ఆర్థిక సర్వే | Sakshi Special Story About Economic Survey 2024-25 | Sakshi
Sakshi News home page

ఆర్థిక సర్వే

Published Sat, Feb 1 2025 6:14 AM | Last Updated on Sat, Feb 1 2025 6:42 AM

Sakshi Special Story About Economic Survey 2024-25

అన్ని చేతులూ కలిస్తేనే తయారీ దిగ్గజం
భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం, ప్రైవేటు రంగం, విద్యా సంస్థలు, పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) సంస్థలు, ఆర్థిక సంస్థల మధ్య సమన్వయంతో కూడిన సహకారాత్మక చర్యలు అవసరమని ఆర్థిక సర్వే సూచించింది. నియంత్రణలు సడలించడం, అవసరమైన నైపుణ్యాలు, ఉపాధి కల్పన వ్యూహాలు అమలు చేయడం, ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేకమైన మద్దతు చర్యలతో భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచొచ్చని అభిప్రాయపడింది. అప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, సవాళ్లను భారత సంస్థలు ఎదుర్కొని రాణించగలవని వివరించింది.  

బంగారం తగ్గొచ్చు.. వెండి పెరగొచ్చు  
బంగారం ధరలు ఈ ఏడాది తగ్గొచ్చని, వెండి ధరలు పెరగొచ్చని ఆర్థిక సర్వే అంచనాలు వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్‌ కమోడిటీ మార్కెట్‌ అవుట్‌లుక్‌ 2024 నివేదికను ప్రస్తావిస్తూ. కమోడిటీ ధరలు 2025లో 5.1 శాతం, 2026లో 1.7 శాతం తగ్గుతాయన్న అంచనాలను ప్రస్తావించింది. మెటల్స్, వ్యవసాయ ముడి సరకుల ధరలు స్థిరంగా ఉంటాయని, చమురు ధరలు తగ్గొచ్చని, సహజ వాయువు ధరలు పెరగొచ్చని పేర్కొంది. బంగారం ధరలు తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించొచ్చని తెలిపింది. దేశం దిగుమతి చేసుకునే కమోడిటీల ధరలు తగ్గడం అది సానుకూలమని, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను తగ్గిస్తుందని అభిప్రాయపడింది.   
చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలి.. 

ఈవీల తయారీలో స్వావలంబన 
ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎల్రక్టానిక్స్‌ తయారీలో స్వావలంబన దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. ముడి సరుకులు, విడిభాగాల కోసం చైనా తదితర కొన్ని దేశాలపై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గించాలని, సరఫరా వ్యవస్థలోని రిస్‌్కలను తొలగించే చర్యలు చేపట్టాలని సూచించింది. కీలక విడిభాగాలు, ముడి సరుకులపై అంతర్జాతీయంగా చైనా ఆధిపత్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. సంప్రదాయ వాహనంతో పోల్చి చూసినప్పుడు ఈవీల తయారీలో ఆరు రెట్లు అధికంగా ఖనిజాలను వినియోగించాల్సిన పరిస్థితిని ప్రస్తావించింది. ఈ ఖనిజాల్లో చాలా వరకు మన దగ్గర లభించకపోవడాన్ని గుర్తు చేసింది. 

‘‘సోడియం అయాన్, సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలు తదితర అత్యాధునిక బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానాలకు పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) నిధులు పెంచడం ద్వారా స్వావలంబన ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలి. ఈ విభాగంలో మేధో హక్కులను సంపాదించుకోవాలి. బ్యాటరీ రీసైక్లింగ్‌ సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలి. దీనివల్ల భారత ఆటోమొబైల్‌ రంగానికి దీర్ఘకాల ప్రయోజనాలు ఒనగూరుతాయి’’అని ఆర్థిక సర్వే సూచించింది. మరోవైపు పర్యావరణ అనుకూల ఇంధనాలకు మళ్లే విషయంలోనూ చైనా దిగుమతులపై అధికంగా ఆధారపడడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణలు సడలించడం ద్వారా దేశీ పరిశ్రమకు మద్దతుగా నిలవాలని సూచించింది. పీఎల్‌ఐ, ఫేమ్‌ పథకాలను ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో ఈవీల అవసరాలను తీర్చే విధానాలపై దృష్టి సారించాలని పేర్కొంది.  

వారానికి 60 గంటలు మించి పని.. ఆరోగ్యానికి హానికరం.. 
వారానికి 60 గంటలకు మించి పని చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఎకనమిక్‌ సర్వే పేర్కొంది. ఆఫీస్‌ డెస్క్‌ ముందు గంటల తరబడి కూర్చోవడమనేది మానసిక ఆరోగ్యానికి హానికరమని వివరించింది. రోజూ 12 గంటలకు పైగా డెస్క్‌లోనే గడిపే వారు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఉద్యోగి ఉత్పాదకతకు ఆఫీసులో గడిపిన సమయమే కొలమానమని అభిప్రాయం నెలకొన్నప్పటికీ మెరుగైన జీవన విధానాలు, వర్క్‌ప్లేస్‌ సంస్కృతి, కుటుంబ సంబంధాలు మొదలైనవి కూడా ఉత్పాదకతకు కీలకమని సేపియన్‌ ల్యాబ్స్‌ సెంటర్‌ అధ్యయన నివేదికలో వెల్లడైనట్లు ఆర్థిక సర్వే వివరించింది. వారానికి 70–90 గంటలు పని చేయాలన్న ఇన్ఫీ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న తరుణంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.  

మెరుగుపడిన విమాన కనెక్టివిటీ 
కొత్త విమానాశ్రయాలు, ఉడాన్‌ స్కీముతో దేశీయంగా ఎయిర్‌ కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య నిర్దేశించిన రూ. 91,000 కోట్ల పెట్టుబడి వ్యయాల లక్ష్యంలో ఎయిర్‌పోర్ట్‌ డెవలపర్లు, ఆపరేటర్లు దాదాపు 91 శాతాన్ని ఖర్చు చేసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్‌లో ఏవియేషన్‌ మార్కెట్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని, భారతీయ ఎయిర్‌లైన్స్‌ భారీ స్థాయిలో కొత్త విమానాలకు ఆర్డర్లిచ్చాయని సర్వే వివరించింది. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌వో) పరిశ్రమకు సంబంధించి భారత్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలంటూ తయారీ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపింది.  

రియల్‌ ఎస్టేట్‌లో బలమైన డిమాండ్‌  
ఆర్థిక స్థిరత్వం, రహదారులు, మెట్రో నెట్‌వర్క్‌ల కల్పన వంటివి దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో డిమాండ్‌ను పెంచినట్టు ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. రియల్‌ ఎస్టేట్‌ రంగ నియంత్రణ కోసం ‘రెరా’తోపాటు, జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం ఈ రంగానికి మేలు చేసినట్టు తెలిపింది. 2036 నాటికి ఇళ్లకు డిమాండ్‌ 9.3 కోట్ల యూనిట్లకు చేరుకుంటుందన్న పలు నివేదికల అంచనాలను ప్రస్తావించింది. 2024 మొదటి ఆరు నెలల్లో ఇళ్ల అమ్మకాలు 11 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడాన్ని గుర్తు చేసింది. రెరా రాకతో రియల్‌ఎస్టేట్‌ రంగంలో మోసాల నుంచి రక్షణ లభించిందని, పారదర్శకత, సకాలంలో ప్రాజెక్టుల పూర్తికి దారి చూపిందని వివరించింది. ఇళ్ల ప్లాన్లకు ఆన్‌లైన్‌ అనుమతులుతో జాప్యం తగ్గి, పారదర్శకత పెరిగినట్టు తెలిపింది. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లకు(రీట్‌లు) ప్రోత్సాహం వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌కు సానుకూలిస్తుందని అభిప్రాయపడింది.  

11.6 బిలియన్‌ డాలర్లకు డేటా సెంటర్‌ మార్కెట్‌
మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్‌ సేవలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా డేటా సెంటర్‌ మార్కెట్‌ 2032 నాటికి 11.6 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరవచ్చని ఎకనమిక్‌ సర్వే అంచనా వేసింది. 2023లో ఇది 4.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఐటీ, డిజిటల్‌ సేవల వ్యవస్థ పటిష్టంగా ఉండటం, రియల్‌ ఎస్టేట్‌ ధరలు తక్కువగా వల్ల డేటా సెంటర్ల ఏర్పాటు వ్యయాలు చౌకగా ఉండటం భారత్‌కు లాభిస్తుందని పేర్కొంది. డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఆ్రస్టేలియాలో సగటున ప్రతి మెగావాట్‌కు వ్యయాలు 9.17 మిలియన్‌ డాలర్లుగా, అమెరికాలో 12.73 మిలియన్‌ డాలర్లుగా ఉండగా భారత్‌లో 6.8 మిలియన్‌ డాలర్లేనని సర్వే వివరించింది.  

జీసీసీల్లో ’గ్లోబల్‌’ ఉద్యోగాలు
భారత్‌లో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) అంతర్జాతీయ కార్యకలాపాలకి సంబంధించి నియమించుకునే (గ్లోబల్‌) ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగనుందని ఆర్థిక సర్వే తెలిపింది. 2030 నాటికి ఇది నాలుగు రెట్లు పెరిగి 30,000కు చేరుతుందని వివరించింది. ప్రస్తుతం ఈ సంఖ్య 6,500గా ఉంది. గత దశాబ్ద కాలంలో భారత్‌లో జీసీసీ వ్యవస్థ పురోగమించిందని, ప్రోడక్ట్‌ మేనేజర్లు, ఆర్కిటెక్టుల్లాంటి హై–ఎండ్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగాలను కూడా టెక్‌ నిపుణులు దక్కించుకుంటున్నారని సర్వే తెలిపింది. 2019లో 1,430గా ఉన్న జీసీసీల సంఖ్య 2024 నాటికి 1,700కు పెరిగిందని, వీటిల్లో దాదాపు 19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొంది.

ఏఐతో ఉద్యోగాలకు రిస్కే 
కృత్రిమ మేథతో (ఏఐ) ఎంట్రీ స్థాయి ఉద్యోగాలకు ముప్పు ఉంటుందని, ముఖ్యంగా జీవనోపాధి కోసం ఉద్యోగాల మీదే ఎక్కువగా ఆధారపడే భారత్‌లాంటి దేశాల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సరైన ప్రణాళికలు లేకుండా ఉద్యోగుల స్థానాన్ని ఏఐతో భర్తీ చేసేందుకు కంపెనీలు తొందరపడటం శ్రేయస్కరం కాదని ఐఎంఎఫ్‌ నివేదికను ఉటంకిస్తూ, సూచించింది. ఒకవేళ అలా చేసిన పక్షంలో ఉపాధి కోల్పోయిన వర్కర్లకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకుని, కార్పొరేట్ల లాభాలపై మరింతగా పన్నులు విధించడం, ఇతరత్రా పాలసీపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వివరించింది.   

ఎఫ్‌డీలకు అన్ని అడ్డంకులు తొలగాలి 
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) భారత్‌ మరింతగా ఆకర్షించేందుకు వీలుగా అన్ని అవరోధాలను తొలగించాలని, పన్నుల పరమైన నిలకడను తీసుకురావాలని ఆర్థిక సర్వే సూచించింది. సమీప కాలంలో వడ్డీ రేట్లు, ద్రవ్యల్బోణ ఒత్తిళ్లు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితులు ఉన్నా కానీ, దీర్ఘకాలానికి భారత్‌ ఎఫ్‌డీలకు అనుకూల కేంద్రంగా కొనసాగుతుందని అభిప్రాయపడింది. బలమైన దేశ ఆర్థిక మూలాలు, ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు, కన్జ్యూమర్‌ మార్కెట్‌ వృద్ధి సానుకూలతలుగా పేర్కొంది. ఇప్పటికే చాలా రంగాల్లో ఎఫ్‌డీలను ఆటోమేటిక్‌ మార్గంలో అనుమతిస్తున్నట్టు తెలిపింది. 

డిజిటల్‌ కనెక్టివిటీకి 5జీ దన్ను
దేశవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో 5జీ సర్విసులను ప్రవేశపెట్టడంతో పాటు టెలికం మౌలిక సదుపాయాలను, యూజర్‌ అనుభూతిని మెరుగుపర్చేందుకు నియంత్రణ సంస్థ తీసుకుంటున్న చర్యలతో డిజిటల్‌ కనెక్టివిటీ మెరుగుపడినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. ప్రస్తుతం 783 జిల్లాలకు గాను 779 జిల్లాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నట్లు వివరించింది. భారత్‌ నెట్‌ ప్రాజెక్టు కింద 2024 డిసెంబర్‌ నాటికి 6.92 లక్షల కి.మీ. ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎఫ్‌సీ) వేసినట్లు పేర్కొంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement