
రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో భారత్ మరోసారి స్పష్టమైన వైఖరి ప్రకటించింది. రష్యా చమురు కొనుగోళ్లపై యూఎస్ నుంచి పదేపదే హెచ్చరికలు, ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. ధరలు అనుకూలంగా ఉన్నంత వరకు రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపడానికి భారత్ సుముఖంగా లేదని తేల్చి చెప్పింది. ఈ వైఖరిని భారత్ తన జాతీయ ప్రయోజనాలు, ఇంధన సార్వభౌమాధికారంగా చూస్తుందని తెలిపింది. దీన్ని ఇతర దేశాలు భౌగోళిక రాజకీయ ధిక్కారంగా కాకుండా ఆర్థిక అవసరంగా చూడాలని పేర్కొంది.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) క్లిష్టతరం
రష్యా చమురుపై భారతదేశం తీసుకున్న వైఖరి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) చర్చలను మరింత క్లిష్టతరం చేసింది. భారత్ మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతిని యూఎస్ రష్యా ఇంధన సంబంధాలతో ముడిపెట్టింది. దీని ఫలితంగా భారత్ నుంచి యూఎస్ వచ్చే కొన్ని వస్తువులపై ఈ సంవత్సరం ప్రారంభంలో విధించిన భారీ సుంకాలను 50% వరకు పెంచింది. వీటిని తగ్గించేందుకు అమెరికా నిరాకరిస్తోంది. రష్యా చమురు సమస్య పరిష్కారమయ్యే వరకు ఈ సుంకాలు కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి: పండుగ వేళ ఆర్డర్లున్నా డెలివరీ కష్టతరం!
యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుత్నిక్ వంటి అధికారులు రష్యాతో ఆర్థిక సంబంధాలను కొనసాగించే దేశాలపై మరింత కఠినమైన ప్రకటనలు చేస్తూ భారతదేశం, బ్రెజిల్ వంటి దేశాలకు ‘ఫిక్సింగ్’ అవసరమని హెచ్చరించారు. ఈ ఒత్తిడికి ప్రతిస్పందనగా భారతదేశం తన దౌత్యపరమైన, ఆర్థిక ఎంపికలను విస్తరిస్తోంది. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ న్యూయార్క్‌లో బ్రిక్స్ విదేశాంగ మంత్రులకు ఆతిథ్యం ఇచ్చారు. ఇండియా ఆర్థిక నిబద్ధతను బలోపేతం చేయడం ఈ వ్యూహంలో భాగం. భారత్ గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాలను పెంపొందించడం, కొత్త వాణిజ్య కారిడార్లను అన్వేషించడం ద్వారా యూఎస్ ఒత్తిళ్లను అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది.