![ఆన్‌లైన్‌లో సగటు కొనుగోళ్లు రూ.10 వేలు!](/styles/webp/s3/article_images/2017/09/2/81419793408_625x300.jpg.webp?itok=m0JoggQ_)
ఆన్‌లైన్‌లో సగటు కొనుగోళ్లు రూ.10 వేలు!
2015లో ఒక్కో కస్టమర్ చేయనున్న వ్యయం ఇది..
ఈ ఏడాది సగటు ఖర్చు రూ.6 వేలు
అసోచాం-పీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ-కామర్స్ రంగం దూసుకుపోతోంది. వచ్చే ఏడాది వివిధ ఉత్పత్తుల కోసం భారతీయ ఆన్‌లైన్ కస్టమర్ సగటున రూ.10 వేలు ఖర్చుచేయనున్నట్లు అసోచాం-పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడించింది. ఆన్‌లైన్ షాపర్ల ఈ ఏడాది సగటు వ్యయం రూ.6 వేలుగా లెక్కగట్టింది. భారత్‌లో ఆన్‌లైన్ మార్కెట్ హవా ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఈ అంకెలే నిదర్శనం. దేశంలో ప్రస్తుతం ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ పరిమాణం రూ.24,000 కోట్లుంది.
నివేదిక ప్రకారం.. ఆన్‌లైన్‌లో 2014లో సుమారు 4 కోట్ల మంది కస్టమర్లు పలు ఉత్పత్తులను కొనుగోలు చేశారు. మెరుగైన రవాణా, బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్ సౌకర్యమున్న మొబైల్స్ విస్తృతి కారణంగా కస్టమర్ల సంఖ్య 2015లో 6.5 కోట్లకు ఎగబాకుతుంది. మొత్తం ఈ-కామర్స్ మార్కెట్ రూ.1.02 లక్షల కోట్లుంది. 35% వార్షిక వృద్ధి రేటుతో అయిదేళ్లలో వ్యాపార పరిమాణం రూ.6 లక్షల కోట్లకు చేరుతుంది.
మొబైల్స్ హవా..
ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారంలో దుస్తులు అగ్రస్థానాన్ని కొనసాగిస్తాయి. దుస్తులతోపాటు కంప్యూటర్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాలు మార్కెట్ వృద్ధికి దోహదం చేయనున్నాయి. యాక్సెసరీస్‌తో కలిపి వీటి వాటా ప్రస్తుతం 39 శాతముంది. 2015లో 42 శాతానికి చేరనుంది. ఇక స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ పీసీ కొనుగోలుదారులు ఈ-రిటైల్ వృద్ధికి కీలకం కానున్నారు.
ఇప్పటికే మొబైల్ ఫోన్ల వాటా 11 శాతముంది. 2017 నాటికి 25 శాతానికి చేరనుందని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. అజీమ్ ప్రేమ్‌జీ, రతన్ టాటా వంటి ప్రముఖ ఇన్వెస్టర్లను పరిశ్రమ ఆకట్టుకుందని అన్నారు. దేశంలో అమెజాన్ వంటి అంతర్జాతీయ కంపెనీల కంటే ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు తమ హవాను కొనసాగిస్తున్నాయి.
ట్రావెల్ వాటా 75 శాతం..
ట్రావెల్, టూరిజం వ్యాపారంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్‌లో మొత్తం ట్రావెల్ సంబంధ వ్యాపారంలో 75 శాతం ఈ-కామర్స్ వేదికగా జరుగుతోంది. కాగా, దేశంలో ఇంటర్నెట్ వినియోగదార్లలో మూడింట ఒక వంతు ఆన్‌లైన్ కొనుగోళ్లు జరుపుతున్నారు.
తొలిసారి ఆన్‌లైన్ కొనుగోలుదార్ల కంటే పాత కస్టమర్లు అధికంగా వ్యయం చేస్తున్నారట. ఈ-టైలింగ్‌లో గిడ్డంగుల నిర్వహణ, సరుకు రవాణాలో 25 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ రెండు విభాగాల్లోనే 2017-20 నాటికి ఒక లక్ష మంది అదనంగా అవసరమని అంచనా.