Foreign Direct Investments (FDI)
-
ఫార్మాలో విదేశీ పెట్టుబడుల వెల్లువ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఫార్మాస్యూటికల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వెల్లువెత్తుతున్నాయి. 2024–25 మొదటి అర్ధభాగంలో ఎఫ్‌డీఐలు నాలుగురెట్లకుపైగా దూసుకెళ్లి 520 మిలియన్ డాలర్లు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్‌లో ఎఫ్‌డీఐ ఈక్విటీ 117 మిలియన్ డాలర్లు మాత్రమే. 2000 ఏప్రిల్ నుండి 2024 సెప్టెంబర్ వరకు డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ రంగంలోకి వచ్చిన విదేశీ నిధులు 23.05 బిలియన్ డాలర్లు. ఇది ఈ కాలంలో దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 3.25 శాతానికి సమానం. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 2024 సెప్టెంబరుతో ముగిసిన రెండవ త్రైమాసికంలో విదేశీ నిధులు దాదాపు పది రెట్లు వృద్ధిని నమోదు చేశాయి. 2024 జూలై నుండి సెప్టెంబర్ వరకు 284 మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వెల్లువెత్తాయి. 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది కేవలం 27 మిలియన్ డాలర్లు మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 162 శాతం వృద్ధితో ఎఫ్‌డీఐలు 236 మిలియన్ డాలర్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 90 మిలియన్ డాలర్లుగా ఉంది. డీవోపీకి ఆ బాధ్యతలు..వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మాస్యూటికల్ రంగంలోకి 1.06 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఇది 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2.06 బిలియన్ డాలర్లు. 2021–22లో 1.41 బిలియన్ డాలర్లు నమోదైంది. ఫార్మాస్యూటికల్స్ రంగంలో నూతనంగా స్థాపించే ప్రాజెక్టులకు విదేశీ పెట్టుబడులు ఆటోమేటిక్ రూట్లో 100 శాతం వరకు అనుమతిస్తారు. ఇప్పటికే ఉన్న ఫార్మాస్యూటికల్ ప్రాజెక్ట్‌లకు 74 శాతం దాటే విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 2017 మే నెలలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్‌ను (ఎఫ్ఐపీబీ) రద్దు చేసిన తర్వాత ప్రభుత్వ ఆమోదం మార్గంలో విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్‌కు (డీవోపీ) ఆ బాధ్యతలను అప్పగించారు. అలాగే వైద్య పరికరాల రంగానికి సంబంధించిన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను సైతం ఈ డిపార్ట్మెంట్ పరిశీలిస్తుంది. -
చిన్న పారిశ్రామిక టౌన్‌షిప్‌లు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళీకరించడం, స్మార్ట్ పారిశ్రామిక టౌన్‌షిప్‌లు, టైర్–2, 3 పట్టణాల్లో రంగాల వారీ ప్రత్యేకమైన పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించిందని పరిశ్రమల ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా తెలిపారు. దేశ పారిశ్రామికీకరణకు ఈ చర్యలు ఊతమిస్తాయన్నారు.ఫిక్కీ వార్షిక సమావేశంలో భాగంగా మాట్లాడారు. పలు శాఖల మద్దతుతో పారిశ్రామికాభివృద్ధికి అనుకూల ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. జాతీయ పారిశ్రామిక నవడా కార్యక్రమం, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ), వ్యాపార సులభతర నిర్వహణ సంస్కరణలు పారిశ్రామికాభివృద్ధికి వీలు కల్పించినట్టు భాటియా తెలిపారు. విద్యుదీకరణ పారిశ్రామికీకరణను వేగవంతం చేసిందని భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి కరమ్ రిజ్వి ఇదే కార్యక్రమంలో భాగంగా అన్నారు.తయారీలో పోటీతత్వం, దేశీయ వాటాను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. ప్రైవేటు పెట్టుబడులు అన్నవి దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా ఉండాలని ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ అనంత్ గోయెంకా అన్నారు. రంగాల వారీ పారిశ్రామిక పార్క్‌లు ఎంతో మార్పును తీసుకురాగలవన్నారు. కాకపోతే స్థానికంగా, విదేశాల్లోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌లు) నుంచి పాఠాలను పరిగణనలోకి తీసుకోవాలని, తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంచాలని సూచించారు. -
‘స్పేస్’లో మరిన్ని ఎఫ్‌డీఐలకు సై
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మూడు కేటగిరీల కింద ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ లాంచ్ వాహనాలు తదితర విభాగాల్లోకి వంద శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించేలా నిబంధనలను సవరిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన విభాగాల్లో 74 శాతం వరకు ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. అది దాటితే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్స్, స్పేస్‌క్రాఫ్ట్‌ల ప్రయోగం కోసం స్పేస్పోర్టుల ఏర్పాటు వంటి విభాగాల్లో 49 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. ఉపగ్రహాల విడిభాగాలు, సిస్టమ్స్/సబ్–సిస్టమ్స్ మొదలైన వాటి తయారీలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. ఇప్పటివరకు ఉన్న పాలసీ ప్రకారం ఉపగ్రహాల తయారీ కార్యకలాపాల్లో ఎఫ్‌డీఐలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉంటోంది. కొత్త సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఈ ఏడాది తొలి నాళ్లలోనే ఆమోదముద్ర వేసింది. వీటికి సంబంధించి కేంద్ర అంతరిక్ష విభాగం ఇన్–స్పేస్, ఇస్రో, ఎన్ఎస్ఐఎల్ వంటి పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపింది. మస్క్ పర్యటన నేపథ్యంలో.. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్న సందర్భంలో తాజా పరిణామం ప్రాధా న్యం సంతరించుకుంది. వేల కొద్దీ ఉపగ్రహాలతో ప్రపంచంలో ఎక్కడైనా హై–స్పీడ్ ఇంటర్నెట్ను అందించేలా ఎలాన్ మస్క్ తలపెట్టిన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టు స్టార్‌లింక్‌కు ప్రస్తుతం అనుమతులను జారీ చేసే ప్రక్రియ తుది దశలో ఉంది. ఏప్రిల్ 21, 22 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న మస్క్ .. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు భారతీయ స్పేస్ కంపెనీలతో కూడా సమావేశం కానున్నారు. -
స్పేస్ స్టార్టప్‌లకు కొత్త జోష్
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడంతో స్పేస్ స్టార్టప్‌లకు మరింత ఊతం లభించగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లాంచ్ వెహికల్స్, ఉపగ్రహాల తయారీ, అసెంబ్లింగ్ మొదలైన విభాగాల్లో అంకుర సంస్థలకు ప్రోత్సాహం దక్కగలదని పేర్కొన్నారు. అలాగే, భారతీయ కంపెనీలు అంతర్జాతీయ అంతరిక్ష రంగ సరఫరా వ్యవస్థల్లో మరింతగా భాగం అయ్యేందుకు కూడా ఇది తోడ్పడగలదని డెలాయిట్ పార్ట్నర్ శ్రీరామ్ అనంతశయనం, నాంగియా ఆండర్సన్ ఇండియా డైరెక్టర్ మయాంక్ ఆరోరా తదితరులు చెప్పారు. అంతరిక్ష రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా విదేశీ పెట్టుబడులను 100 శాతం అనుమతిస్తూ ఎఫ్‌డీఐ నిబంధనలను కేంద్రం సడలించిన సంగతి తెలిసిందే. వీటి ప్రకారం ఉపగ్రహాల సబ్–సెక్టార్‌ను మూడు వేర్వేరు విభాగాలుగా వర్గీకరించారు. ఉపగ్రహాల తయారీ.. కార్యకలాపాలు, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన వాటిలో 74 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో, అంతకు మించితే ప్రభుత్వ అనుమతులు అవసరమవుతాయి. అలాగే, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్‌లు మొదలైన వాటిలో 49 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతి ఉంటుంది. అది దాటితే ప్రభుత్వ ఆమోదం ఉండాలి. శాటిలైట్ల కోసం విడిభాగాలు, సిస్టమ్స్ మొదలైన వాటిలోకి 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంటుంది. గణాంకాల ప్రకారం దేశీయంగా స్పేస్ విభాగంలో దాదాపు 200 పైచిలుకు స్టార్టప్‌లు ఉన్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష ఎకానమీలో భారత ప్రైవేట్ స్పేస్ రంగం వాటా కేవలం రెండు శాతంగా ఉంది. 2040 నాటికి ఇది 10 శాతానికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. -
పేటీఎంలో చైనా పెట్టుబడులపై ప్రభుత్వ ఫోకస్
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్ సరీ్వసెస్ లిమిటెడ్ (పీపీఎస్ఎల్)లో చైనా నుంచి వచి్చన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘పేమెంట్ అగ్రిగేటర్’ లైసెన్స్ కోసం పీపీఎస్ఎల్ 2020 నవంబర్‌లో దరఖాస్తు పెట్టుకుంది. 2022 నవంబర్‌లో ఈ దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. ఎఫ్‌డీఐ మార్గదర్శకాల్లోని ప్రెస్‌నోట్ 3 నిబంధనలను పాటించడం ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం కంపెనీలో ఎఫ్‌డీఐలకి కేంద్రం అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్)లో చైనాకు చెందిన యాంట్ గ్రూప్‌కు వాటాలు ఉన్నాయి. ఆర్బీఐ సూచన మేరకు ఎఫ్‌డీఐ ప్రెస్ నోట్3 నిబంధనలను అనుసరించి, ఓసీఎల్‌లో చైనా ఎఫ్‌డీఐకి ఆమోదం కోసం పేటీఎం 2022 డిసెంబర్ 14న దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి ఇది కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగానే ఉంది. పీపీఎస్ఎల్లో చైనా పెట్టుబడులను అంతర్మంత్రిత్వ శాఖ కమిటీ అధ్యయనం చేస్తోందని, సంప్రదింపులు, విస్తృత పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటుందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. భారత్‌తో భూ సరిహద్దులను పంచుకునే దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలకి ముందస్తు ఆమోదం తప్పనిసరి అంటూ కేంద్ర సర్కారు లోగడ నిబంధనలు తీసుకువచి్చంది. 2020లో చైనా–భారత్ బలగాల మధ్య గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఈ కఠిన వైఖరికి మళ్లింది. యూజర్ల నుంచి పూర్తి మద్దతు: పేటీఎం మరోవైపు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) వివాదం ఎలా ఉన్నా .. యూజర్ల నుంచి తమకు పూర్తి మద్దతు లభిస్తోందని పేటీఎం ఒక బ్లాగ్‌పోస్టులో తెలిపింది. వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సరీ్వసులను కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేసింది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో ఫిబ్రవరి 29 నుంచి దాదాపు అన్ని సేవలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్‌ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్నాం.. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. గతంలో పేటీఎంలోకి వచి్చన ఎఫ్‌డీఐకి సంబంధించి తప్పనిసరి అనుమతులు పొందాలని ఆర్బీఐ సూచించినట్టు తెలిపారు. ‘‘ఇది నియంత్రపరమైన ప్రక్రియ. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఎవరైనా కానీ, ఎఫ్‌డీఐ ఆమోదం పొందాల్సిందే’’అని చెప్పారు. ఈ నిబంధనలను అనుసరించి అన్ని రకాల పత్రాలతో నియంత్రణ సంస్థ వద్ద దరఖాస్తు సమరి్పంచినట్టు తెలిపారు. ఇది పరిష్కారం అయ్యేంత వరకు, కొత్త వరక్తులను చేర్చుకోకుండా, అప్పటికే చేరిన వర్తకులకు పేమెంట్ సేవలు అందించడానికి అనుమతి ఉంటుంది. ‘‘కంపెనీలో యాజమాన్య రూపం మారిపోయింది. పేటీఎం వ్యవస్థాపకుడు (శర్మ) ఇప్పడు కంపెనీలో 24.3 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. ఓసీఎల్‌లో యాంట్ ఫైనాన్షియల్ పెట్టుబడి 10 శాతంలోపునకు తగ్గిపోయింది. కనుక పీపీఎస్ఎల్లో చైనా నుంచి ఎఫ్‌డీఐ అన్నదానికి ప్రస్తుతం అర్థం లేదు’’అని పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. -
సరిహద్దు దేశాల నుంచి ఎఫ్‌డీఐలు
న్యూఢిల్లీ: భూ సంబంధ సరిహద్దు దేశాల ద్వారా 2020 ఏప్రిల్ నుంచి 2023 సెప్టెంబర్ వరకూ రూ. లక్ష కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రతిపాదనలు నమోదయ్యాయి. వీటిలో 50 శాతానికి ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర లభించింది. మిగిలిన సగం ప్రతిపాదనల్లో పెండింగ్ లేదా ఉపసంహరణ లేదా తిరస్కరణకు గురై ఉండవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. కోవిడ్–19 మహమ్మారి కారణంగా భూ సరిహద్దు దేశాల నుంచి లభించే ఎఫ్‌డీఐలకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ కేంద్రం 2020 ఏప్రిల్‌లో పత్రికా ప్రకటన విడుదల చేసింది. తద్వారా దేశీ కంపెనీల టేకోవర్ అవకాశాలకు చెక్ పెట్టింది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్లతో దేశానికి భూ సంబంధ సరిహద్దులున్న సంగతి తెలిసిందే. వెరసి ఈ దేశాల నుంచి తరలివచ్చే ఎఫ్‌డీఐల ద్వారా దేశీయంగా ఏ రంగంలోనైనా పెట్టుబడులు చేపట్టేందుకు అనుమతులు తప్పనిసరిగా మారాయి. ఈ నిబంధనల తదుపరి రూ. లక్ష కోట్ల ప్రతిపాదనలురాగా.. 50 శాతం పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. భారీ మెషీనరీ తయారీ, ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ట్రేడింగ్, ఈకామర్స్, తేలికపాటి ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాలలో అత్యధిక ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు నమోదయ్యాయి. సమీక్షా కాలంలో చైనా నుంచి 2.5 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్‌డీఐ ఈక్విటీ ప్రతిపాదనలురాగా.. నేపాల్ నుంచి 4.5 మిలియన్ డాలర్లు, మయన్మార్ నుంచి 9 మిలియన్ డాలర్లు చొప్పున లభించాయి. -
తగ్గిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి ఆరు నెలలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) 24 శాతం వెనకడుగు వేశాయి. వెరసి ఏప్రిల్–సెప్టెంబర్‌లో 20.48 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, టెలికం, ఆటో, ఫార్మా రంగాలలో పెట్టుబడులు తగ్గడం ఇందుకు కారణమైనట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. గతేడాది(2022–23) తొలి అర్ధభాగంలో 26.91 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు లభించాయి. గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లోనూ ఎఫ్‌డీఐలు దాదాపు 41 శాతం క్షీణించి 9.28 బిలియన్ డాలర్లను తాకాయి. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్ట్‌లలో పెట్టుబడులు నీరసించగా.. సెప్టెంబర్‌లో మాత్రం పుంజుకుని 4.08 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఇవి 2.97 బిలియన్ డాలర్లు మాత్రమే. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) విడుదల చేసిన గణాంకాలివి. పెట్టుబడుల తీరిలా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఈక్విటీ, ఆర్జనను తిరిగి ఇన్వెస్ట్ చేయడం, ఇతర మూలధన పెట్టుబడులు 16 శాతం తగ్గి 32.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో 38.94 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి. తాజా సమీక్షా కాలంలో సింగపూర్, మారిషస్, యూఎస్, యూకే, యూఏఈ నుంచి ఈక్విటీ పెట్టుబడులు డీలా పడ్డాయి. అయితే నెదర్లాండ్స్, జపాన్, జర్మనీ నుంచి పెట్టుబడులు పుంజుకోగా.. నిర్మాణ(మౌలిక సదుపాయాలు) కార్యకలాపాలు, కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, మెటలర్జికల్ ఇండస్ట్రీలకు ఎఫ్‌డీఐలు పెరిగాయి. రాష్ట్రాలవారీగా చూస్తే తొలి 6 నెలల్లో మహారాష్ట్రకు అత్యధికంగా 7.95 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయి. గతేడాది ఇదే కాలంలో లభించిన 8 బిలియన్ డాలర్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కర్ణాటకకు పెట్టుబడులు 5.32 బిలియన్ డాలర్ల నుంచి 2.84 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. -
అంతరిక్ష రంగంలోకి సులభతరంగా ఎఫ్‌డీఐలు
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులు, ప్రైవేట్ సంస్థలను ఆకర్షించే దిశగా కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత సరళతరం చేయడంపై కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి అంతర్–మంత్రిత్వ శాఖల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఒక సీనియర్ అధికారి తెలిపారు. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈ రంగంలో విదేశీ సంస్థలు ఇన్వెస్ట్ చేసేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉపగ్రహాల సంబంధ కార్యకలాపాల విభాగంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉన్నప్పటికీ అది ప్రభుత్వ అనుమతికి లోబడి ఉంటోంది. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో జీ–20 కూటమిలోని మూడు దేశాలు .. అంతరిక్ష రంగంలో భారత్‌తో కలిసి పని చేసే అవకాశాలపై ఆసక్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరిశోధన అభివృద్ధి కార్యకలాపాల కోసం ఉపయోగించే ఉపకరణాల తయారీ మొదలుకుని స్పేస్ హార్డ్‌వేర్, టెక్నాలజీ సేవలు మొదలైన వాటి దాకా అనేక అంశాలు అంతరిక్ష రంగ అవసరాల్లో ఉంటాయి. వివిధ నివేదికల ప్రకారం అంతర్జాతీయంగా అంతరిక్ష రంగం పరిమాణం 546 బిలియన్ డాలర్లుగా ఉంది. 2040 నాటికి ఇది 1 లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది. సాంకేతిక పురోగతి, వ్యయ నియంత్రణ చర్యలు మొదలైనవి ఇందుకు దోహదపడనున్నాయి. -
Canada-India relations: కెనడా పెట్టుబడులు ఎక్కువే
న్యూఢిల్లీ: ఇటీవల కెనడా, భారత్ మధ్య దౌత్య సంబంధ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో పెట్టుబడుల రాకపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలలో వెనువెంటనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడకపోవచ్చని ఇన్వెస్టర్ల ఫోరమ్.. సావరిన్ వెల్త్ ఫండ్ ఇన్స్టిట్యూట్(ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ) పేర్కొంది. రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) వంటి అంశాలు పెద్దగా ప్రభావితం కాకపోవచ్చని అభిప్రాయపడింది. నిజానికి 2000 ఏప్రిల్ నుంచి 2023 మార్చి మధ్య కాలంలో కెనడా నుంచి దేశీయంగా 3.64 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 30,212 కోట్లు) ఎఫ్‌డీఐలు ప్రవహించాయి. వెరసి ఎఫ్‌డీఐల రాకలో కెనడా 17వ ర్యాంకులో నిలిచినట్లు ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది. కెనడియన్ పెట్టుబడుల్లో సరీ్వసులు, మౌలికసదుపాయాల పెట్టుబడులు 40.63 శాతంకాగా.. దేశీయంగా 600కుపైగా కంపెనీలు కార్యకలాపాలు కలిగి ఉన్నాయి. ఇంతకంటే అధికస్థాయిలో కెనడా కంపెనీలు దేశీయంగా పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జీటీఆర్ఐ నివేదిక ప్రకారం కెనడియన్ పెన్షన్ ఫండ్స్ 2022 చివరికల్లా దేశీయంగా 45 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి. తద్వారా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఎఫ్‌డీఐగా కెనడా నిలిచింది. ఫండ్ పెట్టుబడుల్లో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసులున్నాయి. భారీ మార్కెట్ కావడం, పెట్టుబడులపై అత్యధిక రిటర్నులు కారణంగా కెనడా పెన్షన్ ఫండ్స్ దేశీయంగా పెట్టుబడులను కొనసాగించనున్నట్లు జీటీఆర్ఐ అభిప్రాయపడింది. లక్ష కోట్లకుపైగా దేశీయంగా రియలీ్ట, ఎనర్జీ, హెల్త్‌కేర్, ఐటీ తదితర రంగాలలో కెనడియన్ పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్(సీపీపీఐబీ) లక్ష కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసింది. సీపీపీఐబీ తాజా గణాంకాల ప్రకారం ఏడాదిక్రితంవరకూ దేశంలో 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇది ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ స్వతంత్ర బోర్డు నిర్వహణలో ఉంటుందని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ చైర్మన్ లక్ష్మీ నారాయణన్ పేర్కొన్నారు. ప్రధానంగా వాటాదారులకు లబ్ది చేకూర్చే లక్ష్యంతో ఇన్వెస్ట్ చేస్తుందని తెలియజేశారు. దేశీ స్టార్టప్‌లలో సీపీపీఐబీ పెట్టుబడులు చేపడుతోంది. డెల్హివరీలో 6 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో 2.68 శాతం, జొమాటోలో 2.42 శాతం, ఇండస్టవర్లో 2.18 శాతం, పేటీఎమ్‌లో 1.76 శాతం, నైకాలో 1.47 శాతం చొప్పున వాటాలు కలిగి ఉంది. ఈ బాటలో విదేశాలలో లిస్టయిన దేశీ కంపెనీలలోనూ ఇన్వెస్ట్ చేసింది. యూఎస్ లిస్టెడ్ విప్రో, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకులలో పెట్టుబడులు కలిగి ఉంది. మరికొన్ని ఇతర అన్‌లిస్టెడ్ కంపెనీలోనూ వాటాలు పొందినట్లు నారాయణన్ తెలియజేశారు. రెండింటికీ మేలే భారత్, కెనడా సంబంధాలు రెండింటి లబ్ది ఆధారితమై ఉన్నట్లు స్వతంత్ర రీసెర్చర్, కన్సల్టెంట్ ప్రతీమ్ రంజన్ బోస్ పేర్కొన్నారు. దీంతో పెట్టుబడులపై వెనువెంటనే ప్రతికూల ప్రభావం పడకపోవచ్చని అంచనా వేశారు. రెండు ఆర్థిక వ్యవస్థలకూ నష్టదాయకం కావడంతో ప్రస్తుత వివాదాలు కొనసాగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దౌత్య మార్గంలో సమస్యలు సర్దుకునే అవకాశమున్నట్లు తెలియజేశారు. దశాబ్దకాలం తదుపరి ఇటీవలే రెండు దేశాల మధ్య విదేశీ వాణిజ్య ఒప్పంద చర్చలకు తెరతీసినట్లు తెలియజేశారు. అయితే రాజకీయ వివాదాలు తలెత్తడంతో తిరిగి నిలిచిపోయినట్లు తెలియజేశారు. 2022లో కెనడాకు తొమ్మిదో ర్యాంకు విదేశీ వాణిజ్య భాగస్వామిగా భారత్ నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అధిక రిటర్నులు దౌత్యపరమైన ప్రస్తుత ఉద్రిక్తతలు రెండు దేశాల మధ్య పెట్టుబడులను దెబ్బతీయకపోవచ్చని ప్రభుత్వ అత్యున్నత అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. దేశీయంగా అత్యధిక రిటర్నులు లభిస్తుండటంతో కెనడియన్ పెన్షన్ ఫండ్స్ మౌలిక సదుపాయాల రంగంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. అధిక లాభాలను పొందుతున్నందునే దేశీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వెరసి ప్రస్తుత పరిస్థితుల కారణంగా పెట్టుబడులు వెనక్కి మళ్లేందుకు కారణాలు కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. త్వరలోనే వివాదాలు పరిష్కారంకావచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఫండ్స్ పెట్టుబడులపై ప్రపంచంలో మరెక్కడా ఈ స్థాయి రిటర్నులు పొందలేకపోవచ్చని స్పష్టం చేశారు. -
అంతరిక్ష రంగానికి ప్రభుత్వ దన్ను
న్యూఢిల్లీ: అంతరిక్ష(స్పేస్) సంబంధ రంగాలకు దన్నునిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత సరళీకరించింది. తద్వారా స్పేస్ విభాగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులకు వీలు చిక్కనుంది. తాజా సవరణలతో స్పేస్ సంబంధ పరిశ్రమల్లో భారీ పెట్టుబడులకు వీలున్నట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ప్రధానంగా సౌదీ అరేబియా కంపెనీలు ఏవియేషన్, ఫార్మా, బల్క్ డ్రగ్స్, రెనెవబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిటెక్ తదితర రంగాలలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని తెలియజేశారు. అంతేకాకుండా ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్ తదితర విభాగాలలో భారీస్థాయిలో సాంకేతిక సహకారాలకు తెరలేవనున్నట్లు అభిప్రాయపడ్డారు. స్పేస్ రంగంలో ప్రయివేట్ పెట్టుబడులతోపాటు.. విదేశీ పెట్టుబడులకూ అవకాశం కలి్పంచేలా నిబంధనలను మరింత సరళీకరించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్ సదస్సు సందర్భంగా సింగ్ ఇంకా పలు అంశాలను పేర్కొన్నారు. ప్రస్తుతం స్పేస్ రంగంలో శాటిలైట్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆపరేషన్స్ విభాగంలో ప్రభుత్వ అనుమతి ద్వారా 100 శాతం ఎఫ్‌డీఐలకు వీలుంది. కాగా.. ఇప్పటికే సౌదీ కంపెనీలు సౌర, పవన విద్యుత్ రంగంలో పెట్టుబడులు తీసుకువచి్చనట్లు సింగ్ ప్రస్తావించారు. ప్రభుత్వం సౌదీ కంపెనీలతో చేతులు కలిపేందుకు చూస్తున్నట్లు తెలియజేశారు. సౌదీ మిలటరీ పరిశ్రమలు, మేకిన్ ఇండియా కార్యక్రమాలు కలిసి సంయుక్తంగా రక్షణ ప్రాజెక్టులను చేపట్టేందుకు అవకాశమున్నదని వివరించారు. 2022–23కల్లా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 52.8 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. -
మూడు రష్యా సంస్థలకు ఎఫ్‌పీఐ లైసెన్సులు
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన మూడు సంస్థలకు భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ) లైసెన్సును జారీ చేసింది. మాస్కో కేంద్రంగా పనిచేసే ఆల్ఫా క్యాపిటల్ మేనేజ్మెంట్ కంపెనీతో పాటు విసెవిలోద్ రోజానోవ్ అనే ఇన్వెస్టరు ఈ లైసెన్సులను పొందిన జాబితాలో ఉన్నారు. మూడేళ్ల పాటు 2026 వరకు ఇది వర్తిస్తుంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షలు అమలవుతున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి రష్యా ఇన్వెస్టర్లు ఎఫ్‌పీఐ మార్గాన్ని ఎంచుకోవడం ఇదే ప్రథమం కావచ్చని పరిశమ్ర వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ వారు ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) మార్గంలోనే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించాయి. డాలరును ఆయుధంగా చేసుకుని రష్యాపై ఆంక్షలను ప్రయోగిస్తుండటమనేది కొత్త ఆర్థిక పరిస్థితులకు దారి తీస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా తాజా ధోరణి ప్రాధాన్యం సంతరించుకున్నట్లు పేర్కొన్నారు. -
ఇకపై ఎఫ్‌డీఐలు పుంజుకుంటాయ్
న్యూఢిల్లీ: గ్లోబల్ అనిశ్చితుల నేపథ్యలోనూ రానున్న కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) పుంజుకోనున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల శాఖ తాజాగా అంచనా వేసింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో పెట్టుబడులు, ఈక్విటీలకు నిధులు తరలి వస్తుంటాయని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) సంయుక్త కార్యదర్శి మన్మీత్ కె.నందా పేర్కొన్నారు. కాగా.. ఈ ఏడాది(2022–23) తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఎఫ్‌డీఐ ఈక్విటీ నిధులు 14 శాతం క్షీణించి 26.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. డీపీఐఐటీ గణాంకాల ప్రకారం ఈక్విటీ పెట్టుబడులు, రాబడులను తిరిగి ఇన్వెస్ట్ చేయడం, ఇతర మూలధనం కలసిన మొత్తం ఎఫ్‌డీఐలు సైతం ఈ కాలంలో 9 శాతం నీరసించి 39 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది(2021–22) తొలి అర్ధభాగంలో ఇవి 42.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ మందగమనం కారణంగా 18 నెలలుగా విదేశీ పెట్టుబడులపై ప్రభావం పడుతున్నట్లు మన్మీత్ తెలియజేశారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా మెరుగైన ఫలితాలను సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. వెరసి ఇకపై ఊపందుకునే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. -
స్టార్టప్స్‌లోకి భారీగా విదేశీ పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు, స్టార్టప్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో దేశీ అంకుర సంస్థల్లోకి కొత్త ఏడాది (2023)లో భారీగా విదేశీ పెట్టుబడులు రాగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్ జైన్ ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం భారత్.. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఉందని, మన అంకుర సంస్థల పనితీరును బట్టి చూస్తే త్వరలోనే అంతర్జాతీయంగా అగ్ర స్థానానికి చేరుకోగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘గుర్తింపు పొందిన స్టార్టప్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. స్టార్టప్స్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ఎఫ్ఎస్), స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాలకు మంచి ఆదరణ ఉంటోంది’’ అని జైన్ పేర్కొన్నారు. ప్రభుత్వం సరళతరమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని పాటిస్తుండటం కూడా అంకుర సంస్థల్లోకి మరిన్ని పెట్టుబడుల రావడానికి దోహదపడనుందని ఆయన చెప్పారు. మరోవైపు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) వినియోగించుకునేందుకు అంతర్జాతీయ సంస్థలు కూడా ఆసక్తిగా ఉన్నాయని జైన్ తెలిపారు. పలు గ్లోబల్ సంస్థలు తమ తయారీ కార్యకలాపాలను భారత్‌కు మార్చుకునే యోచనలో ఉన్నాయని ఆయన వివరించారు. 14 రంగాల్లో పీఎల్ఐ స్కీములతో రూ. 2.74 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని అంచనా వేస్తున్నట్లు జైన్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫార్మా, టెలికం, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన రంగాలు పెట్టుబడులు, ఉత్పత్తి/విక్రయాలు, ఉద్యోగాల కల్పనలో కీలకంగా ఉంటున్నాయని ఆయన తెలిపారు. పథకాల దన్ను దేశీయంగా నవకల్పనలు, అంకుర సంస్థలు, స్టార్టప్ వ్యవస్థలోకి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా ప్రణాళికను ఆవిష్కరించింది. గణాంకాల ప్రకారం నవంబర్ 30 వరకూ దీని కింద 84,000 పైగా అంకుర సంస్థలు గుర్తింపు పొందాయి. ఇక, స్టార్టప్‌లకు వివిధ దశల్లో అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించేందుకు కేంద్రం ఎఫ్ఎఫ్ఎస్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్ఐఎస్ఎఫ్ఎస్), రుణ హామీ పథకం (సీజీఎస్ఎస్) మొదలైనవి అమలు చేస్తోంది. ఎఫ్ఎఫ్ఎస్ కింద 93 ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌లు) 773 స్టార్టప్స్‌లోకి పెట్టుబడులు పెడుతున్నాయి. అలాగే, 2021–22లో ప్రవేశపెట్టిన ఎస్ఐఎస్ఎఫ్ఎస్ కింద 126 ఇన్క్యుబేటర్స్లోకి రూ. 455 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. నవంబర్ 30 వరకూ ఈ ఇన్‌క్యుబేటర్స్ ద్వారా ఆర్థిక తోడ్పాటు పొందేందుకు 650 స్టార్టప్స్ ఆమోదం పొందాయి. ఇక సీజీఎస్ఎస్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నోటిఫై చేయగా, పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్నారు. -
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గుముఖం
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో 14 శాతం తగ్గాయి. ఈ కాలంలో 26.9 బిలియన్ డాలర్ల (రూ.2.2 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐ మన దేశంలోకి వచ్చినట్టు పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 31.15 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సింగపూర్ నుంచి 10 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ వచ్చింది. ఆ తర్వాత మారిషస్ 3.32 బిలియన్ డాలర్లు, యూఏఈ 2.95 బిలియన్ డాలర్లు, యూఎస్ఏ 2.6 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్ 1.76 బిలియన్ డాలర్లు, జపాన్ నుంచి 1.18 బిలియన్ డాలర్ల చొప్పున ఎఫ్‌డీఐ మన దేశంలోకి వచ్చింది. కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ రంగం అత్యధికంగా 6.3 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐని ఆకర్షించింది. ఆ తర్వాత సేవల రంగ కంపెనీల్లోకి 4.16 బిలియన్ డాలర్లు రాగా, ట్రేడింగ్ 3.28 బిలియన్ డాలర్లు, కెమికల్స్ 1.3 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్ పరిశ్రమ 932 మిలియన్ డాలర్లు, నిర్మాణ రంగం 990 మిలియన్ డాలర్ల చొప్పున ఎఫ్‌డీఐని రాబట్టాయి. -
తయారీ రంగంలోకి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయ తయారీ రంగం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,70,720 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్శించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 76 శాతం అధికమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘తయారీలో భారత్‌కు వెల్లువెత్తిన నిధుల్లో 27.01 శాతం వాటాతో సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది. 17.94 శాతం వాటాతో యూఎస్ రెండవ స్థానాన్ని ఆక్రమించింది. వరుసలో మారిషస్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ నిలిచాయి.కోవిడ్ మహమ్మారి, ప్రపంచ పరిణామాలు కొనసాగుతున్నప్పటికీ 2021–22లో భారత్ అత్యధికంగా రూ.6.78 లక్షల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకుంది’ అని వివరించింది. చదవండి: Zomato Stock Crash Prediction: జొమాటో షేర్లలో అల్లకల్లోలం, రాకేష్ ఝున్‌ఝున్ వాలా మాట వింటే బాగుండేదే! -
'మెట్రో'కు భారీ షాక్, వేలకోట్ల లాభాలే లక్ష్యంగా!
న్యూఢిల్లీ: మెట్రో ఏజీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘిస్తూ, నిధులు మళ్లించుకునే క్రమంలో ఉందని అఖిల భారత రిటైలర్ల సమాఖ్య (సీఏఐటీ) తీవ్రో ఆరోపణలు చేసింది. మెట్రో ఏజీ భారత వ్యాపార విభాగం మెట్రో క్యాష్ అండ్ క్యారీ అనుసరిస్తున్న వ్యాపార విధానాలపై అభ్యంతరాలు లేవనెత్తింది. ఇవి తప్పుడు ఆరోపణలు అని, హాని కలిగించే ఉద్దేశ్యంతో చేస్తున్నవిగా మెట్రో ఏజీ ఖండించింది. మెట్రో ఏజీ 2003లో భారత్‌లోకి ప్రవేశించింది. దేశవ్యాప్తంగా 31 మెట్రో క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను నిర్వహిస్తోంది. భారత్‌లో వ్యాపారాన్ని విక్రయించి వెళ్లిపోయే సన్నాహాల్లో ఉంది. అమెజాన్, రిలయన్స్ రిటైల్, సీపీ గ్రూపు తదితర సంస్థలు బిడ్ వేసే యోచనతో ఉన్నాయి. ఈ క్రమంలో సీఏఐటీ ఆరోపణలు, అభ్యంతరాలను వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘మీడియా కథనాల ప్రకారం మెట్రో జర్మనీ భారత వ్యాపారాన్ని విక్రయించి, తన పెట్టుబడులపై రూ.10,000 కోట్లకు పైగా లాభాలను పొందాలనుకుటోంది. భారత్‌లో గత సంవత్సరాల్లో భారీ లాభాలను సమకూర్చుకున్న మొత్తాన్ని దారి మళ్లించడమే ఇది. మెట్రో ఏజీ క్యాష్ అండ్ క్యారీ (హోల్‌సేల్) రూపంలో బీటుసీ (బిజినెస్ టు కస్టమర్/రిటైల్) వ్యాపారం నిర్వహిస్తోంది. ఇది ఫెమా, జీఎస్టీ చట్టాలను ఉల్లంఘించడమే. వ్యవస్థలను అపహాస్యం చేయడం. క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేసే సంస్థలు కస్టమర్ల నుంచి పన్ను రిజిస్ట్రేషన్ ఆధారాన్ని తీసుకోవాలి. కానీ, మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా బోగస్ పన్ను రిజిస్ట్రేషన్ కార్డులను తన స్టోర్లకు వచ్చే కస్టమర్లకు జారీ చేసి నిబంధనలను పాతరేసింది’’అని సీఏఐటీ ప్రకటన విడుదల చేసింది. ఈడీ దర్యాప్తు దీనిపై మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేసినట్టు సీఏఐటీ ప్రకటించింది. దీనిపై ఈడీ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. ఉల్లంఘనలు పెద్ద ఎత్తున ఉన్నాయని, ఈడీ త్వరలోనే తన దర్యాప్తు పూర్తి చేసి కనీసం మెట్రో ఇండియాపై రూ.12,000 కోట్ల వరకు జరిమానా విధించొచ్చని పేర్కొంది. సీఏఐటీ ఆరోపణలను మెట్రో ఏజీ ఖండించింది. సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘గత 19 ఏళ్ల భారత కార్యకలాపాల్లో నియంత్రణపరమైన నిబంధనల అమలు, ఎఫ్‌డీఐ, భారత చట్టాలను అనుసరించడంలో మాకు నిష్కళంకమైన ట్రాక్ రికార్డు ఉంది. కనుక స్వార్థ ప్రయోజనాల కోణంలో చేసిన తప్పుడు, హానికారక ఆరోపణలను ఖండిస్తున్నాం’’అని పేర్కొన్నారు. -
యస్ బ్యాంక్‌లో కార్లయిల్ గ్రూప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) దిగ్గజం కార్లయిల్ గ్రూప్.. ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. 10 శాతం వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మార్పిడికి వీలయ్యే డిబెంచర్ల మార్గంలో పెట్టుబడులు చేపట్టనున్నట్లు తెలియజేశాయి. పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ 2023 మార్చివరకూ 26 శాతం వాటాను కొనసాగించనున్న నేపథ్యంలో మార్పిడికి వీలయ్యే రుణ సెక్యూరిటీల జారీపై యూఎస్ పీఈ దిగ్గజం కార్లయిల్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఎఫ్‌డీఐ మార్గంలో విదేశీ పోర్ట్‌ఫోలియో(ఎఫ్‌పీఐ) విధానంలో కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) మార్గంలో ఇన్వెస్ట్ చేసేందుకు కార్లయిల్ గ్రూప్ ప్రణాళికలు వేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అయితే విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) ప్రకారం ఎఫ్‌డీఐగా అర్హత సాధించాలంటే కనీసం 10 శాతం వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుంది. వచ్చే నెల(జూలై) మధ్యలో యస్ బ్యాంక్ బోర్డు సమావేశంకానుంది. ఈ సమావేశంలో నిధుల సమీకరణ అంశాన్ని బోర్డు చేపట్టనున్నట్లు అంచనా. నిబంధనల ప్రకారం ఏదైనా ఒక బ్యాంకులో 4.9 శాతానికి మించి వాటాను సొంతం చేసుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. దీనికితోడు బ్యాంకులో వ్యక్తిగత వాటా విషయంలో 10 శాతం, ఫైనాన్షియల్ సంస్థలైతే 15 శాతంవరకూ పెట్టుబడులపై ఆర్బీఐ పరిమితులు విధించింది. చర్చల దశలో యస్ బ్యాంకులో 50–60 కోట్ల డాలర్లు(రూ. 3,750–4,500 కోట్లు) వరకూ ఇన్వెస్ట్ చేసేందుకు కార్లయిల్ ఆసక్తిగా ఉన్నట్లు గతంలోనే వార్తలు వెలువడ్డాయి. మరోపక్క బ్యాలన్స్‌షీట్ పటిష్టతకు పీఈ ఇన్వెస్టర్ల నుంచి 1–1.5 బిలియన్ డాలర్లు(రూ. 7,800–11,700 కోట్లు) సమీకరించేందుకు యస్ బ్యాంక్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కార్లయిల్ వాటా కొనుగోలు వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్లోగల మొత్తం వాటాను విక్రయించేందుకు కార్లయిల్ గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2021 డిసెంబర్‌కల్లా ఎస్బీఐ కార్డ్స్‌లో కార్లయిల్ గ్రూప్ సంస్థ సీఏ రోవర్ హోల్డింగ్స్ 3.09 శాతం వాటాను కలిగి ఉంది. -
ఎల్ఐసీలో ఎఫ్‌డీఐలకు నిబంధనల్లో సవరణలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) మార్గం సుగమం అయ్యేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందుకోసం విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా)లో తగు సవరణలు చేసింది. దీని ప్రకారం ఎల్ఐసీలో ఆటోమేటిక్ పద్ధతిలో 20 శాతం వరకూ ఎఫ్‌డీఐలకు వీలుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐలకు సంబంధించి 20 శాతం పరిమితి ఉంది (కేంద్రం అనుమతులకు లోబడి). దీన్ని ఎల్ఐసీ, ఇతరత్రా ఆ తరహా కార్పొరేట్ సంస్థలకు కూడా వర్తింపచేయాలని నిర్ణయించినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. మెగా పబ్లిక్ ఇష్యూలో ఎల్ఐసీలో సుమారు 5 శాతం వాటా విక్రయించి దాదాపు రూ. 63,000 కోట్లు సమీకరించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 18,300 కోట్ల పేటీఎం ఐపీవోనే దేశీయంగా ఇప్పటివరకూ అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా ఉంది. కోల్ ఇండియా (2010లో రూ. 15,500 కోట్లు), రిలయన్స్ పవర్ (2008లో రూ. 11,700 కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
రూ.7.5 లక్షల కోట్ల ఎఫ్‌డీఐలు
న్యూఢిల్లీ: భారత్ 2022–23 ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్ డాలర్ల (రూ.7.5 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షిస్తుందని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) పేర్కొంది. ఇటీవలి సంవత్సరాల్లో వ్యాపార నిర్వహణ సులభం కావడంతోపాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు, ముఖ్యంగా క్రూడ్ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం రిస్క్ ఉందని పేర్కొంది. ఆర్థిక వృద్ధి బలోపేతానికి, వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు పది అంచెల విధానాన్ని సూచించింది. మౌలిక రంగంలో పెట్టుబడులను వేగవంతం చేయడం, పీఎల్ఐ కిందకు మరిన్ని రంగాలను తీసుకురావడం, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెంచడం, అధిక కమోడిటీ ధరలను పరిష్కరించడం, ముడిసరుకులకు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. -
అంతా మోదీ చలవే!, దేశంలో పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం!
నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని పదేళ్ల యూపీఐ పాలనాకాలంతో పోల్చిచూస్తే, మోడీ పాలనా కాలంలో దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం 65 శాతం పెరిగి, 500.5 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని సీతారామన్ పేర్కొన్నారు. ఫైనాన్స్ బిల్లు 2022, అప్రాప్రియేషన్ బిల్లు, 2022పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి ఈ మేరకు సమాధానం ఇస్తూ, యూఎన్‌సీటీఏడీ (వాణిజ్యం, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి వేదిక) నివేదిక ప్రకారం, ప్రపంచంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించే ఐదు దేశాల్లో భారతదేశం ఒకటిగా కొనసాగుతోందని అన్నారు.2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి ఎఫ్‌డీఐల ప్రవాహం 81.72 బిలియన్ డాలర్లయితే, 2019–20లో ఈ విలువ 74.9 బిలియన్ డాలర్లుగా ఉందని అన్నారు. మహమ్మారి సమయంలోనూ ఎఫ్‌డీఐల ప్రవాహం దేశంలోకి కొనసాగిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ, వనరుల సమీకరణ కోసం ప్రభుత్వం పన్నుల పెంపు దిశగా ఆలోచించలేదని, ఆర్థిక పునరుద్ధరణకు నిధులు సమకూర్చడానికి ఎటువంటి పన్నును పెంచలేదని ఆమె అన్నారు. ఓఈసీడీ నివేదిక ప్రకారం, 32 దేశాలు తమ ఆర్థిక పునరుద్ధరణలకు నిధులు సమకూర్చడానికి తమ పన్ను రేట్ల పెంపువైపే మొగ్గుచూపాయని తెలిపారు. రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధం మహమ్మారి తరహాలోనే అన్ని దేశాలను ప్రభావితం చేస్తోందని సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల నుండి రాష్ట్రాలకు రూ. 8.35 లక్షల కోట్లు కేటాయించామని ఆర్థికమంత్రి పేర్కొంటూ, ఇది 2021–22కి సవరించిన అంచనా రూ. 7.45 లక్షల కోట్ల కంటే అధికమని అన్నారు. -
భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం, క్యూ కడుతున్న సరిహద్దు దేశాలు!
భారత్‌కు సరిహద్దు దేశాల నుంచి 2020 ఏప్రిల్ 18 నుంచి దాదాపు 347 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలు వచ్చినట్లు వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. వీటి విలువ రూ.75,951 కోట్లని తెలిపారు. వీటిలో 13,625 కోట్ల విలువైన 66 ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు. భారత్ ఆమోదించిన 66 ప్రతిపాదనల్లో ఆటోమొబైల్ (7), రసాయనాలు (5), కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ (3), ఫార్మా (4), విద్య (1), ఎలక్ట్రానిక్స్ (8), ఫుడ్ ప్రాసెసింగ్ (2), సమాచార, ప్రసారంతో సహా రంగాలకు చెందినవి (1), యంత్ర పరికరాలు (1), పెట్రోలియం, సహజ వాయువు (1), విద్యుత్ (1), సేవల రంగం (11) ఉన్నాయని మంత్రి వివరించారు. 193 ప్రతిపాదనల విషయంలో తిరస్కరించడమో, మూసివేయడమో లేక ఆయా దేశాలు ఉపసంహరించుకోవడమే జరిగిందన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో 2020 ఏప్రిల్‌లో భారతదేశంతో భూ సరిహద్దును పంచుకునే దేశాల నుండి విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం ముందస్తు అనుమతిని కేంద్రం తప్పనిసరి చేసింది. భారత్ సరిహద్దు దేశాల్లో చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మియన్మార్, ఆఫ్ఘనిస్తాన్లు ఉన్నాయి. చదవండి: భారత్‌పై ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్, కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు! ఇక బాదుడేనా? -
నోటిఫికేషన్ కూడా వచ్చేసింది..ఎల్ఐసీలో విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తాజాగా పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా ఆటోమేటిక్ మార్గంలో 20 శాతం వరకూ ఎల్ఐసీలో ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ నోటిఫై చేసింది. గత నెలలోనే కేంద్ర కేబినెట్ ఎల్ఐసీ డిజిన్వెస్ట్మెంట్కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో 5 శాతం వాటా విక్రయానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: మే 12వరకూ ఎల్ఐసీకి గడువు -
ఎల్ఐసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఐపీవో దిశగా దూసుకెళ్తున్న బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ఎల్ఐసీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఐసీలో ఆటోమేటిక్ రూట్లో 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లకు కేంద్ర మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపిందని సమాచారం. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ బీమా సంస్థలో వాటాను పాక్షికంగా విక్రయించడం, తాజా ఈక్విటీ మూలధనాన్ని పెంచడం ద్వారా ఐపీవోతో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ షేర్లను లిస్టింగ్ చేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఆఫర్‌కు వేదికగా నిలిచిన ఎల్ఐసీ 5 శాతం వాటాను (31.6 కోట్లకుపైగా షేర్లు) రూ.63,000 కోట్లకు విక్రయించేందుకు ఫిబ్రవరి 13న సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో మార్చిలో ప్రారంభం కానుంది. సంస్థ ఉద్యోగులు, పాలసీదార్లకు ఫ్లోర్ ప్రైస్‌పై తగ్గింపు లభిస్తుంది. భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ అతి పెద్దదిగా నిలవనుంది. లిస్టింగ్ పూర్తి అయితే సంస్థ మార్కెట్ విలువ రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ వంటి అగ్ర శ్రేణి కంపెనీలతో పోల్చవచ్చు. చదవండి: చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...! -
భారత్‌కు భారీ ఎఫ్‌డీఐలు: గోయల్
న్యూఢిల్లీ: భారత్‌కు భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వస్తున్నట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై మధ్య ఎఫ్‌డీఐలు 62 శాతం పెరిగి 27 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. గడచిన ఏడు సంవత్సరాలుగా ఎఫ్‌డీఐల విషయంలో భారత్ మంచి ఫలితాలు సాధించిందని, ఇదే ధోరణి ఇక ముందూ కొనసాగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్కరణలు ఇందుకు దోహదపడతాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. 2021– బహుళజాతి సంస్థలు (ఎన్ఎన్సీ) అనే అంశంపై ఇండస్ట్రీ బాడీ సీఐఐ నిర్వహించిన జాతీయ సదస్సులో ఈ మేరకు ఆయన ప్రసంగించారు. యూఏఈ, ఆస్ట్రేలియాలతో త్వరలో ఎఫ్‌టీఏలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై (ఎఫ్‌టీఏ)లపై గోయల్ మాట్లాడుతూ, యుఏఈ, ఆస్ట్రేలియా, యూకే, యూరోపియన్ యూనియన్ (ఈయూ), ఇజ్రాయెల్, జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్)) గ్రూప్‌తో సహా పలు దేశాలతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. రానున్న 60 నుంచి 100 రోజుల్లో యూఏఈ, ఆస్ట్రేలియాలతో ఎఫ్టీఏలకు సంబంధించి కీలక అవగాహనలకు వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన తెలిపారు. తయారీ రంగంలో పెట్టుబడులకు బహుళజాతి కంపెనీలు భారత్‌ను స్థావరంగా ఎంచుకోవాలని, తద్వారా అధిక వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలు పొందాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌టీఏ కింద, రెండు భాగస్వామ్య దేశాలు తమ మధ్య వర్తకం చేసే గరిష్ట సంఖ్యలో వస్తువులపై కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తాయి. లేదా తొలగిస్తాయి. సేవలలో వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి, పెట్టుబడులను పెంచుకోడానికి కూడా ఆయా దేశాలు నిబంధనలను సరళీకరిస్తాయి. -
ఎగుమతుల్లో కొత్త రికార్డులు సాధిస్తాం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లోనూ పుంజుకుంటోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. వస్తు, సేవల ఎగుమతుల్లో చారిత్రక గరిష్ట స్థాయులను సాధించే దిశగా దేశం పురోగమిస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 400 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. అలాగే సర్వీసుల ఎగుమతులకు సంబంధించి 150 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించగలమని ఆయన పేర్కొన్నారు. వెరసి ఇటు వస్తువులు, అటు ఉత్పత్తుల విషయంలో రికార్డు స్థాయి ఎగుమతులు నమోదు చేయగలమని గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో దేశంలోకి 27 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయని మంత్రి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 62 శాతం ఎగిశాయని వివరించారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగిందని, లాక్డౌన్ విధించిన ప్రతికూల పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ వ్యవస్థకు ఎటువంటి అంతరాయాలూ ఏర్పడకుండా సేవలు అందించిందని మంత్రి చెప్పారు. దేశ ఎకానమీ వేగంగా కోలుకుంటోందనడానికి అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 1.3 లక్షల పైగా నమోదు కావడం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భారత్‌కి ఉన్న సానుకూల అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ ఇటీవలే భారత సార్వభౌమ రేటింగ్‌ను నెగెటివ్ నుంచి స్టేబుల్ స్థాయికి మార్చిందని మంత్రి చెప్పారు. మెరుగైన ఇన్ఫ్రా, వృద్ధిలో వైవిధ్యం, అభివృద్ధికి డిమాండ్ తదితర అంశాలు ఆర్థిక పునరుజ్జీవనానికి దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు.