పెట్టుబడులు, టర్నోవరు పరిమితుల్లో మార్పులు
వృద్ధి, ఉద్యోగ కల్పనకు ఊతం
న్యూఢిల్లీ: దేశానికి వెన్నెముకగా ఉంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) మరింత ఊతమిచ్చే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో పలు సంస్కరణలను ప్రతిపాదించారు. ఎంఎస్‌ఎంఈల వర్గీకరణకు సంబంధించి పెట్టుబడి, టర్నోవరు పరిమితులను పెంచడం, రుణ హామీ పథకం కవరేజీని పెంచడం, ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు కస్టమైజ్ చేసిన క్రెడిట్ కార్డులు అందించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. వర్గీకరణకు సంబంధించి పెట్టుబడి, టర్నోవరు పరిమితులను వరుసగా రెండున్నర రెట్లు, రెండు రెట్లు పెంచుతూ బడ్జెట్‌లో మంత్రి ప్రతిపాదనలు చేశారు.
వీటి ప్రకారం రూ. 2.5 కోట్ల వరకు పెట్టుబడులు, రూ. 10 కోట్ల వరకు టర్నోవరు ఉన్న సంస్థలను ’సూక్ష్మ’ సంస్థలుగా వర్గీకరిస్తారు. రూ. 25 కోట్ల వరకు పెట్టుబడి, రూ. 100 కోట్ల వరకు టర్నోవరు ఉన్నవి ’చిన్న’ తరహా సంస్థలుగా, రూ. 125 కోట్ల వరకు పెట్టుబడులతో రూ. 500 కోట్ల లోపు టర్నోవరు ఉన్న సంస్థలను ’మధ్య’ తరహా సంస్థలుగా వ్యవహరిస్తారు. ఎంఎస్‌ఎంఈల విషయంలో ప్రకటించిన చర్యలను పరిశ్రమ స్వాగతించింది. దేశ ఎకానమీలో తయారీ రంగ వాటాను పెంచే దిశగా ఇది కీలకమైన అడుగని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ తెలిపారు.
కీలకమైన రెండో ఇంజిన్..
దేశాభివృద్ధికి కీలకమైన రెండో ఇంజిన్‌గా ఎంఎస్‌ఎంఈలను నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఉత్ప త్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు, టెక్నాలజీని మె రుగుపర్చుకునేందుకు, మరింతగా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు తాజా ప్రతిపాదనలు ఉపయోగపడతాయని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కార్యకలాపాలను విస్తరించేందుకు, యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు లఘు సంస్థలకు ధీమా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కోటి పైగా ఉన్న రిజిస్టర్డ్ ఎంఎస్‌ఎంఈలు, సుమారు 7.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. తయారీ రంగంలో వీటి వాటా 36 శాతంగాను, ఎగుమతుల్లో దాదాపు 45%గా ఉంది.
మరిన్ని విశేషాలు..
→ 5 లక్షల మంది మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ఎంట్రప్రెన్యూర్లకు ప్రయోజనం చేకూర్చేలా మంత్రి కొత్త ప్రతిపాదన ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో రూ.2 కోట్ల వరకు టర్మ్ లోన్‌లు అందించేందుకు తోడ్పడుతుంది.
→ లఘు, చిన్న సంస్థలకు రుణ హామీ కవరేజీని రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు పెంచారు. దీనితో వచ్చే అయిదేళ్లలో రూ. 1.5 లక్షల కోట్ల అదనపు రుణాలు లభిస్తాయి.
→ స్టార్టప్‌లకు క్రెడిట్ గ్యారంటీ కవరేజీని రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెంచారు.
→ ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు రూ. 5 లక్షల పరిమితితో కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులు అందించనున్నారు. తొలి ఏడాదిలో 10 లక్షల కార్డులు జారీ చేస్తారు.
→ మేడిన్ ఇండియా ఆట»ొమ్మలకు గ్లోబల్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా ఇంటర్నేషనల్ మాన్యుఫాక్చరింగ్ మిషన్ ఏర్పాటు.
Comments
Please login to add a commentAdd a comment