ఎఫ్‌డీఐలకు తలుపులు బార్లా
త్వరలో డ్రాఫ్ట్ బిల్లు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి సీతారామన్ తాజా బడ్జెట్‌లో బీమా రంగానికి పూర్తిస్థాయిలో మద్దతిచ్చారు. బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు)ను అనుమతించేందుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం బీమాలో 74 శాతంవరకూ ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. ఆధునికతరం ఫైనాన్షియల్ రంగ సంస్కరణలలో భాగంగా ఇందుకు తెరతీశారు. అయితే మొత్తం ప్రీమియంను దేశీయంగా ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు మాత్రమే పెంచిన పరిమితి వర్తించనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. వెరసి విదేశీ పెట్టుబడుల పరిమితులను సమీక్షించడంతోపాటు సరళతరం చేసినట్లు వెల్లడించారు.
ఎఫ్‌డీఐ పరిమితి పెంపునకు వీలుగా ప్రభుత్వం బీమా చట్టం 1938, జీవిత బీమా చట్టం 1956, బీమా నియంత్రణ, అభివృద్ధి అ«దీకృత చట్టం 1999లకు సవరణలు చేయనుంది. మరిన్ని సంస్థలు ప్రవేశించడం ద్వారా బీమా విస్తృతి పెరగడంతోపాటు భారీ ఉద్యోగ అవకాశాలకు తెరలేవనుంది. కొన్ని నిబంధనలు, విధానాలను సరళతరం చేసే ముసాయిదా బిల్లు త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 25 జీవిత బీమా, 34 సాధారణ బీమా కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కాగా.. ఇంతక్రితం 2021లో బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి ప్రభుత్వం హెచ్చించింది. అంతకుముందు 2015లో 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment