ముంబై: మనం బ్యాంక్ అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకులు ఏం చేస్తాయి. అడిషనల్ ఛార్జీలను వసూలు చేస్తాయి.ఇప్పుడు బ్యాంకులు నిర్వహిస్తున్న ఏటీఎంలలో నగదు అందుబాటులోకి లేదంటే ఆర్బీఐ భారీ ఎత్తున జరిమానా విధించేందుకు సిద్ధపడింది.
నగదు ఉండని ఖాళీ ఏటీఎంలతో ప్రజలకు ఎదురవుతున్న అవస్థలను పరిష్కరించడంపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి సారించింది. ఇకపై ఒక నెలలో మొత్తం 10 గంటలకు మించి ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకుంటే బ్యాంకులకు జరిమానా విధించనుంది. ఈ నిబంధన ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (డబ్ల్యూఎల్‌ఏవో) ఎప్పటికప్పుడు ఏటీఎంలలో నగదు లభ్యతను పర్యవేక్షించి, సమయానికి భర్తీ చేసేలా తమ యంత్రాంగాలను పటిష్టం చేసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది.
ఈ నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని, జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది. ఒక నెలలో పది గంటలకు మించి ఏ ఏటీఎంలోనైనా నగదు లేకపోతే, ఒక్కో ఏటీఎంకు రూ. 10,000 చొప్పున పెనాల్టీ ఉంటుంది. వైట్ లేబుల్ ఏటీఎంల విషయంలో సదరు ఏటీఎంలకు సంబంధించిన నగదు అవసరాలు తీర్చే బ్యాంకులే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని డబ్ల్యూఎల్‌ఏవో నుంచి వసూలు చేసుకోవచ్చు. 2021 జూన్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 2,13,766 ఏటీఎంలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment