స్టార్టప్‌లకు జోష్‌ | Start-ups get a fresh Rs 10,000 crore corpus, tax benefits budget 2025 | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌లకు జోష్‌

Feb 2 2025 6:09 AM | Updated on Feb 2 2025 7:02 AM

Start-ups get a fresh Rs 10,000 crore corpus, tax benefits budget 2025

రూ.10 వేల కోట్ల కార్పస్‌తో ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ పథకం

దేశంలో స్టార్టప్‌లను ప్రోత్సహించే దిశగా బడ్జెట్‌లో కేంద్రం పలు కార్యక్రమాలు ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.10 వేల కోట్ల కార్పస్‌తో నిధుల నిధి (ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అర్హత కలిగిన స్టార్టప్‌లకు పన్ను రాయితీలు కల్పించేందుకు సంబంధించిన విలీన కాలపరిమితిని (ఇన్‌కార్పొరేషన్‌ పీరియడ్‌) ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2016లో కూడా కేంద్రం రూ.10 వేల కోట్ల కార్పస్‌తో ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ తరహా పథకాన్ని ప్రారంభించింది. వెంచర్‌ మూలధన పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దీనిని నెలకొల్పారు. సెక్యూరిటీ అండ్‌ ఎక్సే్చంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)లో రిజిస్టర్‌ అయిన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకు (ఏఐఎఫ్‌లకు) పెట్టుబడి సమకూర్చే చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) దీనిని నిర్వహిస్తుంది.

 కాగా ఈ ఏఐఎఫ్‌లు తిరిగి స్టార్టప్‌లలో పెట్టుబడి పెడతాయి. స్టార్టప్‌ల కోసం ఉద్దేశించిన ఈ ఏఐఎఫ్‌లు రూ.91 వేల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలను కలిగి ఉన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. రూ.10 వేల కోట్ల ప్రభుత్వ కార్పస్‌తో కూడిన నిధుల నిధి పథకం వీటికి దన్నుగా నిలుస్తుందని తెలిపారు. తాజాగా మరో రూ.10 వేల కోట్ల సహాయంతో ఓ కొత్త నిధుల నిధి పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

 పరిశ్రమలను, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ)తో భేటీలో ఏఐఎఫ్‌లు ఈ పథకం కింద మరిన్ని నిధుల కోసం డిమాండ్‌ చేశాయి. ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ సహకారం పొందుతున్న ప్రముఖ స్టార్టప్‌ పెట్టుబడి సంస్థల్లో చిరాటే వెంచర్స్, ఇండియా కోషియెంట్, బ్లూమ్‌ వెంచర్స్, ఐవై క్యాప్‌ తదితరాలున్నాయి. ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ కింద ప్రయోజనం పొందే ఏఐఎఫ్‌లు..తాము అంగీకరించిన మొత్తానికి కనీసం రెండింతలు స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 2024 అక్టోబర్‌ నాటికి ఏఐఎఫ్‌లు రూ.20,572 కోట్ల మేర స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టాయి. 

కంపెనీల హర్షం 
ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ పథకంపై పలు కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి.  బడ్జెట్‌ భారత్‌ను ప్రపంచ ఆవిష్కరణల పవర్‌హౌస్‌ గా నిలబెడుతుందని పేర్కొన్నాయి. రూ.10 వేల కోట్ల తాజా కార్పస్‌తో స్టార్టప్‌లకు అవసరమైన పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయని భారత్‌ పే వ్యవస్థాపకుడు శాశ్వత్‌ నకరాని చెప్పారు. కొత్త స్టార్టప్‌లకు తాజా ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ పథకం కీలకమైన ఆర్థిక మద్దతును అందజేస్తునందని స్టార్టప్‌ పాలసీ ఫోరం (ఎస్‌పీఎఫ్‌) అధ్యక్షుడు, సీఈఓ రాజ్‌పాల్‌ కోహ్లి పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement