Economic Survey
-
ఆర్థిక సర్వే
అన్ని చేతులూ కలిస్తేనే తయారీ దిగ్గజంభారత్ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం, ప్రైవేటు రంగం, విద్యా సంస్థలు, పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) సంస్థలు, ఆర్థిక సంస్థల మధ్య సమన్వయంతో కూడిన సహకారాత్మక చర్యలు అవసరమని ఆర్థిక సర్వే సూచించింది. నియంత్రణలు సడలించడం, అవసరమైన నైపుణ్యాలు, ఉపాధి కల్పన వ్యూహాలు అమలు చేయడం, ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకమైన మద్దతు చర్యలతో భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచొచ్చని అభిప్రాయపడింది. అప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, సవాళ్లను భారత సంస్థలు ఎదుర్కొని రాణించగలవని వివరించింది. బంగారం తగ్గొచ్చు.. వెండి పెరగొచ్చు బంగారం ధరలు ఈ ఏడాది తగ్గొచ్చని, వెండి ధరలు పెరగొచ్చని ఆర్థిక సర్వే అంచనాలు వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ కమోడిటీ మార్కెట్ అవుట్‌లుక్ 2024 నివేదికను ప్రస్తావిస్తూ. కమోడిటీ ధరలు 2025లో 5.1 శాతం, 2026లో 1.7 శాతం తగ్గుతాయన్న అంచనాలను ప్రస్తావించింది. మెటల్స్, వ్యవసాయ ముడి సరకుల ధరలు స్థిరంగా ఉంటాయని, చమురు ధరలు తగ్గొచ్చని, సహజ వాయువు ధరలు పెరగొచ్చని పేర్కొంది. బంగారం ధరలు తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించొచ్చని తెలిపింది. దేశం దిగుమతి చేసుకునే కమోడిటీల ధరలు తగ్గడం అది సానుకూలమని, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను తగ్గిస్తుందని అభిప్రాయపడింది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలి.. ఈవీల తయారీలో స్వావలంబన ఎలక్ట్రిక్ వాహనాలు, ఎల్రక్టానిక్స్ తయారీలో స్వావలంబన దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. ముడి సరుకులు, విడిభాగాల కోసం చైనా తదితర కొన్ని దేశాలపై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గించాలని, సరఫరా వ్యవస్థలోని రిస్‌్కలను తొలగించే చర్యలు చేపట్టాలని సూచించింది. కీలక విడిభాగాలు, ముడి సరుకులపై అంతర్జాతీయంగా చైనా ఆధిపత్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. సంప్రదాయ వాహనంతో పోల్చి చూసినప్పుడు ఈవీల తయారీలో ఆరు రెట్లు అధికంగా ఖనిజాలను వినియోగించాల్సిన పరిస్థితిని ప్రస్తావించింది. ఈ ఖనిజాల్లో చాలా వరకు మన దగ్గర లభించకపోవడాన్ని గుర్తు చేసింది. ‘‘సోడియం అయాన్, సాలిడ్ స్టేట్ బ్యాటరీలు తదితర అత్యాధునిక బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానాలకు పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) నిధులు పెంచడం ద్వారా స్వావలంబన ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలి. ఈ విభాగంలో మేధో హక్కులను సంపాదించుకోవాలి. బ్యాటరీ రీసైక్లింగ్ సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలి. దీనివల్ల భారత ఆటోమొబైల్ రంగానికి దీర్ఘకాల ప్రయోజనాలు ఒనగూరుతాయి’’అని ఆర్థిక సర్వే సూచించింది. మరోవైపు పర్యావరణ అనుకూల ఇంధనాలకు మళ్లే విషయంలోనూ చైనా దిగుమతులపై అధికంగా ఆధారపడడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణలు సడలించడం ద్వారా దేశీ పరిశ్రమకు మద్దతుగా నిలవాలని సూచించింది. పీఎల్ఐ, ఫేమ్ పథకాలను ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో ఈవీల అవసరాలను తీర్చే విధానాలపై దృష్టి సారించాలని పేర్కొంది. వారానికి 60 గంటలు మించి పని.. ఆరోగ్యానికి హానికరం.. వారానికి 60 గంటలకు మించి పని చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఎకనమిక్ సర్వే పేర్కొంది. ఆఫీస్ డెస్క్ ముందు గంటల తరబడి కూర్చోవడమనేది మానసిక ఆరోగ్యానికి హానికరమని వివరించింది. రోజూ 12 గంటలకు పైగా డెస్క్‌లోనే గడిపే వారు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఉద్యోగి ఉత్పాదకతకు ఆఫీసులో గడిపిన సమయమే కొలమానమని అభిప్రాయం నెలకొన్నప్పటికీ మెరుగైన జీవన విధానాలు, వర్క్‌ప్లేస్ సంస్కృతి, కుటుంబ సంబంధాలు మొదలైనవి కూడా ఉత్పాదకతకు కీలకమని సేపియన్ ల్యాబ్స్ సెంటర్ అధ్యయన నివేదికలో వెల్లడైనట్లు ఆర్థిక సర్వే వివరించింది. వారానికి 70–90 గంటలు పని చేయాలన్న ఇన్ఫీ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్అండ్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న తరుణంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. మెరుగుపడిన విమాన కనెక్టివిటీ కొత్త విమానాశ్రయాలు, ఉడాన్ స్కీముతో దేశీయంగా ఎయిర్ కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య నిర్దేశించిన రూ. 91,000 కోట్ల పెట్టుబడి వ్యయాల లక్ష్యంలో ఎయిర్పోర్ట్ డెవలపర్లు, ఆపరేటర్లు దాదాపు 91 శాతాన్ని ఖర్చు చేసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్‌లో ఏవియేషన్ మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని, భారతీయ ఎయిర్‌లైన్స్ భారీ స్థాయిలో కొత్త విమానాలకు ఆర్డర్లిచ్చాయని సర్వే వివరించింది. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్వో) పరిశ్రమకు సంబంధించి భారత్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలంటూ తయారీ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపింది. రియల్ ఎస్టేట్‌లో బలమైన డిమాండ్ ఆర్థిక స్థిరత్వం, రహదారులు, మెట్రో నెట్‌వర్క్‌ల కల్పన వంటివి దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్‌ను పెంచినట్టు ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ కోసం ‘రెరా’తోపాటు, జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ఈ రంగానికి మేలు చేసినట్టు తెలిపింది. 2036 నాటికి ఇళ్లకు డిమాండ్ 9.3 కోట్ల యూనిట్లకు చేరుకుంటుందన్న పలు నివేదికల అంచనాలను ప్రస్తావించింది. 2024 మొదటి ఆరు నెలల్లో ఇళ్ల అమ్మకాలు 11 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడాన్ని గుర్తు చేసింది. రెరా రాకతో రియల్ఎస్టేట్ రంగంలో మోసాల నుంచి రక్షణ లభించిందని, పారదర్శకత, సకాలంలో ప్రాజెక్టుల పూర్తికి దారి చూపిందని వివరించింది. ఇళ్ల ప్లాన్లకు ఆన్లైన్ అనుమతులుతో జాప్యం తగ్గి, పారదర్శకత పెరిగినట్టు తెలిపింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు(రీట్లు) ప్రోత్సాహం వాణిజ్య రియల్ ఎస్టేట్‌కు సానుకూలిస్తుందని అభిప్రాయపడింది. 11.6 బిలియన్ డాలర్లకు డేటా సెంటర్ మార్కెట్మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా డేటా సెంటర్ మార్కెట్ 2032 నాటికి 11.6 బిలియన్ డాలర్ల స్థాయికి చేరవచ్చని ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. 2023లో ఇది 4.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐటీ, డిజిటల్ సేవల వ్యవస్థ పటిష్టంగా ఉండటం, రియల్ ఎస్టేట్ ధరలు తక్కువగా వల్ల డేటా సెంటర్ల ఏర్పాటు వ్యయాలు చౌకగా ఉండటం భారత్‌కు లాభిస్తుందని పేర్కొంది. డేటా సెంటర్ ఏర్పాటుకు ఆ్రస్టేలియాలో సగటున ప్రతి మెగావాట్‌కు వ్యయాలు 9.17 మిలియన్ డాలర్లుగా, అమెరికాలో 12.73 మిలియన్ డాలర్లుగా ఉండగా భారత్‌లో 6.8 మిలియన్ డాలర్లేనని సర్వే వివరించింది. జీసీసీల్లో ’గ్లోబల్’ ఉద్యోగాలుభారత్లో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) అంతర్జాతీయ కార్యకలాపాలకి సంబంధించి నియమించుకునే (గ్లోబల్) ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగనుందని ఆర్థిక సర్వే తెలిపింది. 2030 నాటికి ఇది నాలుగు రెట్లు పెరిగి 30,000కు చేరుతుందని వివరించింది. ప్రస్తుతం ఈ సంఖ్య 6,500గా ఉంది. గత దశాబ్ద కాలంలో భారత్‌లో జీసీసీ వ్యవస్థ పురోగమించిందని, ప్రోడక్ట్ మేనేజర్లు, ఆర్కిటెక్టుల్లాంటి హై–ఎండ్ ఇంజినీరింగ్ ఉద్యోగాలను కూడా టెక్ నిపుణులు దక్కించుకుంటున్నారని సర్వే తెలిపింది. 2019లో 1,430గా ఉన్న జీసీసీల సంఖ్య 2024 నాటికి 1,700కు పెరిగిందని, వీటిల్లో దాదాపు 19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొంది.ఏఐతో ఉద్యోగాలకు రిస్కే కృత్రిమ మేథతో (ఏఐ) ఎంట్రీ స్థాయి ఉద్యోగాలకు ముప్పు ఉంటుందని, ముఖ్యంగా జీవనోపాధి కోసం ఉద్యోగాల మీదే ఎక్కువగా ఆధారపడే భారత్‌లాంటి దేశాల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సరైన ప్రణాళికలు లేకుండా ఉద్యోగుల స్థానాన్ని ఏఐతో భర్తీ చేసేందుకు కంపెనీలు తొందరపడటం శ్రేయస్కరం కాదని ఐఎంఎఫ్ నివేదికను ఉటంకిస్తూ, సూచించింది. ఒకవేళ అలా చేసిన పక్షంలో ఉపాధి కోల్పోయిన వర్కర్లకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకుని, కార్పొరేట్ల లాభాలపై మరింతగా పన్నులు విధించడం, ఇతరత్రా పాలసీపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వివరించింది. ఎఫ్డీలకు అన్ని అడ్డంకులు తొలగాలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) భారత్ మరింతగా ఆకర్షించేందుకు వీలుగా అన్ని అవరోధాలను తొలగించాలని, పన్నుల పరమైన నిలకడను తీసుకురావాలని ఆర్థిక సర్వే సూచించింది. సమీప కాలంలో వడ్డీ రేట్లు, ద్రవ్యల్బోణ ఒత్తిళ్లు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితులు ఉన్నా కానీ, దీర్ఘకాలానికి భారత్ ఎఫ్డీలకు అనుకూల కేంద్రంగా కొనసాగుతుందని అభిప్రాయపడింది. బలమైన దేశ ఆర్థిక మూలాలు, ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు, కన్జ్యూమర్ మార్కెట్ వృద్ధి సానుకూలతలుగా పేర్కొంది. ఇప్పటికే చాలా రంగాల్లో ఎఫ్డీలను ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తున్నట్టు తెలిపింది. డిజిటల్ కనెక్టివిటీకి 5జీ దన్నుదేశవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో 5జీ సర్విసులను ప్రవేశపెట్టడంతో పాటు టెలికం మౌలిక సదుపాయాలను, యూజర్ అనుభూతిని మెరుగుపర్చేందుకు నియంత్రణ సంస్థ తీసుకుంటున్న చర్యలతో డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపడినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. ప్రస్తుతం 783 జిల్లాలకు గాను 779 జిల్లాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నట్లు వివరించింది. భారత్ నెట్ ప్రాజెక్టు కింద 2024 డిసెంబర్ నాటికి 6.92 లక్షల కి.మీ. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) వేసినట్లు పేర్కొంది. -
సంస్కరణల మోత.. వృద్ధికి చేయూత!
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొంటోందని ఆర్థిక సర్వే కుండబద్దలు కొట్టింది. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్న నేపథ్యంలో తక్షణం ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేసి, వృద్ధికి చేయూతనివ్వాలంటే... పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న పలు నియంత్రణలను తొలగించడంతో పాటు భూ, కార్మిక తదితర కీలక సంస్కరణలు అమలు చేయాలని తేల్చిచెప్పింది. మరోపక్క, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, వినిమయం భారీగా పుంజుకునేలా చర్యలు చేపట్టాలని సూచించింది. మరికొద్ది గంటల్లో మోదీ 3.0 సర్కారు కీలక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో 2024–25 ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్‌కు సమర్పించారు. న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.3–6.8 శాతానికి పరిమితం కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ ఏడాది వృద్ధి 6.4 శాతానికి పడిపోవచ్చని ఇప్పటికే కేంద్రం ముందస్తు అంచనాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. కరోనా తర్వాత జీడీపీ వృద్ధి రేటు మళ్లీ ఇంతలా బలహీనపడటం ఇదే తొలిసారి. 2023–24 ఏడాదికి వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. కాగా, 2024 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన దేశం)గా అవతరించాలంటే వచ్చే ఒకట్రెండు దశాబ్దాల పాటు జీడీపీ ఏటా 8 శాతం చొప్పున వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సర్వే నొక్కి చెప్పింది. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించాలంటే పలు రంగాల్లో, ముఖ్యంగా భూ, కార్మిక సంస్కరణలు చేపట్టాలని తెలిపింది. అంతేకాకుండా, జీడీపీలో పెట్టుబడుల శాతాన్ని ఇప్పుడున్న 31 శాతం నుంచి 35 శాతానికి పెంచాల్సిందేనని కూడా పేర్కొంది. తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, బయో టెక్నాలజీ వంటి వర్ధమాన టెక్నాలజీల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సూచించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2027–28లో 5 ట్రిలియన్ డాలర్లను, 2029–30లో 6.3 ట్రిలియన్ డాలర్లను తాకే అవకాశం ఉంది. ధరలు దిగొస్తాయి... కొత్త పంట చేతికి రావడం, సీజనల్‌గా కొన్ని కూర గాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇక ఆహార ద్రవ్యోల్బణం శాంతించే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఆర్బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యం 4%కి అటుఇటుగానే రిటైల్ ద్రవ్యోల్బణం ఉండొ చ్చని పేర్కొంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయంగా కమోడిటీ ధరల సెగ వంటి రిస్కులు పొంచిఉన్నాయని తెలిపింది. 2024 డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టమైన 5.2%కి దిగొచ్చింది. అయితే, కూరగాయల ధరల మంటతో ఆహార ద్రవ్యోల్బణం ఇంకా భారీగానే 8.4%గా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయ రిసు్కలు ఆందోళనకరంగానే ఉన్నా యని కూడా సర్వే పేర్కొంది.నియంత్రణల సంకెళ్లు తెంచాలి... ‘మౌలిక రంగంలో పెట్టుబడులను పెంచాలంటే వ్యవస్థలో పాతుకుపోయిన నియంత్రణ సంకెళ్లను తెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలు కూడా వ్యాపారాలకు అడ్డంకులుగా నిలుస్తున్న పలు నిబంధనలను సరళీకరించడంతో పాటు పలు రకాల టారిఫ్‌లలో కోత విధించాలి. దేశంలో నవకల్పనలను ప్రోత్సహించి, చిన్న మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) రంగానికి దన్నుగా నిలిచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. జర్మనీ, స్విట్జర్లాండ్, జపాన్, సింగపూర్ తదితర దేశాల ఆర్థిక విజయంలో ఎస్ఎంఈలు కీలక పాత్ర పోషించాయి. అధిక నియంత్రణ వల్ల ఇన్నోవేషన్, ఆర్థికవ్యవస్థ చురుకుదనానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఈ దిశగా భూ, కార్మిక, తదితర సంస్కరణలు అత్యవసరం’ అని సర్వే పేర్కొంది.సర్వేలో ఇతర ముఖ్యాంశాలు... → దేశంలో సేవల రంగం మంచి పనితీరును కనబరుస్తోంది. తయారీ రంగం మా త్రం కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటోంది. → ప్రపంచ ఆర్థిక అనిశి్చతిని సైతం తట్టుకుని మన ఫైనాన్షియల్ రంగం పురోగమిస్తోంది. బ్యాంకులు లాభాలు మెరుగుపడ్డాయి. రుణాలు, డిపాజిట్ల మధ్య వ్యత్యాసం తగ్గుతోంది. → పెట్టుబడులకు దన్నుగా, పొదుపులను మదుపుగా మార్చడంలో, సంపద సృష్టిలో మన క్యాపిటల్ మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2013–14 నుంచి 2023–24 మధ్య ఐపీఓ ద్వారా కంపెనీల లిస్టింగ్‌లు ఆరు రెట్లు పెరిగాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లకు యువ ఇన్వెస్టర్లే చోదక శక్తిగా నిలుస్తున్నారు. → విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో ఎగుమతుల వృద్ధి మందగించింది. మరోపక్క, దేశీయంగా పటిష్ట డిమాండ్‌తో దిగుమతులు పెరిగాయి. రక్షణాత్మక ధోరణులు పెరిగిపోవడంతో ప్రపంచ వాణిజ్య ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన ఎగుమతులకు పోటీతత్వం పెంచాలంటే వ్యూహాత్మక వాణిజ్య రోడ్‌మ్యాప్ అత్యవసరం. → అధిక ప్రభుత్వ వ్యయం, మెరుగుపడుతున్న వ్యాపార విశ్వాసంతో పెట్టుబడులు మళ్లీ పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. → సమృద్ధిగా 640 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇది 90 శాతం విదేశీ రుణానికి సమానం, అలాగే దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపోతాయి. → వ్యాపారాలకు సానుకూల వాతావరణం కల్పించేలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0లో రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలి. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేయాలి. → అధిక వృద్ధి పథంలో సాగాలంటే వచ్చే రెండు దశాబ్దాల పాటు మౌలిక రంగంలో పెట్టుబడులను దశలవారీగా పెంచాలి. → కార్పొరేట్ రంగం సామాజిక బాధ్యత విషయంలో మరింతగా దృష్టి సారించాలి. → పప్పు ధాన్యాలు, నూనెగింజలు, టమాటా, ఉల్లి ఉత్పత్తిని పెంచేలా పరిశోధనలు జరగాలి. అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంట రకాలను రూపొందించడంతో పాటు పంట దిగుబడి పెంచి, పంట నష్టాలను తగ్గించడంపై దృష్టి పెట్టాలి.వ్యవసాయోత్పత్తి పుంజుకోవడం గ్రామీణ డిమాండ్‌కు దన్నుగా నిలుస్తోంది. ఆహార ధరలు శాంతించే అవకాశం ఉండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో వృద్ధి మళ్లీ పట్టాలెక్కనుంది. భౌగోళిక రాజకీయ, వాణిజ్య అనిశి్చతులతో పాటు కమోడిటీ ధరల షాక్‌లు మన ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అడ్డంకులుగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ మనదే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీ. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే వృద్ధిని పరుగులు పెట్టించాల్సిందే’. – వి. అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారుపటిష్టమైన దేశీ డిమాండ్, పెట్టుబడులు పుంజుకుంటున్న నేపథ్యంలో వృద్ధి కాస్త మెరుగ్గానే (6.5–6.8%) ఉండొచ్చు. వ్యవసాయ దిగుబడుల జోరు, బలమైన సేవల రంగం వృద్ధికి కీలక చోదకాలు. పాశ్చాత్య దేశాల పాలసీలు, భౌగోళిక–ఆర్థిక అడ్డంకులు సరఫరా వ్యవస్థల రూపురేఖలను మార్చేస్తున్నాయి’. – రుమ్కి మజుందార్, డెలాయిట్ ఇండియా ఎకనమిస్ట్‘భారత్ వృద్ధి రేటు జోరును కొనసాగించాలంటే ప్రపంచ దేశాలతో పోటీతత్వాన్ని పెంచుకోవాల్సిందే. నిర్మాణాత్మక సంస్కరణలు, నియంత్రణల తొలగింపు ద్వారానే ఇది సాధ్యం’ – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
‘ఐటీ’ కటాక్షించేనా?
(సాక్షి, బిజినెస్ డెస్క్, సాక్షి, అమరావతి) : మరి కొద్ది గంటల్లో బడ్జెట్(Budget) ప్రవేశపెట్టనున్న తరుణంలో వెలువడిన కేంద్ర ఆర్థిక సర్వేతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) చేసిన వ్యాఖ్యలు వేతన జీవులు, మధ్య తరగతి వర్గాల్లో ఆశలను పెంచుతున్నాయి. 2014 నుంచి పన్నుల శ్లాబులు మార్చకపోవడం.. మండిపోతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా జీతాలు పెరగని నేపథ్యంలో ఈదఫా వేతన జీవులకు ఊరట లభిస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదలైన ఆర్థిక సర్వే ఇదే సంకేతాలనిచ్చింది. 2023–24లో కంపెనీల లాభాలు 22.3 శాతం పెరగగా ఇదే సమయంలో ఉద్యోగాల కల్పన వృద్ధి 1.3 శాతానికి పరిమితం కావడం.. సంస్థలు వ్యయాల నియంత్రణ పేరుతో సిబ్బంది సంఖ్యతో పాటు వేతనాల్లో కోత పెడుతుండటంపై సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 2002–03లో దేశ జీడీపీలో 2.1 శాతంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల లాభాలు 2023–24 నాటికి ఏకంగా 4.8 శాతానికి చేరుకున్నాయని, ఇదే సమయంలో వేతనాల పెరుగుదల చాలా తక్కువగా ఉండటం ఆర్థిక అసమానతలను పెంచుతుందని సర్వే పేర్కొంది. అయితే దేశ ఆర్థిక పరిస్థితేమీ అంత గొప్పగా లేదు. వృద్ధి నెమ్మదించింది. అమెరికాలో ట్రంప్ విజయం సాధించటమేకాక... భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచుతామని బెదిరిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా విపరీతంగా పెరగటంతో... ఇపుడు బ్లూచిప్, చిన్న, పెద్ద అనే తేడాల్లేకుండా అన్ని కంపెనీల్లోనూ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఫారిన్ ఫండ్స్) తమ వాటాలను అయినకాడికి తెగనమ్మేస్తున్నాయి. ఇక ద్రవ్యోల్బణం పెరుగుతోంది... డాలర్‌తో పోలిస్తే రూపాయి భారీగా పతనమవుతోంది. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందే తప్ప తగ్గటం లేదు. ఇలాంటి సమస్యలతో దేశం ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో 2025–26 కేంద్ర బడ్జెట్‌ను శనివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ఆమె వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నా... మోదీ ప్రభుత్వం మూడోసారి గెలిచాక ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్.ఎందుకంటే ఎన్నికలు సంవత్సరం మధ్యలో రావటంతో మిగిలిన కాలానికి ఓటాన్ అకౌంట్‌తో నెట్టుకొచ్చారు. మరి ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలంటే సరికొత్త గేమ్ ఛేంజర్ విధానాలు అవసరమన్నది నిపుణుల మాట. ఒకవైపు పేద, మధ్య తరగతి వర్గాలకు తగిన రక్షణ కల్పిస్తూనే.. వృద్ధిని పరుగులెత్తించాల్సిన బాధ్యత ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఏ మేరకు నెరవేరుస్తారన్నదే సర్వత్రా చర్చనీయమవుతోంది.ఆదాయపు పన్నులో మరింత ఊరట!బడ్జెట్ వచ్చిందంటే మధ్య తరగతి ఎదురుచూసేది ఆదాయపు పన్ను సవరణల గురించే. ఈసారి ఆదాయ పన్ను విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించే అవకాశముందని సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల కిందట ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని తెచ్చింది. ఎలాంటి మినహాయింపులూ లేకుండా పన్ను శ్లాబులను మాత్రం సవరించింది. పాత పన్ను విధానంలోనైతే గృహ రుణం, స్కూలు ఫీజుల నుంచి మనం చేసిన వివిధ సేవింగ్స్‌ను కూడా మినహాయించుకునే అవకాశముండేది. కొత్త విధానంలో అలాంటి మినహాయింపులేవీ లేవు. కాకపోతే పన్ను రేట్లు కాస్త తక్కువ. జీతాన్ని బట్టి ప్రస్తుతం ఎవరి లెక్కలు వారు వేసుకుని, ఎవరికి ఏది అనుకూలమంటే దాన్ని ఎంచుకుంటున్నారు. కాకపోతే రెండేళ్లు ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో ఆకర్షణీయమైన మార్పులు చేస్తూ... పాత పన్ను విధానం నుంచి ఎవరికి వారు స్వచ్ఛందంగా కొత్త విధానంలోకి మారేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈసారి పాత విధానం వృథా అనేలా చేసే అవకాశం కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్నుల విధానంలో 72 శాతం మందికి పైగా రిటర్నులు దాఖలు చేశారు. పాత పన్నుల విధానాన్ని రద్దు చేసి.. కొత్త పన్నుల విధానంలో పలు రాయితీలను ప్రకటించడం ద్వారా మధ్య తరగతి ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేయవచ్చన్నది ఆర్థిక మంత్రి ఆలోచనగా ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం... కొత్త విధానంలో రూ.10 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని, రూ.15–20 లక్షల వరకు ఆదాయానికి 25 శాతం కొత్త పన్ను శ్లాబ్‌ను ప్రవేశపెట్టాలనే వాదనలు బలంగా వస్తున్నాయి. ఆర్థిక మంత్రి గనక ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటే బడ్జెట్లో మధ్య తరగతికి మేలు జరిగినట్లే. బడ్జెట్ సమావేశాల ఆరంభానికి ముందు... శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పన్ను మినహాయింపులపై ఆశలు పెంచేలా ఉన్నాయి. మధ్యతరగతి, పేదలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ... వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పేర్కొనడం గమనార్హం. ఇన్ఫ్రాకు బూస్ట్కొంతకాలంగా ప్రభుత్వం మౌలిక వసతుల నిర్మాణంపై దృష్టి సారించడం వల్ల ఇన్ఫ్రా రంగంమీద ఫోకస్ ఉంటుంది. అయితే ఈ రంగంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు నిరుత్సాహకరంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చే మూలధన వ్యయం మద్దతును పెంచే అవకాశముంది. వివిధ పరిశ్రమలలో ఇప్పటికే మంచి ఫలితాలను చూపించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని విస్తరించడం ద్వారా తయారీ రంగాన్ని బలోపేతం చేసే అవకాశం కనిపిస్తోంది. వినియోగాన్ని పెంచడం తక్షణ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రైవేట్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోటీతత్వం ,ఉపాధి అవకాశాలను పెంచే దీర్ఘకాలిక వ్యూహాలపై బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.యువత ఉపాధి, కీలక రంగాలకు మద్దతురాబోయే రోజుల్లో లక్షల మంది యువతీ యువకులు డిగ్రీ పట్టాలతో మార్కెట్లోకి వస్తారు. వీళ్లందరికీ ఉద్యోగాలు లభిస్తేనే ఆర్థిక వృద్ధి జోరందుకుంటుంది. ఇందువల్ల ఉద్యోగ కల్పనపై కూడా బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించే అవ కాశం ఉంది. నిర్మాణం, జౌళి, ఇ–కామర్స్, పర్యాటక రంగాలు పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి.ఈ రంగాలకు బడ్జెట్లో మరిన్ని కేటాయింపులు ఉండొచ్చు. దీనికి అదనంగా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం వారికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించడం లక్ష్యంగా విధానాలు ప్రకటించచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి ప్రభుత్వం నుంచి నిరంతర సహాయం అందేలా చర్యలు తీసుకునే వీలుంది. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొనే ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం రుణ హామీ పథకాలను విస్తరించడం, ఎగుమతులకు అదనపు ప్రోత్సాహæకాలు అందించడం వంటి చర్యలను పరిశీలించవచ్చు. వీటికి తోడు చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై విధించే పన్నుల సరళీకరణ కూడా బడ్జెట్లో ఉండొచ్చు.వ్యవసాయం, గ్రామీణ ఆర్థికంపై ఫోకస్వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి బడ్జెట్లో ఎక్కువ మద్దతు లభించే అవకాశం ఉంది. రైతులు రుణాలను సులభంగా పొందడానికి ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ పథకాలను విస్తరించవచ్చు. ఈ రంగానికి మరింత మద్దతుగా, ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మరిన్ని కేటాయింపులు చేసే అవకాశం ఉంది. పంట నిల్వల కోసం గోదాముల నిర్మాణం, వ్యవసాయ మార్కెటింగ్ కోసం మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వొచ్చు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ వంటి కార్యక్రమాలు నీటిపారుదలను గణనీయంగా పెంచినప్పటికీ, ఇంకా పురోగతికి అవకాశం ఉంది. పరిశోధన, అభివృద్ధితో సహా సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యవస్థలతో వ్యవసాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే ప్రయత్నం చేయొచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెంచడానికి రైతులకు మరింత మద్దతు అవసరం. గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకి పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని, అందుబాటు గృహాల నిర్మాణం మరో ముఖ్యమైన అంశంగా ఉండొచ్చు. ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ఉపాధి పథకాలకు నిధులు పెంచి, దాని పరిధిని విస్తరించే అవకాశముంది. -
Budget 2025: ఆర్థిక సర్వేలో పని గంటల ప్రస్తావన
వర్క్-లైఫ్ బ్యాలెన్సింగ్ గురించి ఈ మధ్యకాలంలో విస్తృతస్థాయి చర్చ నడుస్తోంది. చైర్మన్, సీఈవో స్థాయిలో ఉన్న వ్యక్తులు నేరుగా స్పందిస్తుండడం.. వాటిపై విమర్శలు-సమర్థనలతో ఈ చర్చ కొనసాగుతోంది. ఈ దరిమిలా ఇవాళ విడుదలైన ఆర్థిక సర్వే సైతం పనిగంటల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.పని గంటల చర్చలో ఇప్పుడు ఎకనామిక్ సర్వే సైతం భాగమైంది. వారానికి 60 గంటలకు మించి పని చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. వివిధ అధ్యయనాల నివేదికలను ఇందులో ప్రముఖంగా ప్రస్తావించింది. ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం..‘‘ఆఫీసుల్లో ఎక్కువ సేపు గడపడం వల్ల మానసిక శ్రేయస్సుకు మంచిది కాదు. రోజుకు 12, అంతకంటే ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తులు గణనీయమైన స్థాయిలో బాధను అనుభవిస్తున్నారు. వారానికి ఎక్కువ గంటలు పని చేయడం ఆరోగ్యానికి హానికరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ(ILO) అధ్యయనాల నివేదికలూ ఈ విషయాన్నే స్పష్టం చేశాయి... అనధికారికంగా.. ఎక్కువ పని గంటలతో ఉత్పాదకత(Productivity) పెరిగినా.. వారానికి 55-50 గంటల మధ్య పని చేయడం ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమేనని డబ్ల్యూహెచ్‌వో-ఐఎల్వో సంయుక్త అధ్యయన నివేదిక స్పష్టం చేసింది’’ అని ఆర్థిక సర్వే వెల్లడించింది. అలాగే.. సుదీర్ఘంగా ఒకే దగ్గర ఎక్కువ గంటలు పని చేయడం మానసిక ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందని సపెయిన్ లాబ్స్ సెంటర్ ఫర్ హుమన్ బ్రెయిన్ అండ్ మైండ్ స్టడీ రిపోర్ట్‌ను ఎకనామిక్ సర్వే హైలెట్ చేసింది.ఇక.. పని గంటలపై పరిమితులు విధించడం ఆర్థిక వృద్ధికి అవాంతరాన్ని కలిగించొచ్చని సర్వే అభిప్రాయపడింది. అలాగే కార్మికుల సంపాదన సామర్థ్యాన్ని దెబ్బ తీసే అవకాశం లేకపోలేదని తెలిపింది. కాబట్టి సౌకర్యవంతమైన పని గంటల విధానం భారతదేశాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుతుందని.. ఈ చర్యలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి తోడ్పడుతుంది అని ఆర్థిక సర్వే సూచించింది.బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. అనంతరం 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. బడ్జెట్‌కు ముందర దీనిని ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. -
నిపుణ్ భారత్ ఇనిషియేటివ్పై ఆర్థిక సర్వే ఫోకస్
కేంద్ర బడ్జెట్ 2025ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను విడుదల చేశారు. ఇది భారతదేశ ఆర్థిక పనితీరుతోపాటు భవిష్యత్తు పరిణామాలకు పునాది వేసింది. 2026లో 3వ తరగతి పూర్తి చేసుకునే ప్రతి చిన్నారికి సమగ్ర అక్షరాస్యత కల్పించేందుకు ‘నిపుణ్ భారత్ ఇనిషియేటివ్’ కార్యక్రమాన్ని ఈ సర్వే హైలైట్ చేసింది.నిపుణ్ భారత్ ఇనిషియేటివ్కేంద్ర మంత్రిత్వశాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత్ నాగేశ్వరన్ నిపుణ్ భారత్ ఇనిషియేటివ్పై చర్చించారు. 2026 నాటికి 3వ తరగతి పూర్తి చేసుకునే చిన్నారులకు ఈ ప్రోగ్రామ్ ద్వారా బేసిక్ అక్షరాస్యత, సంఖ్యలపై పూర్తి అవగాహన కల్పించేలా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. విద్యా సవాళ్లను పరిష్కరించడంలో, దేశవ్యాప్తంగా లెర్నింగ్ స్కిల్స్‌ను మెరుగుపరచడంలో ఈ నిర్ణయం కీలకంగా మారుతుందని భావిస్తున్నారు. ఆర్థిక సర్వేలో పేర్కొన్న విధంగా బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో విజయవంతమైన నిర్దిష్ట కార్యక్రమాలను సీఈఏ హైలైట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉండబోయే కొన్ని కీలకాంశాలు కింది విధంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక సర్వే 2025 ముఖ్యాంశాలుఉపాధ్యాయ శిక్షణ: బేసిక్ నైపుణ్యాలను సమర్థవంతంగా విద్యార్థులకు అందించడానికి ఉపాధ్యాయులకు విస్తృతమైన శిక్షణను అందించడం.పాఠ్యప్రణాళిక రూపకల్పన: ప్రాథమిక దశ నుంచే అక్షరాస్యత, సంఖ్యలపై నైపుణ్యానికి ప్రాధాన్యమిచ్చే పాఠ్యప్రణాళికను రూపొందించి అమలు చేయడం.సమాజాన్ని భాగస్వామ్యం చేయడం: పిల్లల అభ్యసనకు మద్దతు ఇవ్వడానికి విద్యా ప్రక్రియలో తల్లిదండ్రులు, సమాజాన్ని భాగస్వామ్యం చేయడం.మానిటరింగ్ అండ్ అసెస్మెంట్: బేసిక్ నైపుణ్యాల్లో విద్యార్థుల పురోగతిని పర్యవేక్షించడానికి, వాటిని అంచనా వేయడానికి బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడం. -
స్టాక్ మార్కెట్‌కు ఆర్థిక సర్వే ఊతం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆర్థిక సర్వే 2024-25ను సమర్పించిన అనంతరం దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా నాల్గవ సెషన్లో లాభాలను కొనసాగించాయి. ఇంట్రా-డే గరిష్ఠ స్థాయి 77,549.92 పాయింట్లకు చేరుకున్న తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్ దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 740.76 పాయింట్లు లేదా 0.97 శాతం పెరిగి 77,500.57 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 258.90 పాయింట్లు లేదా 1.11 శాతం పెరిగి 23,508.40 స్థాయిల వద్ద ముగిసింది. ఈరోజు ఇండెక్స్ 23,530.70-23,277.40 రేంజ్లో ట్రేడయింది. నిఫ్టీ50లో టాటా కన్స్యూమర్, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్, లార్సెన్ & టూబ్రో, కోల్ ఇండియా నేతృత్వంలోని 47 స్టాక్‌లు 6.24 శాతం వరకు లాభాలను చూశాయి. మరోవైపు భారతీ ఎయిర్టెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ హోటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్ 0.82 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు వరుసగా 1.89 శాతం, 2.11 శాతంతో బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ నేతృత్వంలోని అన్ని రంగాల సూచీలు వరుసగా 2.04 శాతం, 2.44 శాతం లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, మెటల్, ఓఎంసీలు, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు శుక్రవారం 1 శాతంపైగా లాభాలతో ముగిశాయి.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) పార్లమెంట్లో సమర్పించనున్న కేంద్ర బడ్జెట్ 2024-25 కోసం డి-స్ట్రీట్ ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ కారణంగా భారతీయ ఈక్విటీ మార్కెట్ శనివారం ట్రేడింగ్‌కు తెరిచి ఉంటుంది. -
ఏఐతో ముప్పు ఇదీ.. ఆర్థిక సర్వే హెచ్చరిక!
విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో ప్రయోజనాలు ఎంత ఉన్నా దాని విపరిణామాల పట్ల చాలా మందిలో ఆందోళన ఉంది. ఆరోగ్య సంరక్షణ, పరిశోధన నుండి ఆర్థికాంశాలు, విద్య వరకు ఆర్థికంగా విలువైన చాలా పనులను ఆటోమేట్ చేయడం ద్వారా పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు తెస్తామని ఏఐ డెవలపర్లు హామీ ఇస్తున్నప్పటికీ, ఈ పురోగతి గణనీయమైన విపరిణామాలనూ తీసుకుతో రావచ్చని ఆర్థిక సర్వే 2024-2025 (Economic Survey 2024-2025) హెచ్చరిస్తోంది.ఆర్థిక సర్వే 2024-2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తాజాగా పార్లమెంట్ ముందు సమర్పించారు. ఏఐ పురోగతి ముఖ్యంగా మధ్య, దిగువ ఆదాయ కార్మికులపై ప్రభావాన్ని చూపుతుందని, వివిధ రంగాలలో మానవ నిర్ణయాధికారాన్ని ఏఐ అధిగమించడం వలన పెద్ద ఎత్తున ఉపాధిలో మార్పులు సంభవిస్తాయని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది.ఏమిటీ ఎకనామిక్ సర్వే?ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థలో జరిగిన పరిణామాలను సమీక్షించే ప్రీ-బడ్జెట్ డాక్యుమెంట్. ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలపై పనితీరు, విధానపరంగా సానుకూల మార్పులను సంగ్రహించి విశదీకరిస్తుంది. అలాగే స్వల్ప, మధ్య కాలానికి ఆర్థిక వ్యవస్థకు ఉన్న అవకాశాలను తెలియజేస్తుంది. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందుగా దీన్ని వెల్లడిస్తారు.ఏఐపై ఆర్థిక సర్వే 2024-25 ఏం చెప్పిందంటే.. ఆరోగ్య సంరక్షణ, పరిశోధన, నేర న్యాయం, విద్య, వ్యాపారం, ఆర్థిక సేవలతో సహా వివిధ రంగాలలో క్లిష్టమైన నిర్ణయం తీసుకోవడంలో ఏఐ మానవ పనితీరును అధిగమించగలదని అంచనా ఉంది. ఇది పెద్ద ఎత్తున మధ్య, దిగువ ఆదాయ కార్మికుల ఉపాధిని ప్రభావితం చేస్తుంది.మునుపటి పారిశ్రామిక, సాంకేతిక విప్లవాలతో పోలిస్తే ప్రస్తుత ఏఐ స్వీకరణ ప్రతికూల ప్రభావాల భయాలు అంతగా కనిపించకపోవచ్చు.భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా సేవా ఆధారితమైన నేపథ్యంలో చిన్న స్థాయి ఐటీ సేవల్లో పనిచేసే ఉద్యోగులకు ఆటోమేషన్ ముప్పు ఉంటుంది. ఎందుకంటే కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి కార్మికులను తొలగించి సాంకేతికతతో భర్తీ చేస్తాయి.ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సామూహిక సామాజిక ప్రయత్నం అవసరం. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, విద్యాసంస్థల మధ్య సహకారం ద్వారా భారతదేశం బలమైన సంస్థల సృష్టిని వేగవంతం చేయాలి.నైపుణ్య సంస్థలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉద్యోగులను ఏఐతో కలిసి పనిచేసేలా సన్నద్ధం చేయాలి.ఏఐ ప్రస్తుతం శైశవదశలో ఉన్నందున దాని పునాదులను బలోపేతం చేయడానికి, దేశవ్యాప్త సంస్థాగత ప్రతిస్పందనను సమీకరించడానికి అవసరమైన సమయం దేశానికి లభించింది.విస్తృత-వ్యాప్తి స్వీకరణను సాధించడానికి ముందు ఏఐ డెవలపర్లు అధిగమించాల్సిన కొన్ని సవాళ్లు ఉన్నాయి. ప్రాక్టికాలిటీ, విశ్వసనీయత అనేది డెవలపర్లు పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలు.యువ, డైనమిక్, సాంకేతిక-అవగాహన ఉన్న జనాభాను పెంచడం ద్వారా పని, ఉత్పాదకతను పెంపొందించడానికి ఏఐని ఉపయోగించగల శ్రామిక శక్తిని సృష్టించగల సామర్థ్యాన్ని భారతదేశం కలిగి ఉంది.కార్మిక శక్తి, సాంకేతికత సరైన మార్గంలో సమతుల్యం అయినప్పుడు, ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. పని భవిష్యత్తు శ్రామిక శక్తి, యంత్ర సామర్థ్యాలను ఏకీకృతం చేసే 'అగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్' చుట్టూ తిరుగుతుంది.లేబర్ మార్కెట్లో ఏఐతో వచ్చే మార్పులు శాశ్వత ప్రభావాలను కలిగి ఉండే అవకాశం ఉన్నందున విధాన నిర్ణేతలు ఆవిష్కరణలను సామాజిక వ్యయాలతో సమతుల్యం చేయాలి. -
ఆర్థిక సర్వే 2025 ముఖ్యాంశాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సమగ్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో 2024-25లో జరిగిన వృద్ధిని, భవిష్యత్తు అంచనాలతో 2025 ఆర్థిక సర్వేను శుక్రవారం విడుదల చేశారు. అందులోకి కొన్ని ముఖ్యాంశాలు కింది విధంగా ఉన్నాయి.స్థిరమైన జీడీపీ వృద్ధి: అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం వాస్తవ జీడీపీ వృద్ధి 2025 ఆర్థిక సంవత్సరంలో 6.3 నుంచి 6.8 శాతం ఉంటుందని అంచనా వేశారు. ఇది దశాబ్ద సగటుకు దగ్గరగా ఉంది.రంగాలవారీ పనితీరు: వ్యవసాయం, పరిశ్రమలు, సేవలతో సహా అన్ని రంగాలు మంచి పనితీరు కనబరుస్తున్నాయి. వ్యవసాయ రంగం బలంగా ఉంది.ద్రవ్యోల్బణం నియంత్రణ: రిటైల్ ద్రవ్యోల్బణం 2024 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 4.9 శాతానికి తగ్గింది.బ్యాంకింగ్ రంగం: వాణిజ్య బ్యాంకులు తమ స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తిలో స్థిరమైన తగ్గుదలను నమోదు చేశాయి. ఇది 2024 సెప్టెంబర్ చివరి నాటికి 2.6% కనిష్టానికి చేరుకుంది.గ్లోబల్ ఐపీఓ లిస్టింగ్స్: గ్లోబల్ ఐపీఓ లిస్టింగ్స్‌లో భారత్ వాటా 2023లో 17 శాతం నుంచి 2024 నాటికి 30 శాతానికి చేరింది.మూలధన వ్యయం: 2024 నవంబర్ వరకు మొత్తం మూలధన వ్యయంలో రక్షణ, రైల్వేలు, రోడ్డు రవాణా వాటా 75 శాతంగా ఉంది.ఆహార ద్రవ్యోల్బణం: కూరగాయల ధరల కాలానుగుణంగా భారీ ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఖరీఫ్ సీజన్ వస్తుండడంతో ఆహార ద్రవ్యోల్బణం 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి తగ్గుతుందని భావిస్తున్నారు.బీమా రంగ వృద్ధి: బీమా రంగం 2024 ఆర్థిక సంవత్సరంలో 7.7% వృద్ధి చెంది మొత్తం ఎఫ్‌డీఐల్లో 62% ఆకర్షించింది.హెల్త్ అండ్ మోటార్ ఇన్సూరెన్స్: భారత బీమా రంగం వృద్ధికి ఆరోగ్యం, మోటారు బీమా గణనీయంగా దోహదపడ్డాయి.ఇదీ చదవండి: తగ్గిన జీడీపీ వృద్ధి అంచనానిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గింది. అయితే వృద్ధిరేటు కొనసాగేందుకు క్షేత్రస్థాయి సంస్కరణలు కొనసాగాలి. ప్రపంచస్థాయిలో పోటీపడే దిశగా మెరుగుపడాలి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు సరైన యంత్రాంగం లేకపోతే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.భౌగోళిక, రాజకీయ అస్థిరతల వల్ల డాలర్ బలపడడంతో రూపాయి మారక విలువ పడిపోయింది. 2025లో స్టాక్ మార్కెట్లు కొంత పడిపోయే అవకాశం ఉంది. -
పార్లమెంట్ ముందుకు ఎకనామిక్ సర్వే
-
తగ్గిన జీడీపీ వృద్ధి అంచనా
కేంద్ర బడ్జెట్‌కు ముందు శుక్రవారం మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025 ఆర్థిక సర్వే 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.3-6.8 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.2% వృద్ధిని నమోదు చేసిందన్నారు. దాంతో వరుసగా మూడో ఏటా 7% పైగా వృద్ధి నమోదు చేసినట్లయింది.ఆర్థిక సర్వే 2026 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 6.3-6.8% అంచనా వేసింది. ఇది అంతకుముందు సంవత్సరం వృద్ధి కంటే తక్కువగా ఉంది. అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడంలో విధానకర్తలు కీలక పాత్ర పోషించారని ఆర్థిక సర్వే తెలిపింది. సవాలుతో కూడిన అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వృద్ధిని కొనసాగించాలంటే గణనీయమైన ప్రయత్నాలు అవసరమని సర్వే నొక్కి చెప్పింది.ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా వంటి కీలక రంగాలు మంచి పనితీరు కనబరుస్తాయని పేర్కొంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సవాళ్లను ఎదుర్కొంటాయని అంచనా వేసింది. ఆయుష్మాన్ భారత్ పథకం, లక్పతి దీదీ పథకం, ఇండియా ఏఐ మిషన్ సహా ఆర్థిక వృద్ధిని పెంచడానికి ఉద్దేశించిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పురోగతి ఉంటుందని ఈ సర్వే తెలిపింది.ఇదీ చదవండి: జాతికి ముప్పు చేసే టెక్నాలజీలుకేంద్ర బడ్జెట్ 2025 అంచనాలుకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆదాయపు పన్ను శ్లాబులను సవరించడం, మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచడం, గ్రామీణాభివృద్ధి, విద్యకు కేటాయింపులను పెంచడం వంటి చర్యలతో జీడీపీ వృద్ధిని ప్రోత్సహించడంపై బడ్జెట్ దృష్టి పెడుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర బడ్జెట్ ఆర్థిక సర్వే(Union Budget Economic Survey 2025) 2025 సందర్భంగా కీలక ప్రకటన చేశారు. భారతదేశ మెట్రో రైలు నెట్వర్క్ 1,000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిందని ప్రకటించారు. దాంతో చైనా, యునైటెడ్ స్టేట్స్ తరువాత ప్రపంచంలో ఈ విజయం సాధించిన మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా భారత్ నిలిచింది.భారతదేశం మెట్రో రైలు నెట్వర్క్ 1,000 కిలోమీటర్లకు చేరడం వల్ల ఎంతో మేలు జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ విస్తరణ పట్టణ రవాణాను పెంచడానికి, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రద్దీని తగ్గించడానికి వీలైంది. వచ్చే ఐదేళ్లలో ప్రస్తుత నెట్‌వర్క్‌ను రెట్టింపు చేసే ప్రణాళికలతో మెట్రో, రాపిడ్ రైల్ ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే గణనీయమైన బడ్జెట్‌ను కేటాయించింది.ఇదీ చదవండి: మిషన్ మౌసమ్తో వాతావరణ సమాచారంకశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు మార్గం ఏర్పాటు చేసే ప్రయాత్నాల్లో భాగంగా చాలా సవాళ్లు ఎదురయ్యాయని రాష్ట్రపతి తెలిపారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని ముర్ము ప్రస్తావించారు. 272 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు క్లిష్టమైన భూభాగం కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొందన్నారు. అయినా దీన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల ఈ ప్రాంతంలో కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధి పెరుగుతుందని, వస్తువులు, ప్రయాణీకుల రవాణా మెరుగవుతుందని భావిస్తున్నారు. -
సూక్ష్మ సేద్యం.. ఏపీకి 4వ స్థానం
సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరంలో (2023–24) సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023–24 సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. సూక్ష్మ సేద్యం పరికరాలు రైతులకు ఇవ్వడం లేదని, సూక్ష్మ సేద్యాన్ని అటకెక్కించారంటూ కూటమి నేతలు ఎన్నికల ముందు చేసిన ఆరోపణల్లో నిజం లేదనే విషయం అదే కూటమి ప్రభుత్వం విడుదల చేసిన సర్వే ఎలుగెత్తి చాటింది. గత ఆర్థిక ఏడాదిలో 2.05 లక్షల ఎకరాలను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచి్చనట్టు సర్వే తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ రూపంలో రూ.793.67 కోట్లు సాయం అందించిందని, తద్వారా 26 జిల్లాల్లో 75,035 మంది రైతులు ప్రయోజనం పొందారని సర్వే పేర్కొంది. టాప్–20లో ఐదు జిల్లాలు ఏపీవే 2023–24లో సూక్ష్మ సేద్యంలో దేశంలోని టాప్ 20 జిల్లాల్లో ఐదు జిల్లాలు (అనంతపురం, ప్రకాశం, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య) ఏపీలోనే ఉన్నాయని సర్వే పేర్కొంది. వైఎస్సార్ జిల్లా పులివెందుల మండల ఇ–కొత్తపల్లి గ్రామ పంచాయతీ సూక్ష్మ సేద్యంలో ఉత్తమ పద్ధతులు, విధానాలను అమలు చేయడంతో ఆ గ్రామాన్ని ‘వన్ డ్రాప్.. మోర్ క్రాప్’ జాతీయ వర్క్‌షాపు ప్రశంసించిందని సర్వే పేర్కొంది. సూక్ష్మ సేద్యం ప్రయోజనాలపై అధ్యయనం ప్రకారం 18 నుంచి 20 శాతం వరకు అదనపు విస్తీర్ణం సూక్ష్మ సేద్యం కిందకు తీసుకువచ్చినట్టు తేలిందని, అలాగే 35 నుంచి 60 శాతం ఉత్పాదకత పెరిగిందని, 35 నుంచి 40 శాతం విద్యుత్ ఆదా అయిందని, 40 నుంచి 45 శాతం ఎరువులు ఆదా అయ్యాయని, సాగు వ్యయం 18 శాతం తగ్గిందని, నికరాదాయం 75 శాతం పెరిగిందని సర్వే వివరించింది. సూక్ష్మ సేద్యంతో నీరు, విద్యుత్, ఎరువులు, కూలీ వేతనాల్లో భారీ ఆదాతో పాటు అధిక ఆదాయం లభిస్తోందని పేర్కొంది. సూక్ష్మ సేద్యంలో హెక్టార్‌కు సాగు వ్యయం రూ.21,500 తగ్గుతుందని, హెక్టార్‌కు రూ.1,15,000 అదనపు ఆదాయం వస్తుందని సర్వే తెలిపింది. -
అడ్వాంటేజ్ డొనాల్డ్ ట్రంప్.. హారిస్‌తో ఉత్కంఠ పోరు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పది రోజులే మిగిలి ఉంది. పోలింగ్ తేదీ నవంబర్ 5 దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార హోరు పెరిగింది. పోల్స్ ఫలితాలు కూడా తారుమారవుతున్నాయి. అధ్యక్ష బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకొన్న మొదట్లో వరుస పోల్స్ హారిస్ వైపే మొగ్గు చూపాయి. కానీ తీరా పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ పరిస్థితి క్రమంగా తారుమారు అవుతున్నట్టు కన్పిస్తోంది. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలోకి వెళ్తున్నారు. అంతేగాక తాజా పోల్స్‌లో సానుకూలతను పెంచుకున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ట్రంప్, హారిస్ పోరు తారాస్థాయికి చేరుతోంది. మొన్నటిదాకా సర్వేల్లో హారిస్ ఆధిక్యంలో ఉండగా తాజాగా ట్రంప్ కాస్త ముందంజలోకి వచ్చారు. వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా సర్వేలో ట్రంప్ 47 శాతం మద్దతు దక్కించుకోగా హారిస్‌కు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. సీఎన్‌బీసీ ఆల్ అమెరికన్ ఎకనమిక్ సర్వేలోనూ హారిస్ కంటే ట్రంప్ రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. హోరాహోరీ పోరు సాగుతున్న 7 కీలక స్వింగ్ రాష్ట్రాల్లోనూ తాజా సర్వేల్లో హారిస్ కంటే ట్రంప్ ఒక్క పాయింట్ ఆధిక్యం సాధించారు. డెమొక్రాట్ల కంచుకోటలైన మిషిగన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాతో పాటు నల్లజాతీయులు, లాటినో ఓటర్లలో ఆయన పట్టు సాధిస్తున్నారు.ఇది డెమొక్రాట్లకు ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ప్రధాన పోల్స్ అన్నింటినీ విశ్లేషించే రియల్క్లియర్పాలిటిక్స్ ప్రకారం హారిస్ ఇప్పటికీ ట్రంప్‌పై 0.3 శాతం ఆధిక్యంలో ఉన్నారు. కాకపోతే స్వింగ్ స్టేట్లలో మాత్రం ట్రంప్‌కే 0.9 శాతం మొగ్గుందని అది తేల్చింది. అమెరికా బెట్టింగ్ మార్కెట్ అయితే ట్రంప్ విజయావకాశాలను ఏకంగా 61 శాతంగా అంచనా వేసింది. హారిస్ గెలిచేందుకు 39 శాతం మాత్రమే చాన్సుందని పేర్కొంది. ట్రంప్‌పై కొన్ని రోజులుగా హారిస్ తీవ్ర విమర్శలు చేస్తుండటం తెలిసిందే. హిట్లర్‌ను ప్రశంసించిన ట్రంప్ అంతకంటే నియంత అంటూ దుయ్యబట్టారు. ఆయనో అసమర్థుడని ఎద్దేవా చేశారు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే పర్యవసానాల గురించి పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హారిస్ పాపులర్ ఓట్లను గెలుచుకోవచ్చని సర్వేలంటున్నాయి. కానీ కీలక రాష్ట్రాలను కైవసం చేసుకుంటేనే ఎన్నికల విజయం సాధ్యం. మరోవైపు చాలా రాష్ట్రాల్లో ఓటర్లకు హారిస్‌పై పలు అంశాల్లో ఇప్పటికీ అభ్యంతరాలున్నాయి. మరోవైపు ముందస్తు ఓటేసిన అమెరికన్ల సంఖ్య 3.1 కోట్లు దాటింది.పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యంస్వింగ్ రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైనది పెన్సిల్వేనియా. వాటిలో అత్యధికంగా 19 ఎలక్టోరల్ కాలేజీ ఓటు్లున్న రాష్ట్రం. ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రకటనలపైనే రెండు పార్టీలు కోట్లు వెచ్చించాయి. ఇక్కడి ఓటర్లు ఆర్థిక వ్యవస్థపై చాలా ఆందోళన చెందుతున్నారు. వారు క్రమంగా ట్రంప్ వైపే మొగ్గుతున్నారు. వివాదాస్పద, కుంభకోణాల వ్యక్తిగా ట్రంప్‌పై విముఖత ఉన్నా ఆయన హయాంలో ఆహారం, పెట్రోల్ ధరలు తక్కువగా ఉండేవని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి మహిళలు మాత్రం హారిస్ పట్ల సానుకూలంగా ఉన్నారు. ‘‘ట్రంప్ వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన దారుణం. ఆయన్ను మరోసారి వైట్‌హౌస్‌కు పంపించేదే లేదు’’ అంటున్నారు. కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, మాజీ ఉపాధ్యక్షుడు డిక్ షెనీ కూతురు లిజ్ షెనీ వంటివారి ప్రచారం కూడా హారిస్‌కు ఎంతో కొంత కలిసి రానుంది.‘అబార్షన్ హక్కులు’ ప్రభావం చూపేనా?హారిస్‌కు అమెరికావ్యాప్తంగా ఉన్న సానుకూలత మహిళా ఓటర్లలో బలమైన ఆధిక్యం. ఆమె అభ్యర్థిత్వమే చరిత్రాత్మకం. కానీ ఆమె దీనిపై ప్రచారం చేసుకోవడం లేదు. మహిళల అబార్షన్ హక్కులకు బలంగా మద్దతిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ప్రవేశపెట్టిన అత్యంత కఠినమైన అబార్షన్ నిషేధం మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీన్ని రాజ్యాంగంలో చేర్చాలా వద్దా అనే అంశాన్ని పది రాష్ట్రాలు ఓటింగ్‌కు పెట్టాయి. అలాంటి రాష్ట్రాల్లో అరిజోనాలో హారిస్‌కు మెజారిటీ వచ్చే అవకాశముంది. అయితే అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడు సృష్టించిన వాతావరణాన్ని హారిస్ బలంగా కొనసాగించలేకపోయినట్టు పోల్స్ చెబుతున్నాయి.డెమొక్రాట్లకు ‘గాజా’ షాక్ట్రంప్కే అరబ్–అమెరికన్ల జయహోకీలక రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్‌లో అరబ్–అమెరికన్ ఓటర్లు అత్యధికంగా ఉంటారు. 2020లో బైడెన్ కేవలం అక్కడ 1.5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు, ఇక్కడ అరబ్ అమెరికన్ల జనాభా 3 లక్షలు. గాజా, లెబనాన్లలో ఇజ్రాయెల్ దాడులను నియంత్రించడంలో బైడెన్ విఫలమయ్యారని వారంతా భావిస్తున్నారు. ఈ ప్రభావం నేరుగా డెమొక్రాట్ల అభ్యర్థి హారిస్‌పై పడేలా ఉంది. ఉపాధ్యక్షురాలిగా హారిస్ కూడా దీనికి బాధ్యురాలేనని వారు భావిస్తున్నారు. డెమొక్రాట్ల కంటే అధిక వామపక్ష భావాలున్న వారిలోనూ ఇదే ధోరణి కనబడుతోంది. ‘‘మేమంతా ట్రంప్‌కు ఓటేస్తాం. అంతేగాక ఆయనకే ఓటేయాలని ఇతరులకూ చెబుతాం’’ అని వారంటున్నారు. ‘‘మేం ట్రంప్‌కు ఓటేస్తామని ఏడాది కిందట ఊహించను కూడా లేదు. కానీ ఇప్పుడు డెమొక్రాట్లను క్షమించలేం. హారిస్‌కు ఓటేసేది లేదు’’ అని స్పష్టంగా చెబుతున్నారు. మిషిగన్‌లో కార్మికవర్గం, యూనియన్ల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. తామెవరికీ మద్దతివ్వబోమని ఇప్పటికే కొన్ని యూనియన్లు ప్రకటించాయి. హారిస్‌పై కొన్ని అభ్యంతరాలున్నా ఆమె తప్ప ప్రత్యామ్నాయం లేదని కొందరు భావిస్తుండటం ఆమెకు కాస్త కలిసొచ్చే అంశం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉపాధి రహిత వృద్ధి వృథాయే!
కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల తరువాత ఎదురైన ఆర్థిక సవాళ్లను అధిగమించి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడింది. కాబట్టి భవిష్యత్తులో భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నా యని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. స్థిరమైన వృద్ధిరేటుతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనతోనే 2047 నాటికి భారత్ ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకో గలుగుతుంది.ఒక్క సంపద సృష్టితోనే ఏ ఆర్థిక వ్యవస్థా బలంగా ఎదగలేదు. సంపద వృద్ధితో పాటు మానవ వనరుల ప్రమాణాలను పెంచే ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన తోనే ఏ ఆర్థిక వ్యవస్థ అయినా బలంగా ఎదుగుతుంది. కానీ ఆరు దశాబ్దాల ప్రణాళికా యుగంలో భారత దేశంలో వృద్ధిరేటు ఉపాధి రహితంగా మందకొడిగా కొనసాగింది. ఫలితంగా ఉద్యోగ అవకాశాల సృష్టిలో వెనకబడటం వలన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. 1991 నుండి దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తరువాత ఆర్థిక వృద్ధిరేటు పెరిగినా అది కూడా ఉపాధి రహితంగానే కొనసాగిందనే చెప్పాలి.ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వజ్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ... భారత దేశంలోని ఉద్యోగ ఉపాధి కల్పనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కల్పనలో భారతదేశం జీ–20 దేశాల కంటే వెనకబడి ఉంది. అలాగే 2010– 20ల మధ్యకాలంలో దేశంలో సగటు వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటే ఉపాధి కల్పన రేటు మాత్రం కేవలం రెండు శాతం గానే ఉంది. అంటే ఇప్పటికీ భారతదేశంలో ఉపాధి రహిత వృద్ధి కొనసాగు తోందని గీతా గోపీనాథ్ కూడా భావిస్తున్నారని చెప్పాలి. సులభతర వ్యాపారం ద్వారా దిగుమతి సుంకాలను తగ్గించి మరింత ప్రైవేటు పెట్టబడులను ఆకర్షించటం ద్వారా ఉద్యోగాల సృష్టి జరగటానికి అవకాశం ఉంటుందని గీతా గోపీనాథ్ సూచిస్తున్నారు.2024– 25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతం నుండి 7 శాతం వరకు ఉండే అవకాశం ఉందని ఆర్థిక సర్వే భావిస్తోంది. అలాగే ప్రపంచ బ్యాంకు కూడా భారత్ వార్షిక వృద్ధి రేటు 6.3 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. కానీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ) రిపోర్ట్ ప్రకారంగా 2014లో 5.4 శాతంగా ఉన్న నిరుద్యోగితా రేటు 2024 మొదటి త్రైమాసికానికి 9.2 శాతానికి పెరగటం, పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారంగా 15 ఏళ్లు పైబడిన వయసుగల వారిలో నిరుద్యోగిత రేటు 17 శాతంగా ఉండటం కూడా ఆందోళన కలిగించే అంశం.ఆర్థిక మందగమనం వలన ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ విధానాల వలన ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో జాప్యం వలన నిరుద్యోగ సమస్య తీవ్రత దేశంలో పెరుగుతుందని చెప్పాలి. 3,942 అమెరికన్ డాలర్ల జీడీపీగా ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్... గీతా గోపీనాథ్ చెప్తున్నట్లు 2027 నాటికి జర్మనీ, జపాన్‌లను కూడా అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చు. కానీ ఆ ఎదుగుదల ఉపాధి ఉద్యోగాలను సృష్టించేదిగా ఉంటే యువ భారత్‌కి ఉపయోగకరంగా ఉంటుంది. – డాక్టర్ తిరునహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం, 98854 65877 -
దీర్ఘకాలిక వృద్ధిని పెంచగలదా?
2023–24 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. తద్వారా పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ అత్యంత వేగంగా ముందుకు సాగు తున్న దేశంగా నిలబడింది. దీన్నిబట్టి, గత పదేళ్లలో సాధించినదాని పట్ల కేంద్ర ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టుంది! కానీ అధిక వృద్ధి ఫలాలను పెద్ద సంఖ్యలో ప్రజలు పొందుతున్నారా? బడ్జెట్ రూపకల్పన వారికి అనుగుణంగా జరిగిందా? వృద్ధి ఊపందుకున్నప్పటికీ, పేదరికం కారణంగా వినియోగ డిమాండ్ తక్కువగానే ఉంది. ఈ వృద్ధి నిలకడగా ఉండాలంటే, కార్మికులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హ్రస్వ దృష్టితో చూస్తే బడ్జెట్ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించే అంశాలను అది పరిష్కరించకుండా వదిలేసింది.ప్రతి సంవత్సరం, ఆర్థిక సర్వే, బడ్జెట్లను ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి సమ ర్పిస్తుంది. ఈ సర్వే ద్వారా ఆర్థిక వ్యవస్థ ఎలా దూసుకు పోతోందో వివరించేందుకు ప్రయత్నిస్తుంది. బడ్జెట్ ద్వారా, తన మనస్సులో ఏ కార్యాచరణ ప్రణాళిక ఉందో వివరించడానికి ప్రయ త్నిస్తుంది. రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు ఉండాలి: ప్రస్తుత పరిస్థితిలో ఏమి చేయాలి? విషయాలు సరైన దిశలో వెళ్ళే అవకాశం ఉందా? చూస్తుంటే గత పదేళ్లలో సాధించినదానిపట్ల ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. తద్వారా అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశాన్ని అత్యంత వేగంగా ముందుకు కదలిపోయేదేశంగా నిలబెట్టింది. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతమే పెరిగింది. 2024–25లో ప్రధాన ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతానికికట్టడి చేయగలమనే విశ్వాసంతో ప్రభుత్వం ఉంది. కానీ ఈ కథ పూర్తిగా ఆశాజనకంగా లేదు. 2023–24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 7.5 శాతం వరకు ఉంటూ, మరింత ఆందోళనకరంగా మారింది. మొత్తంమీద, ఈ విషయంలో బాగా పనిచేసినందున, కింది వృద్ధి వ్యూహాన్ని ఆర్థిక సర్వే సూచించింది; తద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెప్పింది: స్థిరంగావృద్ధి చెందడానికి ప్రైవేట్ రంగం దాని సొంత మూలధనాన్ని ఏర్పాటుచేసుకోవాల్సి ఉంది. దేశంలో హరిత పరివర్తన జరగడా నికి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తమ వృద్ధిని కొనసాగించేలా ప్రభుత్వం ఖాళీలను పూడ్చాలి. దేశం అభివృద్ధి చెందడానికి వీలుగా నైపుణ్యాల అంతరాన్ని పూరించడానికి ఒక విధానం అవసరం. ఈ విధానాన్ని రూపొందించాలంటే, రాష్ట్ర యంత్రాంగ సమర్థత, వ్యవస్థ ఒకేలా ఉండాలి.ఇది పావు శతాబ్దానికి దీర్ఘకాలిక లక్ష్యం అయితే, మనం ఇప్పుడు ఎక్కడ నుండి ప్రారంభించాలి? ముందుగా, పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. నిర్ణీత తగ్గింపు (స్టాండర్డ్ డిడక్షన్) రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచుతున్నారు. రూ.17,000 వరకు ఉద్యోగులకు ఆదా అయ్యేలా శ్లాబుల్ని మెలితిప్పారు. ఉద్యోగాల్లో చేరేందుకు ప్రొఫెషనల్స్ ప్రోత్సా హకాలు పొందబోతున్నారు. దీని వల్ల రెండు లక్షల మంది యువ కులు ప్రయోజనం పొందనున్నారు. కేవలం జీతం ఆదాయం మాత్రమే కాదు, పెట్టుబడిపై లాభాలు ఆర్జించే వారికి మూలధన లాభాలకు మినహాయింపు కూడా పెరుగుతోంది.ఈ లెక్కన తక్కువ పన్నులు చెల్లించాల్సిన మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్ తోడ్పడుతుంది. తమాషా ఏమిటంటే, ఆదాయపు పన్ను చెల్లించే అవసరం లేని పేదలు, వారు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన వస్తువులు అన్నింటికీ వాస్తవ చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఇది జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. ఏకాభిప్రాయం సాధించడం ఎల్లప్పుడూ కష్టమైనప్పటికీ, మరిన్ని జీఎస్టీ–అనుబంధ సంస్కరణలను కేంద్రం, రాష్ట్రాలు చేపట్టవచ్చు. అంతేకాకుండా, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని సెస్ నుండి కేంద్రం ప్రయోజనం పొందడం అన్యాయం. పేద పిల్లలు చదువుకునేలా చేయడం వంటి అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే ప్రాజెక్ట్‌ల కోసం సేకరించగలిగే మొత్తం ఆదాయం రాష్ట్రాలకు అవసరం.నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూనీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీనీ సంతోషపెట్టడానికి అనేక భారీ ప్రాజెక్టులకు కూడా బడ్జెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన ప్రాజెక్టులలో పట్నా–పూర్నియా, బక్సర్–భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నాయి. అంతేకాకుండా, బిహార్‌లోని బక్సర్ జిల్లాలో గంగా నదిపై రెండు లేన్ల వంతెనను నిర్మించనున్నారు. అదనంగా, భాగల్పూర్లోని పీర్‌పైంతిలో 2,400–మెగావాట్ల పవర్ ప్లాంట్ రానుంది. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే, రోడ్డు మార్గాల ప్రాజెక్టులను ప్రకటించారు. కొత్త రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు ప్రకటించారు.బడ్జెట్ అనేది రాజకీయ చర్య. దానికి స్పష్టమైన లక్ష్యంఉంది. బీజేపీ సంకీర్ణ భాగస్వాములు, మధ్యతరగతి సంతృప్తిచెందేలా చూసుకోవడమే దాని లక్ష్యం. ప్రధాన పార్టీపై ఆధిపత్యం చలాయించే రాజకీయ వ్యాపారుల వెరపులేని ధీమా కారణంగానేసంకీర్ణ భాగస్వాములను సంతోషపెట్టాలనే లక్ష్యం నడుస్తుంటుంది. పూర్తిగా సంఖ్యల పరంగానే, చిన్న మధ్యతరగతి ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేదు. పాలకవర్గం అంతిమ ఉద్దేశ్యం జనబాహు ళ్యాన్నిసంతోషపెట్టడమే.అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి మంచి జరగనుంది. ప్రపంచ వ్యాఖ్యాతలు కూడా భారత్ అధిక వృద్ధి రేటును ప్రశంసించారు. కానీ వృద్ధి నిలకడగా ఉండాలంటే, కార్మికులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ కీలక సమస్యలను పరిష్కరించడానికి బడ్జెట్ సంకేత పథకాలను మాత్రమే ప్రవేశపెట్టింది. అందుకే, అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లను బాగా అర్థం చేసుకున్నా, దూరదృష్టితో వ్యవహరించడం లేదనేది మొత్తం భావన.ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతోందనే దానితోసంబంధం లేకుండా, బడ్జెట్ అంచనాలు కూడా పరిష్కరించాల్సిన మూడు సమస్యలను ఎత్తిపట్టాయి. వృద్ధి ఊపందు కున్నప్పటికీ, వినియోగ డిమాండ్ తక్కువగానే ఉంది. పైగా ఉపాధి చాలా వెనుకబడి ఉంది. అధిక ఆర్థిక వృద్ధి ఫలాలను పెద్దసంఖ్యలో ప్రజలు పొంద లేకపోతున్నారా? ఇది కొంచెం ఎక్కువగా సాంకేతికమైనది. తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం అనేది ఛేదించగలిగే టంత దృఢంగా ఉందా?నోట్ల రద్దు, కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో, వృద్ధి రేటు అనుకున్నంత ఎక్కువగా లేదని చాలా మంది వాదించారు. కాబట్టి, ఒక విధంగా, ఆర్థిక వ్యవస్థ కేవలం తేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రజలు ఎక్కువ పొదుపు చేయడం వల్ల కాదు కానీ, రెండు ఎదురుదెబ్బల ఫలితంగా ఆదాయ వనరును కోల్పోయినప్పుడు వారు తీసుకున్న భారీ అప్పును తిరిగి చెల్లించ డానికి ప్రయత్నిస్తున్నందున వినియోగం కుంచించుకుపోయింది. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నది సమృద్ధిగా ఉన్న సరఫరాల వల్ల కాదు. ప్రజలు తాము కోరుకున్న వాటిని వినియోగించుకోలేక పోవడం వల్ల.ఇక్కడ శక్తిమంతమైన వైరుధ్యం కూడా ఉంది. ఆర్థిక వ్యవస్థ, వ్యాపారాలు బాగా కొనసాగాలంటే, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తక్కు వగా ఉంచాలి. అయితే, ఎక్కువ డిపాజిట్లను సంపాదించడానికి బ్యాంకులు అధిక వడ్డీ రేటును ఎలా చెల్లించగలవు? అందు వల్ల, బ్యాంకులు రుణాలు, పొదుపు మధ్య అసమతుల్యతను చూస్తున్నాయి. మొత్తంమీద, హ్రస్వ దృష్టితో చూస్తే బడ్జెట్ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ ఇది మధ్యతరగతి ద్వారా, మధ్యతరగతి కోసం చేసే ఒక కసరత్తు. అది దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించే అంశాలను పరిష్కరించకుండా వదిలివేసింది.- వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకులు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- సుబీర్ రాయ్ -
ఆర్థికంగా ఏపీ బలోపేతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలోపేతమవుతోందని కేంద్ర ప్రభుత్వం 2023–24 ఆర్థిక సర్వేలో వెల్లడించింది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడాన్ని కొనసాగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని స్పష్టం చేసింది. ఆర్బీఐ నివేదికలతో పాటు కాగ్ గణాంకాల ఆధారంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అంచనా వేసినట్లు సర్వే నివేదిక తెలిపింది. ఏపీ సహా 23 పెద్ద రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయని.. ద్రవ్య లోటు, అప్పులు భారం తగ్గుతోందని సర్వే నివేదిక స్పష్టం చేసింది.అలాగే ఏపీ సహా పలు రాష్ట్రాల వ్యయంలో నాణ్యత పెరిగిందని.. మూలధన వ్యయంపై ప్రభుత్వాలు దృష్టి సారించడం మెరుగుపడిందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పథకాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించారని వెల్లడించింది. మహిళల సాధికారత, సామాజిక భద్రత, ఆరోగ్యం, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను కల్పించినట్లు తెలిపింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు పాలనాపరమైన సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను చూపించిందని నివేదిక పేర్కొంది.వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపడుతోందని.. తద్వారా గ్రామీణ ప్రాంతాలు పురోగతి సాధిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత ఆధారంగా దిగుబడి అంచనాలను ఏపీతో పాటు తొమ్మిది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని.. తద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతోందని నివేదిక తెలిపింది. మొత్తంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా కితాబిచి్చంది. ఏపీ అప్పు రూ.4.85 లక్షల కోట్లుఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలు తమ ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టానికి(ఎఫ్ఆర్బీఎం) అనుగుణంగా పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం పార్లమెంట్లో వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖతో పాటు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడి రాష్ట్రాల అప్పులు ఉంటాయని ఆయన తెలిపారు. 2024 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.4,85,490 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. -
Economic Survey 2023-24: ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ ప్రమాదకరం
న్యూఢిల్లీ: ప్రభుత్వం డెరివేటివ్స్ ట్రేడింగ్‌కు వీలుగా కమోడిటీల జాబితాను విస్తరించినప్పటికీ మార్కెట్లు మరింత అభివృద్ధి చెందేటంతవరకూ బియ్యం, గోధుమలుసహా ఇతర తృణధాన్యాలలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రమాదకరమని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. సున్నిత(సెన్సిటివ్) కమోడిటీలను ఫ్యూచర్స్ మార్కెట్లనుంచి ప్రస్తుతానికి పక్కనపెట్టడమే మేలు. అగ్రికల్చర్ ఫ్యూచర్స్ మార్కెట్ ఆయిల్‌సీడ్స్, కాటన్, బాస్మతి బియ్యం, మసాలా దినుసుల వంటి నాన్సెన్సిటివ్ కమోడిటీలపై దృష్టి పెట్టడం మంచిదని పేర్కొంది. ఇటీవల ప్రభుత్వం డెరివేటివ్స్‌లోకి కమోడిటీలను 91 నుంచి 104కు పెంచింది. యాపిల్స్, జీడిపప్పు, వెల్లుల్లి, పాలపొడి, వైట్ బటర్ తదితరాలను జాబితాలో కొత్తగా చేర్చింది. కాగా.. చిన్న రైతులతోకూడిన రైతు ఉత్పత్తి సంస్థల(ఎఫ్‌పీవోలు)ను కమోడిటీ మార్కెట్లతో అనుసంధానించాలి. ప్రభుత్వం, సెబీ, కమోడిటీ ఎక్సే్ఛంజీలు ఎఫ్‌పీవోలను ప్రోత్సహించాలి. ఆర్థిక అక్షరాస్యత ద్వారా వీటి నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరచాలి. వెరసి అగ్రిడెరివేటివ్స్ ద్వారా రైతులు లబ్ది పొందేందుకు వీలు కలి్పంచాలి.అవకతవకలకు చాన్స్ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్ల లావాదేవీలు పెరిగితే జూదాల(గ్యాంబ్లింగ్)కు వీలు ఏర్పడుతుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. డెరివేటివ్స్‌లో రిటైలర్ల ఆసక్తి పుంజుకోవడం ఆందోళనకర అంశం. అభివృద్ధి చెందుతున్న దేశంలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు అవకాశంలేదు. కొన్ని సందర్భాలలో అసాధారణ లాభాలకు డెరివేటివ్స్ వీలు కలి్పస్తాయి. అయితే ఇది జూదానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్థిక మంత్రి, సెబీ చీఫ్, స్టాక్ ఎక్సే్ఛంజీలు సైతం రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించాయి. తక్కువ తలసరి ఆదాయంగల దేశాలలో ఎఫ్‌అండ్‌వో సమర్థనీయంకాదు. దిద్దుబాటుకు అవకాశమున్న మార్కెట్లలో రిటైలర్లకు ఎఫ్‌అండ్‌వో ద్వారా అధిక నష్టాలకు వీలుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు సైతం చేటు చేస్తుంది. 2019లో రూ. 217 లక్షల కోట్ల టర్నోవర్ 2024కల్లా రూ. 8,740 ట్రిలియన్లకు చేరడం ఎఫ్‌అండ్‌వో విభాగ భారీ వృద్ధిని అద్దం పడుతోంది. అయితే ఇదే కాలంలో ఈక్విటీ నగదు టర్నోవర్ సగటు సైతం రూ. లక్ష కోట్ల నుంచి రూ. 330 లక్షల కోట్లకు ఎగసింది. ఇది కూడా ఆందోళనకర అంశమే. కుటుంబ పొదుపులో 20 శాతం ఫైనాన్షియల్ మార్కెట్లలో పెట్టుబడులకు తరలివస్తోంది. ప్రత్యక్షంగా, మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ గతేడాది రూ. 14 లక్షల కోట్లు ఎగసింది. ఏయూఎం రూ. 53.4 లక్షల కోట్లను తాకింది. ఇక సెబీ నివేదిక ప్రకారం 89 శాతంమంది రిటైలర్లు 2022లో డెరివేటివ్స్ ద్వారా సగటున రూ. 1.1 లక్షలు నష్టపోయారు.ఆరోగ్యంతోనే ఆశించిన ప్రయోజనాలు భారత్ అధిక జనాభా నుంచి ఆశించిన ఫలాలను పొందాలంటే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకుతోడు, మానసిక ఆరోగ్యంపై ప్రభుత్వం, ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే గుర్తు చేసింది. అధికంగా ప్రాసెస్ చేసిన, చక్కెరలు, కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాల వినియోగంతో సమాజంలో స్థూలకాయం పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో 56.4 శాతం వ్యాధులకు అనారోగ్యకర ఆహార అలవాట్లే కారణమన్న ఐసీఎంఆర్ తాజా అంచనాలను వెల్లడించింది. ప్రజల ఆరోగ్యకర జీవనశైలి, స్థూలకాయం నివారణ కోసం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరింది. పట్టణ ప్రాంతాల్లో 29.8 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 19.3 శాతం పురుషులు స్థూలకాయంతో బాధపడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను ప్రస్తావించింది. కొన్ని రాష్ట్రాల్లో ఇది మరింత అధికంగా ఉందంటూ.. ఢిల్లీలో 41.3 శాతం మహిళలు, 38 శాతం పురుషుల్లో ఈ సమస్య ఉన్నట్టు పేర్కొంది. మానసిక ఆరోగ్యంపై సమాజంలో తగినంత చర్చ జరగడం లేదని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. వ్యక్తిగత, దేశాభివృద్ధిపై ఇది ప్రభావం చూపిస్తుందని తెలిపింది. వైవిధ్యమైన, భిన్నమైన ఆహారం దిశగా అడుగులు వేయాలని సూచించింది. ఈకామర్స్ వృద్ధికి అవరోధాలు డేటా ప్రైవసీ అంశాలు, ఆన్లైన్ మోసాలతో సవాళ్లు వ్యక్తిగత వివరాల గోప్యత సమస్యలు, పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు దేశీయంగా ఈకామర్స్ వృద్ధికి ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. 2030కల్లా దేశీ ఈకామర్స్ మార్కెట్ విలువ 350 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఒక అంచనా. అయితే ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్ వినియోగంలో వినియోగదారులు మోసపోకుండా తగిన విధంగా సన్నద్దం(ఎడ్యుకేట్) చేయవలసి ఉంది. ఇదేవిధంగా ఆన్లైన్ విక్రయాలకు సైతం కేటలాగింగ్ తదితర నైపుణ్యాలను పెంచవలసి ఉంది. వీటికితోడు వ్యక్తిగత వివరాల గోప్యత అంశాలు, ఆన్లైన్లో పెరుగుతున్న మోసాలు ఈకామర్స్ వృద్ధిని దెబ్బతీస్తున్నాయి. వెరసి ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ను రక్షణాత్మకంగా వినియోగించుకోవడంలో యూజర్లకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. గత కొన్నేళ్లుగా దేశీ ఈకామర్స్ వేగవంతంగా వృద్ధి చెందుతోంది. ఇందుకు మెరుగుపడుతున్న సాంకేతికతలు, ఆధునికతరం బిజినెస్ విధానాలు, డి/æటల్ ఇండియా వంటి ప్రభుత్వ చర్యలు, ఓఎన్డీసీ, ఎఫ్‌డీఐ విధానాల్లో సరళత, వినియోగదారుల రక్షణ చట్టాలు సహకరిస్తున్నాయి.124 బిలియన్ డాలర్లకు రెమిటెన్సులు... సేవా రంగం ఎగుమతుల తర్వాత భారతదేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న రెమిటెన్సులు 2024లో 3.7 శాతం పురోగతితో 124 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని సర్వే పేర్కొంది. 2025లో 4 శాతం వృద్ధితో 129 బిలియన్ డాలర్లకు పురోగమిస్తాయని వివరించింది. విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు తమ సొంత దేశానికి నిధులు పంపడానికి సంబంధించిన రెమిటెన్సుల విషయంలో ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలుస్తోంది. 2023లో 120 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు దేశాలనికి వచి్చనట్లు ప్రపంచబ్యాంక్ ఇటీవలి నివేదిక పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ వంటి కీలక దేశాలతో తన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ని అనుసంధానించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు వ్యయాలను తగ్గించి, చెల్లింపులను వేగవంతం చేయగలవని అంచనా వేసినట్లు సర్వే వివరించింది. ఆటో రంగంలో రూ. 67,690 కోట్ల పెట్టుబడులు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో (పీఎల్ఐ) ఆటోమొబైల్, ఆటో విడిభాగాల పరిశ్రమలోకి ఇప్పటివరకు రూ. 67,690 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు ఆర్థిక సర్వే తెలిపింది. 2024 మార్చి ఆఖరు నాటికి రూ. 14,043 కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరిగిందని వివరించింది. దరఖాస్తుదారులు 1.48 లక్షల ఉద్యోగాల కల్పనకు హామీ ఇవ్వగా ఇప్పటివరకు 28,884 ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొంది. ఈ స్కీము కింద 85 దరఖాస్తుదార్లకు ఆమోదం లభించినట్లు సర్వే తెలిపింది. 2023–27 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆటో, ఆటో విడిభాగాల పరిశ్రమ కోసం పీఎల్ఐ స్కీము కింద రూ. 25,938 కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 49 లక్షల ప్యాసింజర్ వాహనాలు, 9.9 లక్షల త్రీ వీలర్లు, 2.14 కోట్ల ద్విచక్ర వాహనాలు, 10.7 లక్షల వాణిజ్య వాహనాల ఉత్పత్తి నమోదైంది. అసమానతల నివారణలో పన్నులు కీలకంకృత్రిమ మేథ (ఏఐ) సాంకేతికత ఉపాధి కల్పన, ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. కనుక రాబోయే రోజుల్లో సమాజంలోని అసమానతల పరిష్కారంలో పన్ను విధానాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. అంతర్జాతీయంగానూ అసమానతలు పెరిగిపోతుండడం విధాన నిర్ణేతలకు కీలక ఆర్థిక సవాలుగా పరిణమిస్తున్నట్టు తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెబుతూ.. ఉపాధి కల్పన, సంఘటిత రంగంతో అసంఘటిత రంగం అనుసంధానం, మహిళా కారి్మక శక్తి పెంచడం కోసం చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేసింది. దేశంలో ఒక్క శాతం ప్రజలు 6–7 శాతం ఆదాయం పొందుతున్నట్టు, టాప్–10 శాతం వర్గం మొత్తం ఆదాయంలో ఒకటో వంతు వాటా కలిగి ఉన్నట్టు గుర్తు చేసింది. మరింత తగ్గనున్న వాణిజ్య లోటు .. రాబోయే రోజుల్లో వాణిజ్య లోటు మరింత తగ్గగలదని ఆర్థిక సర్వే తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాలతో దేశీయంగా తయారీకి ఊతం లభించడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులు పెరగడం వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది. అయితే, కమోడిటీల ధరల్లో, ముఖ్యంగా చమురు, లోహాలు, వ్యవసాయోత్పత్తులు మొదలైన వాటి ధరల్లో హెచ్చుతగ్గులనేవి వాణిజ్య సమతౌల్యత, ద్రవ్యోల్బణ స్థాయులపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది. అలాగే, ప్రధాన వ్యాపార భాగస్వామ్య దేశాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు భారత ఎగుమతి అవకాశాలను ప్రభావితం చేయొచ్చని వివరించింది. భౌగోళిక రాజకీయ సవాళ్ల వల్ల ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడినప్పటికీ, అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు తగ్గడమనేది 2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు తగ్గడానికి తోడ్పడిందని సర్వే వివరించింది. ఉత్పత్తులపరమైన వాణిజ్య లోటు 2022–23లో 265 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023–24లో 240 బిలియన్ డాలర్లకు తగ్గింది. వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యం దేశంలో వృద్ధ జనాభా పెరుగుతున్న తరుణంలో వారి సంరక్షణ అవసరాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే తెలియజేసింది. వృద్ధుల సంరక్షణ మార్కెట్ ప్రస్తుతం దేశంలో రూ.58వేల కోట్లుగా ఉందంటూ.. మౌలిక వసతులు, వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అంశంలో అంతరాలున్నట్టు గుర్తు చేసింది. 60–69 సంవత్సరాల వయసులోని వారి సామర్థ్యాలను దేశ ఉత్పాదకత పెంపునకు వినియోగించుకోవాల్సిన ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. వృద్ధాప్య అనుకూల ఉద్యోగాలతో జీడీపీ 1.5 శాతం మేర పెంచుకోవచ్చన్న ఆసియా అభివృద్ధి బ్యాంక్ నివేదిక సూచనలను ప్రస్తావించింది. 60 ఏళ్లపైబడిన వయసులోని వారికి తగిన ఉపాధి కలి్పంచడం ద్వారా వారిని సమాజంలో చురుగ్గా, ఆర్థికంగా మెరుగ్గా ఉండేలా చూడొచ్చని, ఇది వారి సంరక్షణ అవసరాలను తగ్గిస్తుందని ఆర్థిక సర్వే సూచించింది. 2022 నాటికి దేశ జనాభాలో 14.7 కోట్ల మంది వృద్ధులు ఉంటే, 2050 నాటికి 34.7 కోట్లకు పెరుగుతారని అంచనా. వాస్తవానికి అద్దంఎకానమీ వాస్తవ పరిస్థితికి సర్వే అద్దం పట్టింది. ఈ అంశాల ప్రాతిపదికన భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి తగిన ‘‘ఆచరణాత్మకమైన’’ మార్గాన్ని సర్వే నిర్దేశించింది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ 7 శాతానికి మించి వృద్ధి భారత వృద్ధికి సంబంధించి సర్వే సానుకూలంగా ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 7 శాతం వరకూ ఉంటుందని సర్వే అంచనావేసినా, 8 శాతంగా ఉండే అవకాశం ఉందని విశ్వసిస్తున్నాను. – సంజీవ్ పురి, సీఐఐ ప్రెసిడెంట్సంక్షోభాన్ని దాటి స్థిరత్వం.. కోవిడ్ నేపథ్యంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నుంచి కోలుకున్న ఎకానమీ.. 2047 నాటికి ‘వికసిత భారత్’ ఆవిర్భావ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశలో ముందుకు కదులుతోంది. సర్వే ఈ అంశాన్ని అద్దం పడుతోంది. – సంజీవ్ అగర్వాల్, పీహెచ్డీ చాంబర్సంస్కరణలు బాటన ముందుకు.. ఎకానమీ అవుట్‌లుక్ పరిణతి చెందినట్లు గమనిస్తున్నాము. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటును దేశం కొనసాగిస్తుంది. జీఎస్టీ, ఐబీసీ తర్వాత తదుపరి సంస్కరణల బాటన నడవాల్సిన అవసరం ఉంది. – అనిష్ షా, ఫిక్కీ ప్రెసిడెంట్ సాహసోపేత డాక్యుమెంట్ సాహసోపేతమైనది. భారీ ఉపాధి కల్పనతోపాటు ఏఐ వంటి కొత్త సాంకేతికత సది్వనియోగం చేసుకుని 4వ ప్రపంచ పారిశ్రామిక విప్లవాన్ని సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పాన్ని సూచిస్తోంది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ ఆర్థికాభివృద్ధి లక్ష్యంఅపూర్వ ఆర్థిక పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ రంగం, విద్యాసంస్థల మధ్య ఒక ఒప్పందాన్ని ఆర్థిక సర్వే ప్రతిపాదించింది. అలాగే వివిధ నిబంధనలను ప్రభుత్వం విడనాడాలి. – రానెన్ బెనర్జీ, పార్ట్నర్, పీడబ్లు్యసీ ఇండియా. సహకారం కీలకంమధ్య కాలంలో వృద్ధికి ప్రైవేట్ కార్పొరేట్ రంగం, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు అవసరమని సర్వే పరోక్షంగా నొక్కి చెప్పింది. ద్రవ్యోల్బణాన్ని నిర్వహించడం అనేది కేవలం ఆర్బీఐ, దాని ద్రవ్య విధాన కమిటీ ప్రత్యేకాధికారం కాదు. ముఖ్యంగా ఆహార ధరల నిర్వహణ రంగంలో కేంద్రం చురుకైన జోక్యం అవసరం. – అదితీ నాయర్, చీఫ్ ఎకనమిస్ట్, ఇక్రాఇన్ఫ్రా ఊతంఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నప్పటికీ.. ఐపీ, మెషినరీలో ప్రైవేట్ పెట్టుబడి కూడా బలంగా ఉంది. గృహాలు, నిర్మాణాలలో పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. భౌతిక ఆస్తులలో పొదుపు చేయడానికి కుటుంబాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. – రుమ్కీ మజుందార్, ఎకనమిస్ట్, డెలాయిట్.చిన్న పరిశ్రమల మద్దతు కీలకంప్రభుత్వ దార్శనికత ప్రకారం భారత్ అతి త్వరలో మూడవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలను ముందుకు నడిపిస్తే తప్ప ఈ దార్శనికతను సాధించలేము. ఎందుకంటే అవి భారతదేశానికి ప్రధాన ఉపాధి మార్గాలు, జీడీపీని నడిపించేవి. – వివేక్ జలన్, పార్ట్నర్, ట్యాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సరీ్వసెస్. చిన్న పరిశ్రమల మద్దతు కీలకంప్రభుత్వ దార్శనికత ప్రకారం భారత్ అతి త్వరలో మూడవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలను ముందుకు నడిపిస్తే తప్ప ఈ దార్శనికతను సాధించలేము. ఎందుకంటే అవి భారతదేశానికి ప్రధాన ఉపాధి మార్గాలు, జీడీపీని నడిపించేవి. – వివేక్ జలన్, పార్ట్నర్, ట్యాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సరీ్వసెస్. సవాళ్ల అధిగమనంఅంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు విస్తరించి ఉన్న అభివృద్ధి మార్గంలో ఆర్థిక వ్యవస్థకు ఉన్న కొన్ని కీలక సవాళ్ల గురించి సర్వే చర్చించింది. ఉద్యోగాలను పెంచడం, గ్రామీణ పట్టణ విభజనను తగ్గించడంపై దృష్టి కేంద్రీకరించడం ప్రభుత్వ రాడార్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. – రిశి షా, పార్ట్నర్, గ్రాంట్ థాంటన్. పెట్టుబడుల పురోగతిసర్వేలో అంచనా వేసిన 6.5–7 శాతం వృద్ధికి 35–36 శాతం నిజమైన పెట్టుబడి రేటు అవసరం. తదనుగుణంగా 33–34 శాతం నిజమైన పొదుపు రేటు ఉండాలి. ప్రస్తుత పొదుపు, పెట్టుబడి రేట్లను బట్టి ఇది సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. తగిన విధానపర జోక్యాల ద్వారా రెండు మూడు దశాబ్దాల్లో వృద్ధి ఈ స్థాయిలో కొనసాగాలి. – డి.కె.శ్రీవాస్తవ, చీఫ్ పాలసీ అడ్వైజర్, ఈవై ఇండియా. -
Union Budget 2024-25: ఉపాధికి ఊతం.. ధరలకు కళ్లెం!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో వృద్ధి రేటు అంచనాలను ప్రభుత్వం అచితూచి నిర్ధేశించింది. స్థూలదేశీయోత్తత్తి (జీడీపీ) వృద్ధి 6.5–7 శాతం స్థాయిలో ఉండొచ్చని ఆర్థిక సర్వేలో లెక్కగట్టింది. ఉపాధి కల్పనను పెంచాల్సిన అవసరం ఉందని కూడా నొక్కిచెప్పింది. ధరాభారంతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీ లేదా కూపన్ల రూపంలో నిర్ధిష్టంగా ఆర్థిక తోడ్పాటు కల్పించాల్సిఇన అవసరం ఉందని కూడా సర్వే సూచించింది. దేశంలో తయారీ రంగానికి తోడ్పాటు అందించడంతో పాటు ఎగుమతులను పెంచాలంటే చైనా నుంచి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెంచాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా, గతేడాది (2023–24) 8.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే, ఈ ఏడాది వృద్ధి రేటు అంచనాలు చాలా తక్కువగా ఉండటం విశేషం. ఆర్బీఐ నిర్దేశించిన 7.2 శాతం వృద్ధి రేటు అంచనాలతో పోలి్చనా సర్వేలో వృద్ధి అంచనా తగ్గింది. అనిశి్చత వర్షపాతం, ప్రైవేటు రంగంలో పెట్టుబడుల మందగమనం వంటివి వృద్ధి అంచనాల తగ్గుదలకు ప్రధాన కారణంగా సర్వే పేర్కొంది. ‘భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధి బాటలో పయనిస్తోంది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ సవాళ్లన్నింటినీ దీటుగా ఎదుర్కొంటోంది’ అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సర్వే ముందుమాటలో పేర్కొన్నారు. కాగా, నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా మధ్యకాలం పాటు నిలకడగా 7% వృద్ధి రేటు కొనసాగవచ్చని సర్వే తేల్చిచెప్పింది.కార్మిక సంస్కరణలు వేగవంతం... కేంద్రంలో వరుసగా మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కారు 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడులను పెంచడం, చిన్న–మధ్య తరహా వ్యాపారాలకు చేయూతనందించడం, సాగును లాభసాటిగా మార్చేలా వ్యవసాయ సంస్కరణలు, వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు వనరుల సమీకరణ, ఆర్థిక అసమానాతలను తగ్గించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చాలని కూడా సర్వే నొక్కిచెప్పింది. దేశంలో ఉద్యోగ కల్పనకు మరింత సానుకూల వాతావరణాన్ని సృష్టించాలంటే కార్మిక సంస్కరణల అమలును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది. ‘దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా 2030 నాటికి వ్యవసాయేతర రంగంలో ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సి ఉంటుంది’ అని సర్వే తెలిపింది. చైనా పెట్టుబడులు పెరగాలి... భారత్ ఎగుమతులు, దేశీ తయారీ రంగం మరింత పుంజుకోవాలంటే, చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరగాలని, లేదంటే చైనా సరఫరా వ్యవస్థతో భారత్ అనుసంధానం కావాల్సి ఉంటుందని సర్వే అభిప్రాయపడింది. మరోపక్క, చైనా నుంచి దేశంలోకి దిగుమతులు తగ్గాలని కూడా పేర్కొంది. ‘అమెరికా తదితర కీలక మార్కెట్లకు భారత్ ఎగుమతులు భారీగా పెరగాలంటే చైనా పెట్టుబడులపై మనం మరింత దృష్టి సారించాలి. తూర్పు ఆసియా దేశాలు గతంలో ఇదే విధంగా లబ్ధి పొందాయి’ అని సర్వే తెలిపింది. 2020లో గాల్వాన్‌లో చోటు చేసుకున్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా భారత్ టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌తో సహా 200 చైనా మొబైల్ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం బీవైడీ భారీ పెట్టుబడి ప్రతిపాదనలను కూడా తిరస్కరించింది. 2000–2024 మధ్య భారత్ అందుకున్న మొత్తం ఎఫ్‌డీఐలలో చైనా కేవలం 0.37% (2.5 బిలియన్ డాలర్లు) వాటాతో 22 స్థానంలో ఉంది. కాగా, కీలక ఖనిజాల విషయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సర్వే స్పష్టం చేసింది.పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీవడ్డీరేట్ల నిర్ణయంలో ఆహార ధరలను పక్కనబెట్టండి... ఆర్బీఐకి సర్వే సూచన వడ్డీ రేట్లను నిర్ణయించడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆహార ద్రవ్యోల్బణాన్ని చూడటం మానేయాలని ఆర్థిక సర్వే సూచించింది. అధిక ఆహార ధరలను ఎదుర్కోవటానికి పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీని ప్రభుత్వం అన్వేíÙంచాలని సర్వే పేర్కొంది. ‘‘భారతదేశ ద్రవ్యోల్బణ లక్ష్య ఫ్రేమ్‌వర్క్.. ఫుడ్ ఆరి్టకల్స్‌ను పక్కనబెట్టాలి. అధిక ఆహార ధరలు చాలా సందర్భాల్లో సరఫరాలకు సంబంధించిన సమస్యే తప్ప, డిమాండ్ ప్రేరితం కాదు’’ అని ఆర్థిక సర్వే పేర్కొంది. మధ్య, దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం అవుట్‌లుక్ ధరల యంత్రాంగం పటిష్టత, మార్కెట్ అంశాలు, నిత్యావసారాల దేశీయ ఉత్పత్తి, దిగుమతులు వంటి అంశాలపై ఆధారపడుతుందని వివరించింది. అననుకూల వాతావరణం, తక్కువ రిజర్వాయర్ స్థాయిలు, పంట నష్టం వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేసి, గత రెండేళ్లలో ఆహార ధరలను పెంచడానికి దారితీసిందని కూడా సర్వే పేర్కొంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–రెపో (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ఆర్బీఐ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై ఆధారపడే సంగతి తెలిసిందే. ప్లస్ 2 లేదా మైనస్ 2తో ఇది 4 శాతంగా ఉండాలే చూడాలని ఆర్బీఐకి కేంద్రం నిర్ధేశిస్తోంది. ఈ సూచీలో ఫుడ్ ఆరి్టకల్స్ ఒక భాగం. రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యాన్ని సాధించడంలో ఆహార ధరలు ఒడిదుడుకులు తీవ్ర అడ్డంకిగా మారుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఆర్బీఐ 2023 ఫిబ్రవరి నుంచి యథాతథ వడ్డీరేట్ల వ్యవస్థను కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిని పక్కనపెట్టి... రుణ రేట్లను తగ్గిస్తే ఆ నిర్ణయం వృద్ధికి దోహదపడుతుందన్నది సర్వే అభిప్రాయం. ప్రయివేట్ రంగ పెట్టుబడులు కీలకం ప్రయివేట్ రంగ ఫైనాన్సింగ్, కొత్త వర్గాల నుంచి వనరుల సమీకరణ దేశీయంగా నాణ్యమైన మౌలిక సదుపాయాల(ఇన్ఫ్రా) నిర్మాణానికి కీలకమని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పాలసీలు, సంస్థాగత మద్దతుతోపాటు.. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు సైతం ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది. మౌలిక రంగంలోని వివిధ విభాగాలకు పెట్టుబడులు సమకూర్చడంలో గణాంకాలు, మార్గదర్శకాలు తదితర నివేదికలు అత్యవసరం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కున్న డిమాండ్‌ను అంచనా వేయడం, ఉపవిభాగాల కల్పనలో సౌకర్యాల వినియోగం వంటి అంశాలకు ప్రస్తుత డేటాబేస్ సామర్థ్యం సరిపోదు. ఆర్థికపరమైన ఒత్తిడి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏకీకృత ప్రణాళికల నేపథ్యంలో ఆచరణసాధ్యమైన ప్రాజెక్టులను చేపట్టి పూర్తిచేయవలసి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం కీలకమవుతుంది.రైల్వేల సామర్థ్యం పెరగాలి.. సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం, కార్యకలాపాలను ఆధునీకరించుకోవడం, ఇంధన ఆదా తదితర అంశాలపై రైల్వేస్ ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎకనమిక్ సర్వే సూచించింది. ఇందుకు అనుగుణంగా సరకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్లు, హై స్పీడ్ రైళ్లు, వందే భారత్.. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ .. ఆస్థా స్పెషల్ ట్రెయిన్స్ వంటి ఆధునిక ప్యాసింజర్ సరీ్వస్ రైళ్లు, అధిక సామర్థ్యం ఉండే రైల్వే కోచ్‌లు, లాస్ట్–మైల్ రైల్ లింకేజీలు మొదలైన వాటిపై ఇన్వెస్ట్ చేయాలని పేర్కొంది. లాజిస్టిక్స్ వ్యయాలను, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రైల్వేస్ 3 ప్రధాన కారిడార్ల రూపకల్పనలో ఉందని వివరించింది. ట్రాఫిక్ సాంద్రత అధికంగా ఉండే కారిడార్లు, ఇంధన.. ఖనిజ.. సిమెంట్ కారిడార్లు, రైల్ సాగర్ (పోర్టు కనెక్టివిటీ) కారిడార్లు వీటిలో ఉన్నాయని పేర్కొంది.పర్యాటక రంగంలో అవకాశాలు అపారం..పర్యాటక రంగం కలి్పస్తున్న అవకాశాలను సొంతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే సూచించింది. కరోనా విపత్తు తర్వాత పర్యాటక రంగం వేగంగా కోలుకోవడాన్ని ప్రస్తావించింది. ‘2023లో 92 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించారు. క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 43.5 శాతం ఎక్కువ. భారత పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచంలో 39వ ర్యాంక్ సొంతం చేసుకుంది. పర్యాటకం ద్వారా రూ. 2.3 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించింది. ఇది క్రితం ఏడాదితో పోలి్చతే 65.7% అధికం’అని సర్వే తెలిపింది. కృత్రిమ మేథ (ఏఐ) భారత సేవల ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందన్న ‘క్యాపిటల్ ఎకనమిక్స్’ నివేదికను ప్రస్తావిస్తూ.. ఉపాధి కల్పన విషయంలో తక్కువ నైపుణ్యాలపై ఆధారపడిన పర్యాటకం ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తోందని పేర్కొంది. వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లు కీలకందేశీ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లు కీలకంగా మారుతున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. టెక్నాలజీ, ఇన్నొవేషన్, డిజిటైజేషన్ దన్నుతో మూలధన నిర్మాణం, పెట్టుబడుల విస్తరణలో క్యాపిటల్ మార్కెట్ల వాటా బలపడుతోంది. అంతేకాకుండా దేశీ స్టాక్ మార్కెట్లు ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ రిసు్కలు, వడ్డీ రేట్లుసహా కమోడిటీ ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలోనూ దేశీ క్యాపిటల్ మార్కెట్లు గతేడాది(2023–24) ఉత్తమ పనితీరు చూపిన వర్ధమాన మార్కెట్లలో ఒకటిగా నిలిచాయి. ఈ కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇన్వెస్టర్లకు భారీ(25%కిపైగా) రిటర్నులు అందించాయి. ఇందుకు స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వం, దేశీ ఇన్వెస్టర్ల బలిమి తోడ్పాటునిచి్చనట్లు సీతారామన్ పేర్కొన్నారు. 2024 మే నెలలో ఈక్విటీ మార్కెట్ల విలువ 5 ట్రిలియన్ డాలర్ల(రూ. 415 లక్షల కోట్లు)కు చేరింది. ప్రస్తుతం 9.5 కోట్లమంది రిటైల్ ఇన్వెస్టర్లు ప్రత్యక్షంగా 2,500 లిస్టెడ్ కంపెనీలలో 10% వాటాను కలిగి ఉన్నారు. గతేడాది ప్రైమరీ మార్కెట్ల ద్వారా రూ. 10.9 లక్షల కోట్ల మూలధన ఏర్పాటుకు సహకారమందింది.వ్యవసాయంలో సత్వర సంస్కరణలు వ్యవసాయ రంగంలో సంస్కరణలను వెంటనే చేపట్టాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. లేదంటే ఈ రంగంలో నెలకొన్న వ్యవస్థీకృత సమస్యలు దేశ వృద్ధికి అడ్డుపడతాయని విధానకర్తలను హెచ్చరించింది. తూర్పు ఆసియా దేశాలు, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలతో పోలి్చతే.. దేశ వ్యవసాయరంగం సామర్థ్యాలను ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులోకి తేవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు వ్యవసాయరంగ సామర్థ్యాలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ రంగంపై దేశవ్యాప్తంగా చర్చలు అవసరమని నాగేశ్వరన్ పిలుపునిచ్చారు. ‘‘దేశ వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎలాంటి సంక్షోభంలో లేదు. కాకపోతే నిర్మాణాత్మక మార్పు అవసరం. ఎందుకంటే వాతావరణ మార్పులు, నీటి సమస్య రానున్న రోజుల్లో పెద్దవి కానున్నాయి’’అని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం రైతులకు ఎరువులు, విద్యుత్, ఆదాయపన్ను, మద్దతు ధరల పరంగా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ ప్రస్తుత విధానాలను తిరిగి సమీక్షించా లని అభిప్రాయపడింది. టెక్నాలజీ ఆధునికీకరణ, మార్కెటింగ్ మార్గాలను మెరుగుపరచడం, సాగులో ఆవిష్కరణలు, వ్యవసాయం–పరిశ్రమల మధ్య అనుసంధానత పెంపు దిశగా సంస్కరణలను సూచించింది. ఆర్థిక సర్వే హైలైట్స్..→ అసాధారణరీతిలో వరుసగా మూడోసారి ప్రజలు మోదీ 3.0 సర్కారుకు పట్టం కట్టడం దేశంలో రాజకీయపరమైన, విధానపరమైన స్థిరత్వాతనికి అద్దం పడుతోంది. → అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశీయ వృద్ధి చోదకాలు 2023–24లో ఆర్థిక పురోగతికి దన్నుగా నిలిచాయి. → భౌగోళిక, రాజకీయ సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన, స్థిరమైన ప్రగతిని సాధిస్తోంది. → కరోనా మహమ్మారి తదనంతరం దేశీయ వ్యాపార, వాణిజ్య రంగం రికవరీ కోసం ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంది. → వాణిజ్యం, పెట్టుబడులు, వాతావారణ మార్పుల వంటి ప్రపంచ సమస్యల విషయంలో వివిధ దేశాలతో ఒప్పందాలు క్లిష్టతరంగా మారాయి. → స్వల్పకాలానికి ద్రవ్యోల్బణం అంచనాలు తగ్గుముఖ ధరోణిలోనే ఉన్నప్పటికీ, పప్పుధాన్యాల కొరత , ధరల ఒత్తిడి నిలకడగా కొనసాగుతోంది. → సాధారణ వర్షపాతం, దిగుమతులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ధరలు శాంతించడంతో ఆర్బీఐ సానుకూల ద్రవ్యోల్బణం అంచనాలకు దన్నుగా నిలుస్తోంది. → అధిక ఆహార ధరలతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీలు, నిర్దిష్ట కొనుగోళ్లకు కూపన్ల రూపంలో కొంతకాలం పాటు ప్రయోజనాలను అందించాలి. → భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానంపై ప్రభావం చూపొచ్చు. → భారతదేశ ఆర్థిక సేవల రంగం పటిష్టమైన అవకాశాలున్నాయి. ఈ రంగంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా, దేశీయంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. → కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా ఉండటంతో ప్రైవేటు పెట్టుబడులు మరింత పుంజుకోనున్నాయి. → పన్ను నిబంధలనను సరళతరం చేయడం, వ్యయ నియంత్రణ, డిజిటైజేషన్ వంటివి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను సాధించేందుకు దోహదం చేస్తున్నాయి. → భారత వృద్ధి పథానికి క్యాపిటల్ మార్కెట్లు కీలకంగా నిలుస్తున్నాయి. ప్రపంచ రాజకీయ, ఆర్థిక షాక్‌లకు మన మార్కెట్లు ఎదురొడ్డి నిలుస్తున్నాయి. → చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) జోరందుకోవడం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలు మెరుగుపరచడంలో, ఎగుమతులను పెంచుకోవడంలో భారత్‌కు దన్నుగా నిలుస్తుంది. → 2024లో దేశంలోకి వచి్చన రెమిటెన్సులు (ప్రవాసులు స్వదేశానికి పంపిన నిధులు) 3.4 శాతం వృద్ధితో 124 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఈ మొత్తం 129 బిలియన్ డాలర్లను తాకనుంది.గ్రీన్ ఎనర్జీ @ రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులు దేశీయంగా 2024–2030 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) రంగంలో రూ. 30.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందుకోసం స్థల సమీకరణ సమస్యలను పరిష్కరించుకోవడం, సానుకూల నిబంధనలతో నిధులను సమీకరించుకోవడం కీలకమని పేర్కొంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను సాధించే క్రమంలో వివిధ విభాగాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరగలదని వివరించింది. మరోవైపు, ఉద్గారాల విషయంలో 2070 నాటికి తటస్థ స్థాయికి చేరుకోవాలంటే భారత్‌కు ఏటా సగటున 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని సర్వే తెలిపింది. నిధులను సమకూర్చుకోవడమనేది ఒక అసాధారణ సవాలు కాగలదని వివరించింది.14 శాతం ఐఫోన్ల తయారీ ఇక్కడే ఎల్రక్టానిక్స్ తయారీలో అంతర్జాతీయంగా భారత్ తన వాటాను పెంచుకుంటున్నట్టు ఆర్థిక సర్వే తెలిపింది. 2023–24లో స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ 14% ఐఫోన్లను భారత్‌లోనే అసెంబుల్ చేసినట్టు వెల్లడించింది. దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ 2014 తర్వాత నుంచి గణనీయమైన వృద్ధిని చూస్తోందంటూ, 2021–22లో అంతర్జాతీయంగా మన వాటా 3.7%. దేశ జీడీపీలో 4% వాటాను ఆక్రమించింది. ఎల్రక్టానిక్స్ ఎగుమతుల్లో మొబైల్ ఫోన్ల విభాగం అధిక వృద్ధిని చూస్తోందని, అమెరికాకు మొబైల్ ఫోన్ల ఎగుమతులు 2022–23లో 2.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24లో 5.7 బిలియన్ డాలర్లకు దూసుకుపోయినట్టు వివరించింది. 2022–23లో దేశీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ రూ.8.22 లక్షల కోట్లకు చేరితే, ఎగుమతులు రూ.1.9 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపింది.ఏటా 78 లక్షల కొలువులు సృష్టించాలి.. కార్మిక శక్తి పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయేతర రంగాల్లో 2030 నాటికి ఏటా దాదాపు 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ విషయంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్థిక వృద్ధి అనేది ఉద్యోగాల కల్పన కన్నా జీవనోపాధి కల్పించడంపై ఆధారపడి ఉంటుందని సర్వే వివరించింది. వ్యవసాయ రంగంలో కార్మిక శక్తి 2023లో 45.8 శాతం స్థాయి నుంచి 2047 నాటికి 25 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ఇదంతా వ్యవసాయేతర రంగాల వైపు మళ్లు తుంది కాబట్టి ఆ మేరకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఏర్పడుతుందని సర్వే పేర్కొంది. పీఎల్ఐ స్కీములు, మిత్రా టెక్స్టైల్ స్కీము మొదలైనవి ఇందుకు కొంత తోడ్పడగలవని తెలిపింది. స్టాఫింగ్ కంపెనీల ద్వారా తాత్కాలిక సిబ్బంది నియామకాలు పెరుగుతున్నందున అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు దీన్నొక మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చని వివరించింది. తయారీ రంగ శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి సాధన దిశగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు వ్యాపారసంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పునఃసమీక్షించాలని సూచించింది. వర్కర్ల తొలగింపునకు కాకుండా ఉద్యోగాల కల్పనకు కృత్రిమ మేథ(ఏఐ)రెని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై కార్పొరేట్లు మరింతగా దృష్టి పెట్టాలని ముందుమాటలో ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. వికసిత భారత్ వైపు పయనంవికసిత భారత్‌ను నిర్మించే దిశగా ముందుకు సాగుతున్నందున ప్రస్తుత పటిష్టతలతోపాటు మరింత పురోగతికి అవకాశాలు ఉన్న మార్గాలను సర్వే గుర్తించింది. ఆర్థిక సర్వే మన ఆర్థిక వ్యవస్థ ప్రబలమైన పటిష్టతలతను హైలైట్ చేస్తోంది. మా ప్రభుత్వం తీసుకువచి్చన వివిధ సంస్కరణల ఫలితాలను కూడా సుస్పష్టం చేస్తోంది. – ఎక్స్ పోస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అంచనాలు సుసాధ్యం7 శాతం వృద్ధి రేటు సాధన భారత్‌కు తేలికే. మేము నిరాశావాదులం కాదు. రుతుపవనాల పురోగతి సవాళ్లను కూడా మేము పరిగణనలోకి తీసుకుంటున్నాము. ఫైనాన్షియల్ రంగం అవుట్‌లుక్ పటిష్టంగా కనబడుతోందని, పొదుపులను ఫైనాన్షియల్ మార్కెట్లవైపునకు మళ్లించడాన్ని చూస్తే.. భారత్ కుటుంబాలు కష్టాల్లో లేవన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. – వి. అనంత నాగేశ్వరన్, సీఈఏ పార్లమెంట్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నేపథ్యంలో బడ్జెట్ బృందంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి పంకజ్ చౌదరి -
Economic Survey 2023-24: ప్రతి ఊరికి కావాలి.. ఇలాంటి స్టీల్ బ్యాంక్
పెళ్లయినా శుభకార్యమైనా పార్టీ మీటింగ్ అయినా ప్రభుత్వ హెల్త్ క్యాంప్లైనా భోజనాల దగ్గర ప్లాస్టిక్ వాడకం ఉంటుంది. చెత్త పేరుకు పోతుంది. డబ్బు కూడా వృథా. అదే స్టీల్ గిన్నెలు ఉంటే? ఒకసారి కొంటే ప్రతిసారి ఉపయోగించుకోవచ్చు. ఈ ఆలోచనతో 2020లో తెలంగాణాలోని సిద్దిపేటలో ఏర్పడిన స్టీల్ బ్యాంక్ ‘ఎకానమిక్ సర్వే 2023–24 బుక్’లో తాజాగా చోటు సంపాదించుకుంది. ఇది మహిళా నిర్వహణకు వారి పర్యావరణ దృష్టికి దక్కిన విజయం.ఇది మహిళల విజయం. జాతీయంగా దక్కిన గుర్తింపు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ఎకనామిక్ సర్వే రిపోర్ట్‌ను విడుదల చేస్తారు. సోమవారం విడుదల చేసిన రిపోర్ట్ 12వ చాప్టర్లో మౌలిక సదుపాయాలు, వృద్ధిలో భాగంగా సిద్దిపేట స్టీల్ బ్యాంక్ వలన జరిగిన ఉపయోగం గురించి వివరించారు. దీనితో స్టీల్ బ్యాంక్ నిర్వాకులైన మహిళలతో పాటు సిద్దిపేట ఎం.ఎల్.ఏ. హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.ప్లాస్టిక్ వద్దనుకుని2022లో సిద్దిపేట మున్సిపాలిటీలో ‘కంటి వెలుగు కార్యక్రమం’లో భాగంగా వైద్య సిబ్బందికి ఆయా గ్రామ పంచాయతీలు భోజన ఏర్పాట్లు చేశాయి. వైద్య సిబ్బంది భోజనం చేసేందుకు ప్లాస్టిక్‌ను వినియోగించాల్సి వచ్చింది. ఇది ఊళ్లో అనవసర చెత్తను పోగు చేస్తోంది. అదే సమయంలో పర్యావరణానికి హాని కూడా. ఈ పారేసిన ప్లాస్టిక్‌ని పశువులు తింటే ప్రమాదం. అందుకే డీపీఓ దేవకీదేవి ప్లాస్టిక్‌కు బదులు స్టీలు వాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ సేకరించి స్టీల్ ప్లేట్లు, గ్లాస్లు, స్పూ¯Œ లు, వాటర్ బాటిల్లను కొనుగోలు చేశారు. ఇలా ఏ గ్రామానికి ఆ గ్రామం కొని జిల్లాలోని 499 గ్రామ పంచాయతీల్లో వినియోగించారు. దీంతో రోజుకు 6 కిలోల నుంచి 8 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగించకుండా నిర్మూలించారు.సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 34 స్టీల్ బ్యాంక్‌లో ఉన్న పాత్రల వివరాలు భోజనం ప్లేట్లు 25,500, అల్పహార ప్లేట్లు 8,500, వాటర్ గ్లాస్లు 25,500, టీ గ్లాస్లు 8,500, చెంచాలు 25,500, చిన్న గిన్నెలు 25,500, స్టీల్ ట్రేలు 612, బకెట్లు 272, ఇతరములు 3వేలు వస్తువులున్నాయి.– గజవెల్లి షణ్ముఖ రాజు, సిద్దిపేట, సాక్షి– ఫొటోలు: కె. సతీష్ కుమార్సంతోషంగా ఉంది...ప్లాస్టిక్‌ను నిర్మూలించేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేయించాం. మనం పాటించి తర్వాత ప్రజలు పాటించాలన్న స్ఫూర్తితో బ్యాంక్‌ల ఏర్పాటు. కంటి వెలుగు కార్యక్రమంలో వైద్య సిబ్బందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాం. వీరికి స్టీల్ ప్లేట్, గ్లాస్లు, వాటర్ బాటిల్ల ద్వారానే అందించాం. మా కృషికి గుర్తింపు దొరకడం సంతోషంగా ఉంది– దేవకీదేవి, డీపీఓసంఘం మహిళలు‘మాది సిద్దిపేటలోని వెన్నెల సమైక్య మహిళా సంఘం. శ్రీసాయితేజ సమైక్య మహిళా సంఘంకు చెందిన గడ్డమీది నవ్య ఇద్దరం కలిసి గత నాలుగేళ్లుగా స్టీల్ బ్యాంక్‌ను కొనసాగిస్తున్నాం. మా ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 34 వార్డుల్లో స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. 29, ఫిబ్రవరి 2020న మా స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు. మా వార్డు పరిధిలో వివాహాలు, ఇతర శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు జరిగితే ముందుగానే సామాగ్రి కోసం సమాచారం ఇస్తారు. వారు ఎంత మందితో కార్యక్రమం నిర్వహిస్తున్నారో చెబితే వారికి సరిపడా సామాగ్రిని అందజేస్తాం. వీటిని ప్రత్యేక సంచిలో వేసి ఇస్తాం. వారి కార్యక్రమం అయిపోయిన తర్వాత క్లీన్ చేసి తీసుకువస్తారు. ఏదైనా వస్తువులు మిస్ అయితే వాటికి డబ్బులు తీసుకుంటాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాస్లు, కప్‌లు ధర కంటే తక్కువ అద్దెకే కిరాయికి ఇస్తున్నాం. ప్లాస్టిక్ నిర్మూలిస్తున్నామనే సంతోషంతో పాటు మాకు ఆర్థికంగా సైతం దోహదపడుతుంది. మా కమిషనర్ ప్రసన్న రాణి, చైర్పర్సన్ కడవేర్గు మంజుల, కౌన్సిలర్ దీప్తిల సహకారంతో ముందుకు వెళ్తున్నాం. పెళ్లిళ్ల సీజన్ అయితే ఎక్కువ మంది తాకిడి ఉంటుంది. మా దగ్గర అన్ని కిరాయికి పోతే మా పక్క వార్డులో ఉంటే తీసుకుని వారికి అద్దెను చెల్లిస్తాం. ప్రజల నుంచి బాగా స్పందన వస్తోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి రేపటి తరాలకు మంచి పర్యావరణాన్ని బహుమతిగా ఇవ్వాలనే లక్ష్యంతో వీటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నాం.– బాలగోని దీప్తి, వెన్నెల సమైక్య మహిళా సంఘం. -
ఆకాశాన్నంటిన ఆహార ధరలు.. అదే ప్రధాన కారణం!
గతేడాది టమాటా ధరలు, ఉల్లి ధరలు మాత్రమే కాకుండా పప్పు ధాన్యాల ధరలు చుక్కలు తాకాయి. ఇప్పడు కూడా టమాటా ధరలు భారీగానే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేజీ ధర వంద రూపాయలకంటే ఎక్కువ. ఆహార ధరలు పెరగటానికి గల కారణాలను ఆర్ధిక సర్వేలో వెల్లడించారు.వాతావరణంలో ఏర్పడ్డ మార్పులు, రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గడం, పంట నష్టం వంటివి.. ఆహార ధరలు పెరగటానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంటలపై ప్రభావం చూపుతాయి. ఆ ప్రభావం ధరల మీద పడుతుందని వివరించింది.పంట దిగుబడి తగ్గితే.. డిమాండ్‌కు సరిపడా సరఫరా తగ్గుతుంది. దీంతో ధరలు పెనుగుతాయి. గత కొన్ని రోజులుగా ఆహార ధాన్యాలు, టమాటా, ఉల్లి ధరలు పెరగడానికి ఇదే కారణమని ఆర్ధిక సర్వే వెల్లడించింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం FY22లో 3.8 శాతం నుంచి FY23లో 6.6 శాతానికి చేరింది. ఇది FY24 నాటికి 7.5 శాతానికి చేరింది.ఉల్లి ధరలు పెరగడానికి గత కోత సీజన్లో వర్షాలు, విత్తడంలో జాప్యం మాత్రమే కాకుండా ఇతర దేశాలు తీసుకున్న వాణిజ్య సంబంధిత చర్యలు కూడా కారణమని తెలుస్తోంది. తక్కువ ఉత్పత్తి కారణంగా పప్పుధాన్యాల ధరలు పెరిగాయని సర్వే పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ అవాంతరాలతో పాటు రబీ సీజన్లో నెమ్మదిగా విత్తడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వెల్లడించింది. -
ఐటీ పుంజుకోదా..? ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందంటే..
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో నియామకాలు గణనీయంగా మందగించాయని, ఇవి మరింతగా తగ్గకపోయినప్పటికీ గణనీయంగా పుంజుకునే అవకాశం లేదని ఆర్థిక సర్వే పేర్కొంది.దశాబ్దాల తర్వాత తొలిసారిగా కొన్ని పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో హెడ్‌కౌంట్ క్షీణించిన తరుణంలో ఆర్థిక సర్వేలో ఐటీ రంగంపై ప్రస్తావించారు. ఫిబ్రవరిలో, టెక్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం కేవలం 60,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని పేర్కొంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం సృష్టించిన 2,70,000 ఉద్యోగాలతో పోలిస్తే చాలా తక్కువ.అయితే ప్రభుత్వం చేపట్టిన ప్రోత్సాహక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవడం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఎక్కడా లేని సామర్థ్యాన్ని సంగ్రహించడం ద్వారా వ్యాపార, కన్సల్టెన్సీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులను విస్తరించవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. -
మినీ ఎకనామిక్ సర్వేలో పేర్కొన్న సవాళ్లు ఇవే..
Economic Survey 2024: భారత ఆర్థిక వ్యవస్థ ఇటీవలి సంవత్సరాలలో సంస్కరణల ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే ఇది అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో నాలుగింటిని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్, ఆయన బృందం మధ్యంతర బడ్జెట్‌కు ముందు గత జనవరిలో వారి “మినీ ఎకనామిక్ సర్వే”లో పేర్కొన్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ప్రకటించనున్న 2024-25 పూర్తి బడ్జెట్‌తోపాటు నేడు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న ఆర్థిక సర్వే-2024లో వీటిని ప్రస్తావించవచ్చు. 'ది ఇండియన్ ఎకానమీ: ఎ రివ్యూ' అనే పత్రంలో పేర్కొన్న ఈ సవాళ్లను ఇప్పుడు తెలుకుందాం..ప్రపంచ ఆర్థిక ధోరణుల ప్రభావంభారతదేశ వృద్ధి, ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ ఆర్థిక ధోరణులు, వాణిజ్య విధానాల ప్రభావం మొదటి సవాలు. దేశ వృద్ధి కేవలం అంతర్గత అంశాలపై మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక ఏకీకరణపై కూడా ఆధారపడి ఉందని పత్రం పేర్కొంది.బ్యాలెన్సింగ్ ఎనర్జీ సెక్యూరిటీఇక రెండవ సవాలు ఏమిటంటే, పునరుత్పాదక శక్తి వైపు ప్రపంచ మార్పుల మధ్య ఆర్థిక వృద్ధిని ఇంధన భద్రతతో సమతుల్యం చేయడం భౌగోళిక రాజకీయ, సాంకేతిక, ఆర్థిక రంగాలలో సంక్లిష్ట సవాళ్లను కలిగిస్తుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను మూడో సవాలుగా మినీ సర్వే పేర్కొంది. ఏఐ టెక్నాలజీతో మానవ ఉద్యోగాలకు పెంచిన ముప్పు, ముఖ్యంగా సేవా రంగంలో దీని ప్రభావం గురించి ప్రపంచవ్యాప్త ఆందోళనలు నెలకొన్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఉపాధిపై దాని ప్రభావాన్ని ఎలా ఎదుర్కొంటాయన్నది కీలకం.నైపుణ్యం, విద్య, వైద్యంస్థిరమైన ఆర్థిక వృద్ధి, ఉత్పాదకతకు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి , మంచి నాణ్యమైన విద్య, ప్రజారోగ్యాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యమైనదని పత్రం పేర్కొంది. -
Budget 2024-25: కేంద్ర ఆర్థిక సర్వే 2023-24 విడుదల
దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఉండే ఆర్థిక సర్వే 2023-24ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందించారు. బడ్జెట్లో ‘ఈజ్ ఆఫ్ డూయిండ్ బిజినెస్’పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశంలో కేంద్రమంత్రి బడ్జెట్ 2024-25ను ప్రకటిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..‘ఆర్థిక సర్వేలో 2024-25 ఆర్థిక సంవత్సారానికిగాను దేశ వాస్తవ జీడీపీ 6.5-7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. బడ్జెట్ 2024-25లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై చాలా నిర్ణయాలు తీసుకున్నాం. దాదాపు 11 దశల్లో దీనిపై చర్చలు జరిగాయి’ అన్నారు. #WATCH | Economic Survey 2023-2024 tabled in Lok Sabha by Union Finance Minister Nirmala Sitharaman. pic.twitter.com/XxBVhgW4Lq— ANI (@ANI) July 22, 2024ఆర్థిక సర్వే 2023-24లోని వివరాల ప్రకారం..కేంద్ర ఆర్థిక సలహాదారు మీడియా సమావేశందేశం ఏటా దాదాపు 80 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని కేంద్ర ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ మీడియాతో తెలిపారు.నియంత్రణల సడలింపు ద్వారా ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు సహాయం చేస్తుంది.ప్రధాన ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. ఇది 4 శాతం కంటే తక్కువగా నమోదవుతుంది.దేశ వృద్ధిలో ప్రైవేట్, ప్రభుత్వరంగ విభాగాలదే కీలక పాత్ర.వృద్ధిని మెరుగుపరచడానికి అందుబాటులోని అన్ని విధానాలు, వనరులను ఉపయోగించుకోవడం చాలా అవసరం.#WATCH | Chief Economic Advisor Dr V Anantha Nageswaran says, "The introduction of artificial intelligence, the need to balance energy security & energy transition, and imperatives of employment and skilling- this economic survey picks up on these themes. More importantly, it… pic.twitter.com/LeehHPTvxn— ANI (@ANI) July 22, 2024‘వికసిత్ భారత్’గా ఎదగడానికి దేశీయ వృద్ధి కీలకంగా మారనుంది.ఈ ఆర్థిక సర్వే థీమ్ ‘ఆల్ హ్యాండ్ ఆన్ టేబుల్’.మే 2024 నాటికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాలు గణనీయమైన ఫలితాలు అందిస్తున్నాయి. ఇందులో భాగంగా 2023-24లో రూ.1.28 లక్షల కోట్లకు మించి పెట్టుబడులు సమకూరాయి.2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం మెరుగైన పనితీరు కనబరుస్తుంది. ప్రైవేట్ మూలధన వ్యయం (కాపెక్స్) పెరుగుతోంది.జీసీసీ ఏర్పాటుకు సులభమైన విధానాలుదేశీయంగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను ఏర్పాటు చేయడానికి అవసరమయ్యే విధానాలను సులభతరం చేశారు.150 కంటే ఎక్కువ సంస్థలు గత రెండు సంవత్సరాలుగా దేశంలో జీసీసీలను ఏర్పాటు చేశాయి.1985లో బెంగళూరులో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జీసీసీకు నాందిపడింది.జీసీసీల ఏర్పాటుకు ఆన్లైన్ ఆమోదాలు, లైసెన్సింగ్ ప్రక్రియలను క్రమబద్ధీకరించే ప్రక్రియలను ‘డిజిటల్ ఇండియా’ వంటి వ్యూహాత్మక కార్యక్రామాలు చాలా ప్రభావితం చేశాయి.దేశీయంగా 10 నెలలకు పైగా సరిపడే దిగుమతులను చేసేంత ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి.పెరిగిన ఫారెక్స్ నిల్వలు2023-24 ఆర్థిక సంవత్సరంలో విదేశీ మారక నిల్వలు 68 బిలియన్ డాలర్లు పెరిగాయి.గత దశాబ్దంలో అమలు చేసిన నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా 7 శాతానికి పైగా వృద్ధి రేటును సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీన్ని సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం తప్పనిసరి.బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిలు ప్రభుత్వానికి సవాలుగా మారాయి.ప్రజారోగ్యం దిగజారేందుకు నియంత్రణలేని ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా గడపడం, ఎక్కువసేపు స్క్రీన్ చూడడం, అనారోగ్యకరమైన ఆహారం వంటివి కారణాలుగా ఉన్నాయి.ఈ హానికర అలవాట్లకు ప్రైవేట్ రంగం సహకరిస్తోంది.క్లిష్టమైన, అరుదైన ఖనిజాల ఉత్పత్తి, ప్రాసెసింగ్‌పై చైనా దాదాపు గుత్తాధిపత్యం ఉంది. దీనివల్ల ప్రపంచం ఆందోళన చెందుతోంది. దేశ పునరుత్పాదక ఇంధన కార్యక్రమంలో విశేష మార్పులు చోటుచేసుకోవాలి.ఉపాధి హామీ పథకానికి డిమాండ్.. గ్రామాల దుస్థితికి సూచిక కాదుగ్రామీణ ఉపాధి హామీ పథకానికి డిమాండ్ ఏర్పడడం గ్రామాల దుస్థితికి సూచిక కాదు. ఇది ప్రధానంగా రాష్ట్రాల సంస్థాగత నిర్ణయం, కనీస వేతనాల్లో వ్యత్యాసం మొదలైన వాటితో ముడిపడి ఉంటుంది.2023-24లో 8.2 శాతంగా ఉన్న భారత ఆర్థిక వృద్ధికి పారిశ్రామిక రంగం ఊతాన్నిచ్చింది. ఈ రంగం వృద్ధి రేటు 9.5 శాతంగా నమోదైంది.గత దశాబ్దంలో తయారీ రంగం సగటు వార్షిక వృద్ధి రేటు 5.2 శాతంగా నమోదైంది. అందుకోసం కెమికల్స్, వుడ్ ప్రొడక్ట్స్ అండ్ ఫర్నిచర్, రవాణా పరికరాలు, ఫార్మాస్యూటికల్స్, యంత్రాలు వంటి విభాగాల్లో వృద్ధి నమోదైంది.భారతదేశంలో గతేడాది 997.2 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి జరిగింది. 261 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి చేసుకుంది. మొత్తంగా 1233.86 మిలియన్ టన్నుల బొగ్గు వినియోగించారు.ఆర్థిక సర్వే ప్రకారం మే 2024 వరకు రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందుకోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగపడ్డాయి. దీనివల్ల రూ.10.8 లక్షల కోట్ల ఉత్పత్తి/ అమ్మకాలు జరిగాయి.భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఎగుమతులు రూ.1.9 లక్షల కోట్లకు పెరిగాయి.టమాటా, ఉల్లి ధరల పెరుగుదలఅననుకూల వాతావరణ పరిస్థితులు ఆహార ఉత్పత్తిని అడ్డుకున్నాయి. ఉల్లిగడ్డ, టమాటా ధరలు పెరిగేలా చేశాయి.నిర్దిష్ట పంట తెగులు, రుతుపవన వర్షాలు ముందుగానే కురవడం, రవాణా అంతరాయాల కారణంగా టమోటా ధరలు పెరిగాయి.రబీ ఉల్లి నాణ్యత దెబ్బతినడం, ఖరీఫ్‌లో ఉల్లిని ఆలస్యంగా విత్తడం, ఇతర దేశాల వాణిజ్య సంబంధిత చర్యల కారణంగా ఉల్లి ధరలు పెరిగాయి.బలమైన డిమాండ్, ఎగుమతి పరిమితుల కారణంగా ఎరువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే 2015-2019 స్థాయిల కంటే ఎక్కువగానే ఉండవచ్చు.తగ్గిన రిటైల్ ఇంధన ద్రవ్యోల్బణం2023-24లో ప్రపంచ ఇంధన ధరల సూచీ భారీగా క్షీణించింది. మరోవైపు ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 తగ్గించింది. ఫలితంగా రిటైల్ ఇంధన ద్రవ్యోల్బణం తక్కువగానే ఉంది.ఆగస్టు 2023లో ప్రభుత్వం దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గించింది. దేశంలోని అన్ని మార్కెట్ల్లో ఒక్కో సిలిండర్‌పై రూ.200 తగ్గింది. అప్పటి నుంచి ఎల్పీజీ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ 2023 నుంచి దిగొస్తోంది.భారీగా పెరిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్భారతీయ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరిగింది.బలమైన లేబర్ మార్కెట్ కారణంగా ప్రధాన ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది.యువతకు ఇంకా పెద్దమొత్తంలో ఉపాధి కల్పించాలి.మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల నిర్మాణ రంగం ప్రాముఖ్యతను సంతరించుకుంది.వ్యవసాయాన్ని విడిచిపెట్టిన శ్రామిక శక్తిని తిరిగి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలి.ప్రభుత్వ మూలధన వ్యయం పెరిగింది. దాంతో ప్రైవేట్ పెట్టుబడులు ఊపందుకున్నాయి. 2023-24లో స్థూల స్థిర మూలధన వ్యయం 9 శాతం పెరిగింది.దేశ జీడీపీ 6.5-7 శాతం వృద్ధి2022-23లో సగటున 6.7 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం 2023-24లో 5.4 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ సమస్యలు, సరఫరా గొలుసు అంతరాయాలు, రుతుపవనాల మార్పుల కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ప్రభుత్వం సమర్థంగా నిర్వహిస్తోంది.2023-24లో మూలధన వ్యయ లోటు(సీఏడీ) జీడీపీలో 0.7 శాతంగా ఉంది. ఇది 2022-23 జీడీపీలో 2.0 శాతంగా ఉంది.ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.కార్పొరేట్, బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్ బలంగా ఉన్నాయి. ప్రైవేటు పెట్టుబడుల వృద్ధికి ఇది దోహదం చేస్తుంది.భారత వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లది కీలకపాత్ర. భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిణామాలను తట్టుకోలదని ఆర్థిక సర్వే అభిప్రాయం.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్.. ఏపీ, తెలంగాణకు ఏం కావాలంటే..ఆర్థిక సర్వే విడుదలకు ముందు ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ..‘భారత రాజకీయాల్లో 60 ఏళ్ల తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం గర్వించదగ్గ విషయం. దేశంలోని ప్రజలకు, ప్రభుత్వం లక్ష్యంగా ఏర్పరుచుకున్న ‘అమృత్కాల్’కు ఈ బడ్జెట్ కీలకంగా మారనుంది. ఈ బడ్జెట్ ప్రభుత్వం కలలుకనే ‘విక్షిత్ భారత్’కు పునాది వేస్తుంది’ అన్నారు. -
ఆర్థిక సర్వే, బడ్జెట్ మధ్య తేడా ఏమిటంటే..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కేంద్ర ఆర్థిక సామాజిక సర్వే 2024-25ను విడుదల చేయనున్నారు. జులై 23న కేంద్ర బడ్జెట్‌ను ప్రకటిస్తారు. అసలు ఆర్థిక సర్వే అంటే ఏమిటి.. ఆర్థిక సర్వేకు, బడ్జెట్‌కు మధ్య తేడా ఏంటీ.. అనే కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.ఆర్థిక సర్వే అంటే..దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఆర్థిక సర్వేను పేర్కొంటారు. ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. సాధారణంగా కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందిస్తారు. ప్రస్తుత కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారుగా వి.అనంత నాగేశ్వరన్ వ్యవహరిస్తున్నారు.ఆర్థిక సర్వే, బడ్జెట్ మధ్య తేడాఆర్థిక సర్వేలో ప్రస్తుత ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును విశ్లేషిస్తారు. ఆర్థిక బలోపేతానికి రానున్న కాలంలో చేయాల్సిన చర్యలను పేర్కొంటారు. కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాల్లో రాబడి, ఖర్చుల కేటాయింపులను తెలియజేస్తారు.సర్వేలో ఉండే అంశాలుదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందనే విషయాన్ని ఆర్థిక సర్వే స్పష్టంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి - దిగుమతులు, విదేశీ మారకనిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల లాంటి అంశాలను వివరిస్తుంది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటివల్ల వస్తోన్న ఫలితాలను విశ్లేషిస్తుంది.ఇదీ చదవండి: మహిళలు ఏం కోరుతున్నారంటే..పరిణామ క్రమంబడ్జెట్ కంటే ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మొదటిసారి 1950-51లో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 1964 నుంచి దీన్ని బడ్జెట్‌కి ముందు ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపుల ప్రతిపాదనలను తేలిగ్గా అర్థం చేసుకోవడానికి దీన్ని ప్రత్యేకంగా ప్రకటిస్తున్నారు. -
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్..?
భారతదేశం వాస్తవ జీడీపీ వృద్ధి 2024-25లో 7 శాతంకు చేరుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తుంది. మధ్యంతర కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రకటించిన నివేదికలో ఇందుకు సంబంధించి కీలక అంశాలను పేర్కొంది. 2030 నాటికి ఇండియా 7 శాతం వృద్ధిని అధిగమించగలదని, ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పేర్కొంది. రానున్న మూడేళ్లలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్లు పేర్కొంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచం కేవలం 2 శాతం వృద్ధి సాధించబోతుందని, కానీ భారత్ రానున్న రోజుల్లో 7 శాతం వృద్ధి సాధించబోతున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. దీన్ని ఎకనామక్సర్వేగా భావించకూడదని నాగేశ్వరన్ స్పష్టం చేశారు. ఆర్థికనివేదిక ప్రకారం భారతదేశ వృద్ధిని రెండు దశలుగా విభజించారు. 1950 నుంచి 2014 వరకు ఒకదశ. 2014-2024 వరకు రెండో దశగా పరిగణించారు. 2012-13, 2013-14 మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ బలహీనపడినట్లు నివేదిక చెప్పింది. దాంతో జీడీపీ 5 శాతం కంటే తక్కువ వృద్ధి నమోదు చేసినట్లు తెలిసింది. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడం, ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు.. వంటి అంశాలు గతంలో వృద్ధి క్షీణించేందుకు కారణాలుగా మారినట్లు నివేదికలో వెల్లడించారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి మినీ ఎకనామిక్ సర్వేగా పరిగణించిన ఈ నివేదిక అన్ని సానుకూల పరిణామాలు, సవాళ్లను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం భారత్ వచ్చే మూడేళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిసింది. 2030 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేసింది.