
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌కు రూ.50–60 లక్షల కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అవసరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ పెట్టుబడులను మౌలికరంగ ప్రాజెక్టుల రూపంలో, ఎంఎస్‌ఎంఈ రంగాల్లోకి తీసుకురావడం ద్వారా కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఉరకలెత్తించొచ్చని అభిప్రాయపడ్డారు. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి నిధులు అవసరం. అవి లేకుండా ఆర్థిక వ్యవస్థ చక్రాలు వేగాన్ని అందుకోలేవు. కనీసం రూ.50–60 లక్షల కోట్లు అయినా కావాలి. హైవేలు, విమానాశ్రయాలు, జలమార్గాలు, రైల్వేలు, లాజిస్టిక్ పార్క్‌లు, మెట్రో, ఎంఎస్‌ఎంఈ రంగాలు పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలవు. ఎంఎస్‌ఎంఈ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో ఎఫ్‌డీఐ అవసరం ఉంది.
హైవేలలో విదేశీ పెట్టుబడులను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దుబాయి, అమెరికా ఇన్వెస్టర్లతో సంప్రదింపులు కూడా నడుస్తున్నాయి’’ అని తెలిపారు. ప్రపంచమంతా ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటోందంటూ.. మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పెద్ద ఎత్తున నిధులను తీసుకురాగలదని, మరింత మందికి ఉపాధి కల్పించడంతోపాటు, ఆర్థిక రంగ ప్రోత్సాహంపై దీని ప్రభావం ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment