజలి బ్రాండ్ ఆహారోత్పత్తులు ప్రస్తుతం 26 శాతం కుటుంబాలకు, వ్యక్తిగత సౌందర్య సాధనాల ఉత్పత్తులు 53 శాతం కుటుంబాలకు చేరుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది వంద శాతం వృద్ధి. కార్యకలాపాల విస్తరణ కోసం పతంజలి ఆయుర్వేద సంస్థ కొన్నాళ్లుగా వ్యాపార వ్యూహాలకు మరింత పదును పెడుతూ వస్తోంది. ప్రారంభం నుంచి అనుసరిస్తూ వస్తున్న బ్రాండెడ్ ఫ్రాంచైజీ విధానం నుంచి.. ఎఫ్ఎంజీసీ కంపెనీలు అనుసరించే చానల్ డిస్ట్రిబ్యూషన్ మార్గానికి కూడా మళ్లింది. 2020 నాటికల్లా రూ. 1 లక్ష కోట్ల వార్షిక అమ్మకాలు సాధించాలని పతంజలి నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా 2019 నాటికల్లా పంపిణీదారుల సంఖ్యను ప్రస్తుతమున్న 5,000 నుంచి 25,000కు పెంచుకోవాలని పతంజలి భావిస్తోంది. అలాగే, ఆన్లైన్ వ్యాపార ప్రణాళికలు సైతం వ్యాపార వృద్ధికి గణనీయంగా తోడ్పడనున్నాయి. ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ రంగంలో ఏడో స్థానంలో ఉన్న పతంజలి.. తాజా వ్యూహాలతో మరింత భారీ మార్కెట్ వాటాను దక్కించుకునేందుకు.. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 20,000 కోట్ల టర్నోవరు లక్ష్యాన్ని సాధించేందుకు ఆన్లైన్ ప్రణాళికలు దోహదపడే అవకాశాలు ఉన్నాయి. -
ఆన్లైన్ గ్రాసరీ... హోరాహోరీ!
ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్లో పోటీ అంతకంతకూ వేడెక్కుతోంది. కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ కూడా తాజాగా ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. స్టార్‌క్విక్ బ్రాండ్ కింద వచ్చే 1–2 నెలల కాలంలో సేవలు ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది ట్రెంట్ హైపర్‌మార్కెట్‌కు ఆన్లైన్ చానల్‌గా పనిచేస్తుంది. ఎఫ్‌డీఐ నిబంధనల నేపథ్యంలో ట్రెంట్ అనుబంధ సంస్థ అయిన ఫియోర హైపర్‌మార్కెట్ (ఎఫ్‌హెచ్‌ఎల్) ద్వారా టాటా గ్రూప్ ఈ–గ్రాసరీ సేవలను అందించనుంది. ఎఫ్‌హెచ్‌ఎల్ ఇప్పటికే ట్రయల్స్ కూడా ప్రారంభించింది. ట్రెంట్ అనేది టాటా–టెస్కో జాయింట్ వెంచర్. టాటా గ్రూప్ ఆన్లైన్ గ్రాసరీలోకి ఎంట్రీ ఇస్తే బిగ్‌బాస్కెట్, అమెజాన్‌లకు గట్టి పోటీ ఎదురుకానుంది. అయితే ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్ విషయమై టాటా గ్రూప్ ఎలాంటి కామెంట్ చేయలేదు. జూన్‌లో గ్రాసర్‌మ్యాక్స్ కొనుగోలు టాటా గ్రూప్ జూన్‌లో ‘గ్రాసర్‌మ్యాక్స్’ సంస్థను కొనుగోలు చేసింది. దీంతో టాటా గ్రూప్ ఆన్లైన్ గ్రాసరీలోకి అడుగుపెట్టినట్లయ్యింది. గ్రాసర్‌మ్యాక్స్ మేనేజ్మెంట్ను, టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను స్టార్‌క్విక్ సేవల కోసం వినియోగించుకునే అవకాశముంది. ప్రస్తుతం టాటా గ్రూప్ స్టార్ బ్యానర్ కింద డైలీ, మార్కెట్, హైపర్ అనే మూడు ఫార్మాట్లలో ఆఫ్‌లైన్ గ్రాసరీ సేవలను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో స్టార్ డైలీ సేవలను నిలిపివేయాలని సంస్థ భావిస్తోంది. వీటి స్థానంలో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. స్టార్ బ్యానర్‌కు 42 స్టోర్లు ఉన్నాయి. ఇదే తొలిసారి కాదు.. ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్లోకి రావడం టాటా గ్రూప్‌కు ఇది కొత్తేమీ కాదు. 2015లోనే ఇది ఆన్లైన్ గ్రాసరీలోకి ఎంట్రీ ఇచ్చింది. యూకే రిటైల్ దిగ్గజం టెస్కోతో 50–50 జాయింట్ వెంచర్ ‘ట్రెంట్హైపర్ మార్కెట్’ను ఏర్పాటు చేసింది. ఇది ఈ–గ్రాసరీ షాప్ ఠీఠీఠీ.ఝy247ఝ్చటజ్ఛ్టు.ఛిౌఝ ను ప్రారంభించింది. ఇది ఎఫ్‌హెచ్‌ఎల్ నేతృత్వంలో ఉంది. కాగా, ప్రస్తుతం దీన్ని నిలిపేసింది. కాగా టెస్కో అనేది ప్రపంచపు మూడో అతిపెద్ద రిటైలర్. దీనికి ప్రపంచవ్యాప్తంగా 6,800 స్టోర్లు ఉన్నాయి. లాభాల్లో ఉన్న అతికొద్ది వెంచర్లలో ఇది కూడా ఒకటి. అవకాశాలు అపారం.. దేశంలో ఆన్లైన్ గ్రాసరీ, ఫుడ్ మార్కెట్ విస్తరణ 1 శాతంలోపే ఉంది. అపార వృద్ధి అవకాశాలున్నాయి. అందుకే ఈ విభాగంపై దేశీ, విదేశీ సంస్థలు ప్రధానంగా దృష్టి కేంద్రకరించాయి. ఆన్లైన్ గ్రాసరీ, ఫుడ్ మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందనుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. 2020 నాటికి 141 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధితో మొత్తం ఆన్లైన్ రిటైల్ సేల్స్‌లో 12.5 % వాటాను (15 బిలియన్ డాలర్లు) ఆక్రమిస్తుందని తెలిపింది. దేశంలోని మొత్తం రిటైల్ బాస్కెట్లో ఫుడ్, గ్రాసరీ విభాగం 50% వాటా ఆక్రమించిందని పేర్కొంది. ఆన్లైన్ గ్రాసరీలో త్వరితగతి డెలివరీ చాలా కీలకమని రిటైల్ కన్సల్టింగ్ సంస్థ ఎలర్గిర్ సొల్యూషన్స్ డైరెక్టర్ రుచి సల్లీ తెలిపారు. ఇందులో దిగ్గజంగా ఎదగాలంటే బలమైన లాజిస్టిక్స్, సప్లై చైన్ సామర్థ్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఫ్లిప్‌కార్ట్ రి–ఎంట్రీ.. పేటీఎం ఆసక్తి.. ఆన్లైన్ గ్రాసరీలోకి ఫ్లిప్‌కార్ట్ మళ్లీ వస్తోంది. ఇది ఇదివరకు 2015 అక్టోబర్‌లో నియర్‌బై యాప్ ద్వారా ఈ విభాగంలోకి వచ్చింది. కానీ తర్వాత ఇది మూతపడింది. ఇప్పుడు మళ్లీ రావడానికి ప్రయత్నిస్తోంది. ఇక బిగ్‌బాస్కెట్‌లో 200–300 మిలియన్ డాలర్లమేర నిధుల్ని పొందాలని పేటీఎం, అలీబాబాలతో చర్చలు జరుపుతోంది. అలాగే ఇన్వెస్టర్లు కూడా ఆన్లైన్ గ్రాసరీపై ఆసక్తిగా ఉన్నారు. బిగ్‌బాస్కెట్, జోపర్, షాడోఫాక్స్, నింజాకార్ట్, జోప్నౌ వంటి స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక అమెజాన్ కూడా ఈ–గ్రాసరీపై అధికంగా దృష్టి కేంద్రీకరించింది. -
ఫ్లిప్‌కార్ట్ యూజర్లు- 10 కోట్లు
బెంగళూరు: దేశీ దిగ్గజ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ వినియోగదారుల సంఖ్య 10 కోట్ల మైలురాయిని అధిగమించింది. దీంతో భారత్ ఆన్లైన్ మార్కెట్ విభాగంలో ఈ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా ఫ్లిప్‌కార్ట్ అవతరించింది. ఫ్లిప్‌కార్ట్‌కు కేవలం ఆరు నెలల కాలంలో 2.5 కోట్ల మంది కొత్త కస్టమర్లు జత కావడం ఆశ్చర్యకరం. ఈ ఏడాది మార్చి నాటికి ఫ్లిప్‌కార్ట్ యూజర్ల సంఖ్య 7.5 కోట్లుగా ఉంది. తాజాగా ఇది 10 కోట్ల మార్క్‌కు చేరింది. దేశీ ఆన్లైన్ షాపింగ్ యూజర్లకు నాణ్యమైన వస్తువులను, అందుబాటు ధరల్లో అందించేందుకు ఎప్పుడూ ముందుంటామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో బిన్నీ బన్సాల్ తెలిపారు. -
ఆన్లైన్ మార్కెట్‌కు ఊతం గ్రాబ్ఆన్!
హైదరాబాద్: ఈ కామర్స్ కంపెనీల్లో కొనుగొళ్లకు వినియోగదారులను ఆకర్షించడంలో ఎట్రాక్టీవ్ ఆఫర్స్‌తో వచ్చే కూపన్స్ పోషించే పాత్ర వేరే చెప్పక్కర్లేదు. వివిధ కూపన్స్ ద్వారా ఈ కామర్స్ సంస్థల అమ్మకాలకు ఊతాన్నిస్తూ కూపనింగ్ పోర్టల్ 'గ్రాబ్ఆన్' దూసుకుపోతోంది. 2014లో ప్రారంభమై రెండేళ్లలోనే కూపన్స్ అండ్ డీల్స్ వెబ్సైట్లలో తమ గ్రాబ్ఆన్ టాప్ పొజిషన్లో నిలిచిందని సీఈవో అశోక్ రెడ్డి వెల్లడించారు. కొత్త ఈ కామర్స్ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహించడానికి ముందుకొస్తున్న నేపథ్యంలో నగరంలో 'గ్రాబ్ఆన్' సేవలను మరింత విస్తృత పరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారత్‌లో ఈ కామర్స్ రంగంలో అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్న మాదిరిగానే సంస్థల మధ్య పోటీ సైతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కూపనింగ్ మార్కెట్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ఆన్లైన్ సేల్స్ పెంచడానికి, చిన్న కంపెనీలు తమ ఆన్లైన్ మార్కెట్‌ను విస్తృతపరుచుకునేందుకు గ్రాబ్ఆన్ అందిస్తున్న సేవలు ఎంతగానో దోహదం చేస్తాయని ఈ సందర్భంగా వెల్లడించారు. -
మహిళా సంఘాలకు ఆన్లైన్ మార్కెట్ సౌకర్యం
► తిరుపతి, రాజంపేటను ఆదర్శ సిటీలుగా తీర్చిదిద్దుతాం ► సెర్ప్ సీఈవో సాల్మన్ ఆరోఖ్య రాజ్ వెల్లడి ► తిరుపతిలో నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల మెప్మా సిబ్బందితో సమీక్ష తిరుపతి కార్పొరేషన్ : పొదుపు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆన్లైన్ మార్కెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర సెర్ప్ సీఈవో సాల్మన్ ఆరోఖ్య రాజ్ తెలిపారు. తిరుపతి నగరంలో శనివారం నె ల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలోని మెప్మా అధికారులతో వివిధ మున్సిపల్, కార్పొరేషన్లలో జీవనోపాధుల అమలు తీరుపై ప్రాంతీయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాల్మన్ ఆరోఖ్య రాజ్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు, స్లమ్ లెవల్ ఫెడరేషన్, టౌన్ లెవల్ ఫెడరేషన్ స్థాయిలో పొదుపులు, అప్పుల వసూళ్లపై సక్రమంగా చర్యలు తీసుకోవాలన్నారు. రుణాలు పొందిన సంఘ సభ్యురాలు రుణ మొత్తాన్ని జీవనోపాధి యూనిట్‌ను పెట్టుకునే విధంగా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.9,500 కోట్లు వివిధ బ్యాంకు లింకేజీ ద్వారా మెప్మా పరిధిలోని గ్రూపులకు రుణాలు అందించామన్నారు. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని స్పష్టం చేశారు. ప్రతి డ్వాక్రా బజారులో పొదుపు మహిళలు తయారుచేసిన వస్తువులను ఇంటర్ నెట్ ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునేలా చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు ప్రధాన నగరాల్లో సెర్ప్ ఆధ్వర్యంలో ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా వస్తువులు విక్రయాలు చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నంలో ఆన్లైన్ మార్కెట్ సౌకర్యం పొదుపు సంఘాలు నిర్వహిస్తున్నట్టు గుర్తుచేశారు. అదే తరహాలో తిరుపతిలో కూడా ఆన్లైన్ మార్కెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని, తిరుపతితో పాటు రాజంపేట నగరాలను మోడల్‌గా తీర్చిదిద్దనున్నట్టు స్పష్టంచేశారు. మే మొదటి వారంనుంచి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సెర్ప్ స్పెషల్ డెరైక్టర్ చిన్నతాతయ్య, చిత్తూరు మెప్మా పీడీ నాగపద్మజ, కడప పీడీ వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. -
‘ధారవి’ ఆన్‌లైన్‌కు షాప్‌క్లూస్ తోడు
హైదరాబాద్: ధారవి.. ప్రపంచంలోనే అతి పెద్ద మురికి వాడల్లో ఇదొకటి. ఇప్పుడు ముంబైలోని ఈ మురికివాడలోని కార్మికులను స్లమ్‌డాగ్ మిలియనీర్స్‌గా మార్చడానికి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ షాప్‌క్లూస్ డాట్‌కామ్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ధారవిమార్కెట్ డాట్‌కామ్‌తో ఈ సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇక్కడి కార్మికులు తయారు చేసే లెదర్ బ్యాగ్‌లు, పాదరక్షలను ఆన్లైన్ ద్వారా మార్కెట్ చేస్తున్నామని షాప్‌క్లూస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాధిక అగర్వాల్ చెప్పారు. ఇతర ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌ల మాదిరిగా హై ఎండ్ ఎలక్ట్రిక్ వస్తువులు, హైఫై ఫ్యాషన్ వస్తువులు కాకుండా తమ సంస్థ సామాన్యులకు అవసరమయ్యే సాధారణ వస్తువులను ఆఫర్ చేస్తుందని తెలియజేశారు. కాగా 2014 మధ్యలో ఏర్పాటైన ధారవిమార్కెట్ డాట్‌కామ్ ఈ మురికివాడలో ఉన్న ఎంటర్ప్రెన్యూర్లకు తోడ్పాటునందిస్తోంది. షాప్‌క్లూస్ ఒప్పందంతో ఇక్కడి కార్మికుల ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా యాక్సెస్ లభిస్తుందని ధారవిమార్కెట్ డాట్‌కామ్ వ్యవస్థాపకురాలు మేఘ గుప్తా చెప్పారు. -
జ్యూట్ బ్యాగ్ పరిశ్రమ పెట్టాలంటే...
మీరే పారిశ్రామికవేత్త! ‘ఇంట్లో అందరూ సంపాదన పరులే. నేను మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి’ అనుకుంటున్నారా? ‘ప్రతి ఒక్కరిలో ఏదో ఓ నైపుణ్యం ఉంటుంది. నాలో నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి’ అనుకుంటున్నారా? ఇవేవీ కాదు, ‘డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే మార్గం కాదు. ఉద్యోగాలిచ్చే పరిశ్రమను స్థాపించడం గొప్ప ఆలోచన’ అనుకుంటున్నారా? ఇందులో మీరు ఎలా ఆలోచించినా, మీలో ఏదో చేయాలనే తపన ఉన్నట్టే! మీ ఆలోచనలకు వాస్తవ రూపమివ్వడానికే ఈ ప్రయత్నం. ఈ వారం జ్యూట్ బ్యాగ్ పరిశ్రమ ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం. ఏమేం కావాలి? ఎంత ఖర్చవుతుంది? (ధరలు రూపాయల్లో) 1 జ్యూట్ సూయింగ్ మెషీన్ - 12,000 నుంచి 20,000. ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయాలంటే ఇండస్ట్రియల్ మెషీన్ తీసుకోవాలి. అది 20,000 ఉంటుంది. 1 కటింగ్ మెషీన్ - 9,000. చేత్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో కావాలంటే మెషీన్ ఉంటే పని సులువవుతుంది. ఒక మెషీన్‌కు ఒక మనిషి చేత్తో కట్ చేసి అందించగలరు. 1 కటింగ్ టేబుల్ - 12,000. మీది చిన్న గది అయితే టేబుల్ వేయడం కుదరదు. నేల మీద పరచి కత్తిరించుకోవాలి. మరింత ఆకర్షణీయంగా తయారుచేయాలంటే ఎంబ్రాయిడరీ మెషీన్ కూడా తీసుకోవచ్చు. దీని ధర 28,000. 2 ర్యాకులు- ఒక్కొక్కటి 2,500 1 అల్మెరా - 6,000 నుంచి 7,000 ఇతరాలు: 1 కత్తెర - 200 1 పెద్ద స్కేలు - 20 1 టేపు - 5 10 బాబిన్లు, బాబిన్ కేస్లు - 350 మెషీన్ రిపేర్ కోసం స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్ సెట్ - 100 2 ఐలెట్ పంచెస్ (రంధ్రాలు చేయడానికి) - ఒక్కోటి వంద. (‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో...) మ్యాన్‌పవర్: ఇద్దరు కావాలి స్థలం ఎంతుండాలి? ఒక మెషీన్‌తో యూనిట్ పెట్టడానికి కనీసంగా కావల్సిన స్థలం: 12 బై 12 అడుగుల గది. టేబుల్ కూడా అమర్చుకోవాలంటే మరికొంత పెద్దగా ఉండాలి. యాభై వేల రూపాయలు మీ చేతిలో ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు, బ్యాంకు రుణాల సహకారంతో పది లక్షల రూపాయల యూనిట్ పెట్టుకోవచ్చు. శిక్షణ ఎలా? భారత ప్రభుత్వపు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ‘వందేమాతరం’ పేరుతో కేంద్ర పరిశ్రమల శాఖ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ‘ఎలీప్’ నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా 18-45 ఏళ్ల మధ్య వయసు మహిళలు (కనీస విద్యార్హత 5వ తరగతి) శిక్షణ పొందవచ్చు. ఎలాంటివి ఉత్పత్తి చేయొచ్చు? కుషన్ కవర్లు, కర్టెన్లు, సెల్‌ఫోన్ కవర్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, లంచ్ బాక్సుల ఆకారాలను బట్టి వాటిని ఇమిడ్చే బ్యాగులను తయారుచేయవచ్చు. సర్టిఫికెట్ల ఫోల్డర్లు, కూరగాయల సంచుల నుంచి పిక్నిక్కు పనికొచ్చే వెరైటీలు, ఇలా దైనందిన జీవనాన్ని గమనిస్తే ఎన్నో ఆలోచనలొస్తాయి. మార్కెట్ ఎలా? జిల్లా, మండల కేంద్రాలలోని డ్వాక్రా బజార్లలో స్టాల్ అద్దెకు తీసుకుని స్వయంగా అమ్ముకోవచ్చు. ప్రభుత్వం అనుమతించిన మార్కెట్ ఏజెన్సీలతో అంగీకారం కుదుర్చుకోవచ్చు. గుళ్ల దగ్గర, కాలనీలోని దుకాణదారులకు ప్రయోగాత్మకంగా కొన్ని పీసులను ప్రదర్శించమని అడగవచ్చు. ఇంకా, ఎలీప్ ‘విపణి’ కార్యక్రమం ద్వారా అమ్మకందార్లను, కొనుగోలుదార్లను అనుసంధానిస్తోంది. శిక్షణ ఎక్కడ? రిజిస్ట్రేషన్ ఏలా? 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చు. యాభై వేల రూపాయలు చేతిలో ఉంటే పదిలక్షల యూనిట్ ప్రారంభించే అవకాశాలు నేడు మహిళలకు అందుబాటులో ఉన్నాయి. ఎలీప్ ద్వారా శిక్షణ, పరిశ్రమ పెట్టడానికి అవసరమైన అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తున్నాం. ఆన్లైన్ మార్కెట్‌కు కూడా తెర తీశాం. జ్యూట్ (జనపనార) పర్యావరణ హితమైనది. దాని వాడకం పెరిగితే పరోక్షంగా రైతులకు ఉపాధి పెరుగుతుంది. - రమాదేవి ఎలీప్(అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) అధ్యక్షురాలు రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి -
600% వృద్ధి సాధించాం: స్నాప్‌డీల్
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్ గత ఏడాది 600 శాతం వృద్ధిని సాధించింది. భారత్‌లో గత ఏడాది అత్యంత వేగంగా వృద్ధి సాధించిన ఈ కామర్స్ సంస్థగా నిలిచామని స్నాప్‌డీల్ పేర్కొంది. ఎంకామర్స్ రంగంలో తమదే అగ్రస్థానమని స్నాప్‌డీల్ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈఓ కూడా అయిన కునాల్ బహాల్ పేర్కొన్నారు. గత ఏడాది ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన అగ్రశ్రేణి ఐదు కంపెనీల్లో తమది ఒకటని స్నాప్‌డీల్ వినియోగదారులు, వ్యాపార భాగస్వాములకు రాసిన లేఖలో ఆయన వివరించారు. గత ఏడాది తమకు అద్భుతమైన సంవత్సరమని తెలి పారు. మొత్తం ఆర్డర్లలో 65 శాతం ఆర్డర్లు మొబైల్ ఫోన్ల ద్వారానే వచ్చాయని పేర్కొన్నారు. షోరూమ్‌ల్లో విక్రయించగలిగే అన్ని వస్తువులను ఆన్లైన్లో విక్రయించగలమనే విశ్వాసంతో, కార్లు, బైక్‌లను కూడా ఆన్లైన్లో ఆఫర్ చేశామని వివరించారు. 500కు పైగా విభిన్నమైన కేటగిరీల్లో 50 లక్షలకు పైగా ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నామని వివరించారు. -
ఆన్లైన్లో సగటు కొనుగోళ్లు రూ.10 వేలు!
2015లో ఒక్కో కస్టమర్ చేయనున్న వ్యయం ఇది.. ఈ ఏడాది సగటు ఖర్చు రూ.6 వేలు అసోచాం-పీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ-కామర్స్ రంగం దూసుకుపోతోంది. వచ్చే ఏడాది వివిధ ఉత్పత్తుల కోసం భారతీయ ఆన్లైన్ కస్టమర్ సగటున రూ.10 వేలు ఖర్చుచేయనున్నట్లు అసోచాం-పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడించింది. ఆన్లైన్ షాపర్ల ఈ ఏడాది సగటు వ్యయం రూ.6 వేలుగా లెక్కగట్టింది. భారత్‌లో ఆన్లైన్ మార్కెట్ హవా ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఈ అంకెలే నిదర్శనం. దేశంలో ప్రస్తుతం ఆన్లైన్ రిటైల్ మార్కెట్ పరిమాణం రూ.24,000 కోట్లుంది. నివేదిక ప్రకారం.. ఆన్లైన్లో 2014లో సుమారు 4 కోట్ల మంది కస్టమర్లు పలు ఉత్పత్తులను కొనుగోలు చేశారు. మెరుగైన రవాణా, బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్ సౌకర్యమున్న మొబైల్స్ విస్తృతి కారణంగా కస్టమర్ల సంఖ్య 2015లో 6.5 కోట్లకు ఎగబాకుతుంది. మొత్తం ఈ-కామర్స్ మార్కెట్ రూ.1.02 లక్షల కోట్లుంది. 35% వార్షిక వృద్ధి రేటుతో అయిదేళ్లలో వ్యాపార పరిమాణం రూ.6 లక్షల కోట్లకు చేరుతుంది. మొబైల్స్ హవా.. ఆన్లైన్ రిటైల్ వ్యాపారంలో దుస్తులు అగ్రస్థానాన్ని కొనసాగిస్తాయి. దుస్తులతోపాటు కంప్యూటర్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాలు మార్కెట్ వృద్ధికి దోహదం చేయనున్నాయి. యాక్సెసరీస్‌తో కలిపి వీటి వాటా ప్రస్తుతం 39 శాతముంది. 2015లో 42 శాతానికి చేరనుంది. ఇక స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ పీసీ కొనుగోలుదారులు ఈ-రిటైల్ వృద్ధికి కీలకం కానున్నారు. ఇప్పటికే మొబైల్ ఫోన్ల వాటా 11 శాతముంది. 2017 నాటికి 25 శాతానికి చేరనుందని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. అజీమ్ ప్రేమ్‌జీ, రతన్ టాటా వంటి ప్రముఖ ఇన్వెస్టర్లను పరిశ్రమ ఆకట్టుకుందని అన్నారు. దేశంలో అమెజాన్ వంటి అంతర్జాతీయ కంపెనీల కంటే ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు తమ హవాను కొనసాగిస్తున్నాయి. ట్రావెల్ వాటా 75 శాతం.. ట్రావెల్, టూరిజం వ్యాపారంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్‌లో మొత్తం ట్రావెల్ సంబంధ వ్యాపారంలో 75 శాతం ఈ-కామర్స్ వేదికగా జరుగుతోంది. కాగా, దేశంలో ఇంటర్నెట్ వినియోగదార్లలో మూడింట ఒక వంతు ఆన్లైన్ కొనుగోళ్లు జరుపుతున్నారు. తొలిసారి ఆన్లైన్ కొనుగోలుదార్ల కంటే పాత కస్టమర్లు అధికంగా వ్యయం చేస్తున్నారట. ఈ-టైలింగ్లో గిడ్డంగుల నిర్వహణ, సరుకు రవాణాలో 25 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ రెండు విభాగాల్లోనే 2017-20 నాటికి ఒక లక్ష మంది అదనంగా అవసరమని అంచనా.