దేశంలో మూతపడిన 2 లక్షల కిరాణా షాపులు
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల జోరే కారణం
ఇంటికే క్షణాల్లో సరుకులు కావాలని కోరుకుంటున్న వినియోగదారులు
ఆన్‌లైన్ మార్కెట్లో క్విక్ కామర్స్‌కు పెరిగిన ఆర్డర్స్
నగరాలతోపాటు చిన్న పట్టణాల్లోని పచారీ కొట్ల మనుగడపై తీవ్ర ప్రభావం
ఏఐసీపీడీఎఫ్ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: ఆన్‌లైన్ కొనుగోళ్ల సంస్కృతి పెరుగుతోంది. ఏ వస్తువు కావాలన్నా ప్రజలు ఆన్‌లైన్ వైపే చూస్తున్నారు. ఇటీవల మార్కెట్లోకి దూసుకొచ్చి¯]∙క్విక్ కామర్స్ సంస్థలు జెప్టో, బ్లింకిట్ వంటి కంపెనీలు వినియోగదారులు కోరుకున్న వస్తువులను 10 నిమిషాల్లోనే ఇంటికి డెలివరీ చేస్తున్నాయి. ఈ ప్రభావం కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. దీనివల్ల దేశవ్యాప్తంగా గత ఏడాది 2 లక్షల కిరాణా షాపులు మూతపడ్డాయి. ఈ విషయాన్ని ఆల్ ఇండియా కన్సూ్యమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ (ఏఐసీపీడీఎఫ్) నివేదిక వెల్లడించింది.
క్విక్ కామర్స్ వల్లే..
క్విక్ కామర్స్ (శీఘ్ర వాణిజ్యం) ప్లాట్‌ఫామ్‌ల రాకతోనే కిరాణా షాపులు మూతపడుతున్నట్టు ఏఐసీపీడీఎఫ్ అధ్యయనం వెల్లడించింది. దేశంలోని మెట్రో నగరాలతోపాటు చిన్నపాటి పట్టణాల్లోనూ క్విక్ కామర్స్ ఊపందుకోవడంతో పచారీ దుకాణాలు మూతపడుతున్నాయి. కాలు బయటకు పెట్టకుండా ఇంటికే వేగంగా సరుకులు రావాలని కోరుకుంటున్న వినియోగదారులు బ్లింకిట్, జెప్టో వంటి ఫాస్ట్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆర్డర్లు చేసేందుకు ఇష్టపడుతున్నారు.
ఫలితంగా సంప్రదాయ కిరాణా షాపులు దెబ్బతింటున్నాయి. దేశం మొత్తం మీద సుమారు 1.30 కోట్ల కిరాణా షాపులు ఉంటే.. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ వల్ల కేవలం ఏడాది కాలంలోనే కనీసం 2 లక్షల కిరాణా స్టోర్లు, చిన్నాచితక రిటైల్ ఔట్‌లెట్లు మూతపడ్డాయి. ముఖ్యంగా మెట్రో నగరాలతోపాటు ప్రధాన నగరాల్లోని కిరాణా దుకాణాలపై క్విక్ కామర్స్ ప్రభావం ఎక్కువగా ఉందని ఏఐసీపీడీఎఫ్ స్పష్టం చేసింది.
నగరాల్లోనే 45 శాతం
మూతపడిన దుకాణాల్లో 45 శాతం మెట్రో నగరాల్లోనే ఉన్నాయి. ప్రధాన నగరాల్లో 30 శాతం, పట్టణాల్లో 25 శాతం కిరాణా షాపులు కనుమరుగయ్యాయి. క్విక్ కామర్స్ కంపెనీలు విస్తరిస్తున్న వేగానికి దశాబ్దాలుగా భారత రిటైల్ రంగానికి వెన్నెముకగా ఉన్న కిరాణా దుకాణాలు ఖాతాదారులను, లాభదాయకతను కోల్పోతున్నాయని ఏఐసీపీడీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్ పాటిల్ స్పష్టం చేశారు. తగ్గింపు ధరల పేరుతో ప్రజలను ఆకర్షిస్తున్న ఆన్‌లైన్ వాణిజ్య సంస్థలు కిరాణా షాపుల వినియోగదారులను కొల్లగొడుతున్నాయని తెలిపారు.
40 నుంచి 60 శాతం వరకు తగ్గింపులతో వస్తువులను విక్రయించడం ఏ కంపెనీకి వాస్తవికమైనది లేదా స్థిరమైనది కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్విక్ కామర్స్ సంస్థల చట్టవిరుద్ధ ధరలపై విచారణ జరిపించాలని పాటిల్ డిమాండ్ చేశారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాసిన లేఖలో ఈ–కామర్స్, క్విక్ కామర్స్ భారీ తగ్గింపులపై ఏఐసీపీడీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధరలపై దర్యాప్తు చేయాలని కోరింది. క్విక్ కామర్స్ సంస్థల విస్తరణను అడ్డుకోకపోతే కిరాణా షాపులను కాపాడుకోవడం కష్టమని స్పష్టం చేసింది.
అద్దెలు చెల్లించడం కష్టంగా ఉంది
మాల్స్, డీమార్ట్, స్మార్ట్ బజార్, బిగ్ బాస్కెట్ వంటి సూపర్ మార్కెట్లు రావడంతో చిన్నచిన్న కిరాణా షాపుల్లో విక్రయాలు తగ్గిపోయాయి. ఆన్‌లైన్ సంస్థలు గ్రామీణ ప్రాంతాలకు సైతం డోర్ డెలివరీలు చేçస్తుండటంతో కిరాణా షాపులకు కొనుగోలుదారులు రావడం లేదు. వ్యాపారం లేక షాపుల అద్దెలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. సరుకులు, షాపుల నిర్వహణ కోసం చేసిన అప్పులు చెల్లించలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక వంటి కారణాలతో కిరాణా షాపులు మూతపడుతున్నాయి. – బొలిశెట్టి సత్యనాగ బాలరాజు, అధ్యక్షుడు, పెడన వర్తక సంఘం, కృష్ణా జిల్లా
కిరాణా వ్యాపారాలకు గడ్డుకాలమే
కిరాణా వ్యాపారులకు గడ్డుకాలం వచ్చింది. ఒకవైపు ఆన్‌లైన్ మార్కెట్, మరోవైపు చిన్న పట్టణాల్లో మెగా మార్ట్‌ల రాకతో దశాబ్దాల కాలంగా స్థానికంగా చేస్తున్న కిరాణా వ్యాపారాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆన్‌లైన్, మాల్స్ పోటీని తట్టుకుని నిలబడలేక నష్టాల బాట పట్టాం. అద్దె షాపుల్లో సిబ్బందితో నడిపే కిరాణా వ్యాపారాలు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వాస్తవానికి కిరాణా షాపుల్లో సరుకుల నాణ్యత చూసి కొనుక్కునే అవకాశంతోపాటు అరువు తీసుకునే వెసులుబాటు కూడా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. – అద్దంకి వెంకట శివప్రసాదరావు, కార్యదర్శి, భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్, పశ్చిమగోదావరి
Comments
Please login to add a commentAdd a comment