
ప్రజలకు రూ.100, రూ.200 నోట్లు మరింతగా అందుబాటులో ఉండేలా ఏటీఎంలలో ఆయా డినామినేషన్ నోట్ల లభ్యతను మరింతగా పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. దశలవారీగా ఈ ఆదేశాలను అమలు చేయాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు ఒక సర్క్యులర్‌లో సూచించింది. 2025 సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎంలలో కనీసం ఒక్క క్యాసెట్(ఏటీఎంలో డబ్బు స్టోర్ చేసే కంటైనర్)లోనైనా రూ.100 లేదా రూ.200 నోట్లు ఉండేలా చూడాలని తెలిపింది. 2026 మార్చి 31 నాటికి దీన్ని 90 శాతం ఏటీఎంలకు పెంచాలని పేర్కొంది.
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ ఫిజికల్ క్యాష్ వినియోగం తగ్గుతుందని కొందరు భావిస్తున్నారు. కానీ నిత్యం ఫిజికల్ క్యాష్ అవసరాలు ప్రత్యేకంగా ఉంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డబ్బు లభ్యతకు పెద్దపీట వేయాలని ఆర్‌బీఐ ఇటీవల బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల ఏటీఎంల్లో నగదు లభ్యత తగ్గడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రముఖ ఆర్థిక సంస్థల పనితీరు ఇలా..
దేశంలో ప్రధాన ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్ అయిన ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ పతనం అనేక బ్యాంకులకు నగదు రీఫిల్లింగ్ సేవలకు అంతరాయం కలిగించింది. యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఎక్కువగా అవలంబించడం వల్ల నగదుకు డిమాండ్ తగ్గింది. ఇది బ్యాంకులు తమ ఏటీఎం నెట్‌వర్క్‌లను ఆప్టిమైజ్ చేయడానికి దారితీసింది. కొత్త ఆర్‌బీఐ నిబంధనలు, ఇంటర్‌ఛేంజ్ ఫీజు స్ట్రక్చర్లు ఏటీఎం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకట్ట వేస్తున్నాయి. నగదు భర్తీలో లాజిస్టిక్ సమస్యలు కూడా తాత్కాలిక కొరతకు కారణం అవుతున్నాయి.