‘గేమ్ చేంజర్!’
నేడే 2025–26 కేంద్ర బడ్జెట్.. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
పేద, మధ్య తరగతికి ‘‘లక్ష్మీ కటాక్షం..’’ అంటూ బడ్జెట్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
మోదీ మూడోసారి గెలిచాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది
వ్యవసాయం, ఉపాధి, ఇన్‌ఫ్రా, చిన్నతరహా పరిశ్రమలపై ఫోకస్
ఆదాయపు పన్ను విషయంలో విప్లవాత్మక నిర్ణయాలుంటాయని ఊహాగానాలు
కొత్త పన్నుల విధానంలో రూ.10 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు అని ప్రచారం
రూ.15 లక్షలు – రూ.20 లక్షలు ఆర్జించే వారి కోసం 25 శాతంతో కొత్త శ్లాబ్ పెట్టే చాన్స్
పాత పన్ను విధానంపై నిరాసక్తత కలిగేలా చర్యలు తీసుకునే అవకాశం
ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినందున వినియోగాన్ని పెంచేలా నిర్ణయాలు
పేదలను ఊరడించేలా నిర్ణయాలుంటాయని అందరిలో ఆశలు
(సాక్షి, బిజినెస్ డెస్క్, సాక్షి, అమరావతి) : మరి కొద్ది గంటల్లో బడ్జెట్(Budget) ప్రవేశపెట్టనున్న తరుణంలో వెలువడిన కేంద్ర ఆర్థిక సర్వేతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) చేసిన వ్యాఖ్యలు వేతన జీవులు, మధ్య తరగతి వర్గాల్లో ఆశలను పెంచుతున్నాయి. 2014 నుంచి పన్నుల శ్లాబులు మార్చకపోవడం.. మండిపోతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా జీతాలు పెరగని నేపథ్యంలో ఈదఫా వేతన జీవులకు ఊరట లభిస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదలైన ఆర్థిక సర్వే ఇదే సంకేతాలనిచ్చింది.
2023–24లో కంపెనీల లాభాలు 22.3 శాతం పెరగగా ఇదే సమయంలో ఉద్యోగాల కల్పన వృద్ధి 1.3 శాతానికి పరిమితం కావడం.. సంస్థలు వ్యయాల నియంత్రణ పేరుతో సిబ్బంది సంఖ్యతో పాటు వేతనాల్లో కోత పెడుతుండటంపై సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 2002–03లో దేశ జీడీపీలో 2.1 శాతంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల లాభాలు 2023–24 నాటికి ఏకంగా 4.8 శాతానికి చేరుకున్నాయని, ఇదే సమయంలో వేతనాల పెరుగుదల చాలా తక్కువగా ఉండటం ఆర్థిక అసమానతలను పెంచుతుందని సర్వే పేర్కొంది.
అయితే దేశ ఆర్థిక పరిస్థితేమీ అంత గొప్పగా లేదు. వృద్ధి నెమ్మదించింది. అమెరికాలో ట్రంప్ విజయం సాధించటమేకాక... భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచుతామని బెదిరిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా విపరీతంగా పెరగటంతో... ఇపుడు బ్లూచిప్, చిన్న, పెద్ద అనే తేడాల్లేకుండా అన్ని కంపెనీల్లోనూ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఫారిన్ ఫండ్స్) తమ వాటాలను అయినకాడికి తెగనమ్మేస్తున్నాయి.
ఇక ద్రవ్యోల్బణం పెరుగుతోంది... డాలర్‌తో పోలిస్తే రూపాయి భారీగా పతనమవుతోంది. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందే తప్ప తగ్గటం లేదు. ఇలాంటి సమస్యలతో దేశం ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో 2025–26 కేంద్ర బడ్జెట్‌ను శనివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ఆమె వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నా... మోదీ ప్రభుత్వం మూడోసారి గెలిచాక ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్.
ఎందుకంటే ఎన్నికలు సంవత్సరం మధ్యలో రావటంతో మిగిలిన కాలానికి ఓటాన్ అకౌంట్‌తో నెట్టుకొచ్చారు. మరి ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలంటే సరికొత్త గేమ్ ఛేంజర్ విధానాలు అవసరమన్నది నిపుణుల మాట. ఒకవైపు పేద, మధ్య తరగతి వర్గాలకు తగిన రక్షణ కల్పిస్తూనే.. వృద్ధిని పరుగులెత్తించాల్సిన బాధ్యత ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఏ మేరకు నెరవేరుస్తారన్నదే సర్వత్రా చర్చనీయమవుతోంది.
ఆదాయపు పన్నులో మరింత ఊరట!
బడ్జెట్ వచ్చిందంటే మధ్య తరగతి ఎదురుచూసేది ఆదాయపు పన్ను సవరణల గురించే. ఈసారి ఆదాయ పన్ను విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించే అవకాశముందని సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల కిందట ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని తెచ్చింది. ఎలాంటి మినహాయింపులూ లేకుండా పన్ను శ్లాబులను మాత్రం సవరించింది. పాత పన్ను విధానంలోనైతే గృహ రుణం, స్కూలు ఫీజుల నుంచి మనం చేసిన వివిధ సేవింగ్స్‌ను కూడా మినహాయించుకునే అవకాశముండేది.
కొత్త విధానంలో అలాంటి మినహాయింపులేవీ లేవు. కాకపోతే పన్ను రేట్లు కాస్త తక్కువ. జీతాన్ని బట్టి ప్రస్తుతం ఎవరి లెక్కలు వారు వేసుకుని, ఎవరికి ఏది అనుకూలమంటే దాన్ని ఎంచుకుంటున్నారు. కాకపోతే రెండేళ్లు ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో ఆకర్షణీయమైన మార్పులు చేస్తూ... పాత పన్ను విధానం నుంచి ఎవరికి వారు స్వచ్ఛందంగా కొత్త విధానంలోకి మారేలా నిర్ణయాలు తీసుకుంటోంది.
ఈసారి పాత విధానం వృథా అనేలా చేసే అవకాశం కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్నుల విధానంలో 72 శాతం మందికి పైగా రిటర్నులు దాఖలు చేశారు. పాత పన్నుల విధానాన్ని రద్దు చేసి.. కొత్త పన్నుల విధానంలో పలు రాయితీలను ప్రకటించడం ద్వారా మధ్య తరగతి ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేయవచ్చన్నది ఆర్థిక మంత్రి ఆలోచనగా ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.
నిపుణుల అంచనాల ప్రకారం... కొత్త విధానంలో రూ.10 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని, రూ.15–20 లక్షల వరకు ఆదాయానికి 25 శాతం కొత్త పన్ను శ్లాబ్‌ను ప్రవేశపెట్టాలనే వాదనలు బలంగా వస్తున్నాయి. ఆర్థిక మంత్రి గనక ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటే బడ్జెట్లో మధ్య తరగతికి మేలు జరిగినట్లే.
బడ్జెట్ సమావేశాల ఆరంభానికి ముందు... శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పన్ను మినహాయింపులపై ఆశలు పెంచేలా ఉన్నాయి. మధ్యతరగతి, పేదలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ... వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పేర్కొనడం గమనార్హం.
ఇన్‌ఫ్రాకు బూస్ట్
కొంతకాలంగా ప్రభుత్వం మౌలిక వసతుల నిర్మాణంపై దృష్టి సారించడం వల్ల ఇన్‌ఫ్రా రంగంమీద ఫోకస్ ఉంటుంది. అయితే ఈ రంగంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు నిరుత్సాహకరంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చే మూలధన వ్యయం మద్దతును పెంచే అవకాశముంది.
వివిధ పరిశ్రమలలో ఇప్పటికే మంచి ఫలితాలను చూపించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకాన్ని విస్తరించడం ద్వారా తయారీ రంగాన్ని బలోపేతం చేసే అవకాశం కనిపిస్తోంది. వినియోగాన్ని పెంచడం తక్షణ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రైవేట్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోటీతత్వం ,ఉపాధి అవకాశాలను పెంచే దీర్ఘకాలిక వ్యూహాలపై బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.
యువత ఉపాధి, కీలక రంగాలకు మద్దతు
రాబోయే రోజుల్లో లక్షల మంది యువతీ యువకులు డిగ్రీ పట్టాలతో మార్కెట్లోకి వస్తారు. వీళ్లందరికీ ఉద్యోగాలు లభిస్తేనే ఆర్థిక వృద్ధి జోరందుకుంటుంది. ఇందువల్ల ఉద్యోగ కల్పనపై కూడా బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించే అవ కాశం ఉంది. నిర్మాణం, జౌళి, ఇ–కామర్స్, పర్యాటక రంగాలు పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి.
ఈ రంగాలకు బడ్జెట్లో మరిన్ని కేటాయింపులు ఉండొచ్చు. దీనికి అదనంగా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం వారికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించడం లక్ష్యంగా విధానాలు ప్రకటించచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికి ప్రభుత్వం నుంచి నిరంతర సహాయం అందేలా చర్యలు తీసుకునే వీలుంది.
ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొనే ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం రుణ హామీ పథకాలను విస్తరించడం, ఎగుమతులకు అదనపు ప్రోత్సాహæకాలు అందించడం వంటి చర్యలను పరిశీలించవచ్చు. వీటికి తోడు చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై విధించే పన్నుల సరళీకరణ కూడా బడ్జెట్లో ఉండొచ్చు.
వ్యవసాయం, గ్రామీణ ఆర్థికంపై ఫోకస్
వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో ఎక్కువ మద్దతు లభించే అవకాశం ఉంది. రైతులు రుణాలను సులభంగా పొందడానికి ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ పథకాలను విస్తరించవచ్చు. ఈ రంగానికి మరింత మద్దతుగా, ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మరిన్ని కేటాయింపులు చేసే అవకాశం ఉంది.
పంట నిల్వల కోసం గోదాముల నిర్మాణం, వ్యవసాయ మార్కెటింగ్ కోసం మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వొచ్చు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ వంటి కార్యక్రమాలు నీటిపారుదలను గణనీయంగా పెంచినప్పటికీ, ఇంకా పురోగతికి అవకాశం ఉంది. పరిశోధన, అభివృద్ధితో సహా సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యవస్థలతో వ్యవసాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే ప్రయత్నం చేయొచ్చు.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెంచడానికి రైతులకు మరింత మద్దతు అవసరం. గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకి పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని, అందుబాటు గృహాల నిర్మాణం మరో ముఖ్యమైన అంశంగా ఉండొచ్చు. ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ఉపాధి పథకాలకు నిధులు పెంచి, దాని పరిధిని విస్తరించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment