సాక్షి, బిజినెస్ విభాగం : వైట్ లేబుల్ ఏటీఎంల (డబ్ల్యూఎల్‌ఏ) గురించి మనకి తెలిసిందే. అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ఆర్‌బీఐ పలు నాన్ బ్యాంకింగ్ సంస్థలకు డబ్ల్యూఎల్‌ఏ లైసెన్స్‌లిచ్చింది. కాకపోతే లైసెన్స్‌లిచ్చిన సంస్థలకు ఆ ఏటీఎంలలో పెట్టడానికి క్యాష్ మాత్రం ఇవ్వటం లేదు. పెద్ద నోట్ల రద్దు, ఇంటర్‌చేంజ్ చార్జీల తగ్గింపు వంటి అంశాలు తమ కార్యకలాపాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయని ఆపరేటర్లు వాపోతున్నారు.
ఇండీక్యాష్‌దే తొలి ఏటీఎం
డబ్ల్యూఎల్‌ఏ ఏటీఎంల ఏర్పాటుకు 2013లో ఆర్‌బీఐ లైసెన్స్‌లను జారీ చేసింది. టాటా గ్రూప్‌కు చెందిన ఇండీక్యాష్ తొలిగా ఈ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. బీటీఐ పేమెంట్స్, హిటాచీ పేమెంట్స్ వంటి పలు సంస్థలు డబ్ల్యూఎల్‌ఏ ఏటీఎంలను నిర్వహిస్తున్నాయి. అయితే ఆర్‌బీఐ, ఆపరేటర్లు అంచనా వేసిన మాదిరి కాకుండా ఏటీఎంల ఏర్పాటు చాలా నెమ్మదిగా ఉంది. ఇండీక్యాష్, బీటీఐ పేమెంట్స్ సంస్థలకు వరుసగా 8,500, 4,800 ఏటీఎంలున్నాయి.
ఇవి రెండూ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యాయి. ‘ఏటీఎంల ఏర్పాటు సులువేమీ కాదు. అందుకే మేం లక్ష్యాలను చేరుకోలేకపోయినా రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మాపై జరిమానా విధించడం లేదు. ఎవ్వరూ లక్ష్యాలను అందుకోలేదు. ఆర్‌బీఐ ఒకవేళ జరిమానా విధిస్తే సంస్థలు వాటి లైసెన్స్‌ను తిరిగి అప్పగించే అవకాశముంది’ అని ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ డబ్ల్యూఎల్‌ఏ హెడ్ నశ్విన్ నొరొన్హా తెలిపారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన నగదు కొరత డబ్ల్యూఎల్‌ఏ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపిందని ఎఫ్‌ఐఎస్ ఏటీఎం అండ్ అలైడ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రాధా రామదొరై పేర్కొన్నారు. లక్ష్యాలను చేరుకోలేకపోవడానికి నోట్ల రద్దు ప్రధాన కారణమని బీటీఐ పేమెంట్స్ ఆరోపించింది. దీని వల్ల 8–10 నెలల పాటు వ్యాపారాన్ని కోల్పోయామని పేర్కొంది. ‘మూడో ఏడాది డీమోనిటైజేషన్ వల్ల సవాళ్లను ఎదుర్కొన్నాం. కొత్త ఏటీఎంలను ఏర్పాటు చేయడం తెలివి తక్కువ చర్య’ అని బీటీఐ పేమెంట్స్ సీఈవో, ఎండీ కె.శ్రీనివాస్ తెలిపారు.
డీమోనిటైజేషన్‌కు ముందు జోరుగానే..
పెద్ద నోట్ల రద్దు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని డబ్ల్యూఎల్‌ఏ ఆపరేటర్లు చెప్పారు. ‘డీమోనిటైజేషన్‌కు ముందు వృద్ధి వేగంగా ఉంది. కానీ నోట్ల రద్దు తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అందుకని నగదు సరఫరా ఉన్న ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం ప్రారంభించాం’ అని టాటా కమ్యూనికేషన్ పేమెంట్ సొల్యూషన్స్ సీఈవో సంజీవ్ పటేల్ తెలిపారు. శ్రేయీ ఇన్‌ఫ్రా తన డబ్ల్యూఎల్‌ఏ ఏటీఎం కార్యకలాపాలను మూసివేయడానికి నోట్ల రద్దే కారణం.
9,000 ఏటీఎంల ఏర్పాటుకు లైసెన్స్ దక్కించుకున్న శ్రేయీ మార్చిలో తన లైసెన్స్‌ను వెనక్కు ఇచ్చేసింది. ‘అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసం డబ్ల్యూఎల్‌ఏ మోడల్‌ను ఆవిష్కరించారు. ప్రసుత్త ఇంటర్‌చేంజ్ ధరలు, డబ్ల్యూఎల్‌ఏ ఏటీఎంలకు నగదు కొరత వంటి అంశాల నేపథ్యంలో ఈ మోడల్ ఆశించినంత స్థాయిలో వృద్ధి సాధించలేకపోయింది’ అని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ఎండీ లోనీ ఆంటోనీ తెలిపారు.
ఇంటర్‌చేంజ్ చార్జీలు రూ.15కి తగ్గింపు
డబ్ల్యూఎల్‌ఏ ఆపరేటర్లు ప్రతి లావాదేవీకీ బ్యాంకుల నుంచి కొంత ఫీజు వసూళ్లు చేస్తాయి. దీన్ని ఇంటర్‌చేంజ్ చార్జీ అంటారు. అయితే దీన్ని రూ.18 నుంచి రూ.15కి తగ్గించారు. ఇది డబ్ల్యూఎల్‌ఏ ఆపరేటర్లపై ప్రతికూల ప్రభావం చూపించింది. ‘గ్రామాల్లో నగదు సరఫరా వ్యయాలు ఎక్కువ. దీని వల్ల మెట్రోలతో పోలిస్తే ఆయా ప్రాంతాల్లో ట్రాన్సాక్షన్ చార్జీలు ఎక్కువగా ఉండాలి’ అని బీటీఐ పేమెంట్స్ పేర్కొంది.
‘డబ్ల్యూఎల్‌ఏ నెట్‌వర్క్ నిర్వహణకు అయ్యే ఖర్చు ట్రాన్సాక్షన్ ఫీజు రూ.20 కన్నా ఎక్కువగా ఉంది. పరిశ్రమ ఇంటర్‌బ్యాంక్ చార్జీల పెంపునకు డిమాండ్ చేస్తోంది’ అని ఎన్‌సీఆర్ కార్పొరేషన్ ఎండీ నౌరోజ్ దస్తూర్ తెలిపారు. డబ్ల్యూఎల్‌ఏ మోడల్ వ్యాపారానికి యూనిట్ స్థాయి లాభదాయకత అవసరమని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ) అభిప్రాయపడింది.
ఉచిత లావాదేవీల పరిమితిని పరిశీలించాలి
రిజర్వు బ్యాంక్ 2014లో తీసుకువచ్చిన ఏటీఎంల ఉచిత లావాదేవీలపై పరిమితిని ఒకసారి పునఃపరిశీలించాలని ఆపరేటర్లు కోరారు. ‘పరిమితి వల్ల ఏటీఎంల వినియోగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మాల్‌వేర్ దాడులు, మోసాలు వంటి సమస్యల నుంచి ఏటీఎంల భద్రతకు అవసరమైన ఇన్వెస్ట్‌మెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంల నిర్వహణ వ్యయాలు అధికంగా ఉండటం, నగరాల్లో ట్రాన్సాక్షన్లు తగ్గడం వంటి అంశాలు ఏటీఎంలపై ప్రతికూల ప్రభావం చూపాయి’ అని సీఏటీఎంఐ ట్రెజరర్, యూరోనెట్ సర్వీసెస్ ఇండియా ఎండీ హిమాన్సు పుజారా పేర్కొన్నారు.
కాగా ఇంటర్‌చేంజ్ ఫీజును పెంచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డబ్ల్యూఎల్‌ఏ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ఆర్‌బీఐ ఇంటర్‌చేంజ్ చార్జీల విధింపు ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కి అప్పగించింది. ఎన్‌పీసీఐ స్టీరింగ్ కమిటీ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అనుకూలంగా ఉంటుంది. బ్యాంకులేమో ఇంటర్‌చేంజ్ చార్జీల పెంపును అడ్డుకుంటున్నాయి’ అని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment