అద్దె చెల్లింపులపై ఊరట
రూ.6 లక్షలకు పరిమితి పెంపు
వ్యాపార సంస్థలకు ప్రయోజనం
విదేశీ రెమిటెన్స్‌లపై టీసీఎస్‌లో ఉపశమనం
విదేశీ విద్యకు టీసీఎస్ పూర్తిగా తొలగింపు
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను పరంగా భారీ ఊరటనిచ్చిన కేంద్ర సర్కారు, మరోవైపు అద్దె చెల్లింపులపై టీడీఎస్, విదేశీ రెమిటెన్స్‌ల్లోనూ ఊరట కల్పించింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 194–ఐ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో సంస్థల మధ్య అద్దె చెల్లింపులు రూ.2.40 లక్షలు మించితే కిరాయిదారు మూలం వద్దే పన్ను (టీడీఎస్) మినహాయించాల్సి ఉంటుంది. తాజాగా ఈ పరిమితిని రూ.6 లక్షలకు (నెలవారీ అయితే రూ.50,000) పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు.
ఎవరికి ప్రయోజనం..?
తాజా ప్రతిపాదన ప్రధానంగా వ్యాపార సంస్థలకు ఊరటగా చెప్పుకోవాలి. ప్రస్తుతం వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లకు కిరాయి చెల్లింపులు నెలవారీ రూ.50,000 (వార్షికంగా రూ.6లక్షలు) మించినప్పుడు 5 శాతం టీడీఎస్ అమలవుతోంది. అదే వ్యాపార సంస్థలు/ట్రస్ట్‌లు/ఎన్‌జీవోలు తదితర వర్గాలకు వార్షిక అద్దె రూ.2.4 లక్షలు మించినప్పుడే టీడీఎస్ అమలవుతోంది.
ఇప్పుడు వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌ల మాదిరే సంస్థలకూ టీడీఎస్ అమలు పరిమితిని నెలవారీ రూ.50,000కు పెంచారు. మరింత స్పష్టత, ఏకరూపత కోసం ఈ చర్య తీసుకున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ‘‘భూమి లేదా మెషినరీని కొన్ని నెలల కోసం అద్దెకు ఇచ్చినప్పుడు, నెలవారీ అద్దె రూ.50,000 మించితే టీడీఎస్‌లు అమలు చేయాల్సి వస్తుంది’’అని డెలాయిట్ ఇండియా ఆర్తి రాటే తెలిపారు. తక్కువ పన్ను చెల్లించే వారు, భూ/భవన యజమానులకు ఈ పెంపు ప్రయోజనం కల్పిస్తుందని క్రెడాయ్–ఎంసీహెచ్‌ఐ ప్రెసిడెంట్ డొమినిక్ రామెల్ అభిప్రాయపడ్డారు.
కోటి మంది పన్ను కట్టక్కర్లేదు: సీతారామన్
ఐటీ శ్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా ప్రజల చేతుల్లో పెద్ద ఎత్తున ఆదాయాన్ని మిగిల్చినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘‘రూ.12 లక్షలకు ఆదాయపన్ను మినహాయింపును పెంచడం వల్ల మరో కోటి మంది ప్రజలు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం స్పందన ఇది. మధ్య తరగతికి ప్రయోజనం కల్పించేందుకు పన్ను రేట్లను తగ్గించాం’’అని మంత్రి ప్రకటించారు.
కొత్తగా సులభతర ఆదాయపన్ను చట్టం
కొత్త ఆదాయపన్ను బిల్లును వచ్చే వారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ప్రస్తుతమున్న ఆరు దశాబ్దాల క్రితం నాటి ‘ఆదాయపన్ను చట్టం 1961’ స్థానంలో దీన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. ‘ముందు విశ్వసించండి. తర్వాత పరిశీలించండి’ అన్న భావనతో ‘న్యాయ’ స్ఫూర్తితో ఈ బిల్లు ఉంటుందన్న సంకేతం ఇచ్చారు. ‘‘కొత్త బిల్లు చాలా స్పష్టతతో, చాప్టర్లు, పదాల పరంగా ప్రస్తుత చట్టంతో పోల్చి చూసినప్పుడు సగం పరిమాణంలోనే ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులు అర్థం చేసుకునేంత సరళంగా ఉంటుంది. ఫలితంగా పన్నుల స్పష్టత ఏర్పడి, వివాదాలు తగ్గిపోతాయి’’అని మంత్రి వివరించారు. కొత్త ఆదాయపన్ను బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపిస్తామని చెప్పారు.
రూ.10 లక్షలు మించితేనే రెమిటెన్స్‌లపై టీసీఎస్
ఆర్‌బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశాలకు పంపుకునే నిధుల(రెమిటెన్స్/చెల్లింపులు)పై టీసీఎస్‌లో మార్పు చోటుచేసుకుంది. ఏడాదిలో రూ.7లక్షలు మించితే మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) ప్రస్తుతం అమల్లో ఉండగా, దీన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. నిర్దేశిత ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ నుంచి రుణం తీసుకుని విదేశీ విద్య కోసం పంపుకునే రెమిటెన్స్‌లపై టీసీఎస్‌ను తొలగిస్తున్నట్టు చెప్పడం విద్యార్థుల తల్లిదండ్రులకు మరింత ఊరటనిచ్చేదే. విదేశాల్లో చదువు కోసం, ఇతర అవసరాల కోసం వెళ్లిన వారికి నిధుల అవసరం ఏర్పడొచ్చు.
అలాంటప్పుడు స్వదేశం నుంచి వారికి సులభంగా నిధులు పంపుకునేందుకు ఆర్‌బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ వీలు కల్పిస్తుంది. వచ్చే ఐదేళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచనున్నట్టు ప్రకటించడం స్వాగతించదగిన నిర్ణయం. వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణలో పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తద్వారా విద్యార్థులు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుకుంటారు. అప్పుడే పెరిగిన మెడికల్ సీట్ల ప్రయోజనాలను నిజంగా పొందగలం.
కామినేని శశిధర్‌ఎండి, కామినేని హాస్పిటల్స్
సిమెంట్ రంగ వృద్ధికి..
హౌసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై పెరిగిన కేటాయింపులు నిర్మాణ సామగ్రికి డిమాండ్‌ను పెంచుతాయి. అలాగే సామర్థ్య విస్తరణకు దారితీస్తుంది. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలపై పెరిగిన పెట్టుబడులతో సిమెంట్ రంగ వృద్ధికి అవకాశాలు విస్తరిస్తాయి. సవాళ్లు ఉన్నప్పటికీ సిమెంట్ పరిశ్రమ స్థాపిత తయారీ సామర్థ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం కంటే ఎక్కువ స్థిర వార్షిక వృద్ధి రేటును సాధించడానికి ఈ చర్యలు మద్దతు ఇస్తాయి.
– నీరజ్ అఖౌరీ, ప్రెసిడెంట్, సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్.
మెడికల్ టూరిజంకు బూస్ట్..
దేశీయంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పటిష్టం చేసే దిశగా బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉన్నాయి. మెడికల్ టూరిస్టులకు వీసా–ఆన్–అరైవల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో హెల్త్‌కేర్ గమ్యస్థానంగా భారత్ బలోపేతం అవుతుంది. ప్రజారోగ్యం, ఆర్థిక వృద్ధిపై చిత్తశుద్ధిని ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంది.
– బి. భాస్కర్ రావు, సీఎండీ, కిమ్స్
పోటీతత్వాన్ని పెంచడానికి..
ప్రైవేట్ రంగంలో మూలధనాన్ని సానుకూల దిశలో కేటాయించడాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రపంచం కోసం మేక్ ఇన్ ఇండియా అనే అంశం ఈ బడ్జెట్‌లో కీలకంగా ఉంది. తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు దేశం యొక్క ప్రపంచ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి.
– అనీష్ షా, సీఈఓ, ఎండీ, మహీంద్రా గ్రూప్.
ఈవీల ఉత్పత్తికి బాసట..
బ్యాటరీ తయారీకి కీలక ముడిపదార్థాలపై దిగుమతి సుంకాలు తొలగించడం దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచుతుంది. స్థిర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. పర్యావరణ అనుకూల ఆర్థిక వ్యవస్థకు భారతదేశాన్ని మార్చడానికి ఒక వ్యూహాత్మక చర్య.
– గిరీష్ వాఘ్, ఈడీ, టాటా మోటార్స్.
ఉద్యోగాలను సృష్టించడానికి..
వృద్ధిని పెంపొందించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి బలమైన, నమ్మకమైన వేదికను అందిస్తుంది. రాష్ట్రాల సహకారంతో ఆరు విభాగాలలో సంస్కరణల ద్వారా వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ, పెట్టుబడి, ఎగుమతుల వంటి శక్తివంతమైన ఇంజిన్‌లను పటిష్టం చేయడానికి చేసిన విధాన ఎంపికలు స్వాగతించదగినవి.
– సంజీవ్‌పురి, ప్రెసిడెంట్, సీఐఐ
పట్టణ సంస్కరణలకు.. ఊతం
ప్రతి మంత్రిత్వ శాఖకు 3 సంవత్సరాల పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లను రూపొందించడం ద్వారా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ రంగ ప్రమేయాన్ని ప్రభావితం చేసే స్పష్టమైన ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది. దీనికి ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ మరింత మద్దతునిస్తుంది. రూ. లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పట్టణ సంస్కరణలకు
అంకితం.
– వై.ఆర్.నాగరాజా, ఎండీ, రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.
Comments
Please login to add a commentAdd a comment